స్మృతిరేఖలు (కథాపారిజాతం)

  • 437 Views
  • 1Likes
  • Like
  • Article Share

    భాస్కరభట్ల వెంకటేశ్వర్లు

భాస్కరభట్ల వెంకటేశ్వర్లు

జీవితంలో కొన్ని సంఘటనలు మన హృదయాన్ని కదిలిస్తాయి. ఆ కదలికలు ఒక స్థాయి దాటితే, మన మెదడులో జ్ఞాపకాలుగా మారుతాయి. కాలం, కొన్ని జ్ఞాపకాల్ని చెరిపివేస్తుంది. మరికొన్నిటిని శాశ్వతంగా మెదడులో నిలుపుతుంది. కానీ ఏ సంఘటనలు జ్ఞాపకాలుగా మారుతాయో, ఏవి కాలం వడపోతకి తట్టుకొని, మెదడులోనే శాశ్వతంగా నిలిచిపోతాయో చెప్పడం మాత్రం చాలా కష్టం.
      ప్రస్తుతం నేను మీకు చెప్పదలచిన సంఘటన దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం జరిగింది. ఈ సంఘటనలో ఏదో విశిష్టత ఉందనికాదు నేను మీకు చెప్పడం. ఇటువంటి సంఘటనలు ఎందరి జీవితాల్లోనో జరగడానికి అవకాశం ఉంది. కానీ ఈ సంఘటనలు వాళ్లకి జ్ఞాపకం ఉన్నాయో లేవో మాత్రం నాకు తెలియదు. ఈ సంఘటన మాత్రం, తు.చ.తప్పకుండా, అన్ని వివరాలతో నాకు పూర్తిగా జ్ఞాపకం ఉంది. అదీ దాని విశిష్టతా, ప్రత్యేకతా. ఈ సంఘటన, చెరగని జ్ఞాపకంగా నా మెదడులో నిలిచిపోవడానికి గల కారణాలేమిటో, మీతోకలసి పైకి ఆలోచించడం ఈ కథనంలో నా ముఖ్యోద్దేశం.

ఇది ఇరవై సంవత్సరాల క్రిందటి మాట. అప్పటికి నాకు ఇరవై రెండు సంవత్సరాలు. వివాహమై అప్పటికి మూడు సంవత్సరాలైంది. ఏడాది వయస్సు దాటిన కూతురు. పేరు కల్యాణి. అప్పట్లో చదువు కూడా పూర్తి అయింది. సెక్రటేరియట్‌లో ఉద్యోగం చేస్తున్నాను.
      యవ్వనపు పొంగు అప్పటికి ఇంకా సడల లేదు. గార్హస్థ్య జీవితానికి అప్పటికప్పుడే అలవాటుపడుతున్నాను. ఉద్యోగధర్మం వల్ల నగరంలో హాయిగా భార్య, కూతురుతో కాపురం చేస్తున్నాను.
      ఇంతలోకి ఒకనాడు మాకు ఒక పెళ్ళి పిలుపు వచ్చింది.
      నా మరదలి పెళ్ళి - మా మామగారు స్వయంగా వచ్చి పిలిచారు. తండ్రిని చూడడంతోనే, నా భార్య పెళ్ళికి వెళ్ళడానికి ఉబలాటపడింది. పెళ్ళికి ఇంకా పది రోజులు ఉన్నాయి. వెంటనే కూతురిని పంపించవలసిందని మా మామగారు కోరారు. తొందరగా పంపించడం నాకు ఇష్టం లేదు. పెళ్ళికి తీసుకువస్తానని చెప్పాను. నా భార్య ఉబలాటం, మా మామగారి తొందరపాటు ఈ రెండు కారణాలవల్ల నా మాట సాగలేదు, నిష్ఠూరం దేనికని, నా భార్యని మా మామగారితో పది రోజులు ముందుగానే పెళ్ళికి పంపించివేశాను.
      ఒంటరి జీవితం నాకు ఎన్నడూ అలవాటు లేదు. ప్రసవానికి వెళ్లిన నాలుగు మాసాలు తప్ప, నేను ఎన్నడూ నా భార్యని వదిలి ఉండలేదు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో కూడా హాస్టల్‌లో ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. ఎవడో ఒకడు రూమ్‌మేట్‌ ఉంటూ ఉండేవాడు. అందువల్ల నా భార్య పుట్టింటికి వెళ్లిన పదిరోజులూ, నాకు నగరంలో ఎంతో దుర్భరంగా గడిచాయి. పోనీ ముందుగానే శలవు తీసుకొని పెళ్ళికి వెళదామంటే బింకంకొద్దీ శలవు దొరకదని మా మామగారితో బొంకాను. తీరా శలవు తీసుకొని వెడితే వారేమనుకుంటారో అని నా భయం. వారి కళ్ళల్లో చులకన కావడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. అల్లుడు ప్రయోజకుడనే భావం వారికి కలిగించడానికి అప్పట్లో శలవు దొరకదని ఖచ్చితంగా చెప్పాను. యథోచితంగా నా భార్య ముందూ, నా మామగారి ముందూ బింకం నటించాను. రెండింటికీ చెడ్డ రేవడి కథ అయింది నాది. అటు పెళ్ళికి వెళ్ళలేను. ఇటు ఒంటరిగా ఉండలేను. సత్రం భోజనం, మఠం నిద్ర అన్నట్లు హోటల్‌లో భోజనం చేస్తూ, సాయంత్రాలు సినిమా హాలులో గడుపుతూ కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చాను.
పిక్చర్‌ చూసినా ఏముంటుంది? ఏదో ప్రణయగాథ, ఏవో ఎడబాట్లు, వేడి నిట్టూర్పులు- కన్నీటి ధారలు, విరహ వేదనలు- నిజం చెప్పొద్దూ, ఇవి అన్నీ నాకు పరమ శత్రువులైనాయి. ఏమీ తోచదు. ఆఫీసులో పనిచేయడానికి మనస్సు ఒప్పదు. రాత్రిళ్ళు నిద్రపట్టదు. ఏవో ఆలోచనలు- ఏవో పిచ్చి పిచ్చి కలలు- రాత్రిళ్ళు లేచి, నక్షత్రాలు లెఖ్కపెట్టలేదుగాని, నిద్రపట్టక ఒకటేపనిగా పక్కమీదపడి దొర్లాను. 
      క్షణం ఒక యుగంగా తొమ్మిది రోజులు గడిచాయి. ఆ తొమ్మిది రోజులూ నేను అనుభవించిన విరహవేదన, ఏ ప్రబంధంలో, ఏ నాయకుడూ అనుభవించలేదని నా నమ్మకం.
      పదవ రోజు రాత్రి పది గంటలకు పెళ్ళి. తొమ్మిదవరోజునే ఆఫీసుకు రెండు రోజులు శలవు పెట్టాను. పెళ్ళినాడు ఉదయమే ప్రయాణమై, ఆ మరుసటి రోజునే నగరానికి తిరిగి రావాలని నా సంకల్పం.
      పెళ్ళినాడు ఉదయమే లేచి, స్నానం చేసి, బట్టలు మార్చుకున్నాను. ఉలన్‌ప్యాంటు, సిల్కుషర్టుతో హోటల్‌కి బయల్దేరాను. కాఫీ దేవాలయానికి వెళ్ళి, కాఫీ, ఉప్మా సేవించాను. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏడున్నర అయింది. ఎనిమిది గంటలకు నల్లగొండకి బస్సు. సూటుకేసులో రెండు ప్యాంట్లూ, రెండు షర్టులూ, రెండు ధోవతులు, బనియన్‌లు, టవల్‌లు, ఇంకా కావాల్సిన వస్తు సామాగ్రి అంతా అమర్చుకొని బస్టాండుకి వెళ్ళాను. బస్సు బయల్దేరడానికి ఇంకా అయిదు నిమిషాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ప్రయాణానికై కావల్సిన సిగరెట్లు కొనుక్కొని బస్సు ఎక్కాను.
      బస్సు కదిలింది. ప్రాణం కుదుటపడింది. నల్లగొండకి చేరుకునేసరికే రెండు గంటలు దాటింది. దారిలో ఏ పల్లెటూరి దృశ్యాలు చూచానో, ఏవి చూడలేదో ఇప్పుడు చెప్పడం అసాధ్యం. బస్సు ప్రయాణం అనుభవించాల్సిందేకాని చెప్పనలవి కాదు. దారిలో శరీరం బస్సు కుదుపులకి హూనమైంది. శరీరం నిండా మట్టి కొట్టుకుంది. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు దుమ్ము దుమ్ము అయినాయి. దుమ్ము తుడిచి తుడిచి జేబురుమాలు ఎర్రమట్టితో నిండింది.
      నల్లగొండకి నా మనస్సే ముందుగా వెళ్ళిందో, లేక నా అవస్థే ముందుగా వెళ్ళిందో, ఏనాటి సంగతో, ఇప్పుడు గట్టిగా తేల్చి చెప్పడం కష్టం.
బస్సులో నార్కటుపల్లి దగ్గర ఒక పల్లెటూరి జంట ఎక్కింది. వాళ్ళ క్రీగంటి చూపులు, నవ్వుల గలగలలు, ప్రేమకి సంబంధించిన సయ్యాటలు నా మనస్సుని కలచివేశాయి. సభ్యత మొహం ఎరుగని సయ్యాటలవి. ఎంతో హాయిగా, స్వేచ్ఛగా కనపడ్డాయి. ఏ ప్రతిబంధకాలూ ఎరుగని ప్రణయమది. ఎందుకో అది నా సభ్యతని సిగ్గిలజేసింది.
      పెళ్ళిల్లు మామిడి తోరణాలతో, అరటి స్తంభాలతో, ఇంకా ఇతరమైన ఏవో అలంకారాలతో కళకళలాడుతున్నది. ఆకలితో ఉండడంవల్ల ఆ అలంకారాలు ఏమీ నేను చూడలేకపోయాను. వెళ్ళడంతోనే నన్ను ఎందరో పలుకరించారు. కాని నాకు కావాల్సిన మనుషులెవ్వరూ కనపడలేదు. మామగారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, దిక్కులు చూస్తూ పెళ్ళిపందిరి పక్కన పడివున్న ఒక కుర్చీలో కూర్చున్నాను. 
      రెండు నిమిషాల తరువాత ‘బాగున్నావా, బావా?’ అని ఒక అమ్మాయి వచ్చి నన్ను పలకరించింది. ఆ అమ్మాయి ఎవరో నేను వెంటనే గుర్తుపట్టలేదు. మా కళ్యాణి ఆ అమ్మాయి చంకలో ఉంది. నన్ను చూడడంతోనే, కేరింతలు కొడుతూ నాకు చేతులు అందించింది. నేను కళ్యాణిని ఎత్తుకున్నాను. ముంగురులు నొసటిమీదినించి వెనక్కి నెట్టుతూ ఆప్యాయంగా మా పాపని ముద్దు పెట్టుకున్నాను. 
      ‘ఇంకా నన్ను గుర్తుపట్టలేదా బావా?’ అని అడిగింది ఆ అమ్మాయి, నా కళ్ళల్లోకి చూస్తూ-
      ఎవరో ఆ అమ్మాయి- నేను గుర్తుపట్టలేకపోయాను. ‘నేను ఇందిరని బావా!’ అంది ఆ అమ్మాయి. నా బిత్తర చూపుల్లోని అంతరార్థాన్ని గ్రహిస్తూ, ‘ఏ ఇందిర? నా పెళ్ళికి ముందు నాకు ఇస్తామన్న ఇందిర కాదు కదా?’ అని మనస్సు ఒక నిమిషంపాటు తటపటాయించింది. 
      సందేహం లేదు. నేను నాలుగు సంవత్సరాల క్రితం పెళ్ళిచూపులకై భువనగిరి వెళ్లి చూచిన ఇందిరే.
      బొట్టు కనపడదేం? చెరిగిపోయిందా? లేక విధవ అయిందా? ఏమో? ఈమాటు ఆ అమ్మాయిని పరిక్షించి చూచాను. సందేహం లేదు. మాంగల్యాన్ని కోల్పోయింది... ఇందిరే..
      పుట్టెడు ప్రశ్నల్ని మనస్సులో అణచుకొని, ‘ఇందిరా’ అని మాత్రం అనగలిగాను.
      ‘ఇక్కడ కూర్చున్నావేమిటి బావా?’ అని అడిగింది ఇందిర.
      ‘ఏమి చెయ్యను? ఎవ్వరూ కనపడలేదు’ అని అన్నాను ఏమీ తోచక.
      ‘అందరూ భోజనాలు చేస్తున్నారు... పాప అల్లరి చేస్తుంటే, భోజనాల దగ్గరినుంచి ఇటు ఎత్తుకొని వచ్చానని’ అంది ఇందిర.
      ‘మీ అక్కయ్య ఏదీ?’ అని అడిగాను, ఇందిరని.
      ‘ఇప్పుడే పిలుచుకువస్తా’నని చటుక్కున లోపలికి వెళ్ళింది ఇందిర.
      భోజనం చేస్తున్నదల్లా, నా భార్య చేతులు కడుక్కొని పందిట్లోకి వచ్చింది. ఇందిర కూడా నా భార్యతో కలిసి వెలుపలికి వచ్చేసింది.
      ఆ పక్కయింట్లోనే మాకు విడిది ఇచ్చారు. ముగ్గురమూ, మా పాపతోకలిసి ఆ పక్కయింటికి వెళ్ళాము. 
      వెళ్ళీ వెళ్ళడంతోనే నాకు ఆకలేస్తుందని అన్నాను నా భార్యతో...
      ‘మీరు బట్టలు విడవండి- నేను ఇంతలోనే కాఫీ కాస్తాను’ అని నా భార్య ఆ గదిలోంచి ఎక్కడికో వెళ్ళింది. నా దగ్గరవున్న పాప, రెండు చేతులు జాచి ఇందిరమీదకు ఉరికింది. ఆమె సుందరహాసంతో అందుకొంది.
      సిల్కుషర్టు విడిచి, ధోతి కట్టుకోవడానికి సంసిద్ధపడుతున్నాను. ఇంతలోనే నా భార్య వచ్చి, ‘ఇందిరా నీవు వెళ్ళి బావకి కాస్త స్నానానికి నీళ్ళు తోడు’ అని చెప్పింది దర్జాగా...
      పాపని, నా భార్య చేతికందించి, ఇందిర నీళ్ళు తోడడానికి అక్కడినించి కిందికి వెళ్ళిపోయింది.
      ‘దీన్ని మీరు తీసుకోండి.. ఇప్పుడే మీకు కాఫీ తెచ్చిపెడతా’నంది నా భార్య.
      అది ఏడుస్తూ ఇందిర వెళ్ళినవైపే చూస్తోంది. పాపను నేనెత్తుకొని దానితో ఏవో కబుర్లు చెబుతున్నాను.
      ఇంతలోకి కాఫీ వచ్చింది. నేనూ పాపా కలిసి కాఫీ తాగాము. ‘బావా, నీళ్ళు తోడాను, కిందికి రండి’ అని ఇందిర కిందినించి అరిచింది.
      నేను పాపని ఎత్తుకొనే కిందికి వెళ్ళాను. స్నానాలగదిలో ధోతి, టవల్, బనియన్, సబ్బూ అన్నీ అమర్చి ఉన్నాయి. వేడినీళ్ళు చూసేసరికి పాపకి ప్రాణాలు లేచివచ్చాయి. మూగభాషలో అదీ స్నానం చేస్తానని మంకుపట్టు పట్టింది.
      ‘ఇలా ఇస్తావా పాపని స్నానం చేయిస్తాను’ అన్నాను. ఆమె అందివ్వబోయింది. కాని పాప ఆవిడ మెడ గట్టిగా పట్టుకొని రానన్నట్లు తల ఊపింది.
      సరే ఇందిరే పాపని పీటమీద కూర్చోబెట్టి నీళ్లు పోస్తోంది. నేనా దృశ్యం చూస్తూ అలాగే నిలబడి ఉన్నాను. ఎక్కడో, ఎప్పుడో, పెనవేసుకోదలచిన బాంధవ్య ముద్ర, పట్టుతప్పి, కొంతకాలం దూరంగా ప్రయాణించి తిరిగివచ్చి ఈ అంటు మొక్కకు అల్లుకు పోతోందేమిటా అన్న భావం కలిగింది నాలో...
      ఇందిరనానాడు పెళ్లాడితే నిత్యం ఇలాంటి దృశ్యమే చూచేవాణ్ణి. కాని ఈ పాప ఆ పాపగా ఉండేదికాదు. ఆ పాప వేరు. ఆ పాపపైన ఇందిరకుండే ప్రేమ, అనురాగం, సహజమైనవిగా ఉండేవి. ఈ పాపపై ప్రేమ ఏదో దైవదత్తంగా తోస్తోంది. ఆధ్యాత్మికపుటంచుల్లో తొంగి చూస్తోంది. పరిణయం గార్హస్థ్య జీవితానికి నాంది. సంతానం- ప్రథమ సంతానమే ఆ ప్రణయ జీవితానికి పరిసమాప్తి. ఇందిర పాపల ప్రేమలో నాలో ఆద్యంతాలు ముడివేస్తున్నట్లుగా తోచింది.
      ఇందిర మెల్లగా పాప ముఖం రుద్దుతూ ‘కళ్లు తెరవకు తల్లీ... కొంచెం సేపు అలాగే ఉండు... చందమామ వెలుతురు కనిపిస్తుంది. అంటూ ఏదో చెపుతోంది. అప్పుడు నావంక చూచి చేయి జాచింది. కాసిని నీళ్లు పోస్తారా అన్నట్లుగా, కాని వెంటనే ‘నీళ్లు’ అనే భావం కలుగలేదు. ఏవో ఆలోచనలు అంచుల్లో అడుగులు వేస్తూ నడుస్తూన్న నా మనస్సుకా హస్తం - ఏదో యాచిస్తున్నట్లు స్ఫురించింది. నా మౌనం గ్రహించి ‘కాసిని నీళ్లు పొయ్యండి’ అందామె. అప్పుడు తేరుకొని చేతిలో నీళ్లు పోశాను. పాపకు ముఖం కడిగిందామె. సబ్బుతో రుద్దడం వల్లకంటే, ఆ ప్రేమ హస్తాలతో నిమరడం వల్ల కాబోలు మా పాప చెక్కిళ్ళు ఇంగిలీకపు కాంతులు గ్రుమ్మరిస్తున్నాయి. కళ్లు కలువ పువ్వు చివుళ్లుగా మెరుస్తున్నాయి. 
      ‘పాపం, పాపకోసం చాలా శ్రమపడుతున్నావు అన్నాను, అనాలోచితంగా.
      ఆమె వంచిన తల ఎత్తకుండానే ‘లేని హక్కు సాధించుకోవడం శ్రమ కాదూ’ అంది.
      ఆ మాటకు నా మనస్సు చిందరవందరలైంది. ఆమె ఎంత నొచ్చుకుందోననుకున్నాను.
      ‘మరి నీ ఉద్దేశ్యం?’ అన్నాను. ఆమె పైట కొంగుతో కళ్లు తుడుచుకుంటోంది. 
      ‘అది కాదు ఇందిరా, పాపపైన నీకింత ప్రేమ ఎందుకు కలిగిందా? అని ఆలోచిస్తూ, ఆనందిస్తూ అలా ప్రశ్నించాను అంతే’ అన్నాను. ‘అదే నేను తేల్చుకోలేకుండా ఉన్నాను. పదేపదే ఆత్మను ప్రశ్నించుకున్నాను. ఎందుకీ పాప నా హృదయంలో వచ్చి దాగి దాగుడుమూతలాడుతోందా’ అని ఎడారిలో పువ్వు పూస్తుందా! అమావాస్య నిశి శశికళ తొంగి చూస్తోందా? అనుకొన్నా. ఆ మనస్సు పూయకేం? పూస్తుంది ఎడారిని వనంగా కూడా మారుస్తుందని చెబుతోంది ఆత్మ...’ అని ఆవిడ పాపకు నీళ్లు పోయడం ముగించి లేచింది.
      నేను తువ్వాలు అందీయబోయాను. అప్పటికే ఆమె చీర చెంగుతో పాపను తుడుస్తోంది. పాప ఆ పొరల్లోకి చుట్టుకుపోవడానికి చూస్తోంది. ఆమె మెల్లిగా అంది ‘కొన్ని అదృష్టాలు అంది కూడా జారిపోతాయి. అంతటితో జీవితం మాత్రం ఆగిపోదు. జీవితం అదృష్టాల పరంపర. ఒకటి పోతే ఇంకో అదృష్టం అందుకోవడానికి ప్రయత్నిస్తూంటుంది.’ అన్నదామె.
      ‘అంటే నీ ఉద్దేశ్యం?...’ అన్నాను. ‘నా ఉద్దేశ్యం చెప్పానుగా... ఈ పాపని ఇలా ఆడిస్తూ చేతనైన సేవచేస్తూ జీవించాలని ఉంది...
      ‘మరి నీకీ సేవలో పూర్తి ఆనందం కలుగుతుందా!...
      ‘గతానికి గీత గీయడం చేతనైతే ఏ ఆనందమైనా పూర్తిగా అనుభవించవచ్చు. ఏదైనా అదృష్టం తొంగిచూచినప్పుడు ఆ రోజే జీవితం ప్రారంభమైందనుకోవడం మంచిది’ అని తీసుకొని వెళ్లిపోయింది అక్కడినుంచి.
      ‘గతానికి గీత గీస్తే... అదృష్టం తొంగిచూచినప్పుడు ఆ రోజే జీవితం మొదలు అనుకుంటే’ అని ఆలోచిస్తూ స్నానం చేశాను...
      ఇవతల వరండాలోకి వచ్చాను. ఇందిర పాపకు పౌడరు అవీ వేసి తల దువ్వుతోంది. ముఖాన తిలకం పెట్టింది. ఆ పుల్ల అక్కడే ఉంది. పాప ఆ పుల్ల తీసి ఇందిర ముఖాన బొట్టు పెట్టింది. ఆమె ఉలిక్కిపడింది. తుడిచి వేసుకోవాలని ప్రయత్నించి నన్నుచూచి చెయ్యి దించివేసింది. తిలకం దిద్దిన ముఖం చూడగలిగాను నేను. 
      ‘నేను పెళ్లాడితే ఆమె తిలకానికి భంగం వచ్చేది కాదు.’ అనిపించింది. ఇందిర ఆ ఖంగారులో ఏమీ తోచక, నాపాదాలకు నమస్కరించింది. నేను స్థాణువునై పోయాను. పాప ‘అమ్మ’ అంది. వాళ్ళమ్మ వస్తోంది కాబోలని చూచాను. కాని ఆమె రాలేదు. ఇందిరే ఆప్రయత్నంగా వోయ్‌’ అని పాపను చంకన వేసుకొని వెనక్కి వెనక్కి చూస్తూ వెళ్లిపోయింది. నేను నా గతించిన జీవితంలోకి తిరిగితిరిగి చూచుకుంటూ నిలబడిపోయాను. 
      ఈ సంఘటన జరిగి సంవత్సరమైంది. ఇందిర వద్దనుంచి పాప కులాసా అడుగుతూ ఉత్తరాలు వస్తున్నాయి. ‘ఒక్కసారి వచ్చి చూచిపొమ్మని చాలాసార్లు వ్రాశాను. కాని పిల్లను తీసుకువచ్చేశామన్న కోపమో ఏమో ఆమె రాలేదు. మేమే తీసుకుపోయి చూపాలనుకొన్నాం. కొద్దిరోజుల్లో ఇందిర ఈ లోకం విడిచి వెళ్లిపోయిందని ఉత్తరం వచ్చింది. ఆ రోజున పాపనెత్తుకొన్న దృశ్యాలన్నీ కళ్లబడ్డాయి. ‘మరో అదృష్టం ఎదురైతే’ అన్నది. ఆ అదృష్టం కూడా అందకుండా చేశాను ఈ నేరం నాదేననుకున్నాను.
      అప్పటినుంచి పాపమీద నాకు ప్రేమ ఎక్కువైంది. ఇందిర స్మృతులన్నీ పాపలో మెదిలేవి. కాని ఆ స్మృతిరేఖల్ని కూడా చెరిపేశాడు దైవం. అనుకోకుండా పాపకు ఇన్‌ఫ్లూయంజా వచ్చి మమ్మల్నికూడా విడిచిపోయింది. స్మృతిపథమంతా కారుచీకట్లు క్రమ్ముకున్నాయి. పాపని నేనెలా మరువగలను? పాపను స్మరించినప్పుడల్లా ఇందిర కూడా సాక్షాత్కారమయ్యేది. ‘ఆమె చంకలో పాప’ నన్ను విడవని దృశ్యమైంది.
      ఈ అనుబంధం ఇప్పటికీ ఎప్పటికీ నాకర్థం కాదు. అమర ప్రేమకు, ఆనందానికీ, గల సంబంధమేదో ఇందిరా, పాపల జ్ఞాపకంలో కాపురం చేస్తూ ఉంటుంది.
      ఒక స్మృతికి ఇంకొక స్మృతి అనుబంధంగా నిలుస్తుంది. రెండు స్మృతులు కలిసి నన్ను కృంగతీసి వేస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఎప్పటికీ నా జీవితమింతే.
      ఈ అనుబంధానికి అర్థం తెలుసుకొని మరణిద్దామని ఉంది మరి సాధ్యమో కాదో?

* * *

సౌజన్యం: భాస్కరభట్ల వెంకటేశ్వర్లు (కృష్ణారావు గారి కుమారుడు)
 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam