నేల విడిచి సాము

  • 297 Views
  • 5Likes
  • Like
  • Article Share

    ఎం.బిందుమాధవి

  • bindumadhavi.madduri@icloud.com

తల్లిదండ్రులకి పిల్లల గురించి చాలా కలలుంటాయి. వాటిని, సాకారం చెయ్యడానికి మోయలేని భారాన్ని భుజాన వేసుకుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఆ భారం భరించరానిదిగా మారితే? ఇక్కడ ప్రవీణ్‌ది అదే పరిస్థితి! 
ఆ రోజు
ప్రవీణ్‌ కొడుకు అభినవ్‌ కాలేజీ అడ్మిషన్‌ తేలే రోజు.
      అభినవ్‌ మెడిసిన్‌ చదవాలనేది ప్రవీణ్‌ గాఢమైన కోరిక. ఒక్కగానొక్క కొడుకు! తాహతుకి మించి శిక్షణిప్పించాడు. అభినవ్‌ కూడా కష్టపడి చదివాడు. అయితే, ప్రభుత్వ కాలేజీలో చేరడానికి అవసరమైన ర్యాంక్‌ మాత్రం రాలేదు.
      అభినవ్‌ స్వతహాగా అంతగా తెలివైనవాడేమీ కాదు.
      తమ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఈ రోజుల్లో తల్లిదండ్రులు లేనిపోని తాపత్రయాలు పడుతున్నట్టే... ప్రైవేటు కాలేజీలో బోలెడంత డబ్బుకట్టి కొడుకుని చేర్చడానికి సిద్ధమైపోయాడు ప్రవీణ్‌.
      అయితే, ప్రవీణ్‌ పెద్ద ఉద్యోగస్థుడేమీ కాదు. దానికి కనీసం పెన్షన్‌ వచ్చే అవకాశం కూడా లేదు. అతని భార్య కూడా ఉద్యోగస్థురాలు కాదు. ఒంటి చేతి సంపాదన. అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు, మంచాన పడ్డ ముసలి తల్లిదండ్రులు లాంటి బాధ్యతలు లేకపోయినా తనకొచ్చే జీతంతో నగరంలో నలుగురు మనుషులున్న కుటుంబం నడపడం అంత తేలికేం కాదు.
      కొడుకు కాలేజీ చదువుకొచ్చేసరికి ప్రవీణ్‌కి యాభై ఏళ్లు వచ్చేశాయి. వయసుతో పాటు వచ్చే స్నేహితులు బీపీ, షుగర్, థైరాయిడ్‌ లాంటివి ఒంట్లో తిష్ఠ వేసుకుని కూర్చున్నాయి. ఇంటి ఖర్చులు, మందులు, ఇల్లు, వాహన లోన్లకి బొటాబొటిగా సరిపోయే సంపాదన. తనలాగా కొడుకు కూడా చాలీచాలని బతుకు బతక్కూడదని, తాహతుకి మించి డొనేషన్‌ కట్టి మెడిసిన్‌లో చేర్చడానికి సిద్ధపడిపోయాడు.
      ‘‘ఏరా, డబ్బు ఎక్కడ నుంచి ఏర్పాటు చేద్దామనుకుంటున్నావు? ఏదో ఒకసారి కడితే సరిపోదు కదా! ఏటా లక్షలు కట్టాలి’’ ప్రవీణ్‌ని అడిగింది తల్లి. 
      ‘‘ఏంబీబీఎస్‌ అయితే, అక్కడితో సరిపోదు. ఆ తర్వాత ఎండీ, డీఎం... మళ్లీ కోచింగ్‌లు, తడిసి మోపెడవుతుంది. మెడిసిన్‌ అంటేనే సుదీర్ఘ ప్రయాణం! వాడి చదువు పూర్తయ్యేసరికి నువ్వు రిటైర్‌ అవుతావు. కృష్ణా - రామా అంటూ కాలు మీద కాలేసుకుని కూర్చునే పరిస్థితి ఉండదు. ఈ అప్పులు తీర్చాలి. ఇంకోసారి ఆలోచించు’’ జీవితాన్ని కాచి వడబోసిన అనుభవంతో చెప్పింది తల్లి మహాలక్ష్మి. 
      ‘‘ఏం ఫరవాలేదమ్మా. రేపు సంపాదన మొదలైతే, వాడే తీర్చుకుంటాడు అప్పులన్నీ’’ అని బ్యాంక్‌లో లోన్‌ తీసుకుని కొడుకుని కాలేజీలో చేర్పించాడు ప్రవీణ్‌. 
      ఒక రోజు ఆఫీస్‌ నుంచి వస్తున్న ప్రవీణ్‌కి ప్రమాదం జరిగి కాలు విరిగింది. రెండు చోట్ల స్టీల్‌ రాడ్లు వేశారు. 
      డయాబెటిస్‌ ఉండటం వల్ల అది సరిగా అతక్క రెండు సార్లు సర్జరీ చెయ్యాల్సి వచ్చింది. అయినా సరిగా నయం కాక కాలు కొంత భాగం తీసెయ్యాల్సి వచ్చింది. అప్పటికి అభినవ్‌ చదువు మూడేళ్లు పూర్తయింది.
      ప్రమాదం తర్వాత ప్రవీణ్‌ రెండు మూడు నెలలు సెలవు పెట్టాల్సి వచ్చింది. కాలు కూడా తీసెయ్యడంతో, యాజమాన్యం టెర్మినల్‌ బెనిఫిట్స్‌ చేతిలో పెట్టి ముందుగానే రిటైర్‌ చేసేసింది.
      జరిగిన దానితో కొడుకు చదువుకి ఆటంకం ఏర్పడుతుందేమోనని ప్రవీణ్‌ బాగా కుంగిపోయాడు. ధైర్యం తెచ్చుకుని ఇంటి దగ్గరే ఉండి పదిరూపాయలు కళ్ల చూసే వ్యాపారం ఏదైనా ఉందేమోనని ఆలోచిస్తున్నాడు.
      అంతలో ఆరోగ్యం సరిలేక భార్య నీలిమని ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రెస్ట్‌ క్యాన్సరని తెలిసింది.
      అదింకా ప్రాథమిక దశలోనే ఉంది. మందులతో నయం చెయ్యొచ్చని డాక్టర్‌ చెప్పేసరికి ‘హమ్మయ్యా’ అని ఊపిరి తీసుకున్నాడే గానీ, మందులకి అదనంగా డబ్బు ఖర్చవుతుంది. తను సర్వీస్‌లో ఉంటే, ఆ ఖర్చు కంపెనీ భరించేది! ప్రవీణ్‌కి ఎటూ పాలుపోవడం లేదు. కన్నతల్లికి తన బాధ చెప్పుకుందామంటే ‘నేను ముందే చెప్పాను కదా’ అని అంటుందేమోనని బెరుకు. 
      ఎంతైనా తల్లి మనసు కదా! కాఫీ గ్లాస్‌ చేతిలో పెట్టి కొడుకు పక్కనే కూర్చుని ‘‘బెంగ పడకు నాన్నా! తప్పో ఒప్పో... పిల్లాణ్ని మంచి చదువులో చేర్చాలనుకున్నావు. నీ కొడుకు మంచి గురించి నువ్వు ఆలోచిస్తే, నా కొడుకు గురించి నేను ఆరాటపడకుండా ఉంటానా? పిల్లాడికి మూడేళ్ల చదువు పూర్తయింది. ఇంకో రెండేళ్లు కష్టపడ్డావంటే తర్వాత వాడు ఏదో ఒక ఆస్పత్రిలో చేరి ఓ ఏడాది కాస్త ఊపిరి తీసుకుని మళ్లీ పై చదువుకి తయారవుతాడులే’’ తన మనసులో ఉన్న ఆలోచన చెప్పింది.
      తల్లికొచ్చిన ఉపద్రవం గురించి కొడుక్కి తెలియకుండా ఇంట్లో జాగ్రత్తపడ్డారు. అయితే, సెలవులకి ఇంటికొచ్చిన అభినవ్, అమ్మ టేబుల్‌ మీద కొత్తగా కనిపిస్తున్న మందుల్ని పరిశీలిస్తే క్యాన్సర్‌ కోసమని తేలింది. 
      ఆదుర్దాగా తండ్రి దగ్గరికెళ్లి విషయం తెలుసుకుని, చాలా బాధపడ్డాడు.
      సెలవులవ్వగానే కాలేజీకి తిరిగెళ్లిన అభినవ్‌ ఇంటికి డబ్బు పంపడానికి పార్ట్‌ టైం ట్యూషన్స్‌ చెప్పటం మొదలుపెట్టాడు.
      రెండు పడవల్లో ప్రయాణం చేసే తెలివితేటలు మొదటి నుంచీ లేని అభినవ్‌కి ఆ సంవత్సరం పరీక్షల్లో ఒక సబ్జెక్ట్‌ మిగిలిపోయింది.
      బ్యాంక్‌ వాళ్లు, ప్రతి ఏటా పాస్‌ సర్టిఫికెట్‌ ఇస్తేనే, తర్వాతి ఏడాది ఫీజు లోను విడుదల చేస్తారు. ఫీజు ఎలా కట్టాలా అని మదనపడుతున్న ప్రవీణ్‌ని చూసి మహాలక్ష్మి తన పేరున భర్త బతికున్న రోజుల్లో ఊరిచివర కొన్న 150 గజాల స్థలం అమ్మి కడదాం అని అప్పటికి పరిష్కారం సూచించింది.
      ఉన్న అన్ని రకాల ఆర్థిక వనరులు హరించుకుపోయాయి. అభినవ్‌ చదువు అటూ ఇటూ లాగి ఏడేళ్లకి గానీ పూర్తవ్వలేదు. ఇంటా బయటా సమస్యలు, కుటుంబ అనారోగ్యం.. ఇవన్నీ చూసి తాను అనవసరంగా మెడిసిన్‌లో చేరానని అనుకున్నాడు అభినవ్‌. ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు నర్సింగ్‌ హోంలో ఉద్యోగానికి చేరాడు.
      యావరేజ్‌ అకడమిక్‌ రికార్డ్‌ ఉండి, వెంటనే పై చదువులకి వెళ్లడానికి కావాల్సిన మెరిట్‌ లేక, లక్షలకి లక్షలు డబ్బు పోసి సీటు కొనుక్కునే తాహతు లేనివారంటే ఎవరికైనా లోకువే! వారిని అతి తక్కువ జీతంతో ఎక్కువగా వాడుకోవచ్చు.
ఆ పనే చేశాడు ఆ నర్సింగ్‌ హోం ఓనర్‌ ఓం ప్రకాష్‌!
      నెలకి పదిహేనువేలు జీతం ఇచ్చి రోజుకి 12 నుంచి 15 గంటలు పనిచేయించుకునేవాడు. వచ్చిన రోగులకి అవసరం లేని టెస్టులన్నీ రాయమనేవాడు.
      అవన్నీ పక్క కాలనీలో తన కొడుకు పెట్టిన ల్యాబ్‌లోనే చేయించుకోవాలనే నిబంధన ఒకటి!
      ఒకసారి మామూలు జ్వరంతో ఒక రోగి వస్తే అతనికి కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్, ఆరునెల్ల యావరేజ్‌ షుగర్‌ రీడింగ్స్‌తో పాటు ఎమ్మారై, ఈసీజీ చేయించుకు రావాల్సిందిగా రాయమన్నాడు ఓంప్రకాష్‌.
      ‘‘అతనికొచ్చింది మామూలు జ్వరం! అవన్నీ అవసరం లేదు. అసలు బ్లడ్‌ టెస్టే అక్కర్లేదు’’ అన్నాడు అభినవ్‌. 
      ‘‘మీ జీతాలన్నీ ఎక్కడినించి వస్తాయయ్యా? నేనేమన్నా ధర్మసత్రం నడుపుతున్నా ననుకుంటున్నావా? నువ్విక్కడ పనిచేసి జీతం తీసుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి’’ అనేసరికి ఓంప్రకాష్‌ చెప్పిన టెస్టులు రాశాడు అభినవ్‌. 
      ఆ రోగి తర్వాతి రోజు రిపోర్టులతో వచ్చాడు. వాటి ప్రకారం షుగర్‌ వ్యాధికి వెంటనే ఇన్సులిన్‌ మొదలుపెట్టాలని అవసరమైన మందులు రాశాడు. 
      ‘‘నాకసలు డయాబెటిస్‌ లేదు సార్‌. ఆ ల్యాబ్‌ వాళ్లు ఎవరి రిపోర్టులు నాకిచ్చారో’’ ఆ రోగి ఒకటే గోల. ‘‘నాకొచ్చిన జ్వరానికి ఈ టెస్టులన్నీ అవసరమే లేదని మా కజిన్‌ చెప్పాడు. ఆ ల్యాబ్‌ వాళ్లు అయిదు వేల రూపాయలు తీసుకున్నారు. ఏం వైద్యం చేస్తున్నారు మీరు? మా వాళ్లు మీమీద, మీ ఆస్పత్రి మీదా ఫిర్యాదు ఇస్తామంటున్నారు’’ అతను గట్టిగా అరుస్తుంటే, అలాంటి అనుభవమే ఎదురైన మరో రోగి అతనితో గొంతు కలిపాడు. ‘‘ఆ ల్యాబ్‌ వాళ్లని రిపోర్టుల గురించి నేను కనుక్కుంటాను. ఆలోగా ఈ మందులు వాడండి’’ అంటూ నచ్చజెప్పి పంపాడు అభినవ్‌. 
      ఆ విషయాన్ని ఓంప్రకాష్‌తో చెబితే ‘‘పేషెంట్లని జాగ్రత్తగా మేనేజ్‌ చెయ్యలేనివాడివి మెడిసిన్‌ ఎందుకు చదివావు, మాలాంటి వాళ్లని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే! డొనేషన్లు కట్టి చదివే డాక్టర్లతో ఇవే తిప్పలు’’ అంటూ ఎగిరిపడ్డాడు. 
      ‘‘నీ వల్ల మా ఆస్పత్రి పరువు పోయేలా ఉంది. వచ్చే నెల నుంచి వేరే డాక్టర్ని చూసుకుంటాను. నువ్వు రావాల్సిన అవసరం లేదు’’ తన నిర్ణయం చెప్పేశాడు, అభినవ్‌కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. 
      ఉద్యోగం పోతే అభినవ్‌కి చాలా కష్టం. వేరే చోటైనా అదే పరిస్థితి. సొంతగా ప్రాక్టీస్‌ పెట్టుకుని, వృత్తికి ద్రోహం చెయ్యకుండా వైద్యం చెయ్యాలంటే తన కుటుంబ అవసరాలకి సరిపడా ఆదాయం రావడానికి కొంత సమయం పడుతుంది. 
      ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కునే స్థితిలో తను లేడు. సొంత ప్రాక్టీస్‌ కోసం అవసరమైన పరికరాలు, సామగ్రి కొనడానికీ, అద్దెకీ అవసరమైన పెట్టుబడీ అతని దగ్గర లేదు. తన అసహాయతకి తనమీద తనకే అసహ్యం వేసింది. 
      తన తండ్రి డొనేషన్‌ కట్టి, లోన్‌ తీసుకుని కాలేజీలో చేర్పించగానే ఏనుగెక్కినంత సంబరపడిపోయాడు. కానీ, తర్వాత కుటుంబ పరిస్థితుల్లో, ముఖ్యంగా ఆర్థికంగా వచ్చిన మార్పులు, అవి తన చదువుపై చూపించిన ప్రభావం... వీటన్నింటి వల్ల అతని జీవితం సుడిగాలిలో చిక్కిన నావలా తయారైంది. నలుగురిలోనూ తలెత్తుకుని ధీమాగా ‘నేను డాక్టర్ని... ఫలానా దానిలో స్పెషలిస్ట్‌ని’ అని చెప్పుకోలేని పరిస్థితి. అప్పట్లో తండ్రితో తన నాయనమ్మ చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. 
      ఇవన్నీ ఆలోచిస్తున్న అభినవ్‌కి, పక్కింటి ప్రసాద్‌ అంకుల్‌ పిలుపు వినిపించలేదు. ‘‘నువ్వు పనిచేసే ఆస్పత్రి గురించి పేపర్లో రాశారు. రోగులకి అవసరంలేని టెస్టులన్నీ రాసి వేలకి వేలు బిల్లు చేస్తున్నారని కడుపు మండిన వారెవరో ఫిర్యాదు ఇచ్చారట. పోలీసులు ఆ ఆస్పత్రిని సీజ్‌ చేశారు’’ అభినవ్‌ భుజం మీద చెయ్యేసి చెప్పాడు ప్రసాద్‌.
      ‘‘నువ్వు సరైన సమయంలోనే బయటపడ్డావు. లేకపోతే నీ పేరు కూడా పేపర్లో పడి పరువుపోయేది. అన్నీ మన మంచికేలే. నా స్నేహితుడొకడు కష్టపడి పనిచేసే నమ్మకమైన డాక్టర్‌ కోసం చూస్తున్నాడు. పెట్టుకున్న నర్సింగ్‌ హోం వదిలేసి అతని కొడుకు ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నాడట.       నేను నీ గురించి చెప్పగానే, ఒకసారి వచ్చి కలవమన్నాడు. ఒక తలుపు మూసుకుపోతే భగవంతుడు మరో తలుపు తెరుస్తాడని పెద్దలంటారు కదా. తయారవు, వెళ్లి మా ఫ్రెండ్‌ని కలిసొద్దాం’’ అన్నాడు ప్రసాద్‌. 
      ప్రవాహంలో దిక్కుతెలియకుండా కొట్టుకుపోతున్న వాడికి ఆసరా దొరికినట్టయింది అభినవ్‌కి. ఉత్సాహంగా బయలుదేరాడు కొత్త కాంతిని వెదుక్కుంటూ.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam