వ్యవసాయం

  • 499 Views
  • 13Likes
  • Like
  • Article Share

    పేట యుగంధ‌ర్‌

  • వెదురు కుప్పం, చిత్తూరు.
  • 9492571731
పేట యుగంధ‌ర్‌

వరదయ్య తనకున్న నాలుగెకరాల పొలంలో కొంత వరి, మరికొంత వేరుశనగ వేసి, అంతర పంటగా కూరగాయలు పండించాలనుకున్నాడు.  కొడుకు సుధాకర్‌ తనకు చేదోడుగా ఉంటాడని ఆశపడ్డాడు. కానీ సుధాకర్‌కు వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేదు. మరి వరదయ్య  కొడుకును ఒప్పించాడా? 
సుధాకర్
‌ రోడ్డురవాణా సంస్థలో చిత్తూరు డిపోలో పనిచేసేవాడు. ఇటీవల జరిగిన బదిలీల్లో అతడు తిరుపతి డిపోకు బదిలీ అయ్యాడు. అతడి సొంత ఊరైన రామాపురం నుంచి తిరుపతికి కేవలం పది కిలోమీటర్ల దూరం కావడంతో తిరుపతిలో అద్దె ఇల్లు తీసుకోకుండా సొంత ఊరైన రామాపురానికి భార్యాపిల్లలతో మకాం మార్చాడు. కొడుకు, కోడలు, మనుమడు తనతోపాటు నివశించడానికి వచ్చేసరికి సుధాకర్‌ తండ్రి వరదయ్య ఎంతో సంభరపడిపోయాడు. వరదయ్య సన్నకారు రైతు. తనకున్న నాలుగెకరాల పొలంలో వ్యవసాయం చేసి సుధాకర్‌ను చదివించి ప్రయోజకుడ్ని చేశాడు.

 

*  *  *

      సకాలంలో వర్షాలు పడ్డాయి. సుధాకర్‌ కూడా తనకు తోడుగా ఉన్న మూలాన వ్యవసాయ పనులను ఉత్సాహంగా ప్రారంభించాడు వరదయ్య. తనకున్న నాలుగెకరాల పొలంలో కొంత వరి, మరికొంత వేరుశనగ వేసి, వేరుశనగలో అంతర పంటగా కూరగాయలు నాటాలని నిర్ణయించాడు. తన కొడుకు సుధాకర్‌ వ్యవసాయంలో తనకు చేదోడువాదోడుగా ఉంటాడని ఆశపడ్డాడు. కానీ సుధాకర్‌కు వ్యవసాయం చేయడం ఇష్టంలేదు. కష్టపడి వ్యవసాయం చేసినా ఆశించిన స్థాయిలో లాభాలు ఉండవన్నది సుధాకర్‌ అభిప్రాయం. కొన్ని సార్లు అతివృష్టి వల్ల, మరికొన్ని సార్లు అనావృష్టి వల్ల పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందదన్నది అతడి ఉద్దేశ్యం. ఇదే విషయాన్ని వరదయ్యకు సూటిగా చెప్పాడు సుధాకర్‌. వరదయ్యకు కూడా వయసు పైబడిన కారణంగా, వ్యవసాయం మానేసి, విశ్రాంతి తీసుకోమని తండ్రికి సలహా ఇచ్చాడు.
      ఎప్పుడూ పచ్చగా ఉండే పొలం బీడుభూమిగా మారిపోయేసరికి వరదయ్య చాలా దిగులుపడ్డాడు.
      ‘‘తాతయ్యా! నువ్వు ఎందుకని దిగులుగా ఉన్నావు?’’ వరదయ్యను అడిగాడు అతడి మనవడు ప్రశాంత్‌.
      ‘‘మీ నాన్న వ్యవసాయం వద్దని అంటున్నాడు. అందుకే!’’ సమాధానం ఇచ్చాడు వరదయ్య.
      ‘‘ఉద్యోగం చేసి నాన్న గారు డబ్బులు సంపాయిస్తున్నారు కదా! మనం వ్యవసాయం చేయకపోతే ఏమవుతాది?’’ అంటూ తాతయ్యను అమాయకంగా అడిగాడు ప్రశాంత్‌.
      వరదయ్య ప్రశాంత్‌ను దగ్గరకు తీసుకుని తన బాధను చెప్పుకున్నాడు. 
      ‘‘చూడు ప్రశాంత్‌! మనకు పొలం ఉంది. పొలానికి సరిపడా సాగునీరు ఉంది. తరతరాలుగా మనది రైతు కుటుంబం. వ్యవసాయం చేయడం మనకు పుట్టుకతో వచ్చిన విద్య. అలాంటి మనమే వ్యవసాయం చేయకపోతే ఎలా? కష్టమని, నష్టమని చెప్పి దేశంలోని రైతులందరూ మనలాగే వ్యవసాయం మానేస్తే మనదేశం ఎడారి భూమిలా మారిపోతుంది. దేశంలో ఆహారధాన్యాల కొరత ఏర్పడుతుంది. అప్పుడు మన ప్రభుత్వం ఇతర దేశాల నుంచి ఆహారధాన్యాలను, పప్పు దినుసులను, ఆకుకూరలను దిగుమతి చేసుకోవాల్సొస్తుంది. వరీ, గోధుమ, జొన్న, పప్పుధాన్యాలు, కూరగాయల రేట్లు గణనీయంగా పెరిగిపోతాయి. ఆకాశాన్నంటే ఆహార ధాన్యాలను కొనుక్కొని తినలేక ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. పౌష్టికాహార లోపంతో పేదలు అనారోగ్యపాలవుతారు. మా చిన్నతనంలో ఇంటికి కావాల్సిన ఆహారధాన్యాన్ని, కూరగాయలను, పండ్లను మా నాన్న గారు పండించేవారు. ఇరుగుపొరుగు వారికి కూడా పండించినదాన్ని ఉచితంగా ఇచ్చేవారు. అలాగే పొరుగువారు కూడా తాము పండించిన వాటిని మాకూ ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. వ్యవసాయం చేసేవారు తగ్గిపోయారు. జనాభామాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. అందువల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. వాటి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మా చిన్న తనంలో ఉచితంగా లభించే కూరగాయలు ఇప్పుడు కిలో అరవై, డెబ్బై రూపాయలు పలుకుతున్నాయి. పప్పు ధాన్యాలైతే కిలో రెండువందల పైమాటే. ఇది ఇలాగే కొనసాగితే మీరు పెరిగి పెద్దయ్యే సరికి వీటి ధరలను ఊహించుకోవడమే కష్టంగా ఉంది.’’ భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ప్రశాంత్‌కు వివరించాడు వరదయ్య.
      పసివాడైన ప్రశాంత్‌కు వరదయ్య చెప్పింది పెద్దగా అర్థం కాలేదు గానీ, తండ్రి మాటలను వింటూ, ఇంట్లో కూర్చొని భోంచేస్తున్న సుధాకర్‌ మీద ప్రభావం చూపాయి వరదయ్య మాటలు.
      సుధాకర్‌ పడుకున్నాడే గానీ, అస్సలు నిద్రపట్టలేదు. తన తండ్రి చెప్పిన మాటలు పదేపదే అతడి చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆలస్యంగా ఎప్పటికో నిద్రపట్టింది. అంతలోనే తెల్లవారిందంటూ అతడి భార్య పద్మ సుధాకర్‌ని నిద్రలేపి
      ‘‘ఏమండీ! తొందరగా నిద్రలేచి, మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు పట్టుకొనిరండి!’’ అని చెప్పింది.
      ‘‘ఇంకొంచెం సేపు పడుకొనివ్వవే!’’ బతిమాలినట్టు అడిగాడు సుధాకర్‌.
      ‘‘ఆలస్యమయితే వాడిపోయినవి, పుచ్చుపట్టినవి తప్ప తాజా కూరగాయలు దొరకావు. వెంటనే బయలుదేరండి!!’’ అంటూ సుధాకర్‌ను నిద్రలేపి తన చేతిలో వందరూపాయల నోట్లకట్టను పెట్టింది పద్మ.
      ‘‘ఇంత డబ్బెందుకే?’’ నోట్ల కట్టను అందుకొంటూ ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్‌.
      ‘‘సంచి నిండా కూరగాయలు కావాలంటే ఆ మాత్రం డబ్బులు కావాలి కదా!’’ అంటూ వంటగదికి వెళ్లింది పద్మ. 

*  *  *

      సుధాకర్‌ తయారై మార్కెట్‌కు వెళ్లాడు. ఒక కొట్టులో తాజా క్యాలీఫ్లవర్లు కనబడ్డాయి.
      ‘‘ఏమండీ రెండు కిలోల క్యాలీఫ్లవరు ఇవ్వండి.’’ అడిగాడు సుధాకర్‌.
      ‘‘ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌ చేస్తున్నారా సార్‌?’’ తిరిగి ప్రశ్నించాడు కొట్టువాడు.
      ‘‘ఎందుకలా అడుగుతున్నారు?’’ 
      ‘‘ఒకేసారి రెండు కిలోలు కొంటున్నారు కాదా! అందుకే అడిగాను’’. అతడు ఏం మాట్లాడుతున్నాడో సుధాకర్‌కు అర్థంకాక తల గోక్కునాడు.
      ‘‘క్యాలీఫ్లవర్‌ కిలో తొమ్మిదివందలు సార్‌! ఇవ్వమంటారా?’’. రేటు వినగానే సుధాకర్‌ నోరు తడారిపోయింది.
      ‘‘అదేంటయ్యా! అంత రేటు చెబుతున్నావు?’’ 
      ‘‘గతవారం కిలో వెయ్యి రూపాయలు పలికింది సార్‌! ఇప్పుడే కాస్త రేటు తగ్గింది.’’ సుధాకర్‌ అయోమయంతో పక్క కొట్టుకు వెళ్లాడు. 
      ‘‘బాబు! వంకాయలు ఎంత?’’ 
      ‘‘కిలో ఆరువందలు సార్‌!’’ 
      ‘‘కిలో అరవైకి ఇస్తావా?’’ తడబడుతూ అడిగాడు సుధాకర్‌.
      ‘‘మీరు భలే తమాషా మనిషిలా ఉన్నారు సార్‌! అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ల కిందట 2020లో మీరు చెప్పిన రేటుకే అమ్మేవాణ్ని.’’ 
      ‘‘అంటే ఇప్పుడు నడుస్తున్నది 2050వ సంవత్సరమా?’’ నమ్మలేనట్టు అడిగాడు సుధాకర్‌. 
      ‘‘చూస్తుంటే చదువుకున్న వారిలా ఉన్నారు! మీకు ఆ మాత్రం తెలియదా?’’ 
      ‘‘రండి సార్‌! రండి!! టమాటా అరవై, ఉల్లి ఎనభై, టమాటా అరవై, ఉల్లి ఎనభై’’ అంటూ గట్టిగా అరుస్తూ సుధాకర్‌ ను పిలిచాడు ఆ పక్క కొట్టువాడు.
      ఆ రేటు వినగానే సుధాకర్‌ చెవిలో అమృతం పోసినట్టు అనిపించింది. ఆలస్యమైతే వాడు కూడా రేటు పెంచేస్తాడేమోనని, జేబులో నుంచి రూ.140 తీసి కొట్టువాడి చేతిలో పెట్టాడు. కొట్టువాడు నింపాదిగా ఒక టమోటా పండు, ఒక ఉల్లి గడ్డ తీసి సుధాకర్‌ సంచిలో వేశాడు.
      ‘‘అదేంటయ్యా! చెరో కిలో ఇవ్వమని రూ.140 ఇస్తే చెరోకటి తీసి సంచిలో వేశావు?’’
      ‘‘నూటనలభై రూపాయలకు చెరో కిలో ఇవ్వడానికి ఇవి కూరగాయలనుకున్నారా? లేదా కంకర రాళ్లనుకున్నారా?’’
      ‘‘నువ్వేకదయ్యా చెప్పావు. టమాటా అరవై, ఉల్లి ఎనభై అనీ!’’ అన్నావు.
      ‘‘అవును! చెప్పాను!! ఒక టమాటా పండు అరవై, ఒక్క ఉల్లి గడ్డ ఎనభై అని చెప్పాను!’’ కోపాన్ని దిగమింగుకొని చెప్పాడు కొట్టువాడు.
      అంతలోనే ఒక పెద్దావిడ ‘‘ఏమయ్యా! ఒక అర్ధగడ్డ ఉల్లి, రెండు పాయల వెల్లుల్లి ఎంతవుతుంది?’’ 
      ‘‘అర్ధగడ్డ ఉల్లి నలభై రూపాయలు, రెండు వెల్లుల్లి పాయలు ఇరవై, మొత్తం కలిపి అరవై అవుతుందమ్మా!’’ 
      ఆవిడ అరవై రూపాయలు ఇవ్వగానే చాకుతో ఉల్లిని సరాసరి సగానికి కత్తిరించి ఒక సగం ఆమె సంచిలో వేసి, అదే చేత్తో ఒక వెల్లుల్లి గడ్డను చీల్చి, రెండు వెల్లుల్లి పాయలను ఆమె చేతిలో పెట్టాడు. 
      ‘‘ఏంటో! మా చిన్నతనంలో కూరగాయలను రాశులుగా పోసి అమ్మేవారు. కష్టమని, నష్టమని చెప్పి దేశంలోని రైతులందరూ వ్యవసాయం మానెయ్యడంతో ఆ రోజుల్లో కిలోలకొద్దీ కూరగాయలు కొన్న చోటే ఇవ్వాళ గ్రాములతో తూచి కోనాల్సివస్తోంది!’’ అంటూ తనలో తానే మాట్లాడుకుంది పెద్దావిడ.
      ‘‘సుధాకర్‌కు విషయం అర్థమైంది. ఆ రోజు తన తండ్రి ఏదైతే భయపడ్డాడో ఇప్పుడు అదే జరుగుతోంది. కూరగాయల ధరలు అమాంతం పెరిగి అందుబాటులో లేకుండా పోయాయి. ఆ రోజు తన తండ్రి చెప్పినట్టు వ్యవసాయం చేయాల్సింది. దేశంలోని రైతులందరూ తమ పిల్లలచేత వ్యవసాయం చేయించాల్సింది!’’ అని బాధపడ్డాడు సుధాకర్‌.
      ‘‘సార్‌! ఇంకా ఏవైనా కూరగాయలు కావాలా?’’ కొట్టువాడి అరుపుతో ఈ లోకంలోకి వచ్చాడు సుధాకర్‌.
      ‘‘రెండు బెండకాయలు, ఒక మునక్కాడ, అర్ధ బీరకాయ, వందగ్రాముల క్యాలీఫ్లవర్, నాలుగు పచ్చిమిర్చి, పదిగ్రాముల అల్లం ఇవ్వండి!’’ అన్నాడు సుధాకర్‌.
      ‘‘ఏమండీ! ఏమండీ!!’’ వెనుక నుంచి తన భార్య పద్మ పిలిచినట్టు వినిపించడంతో అటూ, ఇటూ చూశాడు.
      ‘‘ఏమయ్యిందండీ! బెండకాయలు, మునక్కాడలు, బీరకాయలు అంటూ నిద్రలో ఏదేదో కలవరిస్తున్నారు!’’
      సుధాకర్‌ కళ్లు నులుముకొని చూశాడు. తను మార్కెట్‌లో లేడు. తన గదిలోనే ఉన్నాడు. ఇంతసేపు కలగన్న విషయం అవగతమైంది అతడికి. 
      ‘‘పద్మా! నాన్నగారు ఎక్కడున్నారు?’’ 
      ‘‘పెరట్లో బొప్పాయి మొక్కలకు పాదులు తొవ్వుతున్నారు.’’  
      సుధాకర్‌ తండ్రి దగ్గరకు పరిగెత్తాడు.
      ‘‘నాన్నా! నాన్నా!! మీరు చెప్పినట్టే మనం వ్యవసాయం చేద్దాం. సెలవు రోజుల్లో, ఖాళీ సమయాల్లో నేను మీకు తోడుగా ఉంటాను. మన ప్రశాంత్‌కు కూడా ఇప్పటి నుంచి వ్యవసాయం చేయడం అలవాటు చేద్దాం.’’ 
      తన కొడుకులో వచ్చిన మార్పుకు వరదయ్య ఎంతగానో సంతోషపడ్డాడు. దేశంలోని రైతుబిడ్డలందరూ తన కొడుకులాగే తమతమ ఉద్యోగాలతోపాటు వ్యవసాయానికి కూడా తగిన ప్రాధాన్యతనిస్తే ఈ దేశంలో ఎప్పటికీ ఆహారధాన్యాల కొరత ఏర్పడవని అనిపించింది వరదయ్యకు. 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam