దుర్గంధం

  • 379 Views
  • 12Likes
  • Like
  • Article Share

    డి.మహబూబ్‌ బాషా

  • ఆదోని, కర్నూలు.
  • 9440239828
డి.మహబూబ్‌ బాషా

అయిదు దశాబ్దాలపాటు సొంతూరి పొలిమేరలు కూడా దాటని వ్యక్తి... 
హఠాత్తుగా ఎక్కడికో పయనమయ్యాడు! కల్లాకపటం తెలియని ఆ మనిషికి 
ఆ ప్రయాణంలో ఎదురైన అనుభవాలేంటి? ఆ క్రమంలో అతనికి 
అర్థమైన లోకరీతి ఏంటి? దానికి అతని గుండె ఎలా స్పందించింది?
హనుమంతు
పట్నానికి బయల్దేరాడు. ఇదో గొప్పవింత! ఎందుకంటే పుట్టి బుద్ధెరిగిన ఈ యాభై ఏళ్లలో పట్నం ముఖం చూసి ఎరగడతను. ఆ మాటకొస్తే సొంతూరి పొలిమేరలు కూడా దాటలేదు. 
      హనుమంతు పుట్టింది ఓ మారుమూల కుగ్రామంలో. చిన్నాపురం అనే ఆ పల్లె ప్రభుత్వ పటాల్లో సైతం కనపడనంత చిన్నది. అయినా అక్కడ మనుషులు జీవిస్తున్నారు- కేవలం ఓటర్లుగా! అలాంటి ఊళ్లో ఓ పేదరైతు కుటుంబంలో హనుమంతు జన్మించాడు.
      చంటిపిల్లాడిగా ఉన్న హనుమంతును తీసుకుని ఓరోజు అతని తల్లిదండ్రులు పట్నానికి బయల్దేరారు. వాళ్లు చిన్నాపురం దాటారో లేదో హఠాత్తుగా జ్వరంతో హనుమంతు ఒళ్లు వేడెక్కింది. తల్లిదండ్రులు కలవరపడి వెనక్కొచ్చేశారు. అయితే ఊళ్లో అడుగుపెట్టగానే అతని జ్వరం తగ్గిపోయింది. దాంతో ధైర్యం చేసి మళ్లీ బయల్దేరారు. మార్గమధ్యంలో మళ్లీ జ్వరమొచ్చింది. కంగారుపడి మళ్లీ తిరిగొచ్చారు. ఊళ్లోకి రాగానే యథామామూలు.. జ్వరం పోయింది. వాళ్లకిదంతా విచిత్రంగా తోచింది. ఎందుకైనా మంచిదని ఆ రోజుకు పట్నం వెళ్లే ఆలోచన విరమించుకున్నారు.
      ఆ రోజే కాదు, మరో రెండు మూడుసార్లు ఇలాగే జరిగింది. హనుమంతు తండ్రికి ఏదో అనుమానం వచ్చింది. ఊళ్లో జ్యోతిషం చెప్పే రాఘవాచారిని కలిశాడు. ఆయన హనుమంతు జాతకాన్ని కూలంకషంగా పరిశీలించి అతనికి ‘పట్నగండం’ ఉందని తేల్చాడు. యాభై ఏళ్లు నిండేవరకు అతను పట్నంలో అడుగుపెట్టకూడదనీ, కాదని వెళ్తే మరణం తథ్యమని హెచ్చరించాడు.
      దాంతో ఇప్పటివరకు హనుమంతు పట్నానికి వెళ్లలేదు. నిన్ననే శ్రావణ మాసం ముగియటంతో అతనికి యాభై ఏళ్లు నిండాయి. ఇన్నాళ్లు మనసులోనే అణచుకున్న కోరిక ఇప్పుడు హఠాత్తుగా పడగ విప్పింది. పట్నం చూడాలని గుండె కొట్టుకులాడింది. అతని కొడుకు వీరేశ్‌ అక్కడి పురపాలక కార్యాలయంలో బంట్రోతు. ‘‘రెండ్రోజుల తర్వాత నేనే వచ్చి నిన్ను పట్నానికి తీసుకుపోతాను’’ అని తండ్రికి కబురంపాడు. అయినా హనుమంతు ఆగలేకపోయాడు. యాభై నిండిన మర్నాడే ప్రయాణం కట్టాడు. 
      చిన్నాపురానికి మూడు పక్కలా కొండలు, నాలుగో పక్క ఓ వాగు కావలి కాస్తుంటాయి. పట్నం వెళ్లాలంటే ఆ వాగు దాటాల్సిందే. తన జీవితంలో హనుమంతు ఒక్కసారి కూడా ఆ వాగు దాటలేదు. యాభై ఏళ్లలో ప్రపంచం ఎంతో మారింది. కానీ హనుమంతు మాత్రం మారలేదు. అతని ఊరూ మారలేదు. అక్కడి జనం పేదరికంలోనూ మార్పు రాలేదు. ఈనాటికీ చిన్నాపురానికి విద్యుత్తు లేదు. రక్షిత నీరు లేదు. రహదారి, బస్సు సౌకర్యాలైతే కల్లో మాటలు. పట్నం వెళ్లాలంటే వాగు దాటి, మూడుమైళ్ల దూరంలోని పెద్దాపురం వరకు నడిచి, బస్సెక్కాలి. ఆ వాగు దాటడానికి కూడా ఎప్పుడో తెల్లవాళ్లు కట్టిన వంతెనే ఆధారం. అదీ శిథిలమైపోయింది. కొన్నాళ్ల కిందట మనవాళ్లు కట్టించిన కొత్త వంతెన ‘అవినీతి’ వరదలో కొట్టుకుపోయింది. రానూపోనూ ఈ తిప్పలు పడలేక, పెళ్లయి పట్నంలో కాపురం పెట్టాక హనుమంతు కొడుకు ఊరి ముఖం చూడలేదు. ఈలోగా అతనికి అక్కడే ఉద్యోగం దొరకడంతో ఇక ఇటు రావాల్సిన అవసరమూ రాలేదు. తండ్రి మొదటిసారి తన దగ్గరికి వస్తున్నాడన్న ఆనందంతో తనే వచ్చి తీసుకుపోతానని కబురుపెట్టాడు కానీ హనుమంతు ఆగితేగా!
      హనుమంతు పుట్టినరోజే వాళ్లింటి ముందు ఓ తుమ్మచెట్టు మొలిచింది. అదీ హనుమంతుతోపాటే పెరిగి పెద్దదైంది. దాన్ని చూసినప్పుడల్లా, తనను దాంతో పోల్చుకునేవాడు హనుమంతు. ఆ చెట్టు పెరిగి పెద్దదయింది. తనూ చెట్టంత అయ్యాడు. అదెప్పుడూ జబ్బు పడలేదు. తనూ జబ్బు పడలేదు. అది పట్నం వెళ్లలేదు. తనూ వెళ్లలేదు. ఇలా అనుకుని తృప్తి పడేవాడు.
      ఎదుగూ బొదుగూ లేని జీవితం అతనిది. రోజూ కోడి కూయకముందే లేవటం, అందర్నీ నిద్రలేపి ఒంటరిగా చెరువుకెళ్లి స్నానం చేయడం, చెరువుగట్టున ఉండే దేవుడికి మొక్కటం, తర్వాత ఇంటికొచ్చి ఇల్లాలు వండింది కిమ్మనకుండా తినడం, పగలంతా గానుగెద్దులా పొలంలో పనిచేయడం, మళ్లీ రాత్రి తిన్న తర్వాత ఆరుబయట ఆదమరచి నిద్రపోవడం- ఇదీ అతని దినచర్య.
      జనం దృష్టిలో అతనో భోళాశంకరుడు. కల్లాకపటం ఎరగనివాడు. అబద్ధం ఎలా చెప్పాలో తెలియదు. మోసం, దగా, కుట్ర, అవినీతి వంటి పదాలకు అర్థాలూ తెలియవు. తల్లిదండ్రులు చెప్పిందే వేదం. వాళ్లు ‘‘వద్దు’’ అన్నందుకు ఇంతవరకు పట్నం పోలేదు. వాళ్ల కోరిక మేరకు ఆ ఊరి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలానికి అతనికో కొడుకు వీరేశ్‌ పుట్టాడు. తనలా వాడికి ‘పట్నగండం’ లేకపోవడంతో పట్నం చదువు చెప్పించాడు. అది వీరేశ్‌ బుర్రకెక్కలేదు. దాంతో అతణ్ని వెనక్కి పిలిపించి పెళ్లి చేశాడు. పొలం చూసుకోమన్నాడు. ‘‘నావల్ల కాదు. పట్నంపోయి ఏదైనా పని చేసుకుంటా’’ అని పెళ్లాన్ని వెంటబెట్టుకుని వెళ్లిపోయాడు వీరేశ్‌. అలా వెళ్లినవాడు ఎలాగో తంటాలుపడి పురపాలక కార్యాలయంలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతనికో కొడుకు కూడా పుట్టాడు. ఇంత జరిగినా హనుమంతు మాత్రం పట్నంలో కాలు పెట్టలేదు. పట్నమనే కాదు ఏ ఊరూ పోలేదు. బయట ఎక్కడైనా పనిపడితే బంధుమిత్రుల సాయంతోనే చక్కబెట్టుకున్నాడు. ఇప్పుడు ‘పట్నగండం’ తీరిపోవడంతో అక్కడికి హుషారుగా బయల్దేరాడు.
      పెద్దాపురం వరకు అతనికి తోడుగా కొంతమంది మిత్రులు వచ్చి బస్సెక్కించి వెళ్లిపోయారు. అక్కణ్నుంచి హనుమంతుకి కష్టాలు మొదలయ్యాయి. బస్సు ప్రయాణం అలవాటు లేకపోవడంతో కుదుపులకు ఉక్కిరి బిక్కిరైపోయాడు. బ్రేకు వేసినప్పుడల్లా సీట్లోంచి జారి కింద పడిపోయేవాడు. పడినప్పుడల్లా తోటి ప్రయాణికులు ముఖం మీదే నవ్వేవాళ్లు. అలా ఒళ్లు హూనం చేసుకుని పట్నం చేరాడు. 
      కానీ, పట్నాన్ని చూడగానే అంతా మర్చిపోయాడు హనుమంతు. ఎత్తయిన భవనాలు, రహదారుల మీద వేగంగా వెళ్తున్న రకరకాల వాహనాల్ని చూసి ఆశ్చర్యపోయాడు. అయితే బస్టాండుకి వస్తానన్న కొడుకు రాకపోవడంతో కలవరపడ్డాడు. బస్టాండు నుంచి బయటికొచ్చి, రోడ్డుపక్కన నిల్చుని కొడుకుకోసం ఆత్రుతగా ఎదురు చూడసాగాడు. అతని వాలకం చూసి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు అనుమానం వచ్చింది. ‘‘ఎవరు నువ్వు? ఎందుకలా దొంగచూపులు చూస్తున్నావు?’’ అని లాఠీ ఝళిపిస్తూ గద్దించాడు.
      ‘‘అయ్యా.. ఇప్పటివరకూ నేను పట్నం చూళ్లేదండీ. మొట్టమొదటిసారి ఇక్కడికొచ్చాను’’ అంటూ తన కథంతా చెప్పుకున్నాడు హనుమంతు. అతనో వెర్రివెంగళప్ప అని కానిస్టేబుల్‌కి అనిపించింది. ‘‘కొత్త మనిషి ఎవరైనా పట్నంలో కాలుపెడితే ప్రవేశరుసుం కట్టాలి తెలుసా? కట్టకపోతే ఇటునుంచి ఇటు జైలుకే’’ అని బెదిరించాడు. 
      ‘‘ఈ సంగతి నాకెవరూ చెప్పలేదండీ, తప్పయిపోయింది. క్షమించండి’’ అంటూ లబలబలాడాడు హనుమంతు.
      ‘‘క్షమించడం కుదరదు. వందరూపాయలు కట్టు. లేదా జైలుకెళ్లు’’ మరింత కటువుగా అన్నాడా కానిస్టేబుల్‌.
      ‘‘నా దగ్గర ఎనభై రూపాయలే ఉన్నాయండీ’’ 
      ‘‘సరే, ఉన్నంత ఇచ్చేయ్‌. మిగతా డబ్బు నేను కడతాలే.. నిన్ను చూస్తే జాలేస్తోంది’’ 
      హనుమంతు సంతోషంగా తన జేబులోని డబ్బు తీసిచ్చాడు. ‘‘తమరు చాలా మంచివారండీ. ముక్కూ ముఖం తెలియని మనిషికి సాయపడుతున్నారు.. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను’’ అంటూ అమాయకంగా చేతులు జోడించాడు. కానిస్టేబుల్‌ వెకిలిగా నవ్వాడు. అప్పుడే ఓ రకమైన దుర్గంధం హనుమంతు ముక్కుపుటాల్ని తాకింది. అప్రయత్నంగా ముక్కు మూసుకుంటూ ‘‘ఏదో దుర్వాసన వస్తోందండీ’’ అన్నాడా కానిస్టేబుల్‌తో.
      ‘‘ఎక్కణ్నుంచి?’’
      ‘‘తమరినుంచే! తమరివాళ స్నానం చేసినట్టు లేరు’’ 
      ‘‘అబ్బే... ఉదయం స్నానం చేశాకే డ్యూటీకొచ్చాను. సెంటు కూడా కొట్టుకున్నాను’’ తన చంకల్లో వాసన చూసుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడా కానిస్టేబుల్‌. అతను వెళ్లగానే దుర్గంధం తగ్గిపోయింది. హనుమంతు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
      వీరేశ్‌ ఎంతకూ రాకపోవడంతో, తనే అతని దగ్గరికి వెళ్లాలనుకున్నాడు హనుమంతు. కొడుకు పనిచేసే చోటు ఎక్కడుందో ఎవరినైనా అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. దారిన పోతున్న ఓ వ్యక్తిని ఆపి అడిగాడు. ‘‘నాకు టైం లేదు’’ అంటూ ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. మరో వ్యక్తి తనకు తెలియదన్నాడు. ఇంకో వ్యక్తి అస్సలు వినిపించుకోలేదు. 
      వాళ్ల ప్రవర్తన హనుమంతుకు అంతుపట్టలేదు. అందరూ అంత హడావుడిగా ఎక్కడికెళ్తున్నారో కూడా బోధ పడలేదు. పట్నంలో అందరూ ఇలాగే ఉంటారేమో అనుకున్నాడు. చివరికి తీరిగ్గా నిల్చున్న ఓ వ్యక్తి కనిపించాడు. అతని దగ్గరికి వెళ్లాడు హనుమంతు. ‘‘ఏవండీ... పురపాలక కార్యాలయం ఎక్కడుందో కాస్త చెబుతారా?’’ అని అడిగాడు.
      ఆ వ్యక్తి హనుమంతుని ఎగాదిగా చూశాడు. ‘‘మీరడిగేది మున్సిపల్‌ ఆఫీసు గురించేనా? తెలుగులో అడగొచ్చు కదా.. సంస్కృతంలో అడిగితే ఎవరికి అర్థమవుతుంది?’’ అని ఎదురు ప్రశ్నించాడు. 
      ‘‘ఇక్కడి భాష నాకు సరిగ్గా రాదండీ. దయచేసి ఆ చిరునామా చెబుతారా?’’ అన్నాడు హనుమంతు.
      ‘‘నడుచుకుంటూ వెళితే అరగంట పడుతుంది. ఆటో ఎక్కితే పది నిమిషాల్లో వెళ్లొచ్చు..’’ ఆ మనిషి మాటలు విని రోడ్డుమీద వెళ్తున్న ఓ ఆటో టక్కున ఆగింది. ఆ మనిషి చిరునామా చెప్పగానే, ఆటోడ్రైవరు హనుమంతుని ఎక్కమన్నాడు. హనుమంతు ఆటోవైపు ముచ్చటగా చూస్తూ ‘‘ప్రయాణం ఉచితమా?’’ అని అడిగాడు.
      ‘‘అంతలేదయ్యో! నలభై రూపాయలు’’ చిరాగ్గా అన్నాడా ఆటోడ్రైవర్‌.
      ‘‘ఓయబ్బో! రెండు గంటల బస్సు ప్రయాణానికి తీసుకున్నంత డబ్బులు పది నిమిషాల ప్రయాణానికే తీసుకుంటారా? ఇది అన్యాయం’’ అన్నాడు హనుమంతు. ఆటోడ్రైవర్‌ విసుక్కుంటూ వెళ్లిపోయాడు.
      ఇంతలో ఊతకర్ర పట్టుకొని వెళ్తున్న ఓ పెద్దాయన ఆగి, విషయమేంటని హనుమంతుని అడిగాడు. అతను చెప్పింది విని, ‘‘నేను అటే వెళ్తున్నాను. నాతో రండి’’ అన్నాడు. హనుమంతు ఆయన్ని అనుసరించాడు. ఓ అరగంట నడిచాక ఓ రకమైన వాసన హనుమంతు ముక్కుపుటాల్ని తాకింది. ‘‘అదే పురపాలక కార్యాలయం’’ ఓ భవనాన్ని చూపిస్తూ అన్నాడా పెద్దాయన. ‘‘ఇక్కడేదో వాసన వస్తోందే’’ గొణిగాడు హనుమంతు.
      ‘‘నాకేం రావడం లేదే’’ అంటూ ఆ పెద్దాయన తన దారిన తను వెళ్లిపోయాడు. హనుమంతు కార్యాలయం గేటు దాటి లోపలికెళ్లాక ఆ వాసన దుర్గంధంగా మారింది. అక్కడ అతనికి వీరేశ్‌ కనపడలేదు. మరో బంట్రోతు కనిపించాడు. ‘‘మీరు వీరేశ్‌ నాన్నగారా? అతను పని మీద బయటికెళ్లాడు. మీరొస్తే కూర్చోబెట్టమన్నాడు’’ అంటూ ఓ బెంచీ చూపించాడు.
      ‘‘నేను పట్నం రావడం ఇదే మొదటిసారి. బస్సు దగ్గరికి వస్తానన్నవాడు రాలేదు’’ 
      ‘‘నిజానికి మీరొస్తున్నారని వీరేశ్‌ ఈ రోజు సెలవు పెట్టాలనుకున్నాడు. కానీ అనుకోకుండా మంత్రిగారు పట్నానికి రావడంతో కమిషనర్‌ గారి వెంట వెళ్లాల్సి వచ్చింది. మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాడు’’ అన్నాడా బంట్రోతు. అంతలో ఎవరో అతని దగ్గరికొచ్చి రహస్యంగా ఏదో చేతిలో పెట్టారు. అతను దాన్ని జేబులో దాచుకున్నాడు. అప్పుడే అతణ్నుంచి ఓ రకమైన దుర్గంధం వెలువడింది.
      ‘‘ఇక్కడేదో దుర్వాసన వస్తోంది’’ ముక్కు మూసుకుంటూ అన్నాడు హనుమంతు.
      ‘‘దుర్వాసనా? అలాంటిదేం లేదే! బహుశా మీకు పట్నం వాతావరణం సరిపడక అలా అనిపిస్తుందేమో...’’ అంటూ అతను లోపలికెళ్లిపోయాడు. దుర్గంధం కాస్త తగ్గింది.
      అయితే అది తాత్కాలికమే. అప్పుడప్పుడూ ఆ చెడు వాసన వస్తూనే ఉంది. ముఖ్యంగా కొందరు ఉద్యోగస్థులు తన ముందు నుంచి వెళ్తున్నప్పుడే ఆ దుర్గంధం వస్తోందని గ్రహించాడు హనుమంతు. మనిషిని బట్టి దాని తీవ్రత మారుతోంది. కొంతమంది నుంచి కుళ్లిన పండ్ల వాసన వస్తోంటే, మరికొంత మందినుంచి మురుగు కాలువ వాసన వస్తోంది. ముక్కు మూసుకున్నా ఆ వాసన వదలట్లేదు. అయితే అక్కడున్న వాళ్లెవరినీ ఆ వాసన ఇబ్బంది పెట్టడం లేదు. బహుశా వాళ్లకు అలవాటైనట్టుంది. హనుమంతు మాత్రం దాన్ని భరించలేకపోతున్నాడు. ముళ్ల మీద కూర్చున్నట్టు బెంచీమీద అసహనంగా కదులుతున్నాడు.
      కాసేపటి తర్వాత ఆ బంట్రోతు మళ్లీ వచ్చాడు. ‘‘నేనీ దుర్వాసన భరించలేను. బయటికెళ్లిపోతాను’’ అన్నాడు హనుమంతు. 
      ‘‘మీ ఆరోగ్యం బాగున్నట్టు లేదు. ఓ పని చేయండి... ఇక్కడ చాయ్‌ తెచ్చిచ్చే పిల్లాడికి మీ అబ్బాయి ఇల్లు తెలుసు. అక్కడికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి. వీరేశ్‌ రాగానే చెబుతాను’’ అన్నాడా బంట్రోతు. అటుపక్క ఎక్కడో ఉన్న పిల్లాణ్ని వెతికి పట్టుకొచ్చాడు. హనుమంతుకి ప్రాణం లేచొచ్చింది. గబగబా బయటికొచ్చాడు. అక్కడ దుర్గంధం లేదు. హుషారుగా ఊపిరి పీల్చుకుంటూ, ఆ పిల్లాడి వెంట చిన్నపిల్లాడిలా ముందుకు కదిలాడు.
      ప్రధాన రహదారి మీద వాహనాలన్నీ ఎక్కడివక్కడే నిల్చిపోయాయి. ఓ పోలీసు జీపు సైరన్‌ మోగిస్తూ ముందుకెళ్తుంటే వెనక కాస్త దూరంలో వరసగా కొన్ని కార్లు వస్తూ కనిపించాయి. ‘‘మంత్రిగారు వెళ్తున్నారు’’ అన్నారెవరో. పిల్లాడితోపాటు హనుమంతు కూడా రోడ్డుపక్కనే నిల్చుండిపోయాడు. మంత్రిగారు కిటికీలోంచి జనంవైపు చూస్తూ చెయ్యి ఊపుతున్నారు. ఆయన కారు హనుమంతుని సమీపించగానే భయంకరమైన దుర్గంధం వెలువడింది. ఎముకలు కుళ్లిన దుర్వాసన అది. ఆ కంపు భరించలేక అప్రయత్నంగా ముక్కు మూసుకున్నాడు. అయినా దుర్గంధం వదల్లేదు. ఉదయం తిన్నదంతా బయటికి వచ్చేస్తుందనిపించింది. బలవంతంగా దానికి అడ్డుకట్ట కట్టాడు.
      కొద్దిక్షణాలకు ఆ దుర్గంధం దూరంగా వెళ్లిపోయింది. అంతవరకు ఊపిరి బిగపట్టిన హనుమంతు స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నాడు. జరిగినదంతా అతనికి విచిత్రంగా అనిపించింది. పట్నంలో అడుగుపెట్టినప్పటి నుంచి తనకిలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. తనకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఎవరికీ రాని దుర్గంధం తనకే ఎందుకొస్తోంది? ఒక్కక్షణం హనుమంతు గుండె దడదడలాడింది. తను రాకూడని చోటుకు వచ్చాడా? హనుమంతుకి ఇప్పుడు పట్నమంటేనే భయమేస్తోంది.
      ఆలోచిస్తూనే పిల్లాడి వెంట బయల్దేరాడు. దార్లో అక్కడక్కడా అతనికి ఆ వాసన వస్తూనే ఉంది. ముక్కుమూసుకుంటూ నడుస్తూ ఎలాగో వీరేశ్‌ ఇంటికి చేరాడు. తొలిసారి వచ్చిన మామగారిని కోడలు సాదరంగా ఆహ్వానించింది. మనవడితో కబుర్లు చెబుతూ భోజనం పూర్తిచేశాడు హనుమంతు. తర్వాత పట్నంలో అడుగు పెట్టినప్పటినుంచి తనకు ఎదురైన అనుభవాలన్నింటినీ కోడలికి చెప్పాడు. కానిస్టేబుల్‌కి డబ్బులివ్వడం గురించి చెప్పినప్పుడు ఆమె పకాపకా నవ్వింది. ‘‘మామయ్యా... అతనెవరోగానీ మిమ్మల్ని మోసంచేశాడు. అలాంటి రుసుములేవీ ఉండవు’’ అంది. హనుమంతుకి ఏమీ అర్థం కాలేదు. అతని ముక్కుపుటాలను ఇబ్బంది పెట్టిన దుర్గంధం సంగతి కోడలికి అర్థం కాలేదు. 
      కొడుకు ఇంట్లో ఖరీదైన వస్తువులు, కోడలి ఒంటిమీది నగలు హనుమంతుకు ఆశ్చర్యం కలిగించాయి. ‘‘ఇవన్నీ జీతం డబ్బులతోనే కొన్నారా?’’ అని అడిగాడు. ‘‘అది దేనికీ సరిపోదు మామయ్యా... ఆయనకు పై ఆదాయం బాగానే వస్తుంది. దాంతోనే ఇవన్నీ కొన్నారు’’ అందామె. పై ఆదాయమంటే ఏంటో హనుమంతుకి తెలియదు. అందుకే నేరుగా కోడల్ని అడిగేశాడు. ఆమె గుట్టు విప్పింది. హనుమంతు గుండె ఎందుకో నొప్పెట్టింది. 
      ఇంతలో వీరేశ్‌ వచ్చేశాడు. జీవితంలో తొలిసారి పట్నానికొచ్చిన తండ్రిని చూసి సంబరపడిపోయాడు. పట్నం అంతా తిప్పి చూపించడానికి రెండు రోజులు సెలవు పెట్టినట్టు చెప్పాడు. కానీ, హనుమంతు ఏవీ వినే పరిస్థితిలో లేడు. అతనిలో మళ్లీ అలజడి... అదే దుర్గంధం మళ్లీ అతనిమీద దాడిచేసింది! హనుమంతుకు విషయం అర్థమైంది. కానీ, ఈసారి అతను ఆ దుర్వాసనను తట్టుకోలేకపోయాడు. వాకిట్లోకి పరిగెత్తి భళ్లున వాంతి చేసుకున్నాడు. ‘‘నాన్నా... ఆరోగ్యం బాలేదా? ఆస్పత్రికి వెళ్దాం పద’’ అంటూ వీరేశ్‌ వెనకాలే వచ్చాడు. 
      ‘‘వద్దురా... ఇది వైద్యులకు అర్థమయ్యేది కాదు. ఈ యాభై ఏళ్లలో నేనసలు జబ్బు పడలేదు. ఇన్నేళ్లుగా నేను పట్నానికి దూరంగా ఉన్నాను. కల్లాకపటాలకు, అవినీతి అక్రమాలకూ దూరంగా ఉన్నాను. ఇప్పుడీ వాతావరణంలోకి రాగానే నా శరీరం మార్పును జీర్ణించుకోలేకపోయింది. అవినీతి అక్రమాలనేవి ఇక్కడ కొంతమంది రక్తంలోనే ప్రవహిస్తున్నాయి. నా ఒంటికి సరిపడని ఆ దుర్గుణాలే దుర్గంధం రూపంలో నన్ను వెంటాడుతున్నాయి. చివరికిప్పుడు నీ దగ్గరినుంచి కూడా! నేనుండలేనురా.. వెళ్లిపోతున్నా’’ అన్నాడు హనుమంతు.
      వీరేశ్‌ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. తను లంచగొండి అనే విషయం తండ్రికి ఈ రకంగా తెలుస్తుందని అతను కలలో కూడా ఊహించలేదు. అక్రమార్కుల ఉనికే దుర్గంధంగా మారి తండ్రిని హెచ్చరించడం, ఆయనకు దేవుడిచ్చిన వరమనుకున్నాడు. క్షమాపణ కోరాడు. అయినా అక్కడ ఉండటానికి హనుమంతు ఒప్పుకోలేదు. ‘‘ప్రపంచమంతా కంపుకొట్టినా భరించగలను. కానీ కన్నబిడ్డ నుంచి దుర్గంధం వస్తే మాత్రం ఈ తండ్రి భరించలేడురా. ముందు నీలోని కల్మశాన్ని వదిలించుకో. అప్పటివరకూ మళ్లీ నేనిక్కడ అడుగుపెట్టను’’ అంటూ భుజం మీద కండువా వేసుకుని బయటికి నడిచాడు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam