అమరం.. అఖిలం.. ఈ ప్రేమ

  • 854 Views
  • 26Likes
  • Like
  • Article Share

    మహమ్మద్‌ అన్వర్‌

  • హైదరాబాదు
  • 8008709985
మహమ్మద్‌ అన్వర్‌

ప్రేమ...  ప్రతి మది తలుపుల్ని ఎప్పుడో అప్పుడు తప్పక తడుతుంది. కానీ, అన్ని ప్రేమలూ తీయని సరాగాలు కావు. విఫల గాథలూ ఉంటాయి. సిద్దూ ప్రేమ కూడా అలాంటిదే! అయితే, తను ఇష్టపడిన అమ్మాయి పెళ్లికే కార్లో బయల్దేరాడతను. ఆ ప్రయాణం ఏమైందో చూద్దాం పదండి... 
డెభ్భై...
ఎనభై... తొంభై... 
      హైవే మీద కారు వేగం పెరుగుతోంది. బయట ముసురు పట్టి సన్నగా చిరు జల్లులు. రోడ్డుకి ఇరువైపులా కాపలాగా నిలబడిన చెట్లు తలలాడిస్తూ ఆ వర్షానికి స్వాగతం పలుకుతున్నాయి. వాటి కింద మేకల గుంపులు ప్రకృతిని ఆసక్తిగా గమనిస్తున్నట్టున్నాయి. మొక్కజొన్న పొత్తులకు గిరాకీ పెరిగినట్టుంది. అక్కడక్కడా తోపుడుబళ్ల మీద అవే కనిపిస్తున్నాయి. ఆ చినుకుల్ని కాచుకుంటూనే నిప్పులు రాజేస్తున్నారు. వాటి మీద పొత్తుల చిటపటలు. కార్లో ఇళయరాజా పాటలు అలుపులేకుండా పలుకుతూనే ఉన్నాయి.
      ఎవరికైనా ఇంతకు మించిన రొమాంటిక్‌ ప్రయాణం ఉండదు. కానీ నాకేమో పరమ బోరింగ్‌గా అనిపిస్తోంది. సిద్దూ కోసమే ఇష్టం లేకపోయినా, ఆ వర్షంలో కారు నడుపుతున్నాను.  
      విజయవాడ 150 కిలోమీటర్లు. ఆ బోర్డు చూసి ఇంకాస్త నీరసం వచ్చింది. వాడికి స్టీరింగ్‌ అప్పగిద్దామంటే దేవదాసు అవతారం ఎత్తేశాడు. ఎత్తిన బాటిల్‌ దించట్లేదు.
      ‘వద్దురా’ అంటే వినిపించుకునే రకం కాదు. పైగా వాడి పరిస్థితిని కూడా అర్థం చేసుకోగలను. ఈ సమయంలో వాడికి మందుకి మించిన ‘మందు’ లేదు. 
      ‘‘ఈ పెళ్లికి వెళ్లడం అవసరమారా? యూటర్న్‌ తీసుకుని ఇంటికి వెళ్లిపోదాం. ఏమంటావ్‌?’’ అన్నాను. 
వాడు నా మాటలు వినడం లేదని నాకు తెలుసు. కారు అద్దాల్ని కిందకి దింపి బయట ఎక్కడో చూస్తున్నాడు. జల్లులకు సగం తడిచిపోయాడు. నాకైతే ఏసీ ఆఫ్‌ చేసినా వణుకు వస్తోంది. వాడికి అదేమీ పట్టట్లేదు. అప్పుడప్పుడూ వాడి కళ్లలోకి చూడాలనిపిస్తోంది. తల అటువైపు తిప్పి, చాటుగా ఏడుస్తున్నాడా? అనే అనుమానమూ వేస్తోంది! చెట్టంత మగాడు ఏడవడమేంటి? అనుకోవచ్చు ఎవరైనా! ప్రేమకదా... ఏమైనా చేస్తుంది, చేయిస్తుంది. అవును... వాడిది లవ్‌ ఫెయిల్యూర్‌.
      సౌమ్యని ప్రాణంగా ప్రేమించాడు. ఏళ్లకేళ్లు ఆమె కోసం తపించాడు. కానీ, ఏరోజూ వాడి ప్రేమని ఆమె గుర్తించిందే లేదు. ఇప్పుడు వేరెవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. ఆమె పెళ్లికే వెళ్తున్నాం. ఒక్కడినే పంపలేక నేనూ తోడుగా బయల్దేరా.
      ‘‘నిన్ను ఛీ అన్న అమ్మాయి పెళ్లికి, పిలవకపోయినా వెళ్తున్నాం. మనల్ని కంబైండుగా మళ్లీ ఛీ కొట్టరు కదా?’’ అన్నాను, నాలో ఆవేశాన్నీ, బాధనీ అణచుకుంటూ. ఈసారి కూడా నా మాటలు వినలేదో, విన్నా విననట్టే ఉండిపోయాడో తెలియలేదు.
      ‘‘విజయవాడ ఇంకా ఎంతసేపురా. తనని చూడాలనిపిస్తోంది’’ అంటూ మళ్లీ బాటిల్‌ ఎత్తాడు.
      ‘‘ముందు తాగడం ఆపుతావా లేదా. ఇంకో చుక్క తాగినా కారు ఇక్కడే వదిలేసి వెళ్లిపోతా..’’ బలవంతంగా బాటిల్‌ లాక్కుంటూ అన్నాను. నావైపు చురుగ్గా చూసి, చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో జీవం లేదు. 
      ‘‘నన్నొదిలేసి వెళ్లిపోతావా’’ అన్నాడు దీనంగా. అప్పుడు చూశాను వాడి కళ్లు! ఎర్రగా, చింతనిప్పుల్లా ఉన్నాయి. లోపల ఎంత బాధ దాచుకుంటే ఆ కళ్లు అలా మండుతున్నాయో! కోట్ల కన్నీటి చుక్కల్ని దాచుకున్న కళ్లు అలా సలసలా కాగుతున్నాయేమో! ఇప్పుడు వాడు ఏడిస్తేనే మంచిదనిపిస్తోంది. అంతకు మించిన సాంత్వన వాడికి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఎవరూ ఇవ్వలేరు.
      ‘‘చెప్పరా, నన్నొదిలేసి వెళ్లిపోతావా?’’ మళ్లీ దీనంగా అడిగాడు. జాలేసింది. గట్టిగా హత్తుకోవాలనిపించింది. వాడిలో ఉన్న మ్యాజిక్కే అది. ఎదుటి వాళ్లు ఎంత కోపంలో ఉన్నా చూపులతోనే కరిగించేస్తాడు. వాడి మాటలకూ, ప్రేమకూ అందరూ పడిపోయారు, ఒక్క సౌమ్య తప్ప. అందుకే ఆమె అంటే నాకు కోపం. తను కాదన్నా వెంటపడుతున్నందుకు వీడంటే చిరాకు.
      ‘‘సరేలే, తగలడు’’ అంటూ బాటిల్‌ ఇచ్చేశాను. కారు మళ్లీ జోరందుకుంది.
      ‘ప్రియతమా... నా హృదయమా.. ప్రేమకే ప్రతి రూపమా... నా గుండెలో నిండినా గానమా... నను మనిషిగా చేసిన త్యాగమా’ - ఇళయరాజా మరో పాట.
      వాడి మూడ్‌కీ ఆ పాటకీ సింకు మరింత కుదిరింది. నా భయం పెరిగింది. ఆ జ్ఞాపకాల్లో మరింత కుంగిపోతాడేమో అని. పాటలు కట్టేస్తుంటే - చెయ్యి అడ్డుపెట్టి వారించాడు.
      ‘‘ఈ పాట సౌమ్యకి చాలా ఇష్టంరా. యాన్యువల్‌ డే రోజున పాడింది, పెద్ద లేడీ బాలూలా ఫోజు కొడుతూ. అన్నీ తప్పులే తెలుసా’’ ఈసారి స్వచ్ఛంగా నవ్వాడు.
      అదేంటో ఓ వైపు అమ్మాయిలు బాధపెడుతుంటారు. మరోవైపు వాళ్ల జ్ఞాపకాలే ఓదారుస్తుంటాయి!
      ‘‘పెద్ద అందగత్తె కాదు. ఆస్తిపాస్తుల్లేవు. పోనీ, లతామంగేష్కర్‌లా పాడుతుందా? భూమి బద్దలైపోయే టాలెంట్‌ ఉందా? ఏవీ లేవు. అసలు ఏముందిరా ఆ అమ్మాయిలో..’’ నా విసుగులోంచి పుట్టుకొచ్చిన ప్రశ్న అది. 
      ‘‘నీలో ఏముందని ఫ్రెండుగా చేసుకున్నాను?’’ సూటిగానే అడిగాడు. దానికి నా దగ్గర సమాధానం లేదు. అలాంటప్పుడు నా ప్రశ్నకు వాడి నుంచి సమాధానం ఆశించడంలో న్యాయం లేదనిపించింది.
      కారు వెళ్తోంది...
      ‘‘ప్రేమించావు సరే, కాదందిగా. ఇప్పుడామె పెళ్లికెళ్లడం అవసరమా? దీనికైనా సమాధానం చెబుతావా. లాజిక్కులు తీసి బుర్ర తింటావా?’’ నా మాటలకు కరిగో, విసిగెత్తో, చిరాకేసో- ఎక్కడో ఓ చోట, ఎప్పుడో ఓసారి, ‘వెనక్కి వెళ్లిపోదాం పద..’ అంటాడేమో అని ఆశ. 
బాటిల్‌ ఎత్తి, మళ్లీ గొంతులోకి ఒంపుకున్నాడు. 
      ‘‘ప్రతి మనిషి జీవితంలోనూ మూడు ఘట్టాలుంటాయిరా. పుట్టడం మొదటిది. సౌమ్య పుట్టినప్పుడు చూసే అవకాశం నాకు లేదు. ఆఖరి ఘట్టం చావు. తన మరణం నేనెప్పటికీ చూడాలనుకోవడం లేదు. ఇక మిగిలిన ఘట్టం పెళ్లి. ప్రతి మనిషి జీవితంలోనూ వైభవంగా జరిగే వేడుక. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి వెళ్లకపోతే ఎలారా? అది ప్రేమకే అవమానం’’ వాడి మాటల్లో నిజాయతీ.
      ‘‘పెళ్లి బట్టల్లో ఆమెని చూడాలి. తన సంతోషాన్ని నా కెమెరాలో బంధించాలి. తనెంత ఆనందంగా ఉందో కడసారి చూసి రావాలి. దాన్నే జీవితాంతం దాచుకోవాలి. అంతకు మించి ఏమీ లేదురా’’ కొండంత విషాదాన్ని మోసుకుంటూ ఓ వేడుక చూడ్డానికి వెళ్తున్న స్వచ్ఛమైన ప్రేమికుడు కనిపించాడు వాడిలో. 
      ఈసారి వాడు వెనక్కి వెళ్లిపోదామన్నా- నేనే పట్టుబట్టి పెళ్లికి తీసుకెళ్లేలా ఉన్నాను. చెప్పాకదా.. మనుషుల్నీ, వాళ్లలో తనపట్ల ఉన్న అభిప్రాయాన్నీ చిటికెలో మార్చేయగలడు.
కారు వేగంగా వెళ్తోంది...
      ‘‘సౌమ్య మీద నీకెప్పుడూ కోపం రాలేదా?’’ వాడి మనసులో ఏముందో తెలుసుకుందామని అడిగాను. 
      ‘‘చాలా సార్లు వచ్చింది. నన్నూ, నా ప్రేమనీ ఎందుకు అర్థం చేసుకోదనిపించేది. పిచ్చెక్కేది. ప్రేమికుడి కోపం కూడా ముసుగులో ఉన్న మరో ప్రేమేరా. అవతలి వ్యక్తి మీద కోప్పడుతున్నామంటే, తనపై ప్రేమ మరింత పెరుగుతోందనే అర్థం. కోపం తెచ్చుకునీ తెచ్చుకునీ, తెంచుకోలేనంత ప్రేమించేశా’’ వాడి కళ్లలోంచి రెండు కన్నీటి చుక్కలు చెంపల మీదగా జారి గాల్లోకి చిందాయి.
      ‘నువు లేని నన్నూ ఊహించలేను... నా వేదనంతా నివేదించలేను... అమరం... అఖిలం.. మన ప్రేమా’ ఇళయరాజా పాట మంద్రంగా వినిపి స్తోంది. సిద్దూ గుండెలోని వేదన బాలూ గొంతులో పలుకుతోందా అనిపిస్తోంది. ‘‘అసలు ఈ పాటలే చెడగొడుతున్నాయ్‌’’ టాపిక్‌ మారుద్దామని అన్నాను.
      ‘‘అలా అనకురా. నాలాంటి ప్రేమికులందరికీ ఈ పాటలే ఓదార్పు. ప్రేమ బాధిస్తే ఇదిగో ఇలా ఇళయరాజా, ఆత్రేయ లాంటి వాళ్లు తమ పాటలతో మందు పూస్తుంటారు’’ అంటూ ఆ గీతంలో లీనమైపోయాడు.
      హైవే పక్కన టీకొట్టు దగ్గర ఆగింది కారు. వేడిగా రెండు కప్పులొచ్చాయి. మనసు మాటేమోగానీ, శరీరానికి కాస్త ఊరట.
      ‘‘సౌమ్య టీ తాగే స్టైల్‌ చూశావా, భలే ఉంటుంది. విచిత్రమైన శబ్దం చేస్తుంది’’ అన్నాడు టీ తాగుతూ. 
      ‘‘ఎప్పుడూ సౌమ్య పేరేనారా. ప్రపంచంలో ఇంకేం లేవా?’’ అస్తమానం అదే ధ్యాసలో ఉంటే ఏమైపోతాడో అనే భయం నాది.
      ‘‘మనసులో తన రూపం, మెదడులో ఆమె ఆలోచనలు, నాలికపై ఆ పేరు, వద్దన్నా అలా ఉండిపోయాయిరా. కొన్నాళ్లు ఇంతేనేమో. తర్వాత అన్నీ సర్దుకుంటాయిలే’ అన్నాడు ఖాళీ టీ కప్పుని పక్కన పెడుతూ.
      కారు మళ్లీ రోడ్డెక్కింది.
      ‘‘ఆమె మెడలో మరొకరు తాళి కడుతుంటే చూసి తట్టుకోగలవా?’’ గేరు మారుస్తూ అడిగాను.
      ‘‘జీవితాంతం మరొకరితో గడుపుతుంటే చూసి భరించాలి కదా. దానికి ఇది ప్రోమోలా ఉపయోగపడుతుందనుకో’’ అంటూ మళ్లీ అద్దాలు దించి బయటి ప్రపంచంలో లీనమైపోయాడు. బాధల నుంచి దూరంగా పారిపోవడం కన్నా వాటిని అలవాటు చేసుకోవడం నేర్చుకుంటున్నాడన్నమాట.
      విజయవాడ 60 కిలోమీటర్లు...
      ‘‘ఈ పెళ్లికి ఎందుకొచ్చావ్‌ అని అడిగితే?’’
      ‘‘అడగదు..’’
      ‘‘అడిగితే..’’ 
      ‘‘అడగదు’’
      ‘‘అదే.. ఎందుకు..?’’
      ‘‘వద్దన్నా పదే పదే ఇంటికొచ్చే బిచ్చగాణ్ని కూడా కొద్ది రోజులే చీదరించుకుంటార్రా. ఆ తరువాత వాడి మానాన వాణ్ని వదిలేస్తారు. ప్రేమికుడికి ఆమాత్రం గౌరవం ఇవ్వరా?’’ ఇప్పుడు వాడిలో వేదాంతి కూడా కనిపిస్తున్నాడు. 
      ‘‘ఎదురైందనుకో.. ఏం మాట్లాడతావ్‌?’’
      ‘‘నేనేమీ మాట్లాడను’’
      ‘‘మరి..’’
      ‘‘తనకు కాబోయే భర్తతో రెండు నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను’’
      ‘‘వ్వాట్‌..’’ నాకు తల గిర్రున తిరిగింది. కారుని రోడ్డు పక్కన ఆపాను.
      ‘‘పెళ్లికొడుకుతో మాట్లాడ్డం ఏంట్రా? నీకేమైనా మతిపోయిందా. అసలు నీ వాలకం ఎలా ఉందో చూసుకున్నావా? పీకల్దాకా తాగావ్‌. ఇలాంటి స్థితిలో పెళ్లికెళ్లడమే తప్పు. మళ్లీ పెళ్లికొడుకుతో మాట్లాడతావా? ఈ మత్తులో లేనిపోనివి వాగావంటే కొంపలంటుకుంటాయి’’ అన్నాను కోపంగా.
      ‘‘నువ్వనుకుంటున్నట్టు ఏమీ జరగదులేరా. నా మీద నమ్మకం లేదా? మండపం దగ్గరికి తీసుకెళ్లు, టైమ్‌ అవుతోంది’’ అభ్యర్థనగా అడిగాడు.
      సిద్దూ మాటల మీదకంటే, వాడి ప్రేమ పైన నమ్మకం ఉంది. అందుకే కారుని ముందుకు పోనిచ్చాను.
      సౌమ్య వెడ్స్‌ సుధీర్‌... రంగురంగుల అక్షరాలతో వెల్‌కమ్‌ బోర్డు మెరిసిపోతోంది.
      సౌమ్య వెడ్స్‌ సిద్దు అని చూడాలనుకున్నాను. మన చేతుల్లో ఏముంది? అంతా రాత.
      కెమెరా చేతిలోకి తీసుకుని నేమ్‌ బోర్డు వైపు జూమ్‌ చేసి క్లిక్‌మనిపించాడు. సౌమ్య వాడి పంచప్రాణాలైతే, కెమెరా ఆరోప్రాణం. ఇప్పుడు అదే వాడికి టైమ్‌పాస్‌. మండపంలోని ప్రతి అందమైన దృశ్యం వాడి కెమెరాలోకి వెళ్లిపోతోంది. పట్టుచీరలు, లాల్చీ పైజామాలు, సూటు బూట్లు - అతిథులతో పెళ్లిమండపం కళకళలాడుతోంది. ఒక చోట చిన్న పిల్లలంతా చేరి ఆడుకుంటున్నారు. వాళ్ల అల్లరిని కూడా కెమెరాలో బంధిస్తూ బిజీ అయిపోయాడు. ముహూర్తానికి ఇంకా సమయం ఉంది. పెళ్లి కూతురు, పెళ్లికొడుకు ఎవరి గదుల్లో వాళ్లున్నారు.
      దూరంగా తన గదిలోంచి సౌమ్య బయటికొస్తూ కనిపించింది. పెళ్లి చీరలో దేవతలా ఉంది. నాకంటే ముందు సౌమ్య అలికిడి సిద్దూకి చేరిపోయినట్టుంది. అలాగే చూస్తూ నిలబడిపోయాడు. ఇప్పుడు వాడి మనసు ఎన్నిరకాలుగా ఆలోచిస్తుంటుందో, లోలోపల ఎంత నరకయాతన పడుతున్నాడో!
      ‘‘మీరేంట్రా ఇక్కడ. ఇక్కడేం పని. ఎవడ్రమ్మన్నాడు’’ సౌమ్య అన్నయ్య, అతని కోపం చూస్తే మెడ పట్టుకుని బయటికి గెంటేలాగున్నాడు. 
      ‘‘సార్‌.. నా మాట కాస్త వినండి. మేమేమీ గొడవ చేయడానికి రాలేదు. ఒక్కసారి సౌమ్యని చూడాలంటే తీసుకొచ్చాను. ఎంత కామ్‌గా వచ్చామో అంతే కామ్‌గా వెళ్లిపోతాం. నాది పూచీ’’ ఏమనుకున్నాడో ఏమో కాస్త శాంతించి, పక్కకి వెళ్లిపోయాడు.
      అయితే ఈ గోల, గొడవ సిద్దూగాడికి పట్టినట్టు లేదు. ఏడుకొండలూ ఎక్కి గంటల కొద్దీ క్యూలో నిలబడ్డాక, వేంకటేశ్వరుడి దర్శన భాగ్యం కలిగినప్పుడు... ఆ కాసేపూ తదేకంగా ఆయన్నే చూస్తూ ఎలా లీనమైపోతామో అలా తన్మయత్వంతో మునిగిపోయాడు.  
      ‘‘సౌమ్యని చూడ్రా, ఎంత బాగుందో. ఆ కళ్లలో మెరుపు చూశావా. ఈ పెళ్లంటే తనకెంత ఇష్టమో ఆ కళ్లే చెబుతున్నాయి. నేనెప్పుడు ఎదురైనా ఆ మెరుపు ఉండేది కాదు’’ తన ప్రేమని తానే తగ్గించుకోవడం మొదలెట్టాడు.
      ‘‘సౌమ్యని చూశాం కదా. పెళ్లికొడుకుని చూసొద్దాం పద’’ అన్నాడు.
      ‘‘వద్దులేరా. ఏమైనా అనుకుంటాడేమో’’ అన్నాను భయంగా, ఇందాక సౌమ్య అన్నయ్య చేసిన గద్దింపు గుర్తొచ్చి. 
      ‘‘నేను వెళ్తున్నా. వస్తేరా, లేకపోతే లేదు’’ అంటూ పెళ్లికొడుకు గదిని వెతుక్కుంటూ కదిలాడు.
      అతనితో ఏం మాట్లాడతాడో ఏమో అనుకుంటూ నేనూ వాణ్ని అనుసరించాను. 
      అదృష్టం బాగుంది. పెళ్లికొడుకు తన గదిలో ఒక్కడే ఉన్నాడు. కిటికీ తలుపులు తీసి, దమ్ములాగుతున్నాడు. 
      ‘‘ఎక్స్‌క్యూజ్‌ మీ..’’ అన్నాడు సిద్దూ.
      ‘‘హా...’’ అంటూ సిగరెట్‌ని సగంలోనే ఆర్పేసి, బయటికి విసిరేశాడు సుధీర్‌.
      ‘‘అయామ్‌ సిద్దూ..’’ పరిచయం చేసుకున్నాడు.
      ‘‘సౌమ్య ఫ్రెండ్సా...’’ షేక్‌హ్యాండ్‌ ఇస్తూ అడిగాడు.
      ‘‘కాదు..’’ మామూలుగానే అన్నాడు.
      ‘‘ఫొటోగ్రాఫర్లా..’’ చేతిలో కెమెరా చూసి అడిగాడు.
      ‘‘కాదు..’’
      ‘‘మరి..’’
      ‘‘నేను సౌమ్య లవర్‌ని..’’ బాంబు పేల్చేశాడు. నేను భయపడ్డట్టే జరుగుతోందనిపిస్తోంది. 
      ‘నువ్వు ఏదేదో వాగి రచ్చ చేసేలా ఉన్నావు’ వాడి చెవిలో రహస్యంగా చెప్పాలనుకున్నా, ఆ ఆందోళనలో మాటలు బయటికే వచ్చేస్తున్నాయి. ‘‘అబద్ధం ఏమీ కాదుకదా. నేను సౌమ్య లవర్‌ని’’ ఇంకొంచెం గట్టిగానే అన్నాడు.
      ‘‘వ్వాట్‌..’’ ఈసారి నిజంగానే అదిరిపడ్డాడు సుధీర్‌.
      ‘‘కంగారుపడకు బ్రదర్‌. వీడు నిజంగానే సౌమ్యని ఇష్టపడ్డాడు. కానీ తను వీణ్ని పట్టించుకోలేదు. అసలు మేం ఈ పెళ్లికి వచ్చామన్న సంగతి కూడా ఆమెకి తెలీదు. చెప్పాలంటే, మమ్మల్ని అసలు ఈ పెళ్లికే పిలవలేదు. ఒక్కసారి మీ ఇద్దరినీ చూడాలనిపిస్తే నేనే తీసుకొచ్చాను..’’ నేను అన్నీ చెప్పేస్తున్నాను.
      అతను కూడా ఒకసారి జాలిగా చూశాడు సిద్దూ వైపు.
      ‘‘కంగ్రాట్స్‌. హ్యాపీ మారీడ్‌ లైఫ్‌..’’ అంటూ సుధీర్‌ని హగ్‌ చేసుకున్నాడు. ఆ హగ్‌లో సౌమ్యపై సిద్దూకు ఉన్న ప్రేమ సుధీర్‌కి అర్థమయ్యి ఉంటుంది. లేదంటే తను సిద్దూ ప్లేసులో ఉండి ఆలోచించడం మొదలుపెట్టి ఉంటాడు. ఎందుకంటే సుధీర్‌ మొహంలో ఇందాక చూసిన కోపం లేదు.
      ‘‘ఎనీవే, భోంచేసి వెళ్లండి’’ అన్నాడు నింపాదిగా. ఇద్దరం బయల్దేరబోయాం.
మధ్యలో ఏం గుర్తొచ్చిందో.. మళ్లీ సుధీర్‌ దగ్గరికి వెళ్లాడు సిద్దూ.
      ‘‘సౌమ్యకు కాబోయే భర్త ఎలా ఉంటాడో అనిపించి ఇంతదూరం వచ్చాను. ఫర్లేదు బాగనే ఉన్నావ్‌. సౌమ్యని జాగ్రత్తగా చూసుకో..’’ ఓ అన్నలా, నాన్నలా బాధ్యత గుర్తుచేస్తున్నట్టు కొనసాగిస్తున్నాడు సిద్దూ.
      ‘‘చూడు బ్రదర్, పరుగుపందెంలో గెలిచినవాడి చేతిలో కప్పు ఉంటుంది. దాన్ని వాడు ఇంటికి తీసుకెళ్లి భద్రంగా షోకేసులో దాచుకుంటాడు. రెండ్రోజుల తర్వాత దాని మీద ధ్యాస తగ్గుతుంది. కొన్నాళ్లకు మర్చిపోతాడు. కానీ ఓడిపోయినవాడికి ఆ కప్పు ఎందుకు మిస్సయ్యానా అని ప్రతిక్షణం అనిపిస్తూనే ఉంటుంది. ప్రేమ కూడా అంతే. గెలిచినవాడి కంటే ఓడిపోయినవాడికే దాని విలువ ఎక్కువ తెలుస్తుంది. సౌమ్య ప్రేమ పొందడంలో నువ్వు గెలిచావు. నేను ఓడాను. గెలిచానని సంబరపడి నిర్లక్ష్యం చెయ్యకు ప్లీజ్‌’’ చివరి మాటగా చెప్పేసి ఆ గదిలోంచి, ఆ మండపంలోంచి, ఆ అమ్మాయి జీవితంలోంచి పూర్తిగా బయటికొచ్చేశాడు సిద్దు.
      హైదరాబాదు 180 కిలోమీటర్లు... బోర్డు కనిపిస్తోంది.
      ఈసారి వర్షం మరింత జోరుగా కురుస్తోంది. ఇళయరాజా పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. 
      ఈ సారి నా చేతిలో బాటిల్‌... వాడి చేతిలో స్టీరింగ్‌. 
      ‘‘నీ గురించి తలచుకుంటుంటే బెంగగా ఉందిరా..’’ అన్నాను ఓ గుటక వేస్తూ.
      ‘‘నాకేమైందిరా?’’ ఆశ్చర్యంగా అడిగాడు.
      ‘‘నీకంటూ ఓ జీవితం ఉంది కదా. సౌమ్యనే తలచుకుంటూ నువ్వేమైపోతావో అని...’’
      ‘‘ఇందాక చెప్పాకదా. పరుగు పందెం థియరీ. పందెంలో గెలిచినవాడు ఇక చాల్లే అని సంతృప్తి పడిపోతాడేమో. ఓడిపోయినవాడికి ఎప్పుడూ ఇంకో రేసు ఉంటుందిరా. నిజమైన ఆటగాడెప్పుడూ ఓటమితో ఆట ఆపడు. గెలిచేంత వరకూ పోరాడుతూనే ఉంటాడు. ప్రేమ కూడా అంతే. ఓడిపోయిన చోటే వెతుక్కోవడం ప్రేమకి కూడా అలవాటు చేయాలి. పరుగు పందేనికి మరో రేసు ఉన్నట్టే, నాదంటూ ఎక్కడో ఓ చోట ఓ ప్రేమకథ ఉండే ఉంటుంది. దాన్ని వెతుక్కుంటూ ప్రయాణం చేస్తాను. ప్రయాణమైనా, ప్రేమైనా, జీవితమైనా ముందుకు సాగుతుంటేనే అర్థం. బలవంతంగా ఆపేస్తే దానికి విలువలేనట్టే..’’ అసలు సిసలైన జీవిత సత్యం చెప్పేశాడు. 
      కారు ముందుకు వెళ్తోంది... చీకట్లని చీల్చుకుంటూ.. మరో మజిలీని వెతుక్కుంటూ...

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam