ఏ... డార్లింగ్‌!

  • 691 Views
  • 59Likes
  • Like
  • Article Share

    వీరా కోగటం

  • హైదరాబాదు
  • 7013656275
వీరా కోగటం

పెద్దలు వారి ప్రేమని కాదన్నారు. ఆ ఇద్దరూ 
మరణంలోనైనా ఒక్కటవ్వాలనుకున్నారు!
ఉరితాళ్లు వారి మెడలకు బిగుసుకున్నాయి!
అంతలోనే అనుకోని సంఘటన!

ప్రేమను బతికించుకోవడానికి అన్ని దారులూ మూసుకుపోయాక... ప్రేమికులిద్దరూ చావడానికి ఆ గది తలుపులు తెరిచారు. గదిలో నిశ్శబ్దమంతా ఒక్కటై వారికి స్వాగతం పలికింది. పవన్, మాధవి ఇద్దరూ లోపలికి అడుగులు వేశారు.
      చేతిలోని కవర్లు బెడ్‌పై పెట్టాడు పవన్‌. మాధవి అలా మంచం మీద కూలబడింది. పవన్‌ వెళ్లి కిటికీ తెరిచాడు. సాయంత్రం చీకట్లను పక్కకు తోస్తూ.. వీధిలైట్ల వెలుతురు లోపలికి దూసుకొచ్చింది.
      ‘‘వద్దు.. కిటికీ మూసెయ్‌’’ అంది మాధవి.
      తెరిచిన కిటికీని వారగా వేశాడు పవన్‌.

* * *

      అది కర్నూలు బస్టాండుకు దగ్గరగా ఉన్న శకుంతలా లాడ్జీ. ఒకటో అంతస్తులో నూట అయిదో రూం.
      ‘‘ఏమన్నా కావాలా?’’ అంటూ వచ్చాడు హోటల్‌ బాయ్‌. మాధవి సర్దుకుని కూర్చుంది. ‘‘ఏమొద్దు అవసరమైతే పిలుస్తా’’ అని అతనికి చెప్పి గది తలుపులు వేసి, గడియ పెట్టాడు పవన్‌.
      ‘మేమిద్దరం ఇక వేరే మనిషిని చూడటం ఇదే ఆఖరు’ అనుకున్నాడు పవన్‌. కన్నీళ్లు రాలుతున్న శబ్దం.. అతని గుండెకు వినిపించింది. 
      ‘‘మాధవీ... ఎందుకు ఏడుస్తున్నావ్‌? మన ప్రేమను కాదన్నందుకు, మన పెళ్లికి ఒప్పుకోనందుకు రేపు అందరూ ఏడుస్తారు’’ అంటూ మాధవి తలను తన గుండెలకు హత్తుకున్నాడు.
      మాధవి.. పవన్‌ నడుమును చుట్టుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. పెదవులు అదురుతున్నాయి. మాట్లాడటానికి ఏదో తెలియని భయం గొంతులో అడ్డుపడుతోంది.
      ఈ సారి కడుపులోంచి ఏడుపు బయటికి తన్నుకొచ్చింది. కొద్దిసేపు మాధవి బాధకు పవన్‌ తోడయ్యాడు.
      పది నిమిషాల పాటు గదిలో వేలాడేసిన గడియారం ముల్లు దుఃఖాన్ని మోసుకొని భారంగా కదిలింది.
      నిశ్శబ్దాన్ని తరిమేసి.. ఆవేదన ఆ గదిని ఆక్రమించింది.

* * *

      వెంట తెచ్చిన ప్యాకెట్లను పవన్‌ విప్పాడు.
      ‘‘అదేంది వెజ్‌పలావ్‌ తెచ్చావ్‌?’’ అని మాధవి ప్రశ్నార్థకంగా చూసింది.
      ‘‘నీకు ఇష్టమని...!’’ పవన్‌ ముఖంలో చిన్న నవ్వు.
      ఆ నవ్వు ఎందుకో.. మాధవికి అర్థమైంది.
      వాళ్లిద్దరూ మొదటిసారి కలుసుకున్నది వెజ్‌ బిర్యానీ వల్లే. టెన్త్‌క్లాస్‌ పరీక్షలయ్యాక.. ఊరికి పోవడానికి విద్యార్థులంతా బస్టాండుకొచ్చారు. పవన్‌ స్నేహితులతో కలిసి టిఫిన్‌ చేద్దామని వెళ్లాడు. వెజ్‌ పలావ్‌కు టోకెన్‌ కొన్నాడు. వెజ్‌పలావ్‌ ఒక్కటే ఉన్న విషయం తెలియక.. కౌంటర్లో ఉన్న వ్యక్తి మాధవికీ టోకెన్‌ ఇచ్చాడు. తీరా సర్వ్‌ చేసే పాయింట్‌ దగ్గరికొచ్చాక లేదని తెలిసింది.
      ‘‘వెజ్‌ పలావ్‌ లేకపోతే... నాకు ఇంకేమొద్దు’’ అని మాధవి ముఖం ముడుచుకుంది. తన మిత్రబృందమంతా  ఆలోచనలో పడింది.
      అప్పుడు పవన్‌ తన ప్లేటును మాధవికి ఇవ్వబోయాడు.
      మాధవి వద్దంది.
      ‘‘నేను వెజ్‌ పలావ్‌ కాకపోతే మసాలా దోసె తింటా... నువ్వు అలా కాదు కదా!’’ అని చిన్న నవ్వు నవ్వాడు. అప్పుడు అతని ముఖంలో ఎంత కాంతో. ఇప్పుడూ వెజ్‌ పలావ్‌ మాధవికి అందిస్తున్నాడు. కానీ అతని ముఖంలో అంత కాంతి లేదు.
      మాధవి తలవంచుకుని తీసుకుంది. 
      మొదటి ముద్దను పవన్‌కి తినిపించింది.
      ‘‘పెళ్లయ్యాక... నువ్వు ప్రతి పూటా మొదటి ముద్ద నాకే పెట్టాలి’’ అని మాధవి ఒళ్లో తలవాల్చి అన్నప్పటి మాటలు పవన్‌ గుండెలో చప్పుడుచేశాయి. 
      చేతుల్లోని ముద్దలు కన్నీళ్లతో తడిసిపోతున్నాయి. కన్నీళ్లు తుడుచుకున్నారు. ఇద్దరూ ఒకర్ని చూసి ఒకరు నవ్వుకున్నారు. ఎవరి ముద్దలు వాళ్లు తినలేదు. అన్ని ముద్దలు ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. కవర్లు అన్నీ కట్టి మూలన ఉన్న డస్ట్‌బిన్‌లో వేశారు. కూల్‌డ్రింక్‌ సీసా తీశాడు. 
      తను కొంచెం తాగి... మాధవికి అందించాడు. తను కొంచెం తాగింది. ‘‘ఐ లవ్‌ యూ’’ అన్నాడు పవన్‌. ‘ఐ టూ రా’ అంది మాధవి. గట్టిగా కౌగిలించుకున్నారు.
      ఆ కౌగిలిలో మాధవికి ఆనందం లేదు... బాధ ఉంది. ‘‘మళ్లీ పవన్‌గాడితో కనిపిస్తే చంపేస్తాన’’ని బెదిరించిన నాన్నపై కోపం ఉంది. ‘‘తక్కువ కులమోణ్ని ఎలా పెళ్లి చేసుకుంటావే?’’ అని అరచిన అమ్మపై ఉక్రోషం ఉంది.
      ఆ కౌగిలిలో పవన్‌కు సంతోషం లేదు. పెద్దల్ని ఒప్పించే శక్తి లేక, తనను విడిచి బతకలేక.. ప్రియురాలినీ చంపేస్తున్న చేతకానితనం ఉంది. పవన్‌ ఠక్కున తనకు దూరంగా కదిలాడు.
      తెచ్చుకున్న ఒక తాడును ఫ్యాన్‌కు వేశాడు. గట్టిగా బిగించాడు. మరో తాడును గదిలో సీలింగ్‌కు ఉన్న కొక్కేనికి తగిలించాడు.
      ఇద్దరూ పైకెక్కారు. మెడలకు తాళ్లు తగిలించుకున్నారు. బాధ కొంచెమున్నప్పుడే కన్నీళ్లు వస్తాయి. బాధ బాగా పెరిగిపోతే కన్నీళ్ల స్థానంలో కసి మొలుస్తుంది.
      బాధ కసిగా మారింది. ఇప్పుడు ఇద్దరి కళ్లలో శూన్యం. ఉరి బిగించుకున్నారు. ఇద్దరూ ఒకేసారి స్టూల్‌ తన్నేశారు.
      తాము ప్రేమలో గడిపిన ఈ మూడేళ్లు ఒక్క సెకనులోనే కనిపించాయి.
      శరీరం గిలాగిలా కొట్టుకుంటోంది. కళ్లు తల నుంచి ఊడిపోతాయా? అన్నట్లు అయిపోతోంది.
      రక్తం ప్రవహించడం మానేస్తోంది. గుండె కొట్టుకోవడం లేదని తెలుస్తోంది. ఊపిరి ఆగిపోవడానికి... తీసుకోవడానికి మధ్య రెండు ప్రాణాలు కొట్టుకుంటున్నాయి.
      ఉన్నట్టుండి ఒక తాడు తెగిపోయింది. మాధవి కిందపడింది.
      పవన్‌ చివరిసారిగా మాధవి కింద పడటం చూశాడు. ఇక తన కళ్లకు ఏమీ కన్పించలేదు.
      తనకు ఇప్పుడు ఏ నొప్పి, ఏ బాధ తెలియడం లేదు. ఊపిరిని తనలో కలుపుకొన్న గాలి... కొంచెం బరువెక్కింది.
      కింద పడిన మాధవి తేరుకుంది. పవన్‌ని చూసింది. ఏడుపు తన్నుకొచ్చింది. తలను చేతులతో కొట్టుకొంది. బాయ్‌ పరిగెత్తుకుంటా వచ్చి గది తలుపు బాదుతున్నాడు. మాధవికి చేతులూ, కాళ్లూ ఆడలేదు. ఎలాగో లేచి వెళ్లి... తలుపు గడియ తీసింది. బాయ్‌ వచ్చాడు. గట్టిగా అరచి ఇంకో బాయ్‌ని పిలిచాడు. ఇద్దరూ కలిసి పవన్‌ను కిందకి దించారు. మాధవి ఏడుపు లాడ్జీకే కాదు... రోడ్డుకూ వినిపించింది. జనం గుమిగూడారు.
      హోటల్‌ బాయ్‌ సాయంతో పవన్‌ని ఆటోలో పెద్దాసుపత్రికి తీసుకుపోయింది. ఎమర్జెన్సీ వార్డు... కిటకిటలాడుతోంది. అన్ని పడకల చుట్టూ.. ఏడుపులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు. స్ట్రెచర్‌ మీద పవన్‌ చేయిని మాధవి గట్టిగా పట్టుకునే ఉంది. తన గుండె కొట్టుకుంటోందనే విషయం కూడా తనకు తెలియనంత అగాధంలో మునిగిపోయింది. హోటల్‌ బాయ్‌ డాక్టర్ని పిలుచుకుని వచ్చాడు.
      ‘‘ముందు మీరు బయటికి వెళ్లండ’’ని కసురుకున్నాడు.
      బాయ్‌... మాధవిని బయటికి తీసుకొచ్చాడు. నర్సులు, ట్రైనీ డాక్టర్లు, పెద్ద డాక్టర్‌ మొత్తం పది నిమిషాలు ఏదో చేశారు.
      పవన్‌ ముఖం మీద కొట్టారు. గుండె మీద తట్టారు. చెయ్యిపట్టుకుని చూశారు.
      కొద్దిసేపటికి డాక్టర్‌ బయటికొచ్చాడు.
      గోడకు కూలబడి, తలపట్టుకుని ఏడుస్తున్న మాధవి డాక్టర్‌ వైపు ఆశగా చూసింది.
      డాక్టర్‌ ఏదో చీటీ తన చేతిలో పెట్టాడు. మాధవి చీటీ తెరిచింది.

* * *

      ‘ఏ... డార్లింగ్‌!’ అంటూ నీ వెంట పడ్డాను. నువ్వు వద్దన్నా వినకుండా ప్రేమించాను. తీరా నువ్వు ప్రేమించాక... టైమంతా వేస్ట్‌ చేశా. ఏదో ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మీ ఇంట్లో ఒప్పిస్తానని నన్ను ఊరడించావు. నువ్వు నవ్వుతుంటే చాలే... నేను ప్రపంచాన్నే జయిస్తానని చెప్పా. ప్రపంచాన్ని కాదు కదా! మీ ఇంట్లో వాళ్ల మనసూ జయించలేకపోయా! నేను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే నీకు పెళ్లి కుదిర్చారు. మీ ఇంట్లో వాళ్ల కాళ్లు పట్టుకున్నా.. ఒప్పుకోలేదు. నా ప్రేమను.. నా కులం ఓడించింది. నా చేతకాని తనాన్ని అదే రెండింతలు చేసింది.
      కలిసి బతకలేకపోతున్నాం... కలిసి చద్దామని అని నేనంటే నువ్వు ఒప్పుకుని నా వెంట నడిచావు. నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమైంది. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన నీకు నేను చావునా ఇస్తోంది? ఎప్పుడూ నీ నవ్వునే కోరుకునే నేను... నీ చావును ఎలా చూడగలను? అందుకే నీ ఉరికి తాడును కావాలనే లూజుగా కట్టాను. నన్ను క్షమించు!
      ఐ లవ్‌ యూ...

* * *

      మాధవి గుండెలో బద్దలైన అగ్నిపర్వతం... కులాన్ని తగలబెట్టాలని గట్టిగా మొత్తుకుంటోంది.

* * *

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam