మల్లరావలె!

  • 842 Views
  • 15Likes
  • Like
  • Article Share

    జిల్లా గోవర్ధన్‌

  • విశ్రాంత అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనరు,
  • ముంబయి.
  • 9819096949
జిల్లా గోవర్ధన్‌

ఊళ్లో బతుకు లేదనుకుని పట్నం వెళ్లిపోయిన తరం వెనక్కి తిరిగి చూస్తోంది! ఆ నేలతల్లికి మరోతరం దూరం కాకూడదనుకునే గోపాలం లాంటివాళ్ల ఆలోచనలు నిర్ణయాలుగా మారే సందర్భాలు ఎంతమందికి ఎదురవుతాయి?
ఊరూవాడా
హోరెత్తుతోంది. ఎక్కడ చూసినా తెలంగాణ ఆవిర్భావ సంబరాలే. కానీ, నా దురదృష్టం... వాటిని టీవీలో చూసి సరిపెట్టుకోవాల్సి వస్తోంది. పుట్టినగడ్డకు దూరంగా బతకడమంటే తల్లి ఒడికి దూరమవడం లాంటిదే. అందులోని కష్టమేంటో అనుభవిస్తే కానీ తెలియదు. ఇక ఇలాంటి సంతోషకర సందర్భాల్లోనైతే మనసు మరీ కొట్టుకులాడిపోతుంది. ఆ బాధతోనే పడకమీద వాలాను. కానీ, మనసెక్కడో ఆ మట్టి మీదికెళ్లిపోతే, ఇక్కడ శరీరం ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటుందా! కునుకుపట్టని ఆ క్షణాల్లో నా ఆలోచనలన్నీ మా ఊరు చుట్టూ అల్లుకుపోయాయి. గతస్మృతులేవో కళ్లముందు మెదులుతున్నాయి. 

* * *

      ‘‘ఏం జయక్కా, కొడుకు మీసకట్టు అవుపడుతుంది. ఇంకేంది, కోడలును సూడు..’’ పక్కవీధి చంద్రమ్మ మా అమ్మను నవ్వుతూ అడిగింది. 
      మా అమ్మ గర్వంగా ‘‘ఆని మెట్రిక్‌ పరీక్షలు అయిపోనియ్, అయి కాంగనే కోడలు పోరిని తెద్దంలే’’ అంది.
      ‘‘ఏం సదువో, ఏందో పిలగాడు పదియేనేండ్లు దాటవట్టె. పెండ్లి మాటెత్తుత లేరు. పెండ్లికీ సదువుకూ ఏం తంట?’’ మా నానమ్మ అందుకుంది కండెల రాట్నం తిప్పుకుంటూ.
      ‘‘బాగ జెప్తివి శివ్వత్త, ఇంక మనుమనికి పిల్లను దెవులాడుండ్రీ’’ అంటూ సలహా ఇచ్చి వెళ్లిపోయింది చంద్రమ్మ.
      మా ఊరు దాచారం. నేనుండేది మాత్రం చిన్నాన్న దగ్గర... బొంబాయిలో. అక్కడి ఆంధ్ర బడిలో తొమ్మిదో తరగతి పరీక్షలు రాసి సెలవులకి ఊరు వచ్చాను. ఏటా దసరా, దీపావళి, వేసవి సెలవులన్నీ దాచారంలోనే గడిచేవి. దాంతో పరాయి రాష్ట్రంలో ఉంటున్నా తెలంగాణ సంస్కృతి నాకు బాగానే ఒంటపట్టింది. 
      మరో రెండేళ్లకు మెట్రిక్‌ పరీక్ష ఉత్తీర్ణుడనయ్యాను. పై చదువులకు లాలా లజ్‌పత్‌రాయ్‌ కళాశాలలో చేరాను. ఇంతలో ఊరినుంచి పిడుగులాంటి వార్త... నాన్న చనిపోయారని! ఆ తర్వాత బాధ్యతలన్నీ అమ్మమీదే పడ్డాయి. వ్యవసాయం, కుటుంబ వ్యాపారం... అన్నీ అమ్మే చూసుకోవాల్సి వచ్చింది. చదువు మధ్యలో ఉండటంతో నాకు ధైర్యం చెబుతూ, తన భుజాల మీద కుటుంబాన్ని నిలబెట్టింది అమ్మ. 
      నడీడు కొడుకు తన కళ్లముందే పోవడంతో నానమ్మ ఏడవని రోజు లేదు. సెలవుల్లో నేను ఊరికి వెళ్లగానే, నన్ను గుండెలకు హత్తుకుని ఏడ్చేది. మనవడిలో కొడుకుని చూసుకునేదో ఏమో పాపం.. నాకూ కన్నీళ్లు ఆగేవి కావు.  
      ‘‘కొడుకా పిలగాని పెండ్లి చేద్దాం రా’’ ఎప్పుడైనా ఊరికి వచ్చిన మా చిన్నాన్న చెవినిల్లు కట్టుకుని పోరేది నానమ్మ. 
      ‘‘ఆని సదువు కావాల్నా లేదా’’ అంటూ సర్దిచెప్పేవాడు చిన్నాన్న.
      ‘‘ముసల్దాన్ని.. ఎప్పుడు రాలిపోతనో ఏమో, నా కండ్ల ముంగట నా మనవని పెండ్లి అయితే బాగుండు’’ అంటూ గొణిగేది. 
మొత్తానికి నా ఇరవయ్యో ఏట మా నానమ్మ ఆశ తీరింది. పెళ్లి వేడుకలన్నీ ఆమె కళ్లముందరే... దాచారంలోనే జరిగాయి. ఆ తర్వాత నా ఇద్దరు కూతుళ్లనూ నిండార ఆశీర్వదించాక, ఇక చాలనుకుందో ఏమో కానీ, తన కొడుకు దగ్గరికి పయనమైపోయింది నానమ్మ. ఈమధ్యలోనే నాకు       బొంబాయిలో కొలువు దొరికింది. దాంతో అక్కడే స్థిరపడిపోవాల్సి వచ్చింది. కొంతకాలానికి పొలం పాత్రా అమ్మేసి అమ్మ కూడా నా దగ్గరికి వచ్చేసింది. కాలచక్ర గమనంలో తనూ మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. 
      అక్కడ దాచారంలో మా ఇంటి నాలుగు గోడలూ ఎండావానలకోరుస్తూ అలాగే నిలబడ్డాయి. ఏ మూడు నాలుగేళ్లకోసారో ఊరికి వెళ్లేవాణ్ని. అక్కడినుంచి తిరిగొచ్చిన ప్రతిసారీ రెండు రోజులపాటు ఊరి ఆలోచనలే మెదిలేవి.  ఇక్కడ ఎంత సంపాదిస్తున్నా... సొంతూరికి దూరంగా పరాయి జీవితం గడుపుతున్నామన్న బాధ ఒకవైపు, జీవితంలో కాస్తోకూస్తో స్థిరపడ్డాం కదా, ఊరికి ఏదైనా చేయాలన్న ఆలోచనలు మరోవైపు నిలబడనిచ్చేవి కావు. ఇంతలో తెలంగాణ ఉద్యమం ఫలించింది. జూన్‌ రెండున తూరుపు దిక్కున కొత్త వేగుచుక్క పొడిచింది. 

* * *

      రోజులు అలాగే గడచిపోతున్నాయి. ఇంతలో అనుకోకుండా హైదరాబాదు వెళ్లే పనిపడింది. అక్కడి దాకా వెళ్తున్నాం కదా, ఎలాగైనా ఊరికి వెళ్లిరావాలని నిర్ణయించుకున్నా. 
      హైదరాబాదు నుంచి దాచారం రెండు గంటల ప్రయాణం. ఇక్కడ పనైపోగానే, కారు మాట్లాడుకుని ఉదయం పదిగంటలకల్లా దాచారంలో వాలిపోయాను. వీధులన్నీ పాత గోడలతో బోసిపోయాయి. మాసిన గడ్డాలతో, చేతికర్రలతో వయసుపైబడ్డ పెద్దవాళ్లు తప్ప కుర్రాళ్లెవరూ కనిపించలేదు. ఉన్న నలుగురూ కారువైపు అదోలా చూస్తున్నారు. ఇంతలోనే ఇల్లు వచ్చేసింది. పక్క ఇంట్లో ఉండే మా పెదనాన్న కొడుకు బయటికొచ్చాడు. మా ఇంటి తాళం తీసి నన్ను లోపలికి తీసుకెళ్లాడు. 
      ‘‘ఏం రా తమ్మి.. ఇయ్యాల సుక్క తెగి పడ్డట్లే ఒస్తివేంది?’’ అన్నాడు. 
      ‘‘ఏం లేదే, ఊరు సూడాలనిపిస్తే వచ్చిన’’ బదులిచ్చాను.
      కారు చప్పుడు చెవినపడినట్లుంది... చంద్రమ్మ వడివడిగా అడుగులేస్తూ వచ్చింది. ‘‘వామ్మో గోపయ్యా.., ఎన్నాళ్లకు కనిపిస్తివి బిడ్డా!’’ అంటూ కౌగిలించుకోబోయి, కాస్త ఆగింది. తన మాసిన బట్టలు, చెదిరిన నెరసిన జుట్టు చూసుకుని కొంచెం తటపటాయించింది. నేను చేతులు చాచగానే వెంటనే వచ్చి హత్తుకుంది. ఆమె కళ్లనిండా నీళ్లు. ఆమె వెనుకనే తన భర్త రాములు... జారిపోయే కళ్లజోడు సవరించుకుంటూ, ‘‘ఎవలయ్యా..?’’ అంటూ వచ్చాడు.  
      ‘‘అయ్యో, పెంటక్క కొడుకు గోపాలం కాడూ!? బొంబయి నుంచి ఒచ్చిండు’’, చంద్రమ్మ బదులిచ్చింది.
      ‘‘ఓర్ని, నువ్వా కొడుకా..’’ అంటూ నా వైపు చూస్తూనే ఎదురుగా ఉన్న గుమ్మానికి ఆనుకుని కూర్చున్నాడు. ‘‘కంటిసూపు మందమయింది బిడ్డా. సర్కారోల్లు ఇచ్చిన కంటి అద్దాలు పెట్టుకున్నా సూపు ఆనుత లేదు. గొంతు ఇంటెనేగాని ఎవ్వళ్లనీ గుర్తు పడ్తలేను’’ అన్నాడు.
      ‘‘ఇంక నౌకరి మీదనే ఉన్నవా అయ్యా?’’ చంద్రమ్మ అడిగింది.. 
      ‘‘ఔనే. ఇంక ఓ యాడాదికి రిటైరయితా’’ బదులిచ్చాను. 
      ‘‘ఇంక సాలుతియ్యి బిడ్డ. ఎన్నేండ్లు సాకిరి చేస్తవు. సాలిచ్చుకోని, ఆ బస్తి ఇడిసి, దాసారం ఒస్తె గాదు. మీ నాయన పోయె, అమ్మ పోయె, నీవోల్లూ, నావోల్లూ, అందరు పెద్దోల్లూ మట్టిల కలిసిరాయె. వొయసు పోరలేమో అయిద్రాబాదుకెల్లి పోయిరాయె. నా అసుంటి ముసలికుంకలం ఈ ఊరు పట్టుకుని ఉన్నం. మా గోస ఎవరికి చెప్పుకోవాలె?’’ రాములు కాక గుండెందుకో చెరువైంది.  
      అంతలోనే అయిలయ్య గౌడు, రజివెల్లి కూడా వచ్చేశారు. అందరిదీ అదే మాట. వాళ్లంతా మా నాన్న సమకాలికులు, ఆసాములు కూడాను.
      ఈలోగా చంద్రమ్మ పెద్దగ్లాసు నిండా చిక్కటి చాయ్, ఓ చిన్న బిస్కట్‌ పొట్లం తెచ్చింది. ‘‘తీస్కో అయ్యా, పొద్దట్నించి ఏం తిన్నవో ఏమో..’’ అంది. ‘‘ఇంత చాయ్‌నా! పొద్దుగాలే నాస్టా చేసి తాగిన’’ అంటున్నా, పట్టించుకోకుండా, ‘‘అయితేమాయెలే, చాయ్‌ నీల్లె గదా, తాగు బిడ్డా..’’ బుజ్జగించుతూనే ‘‘ఓ రజివెల్లన్న.. ఇంట్ల లేత కోడిపిల్ల ఉంటె కోస్కరా, గింత అన్నం తిని పోతడు గోపయ్య’’ అంటూ పురమాయించింది. 
      ‘‘వద్దు చిన్నమ్మ. కారున్నది గదా, ఎంత సేపట్ల పోత హైద్రాబాదుకు?’’ అంటున్న నా మాటలను మధ్యలోనే ఆపేసింది చంద్రమ్మ. ‘‘ఇంక జెప్పకయ్య, కూత పెట్టున ఉన్నదా అయిద్రబాద ఈడికి? నాకు జెప్తవు, నా కండ్ల   ముందు పుట్టినోనివి!’’ అంది. ఆ తల్లి ప్రేమనెలా కాదనగలను... ‘‘సర్లే నీ ఇష్టమవ్వా’’ అన్నా. 
      తర్వాత ఆమె ఆ పనిలో పడిపోయింది. ‘‘రాములు కాకా, తెలంగాణ ఒచ్చింది గదా? ఎట్లనిపిస్తంది?’’ అంటూ పెద్దాయన్ని కదిలాంచాను. 
      ‘‘సూడాలె బిడ్డా.. తక్తు ఎక్కినోలు మంచి సెయ్యకవోతరా..’’ ధీమాగా చెప్పాడు. అంతలోనే... ‘‘ఏమో ఎన్కటి రోజులే బాగుండె. ఒక్క తూటు పైసకు (నైజాం కాలంలో ఆలి కరెన్సీ. నాణేలకు రంధ్రం ఉండేది) శేరున్నర బియ్యం, గిన్నన్ని వట్టి మిర్పకాయలు ఉట్టిగనే దొరికేవి. మరి ఇప్పుడు, ఏది కొనబోయినా అగ్గేనాయె. ఉన్నోడు, లేనోడు అందరూ అయిద్రాబాదకే ఉర్కవట్టిరి. నైజాం సర్కారు జమానల ఎవరైనా ఊరు దాటేటోల్లా. మీ సాలోల్లు మాత్రం బొంబాయి, సూరత్‌ మొకాన పోతుండిరి. ఇప్పుడు వొచ్చేటప్పుడు చూస్తివి గదా, ఈ ఊర్ల గతి ఎట్లున్నది. మా కాలంల ఊర్లల్ల అందరికి చేతినిండ పనులుండేవి. కాపోల్లు, గౌండ్లోల్లు, సాలోల్లు, సాకలోల్లు, ఒడ్లోల్లు, అవుసలోల్లు, కమ్మరోల్లు, కుమ్మరోల్లు, ఏ కులపోల్లూ ఉపాసాలు ఉండెటోల్లు కాదు. మనిషికి ఏం గావాలె. రెండు పూటలా కంచంల గిన్ని మెత్కులు? గా మెత్కులు కూడ దొరకని రోజులొచ్చి పడ్డయి బిడ్డ ఊర్లమీద.             పల్లెలన్నీ బీడుపట్టిపోతున్నయి. పట్నం మాత్రం యాడికెల్లి తెచ్చిపెట్టుద్ది గింతమందికి. ఆడికి పోయినోళ్లకీ కాసు మిగలట్లేదు’’
      ’’అవును కాకా.. సక్కగ సెప్పినవ్‌’’ అన్నాడు గౌడు. నేనూ అవునన్నట్టు తల ఊపాను.
      ‘‘సర్కారోల్లు ఊర్లపొంటి ధ్యానం పెడితే, పట్నం పోయిన ఊరి జనాలు మల్ల ఈడికి వస్తరు. పనులు చేసుకుంటరు. దగ్గర దగ్గర మండలాల పొంటి చిన్నపాటి ఖార్కానలు పెడితే.. వయసు పోరలు సదువు నేర్చినోల్లకు కొలువులు దొరుకుతయి. ఊరి గాలి, నీళ్ల ముందట ఏ మందులు ఏం పని జేస్తవి’’ పల్లెటూళ్లో ఉన్నా రాష్ట్ర ఆర్థికప్రణాళికను పండితునిలా చెప్పుకుంటూ పోతున్న రాములు మాటలను అలా వింటూ ఉండిపోయాను.
      ‘‘ఆఁ కొడుకా ముచ్చట అయిటెంకిగాని.. బువ్వ తిందువుగాని రాండ్రి’’ అని చంద్రమ్మ కేకేసింది. ఆమె ఇంటికి పిలుచుకెళ్లి భోజనం వడ్డించింది. నాటుకోడికూర, అన్నం, పచ్చిపులుసుతో భోంచేసి, హైదరాబాదుకి... అట్నుంచి బొంబాయికి తిరుగుముఖం పట్టాను. 
      మర్నాడు ఉదయం ఆరింటికల్లా ఇంటికి చేరిపోయాను. బడలిక తీర్చుకోమంటూ టీ తెచ్చిచ్చింది మా ఆవిడ. పనిలోపనిగా ఊరి విశేషాలు అడిగింది. సంగతులన్నీ పూస గుచ్చినట్లు చెప్పుకుపోతూ... ‘‘రిటైరయిన తర్వాత మనం దాచారంలో ఉంటె బాగుంటుందేమో’’ అన్నాను.  
      వినకూడనిది ఏదో విన్నట్లు కనుబొమ్మలు చిట్లించి- ‘‘ఎందుకు బాగుండదూ? పిలగాళ్లు ఉండేది విదేశాలల్ల, మన ఇల్లు సంసారమేమో బొంబాయిల, ఇప్పుడు ఈడు మీద పడ్డంక దాసారం పాత గోడల్లకు మకాం మార్చుకుందం.. చాల బాగుంటది.....’’ అంటూ రుసరుస లేచి వెళ్లిపోయింది. టీ తాగుతూ, పైన తిరుగుతున్న పంఖావైపు చూస్తూ కూర్చుండిపోయాను. దాని రెక్కలు మాదిరిగానే రాములు కాకా మాటలు నా బుర్రలో తిరుగుతున్నాయి. ఆయన సర్కారోళ్ల మీద ఆశపెట్టుకున్నాడు. అది ఎప్పటికయ్యే పనో! ఇంతలోగా నాలాంటి వాళ్లు ఊరికేమీ చేయలేరా? తప్పదు నేలతల్లి       రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలి.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam