మిరప మొక్క

  • 504 Views
  • 16Likes
  • Like
  • Article Share

    కిరణ్‌ జమ్మలమడక

  • హైదరాబాదు.
  • 9885109899
కిరణ్‌ జమ్మలమడక

జానపదాలు ఆలపించుకుంటూ, తోచిన పనేదో చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు కొండయ్య. అతని పాటను నలుగురికీ చేర్చింది నూతన. కానీ, కొండయ్య కొడుక్కి మాత్రం అవి ‘పనికిరాని పాటలు’! అతని అభిప్రాయం మారిందా మరి!?
మూఢనమ్మకం
అనేది తర్కానికి అందని నమ్మకం. దానికి ఒక వ్యక్తి మేధస్సు, చదువుతో సంబంధం లేకుండా, చేతలను నిర్ణయించగల సామర్థ్యం ఉంటుంది. అందుకే తన పెరటిలోని మిరప మొక్కను పనివాడు తుంచేయగానే నూతన మనసు కీడు శంకించింది. వేరే ఏ మొక్క అయినా వేరేలా ఉండేదేమో కానీ ఆ మిరప మొక్కకీ, ఆమెకూ ఓ బంధం ఉంది.
      ‘‘అదేంటి అలా పీకేశావ్‌’’ అంది ఆందోళనగా,
      ‘‘బాగా చీడ పట్టింది అమ్మగారు ఇంక బతకదు, ఇదివరకే మందులు వేశాను. అయినా లాభంలేదు. ఈ మొక్క పని అయిపోయింది అమ్మగారు’’ అనేసి తన పనిలో తను నిమగ్నమైపోయాడు.  

* * *

      అనుకున్నదే తడవుగా తనకు తెలిసిన కొద్దిపాటి వివరాలతో ఊరు బయలుదేరింది నూతన. పల్లెవెలుగు బస్సు కొంత అసౌకర్యంగా ఉన్నా తన ఆలోచనలన్నీ కొండయ్య చుట్టూ తిరగసాగాయి.
      కొండయ్యతో తన పరిచయం ఓ ఏడెనిమిది ఏళ్లనాటిది. తను రేడియో స్టేషన్‌ మాస్టర్‌గా బాధ్యతలు తీసుకున్న కొత్తలో జానపద కళాకారుల మీద కార్యక్రమాలు చేసేది. ఒక ఆదివారం మధ్యాహ్నం ఏదో పుస్తకం చదువుతూ ఉండగా, బాగా అలసిన, నలిగిన గొంతుతో, ఓ జానపద పాట లీలగా వినపడసాగింది, రానురాను అది శ్రావ్యంగా తనకి పనికొచ్చే అంశంగా మారింది.
      గబగబా వీధిలోకి వచ్చి చూసింది. వీధి చివర చెట్టుకింద వయసు మళ్లిన ఒకతను కూర్చుని పాడుతున్నాడు. దగ్గరికి వెళ్లి అతణ్ని పరిచయం చేసుకుని తనతోపాటు తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టింది. తనది విజయవాడ పక్కన ఓ చిన్న తండా అని, అప్పుడప్పుడు ఇలా అడవిలో పెరిగిన చింతపండు, మిరపకాయలు ఇక్కడికి తెచ్చి అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని అర్థమైంది నూతనకి.
      ‘‘నీ పేరేమన్నావ్‌?’’ అని అడిగింది నూతన.
      ‘‘కొండయ్య అంటారు, కూసిన్ని మంచినీళ్లు ఇయ్యి దావతి అవుతోంది’’ అన్నాడు కొండయ్య చాలా చనువుగా.
      సరే అని కొన్ని నీళ్లు తెచ్చి, కొన్ని మిరపకాయలు, చింతపండు కొని, ఆ పాట వివరాలు అడిగి తెలుసుకుంది నూతన.
      ‘‘ఊరికొచ్చినప్పుడల్లా ఇక్కడికి రా’’ అని చెప్పింది, సరే అనేసి వెళ్లిపోయాడు కొండయ్య.
      ఆ తర్వాత అప్పుడప్పుడూ వచ్చి, కొన్ని మిరపకాయలు, చింతపండు తెచ్చివ్వడం, నూతన కాసేపు పిచ్చాపాటి మాట్లాడటం జరగసాగింది. ఇలా రెండు మూడుసార్లు కలిశాక రేడియోలో పాట పాడతావా అని అడిగింది నూతన. ‘‘నా పాటలు ఎవరికీ నచ్చవంటగా, నా బిడ్డ అన్నాడు. నువ్వు పాడమంటే పాడతాలే..’’ అన్నాడు కొండయ్య.
      నూతనకి ‘నువ్వు’ అనే పదంతో నొసట మొదట ముడిపడినా, తర్వాత అతని అమాయకత్వం ఆ నొసట ముడిని విప్పింది. ఆ పిలుపులో కూతురి పట్ల తండ్రికి ఉండే చనువు, ఆప్యాయతే తప్ప, అగౌరవం కనిపించలేదు. ‘‘రేడియో వాళ్లు డబ్బులిస్తార్లే ఊరికే కాదు..’’ అని నవ్వేసింది. ‘‘నీతో పాటు ఇంకా పాడేవాళ్లు, డప్పు వాయించేవాళ్లు ఉంటే ఇంకో అయిదుగురిని తెచ్చుకో’’ అంది.
      అప్పటి నుంచి కొండయ్య తన మందితో వచ్చి, కొన్ని పాటలు పాడేసి డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండేవాడు. అంతలో నూతనకు కొండయ్య వివరాలు కొద్దికొద్దిగా తెలియసాగాయి. కొండయ్య తన మాటల్లో అప్పుడప్పుడు చెబుతూ ఉండేవాడు. ఒక రోజు మిరపకాయలు తెచ్చి ‘‘ఇగో బయట ఆరుకి ఇత్తన్న, నీకు మూడుకే ఇత్త.. లోపలకి పోయి గంప అట్టుకురాపో..’’ అన్నాడు. నూతన నవ్వుకుంటూ సరే అని చిన్న బుట్ట తెచ్చి పెట్టింది. మాటల్లో ‘‘నీ కొడుకు ఏంచేస్తున్నాడు’’ అని అడిగింది
      ‘‘ఆడికి పటాలం యేసుకొనే ఉద్యోగం కావాలట. సైన్మా పాటలే పాడతాడంట. నాతో రారా డబ్బులు ఇత్తారంటే, రాను పొమ్మన్నాడు. ఎదవ, అసలు మాట ఇనటం లేదు.. ఓతూరి, నువ్వు ఆడికి నచ్చచెప్పు, పాటలు బాగా పాడతాడు కానీ మంకుతనం ఎక్కువ’’ అని చెప్పాడు. ‘‘ఇగో నువ్వు, మాకు ప్రతి నెలా పాట పాడమనొచ్చు కదా? మాకు బాగుంటది కాస్త’’ అన్నాడు. అవసరానికి డబ్బులు అడగకుండా, పని అడిగే పద్ధతి నచ్చింది నూతనకి,
      ‘‘అలా కుదరదు కొండయ్యా.. ఆరేడు నెలలు ఆగాల్సిందే. గవర్నమెంట్‌ ఒప్పుకోదు’’
      ‘‘నువ్వు చెప్పు ఒప్పుకుంటాది’’ అని ఆశగా చూశాడు కొండయ్య. ఆ కళ్లలో అవసరం కనపడింది నూతనకి. వెంటనే ఓ అయిదు వందలు, పాత పంచె తీసుకొచ్చి ఇచ్చింది. ఈసారికి వాడుకో తర్వాత ఇద్దువులే అని చెప్పి సాగనంపింది. 
      మామూలుగా ఇరవై ముప్పయి రోజులకొచ్చే కొండయ్య ఈసారి, పదిరోజులకే వచ్చి, ఓ మిరప మొక్క తానే ఇంటి పెరట్లో పాతాడు. ‘‘మంచి మొక్క, బాగా కాస్తది కొంచెం నీళ్లు పోయి’’ అన్నాడు. 
      ‘‘ఇదెందుకు, నువ్వు తెస్తున్నావు కదా...’’ అని నూతన అంటూ ఉండగానే, ‘‘నా కోసం పడికాపులు కాస్తావేంటి నువ్వు.. నేనున్నా లేకపోయినా ఈ మొక్క మిరపకాయలు ఇత్తాది’’ అనేసి వెళ్లిపోయాడు. 
      అతని అమాయకత్వానికి జాలేసింది నూతనకి. తనకి తోచిన సాయం చేస్తూ కొండయ్య పాటలు రేడియోలో ప్రసారం చేయిస్తూ ఉండేది, ఆ పాటలకు ఆదరణ బాగానే ఉండటంతో కొన్ని ప్రశంసల ఉత్తరాలు కూడా వచ్చేవి. అవి చదివి వినిపించేది కొండయ్యకి. రాన్రానూ అతని రాక తగ్గిపోయింది. కొండయ్యకి ఒంట్లో బాగోలేదని, అందుకే రావడం లేదని తెలిసింది. ఎన్నోసార్లు అనుకున్నా ఇంటికి వెళ్లి కలవలేకపోయింది. ఆ తర్వాత తనకు కొండయ్య వివరాలు తెలియలేదు. 
      కొండయ్య జ్ఞాపకాలు మరుగున పడుతున్న సమయంలో, మిరపమొక్క పీకేసిన ఘటన అతణ్ని గుర్తు చేసి మనసును కలచివేసింది.

* * *

      కండక్టర్‌ ఊరు పేరు గట్టిగా అరవడంతో ఈ లోకంలోకి వచ్చింది నూతన. బస్సు ఆగిన చోట ఊరి పేరేగాని అక్కడ ఊరులేదు. లోపలికి రెండు మూడు కిలోమీటర్లు వెళ్లాలంట. కష్టమే, కానీ బయల్దేరింది.
      ఊరు, ఇల్లు చేరుకునేసరికి, మధ్యాహ్నం అయ్యింది. ఇల్లు శుభ్రంగా ఉంది ఇంటిముందు చిన్న వసారా, కట్టెలపొయ్యి, చిన్నచిన్న గదులు ఉన్నాయి, పెద్ద సామాను ఏమీ లేదు కానీ టీవీ, డిష్‌ యాంటీనా మాత్రం ఉన్నాయి. బస్సులు, రోడ్లు లేవుగాని ఊరి నిండా అవే ఉన్నాయి. ఇంతలో కొండయ్య భార్య రావడంతో నూతన తనని తాను పరిచయం చేసుకుంది. మొదట కొంత ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకుందామె. ఎప్పుడూ కొండయ్య కోసం ఎవరూ రాలేదట. అతను ఎలా మంచాన పడింది, ఏమీ మిగల్చకుండా ఎలా కాలం చేసిందీ అన్నీ చెప్పుకొచ్చింది. ఆ ఊళ్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ తనూ, తన కొడుకూ ఎలా కాలం వెళ్లబుచ్చుతున్నారో చెప్పింది. ఆ మాటల్లో కొండయ్య వాళ్లకి చేసిన అన్యాయమే ఎక్కువగా కనపడింది నూతనకి. ఆమె చేతిలో అయిదువేల రూపాయలు పెట్టి వెళ్లబోతుండగా.. ఓ పాతికేళ్ల కుర్రాడు, చిరిగిన అంటే చింపుకున్న జీన్స్‌ ప్యాంటు, అక్కడక్కడా బంగారం రంగు అద్దిన జుట్టు, చెవికి ఒక పోగు, పుర్రె బొమ్మ ఉన్న రెండు ఉంగరాలతో లోనికొచ్చాడు, అతని వాలకానికి కారణాలు అర్థమవడానికి నూతనకి ఎక్కువ సమయం పట్టలేదు. వెళ్లబోయేది మళ్లీ కూర్చొని అతని వివరాలు అడగసాగింది.
      అతని పేరు రాజు, కొండయ్య కొడుకు. డిగ్రీ సగం చదివాడట. విజయవాడలో కారుడ్రైవర్‌గా చేరి మెల్లగా ధనవంతుడై, జీవితంలో స్థిరపడాలని అనుకుంటున్నాడు. కానీ అతనికి ‘మెల్లగా’ అంటే అర్థం తెలుసా అని ఒక సందేహం అయితే కలిగింది నూతనకి. ‘‘కొండయ్యలాగా నువ్వు కూడా వ్యాపారం చేయొచ్చు కదా’’ అని అడిగింది.
      ‘‘నేనూ, అమ్మా.. మా అయ్యకి చాలాసార్లు చెప్పాం.. మిరపకాయలు, చింతపండు అమ్మితే మన అవసరాలు తీరవు. పట్నం పోదాం. అక్కడ వాచ్‌మెన్‌కే చాలా జీతం ఇస్తారు, బోలెడు డబ్బులు సంపాదించొచ్చు అని. ఇనలే, ఏం చేస్తాం అలా చేసుంటే ఇప్పటికి కొంత డబ్బులు ఉండేవి. నేను ఈపాటికే సొంత కారు కొని డ్రైవర్‌గా ఉండేవాణ్ని’’ అన్నాడు. అసహనం అతని ముఖంలో  ప్రస్ఫుటంగా కనపడుతోంది. 
      అయితే నగరంలో క్యాబ్‌డ్రైవర్‌ కష్టాల్ని ఇతను  తట్టుకోగలడా? అసలు వాటి గురించి తెలుసా? అనే అనుమానం నూతనని వెంటాడుతూనే ఉంది. ‘‘పోనీ పాటలు పాడు మీ నాన్నలాగ’’ అంటే, ఆ పాటలు ఏం బాగోవు అని, అవసలు పాటలే కావు.. వాటి వల్ల ఉపయోగం లేదు అనే స్థిర అభిప్రాయంలో ఉన్నాడు. ఏతావాతా నూతనకి తెలిసిందేంటంటే.. తల్లీ కొడుకులకి కొండయ్య మీద సదభిప్రాయం లేదు. ఏదో పనికి పోతాడు చాలీచాలని డబ్బులు తెస్తాడు అనే తప్ప, కొండయ్య గురించి పెద్దగా తెలియదు. అంతే కదా! పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అనుకుంటూ తిరుగు ప్రయాణమైంది నూతన.
      ఇంటికి చేరింది కానీ, తన మనసు మసులో లేదు. తల్లిదండ్రులను గౌరవించలేని వాడు సమాజంలో ఎవరినీ గౌరవించలేడు. రాబోయే తరం ఎంత ప్రమాదంలో ఉందో అర్థమవుతోంది. తన వంతుగా ఒక్కరిని మార్చినా చాలు అనుకుంది, కానీ ఏం చెయ్యాలి.. వాళ్ల ఆలోచనా దృక్పథాన్ని తనెలా మార్చగలదు అన్న ఆలోచనలతోనే రెండు మూడు రోజులు గడిచాయి. 
      ఓ నిర్ణయానికి వచ్చిన నూతన వెంటనే రేడియో స్టేషన్‌ డైరెక్టర్‌ని కలిసింది. నూతన అభ్యర్థనలోని మంచిని గమనించి ఆయన అవసరమైన సాయం చేశాడు. కొండయ్యకి వచ్చిన ప్రశంస ఉత్తరాలు, ఆ ప్రసారాలు చేసినందుకు తనకి వచ్చిన ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, అన్నీ పోగేసి ఒక పెట్టె నిండా సర్ది, ఆ పైన స్వయంగా చిన్న ఉత్తరం రాసిపెట్టి, రాజుకి చేరేలా ఏర్పాటు చేసింది.
      రోజులు గడుస్తున్నా అటువైపు నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు నూతనకి. రోజూ పోస్టు వచ్చేవరకు అక్కడే తచ్చాడుతూ గడిపేది. ఇక తనది వృథా ప్రయాస అని నిర్ణయించుకుని, ఆ తర్వాత పోస్టు కోసం ఎదురు చూడడటం మానేసింది.
      ఒకరోజు ఎవరో కాలింగ్‌ బెల్‌ కొడితే బయటికి వెళ్లిచూసింది నూతన. అక్కడ రాజు ఉండటం చూసి ఆశ్చర్యపోయింది, ‘‘రా.. రా.. రాజు.. లోపలికి రా.. ఏంటి ఇలా వచ్చావు.. లోపలికి రా’’ అంది. ‘‘పని మీద ఈ ఊరొచ్చా.. మీకు ఈ మిరప విత్తనాలు ఇద్దామని..’’ అంటూ ఆమె చేతిలో ఆ పొట్లం పెట్టేసి వెళ్లిపోయాడు రాజు. 
      నూతనకు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత రాజు మళ్లీ కనిపించలేదు, ఏడెనిమిది నెలలు గడిచాయి. నూతన కూడా అతని గురించి ఆలోచించడం తగ్గించింది. అంతకంటే తనేమీ చేయలేనని ఆమెకు అనిపించింది. అంతలో జానపద పాటల పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించమని ఓ సంఘం వారు నూతనను పిలిచారు. ఆమె ‘సరే’ అంది.

* * *

      సభలో చాలామంది గాయకులు ఉన్నారు. ఒక్కొక్కరూ వచ్చి పాడుతున్నారు. నూతనకు కొద్దిగా విసుగు పుట్టింది. అంతా గొంతుతో పాడేవారే కానీ మనసుతో పాడేవారే కనపడలేదు. మళ్లీ కొండయ్య గుర్తుకొచ్చాడు. నూతన ఆ ఆలోచనల్లో ఉండగానే కొండయ్య గొంతులాగా ఒక పాట వినపడసాగింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి ‘ఏంటిది భ్రమ కాదు కదా?’ అనుకుంది. అంతలోనే ఆ పాట సాహిత్యం మనసులోకి వెళ్లడం ప్రారంభమైంది.
      ‘‘యేడవున్నాడో నాన్న...
      గెట్లవున్నాడో నాన్న..
      నీ అవసరాలకి ఖాళీ జేబులు వెక్కిరించినా, 
      నా విలాసాలకు అవి అక్షయ పాత్రలైనాయి..
      నువ్వు గొప్పోడివి కాదని ఈ లోకం అన్నా..,
      నిన్ను గుర్తించేంత గొప్పది కాదు
      ఈ లోకం అని నేను అంటున్నా..
      ... .... .... .... .... .... 
      ... .... .... .... .... ....
      యేడవున్నాడో నాన్న ...
      గెట్లవున్నాడో నాన్న..’’
      ఆ పాట పాడే వ్యక్తి వైపు చూసింది నూతన. వెంటనే ముఖంలో చిరునవ్వు. అక్కడ పాడుతోంది.. కొండయ్య కొడుకు రాజు. 
      ఇప్పుడు తృప్తిగా ఉంది నూతనకు. తాను రాసిన ఉత్తరం గుర్తుకొచ్చింది.
      ‘‘రాజూ, 
      చరిత్ర ఎప్పుడూ గొప్ప వ్యక్తుల గురించే చెబుతుంది. ఎందుకంటే సమాజం నిర్వచించిన ‘విజయం’ సాధించిన వాళ్లే చరిత్ర రాస్తారు కాబట్టి! కానీ శ్రమించే ప్రతి వ్యక్తీ విజయానికీ, గౌరవానికీ అర్హుడే. మీ నాన్న నీకు ఏమివ్వలేదో చూస్తున్నావు కానీ, నీకు ఏమిచ్చాడో నువ్వు గుర్తించట్లేదు. ఐశ్వర్యం అంటే ఖరీదైన బట్టలు, డబ్బు కాదు. అంతకుమించి.. ఏ చదువూ చదవని మీ నాన్న, నిన్ను చదివించాలనుకోవడమే ఒక విజయం. మీకు రెండు పూటలా తిండి పెట్టడం కోసం తాపత్రయపడటమే విజయం. ఇన్ని గెలుపులున్నా అవి నీకు సరిపోకపోతే మీ నాన్న సాధించిన మరిన్ని విజయాలు ఈ పెట్టెలో ఉన్నాయి చూడు.. ఎంతమందికి మీ నాన్న పాట తెలుసో, ఎంతమందికి మీ నాన్న గురించి తెలుసో..! మీ నాన్న పెరటి చెట్టే కావచ్చు కానీ తులసి చెట్టులాంటి వాడు. గౌరవించకపోయినా ఫర్వాలేదు. కానీ అగౌరవపరచకు.
      - మీ అక్క’’
      పాట పూర్తవడం, సభంతా కరతాళ ధ్వనులతో మోగిపోవడం, ఆ సంఘం వారు రాజు ప్రతిభకు పట్టం కట్టడం లాంటివి నూతనకు పెద్ద విషయాలుగా కనపడలేదు. రాజులో వచ్చిన మార్పే అతని భవితకు నాంది.. అదే అన్నింటికంటే ముఖ్యమైందిగా తోచింది నూతనకి. మార్పు ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఎందుకు మారాడు? ఎలా మారాడు? నా ఉత్తరం అందిందా? తను చదివాడా? లాంటి ప్రశ్నల కంటే కనపడిన మార్పును ఆస్వాదించడానికి మొగ్గు చూపింది నూతన.
      ఆనందంతో ఇంటికొస్తున్న ఆమెకు కొత్తగా చిగురిస్తున్న మిరపమొక్క స్వాగతం పలికింది.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam