గుండె చ‌ప్పుడు

  • 433 Views
  • 8Likes
  • Like
  • Article Share

    డా।। వి.కృష్ణవేణి

  • తెలుగు విభాగాధిపతి, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల
  • తిరుపతి.
  • 9441948530
డా।। వి.కృష్ణవేణి

నందినికి మొక్కలంటే ఇష్టం. కిరణ్‌కేమో పరమ చిరాకు! వాళ్లిద్దరూ పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. పైగా పెళ్లి తర్వాత భార్యని ఉద్యోగం మాన్పించేశాడు కిరణ్‌. ప్రతి పనిలో అర్ధాంగిని విమర్శిస్తుంటాడు కూడా! వీరి జీవన పయనం ఏ మలుపు తిరిగింది?
ఇంటి
గడప దగ్గరికి రాగానే కిరణ్‌కు చిరాకేసింది. కారణం పూలకుండీ. బయటి నుంచి రాగానే గడప పక్కనున్న గోడకు చెప్పులను విసిరికొట్టడం చిన్నప్పటి నుంచీ అతనికి అలవాటు. కానీ, మూడు నెలల నుంచి అది కుదరడం లేదు. రోజుకో కొత్త పూలమొక్క గోడను ఆనుకుని ఉంటోంది. దీనికంతా కారణం అతని భార్య. మూడు నెలల ముందు ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది నందిని.
      నీరసంగా స్టాండులో బూట్లను సర్ది, ఇంట్లోకెళ్లాడు కిరణ్‌.
      ‘‘వచ్చారా?’’ నవ్వుతూ ఎదురొచ్చి, అతని చేతిలోని బ్యాగును అందుకుంది నందిని. 
      కిరణ్‌ బట్టలు మార్చుకుని టీవీ ముందు కూర్చోగానే వేడివేడి అల్లం టీ అందించింది.
      మరొకసారి అతనిలో అసహనం. కిరణ్‌కి కాఫీ ఇష్టం. అలసట తీరుతుందని సాయంత్రం అల్లం టీ, ఉదయం కాఫీ ఇస్తోంది.
      ‘ఈ ఆడవాళ్లు వారి అలవాట్లన్నీ మొగుళ్ల మీద రుద్దుతారు’ అనుకుంటూ టీ కప్పు అందుకున్నాడు.
      ‘‘అత్తమ్మా! కాఫీ’’ కిరణ్‌ అమ్మకు చక్కెర లేని కాఫీ ఇచ్చింది నందిని. 

* * *

      మరుసటి రోజూ గడప దగ్గర మొగ్గతొడిగిన గులాబీ కనిపించింది. 
      ‘‘పువ్వు పూసినందుకు మొక్క సంతోషంగా ఉంది, పువ్వు నవ్వుతోంది’’ అని నందిని ఒకసారి చెప్పడం కిరణ్‌కి గుర్తొచ్చింది. 
      ‘‘ఇవి నిజంగా ఆమెతో మాట్లాడినట్లు. హు...’’ అనుకుంటూ లోపలికెళ్లాడు.
      ‘‘మావయ్యొచ్చాడు.. మావయ్యొచ్చాడు’’ కిరణ్‌ అక్క విమల పిల్లలు కేరింతలుకొట్టారు.
      విమల కుటుంబం అదే ఊళ్లో ఉంటోంది. భార్యాభర్తలిద్దరూ దగ్గరలోని పల్లెలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. సెలవు రోజుల్లో కిరణ్‌ వాళ్లను చూడటానికి వస్తుంటారు.
      ‘‘బావ రాలేదా’’
      ‘‘ఏదో పనుందట. నీ భార్య ఇల్లంతా మొక్కలతో నింపేస్తోంది. ఏడాదిలో కూరగాయలన్నీ ఇంట్లోనే పండిస్తుందేమో?’’ నందినిని మెచ్చుకోలుగా చూస్తూ అంది విమల.
      ‘‘అప్పుడు కానీ మా ఇంటి యజమాని నన్ను ఖాళీ చేయమనడు. సిద్ధంగా ఉండు. మీ ఇంట్లోనే మకాం’’ అన్నాడు చిరాకుగా.
      నందిని అందరికీ మొలకెత్తిన పెసర గింజలు అందించింది.
      ‘‘చాలా ఓపిగ్గా ఇవన్నీ చేస్తోంది. నా ఎంపిక సరైందే. ఏమంటావు?’’ తమ్ముణ్ని అడిగింది విమల.
      ‘‘సన్యాసిని కావడమొక్కటే తక్కువ’’ దురుసుగా చెప్పి, తన గదిలోకి కదిలాడు కిరణ్‌. విమల కిలకిల నవ్వులు అతని అసహనాన్ని మరింత పెంచాయి.
      గదిలో ఒంటరిగా కూర్చున్న కిరణ్‌లో ఆలోచనలు ముసురుకున్నాయి.
      ‘అక్క నాకంటే అయిదేళ్లు పెద్దది. చదువులు, ఆటలు అన్నింట్లో తనే ఫస్టు. అక్క ప్రతిదీ నా మంచి కోరే చెబుతుందని నమ్మకం. అలా గుడ్డిగా ఆమె మాటలు వినడం అలవాటయింది. అన్నీ మంచే జరిగాయి. కానీ, పెళ్లి విషయంలోనే కాస్త...
      ‘హైదరాబాదులో చదువుకున్న నా అలవాట్లన్నీ పట్నపు వాసనలతో నిండి ఉన్నాయి. చిన్నప్పుడు నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉంటూ అక్కడే చదువుకున్నాం. నాన్న చనిపోయాక సొంత ఊరు తిరుపతికి వచ్చేశాం. తొలి పెళ్లిచూపుల్లో హైదరాబాదులో ఒకమ్మాయిని ఇష్టపడ్డాను. చీరలో, ఆధునిక దుస్తుల్లో చాలా బాగుంది.
      కానీ.... 
      నందిని వాళ్లు ఇక్కడికి దగ్గరలోని పల్లెటూళ్లో ఉంటారు. ఆమె తిరుపతిలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. వైజ్ఞానిక ప్రదర్శనశాలలో అక్క నందినిని చూసిందట. అన్నీ విచారించి సంబంధం ఖాయం చేశారు. అమ్మ కూడా నందినిని బాగా ఇష్టపడింది. నేను సరేననక తప్పలేదు.
      కానీ, నా గుండె చప్పుడు ఎవరు వినగలరు?’ ఆలోచనల అలజడిలో కిరణ్‌కు ఆలస్యంగా నిద్రపట్టింది.

* * *

      నిద్రలేచిన కిరణ్‌కు ఇల్లంతా నిశ్శబ్దంగా కనిపించింది. 
      అంతా ఏమైపోయారు అనుకుంటూ హాల్లోకొచ్చాడు. 
      నందిని చెప్పేది వింటూ పిల్లలు ఛార్టులు గీస్తున్నారు. 
      అమ్మ ఇంటి ముందు మొక్కల మధ్య కూర్చుని దినపత్రిక చదువుతోంది.
      కిరణ్, నందినిని చూస్తూ ‘‘ఆ ఛార్టులు నువ్వే వేయొచ్చుకదా!’’ అన్నాడు. 
      ‘‘నేను వేస్తే, వాళ్లకెప్పుడు అలవాటవుతుంది?’’ 
      ‘‘వాళ్లని డిస్టర్బ్‌ చేయొద్దు కిరణ్‌. రేపు సైన్స్‌ ఫెయిరుంది’’ అంది విమల.
      ‘‘ఓ.....!’’ కిరణ్‌ కళ్లెగరేశాడు.
      ‘‘మనం అమ్మ దగ్గర కూర్చుందాం రా’’ అంటూ తమ్ముడిని ఇంటి ముందుకు తీసుకెళ్లింది విమల.
      ‘‘నేను లోపలికెళతాను. మీరు కూర్చోండి’’ అంటూ కిరణ్‌ తల్లి లోపలికి వెళ్లిపోయింది. 
      విమల, కిరణ్‌లు ఇంటి ముందు కూర్చున్నారు.
      అక్క మాటలు వింటూ, నందినిని తదేకంగా చూస్తున్నాడు కిరణ్‌. అతని కళ్లకు ఆమె ఆ రోజు కొత్తగా కనిపిస్తోంది. పెన్నులు, స్కెచ్‌లు, పెన్సిళ్లు, పిల్లలతో..... ఆమె కళ్లలో ఏదో వెలుగు. నందిని ఇంత సంతోషంగా, సరదాగా నవ్వుతుండటం పెళ్లయినప్పటి నుంచి అతను చూడలేదు. ఏదో భారం ఆమె నడకలో కనపడేదతనికి.
      కిరణ్‌కు వెంటనే రాత్రి ఉక్కిరి బిక్కిరి చేసిన ఆలోచనలు గుర్తొచ్చాయి. వాటి గురించి అక్కని తప్ప మరెవరిని అడగ్గలడు!
      ‘‘అక్కా! నందినికి నాలో అసలు ఏం నచ్చింది? ఆమె మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుందా? లేదంటే పెద్దల...’’ 
      ఆపమన్నట్లు సైగ చేస్తూ ‘‘తనకు వినపడితే బాధపడుతుంది. నాన్నలాగా నీకూ కందుకూరి వీరేశలింగం ఆదర్శం కదా! కట్నం తీసుకోకుండా పెళ్లిచేసుకోవాలనే నీ భావాలకు పడిపోయింది తను’’ చెప్పింది విమల.
      ‘‘మరీ అంత పేదవాళ్లేం కాదే వాళ్లు’’ అనుమానంగా అడిగాడు కిరణ్‌.
      ‘‘ఆడపిల్లలకు కూడా కొన్ని ఆశయాలుంటాయి. నిన్ను ఇష్టపడింది కాబట్టే ఉద్యోగం చేయకూడదన్న షరతును కూడా ఒప్పుకుంది’’ అంది విమల.
      తల పంకించి నందిని వైపు చూశాడు కిరణ్‌.

* * *

      ‘‘మావయ్యా! నాకు సైన్స్‌ ఫెయిర్‌లో మొదటి బహుమతొచ్చింది తెలుసా?’’ కిరణ్‌ ఇంట్లోకి రాగానే విమల కూతురు చెప్పింది.
      ‘‘అవునా? ఏ ప్రయోగానికి వచ్చింది?’’ ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్‌. 
      ‘‘నందిని అత్త చెప్పించింది. మనం ఊళ్లో లేనప్పుడు ఇంట్లో మొక్కలకి నీళ్లు పోయలేం కదా. నెల రోజులు ఊళ్లో లేకపోయినా వాటిని ఎలా బతికించుకోవచ్చో చెప్పే ప్రయోగం’’
      ‘‘ఎలా?’’ కిరణ్‌ కుతూహలంగా అడిగాడు. 
      ‘‘శివాలయాల్లో శివలింగంపైన రంధ్రమున్న పాత్ర ఉంటుంది. ఒక్కో చుక్క పడుతుంటుంది. అలాగ’’
      ‘‘ఒక్కో చుక్కా పడాలంటే’’ కిరణ్‌కు అర్థం కాలేదు. 
      ‘‘నీటి లోపల రంధ్రం దగ్గర స్పాంజి పెడతారు మావయ్యా’’ చెప్పాడు బాబు. 
      నందిని వైపు మెచ్చుకోలుగా చూశాడు కిరణ్‌. 
      అంతలో సర్దుకుని... ‘‘ఎక్కడి నుంచో కాపీ కొట్టిందేగా. సొంత ఆలోచనా ఏంటి?’’ వెటకారంగా అన్నాడు. 
      ‘‘నువ్వెప్పుడూ ఇంతే. పో మావయ్యా’’ పాప బుంగమూతి పెట్టింది. 

* * *

      ఓరోజు రాత్రి పడగ్గదిలో మంచంపై కూర్చుని ల్యాప్‌టాప్‌లో ఆఫీసు పని చేసుకుంటున్నాడు కిరణ్‌. పక్కనే నందిని పుస్తకం చదువుకుంటోంది. రెండు గంటల నుంచి ఇద్దరూ అలాగే ఉన్నారు. 
      ‘‘ఏం చదువుతున్నావ్‌?’’ నందినిని అడిగాడు.
      ‘‘మహాభారతం. నాలుగుసార్లు చదివాను. ఇది అయిదోసారి’’
      ‘‘ఓ, అలాగా. అది సరే. ఆడవాళ్లు ఎక్కువగా మాట్లాడతారంటారు. రెండు గంటల నుంచి నువ్వు ఒక్కమాటా మాట్లాడలేదు’’
      ‘‘మీరు పనిలో ఉన్నారు. నాకిష్టమైన పుస్తకం చదువుకుంటున్నాను’’
      ‘‘ఉద్యోగం వదిలేస్తేనే పెళ్లన్న నా షరతు విని నీకు కోపం రాలేదా?’’
      ఆమె నుంచి సమాధానం లేదు. 
      ‘‘పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నట్టు?’’ మరో ప్రశ్న సంధించాడు. 
      ఆమె ఏమీ మాట్లాడకుండా పక్కనున్న పుస్తకాన్ని భర్తకు అందించింది. 
      ‘‘భారతీయ తత్త్వవేత్తలు - నండూరి రామ్మోహనరావు. ఇప్పుడీ పుస్తకమంతా చదవమంటావా?’’ భయం నటిస్తూ అడిగాడు.
      నందిని మెల్లగా నవ్వుతూ పుస్తకాలను పక్కన పెట్టేసింది.

* * *

      పదిరోజుల తరువాత జరిగిన సంఘటన కిరణ్‌ ఆలోచనల్ని మలుపుతిప్పింది.
      కిరణ్‌ తన ఆఫీసులో భోజనం చేస్తుండగా సహోద్యోగి వాసు వచ్చి ‘‘ఏంటి కిరణ్‌? రోజూ భోజనం తెచ్చుకునేవాడివి. ఈరోజిక్కడ?’’ ప్రశ్నించాడు. కిరణ్‌ కంటే వయసులో, ఉద్యోగానుభవంలో పెద్దవాడు వాసు.
      ‘‘నా భార్య ఊరెళ్లింది సార్‌. మరి మీరు?’’
      ‘‘మా పాపను వేరే స్కూల్‌కి మార్చాలి. మంచి స్కూల్‌ కోసం నేను నాభార్య వెతుకుతున్నాం. మీకు తెలుసు కదా. నాభార్య కూడా ఉద్యోగస్థురాలని. పొద్దున సమయం లేక వంట చేసుకోలేదు. అందుకే క్యాంటీన్‌కొచ్చాను’’
      ‘‘మీపాప చదివే స్కూల్‌ చాలా బాగుందని అన్నారు కదా సార్‌ మీరు’’
      ‘‘నిజమే బాగుండేది. తన క్లాస్‌ టీచర్‌ ప్రభావం పాపపై ఎక్కువ. ఆమె విద్యార్థులను అన్ని పోటీల్లో పాల్గొనేలా చేసేది. పాఠం చెబుతూ రామాయణ, భారత, భాగవతాల కథలు వినిపించేది. చాలా పద్యాలను కంఠస్థం చేయించింది...’’ 
      ‘‘సార్‌. ఇప్పుడు తల్లిదండ్రులు నర్సరీ నుంచే ఐఐటీ, మెడిసిన్‌ అంటుంటే, మీరు..?’’ సందేహంగా అడిగాడు కిరణ్‌.
      ‘‘ఏకాలమయినా మన సంస్కృతి, సంప్రదాయాలున్న సాహిత్యం తెలుసుకోవడం ముఖ్యం కిరణ్‌. భర్తృహరి ‘ఒకచో నేలను పవళించు....’ పద్యం, దాని అర్థం మా పాప చెబుతూంటే ఆశ్చర్యమేసింది. పద్యాల్లోని గూఢార్థాన్ని గ్రహిస్తే, అదే శాంతి మంత్రం. మనం ఆఫీసుల్లో చిన్నచిన్న విషయాలకే ఆవేశపడిపోతూ, తరవాత తెగ బాధపడిపోతుంటాం. మనలోని భావోద్వేగాల్ని అదుపు చేసుకోవడానికి మన ఆఫీసుల్లో నిర్వహించే వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతుల్లో భగవద్గీత, వేమన, సుమతీ శతకాలు లాంటివి చేర్చితే బాగుంటుందని నా అభిప్రాయం’’ దీర్ఘశ్వాస తీసుకుంటూ చెప్పాడు వాసు.
      తిరిగి కొనసాగిస్తూ, ‘‘ఆ ఉపాధ్యాయురాలికి పెళ్లయిందని, ఉద్యోగం మానేసిందని తెలిసింది’’
      ‘‘ఇంతకూ ఆమె పేరు చెప్పలేదు సార్‌ మీరు’’ అడిగాడు కిరణ్‌. 
      ‘‘నందిని’’ 
      ‘‘ఏంటీ? నందినీనా?’’ నోరెళ్లబెట్టాడు కిరణ్‌. 
      ‘‘ఆమె మీకు తెలుసా?’’ 
      కిరణ్‌ తన ఫోను తీసుకుని, 
      ఫొటో చూపిస్తూ ‘‘ఈమేనా సార్‌’’ అనడిగాడు. 
      ‘‘అవును ఈ మేడమే. మీకెలా తెలుసు?’’ వాసు ముఖంలో ఆశ్చర్యం. 
      ‘‘తను నా భార్య’’ 
      ‘‘అవునా?’’ మరింత ఆశ్చర్యపోయాడు వాసు. 
      ‘‘మీ పెళ్లి సమయానికి నేను వేరే ఆఫీసులో పనిచేస్తున్నాను కదా. మీ పెళ్లికి నేనొచ్చే అవకాశమే లేదు. సరే, నందినిగారు ఇప్పుడు ఏ స్కూల్లో పనిచేస్తున్నారు? మా పాపను అక్కడే చేర్పిస్తాం’’ ఆత్రంగా అడిగాడు వాసు.
      ‘‘పెళ్లయ్యాక ఇంటిపట్టునే ఉంటోది సార్‌’’ చెప్పాడు కిరణ్‌. ఆ మాటతో వాసు దిగులు ముఖం పెట్టాడు. 
      ‘‘మీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఓ మంచి ఉపాధ్యాయురాలిని ఇంటి పనులకు అంకితం చేయడం ఎంతవరకు సరైందో ఓసారి ఆలోచించండి’’ కిరణ్‌ భుజం తట్టి వాసు వెళ్లిపోయాడు.
      ఆరోజు ఆఫీసులో పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాడు కిరణ్‌. సగంరోజు సెలవు పెట్టి ఇంటికి బయలుదేరాడు.
      గడప ముందు విరబూసిన గులాబీ ‘‘వచ్చారా?’’ అంటూ పలకరించే నందిని నవ్వులా హాయినిచ్చింది. 
      ఇంట్లోకొచ్చిన కొడుకుని చూస్తూ ‘‘ఏంటి అప్పుడే వచ్చేశావు. ఒంట్లో బాలేదా. కాఫీ...’’ అమ్మ అంటుండగానే..
      ‘‘ఉదయం నీకు షుగర్‌ పరీక్షలు చేయించాం కదా! ఇప్పుడు డాక్టర్‌ దగ్గర వాటిని చూపించి నిన్ను అక్క ఇంట్లో వదిలిపెడతాను. రేపు ఉగాది పండగ కదా. అటు నుంచి అటే నందిని వాళ్లింటికి వెళతాను’’ చెప్పాడు కిరణ్‌.
      ‘‘వీడి మామ వచ్చి పిలిచినప్పుడేమో రానన్నాడు. ఇప్పుడేమో వెళతానంటున్నాడు. పెళ్లాం మీద గాలి మళ్లిందేమో...’’ అమ్మ సణుగుడు వినపడుతోంది అతనికి. 

* * *

      ‘‘ఏమేం తింటున్నారమ్మా మీరు?’’ రిపోర్టులు పరిశీలిస్తూ కిరణ్‌ తల్లిని అడిగాడు డాక్టరు. 
      ‘‘నేనేం తింటాను సార్‌. నా కోడలు నాకు అన్నమే పెట్టదు’’ బాధగా చెప్పింది కిరణ్‌ తల్లి.
      ‘‘అమ్మా!’’ వారించాడు కిరణ్‌. 
      ‘‘మీరుండండి కిరణ్‌. మీరు చెప్పండమ్మా!’’ అన్నాడు డాక్టరు.
      ‘‘నా కోడలు పొద్దునే మొలకెత్తిన మెంతులిస్తుంది. తరువాత మజ్జిగ కలిపిన రాగి జావ. మధ్యాహ్నం, రాత్రి జొన్న రొట్టో, పెసరట్టో. కాకర, చిక్కుడు, సొరకాయల్లో ఏదో ఒక కూర, చీనీ, జామకాయ లాంటి పండ్లు, ఉడకబెట్టిన గుడ్డు ఇస్తుంది. ‘ఆరోగ్యానికి మంచిది. ఓ మూడు నెలలు ఇవి వాడి చూడండత్తయ్యా!’ అంటుంది’’ బాధగా చెప్పింది కిరణ్‌ తల్లి.
      ‘‘వీటివల్లనే మీకు చక్కెర వ్యాధి తగ్గుముఖం పట్టిందమ్మా! వాటినే కొనసాగించండి’’ డాక్టరు నవ్వుతూ చెప్పాడు.
      నిజమేనన్నట్లు చూశాడు కిరణ్‌. అతని తల్లి ముఖంలో బాధ మాయమై నవ్వు విరిసింది.

* * *

      నందిని అమ్మగారింట్లోకి అడుగుపెట్టగానే, అక్కడి వాతావరణం కిరణ్‌కు ఆహ్లాదాన్నిచ్చింది.
      చందమామ వెన్నెల్లో ఇంటిముందు మంచంపై నందిని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. కింద చాప మీద నందిని, ఆమె అన్నా వదిన, వారి పిల్లలు కూర్చుని కారం బొరుగులు తింటూ మాట్లాడుకుంటున్నారు.
      అందరూ కుశల ప్రశ్నలు అడిగి ఓ కుర్చీవేసి అతణ్ని కూర్చోబెట్టారు.
      కళ్లతోనే ‘‘ఎలా ఉన్నారు?’’ అనడిగింది నందిని. నవ్వుతోనే సమాధానమిచ్చాడు కిరణ్‌.  
      ‘‘నేను ముందే చెప్పాను కదా నందినీ. మీ ఆయన పండగ వేళకు వచ్చేస్తాడని’’ నందిని వదిన పరిహాసమాడింది.
      అందరూ ఏదో పనున్నట్లు ఒక్కొక్కరూ ఇంట్లోకి జారుకున్నారు. నందిని, కిరణ్‌లు మాత్రమే మిగిలారు.
      ‘‘ఎలా ఉన్నావు?’’ నందినిని దగ్గరికి తీసుకోబోయాడు కిరణ్‌. 
      ‘‘బాగున్నాను’’ దూరంగా జరుగుతూ చెప్పింది.
      ‘‘చందమామ చూస్తున్నాడు తమ్ముడూ!’’ నందిని వదిన ఆటపట్టిస్తూ ఇద్దరినీ లోపలికి పిలిచింది.

* * *

      ‘‘ఈ ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యి’’ ఆ రాత్రి తన పక్కన కూర్చుంటున్న నందినికి ఫోను చూపిస్తూ చెప్పాడు కిరణ్‌ 
      ‘‘ఏంటది?’’ అంది నందిని.
      ‘‘ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు’’ 
      ఆ మాటతో భర్త వైపు ఆశ్చర్యంగా చూసిందామె.
      ‘‘నీలాంటి ఉపాధ్యాయుల అవసరం ప్రభుత్వ పాఠశాలలకు చాలా ఉంది. ఈ ఉద్యోగం వచ్చేలోపు, నువ్వు గతంలో పనిచేసిన స్కూల్‌కి వెళ్లు’’ చెప్పాడు కిరణ్, నమ్మలేనట్లు చూస్తున్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ....
      ‘‘నీకు తెలుసుగా. మా నాన్న వాళ్లది ఆదర్శ వివాహం. ఆయన ఎన్నో పుస్తకాలు చదివేవారు. ఆయన ఆదర్శాల ప్రభావం నా మీద కూడా ఉంది. అయితే, మా అక్కను, ఆఫీసుల్లో పనిచేస్తున్న ఆడవాళ్లను చూసి ‘వీళ్లెందుకింత శ్రమపడుతున్నారు. ఉన్నంతలో సర్దుకుని ఇంటిపట్టున హాయిగా ఉండొచ్చుగా’ అనుకునేవాణ్ని. కానీ, మహిళలు తమ మేధస్సునంతా వంటింట్లో, ఇంటిపనుల్లో వృథా చేయకూడదని గ్రహించాను. నా ఆలోచనల్లోని లోపాలను తెలుసుకున్నాను’’ మనస్ఫూర్తిగా అన్నాడు కిరణ్‌... ‘నిజమా?’ అన్నట్లున్న నందిని చూపులను, ఆ కళ్లలోకి క్రమంగా వ్యాపిస్తున్న వెలుగును ఆస్వాదిస్తూ...
      ‘సర్, మీ పాపను ఆ పాఠశాల నుంచి మార్చనవసరం లేదు’ అంటూ వాసుకు సంక్షిప్త సమాచారం పంపాడు. 
      ఆ క్షణంలో నందిని కళ్లలోకి చూస్తూ తన అర్ధాంగి గుండెచప్పుడు తాను వింటున్న అనుభూతికి లోనయ్యాడు కిరణ్‌.
      యుగాదిగా జరుపుకునే షడ్రుచుల ఉగాది ఓరోజు ముందే ఆ దంపతుల జీవితంలోని ప్రవేశించినట్లయింది.
 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam