అనుకోని కథ

  • 516 Views
  • 4Likes
  • Like
  • Article Share

    భ‌రాగో

భ‌రాగో

ఒకాయనకి తన మేనకోడలు అనుకోని సమస్య ఒకటి తెచ్చిపెడుతుంది. సమస్య అనుకోకుండా వచ్చిందికాదని ఓ ఉత్తరం చెబుతుంది. ఏమైందోనన్న అనుమానం ఆయన్ని పీక్కుతింటుంది. చివరికి ఆయన పాలిట అనుకోని కథగా మిగిలిన ఆ సమస్యేంటి?
ఎండ
నిప్పులు చెరుగుతోంది - అంటారు ఇలాంటి ఎండను వర్ణించేటప్పుడు.
      పోస్టుమాన్‌ రాకపోయుంటే నేను వీధిగది తలుపు తీసుండేవాడిని కాదు. మెట్లుదిగి గేటుదాకా వెళ్లుండేవాడినీ కాదు. ఎండ నిప్పులు చెరుగుతోందో పప్పులు ఉడకబెడుతోందో నాకు తెలియవలసిన అవసరం ఉండేదీ కాదు. వేడి ఉందని తెలుస్తుంది. భరించడం అంతకంటే బాగా తెలుస్తుంది. అంతే.
      కర్రగేటు. దానికి రెండు రెక్కలు. రెండు రెక్కల్నీ కలిపి ఉంచడానికి ఒక దళసరి ఇనపరింగు. ఆ రింగుని ఒక రెక్కమీది నుంచి తప్పిస్తే గేటు తెరవ్వొచ్చు. మెట్లదాకా వచ్చి తను తెచ్చిన ఉత్తరం కిటికీలోంచి పడెయ్యొచ్చు. మళ్లీ గేటుదాకా వెళ్లి గేటు తాలూకు రెండు రెక్కల్నీ దగ్గరగా లాగి రింగు వెయ్యొచ్చు.
      పోస్టుమాన్‌ ఆ శ్రమంతా పడలేదు. ‘‘పోస్ట్‌!’’ అని ఒకసారి అరిచేడు. గేటుమీదుగా ఒక ఉత్తరాన్ని విసిరేశాడు. అది దారం తెగిన గాలిపటంలా, గాల్లో రెండు పిల్లిమంతరాలు వేసి కాంపౌండుగోడకి కొంచెం ఇటుగా ఉన్న మల్లెపొద కుదుట్లో పడింది. కిటికీలోంచి అంతా వినిపించింది. అంతా కనిపించింది. కుదుట్లో పడ్డ ఉత్తరాన్ని ఇంట్లోకి తెస్తేనేగాని ప్రాణం కుదుటపడలేదు.
      ఉత్తరం. కవరు. నాకు కాదు, మా అబ్బాయికీ కాదు మా కోడలికీ కాదు. మా మేనకోడలు వాణి పేర వచ్చింది. ఏదో కంపెనీ వాళ్లు రాసినట్టున్నారు. రకరకాల ఉద్యోగాలకి దరఖాస్తులు పెడుతూ ఉంటుంది. ఎవరో ఇంటర్‌వ్యూకి రమ్మని ఉంటారు. విశాఖపట్నానికి రీ-డైరక్టు చెయ్యాలి.
      ‘‘మీరు వీధి గదిలో కూర్చుంటారేమో, మామయ్యగారూ! ఎండవేళప్పుడు ఆ కిటికీ తలుపులు మూసేసుకుని తెరలు దించుకోడం మర్చిపోకండి’’ అని ప్రతిరోజూ వార్నింగు ఇచ్చి మరీ వెళ్తుంది కోడలు. నేను వీధి గది తలుపు గడియ పెట్టుకున్నానని నిర్ధారణ అయ్యేవరకు గేట్లోంచి కదలదు.
      ‘‘పరవాలేదు లేమ్మా. ఎంత పడమటి మొహం ఇల్లయినా, ఇంట్లో కూర్చున్న మనిషిని ఎండదెబ్బకి శోషొచ్చి పడిపోను.’’
      ‘‘అవుననుకోండి - కిటికీ తలుపులు మూసుకుంటే తప్పేముంది? ఇంట్లో కూర్చున్న మనిషి ఉక్కపోసి ఉడికిపోతారాయేమిటి? ఫాన్‌ ఉంది కదా! వాళ్ల ధర్మమా అని కరెంటు రాత్రి పూట తప్ప పగటిపూట కట్‌ చెయ్యడం లేదు.’’
      ‘‘ఆ మాత్రం ఎండచవి కూడా చూడాలమ్మా. ఎండ వొంటికి ఆరోగ్యం. తగినంత ఎండ చవిచూడకనే ఆరోగ్యాలు పాడవుతాయి.’’
      ‘‘చింత చచ్చినా పులుపు చావలేదు.’’
      ఇలాగ నాకూ కోడలికీ మాటకి మాట తెగులు. రోజూ ఇవే మాటలు కాకపోయినా ఇదే అర్థం, ఇదే సారాంశం.
      మా అబ్బాయి డ్యూటీ ఉదయం - ఏడున్నరకి. ఒట్టి కాఫీ తాగి ఏడుంపావుకి స్కూటరెక్కి వెళ్లిపోతాడు. కోడలి డ్యూటీ పదిన్నరకి. నాకు టిఫిన్‌ పెట్టి, తను భోంచేసి, మావాడికి కేరేజి కట్టి, తన టిఫిన్‌ బాక్సు సర్దుకుని, ఐదు నిమిషాలు తక్కువ పదికి ఇల్లు వదుల్తుంది. మా అబ్బాయికి కేరేజి పట్టుకెళ్ళే మనిషి పదిన్నరకి వస్తాడు. వాడికి ఆ కేరేజి వప్పగించి గేటు మూసుకుంటే సరి. ఒంటిగంటకి భోజనం వొడ్డించుకుని తినేసి వీధిగదిలోకి చేరిపోయి సాయంకాలం నాలుగు గంటలదాకా ఈజీ చేర్లోనో బల్లమంచం మీదనో కూర్చోవచ్చు. పడుకోవచ్చు. నాలుగ్గంటలకి పాల పేకెట్టు వస్తుంది. అప్పుడు తలుపు తియ్యాలి. నాలుగుంపావుకి కేరేజీ మనిషి ఖాళీ కేరేజి తెస్తాడు. నాలుగున్నరకి అబ్బాయి వస్తాడు. అయిదుంపావుకి కోడలు వస్తుంది. అయిదున్నరకి పనిపిల్ల వొస్తుంది. అందరూ గేటు తీస్తారు. గేటు తీసిన వారే గేటు మూస్తారు.
      పోస్టుమాన్‌ పన్నెండున్నరకి కొంచెం అటూయిటూగా వస్తాడు. ఉత్తరాలు వారానికి రెండో మూడో వస్తాయి. ఇద్దరికిద్దరూ ఉత్తరాలు ఆఫీస్‌ అడ్రసులకే రప్పించుకుంటారు. వెంటనే జవాబులు రాసి పడెయ్యొచ్చుననే తప్ప మరో కారణం కాదు. వారానికి రెండు మూడు ఉత్తరాలే కదా. ఆ మాత్రం       దానికి ఆ పోస్ట్‌మాన్‌ గేటు దగ్గరి నుంచి ‘‘పోస్ట్‌’’ అని కేకపెట్టి వొచ్చిన ఉత్తరాన్ని మొక్కల్లోకి విసిరెయ్యడమెందుకు? లోపలికొచ్చి కిటికీలోంచి అందించొచ్చు కదా. అందించడానికి నామోషీ అయితే పోనీ విసిరెయ్యొచ్చు కదా. ఊఁహూఁ. అతగాడి పద్ధతే పద్ధతి.
      వీధిగది తలుపు మూసేను. కిటికీ తలుపు కూడా మూసేను. తెర సర్దుతూ ఉండగా గేటుకున్న ఇనపరింగు తొలగించిన చప్పుడు. కిటికీకి మీద వేపున్న అద్దంలోంచి చూసేను.
      పాతికేళ్లుండవు. ఇరవై దాటుంటాయి. ఆడపిల్ల, చంకలో ఆడపిల్ల. రెండేళ్లు వెళ్లుండవు. గేటుమూసి, రింగు తగిలించి లోపలికొచ్చేస్తోంది. కిటికీ తలుపు తెరిచాను, ‘‘ఎవరూ?’’
      ఆ పిల్ల గది గుమ్మం మెట్లెక్కింది. ‘‘తలుపు తియ్యండి!’’ అంది.

* * *

      ‘‘1-8-250/ఎ; ఇదేనా?’’
      ‘‘ఇదేనమ్మా, లోపలికి రా.’’
      చెప్పులు మెట్లమీద విడిచి లోపలికొచ్చింది.
      ‘‘సీతారామయ్యగారు మీరేనా?’’
      ‘‘నేనే. దా. కూర్చో.’’
      చంకలో పిల్ల నిద్రపోతోంది. మంచం మీద విడిగా ఉన్న దుప్పటిని సగానికి మడిచి నేలమీద పరిచాను. కుర్చీలో ఉన్న కుషన్‌ దుప్పటిమీద ఓ వారగా వేసేను. ‘‘చంటిపిల్లని అలా పడుకోబెట్టు. నువ్విలా కుర్చీలో కూర్చోవచ్చు.’’ అన్నాను.
      ‘‘అక్కర్లేదు.’’ తను కూడా దుప్పటి మీదనే కూర్చుంది. పిల్లని రెండు మూడుసార్లు జోకొట్టింది. లేచి, తలుపు మూసింది. ‘ఆ కిటికీ కూడా మూసెయ్యండి. ఎండపొడ.’
      అర్థం చేసుకోడానికి గాని అపార్థం చేసుకోడానికి గాని ఏమీ లేదు. కాని అర్థం కానిది ఏదో ఉన్నంతగా ఒంట్లో నెత్తురంతా క్షణం పాటు నీరైంది.
      లోపలికి వెళ్లాను. ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్ల సీసా ఒకటి స్టాండ్‌లోంచి గ్లాసొకటి, తెచ్చి అక్కడ పెట్టాను.
      ఆ అమ్మాయి లేచింది. సీసా పుచ్చుకుని తలుపుదాకా వెళ్లి తలుపు తెరిచింది. సీసాలో ఉన్న చల్లటి నీళ్లు కొంచెంగా చేతిలో పోసుకుని మొహం మీద జల్లుకుంది. నుదుటిమీద అంటించుకున్న బొట్టు రాలిపోకుండా అద్దుకుంటూ చీరకొంగుతో మొహం తుడుచుకుంది. లోపలికొచ్చి, తలుపు మూసి, సీసా ఎత్తి సగంపైగా నీళ్లు తాగింది.
      ‘‘ఎవరమ్మా నువ్వు? నిన్ను నేనెప్పుడూ చూసినట్టు లేదే!’’
      అమ్మాయి కూర్చుంది.
      ‘‘మంచి ఎండలో వచ్చేవు, ఏమిటి పని?’’
      సీసా దూరంగా ఉంచింది.
      ‘‘మా కోడలు నేస్తురాలివి కాబోలు. తను ఆఫీసుకెళ్లింది.’’ అన్నాను.
      ‘‘... విజయవాణి ఎవరు?’’
      ‘‘వాణి... మా బావమరిది గారమ్మాయి... నువ్వూ అదీ స్నేహితురాళ్లా?’’
      ‘‘అది నా స్నేహితురాలేమిటి? ఏ పూర్వజన్మంలోనో శత్రువై ఉండాలి. లోపలుంటే పిలవండి. అడగవలసిందేదో మొహం మీదనే అడిగేస్తాను! లోకం మీద ఇంతమంది మొగాళ్లుండగా దానికి నా మొగుడే కావల్సొచ్చాడా?’’ సీసా అందుకుని మిగిలిన నీళ్లు తాగేసింది.
      నిర్ఘాంతపోయాను.
      మా బావమరిది కూతురు విజయవాణి. విజయా అనీ, వాణీ అనీ, బుజ్జీ అనీ ముద్దుగా పిల్చుకుంటూ వాళ్ల అమ్మా నాన్న ఆశ్చర్యపడేటంత ఆపేక్షతో పెంచేను. నేను దానికి చదువు చెప్పించేను. మా ఆవిడ దానికి పనులు నేర్పించింది. నా కోడలు దానికి ప్రపంచజ్ఞానం నూరిపోసి చనువూ చొరవా ధైర్యం అలవాటు చేసింది. ఇప్పుడీ అమ్మాయి మాటల్ని బట్టి ఏమిటనుకోవాలి? వాణి ఈ అమ్మాయి భర్తని వల్లో వేసుకుని?
      (అలా అయ్యుండదు. ఈ అమ్మాయి భర్తే రసికాగ్రగణ్యుడై మా వాణిని లొంగతీసుకుని ఉంటాడేమో... అది వినో, చూసో, గ్రహించో ఈమె తన భర్త సాక్షాత్తూ శ్రీరామచంద్రుడని ఇతర స్త్రీలే అతణ్ని గోపాలకృష్ణుడుగా చేస్తున్నారనీ అనుకుంటూందా?)
      ‘‘నోర్ముయ్యి. మా వాణిని గురించి అంతమాట అనడానికి నీకెంత తెగువే?’’ అని కసిగా కసరొచ్చు. కాని, కథ ఎంతవరకు నడిచిందో సౌమ్యంగా తెలుసుకొనే దారి అది కాదు.
      ఏవో కోర్సులు చదువుతాననీ, పోటీ పరీక్షలకి రాస్తాననీ వాణి ఏడాదికి ఆర్నెల్లు ఇక్కడే ఉంటుంది. విశాఖపట్నం వెళ్లి పదిహేను రోజులై ఉంటుంది. ఎండలు తగ్గేక మళ్లీ వస్తానని వెళ్లింది.
      ‘‘ఇక్కడుంటే చదువుకైనా, ఉద్యోగానికయినా, ఆఖరికి పెళ్లికైనా సరే అవకాశాలు ఎక్కువ.’’ అంటుంది. ‘‘బావా, నేనేదో నీ ఇంట్లో పడి తింటున్నానని ఊరికే బాధపడిపోకు. మావయ్య నీకు ఫాదరైతే నాకు గాడ్‌ఫాదరు. నేనిక్కడుంటే మీకే మంచిది. నా పన్లూ, పరీక్షలు చూసుకుంటూనే అక్కకి సాయం చేస్తున్నాను. నాకు పెళ్లో, ఉద్యోగమో కుదిరి వెళ్లిపోయానంటే అక్క పాపం - తనే రోలై, తనే మద్దెలై-’’ అని పడీపడీ నవ్వింది.
      ఇంటిపన్లు చూస్తూనే వాణి సాయంకాలం పూట కోచింగులకి వెళ్తుంది. ఏడు గంటలు కాకముందే ఇంటికి చేరిపోతుంది. అంతలోనే ప్రేమాయణాలు సాగించగలుగుతోందా?
      ఏమో? ఎంతసేపు కావాలి గనక? అన్నీ యాంత్రికంగా మారిపోయిన యుగంలో కదా, ఉన్నాం!
      ఆ అమ్మాయి అక్కడ పెట్టిన ఖాళీ సీసా తీసి దాన్నిండా నీళ్లుపట్టి ఫ్రిజ్‌లోకి చేర్చడం, ఫ్రిజ్‌లోంచి ఇంకో సీసా ఇవతలికి రావడం - ఈ వ్యవధిలో నా ఆలోచనలు అలా వాణి మీదకు వెళ్లాయి.
      ‘‘చూడమ్మాయి, నీ పేరేమిటి?’’
      ‘‘సరస్వతి.’’
      ‘‘ఇదుగో, సరస్వతీ! నువ్వు మా వాణి గురించి ఇందాక ఏదో అన్నావు. అదేమీ బాగాలేదు. మా పిల్ల అని చెప్పడం కాదుగాని మా వాణి చాలా ఉత్తమురాలు, నీకు కష్టం కలిగించే పని ఏదీ కూడా మా వాణి చేసుండదు. ఎండని పడివొచ్చావు. చిన్నదానివి. ఆవేశం, ఆగ్రహం తెచ్చుకుని ఏదో అన్నావు. నీలాగే నేను కూడా ఆవేశపడి, ఆగ్రహించి- గెటవుట్, యూ స్టుపిడ్‌ గర్ల్‌- అనొచ్చు. కాని-’’
      చంటిపిల్ల నిద్దట్లోనే పెద్దగొంతుక పెట్టి ఏడిచింది.
      సరస్వతి ఒకసారి నా వేపు చూసింది. ఒకసారి చుట్టూరా చూసింది. చంటిపిల్ల వేపుకి తిరిగి పడుకుంది. చంటిపిల్లకి పాలు పెట్టడం కోసం పైకట్టు వదులు చేసుకుంది. ఆ లోపల ఉన్న ఒక కాగితం మడతని ఇటువేపు చూడకుండా నా మీదకి విసిరి ‘‘చదువుకో, సీతారామయ్యగారూ!’’ అని, పైటచెంగుతో చంటిపిల్లని కప్పింది.

* * *

      ‘‘శ్రీ కె.వెంకటనారాయణగారికి ఇ.విజయవాణి నమస్కరించి వ్రాయునది. వివాహవేదిక అనే మాసపత్రికలో మీ వివరాలు చూసి ఈ ఉత్తరము వ్రాయడమైనది. నేను బీ.ఎస్సీ., సెకండ్‌క్లాసులో పాసయి వున్నాను. టైపు హయ్యరు పాసైనాను. కంప్యూటర్‌ కోర్సు చేసితిని. నా వయస్సు ఇరవైమూడు. ఎత్తు అయిదడుగుల మూడంగుళములు. మాది హరితస గోత్రము. నా జన్మనక్షత్రము పునర్వసు ఒకటవ పాదము. మాది సంప్రదాయ కుటుంబమే గాని సంపన్న కుటుంబము కాదు. అయిననూ, మా తండ్రిగారు నా వివాహం నిమిత్తము సుమారు అరవైవేల రూపాయల వరకు జాగ్రత్త చేసియున్నారు. ఆ సొమ్ము అంతా ఖర్చు పెట్టడానికి గాని నా పేరిట బ్యాంక్‌లో వడ్డీకి వేయుటకుగాని వారు వెనుకాడరు. మీరిచ్చిన వివరాలలో ఉద్యోగం చేసే యువతులకు ప్రాధాన్యం అని ఉన్నది. నాకు ప్రస్తుతము ఉద్యోగము దొరుకుట అసాధ్యము కాదు. మీరు ఏదో ప్రయివేటు కంపెనీలో జాబ్‌ చేయుచున్నారని, ప్రభుత్వోద్యోగం కాదని, తెలియపరిచినారు. నాకు ఆమోదమే.
      ఈ ఉత్తరంతోబాటుగా నా ఫుల్‌సైజు కలర్‌ఫొటో ఒకటి పంపుచున్నాను. మా తల్లిదండ్రులు విశాఖపట్టణంలో ఉన్నప్పటికీ నేను తరచు హైదరాబాద్‌ వచ్చుచునే యుందును. మా మేనత్త భర్తగారు హైదరాబాద్‌లో స్థిరపడి ఉన్నారు. మీ ఇష్టాయిష్టాలను అనుసరించి వారి అడ్రసుకు మీరు సమాధానం వ్రాసినచో తదుపరిగా పరిచయాలు, సంప్రదింపులు చేసికొనవచ్చును... ఇట్లు. ఈమని విజయవాణి.
      ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి నాకే సీసాడు నీళ్లు అవసరం వచ్చాయి. మంచం మీది నుంచి దిగి, ఆ అమ్మాయికి అవతలివైపుగా ఉన్న సీసా అందుకుని, గ్లాసు నింపుకొంటూ - ఒకటి, రెండు, మూడు గ్లాసుల నీళ్లతో - ఆరిపోయిన గొంతు తడుపుకొన్నాను.

* * *

      సరస్వతి కట్టు సరిచేసుకుని లేచి కూర్చుంది. చంటిపిల్లని నావైపుకి తిప్పి పడుకోబెట్టి తాను అవతలివైపుకి వెళ్లి ఇటువైపుకి తిరిగి కూర్చుంది.
      ‘‘వెంకటనారాయణ, మీ ఆయనా?’’ అన్నాను.
      ‘‘కాకపోతే నాకీ బాధెందుకు?’’
      ‘‘ఫొటో యేదీ?’’
      ‘‘ఇంటి దగ్గరుంది. నలిగిపోతుందని తేలేదు. ఫొటో చూపిస్తేగాని నమ్మరా?’’
      ‘‘లేదు లేదు... అయితేను, ఇందులో మా అమ్మాయి తప్పేముంది? మీ ఆయనేమో తనకి పెళ్లే కాలేదన్నట్టుగా ప్రకటన వేశాడు; మా అమ్మాయి అప్లయి చేసింది! ఇందులో తప్పంటూ ఉంటే అది మీ ఆయనదే కదా; కొంచెం ఆలోచించు!’’
      హటాత్తుగా సరస్వతికి ఉడుకుబోత్తనం, కోపం, ఏడుపు వచ్చేశాయి. గుండెలు బాదుకుంటే మాత్రం, గుండె కరిగేటంత ఏడుపు ఎలా వస్తుందని మళ్లీ నిర్ఘాంతపోయాను. 
      ‘‘తప్పు-తప్పు-తప్పెవరిదీ కాదు; నాదీ, తప్పు! నా మొగుడు ఇంత భ్రష్టుడని ఎరక్క- చిన్న ఉద్యోగం అనీ, గవర్నమెంటుద్యోగం కాదనీ తెలిసినా ఎలాగో సంసారం చేసుకోగలుగుతానని ఈ పెళ్లికి ఒప్పుకోడం నాదీ, తప్పు! అంతా కలిపి రెండేళ్ల రెండు మాసాలయిందంటే! పెళ్లయిన పదకొండో నెలకే ఈ జెష్టముండ పుట్టింది. ఆడపిల్లని కన్నానని అతనూ వాళ్లమ్మా నా మీద రుసరుసలాడేరు. లక్ష్మి అని పేరు పెట్టి కూడా దీన్ని జెష్టా అనే పిలుస్తారు. అలా పిల్చినందుకు నేను దుఃఖపడితే సరదాకన్నాను లేవోయని నన్ను సముదాయిస్తారు. పెళ్లిచేసి నిన్ను నాకు తగిలించేసేరే గాని మీ వాళ్లు మళ్లీ మొహం చూపించేరు కాదే అని అదే నవ్వులాట, అదే విసుగు! దీని పురిటిరోజులప్పుడు మా అమ్మ చావు బతుకుల మీద ఉందని మా అన్నయ్య నన్ను తీసికెళ్లలేదు. ఇది పుట్టిననాడే మా అమ్మ పోయిందన్న ఉత్తరం వచ్చింది. నాన్నగారు మొదటే లేరుకదా. దాంతో మా అమ్మ జాతకం మంచిది కాదనీ, ఆవిడే అక్కడ చచ్చి ఇక్కడ పుట్టిందనీ ఆడిపోసుకున్నారు. ఈ రెండేళ్ల పొద్దూ నన్నూ మా అమ్మనీ నా కూతుర్నీ కలిపీ విడివిడిగానూ తిట్టుకోడం మా అత్తగారికొక పనిగా ఉంది. ఆఖరికి నన్ను ఎలాగో ఓలాగ వదలగొట్టుకో వచ్చునని స్థిరపర్చుకుని తనకొక పెళ్లాం కావాలని ప్రకటన వేసుకున్నారు. పరమ దుర్మార్గులు వాళ్లు. ఒకవేళ నేను ఏ నుయ్యోగొయ్యో ఉరితాడో కిరసనాయిలో చూసుకున్నాక అతను మీ వాణిని పెళ్లి చేసుకున్నా సరే, దాని గతీ ఇంతే అవుతుంది, అది మాత్రం ఖాయం!’’
      ‘‘అయ్యో; నా తల్లీ!’’ అన్నాను ఆ పిల్లని ఎలా సముదాయించాలో తోచక.
      సరస్వతి కళ్లు తడుచుకుంది. సీసాలోంచి కొంచెం నీళ్లు చీరకొంగులో వొంపుకొని తడిగుడ్డతో మొహం తుడుచుకుంది.
      ‘‘అమ్మా ఇంత నిప్పుల కుంపటిలో ఉంటూ ఇంత నిప్పు చెరిగే ఎండలో ఇలా వచ్చేవే. ఇంటికి చేరగానే ఈసాకుపెట్టి ఇంతకింతా హింస పెడతారేమోనే, పాపం?’’ అన్నాను.
      ‘‘ఇవాళ ఆ గండం లేదు లెండి. మా అత్తగారు నిన్న సాయంకాలం వరంగల్లు వెళ్లింది. నా మొగుడు ఈ ఉదయం డ్యూటీకెళ్లిన మనిషి వెంటనే తిరిగొచ్చేసి కంపెనీ పనిమీద అర్జంటుగా మెదక్‌ వెళ్తున్నాననీ, ఎలాగైనా రాత్రి పదిగంటల్లోగా వచ్చేస్తాననీ, చెప్పి వెళ్లేడు. మీరు పెద్దవారు, తండ్రిలాంటివారు అని - మీరుంటే మీతోనూ మీరు లేకపోతే వాణితోనూ నా బాధ చెప్పుకుందామని వొచ్చాను.’’
      నేను గోడవేపు చేతులు జోడించాను. ‘‘అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. సర్దుకుపోవడమంటూ కొంత అలవాటైంది గనక జాగ్రత్తగా ఉండు తల్లీ. ఇప్పుడు ఇలాంటి ఆరళ్లు అక్కడక్కడ కనబడుతూనే ఉన్నాయి. అయితే ఇందులో కొంత నీ భ్రమ కూడా ఉండొచ్చు. మరింత సుఖంగా బ్రతకలేకపోతున్నామే అని నీకు అనిపించినప్పుడు మీ ఆయనా మీ అత్తగారూ యథాలాపంగా అనే మాటలే నిన్ను బాధపెడతాయి. అయితే, ఒక్కమాట! నీ బాధంతా నిజంగా బాధే అయి, నీ పరిస్థితి మరీ క్లిష్టమైపోయిందని అనిపిస్తే మటుకు ఏ అఘాయిత్యమూ చెయ్యనని నాకు మాట ఇయ్యమ్మా. ఆ ఇల్లు వదిలిపెట్ట వలసిన పరిస్థితి రాకూడదనే దేవుణ్ని ప్రార్థిద్దాం. కాని, అలాంటి పరిస్థితి వస్తే మాత్రం, నీకు తల్లిలేదని, తండ్రి లేరని అనుకోక తిన్నగా నా దగ్గిరకొచ్చేయమ్మా. నాకు ఇంతో అంతో పలుకుబడి ఉంది. నీకేదైనా దారి చూపించగలను!’’ అని చెప్పాను.
      చంటిపిల్ల మళ్లీ ఏడ్చింది. సరస్వతి ఈసారి దాన్ని ఒళ్లో పడుకోబెట్టుకుని తొడల మీద మెత్తగా ఎగరేస్తూ పాలు కుడిపింది.
      నేను టైమ్‌ చూశాను. రెండున్నర. ఈ అమ్మాయికి ఇంతసేపూ నీళ్లూ కన్నీళ్లూ తప్ప ఏమీ ఇవ్వలేదని స్ఫురించి లోపలికి వెళ్లాను. ఫ్లేవర్డ్‌ మిల్క్‌ పాకెట్లు రెండు తీసి ఒక పెద్ద గ్లాసులో పోసి తెచ్చాను. కొంచెం బిస్కెట్లు ఒక ప్లేటులో పెట్టి తెచ్చాను.

* * *

      ‘‘ఉత్తరం ఏదో వచ్చినట్టుందే!’’ అన్నాడు మా అబ్బాయి, వీధిగదిలో కూర్చుని బూట్లు విప్పుకుంటూ.
      ‘‘వాణికి,’’ అన్నాను. ‘‘దానికేం పనా, పాటా? ఉద్యోగాలకే కాకుండా పెళ్లి సంబంధాలకి కూడా అప్లికేషన్లు పడేస్తోంది.’’
      మావాడు అప్పటికే ఆ కవర్ని డేమేజి చెయ్యకుండా వెనకవైపు నుంచి లాఘవంగా తెరిచేశాడు. అందులో ఉన్న కాగితాన్ని అరక్షణంలో పరకాయించేసి ‘‘చూసినట్టు చెబుతున్నారే! ఎలాగైనా, బుర్రంటే మీదే, బుర్ర!’’ అన్నాడు పకపకా నవ్వుతూ.
      ‘‘ఏదీ!’’ అని లాక్కున్నాను.
      ‘‘చిరంజీవి సౌభాగ్యవతి ఇ.విజయవాణి గారికి కె.వెంకటనారాయణ వ్రాయునది. మీరు చూచిన వివాహవేదికలోని వివరములు మూడు సంవత్సరముల క్రిందటివి అని తెలియజేయుటకు చింతిస్తూ యున్నాను. నాకు 1991 ఫిబ్రవరిలో వివాహము జరిగింది. మాకు ఇప్పుడు ఏడాది నాలుగు మాసముల వయస్సుగల పాప కలదు. భగవంతుని దయవలన, చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా; మేము సుఖముగా ఉన్నాము. అప్పట్లో నేను వ్రాసిన ఒక సర్వీస్‌ కమీషన్‌ పరీక్ష ఫలితాలు తెలిసినందువల్ల నేను త్వరలో ప్రభుత్వోద్యోగంలో చేరబోతూ ఉన్నాను. ఆ వివాహవేదిక మాసపత్రికను ప్రింటు చేయుచున్నవారికి; నా వివాహభోగట్టా లేఖ ద్వారా తెలియపరచకపోవుట వలన ఈ పొరపాటు జరిగినది. ఈ రోజే వారికి వివరంగా వ్రాయుచున్నాను. ఈ విషయములో మీరు నన్ను క్షమించవలయును. ఇట్లు, కె.వెంకటనారాయణ.’’
      ‘‘అయ్యో!’’ అన్నాను, నెత్తి కొట్టుకుని.
      ‘‘ఏమిటి, ఏమిటి?’’ అంటూ మా అబ్బాయి ఆ కాగితాన్ని తీసుకోబోయాడు.
      నేను ఇవ్వలేదు. ‘‘అడ్రసైనా అడిగేను కాదే!’’ అని, నా మనసులో మాట - అసంకల్పితంగా పైకే అనేశాను.
      ‘‘దీని మీద ఉంది కదా?’’ అని కవరు ఫెళఫెళలాడించాడు మావాడు. ‘‘ఆర్‌.కె.ఇండస్ట్రీస్, బాలనగర్, హైదరాబాద్‌!’’
      ‘‘ఆ ఎడ్రస్‌ కాదురా!’’ అని నేను విసుక్కున్నాను.

* * *

సౌజన్యం: భమిడిపాటి భాస్కరం 
(భరాగో గారి కుమారుడు)

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam