ద్వంద్వం

  • 790 Views
  • 9Likes
  • Like
  • Article Share

    వాడపల్లి చంద్రశేఖర వర్మ

  • సీతమ్మధార, విశాఖపట్నం
  • 9652692753
వాడపల్లి చంద్రశేఖర వర్మ

ధరణి అమ్మ మనసు ప్రతీకారంతో రగిలిపోతోంది. కొడుకు నిశ్చితార్థం అయిన అమ్మాయితో పెళ్లిని తప్పించాలని ఆమె చూస్తోంది. అలాగని ఆ అమ్మాయి అంటే అయిష్టం ఏమీ లేదు!  ఆమెలో ఈ ద్వంద్వ స్థితి ఏంటి? ఆమె కోపానికి కారణమేంటి?
ఉదయం
పది గంటలకు ఫోను రింగవుతుంటే లిఫ్ట్‌ చేశాను.
      ‘‘అమ్మా! నీకో విషయం చెప్పాలి’’ అవతల నా కొడుకు ధరణి. హాస్పిటల్లో రోగులతో బిజీగా ఉండే సమయంలో ఎందుకు చేసినట్టు?
      ‘‘ఏమైంది బాబూ’’ కంగారుగా అడిగాను.
      ‘‘ఏం లేదమ్మా...’’ మొహమాటపడుతూ ఆగిపోయాడు.
      అంతా తండ్రి పోలిక. ఆనంద్‌లాగే మొహమాటం ఎక్కువ.
      ‘‘అదేంటి ధరణీ. ఏదీ లేనప్పుడు ఎందుకు ఫోన్‌ చేసినట్టు’’
      ‘‘వైజాగు నించి ఆమె కాల్‌ చేసింది’’
      వాడి ధోరణే అంత. ఏదీ సూటిగా చెప్పడు.
      ‘‘ఎవరు బాబూ. తల్లి దగ్గరే ఇంత మొహమాటమైతే ఇక రోగుల్ని ఎలా చూస్తున్నావు? పైగా సైక్యాట్రిస్ట్‌వి’’ నవ్వుతూ అడిగాను.
      ‘‘అమ్మా! సరళ ఫోన్‌ చేసింది’’
      సరళ ధరణికి పెళ్లి నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి. ఆమె పరీక్షలయ్యాక పెళ్లి అనుకున్నాం.
      ‘‘తనెందుకు చేసింది’’ ఆశ్చర్యంగా అడిగాను.
      ‘‘ఊరికినే చేసుంటుంది. నీ క్షేమ సమాచారాలడిగింది’’
      సరళ అభిమానానికి ముచ్చటేసింది. ఒంట్లో బాగుండక ఈ మధ్య రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్నాను.
      ‘‘నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనే చేసిందా? ఆమెకెలా తెలిసింది’’ నాలో ఏదో అనుమానం.
      ‘‘నాకెలా తెలుస్తుంది. నంబరిస్తాను. నువ్వే అడుగు’’ కాస్త విసుగ్గా అన్నాడు. 
      ‘‘అంతేనా. ఇంకేమైనా మాట్లాడిందా’’ ఆరాతీస్తూ అడిగాను.
      ‘‘లేదు’’ ముక్తసరిగా అన్నాడు.
      ‘‘ఆమె తాతయ్య విశ్వనాథం చేయించుంటారు, పెళ్లి విషయం తెలుస్తుందని. అభిమానంతో సరళ బయటపడలేదు’’
      ‘‘సరళ పరీక్షలై మూడు నెలలైంది. మన వైపు నుంచి ఏ సమాచారం లేనప్పుడు వాళ్లకు కంగారుంటుంది కదా’’ అన్నాడు. నా మాటల్లోని ఆంతర్యాన్ని ధరణి గ్రహించి ఉంటాడు.
      ‘‘ఎవరికి. సరళకా, విశ్వనాథానికా’’
      కోపంతో కూడిన వ్యంగ్యంతో అన్నాను.
      ‘‘ఎప్పుడూ లేనిది నీ స్వభావానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. విశ్వనాథం వార్థక్యంలో ఉన్నారు. మనవరాలి పెళ్లి విషయంలో ఆతృత, ఆందోళన ఉంటాయి. ఆయన స్వయంగా వచ్చి అడిగినప్పుడు ముహూర్తం పెట్టి తెలియపరుస్తానన్నావు. సరళ నీకు నచ్చిందని మాకు తెలుసు. కానీ, పెళ్లి విషయంలో నీ నిర్ణయం చెప్పవు. నీ మనసులో ఏముందో తెలీదు. ఏ కారణం చేతనో నువ్వు ద్వైదీభావంలో ఉన్నావనిపిస్తుంది. మనం సభ్యతగా ఏదో ఒక విషయం విశ్వనాథంగారికి తెలియజేయడం మంచిది’’ చెప్పి ధరణి ఫోన్‌ పెట్టేశాడు. 
      వాడు చెప్పినట్టే త్వరగా నిర్ణయం తీసుకోవాలనుకున్నాను. కానీ, ఆలోచనలే తెగడం లేదు.
      నేను చేస్తోంది తప్పని తెలుసు. కానీ, విశ్వనాథం నాకు చేసిన అన్యాయాన్ని, అవమానాలను మరచి క్షమించలేకపోతున్నాను. అందుకు సరళను శిక్షించడం భావ్యం కాకపోవచ్చు. అయినా నా మనసు ప్రతీకారమే కోరుకుంటోంది. నాకు కలిసొచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకూడదు అనిపిస్తోంది. 

* * *

      సరళ ఫొటో చూసిన ధరణి ఆనంద్‌లకి ఆమె నచ్చింది. నేనూ ఆమెనే కోడలిగా చేసుకోవాలనుకున్నాను. పెళ్లి చేయాలని రెండేళ్లుగా అనుకుంటున్నా, ఏవో సాకులు చెప్పి ధరణి వాయిదా వేస్తూ వస్తున్నాడు. వాడు చివరకి సరే అనడంతో పెళ్లిచూపులకి సంబరంగా వైజాగ్‌ వెళ్లాం.
      పెళ్లి చూపులనాడే నా ఆనందమంతా ఆవిరైపోయింది. నా జీవితంలో జరిగిన సంఘటన గుర్తొచ్చి మనసుని అతలాకుతలం చేసింది. సరళ తాతయ్య విశ్వనాథాన్ని చూడగానే నా మనసులో దాగివున్న కోపం, ప్రతీకార వాంఛ పడగ విప్పాయి. విశ్వనాథం నన్నెరగనట్టే మర్యాదలు చేస్తుంటే లోలోపల రగిలిపోయాను. అందరి మధ్యా నా సహజ స్వభావాన్ని చూపడానికి నరకయాతన పడ్డాను. 
      నవ్వు ముఖం, నిష్కల్మషమైన కళ్లు, మాటల్లో మృదు స్వభావంతో సరళ మా మనసులను హత్తుకుంది. అందం, అణకువ కలిగిన అమ్మాయి. ఎమ్మెస్సీ చదువుతోంది. అందుకే పెళ్లి చూపులనాడే నిశ్చితార్థం చేసుకుంటామని ఆనంద్‌ చెప్పేశారు. ధరణి కాదనలేదు. తండ్రీ కొడుకూ అంతగా ఇష్టపడ్డాక నా అభిప్రాయాన్ని, విశ్వనాథం విషయాన్ని చెప్పలేక ద్వైదీభావంతో సతమతమయ్యాను. పంతులు రావడంతో తర్వాతి తంతు చకచకా జరిగిపోయింది.

* * *

      గడచిపోయిన కాలం పాతికేళ్లు పైమాట. నేను డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగా, పెళ్లిసంబంధం వచ్చింది. కలిగిన వాళ్లబ్బాయి, ఉద్యోగస్థుడు. మంచి సంబంధమని నాన్న, అమ్మ ఒప్పుకున్నారు. పెళ్లి చూపులకు శ్రీధర్‌ తల్లితోపాటు వచ్చాడు. అతడి తండ్రి విశ్వనాథం రాలేదు.
      శ్రీధర్‌ నాకు నచ్చాడు. మగపెళ్లివారు కోరిన లాంఛనాలు, కట్నకానుకల్ని కాదనలేదు. ఆ రోజే నిశ్చితార్థంతోపాటు పెళ్లికి లగ్నపత్రిక రాయడం అయిపోయింది. శుభలేఖలు ఇచ్చి పెళ్లి పిలుపులు జరిగాయి. బంధువులు, అయినవాళ్లు అందరూ మంచి సంబంధమని నా అదృష్టాన్ని గొప్పగా చెప్పుకున్నారు. ఇక అమ్మా, నాన్నల ఆనందానికి అవధులే లేవు.
ఒక్కగానొక్క అమ్మాయిని కావడంతో నాన్న నా పెళ్లి ఘనంగా చేయాలనుకున్నారు. బంధువుల రాకతో వారం రోజుల ముందుగానే ఇంటికి పెళ్లిశోభ వచ్చేసింది.
అందరూ పెళ్లి సంబరంలో ఆనందంగా ఉన్న ఒక రోజు ఉదయం పిడుగులాంటి వార్త. మగపెళ్లివారు పెళ్లి తప్పించాలనుకుంటున్నారని, ఆ ప్రయత్నంగా మాట్లాడటానికి విశ్వనాథం వస్తున్నారని మధ్యవర్తి కబురు తెచ్చాడు. అందరిలో దుఃఖపు బరువు చేరి ఇంట్లో శ్మశాన మౌనం ఆవహించింది.
ఆ రోజు నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి సమావేశం జరుగుతోంది. విశ్వనాథంతో పాటు మా బంధువులున్నారు. అప్పటికే వారి మధ్య పెళ్లి విషయమై ఏ చర్చ జరిగిందో మరి అమ్మానాన్న ముఖాల్లో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి.
      ‘‘అమ్మాయిని చూపించే ముందే మీరీ విషయం చెబితే నిశ్చితార్థం, పెళ్లి వరకూ వచ్చేది కాదు’’ విశ్వనాథం మాటలకు విషయం అర్థంకాక నాన్న వైపు చూశాను. ఆయన అవమాన భారంతో తలదించుకుని ఉన్నారు.
      ‘‘చూడండి విశ్వనాథంగారూ! పీటల వరకూ వచ్చిన పెళ్లిని మీరిలా రద్దు చేసుకోవాలనుకోవడం ధర్మంకాదు. ఇందులో అమ్మాయి తప్పేముంది’’ నాన్న సన్నిహితుడు అభ్యర్థనగా అడుగుతుంటే నాలో నవనాడులు కుంగిపోతున్నట్లయింది. పెళ్లి తప్పించడానికి విశ్వనాథం మోపుతున్న నెపమేమిటో నాకు తోచలేదు.
      ‘‘మీరన్నది నిజమే. ఇప్పుడు తప్పొప్పుల చర్చకాదు. కుల సంప్రదాయాలు, వంశ మర్యాదలు వివాహానికి వన్నెతేవాలి గానీ తలవంపులు కాదు’’ విశ్వనాథం మాటలకు అమ్మ బోరున విలపిస్తూ అక్కణ్నించి వెళ్లిపోయింది. 
      నాకప్పుడు ఛాయామాత్రంగా అర్థమై మనసు అవమాన భారంతో కుంగిపోయింది. 
      ‘‘విశ్వనాథంగారూ! మీరంటున్నట్టు ఇందులో మేం దాచిపెట్టింది ఏమీ లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా అని దానికి అంత ప్రాధాన్యం ఇచ్చి మీకు చెప్పలేదు. ఎందుకంటే మా పెళ్లయ్యి ముప్పై యేళ్లయింది. నా భార్యది మా కులం కాదని అందరికీ తెలుసు. సంబంధం కుదిర్చిన మధ్యవర్తి మీకు చెప్పేవుంటాడని అనుకున్నాం. కానీ, ఆ నెపంతో ఈ పెళ్లి మీరు కాదనుకుంటే అమ్మాయి జీవితం ఏంగాను? పీటల వరకూ వచ్చిన పెళ్లి ఆగిపోతే ఎన్ని నిందలు, ఎన్ని అపవాదులు. వాటిని భరించి ఎలా బతగ్గలం చెప్పండి’’ నాన్న వేడుకోలుకి విశ్వనాథం మనసు కరగలేదు. అతను మానవత్వంలేని మనిషనుకున్నాను.
      ‘‘మీ గురించి మీరాలోచిస్తున్నారు. ఈ పెళ్లి జరిగితే బంధువులు దాయాదుల దగ్గర మా పరువుప్రతిష్ఠలు మంటకలుస్తాయి. ఈ పెళ్లి జరగదు’’ విశ్వనాథం కరాఖండిగా చెప్పేయడంతో నాన్న నిలువునా నేలకూలిపోయారు.
      ‘‘మీరు తొందరపడుతున్నారు. ముందుగా తెలిసింది కాబట్టి కాదనుకుంటున్నారు. అదే పెళ్లయ్యాక తెలిస్తే’’
      ఓ పెద్దాయన మాటకు విశ్వనాథం తోకతొక్కిన తాచులా లేచాడు.
      ‘‘పెళ్లి పెటాకులు చేస్తానుగానీ ఇలాంటి కులభ్రష్ట సంబంధం నిలుపుకోను’’
      ‘‘ఇది న్యాయమంటారా?’’
      ‘‘ఆ విచారణ నాదొక్కడిదేనా. కులం సమాజం ఉన్నాయి’’ విశ్వనాథం తర్కానికి ఎవరు సమాధానం చెప్పగలరు. 
      దావానలం అడవిని దహించినట్టు అవమానం నా మనసుని రగిల్చివేసింది. నా పెళ్లి తప్పిపోవడం అమ్మానాన్నలకు తీరని మానసిక వ్యథ మిగిల్చింది. అమ్మ అవమాన భారంతో కుంగిపోయింది. అభిమానపడి తనకు తానే శిక్షించుకుని ఆరోగ్యం పాడుచేసుకుంది. అనారోగ్యంతో నెలల వ్యవధిలోనే కన్నుమూసి మాకు దూరమైపోయింది. దీనికంతటికీ కారణం విశ్వనాథం. నన్నూ నా కుటుంబాన్నీ అప్పుడు అవమానాలపాలు చేసిన అతణ్ని క్షమించడానికి మనసంగీకరించడంలేదు. అలా అని సరళకు కష్టం కలిగించడం నా అభిమతం కాదు. కానీ, మనసు ప్రతీకారమే కావాలంటోంది.

* * *

      సాయంత్రం ఆనంద్‌ నుంచి ఫోనొచ్చింది. తను ఆంధ్రా యూనివర్సిటీలో కాన్ఫరెన్సుకని వైజాగ్‌ వెళ్లి నాలుగురోజులైంది.
      ‘‘డియర్‌. ఎలా ఉన్నావు’’ ఆయన మాటలో ఎప్పుడూ ఉండే ఉత్సాహమే. ఆ డియర్‌ అన్న పిలుపు తప్ప నా పేరు మరచిపోయారా అనిపిస్తుంది.
      ‘‘నా బాగోగులు చూడ్డానికి ఇక్కడ అబ్బాయి ఉన్నాడు. మీరెలా ఉన్నారు. క్యాంపు ఇంకెన్ని రోజులు? తిరిగొచ్చేదెప్పుడు?’’
      నా ప్రశ్నల వర్షానికి ఆనంద్‌ పకపకా నవ్వుతూ ‘‘ఏవండీ శ్రీమతిగారూ. అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కమారు చెప్పడం ఎంత కష్టమో కాస్త ఆలోచించండి’’ అన్నారు.
      నా ఆత్రుతకు నవ్వుకున్నాను. తనొస్తే మనసులో రగులుతున్న చికాకు తొలగిపోతుందన్న తపన నాది.
      ‘‘సర్లెండి. నా ప్రశ్నలు పక్కనపెట్టి విషయం చెప్పండి’’
      కొద్దిక్షణాలు అవతల మౌనం
      ‘‘అన్నట్టు డియర్, అబ్బాయి విషయం ఏం చేశావు’’
      ‘‘ఏ విషయం’’
      ‘‘అదేనోయ్, పెళ్లి ముహూర్తం. పంతులుగార్ని పిలిచి పెట్టించమన్నానుగా’’
      వెంటనే సమాధానం దొరకలేదు. ఆనంద్‌ వూరెళుతూ ముహూర్తం పెట్టించి విశ్వనాథంకి చెప్పమన్నారు.
      ‘‘ఇప్పుడు ముహూర్తానికేం తొందర. మీరొచ్చాక చూద్దాంలెండి’’ నిర్లిప్తంగా అన్నాను.
      ‘‘అదేంటి అలా అంటావు. పాపం విశ్వనాథంగారు ఎన్ని నెలలు ఎదురు చూస్తారు?’’
      విశ్వనాథం వల్లనే సంబంధం వద్దనుకుంటున్నానని చెప్పలేకపోతున్నాను. ఆ కారణం చెబితే నాది అల్ప బుద్ధని వేలెత్తిచూపుతారని భయం.
      ‘‘ఆయన గురించి మీరు బాధపడకండి. అంత తొందరగా ఉంటే మరో సంబంధం చూసుకుంటారు’’ నా అభిప్రాయాన్ని సందిగ్ధంగా చెప్పేశాను. 
      ఆనంద్‌ దీర్ఘంగా నిట్టూర్చి కొన్ని క్షణాలు మాట్లాడలేదు.
      ‘‘అలా అనుకుంటే ఎలా. పీటల వరకూ వచ్చిన పెళ్లి ఆగిపోయినప్పుడు నేను నీలా ఆలోచిస్తే మన దాంపత్యం కలిసేదా’’ 
      అంతసూటిగా అడిగితే నేనేం చెప్పగలను. నా మనసులోని సందిగ్ధస్థితిని ఎలా తెలపను. ఆనంద్‌ నన్ను పెళ్లి చేసుకోవడంలో చూపిన సౌజన్యాన్ని సరళని కోడలిగా తెచ్చుకునేందుకు చూపలేకపోతున్నాను. విశ్వనాథం విషయంలో సమాధాన పడలేక ఏం మాట్లాడలేకపోతున్నాను.
      ‘‘చూడు డియర్‌. నీ మంచి మనసుని, సంస్కారాన్ని బలహీనపరచుకోకు. పాపం సరళ, తల్లిదండ్రులు లేని అమ్మాయి’’
      ‘‘అంత కుసంస్కారాన్ని ఏం చూపాను?’’ నా గొంతులో జీర ధ్వనించింది.
      ‘‘అలా నొచ్చుకుంటే ఎలా? జీవితంలో అందరూ మనకిష్టమైనవాళ్లు, అభిమానించేవాళ్లు తారసపడరు. విశ్వనాథంగారూ అంతే. తన కొడుకు పెళ్లి విషయంలో నీకూ నీ కుటుంబానికీ తీరని అన్యాయం చేసుండొచ్చు. దానికి సరళ కారణం కాదు కదా’’
      ‘‘ఆ వివరాలు మీకెలా తెలుసు?’’ ఆశ్చర్యంగా అడిగాను.
      ‘‘ఈరోజు ఉదయం విశ్వనాథంగారిని కాకతాళీయంగా కలిశాను. సరళ సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీకి వచ్చారు.
      ‘‘ఏం మాట్లాడారు?’’
      ‘‘పెళ్లి చూపులనాడు నిన్ను గుర్తుపట్టారట. కొడుకు పెళ్లి విషయంలో జరిగింది బాధపడుతూ చెప్పారు. తన తప్పునకు పశ్చాత్తాపం ఆయనలో కనిపించింది. నువ్వు మంచి మనసుతో సరళని కోడలిగా చేసుకుంటున్నావనుకున్నారు’’
      ‘‘ఆయన నన్ను గుర్తుపట్టీ గుట్టుగా వూరుకోవడంలో ఆంతర్యం ఏమిటి? వియ్యమొందడానికి మన కులం ఇప్పుడు మంచిదైపోయిందా. పరిస్థితులు దిగజారి చెయ్యి కిందైనప్పుడు వంకలన్నీ వెలిసిపోతాయి’’ నిష్ఠూరంగా అన్నాను.
      ‘‘ఈ పెళ్లి విషయంలో నువ్వెంత మథనపడుతున్నావో నాకు తెలుసు. మన మధ్య అభిప్రాయ భేదాలు రాకూడదనే నిర్ణయాన్ని నీకు వదిలిపెట్టాను. కానీ ఒక్క విషయం. మంచివాళ్లు, చెడ్డవాళ్లు అని మనుషుల్ని తరగతులుగా విభజించి చూడలేం. ఎందుకంటే మనలో మంచీ చెడులు రాశులు పోసినట్టు వేర్వేరుగా ఉండవు. విజ్ఞత, వివేకం లోపించినప్పుడు చెడు వైపు అడుగులు వేస్తాం. విశ్వనాథంగారూ అంతే’’ ఆనంద్‌ చాలా మృదువుగా చెప్పి విశ్వనాథంని సమర్థిస్తున్నారనిపించింది.
      ‘‘అందరూ మీ అంత మంచిగా ఆలోచించలేరు’’ నేను ఒంటరినైపోయానన్న బాధతో అన్నాను.
      ‘‘సారీ డియర్‌. నీ మనసుని కష్టపెట్టాలని నా ఉద్దేశం కాదు. మన మూలంగా ఓ అమ్మాయికి కష్టం కలగడం సమ్మతం కాదు. ఇది నా అభిప్రాయం. ఆపై నీ ఇష్టం. ఉంటాను’’ ఫోన్‌ కట్టయింది. నాలో అంతవరకూ ఉగ్గపట్టుకున్న దుఃఖం ఇక ఆగలేదు.

* * *

      ‘‘అమ్మగారూ’’ పనిమనిషి పనులు ముగించుకుని వెళ్లబోతూ పిలిచింది. 
      ‘‘ఏం సత్యవతీ, పనైపోయిందా’’
      ‘‘అయిందమ్మా. రేపట్నుంచి వారం రోజులు పనికి రానండి’’ ఆ మాటకి నా గుండెల్లో రాయి పడింది.
      ‘‘అదేంటి సత్యవతీ. నాకు వంట్లో బాగుండటంలేదని తెలుసుండీ అన్ని రోజులు రానంటే ఎలా’’ 
      ‘‘తప్పదమ్మా. రత్నానికి నెలలు నిండాయి. కాన్పునకి తీసుకురావాలి’’
      నాకు ఆశ్చర్యమేసింది. రత్నం ఆమె కూతురు. వేరే కులం వాణ్ని ప్రేమించి పెళ్లాడి వెళ్లిపోయింది.
      ‘‘కులం చెడిందని తనని నానా తిట్లూ తిట్టి ఇంటికి రానీలేదు. శాపనార్థాలు పెట్టావు. ఆమె అలా చేసిందని ఇన్నాళ్లూ బాధపడి ఇప్పుడెలా తీసుకొస్తావు?’’
      ‘‘ఏం చేయనమ్మా. తండ్రిలేని పిల్ల. రెక్కల కష్టంతో పెంచాను. నాకెవరున్నారు చెప్పండి’’ సత్యవతి కంటనీరు పెట్టుకుంది.
      ‘‘కూతుర్ని క్షమించావన్నమాట’’
      ‘‘పంతాలూ పట్టింపులూ ఎన్నాళ్లుంటాయమ్మా. రత్నాన్ని కన్నది నేను. కులం కాదు’’ నేను నివ్వెరపోయాను. సత్యవతి ఎంత విజ్ఞత చూపింది. 
      ఎక్కడో చదివిన ఐన్‌స్టీన్‌ మాటలు గుర్తుకొచ్చాయి. ‘‘చదువు వల్ల జ్ఞానం లభిస్తుంది. కానీ జీవితం కేవలం జ్ఞానం వల్లనే సాఫల్యం కాదు’’ జీవిత సాఫల్యానికి మనుసుకి విచక్షణనిచ్చే బుద్ధితో ప్రవర్తించాలని తెలిసింది. చదువులేకపోయినా సత్యవతి అదే చేసింది. అది నాకు కనువిప్పు.
      ‘‘మంచిపని చేస్తున్నావు సత్యవతీ. రత్నం సంతోషిస్తుంది. తన జీవితం సుఖమయమవుతుంది’’ మెచ్చుకోలుగా అన్నాను. సత్యవతి సంబరపడుతూ వెళ్లిపోయింది. నా మనసుని ద్వంద్వం విడిచిపెట్టింది.
      పెళ్లి ముహూర్తం ఆడ పెళ్లివారు నిర్ణయించడం సంప్రదాయం. పెళ్లికి లగ్నపత్రిక రాసుకోడానికి మంచిరోజు చూసి మేమే వస్తున్నామని విశ్వనాథంగారికి ఫోన్‌ చేసి చెప్పాను. అప్పుడుగానీ నా మనసు తేలికపడలేదు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam