నాన్న ఒడి

  • 114 Views
  • 0Likes
  • Like
  • Article Share

    యలమర్తి మధుసూదన

  • కడప
  • 9441682894
యలమర్తి మధుసూదన

కొన్ని కలలు భయపెడతాయి... కొన్ని కలలు ‘కలలు కాకుంటే బాగుండు’ అనిపిస్తాయి. మరికొన్ని ఏమో ఏనాటి జ్ఞాపకాల్నో తట్టిలేపుతాయి. అలాంటి జ్ఞాపకాల ఒడిలో సేదతీరుతున్న ఓ కొడుకు కథ ఇది... అతని మాటల్లో వినపడే ఓ నాన్న కథ ఇది... 
నాన్నా
నేనూ బైక్‌ మీద వెళ్తున్నాం. ఎక్కడికో తెలీదు కానీ, చాలా సంతోషంగా వెళ్తున్నాం. పైగా వేగంగానూ. నా భుజాల మీద తన రెండు చేతులూ వేసి అదిమి పట్టుకున్నాడు నాన్న. మాటిమాటికీ చెవి దగ్గరికొచ్చి, ‘‘అబ్బీ జాగ్రత్త!’’ అంటున్నాడు.
      నాకు ఇదో కొత్త అనుభూతి. ఎందుకంటే, మామూలుగా బండిని నాన్నే నడిపేవాడు. నేనెప్పుడూ వెనకే. హెల్మెట్‌ కూడా నాకే పెట్టేవాడు. ‘‘నేను నడుపుతా కదా’’ అంటే ఒప్పుకునేవాడు కాదు. ‘‘అమ్మో వద్దబ్బీ! నువ్వు చాలా వేగంగా వెళ్తావు. అది మంచిది కాదు. నిదానంగా వెళ్లాలి’’ అంటూ తనే నడిపేవాడు. పైగా మాటిమాటికీ చేయి వెనక్కి పెట్టి నన్ను తడుముతూ ‘‘అబ్బీ జాగ్రత్త’’ అనేవాడు. ఇదేంటి వెనకున్న నాకు జాగ్రత్త చెబుతాడేంటీయన? అని విసుక్కునేవాణ్ని. 
      ఇది మాకు మామూలే. నాకు ముప్ఫై ఏళ్లొచ్చాయి కానీ నాన్నకు మాత్రం నేనింకా మూడేళ్ల పిల్లాణ్నే! 
      అయినా ఈ రోజు అలా కాదు... నేనే నడుపుతున్నా. నిజంగా ఎంత ఆనందంగా ఉందో! కొంచెం గర్వంగానూ ఉంది. ఆ సంతోషంలో వేగం మరింత పెంచేశా.
      అంతవరకూ నా చెవిలో ధ్వనిస్తున్న ఆ శబ్దం, నన్ను స్పృశిస్తున్న ఆ స్పర్శ ఇప్పుడు లేదు. ఆగిపోయింది. నాకెందుకో భయం వేసింది. ‘‘నాన్నా!’’ అంటూ వెనక్కి చూశా. నాన్న లేడు. షాక్‌ కొట్టినట్లు ఒళ్లంతా ఝల్లుమంది. ఒక్క నిమిషంలో కలిగిన ఆనందం, ఒకే ఒక్క క్షణంలో మాయమైనట్లుంది! బండితోపాటు నా గుండె కూడా ఒరిగింది! ‘‘నాన్నా!’’ అని గట్టిగా అరిచాను. అంతే మెలకువొచ్చింది. దిగ్గున లేచా. చూస్తే బెడ్‌రూంలో మంచం మీదున్నా.
      ఉఫ్‌...ఫ్‌...ఫ్‌... అంటూ ఓ నిట్టూర్పు! ఓ నిమిషంపాటు తలవంచుకుని అలాగే కూర్చుండిపోయాను. తర్వాత నెమ్మదిగా కళ్లు నులుముకుంటూ, అటూ ఇటూ చూశా. గదంతా నిశ్శబ్దంగా ఉంది, నా గుండె తప్ప. వెంటనే నా చూపు గోడ గడియారం మీదికి వెళ్లింది. తెల్లవారుజాము అయిదైంది. ‘అయితే ఇదంతా కలా?’ ఆశ్చర్యమేసింది!
      ఓహ్‌ ఇప్పుడు గుర్తొచ్చింది. రాత్రి మంచం మీదికి ఒరుగుతూ, నాన్నను తలచుకున్నా. ‘ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది నాన్నా’ అని. నేను ఏదడిగినా సరే నాన్న కాదనేమాటే ఉండదుగా..! అందుకే కల్లోకొచ్చేశాడు. అయినా ఇది కలలా లేదే. నాన్న స్పష్టంగా కనిపించాడు. నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శ నాకు తెలీదా ఏంటి? అది నాన్నదే! కచ్చితంగా నాన్నొచ్చాడు.
      వెంటనే లేచి ముఖంమీద నీళ్లు చిలకరించుకున్నా. ఆ తర్వాత కాసిన్ని మంచినీళ్లు తాగి, చిన్నగా నాన్న గదివైపు అడుగులు వేశా. వాకిటి దగ్గరికి చేరి, మెల్లగా తలుపు తీయగానే ఎదురుగా కనిపించాయి.. గాజుపెట్టెలో వరసగా పేర్చిన నాన్న పుస్తకాలు. అన్నీ అచ్చమైన తెలుగు పుస్తకాలే. అవన్నీ నన్నెప్పుడూ పలకరిస్తున్నట్టే అనిపిస్తుంటుంది. వాటిల్లోని ప్రతి పద్యాన్నీ నాన్న నాకు నేర్పారు. ప్రతి కథనూ నాతో చదివించారు. ఆ పుస్తకాలన్నీ నా విజ్ఞాన వికాసానికి తోడ్పడ్డ చేదివ్వెలు. అందుకే వాటిని ఏ గ్రంథాలయానికైనా ఇద్దామంటే కూడా మనసొప్పడం లేదు.
      అదిగో నాన్న కుర్చీ! రోజూ ఆ కుర్చీలోనే కూర్చునేేవాడు. ఎప్పుడూ అక్కడే ఏదో ఒకటి చదువుతూ ఉండేవాడు. ఇప్పుడు ఆ కుర్చీ ఖాళీగా కనిపిస్తోంది. అది ఖాళీ అయి మూడేళ్లయింది. నాకేమో ముప్ఫయ్యేళ్లయినట్టుంది.
      నేను పుట్టగానే అమ్మ పోయింది. తర్వాత నాకు అన్నీ నాన్నే! పాకడం కూడా రాని పసివయసు నుంచి పెళ్లికొడుకుగా మారేవరకూ నాన్న చేతులే నాకు కాపుగాశాయి.
      కొంచెం మాటలొచ్చాక నాన్నని అడిగేవాణ్ని.. ‘‘నాన్నా! అమ్మెక్కడా?’’ అని.
      ‘‘వాళ్ల నాన్న దగ్గరుందబ్బీ!’’ అనేవాడు.
      ‘‘నాన్న దగ్గర ఎందుకుంటుంది?’’ మళ్లీ నా ప్రశ్న.
      ‘‘ఎందుకంటే! నువ్వు నాన్న దగ్గరే కదా ఉన్నావు? అట్లే అమ్మ కూడా వాళ్ల నాన్న దగ్గరే ఉంటుందన్నమాట’’ అని చెప్పేవాడు. నాకెందుకో ఏదో తేడాగా అనిపించినా... ‘ఔనా!’ అంటూ సరిపెట్టుకునేవాణ్ని.
      ఊహ తెలిసిన తర్వాత అప్పుడప్పుడూ కొన్ని మాటలు వినపడేవి. అవి... నాన్నను రెండో పెళ్లి చేసుకోమని చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఇచ్చే సలహాలు! వాళ్లందరికీ నాన్న సమాధానం ఒక్కటే... అనవసరం అన్నట్లు ఓ చిన్న నవ్వు.
      అప్పుడప్పుడూ నాన్న స్నేహితుడు రాజు మామయ్య ఇంటికొచ్చేవాడు. ఇద్దరూ ప్రత్యేకంగా ఈ గదిలో కూర్చుని మాట్లాడుకునేవాళ్లు. ఆయన కూడా వచ్చిన ప్రతిసారీ పెళ్లిమాట ఎత్తకుండా పోయేవాడు కాదు. దానికి నాన్న, ‘‘నాకు భార్య కావాలన్న ఆలోచనే లేదు... ఇక మీద రాదు కూడా’’ అనేవాడు.
      ‘‘నీకు భార్య కావాలని ఉండకపోవచ్చు. కానీ వాడికి అమ్మ కావాలని ఉంటుందిగా’’ అని మామయ్య అన్నప్పుడు, ‘‘వాడి అమ్మ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. పోయినవాళ్లు మళ్లీ తిరిగి రారుగా’’ అని ఆ చర్చను ముగించేవాడు నాన్న.
      నేను అయిదో తరగతిలోకి వచ్చేదాకా రోజూ రాత్రి పక్క తడిపేసేవాణ్ని.. నాన్నను కూడా! అయినా, విసుకోక్కుండా నాకు బట్టలు మార్చి పడుకోబెట్టేవాడు. ఆయన కూడా బట్టలు మార్చుకోక తప్పేది కాదు.
      నాన్నకు ‘‘అబ్బీ!’’ అని పిలవడం ముద్దు. ఆ పిలుపు నాకు మోటుగా అనిపించేది. నేను ఏడోతరగతిలో ఉన్నప్పుడొకసారి బడి లోపలికి వచ్చి ‘‘అబ్బీ!’’ అని గట్టిగా పిలిచాడు. తోటి విద్యార్థులంతా నావైపు అదోలా చూశారు. అప్పుడు నాకు కోపమొచ్చింది చూడూ... ‘‘ఏంటి నాన్నా నువ్వు?... ప్రదీప్‌ అని పేరు పెట్టావు కదా? ఆ పేరుతోనే పిలవొచ్చుగా? ఈ అబ్బీ ఏంటి మరీనూ... నాకు అవమానంగా ఉంది’’ అంటూ కసురుకున్నాను. ఆ తర్వాత చాలాసేపు బుంగమూతితో అలిగి కూర్చున్నాను. నాన్నేమో ముసిముసిగా నవ్వుతూనే ఉన్నాడు. ఆ నవ్వు నాకిప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది.
నేనేది అడిగితే అది క్షణాల్లో కొనిపెట్టాల్సిందే! లేకుంటే మొండికేస్తానుగా! బట్టలూ, చెప్పులూ, ఆట వస్తువులూ ఇంకా ఏవైనా సరే, నేను ఇష్టపడ్డవన్నీ వచ్చేసేవి... ఒక్క సైకిల్‌ తప్ప.
      ‘‘సైకిల్‌ కొనిపెట్టు నాన్నా’’ అంటూ ఏడుపు ముఖంతో రోజూ సతాయించేవాణ్ని.
      ‘‘అమ్మో వొద్దబ్బీ! నువ్వు సైకిల్‌ మీద వెళ్లావనుకో తిరిగి ఇంటికొచ్చే వరకూ నా మనసంతా నీ మీదే ఉంటుంది. అదే నా బండిమీదే అయితే ఏ దిగులూ ఉండదు. సరేనా! ఇంకెప్పుడైనా కొని పెడతాలేప్పా! మాయబ్బి గదూ’’ అని బుజ్జగించేవాడు. తర్వాత కొన్నాళ్లకు ఆ ముచ్చటా తీర్చాడు.
      ఎప్పుడూ ప్రేమించే నాన్నకు అప్పుడప్పుడూ కోపమూ వచ్చేది. అయితే కొట్టేవాడు కాదు కానీ, ఆ కోపం తగ్గేవరకూ తిట్టేవాడు. అదీ కొద్దిసేపే.. ఆ తర్వాత, అప్పటిదాకా ఏమీ జరగనట్టు ‘‘అబ్బీ!’’ అని ప్రేమగా పిలిచేవాడు. నాకేమో ఒళ్లు మండిపోయేది.
      రోజూ బయటికి వెళ్లేటప్పుడు ‘‘అబ్బీ! ఇప్పుడే వస్తా.. జాగ్రత్తగా ఉండు’’ అని చెప్పే అలవాటు ఆయనకి. ‘‘ఇదేంటి ఇంట్లో ఉండే నాకు జాగ్రత్త చెప్తావు?’’ అంటూ దానిక్కూడా విసుక్కునేవాణ్ని.
      తండ్రి ప్రేమ అర్థం చేసుకోలేని కొడుకులంతా ఇంతేనేమో? అయినా అందరూ ఇలాగే ఎందుకుంటారూ? నేను తప్ప. ఇప్పుడవన్నీ తలచుకుంటుంటే కళ్లు తడిసిపోతున్నాయే కానీ కంటికి నాన్న మాత్రం కనిపించడు.
      ఒక్కోసారి అనిపిస్తుందీ.. నాన్న నన్ను మోసం చేశాడేమో అని. ఇప్పుడే వస్తానన్న సంగతి చెప్పి మరీ వెళ్లేవాడు, ఎప్పటికీ రానన్న విషయం మాత్రం చెప్పకుండానే వెళ్లాడే... అని.
      నాన్నంటే అవసరాలు తీర్చడానికే అనుకునేవాణ్ని. కానీ, ఆ అనురాగం వెలకట్టలేనిదని, ఆ ప్రేమకు కొలమానం లేదని ఇప్పటిగ్గాని నాకు తెలియలేదు. ఇప్పుడు నాకంటూ మిగిలిన ఆయన ఆనవాళ్లు నాన్న మిగిల్చిపోయిన ఆ కుర్చీ, ఆ పుస్తకాలూ, ఈ గది. నాన్న గుర్తొచ్చినప్పుడల్లా ఈ గదిలోకొచ్చి, ఆ కుర్చీలో కూర్చుంటా. ఎందుకంటే అక్కడ కూర్చుంటే మా నాన్న ఒళ్లో కూర్చున్నట్టే ఉంటుంది నాకు.
      ఇప్పుడు కూడా మెల్లగా ఆ కుర్చీవైపు నడిచా. కళ్లనిండా నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి. ఆ రెండడుగులు కూడా తారాడుతూ ఎలాగో వేసి, నాన్న ఒడిలోకి మాత్రం చేరుకోగలిగా. అక్కడికి వెళ్లగానే ఏదో మధుర స్పర్శ! ఈసారి శరీరాన్ని కాదు, నేరుగా హృదయాన్ని తాకుతోంది. పైగా అదో తెలియని ఆనందం. ఇంకా ఏదో చెప్పలేని బాధ కూడా. గుండె బరువెక్కుతోంది. గొంతు బొంగురుపోతోంది. ఏవేవో అనాలనిపిస్తుంది. కానీ ఏవీ గొంతుదాటి రావట్లేదు - ఎంత బలంగా ప్రయత్నించినా.
      ఇది నా బలహీనత. గుండె బరువెక్కినప్పుడు మనసులో తప్ప మనిషితో మాట్లాడలేను. లోలోపలే కానీ బయటికి మాట పెగలదు. అందుకే నా బాధంతా మనసులోనే... ఆ మూగభాషతోనే నాన్నకు నివేదించా. 

* * *

      ఒక్కసారి ‘అబ్బీ!’ అని పిలువు నాన్నా! అప్పుడైతే విసుక్కునేవాణ్ని కదా... ఇప్పుడు మనస్ఫూర్తిగా పలకాలని ఉంది నాన్నా! అన్నట్టు నీకు గుర్తుందా? ‘నీ కడుపున పుడతానబ్బీ!’ అనేవాడివి. మాట నిలబెట్టుకున్నావు కదా నాన్నా! ఇప్పుడు నీ మనవడికి మూడో ఏడు. అచ్చు నీ పోలికే! పేరుకు అభిరామ్‌ అయినా నేను మాత్రం ‘అబ్బీ!’ అనే పిల్చుకుంటా. అలా పిలుస్తున్నప్పుడల్లా నువ్వు నన్ను పిలుస్తున్నట్లే అనిపిస్తుంది! హాయిగా ఉంటుంది.
      ఇంకో ముఖ్యమైన సంగతి. ఇదే కుర్చీలో నన్ను నీ ఒళ్లో కూర్చోబెట్టుకొని, నా తల నిమురుతూ, నడినెత్తిమీద ముక్కుపెట్టి గట్టిగా వాసన పీల్చేవాడివి గుర్తుందా? 
      ‘ఏంటిది?’ అని అడిగితే, ‘ఏంటా... దీన్ని... మూర్ధాఘ్రాణం అంటారులే’ అనేవాడివి. వెనక్కి తిరిగి నీ కళ్లల్లోకి చూస్తూ ‘అంటే ఏంటి?’ మళ్లీ ప్రశ్నించేవాణ్ని. ‘అంటే... నువ్వు కూడా నాన్నవి అయ్యాక తెలుస్తుందిలే’ అని చెప్పి గట్టిగా హత్తుకునేవాడివి.
      నువ్వు చెప్పింది అక్షరాలా నిజం నాన్నా! ఆ స్పర్శలో ఉన్న అనిర్వచనీయ సుఖం, ఆ ఆఘ్రాణింపులో ఉన్న ఆనందానుభూతి, నేను తండ్రినయ్యాక గానీ తెలియలేదు.
      నీ వియోగమనే ఎండలో ప్రయాణిస్తున్న నాకు, నీ జ్ఞాపకాల నీడలే సేద తీర్చుతున్నాయి నాన్నా! మరపు దేవుడిచ్చిన వరం అంటారు. పోయిన వాళ్లను మర్చిపోకపోతే ఉన్నవాళ్లు జీవించలేరు అంటారు. కానీ ఆ మరపు నాకొద్దు. నేను నీ జ్ఞాపకాల్లోనే బతకాలి! ప్రపంచం నన్ను మరచిపోనీ, నేను ప్రపంచాన్నే మర్చిపోనీ... కానీ నా స్మృతిపథంలోంచి నువ్వు మాత్రం వెళ్లొద్దు నాన్నా! వెళ్లొద్దు నాన్నా!... 

* * *

      ఇలా మనసులోనే కేకలు వేస్తున్నా. అంతలో నా రెండు చేతుల మీద ఇంకో రెండు చిన్న చేతులు వాలాయి. ఆ స్పర్శతో తిరిగి ఈ లోకంలోకి వచ్చా. చూస్తే, ఎదురుగా అభిరామ్‌. ‘‘అబ్బీ!’’ అంటూ ఒళ్లోకి తీసుకున్నా. గుండెకు హత్తుకున్నా. మెల్లిగా తల నిమురుతూ, తలపై ముక్కుపెట్టి వాసన పీల్చుతూ, కాసేపు అలాగే ఉండిపోయా. నాటి జ్ఞాపకం, నేటి అనుభవం... రెండూ కలిసిన ఒక అపూర్వానుభూతి ఇది.
      అప్పటికే తెల్లగా తెల్లవారింది! లోపలి నుంచి రేవతి పిలుస్తోంది... ‘‘అభీ!... అభిరామ్‌!... ఎక్కడున్నావ్‌?’’
      ‘‘వాళ్ల నాన్న ఒళ్లో’’ అన్నాన్నేను.
      ‘‘ఇంతకీ మీరెక్కడున్నారో?’’ 
      ‘‘మా నాన్న ఒళ్లో..!!’’ 

* * *

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam