నాన్న మీద పిరేదీ

  • 478 Views
  • 7Likes
  • Like
  • Article Share

    బందిలి రతన్‌ రాజు

  • కన్‌స్ట్రక్షన్‌ అసిస్టెంట్, డీఆర్‌డీవో
  • విశాఖపట్నం
  • 9490263115
బందిలి రతన్‌ రాజు

మలేరియా జ్వరాలు పల్లెలను వణికించిన రోజుల్నాటిమాట! ఆ ఊరికి
ఉపాధ్యాయుడూ, వైద్యుడూ అయిన ఓ తండ్రి తన సొంతకొడుకుకు  
చేసిన వైద్యం... చివరికి ఊరుఊరంతటినీ నవ్వుల్లో ముంచేసింది.
ఆ యవ్వారమేంటో తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంత మాండలికంలో చదవండి...
ఊళ్లో
సేనామందికి జొరాలు. తెలిసినోళ్లెవళకన్నా జొరవొచ్చి మంచానడ్డారని కబురు తెలిత్తే గుండె గుబేలనేది. ఎందుకంటే ఆ నీరసం మామోలుగుండేది గాదు. ఒల్లు అగ్గినిప్పుల్లా కాలిపోయేది. సలిజొరవొచ్చినోళ్లు పక్కనుంటే కుంపటి సెగ దగిల్నట్టుండీది. నాలుగు రోజుల్లో అటో ఇటో తేలిసీసేది. ఆ నీరసానికి వాంతులూ ఇరేసనాలు తోడైతే.. ఆపాళంగా పేణమ్మీద ఆసొదిలేస్కోవాల్సిందే. గోడల నిండా ఎక్కడబడితే అక్కడ ఇదే పెసారం. పలాసటి రేకుమీద అచ్చరాలు కత్తిరించుంటాయి. అది గోడమీదెట్టి రంగులోముంచి దీసిన గుడ్డతో రుద్దితే ఇదిగిలాగొచ్చేది.
      ‘‘జ్వరమా? అది మలేరియా కావచ్చు..! క్లోరొక్విన్‌ మాత్రలు వాడండి’’ అని. రేడియోలో గూడా ‘‘జ్వరమా అది మలేరియా కావచ్చు...’’  టింగ్‌ టింగ్‌... సీటికీమాటికీ ఇదే గొడవ. గవర్మెంటు ఊదరగొట్టేత్తోంది.

* * *

      మాది సెంకారం (శంఖవరం). ఇటు పల్టూరూకాదు, టౌనంతకంటే గాదు. మా నాన బడిపంతులు. సర్కారీ బడిపంతుళ్లకి అట్టే జీతాలివ్వక పోయినా, ఊళ్లో సేనా గౌరం. మా ఊళ్లో సొంతిల్లు. గైరంపేట్లో ఉజ్జోగం. రోజూ ఆరు మైళ్ల పయాణం. ఆ రోజుల్లో సైకిలుంటే గొప్ప. మా నానది ‘అంబర్‌’ సైకిల్‌. అదెక్కించుకుంటే ఏనుగంబారీ ఎక్కినంత సంబరమైపోయేది. మాయమ్మకి మేమైదుగురు సంతానం. నేన్నడిపోణ్ని. అప్పుడికి మాయన్నియ్య, మాయక్క ఎడపిల్లలు. నా తరవాత ఇద్దరు సెల్లెళ్లు. ఆళ్లు మరీ సిన్నోళ్లు. నాకూహ తెలుసు... అప్పుడు మూడో తరగతి సదుంకుంట్నాను. మా ఊళ్లో బాగా అల్లరి జేసీవోల్ని సుండోడంటారు. ఇంట్లోవోళ్లే గాదు, ఈదిలోనూ కొంతమంది నన్నలాగే పిల్సీవోళ్లు. ఆళ్లలా బిలుత్తుంటే.. నేను కోపంతో పెద్దపుల్లాగ రంకెలేసేవోణ్ని. అందుకే ‘పెద్దపులి’ అని పేరొచ్చింది. అదొదిలేద్దాం. నానతో ఆచ్‌.. ఎల్డమంటే సంచట్టుకుని ఊళ్లో బజారుకి తోడెల్డం. ఒగరోజు.. ‘‘నానా నేనూ నీతో మీ స్కూలు కొత్తా’’నని మొండిపట్టట్టేను. ఎప్పుడన్నా నన్ను సైకిలుమీద ఎక్కించుకుని గైరంపేట తీస్కెల్లీవోడు. నాకొక్కడికే గాదు, అప్పుడప్పుడూ అన్నయ్యకీ, అక్కకీ గూడా ఈ శాన్సు దొరికేది. గైరంపేటెల్లీ దార్లో నల్లగొండమ్మ గండీ ఎక్కుడు ఎక్కేసరికి నానకి గుడ్లెక్కొచ్చి, పేణం సాలొచ్చినట్టుండీది. ఇంక దిగుడులో సొక్కా గుండీలిప్పేసి తస్సాదియ్య సైకిలు యాండ్లట్టుకుని రయ్యిమని ఎల్తా ఉంటే.. నాకైతే ఇవానమ్మీద ఎల్తున్నట్టుండేది.
      ఆయాల నాన సైకిలు గైరంపేట ఊళ్లోకిలాగ అడుగెట్టిందంతే. ‘‘మేస్ట్రుగోరండీ.. మేస్ట్రుగోరండీ...’’ బళ్లో పిల్లలకి ఉప్మా వొండే అప్పయ్యమ్మ పలకరింపు. ఎవలకో జొరమని కబురు నాన సొవులో ఊదేసింది. అప్పుడ్లో బడిపంతులంటే సేత్తో బెత్తమట్టుకుని పిల్లలకి పాఠాల్జెప్పడమొకటే కాదు. సేనా పనుల్జెయ్యాల. ఊళ్లో జనానికి జబ్బొచ్చినా, జాడ్డిమొచ్చినా ఆరసాల, తీరసాల. ఈ కట్టాలన్నీ జూసి ‘బతకలేక బడిపంతులు’ అని ఎగతాళిజేసేవోళ్లూ ఉండీవోరు. పెదమ సికిచ్చ సరంజామా అంతా ఎప్పుడూ నాన బుజానికేలాడే సంచిలో సిద్ధంగా ఉండీది. అంగుళం ఎడెల్పుండే నాలుగు అంగుళాల అద్దం ముక్కలు పత్తేకంగా ఒక పెట్లో ఒజ్జిగా బేర్సుండియ్యి. బడి తలుపుతీసి, గంట గొట్టించేడు నాన. ఇద్దరు కుర్రోళ్ని బెత్తాయించి బడికి రమ్మని ఇంటింటికీ కబురంపేడు. 
      కుర్రోళ్లు బడికొచ్చీలోగా జొరవొచ్చినతనింటికి నడిసెల్లేం. ముందు రాత్రి పొగలు సెగలు కక్కేలాగ పిడకల పొయ్యిమీద అమ్మ టెరైలో అదేదోజేసి రడీ జేసిన సూదుల్లో ఒకటి దీసేడు. ఇంకో పెట్లోంచి టెరైల్‌ కాటన్‌ ఉండ తీసేడు. పిరిటు సీసాలో ఆ దూదుండ ముంచేడు. జొరవొచ్చినతని సేతి ఏలొకటి ఎడం సేతిలోకి దీసుకొని గట్టిగా బిగించేడు. కుంచేపయ్యేక కుడిసేతిలో సూదితో కసక్కమని పొడిసేసేడు. అంతే.. రత్తం బొటబొటా గారింది. అదిజూసి ఒకమ్మి కళ్లుదిరిగి పడింది. ఎంట్నే.. అద్దంపెంకుకి రెండు కొసలకాడా రెండు సుక్కలంటించేడు. పేసెంటు సేతి ఏలికి పిరిటు కాటన్‌ ఆనించి గట్టిగా పట్టుకోమని ఆళ్లావిడికి పురమాయించేడు. ఆ గాజు పెంకులకి ఒక మూల్న రత్తం సుక్కల్ని గుండ్రంగా రుద్దేడు. రెండోపక్క రత్తాన్ని పలాసగా ఇంకో సెతురస్రాకారపు గాజుతో సర్దేడు. కుంచేపు ఎండలో బాగా ఆరబెట్టేడు. పేసెంటు పేరూ వయసూ అద్దం పెంకు ఎనకాల రాసుకున్నాడు. ‘‘గొంతార్సుకుపోయి.. దాహం ఎక్కుగా ఏత్తాది. బాగా మరిగించి, సల్లార్చి ఒడగట్టిన మంచీనీలే ఇయ్యండి. ఇంట్లో అందరూ అలాటి నీలే తాగండి. మూడుపూట్లా ఈ మాత్తర్లు ఎయ్యండి’’ ఇలాటి జాగర్తల్జెప్పి క్లోరిక్విన్‌ మాత్తర్లు పొట్లాం గట్టిచ్చేడు. మలేరియా బిళ్లలు, పేరాసిటమాలు, ఐరన్‌ టేబ్లెట్లూ మా ఇంట్లో ఎప్పుడూ కట్టలు కట్లు టాకుండేయి. అప్పుడప్పుడూ నాకు అనుమానవొచ్చీది. ఇంతకీ మానాన డాట్రా? టీచరా? అని. పానకంలో పుడకలాగా నా ఊసెందుకులే. ఆ ఊరిజనం మాత్రం.. నానకి బలే సేరికైపోయేరు. దేరామేట్టోరు, దేరా మేస్ట్రు అని సనువుగా బిలిసీవోళ్లు. అసలు పేరైతే డేవిడ్రాజు మేస్టరు.. వాడకంలోకొచ్చీ సరికి అలాగైపోయింది. నాన్ని జూత్తే నా వయసు కుర్రకుంకలకి అడలు. నాక్కూడా. బళ్లో పాటం జెప్తుంటే పిన్డ్రాప్‌ సైలెన్సే. ఎవలన్నా ఎదవేసాలేత్తే ఈపు ఇవానం మోతే. ఒంటిపూట బళ్లు. మజ్జానం దాకా గొంతు జించుకుని పాఠాలు చెప్పేడు. మిట్ట మజ్జానం సైకిలు సీటు సుర్రుమని గాల్తోంది. నన్ను కూకోబెట్టడానికి సరిపడా తలంలో తమాసగా తువాలు సుట్టేడు. నా నెత్తిమీద ఇంకో తువాలు సుట్టేసేడు. అంతే ఎండా లేదు కొండా లేదు. ఇంటికి రయ్యిన సైకిలు తొక్కొచ్చేడు.
      ఒక పనిమీద బయటికొచ్చి నాలుగు పన్లు సక్కబెట్టుకురాడం నాన కలవాటు. నాకూ అదే తీరవొచ్చిందంట. పొద్దున్న గైరంపేటలో సేకరించిన రత్తం నమూనా గాజు పలకల్ని బద్దరంగా పొట్లాం గట్టి దారం జుట్టేడు. ఒక పక్క నాన ఎడ్రస్సూ, ఇంకోపక్క ‘శంఖవరం పీహెచ్‌సీ’ అని ఇంగిలీసులో రాసి, పొట్లం జాగర్తగా సెంకారం ఆస్పట్లు రత్తపరీచ్చ గదిలో ఇచ్చొచ్చేడు. ముందు రోజిచ్చిన రత్తం సేంపిళ్ల తాలూకు లేబు రిపోటులు దీసుకున్నాడు.
      ఆయాల సుక్కురోరం. సెంకారం సంత. మజ్జానం దాటేక అక్కడికి సుట్టుపక్కల పల్లెటూళ్ల నుంచి జనం అగులోబొగులోమంటా నడిసొచ్చి సరుకులు కొనుక్కుంటున్నారు. సంతబైలుకెల్లి ఇంటిగ్గావొలసిన సరుకులు తేడంతోపాటు గైరంపేటోళ్లు గాని గనబడితే ఆళ్లకి ఫలానోళ్ల రక్తపరీచ్చ ఇవరాలు అనిజెప్పి కబురంపేరు. మజ్జె మజ్జెలో సంతకొచ్చిన మేట్టర్లు, ఆపీసోళ్లతో సెంటర్‌ క్లాస్‌ ముచ్చట్లు. ఏరే ఉజ్జోగత్తుల్తో అయితే ఇంక్రిమెంట్లు, డీఏ ఎరియర్సూ, రాజకీయాలు వగైరా కబుర్లు. ఇదీ ఆయనొరస. నాకొక్క ముక్క అర్తమయ్యీదిగాదు. ఊ... సంతలోనూ ఇదే సొద అనుకునీవోణ్ని అచ్చు మాయమ్మకులాగే. పొద్దోపాల ఇల్లు జేరేసరికి నాకూ ఒల్లుగాల్తున్నట్టనిపించింది. ఉడుకు జొరవొచ్చినట్టుంది. ఎవళకీ జెప్పలేదు. ఒకేల సెప్తే ఎండలో సైకిలుమీద పెత్తనాలెందుకని గడ్డెడతారని.
      పుల్లల పొయ్యి మీదే వంట. అమ్మకు సందరకాడే వంట పూర్తయ్యింది. అమ్మసేతి సారు మరిగింపు, తాలింపు... ఆ గుబాలింపే ఏరు. నాకు దెలిసి అమ్మంత రుసిగా సింతపండు సారు ఎట్టీవోళ్లు ఈ బూపెపంచకమ్మీదే లేరు. అమ్మ ఇలా సారు తాలింపేసి పొయిమీంచి దాక దించిందో లేదో ఈది ఈదంతా గుమాయించేసింది. ఈ తాలింపు గొందికి ఆ కూసేపూ మాయమ్మకి పొరమారేసీ అల్లకల్లోలమైపోయీది. ఆ వాసనకి సంటిపిల్ల తల్లులు కూరగిన్నెలతో మా ఇంటిముందు వరస కట్టేవోళ్లు. మాతోపాటు ఆ దాకిడు సారే ఆళ్లందరికీ తలా కొంతా సర్దేది. అమ్మసేతి సారన్నంలో సన్నటి సిప్స్‌లా తరిగి ఓ నూనెసుక్కేసి అట్లపెనమ్మీద అటూ ఇటూ తిరగేసి జేసిన అరిటికాయేపుడు నంజుకుని లొట్టలేసుకుంటా అన్నాలు దినేసేం. మా నానైతే అన్నమైపోయేక గళాసుడు సారేసుకుని దోరిసేసీవోడు. అలాజేత్తే సుఖిరేసనమౌతాదని మాకు జెప్పీవోడు.
      పిల్లాజెల్లా వాకిట్లో మంచాల మీదే పడక. నవారుమంచం, నులకమంచం, మడతమంచం ఇలా రకానికొకటుండేయి మాయింట్లో. అందరి మంచాలకీ పక్కలు, తలదిండ్లు, దుప్పట్లు, తలకాడ సెంబుతో మంచీలు, ఆటికి మూత గళాసొకోటి అమిరసేసి తొంగడబెట్టిందమ్మ. ఈలోగా ‘‘కస్తూరీ.. ఇట్రావోయ్‌. కాళ్లు పీకుతున్నాయి. కూతంత మర్దనా జెయ్యవూ..!’’ అభ్యర్థనలాంటి ఆదేశమేదో జారీ చేసేడు నాన. అంతే, ఆగమేగాల మీద పన్లన్నీ ముగించేస్కోని కొబ్బర్నూనితో మర్దనా జెయ్యడం మొదలెట్టిందమ్మ. ఇక్కడో సంగత్జెప్పాల. ఇసుగూ, ఇరామం ఈ రెండు పదాలు మా అమ్మ నిగంటువులో భూతద్దమెట్టి ఎతికినా దొరకవు. అందరం మంచాల మీద సాగోరేం. అసలే ఎన్నెల రాత్తుర్లు.. మజ్జెమజ్జెలో సెట్లగాలి. బలే ఆయిగా నిద్దరట్టేసింది.
      తెల్లారింది. అందరూ ఎవళ పనుల్లో ఆళ్లున్నారు. నాకు జొరమొచ్చినట్టుంది. ఎప్పుడు జేరిందో అమ్మ నా పక్కనే ఉంది. సల్లన్నీట్లో తడిపిన సుబ్బరమైన గుడ్డొకటి నొసటిమీదెట్టింది. కొబ్బర్నూని రాసి తల నివురుతోంది. నాదగ్గిర జొరం వాసనొత్తుందంట అమ్మ జెప్పింది. ఓపక్క నాకూ రత్తం నమూనా తీత్తాడేమో నాన అని అనుమానం వొచ్చింది. అది నిజమవడానికి ఎంతో సేపుపట్టలేదు. నా చిట్టి ఏలికి సూదిగుచ్చి రత్తం పిండేత్తుంటే, కోడిపిల్లలా గిలగిల కొట్టుకున్నాను. అడలిపోయి ఆకాసమటేసి నేనేడుత్తుంటే ఇంట్లోవోళ్లంతా ఓదార్సేరు. 
      నాన సాయంత్రం బణ్నుంచి తిరిగొచ్చేక మల్లా దర్మామీటర్‌తో జూసేడు. మలేరియా ఔనో కాదో నాకంత గేపకం లేదు. కానీ పిర్రమీద ఇండీసన్లు మరిసిపోలేదు. మా నాన సిరంజిలు, సూదులు సరుత్తుంటేనే పేణం పోయినంత పనైంది. గిజాయించి పారిపోవాలనుకున్నా ఓపికలేదు. గుక్కెట్టి ఏడిసేను. కిల్లపెట్టి మారాంజేసేను. ఏంజేత్తే మాత్రం ఏం? నన్నెప్పుడూ ఎనకేసుకొచ్చే అమ్మే నా మాటిన్లేదు. ‘‘ఇండీసనేకదా నెప్పి తగ్గిపొద్దిలే’’ అని సర్దిసెప్పి సన్నాయినొక్కులు నొక్కుతోంది. అమ్మ, నాన కలిసి నాకు ఇండీషనియ్యడానికి తయారయ్యేరు. నా కాళ్లూ సేతులూ కదలకుండా పట్టుకోమని అమ్మకి నాన సెప్పడం, నేను గింజుకుని ఓ తాపు తన్నడం అయిదు నిమిసాల్లో జరిగిపోయేయి. ఆళ్లకర్దమైంది అమ్మ ఒకర్తే నన్నదుపు సెయ్యడం కుదర్దని. అప్పుడుకే నాన సేతిలో ఇండీషను లోడు జేసేసుంది. ఎంట్నే అమ్మ ఇరుగు పొరుగుల్ని పిలుసుకొచ్చింది. ఆళ్లూ గబాల్నొచ్చేరు. ఆళ్ల సాయంతో అతి కట్టమ్మీద నాన నాకు ఇండీషను పొడిసేసేడు. ఒకటా, రెండా ఏకంగా మూడ్రోజులిదే పని. రెండు పిర్రలూ ఓసిపోయేయి. కూచ్చుంటే నెప్పి, నుంచుంటే నెప్పి. నా పని ఏడుపే కూడన్నట్టుంది. ఏడిసి ఏడిసి నా మొకం బాండ్రుకప్పలా ఉబ్బిపోయింది. అమ్మ బతిమాలి, బామాలి, నానా ఇద్దెలుబడి సారన్నం, మజ్జిగన్నం తినిపించీది. నాలుగో రోజుకల్లా జొరం పటాపంచలై నేను మామోలు మనిసినయ్యేను. ఇంట్లో వోళ్లందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ నాకు నానమీద కోపం కుతకుతలాడిపోయింది. నా సొద నాది, నా ఇండీసన్‌ టయానికి యమకింకరుల్లా దాపురించినోళ్ల మొకాలు సూసిన పెతీసారీ కసి పెరిగిపోతుంది.
      ఎండాకాలం సెలవులు దగ్గిరికొచ్చేసేయి. పరిచ్చలు రాయాల. జొరం తగ్గేక మల్లీ నేను బడికెల్డం మొదలెట్టేను. రోజూ పుత్తకాల సంచి భుజానికి దగిలించుకుని మా ఊరి ఎలిమెంట్రీ స్కూలుకెల్లొచ్చీవోణ్ని. దార్లో నాకు పోట్టాఫీసు, పోట్టు డబ్బా కనపడేవి. నాన అప్పుడప్పుడూ ఉత్తరాలు రాసి పోస్టు డబ్బాలో ఎయ్యడానికి నా సాయం తీసుకునీవోడు. టూ ఎడ్రస్, ఫ్రమ్‌ ఎడ్రస్, ఇన్లాండ్‌ లెటర్, పోట్టుకార్డు, ఎన్విలప్, పార్శిల్, వీపీపీ లాంటి తేడాలన్నీ అప్పుడు నాకేం తెలీవు. అసలు టాంపులు అంటించాలని గూడా తెల్దు. ఎవళమీదైతే నాకు పీకల్దాకా ఉందో ఆళ్ల పేర్లన్నీ రాసి పోట్టుడబ్బాలో ఏసేసేనంతే. రెండ్రోజులైంది. రిజల్టు కోసం ఎదురు జూత్తున్నాను.
      మూడోరోజు సాయంత్రం నాన బడ్నించి వొచ్చీరాగానే అమ్మతో ఏదో సెప్తున్నాడు. వొచ్చీవారం డీఈవో ఇనస్పెక్షనుందట. ఆయన మొకంలో నాకింకేదో ఆందోలన గనపడ్డాది. ఎక్కడికెల్లొచ్చినా బయట జరిగిన సంగతులన్నీ అమ్మతో పూసగుచ్చినట్టు సెప్పడం నానకు అలవాటు. పిల్లల్తో పంచుకోవాల్సినవైతే అందరిముందూ సెప్పీవోడు. పెద్దోళ్ల ఇసయాలైతే ఆళ్లిద్దరూ పడగ్గదిలో తలుపేసుకుని మాట్లాడుకునేవోళ్లు. అమ్మతో నానేదో సెప్తుంటే నాకినాలనిపించింది. తలుపు దగ్గర సెవానించేను. అమ్మతో నాన గుసగుసలు.. గుసగుసలంటే గుర్తొచ్చింది. నానకి నెమ్మదిగా మాట్టాడ్డం తెల్దు. అదీ బయటోళ్లకినబడిపోద్ది. 
      ‘‘సూడోయ్‌ నీ సిన్న కొడుకేంజేసేడో!’’
      ‘‘ఏంజేసేడూ?’’ అమ్మ రెట్టించింది. 
      ‘‘నా మీద పిటీషనెట్టేడు’’ 
      ‘‘ఎవళికి?’’ అమ్మ గొంతులో కంగారు కొట్టొచ్చినట్టినబడ్డాది. 
      ‘‘ఎవళకని జాయిగా అడుగుతావేటి? గవర్మెంటోళ్లకి?’’ నాన సొరం ఎచ్చింది. 
      ‘‘ఊరుకోండి. సిన్నపిల్లోడికీ పిరేదీలు ఏందెలుత్తాయి?’’
      ‘‘నిజమేనోయ్‌.. కావాలంటే సూడు..!?’’ నాన జేబులోంచి ఉత్తరం తీసి సూపించేడు. 
      అమ్మ సూసి, ‘‘ఔను ఇది మన సిన్నోడి రాతే’’ నిర్దారించేసింది. పెన్సిలుతో రాసిన ఆ ఉత్తరాన్ని సదివింది. 
      గైరంపేట డేవిడ్రాజు మేస్టారికి పనిష్మెంటిమ్మని ఆ ఉత్తరం. వొద్దద్దని ఎంత మొత్తుకుంటున్నా.. పాపం సిన్నపిల్లోడని గూడా జూడకుండా, జాలీ కనికరం లేకుండా రత్తాలొచ్చీలాగ సూదుల్తో గుచ్చేసిమరీ ఇండీషన్లు పొడిసేసినట్టుందా పిరేది. అందుకు సాకరించిన బూలేకమ్మ, కొండబాబు, పోలీసు ఇంకెవళెవళ పేర్లో రాసేను. కావాలనే అమ్మ పేరు మాత్రం సెమించొదిలేసేను. ఆ ఉత్తరానికి టూ ఎడ్రస్‌ మాత్రం దేవుడికీ, గవర్నమెంటుకీ కలిపి రాసినట్టుంది. ఓను ఆళ్లిద్దరికే గదా నాన బయపడేది? నా గడుసుదనం జూడండి! ఫ్రమ్‌ ఎడ్రస్‌లో నా పేరు, కళాసు అన్నీ ఉన్నాయ్‌. పోస్టాపీసోల్లందరూ నానకు బాగా నిలవైనోళ్లుగాబట్టి పోట్టుమేస్ట్రు ఉత్తరం నానకిచ్చాడు.
      ‘‘అమ్మో అమ్మో.. ఏలెడంత లేడు ఈ సిన్నిగాడు జూడు నాకు సెన్లాగ దాపురించి నా మీదే పిరేదీ.. పొద్దున్న లెగనీ ఈడి పన్జెప్తాను’’ మా నాన అగ్గిమీద గుగ్గిలమైపోతున్నాడు. నాకు గుండెల్లో దడట్టుకుంది. తుర్రున మంచమ్మీదికెల్లి ముసుగేసేను. తెల్లారగట్లే అమ్మ కేరేజీ సర్దేసి నాన్ని బడికి పంపించేసింది. తరవాత అక్కకీ, సెల్లెళ్లకీ తల్దువ్వి జడలేసింది. మాకందరికీ సల్దన్నాలొడ్డించి ఊరగాయనంజుకిచ్చింది. ఇంతలో ఇరుగింటోళ్లెవళో వొచ్చేరు. అమ్మ కడుపుబ్బరం ఆగలేదు. మాటల సందర్భంలో ఆల్లతో నా ఊసు జెప్పి నవ్వుకుంది. ఆ నోరూరుకుంటాదా? ‘‘సూసేవా చిన్నోడెలాటి పన్జేసేడో?’’ అంతే ఆ సంగతి టాంటాం అయిపోయింది. 
      మర్నాడు ఊరునోటా గోలైపోయేన్నీను. ఆల్లు ఈల్లని లేదు ఇసయం తెలిసినోళ్లందరూ పకపకా నవ్వుకుంటున్నారు. ఒకళొకళూ నాన్ని పలకరించనీకొత్తుంటే ఆయన మొకమెత్తుకోలాపోత్నాడు. నాకు నూటొకటి కొట్టుకుంటోంది. అక్క, అన్నయ్య నావొంకదోలా సూత్నారు. ఊళ్లో జనం ఇంకా సిత్తరంగా ఇడ్డూరంగా సూత్నారు. నీలాటి రేవుకాడ ఆడోల్ల ఊసులూ నా గురించేనంట. మేట్టోరి సిన్నోడు పేరెల్లిపోయేడు. నానకి మొకం  సాటేసేను. బడికెల్లిరాడం, ఇంటికొచ్చి ఏదో మూల్న దాకోడం ఇదేపని. వారం గడిసింది. ఆ రోజు సెకండ్‌ సాటర్‌డే నానకీ, నాకూ సెలవే. అడ్డంగా దొరికేసేను. కర్రపెళ్లి తప్పదనుకున్నాన్నేను. రాత్తిరి అమ్మ ఏం సర్దిజెప్పిందో, ఎలా సర్ది సెప్పిందో ఆ దేవుడికే దెల్సు? ఇచిత్రం.. ఏం జరిగిందో? ఏమో నాకుదెల్దు. దేవుడులాగ నా తప్పు సెమించేసినట్టున్నాడు నాన. మనసులో అయ్యేం బెట్టుకోకుండా మామూలుగా సైకిలెక్కించుకుని నన్ను సికారు తిప్పడానికి తీస్కెల్లి అడిగిన పప్పలు కొనిపెట్టేడు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam