మయసభ

  • 361 Views
  • 2Likes
  • Like
  • Article Share

    తులసి బాలకృష్ణ

  • విశ్రాంత బ్యాంకు అధికారి, ఆంధ్రాబ్యాంకు
  • సికింద్రాబాదు.
  • 8790115544
తులసి బాలకృష్ణ

గౌరీనాథశాస్త్రి పేదరికంలో బతుకు నెట్టుకొస్తున్న మనిషి. అనూహ్యంగా ఓ భాగ్యరేఖ అతని ఇంటిముందు కనిపిస్తుంది.. సంసార చదరంగంలో కష్టాలన్నీ తీరే తరుణం వచ్చినట్లే అనుకున్నఆయన ఈర్ష్యాసూయల ఎత్తులముందు ఎలా నిలబడ్డాడు..?
ఇంటి ముందు
కారాగిన శబ్దానికి చదువుతున్న భారతం మీద దృష్టి సడలి, చూపుల్ని వీధి గుమ్మం బయటికి తిప్పాడు గౌరీనాథ శాస్త్రి. తళతళలాడిపోతూన్న ఓ ఖరీదైన కారు. అందులో పెళపెళలాడే గంజి పెట్టిన ఇస్త్రీ దుస్తుల్లో కొంతమంది పెద్ద మనుషులు.
      ‘ఎదురింటి చైనులు బాబాయిని ఏ సాహితీసభకో ముఖ్య అతిథిగానో, ప్రధాన ఉపన్యాసకుడిగానో ఆహ్వానించడానికి ఏదో సమాజంవాళ్లు వచ్చుంటారు’ అని లోలోనే అనుకుని, తిరిగి చదువుకోబోయిన గౌరీనాథశాస్త్రి, ఆ పెద్ద మనుషులు తన ఇంట్లోకే వస్తుండటం గమనించి, ఉలిక్కిపడ్డాడు. భారతాన్ని వ్యాస పీఠం మీద ఉంచి, తత్తరపాటుతో ఆదరాబాదరా లేచి, వాళ్లెవరో తెలియకపోవడంతో భ్రుకుటి ముడిచి, చేతులు జోడిస్తూ వాళ్ల వైపు నడిచాడు.
      అందరిలోకి ముందున్న పెద్దాయన వెనకనున్నవాళ్ల వైపు ‘వీరేనా?’ అన్నట్లుగా చూశాడు. అవునన్నట్లుగా వాళ్ల తలలు ఊగగానే, చేతులు జోడించి, ‘‘అయ్యా! శాస్త్రి గారూ! నమోన్నమః!’’ అన్నాడు వినయంగా, వెలుగుతున్న ముఖంతో. ‘‘మహేశ్వరార్పణం’’ అన్నాడు గౌరీనాథశాస్త్రి అయోమయం నుంచి తేరుకోలేకపోతూ. తన యాభై ఏళ్ల జీవితంలో ఎన్నడూ తన ఇంటిముందు తన కోసం కారు ఆగడం గాని, అంతటివారు తన ఇంట్లో అడుగుపెట్టడం గాని ఎరగడు మరి.
      వాళ్లు ఏదో చెప్పడానికి గొంతు సవరించుకుంటుంటే గబుక్కున స్పృహలోకి వచ్చి, నిస్సహాయతతో చుట్టూ చూసి, వాళ్లని కూర్చోబెట్టి మర్యాద చెయ్యడానికి తన ఇంట్లో కుర్చీలు లేనందుకు సిగ్గుపడి, తలవంచుకున్నాడు. పెద్దాయన ‘‘అయ్యా శాస్త్రిగారూ! మేం ఎన్నారై సూర్య గారి ‘శారదా సాహితీ సభ’ తరఫున వచ్చాం. త్వరగా వెళ్లిపోవాల్సి ఉంది కాబట్టి, మాకు మర్యాదలు చెయ్యడానికి మీరు ఇబ్బంది పడొద్దు! ముందస్తుగా ఓ గొప్ప కవి పండితుడిగా మీ గురించి మేము తెలుసుకోవడంలో ఆలస్యం జరిగినందుకు క్షమాపణలు అర్థిస్తున్నాం’’ అన్నాడు తల వంచి నమస్కరిస్తూ.
      ‘‘అయ్యో ఎంతమాట! పెద్దవారు మీరంతమాట అనకూడదు! అయినా నేనెంత- నా పాండిత్యం ఎంత?’’ వినయంగా ముడుచుకుపోయాడు శాస్త్రి.
      ‘‘సరే! విషయమేమిటంటే ప్రతి నెలా మా సభ తరఫున ఓ సాహిత్య కార్యక్రమం జరిపి, ఓ పండితుణ్ని సన్మానిస్తూ, ఏదో మా చేతనైన సాహిత్యసేవ చేస్తున్నాం. కార్యాన్ని మేం నిర్వహిస్తాం, ఖర్చంతా అమెరికాలో స్థిరపడిన మన తెలుగువాడు, సాహితీ ప్రియుడు సూర్యగారు భరిస్తారన్నమాట. ఈ ఇరవయ్యో తారీఖున మన కార్యక్రమం ఉంది. అదృష్టవశాత్తూ సూర్యగారు ఆ రోజున ఇండియాలో ఉంటున్నారు. మన సభకి వస్తారు కూడా. ఇక, మీ దగ్గరికి మేం వచ్చిన కారణమేమిటంటే ఈ కార్యక్రమంలో ఓ కవిగా, పండితుడిగా మిమ్మల్ని సన్మానించుకునే భాగ్యాన్ని  మాకు కలిగించాలని వేడుకోవటానికి..’’
      ‘‘అయ్య బాబోయ్‌ అంత మాటే! అయ్యా! మీ సభ గురించి విన్నాను. దేశంలోని మహామహా పండితుల్ని పిలిపించి సన్మానిస్తారని చెప్తారు. ఇప్పుడు నా బోటి చిన్న కవిగాణ్ని ఆ వేదిక మీదికి ఎక్కిస్తే, మీ సభ గౌరవం తగ్గించిన పాపం మూటకట్టుకున్న వాడినవుతాను. అయ్యా! మీ అభిమానానికి ధన్యవాదాలు. నన్నొదిలెయ్యండి’’ తల వంచి, వినమ్రంగా తిరస్కరించాడు శాస్త్రి.
      ‘‘మీరలా అంటే మమ్మల్నీ, కవి పండితుల స్థాయి నిర్ణయించడంలో మా జ్ఞానాన్నీ కించపరిచినట్లే. ఇంకేం మాట్లాడొద్దు! ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు. అంతే! కాదంటే మమ్మల్ని అవమానపరిచినట్లే! ఒక్క రెండు రోజుల్లో మీకు ఆహ్వానపత్రాలు అందుతాయి. సెలవు!’’ అన్న పెద్దమనిషితోబాటు, మిగిలినవాళ్లూ దణ్ణాలు పెట్టి, వెనుతిరిగారు. ఏం మాట్లాడలేక చూస్తూండిపోయాడు శాస్త్రి.
      నాలుగడుగులు వేశాక, మిగిలినవాళ్లని పంపించి, ఆ పెద్దాయన ఆగి, వెనక్కి వచ్చి, ఉండబట్టలేక చెప్పేస్తున్నాను. అసలు ముందు చెప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యపరిచి, ఆనందపెట్టాలనుకున్నాం. విషయమేమిటంటే సూర్యగారికి ఈ సభా కార్యక్రమాలు జరపించడంతోబాటు ఇంకో ఆనవాయితీ కూడా ఉంది. సంవత్సరానికోసారి ఇలా సన్మానిస్తున్న పండితుల్లో ఓ పేద పండితుడికి ముందు చెప్పకుండా ఓ లక్ష రూపాయలు సభాముఖంగా అప్పటికప్పుడు ప్రకటించి సమర్పించుకుని ఆనందిస్తాడాయన. క్షమించాలి. మీ ఆర్థిక పరిస్థితిని ఎత్తి చూపుతున్నామని మీరు తలచకూడదు. ఆ లక్షరూపాయల సంభావనకి మా తరఫున మిమ్మల్ని సిఫార్సు చేయడానికి నిశ్చయించాం. మా ఎన్నిక మీద ఆయనకి పూర్తి విశ్వాసం. కాబట్టి ఆ సభలో ఆయన చేతుల మీదుగా పేద స్థితిలో ఉన్న ఓ మహాపండితుడిగా మీకు సన్మానం, ఆ సంభావన సమర్పణ జరగుతుంది. మీరు కాదనకూడదు! అంతే! వస్తాం!’’ చర్రున వెనుతిరిగి, కారెక్కేశాడాయన.
సంభ్రమాశ్చర్యాలతో అవాక్కయి, నిలబడిపోయాడు గౌరీనాథశాస్త్రి.

* * *

      తమ ఇంటిపెద్దకి అంత పెద్ద సన్మానం జరగబోతున్నందుకూ, ముఖ్యంగా ఈ పేదరికంలో లక్షరూపాయలు పండిత పారితోషికంగా అందుతున్నందుకూ శాస్త్రి భార్య గాయత్రి, కొడుకు భరతశాస్త్రి, కూతురు జాహ్నవి మహదానందపడిపోయారు.
      ‘‘అప్పు తీర్చలేదని మన పాడి ఆవు రావుణ్నీ, లేగదూడనీ తోలుకుపోయాడు కదా ఆ సుబ్బరామయ్య. ఈ సన్మానం తర్వాత అప్పు మొత్తం వడ్డీతో సహా ఇచ్చేస్తానని చెప్పి, వాటిని తీసుకొచ్చేయండి. మనం తిన్నా తినకపోయినా అవి కళ్లెదుట ఉంటే, ఇల్లు కళగా ఉండి, కడుపు నిండినట్లుండేది. ఇప్పుడు అనకూడదు గాని అవిలేని ఇల్లు దినాల మైల కొంపలా ఉంది’’ అంది గాయత్రి గొంతు గద్గదికమవుతూండగా కొంగు నోటికి అడ్డం పెట్టుకుంటూ.
      ‘మంచి ఆలోచన’ అనిపించిన శాస్త్రి వెంటనే సుబ్బరామయ్య ఇంటికెళ్లి, సన్మానం అవగానే అప్పు వడ్డీతో సహా తీర్చేస్తానని తన యజ్ఞోపవీతం పట్టుకుని ప్రమాణం చేసి, రావుణ్నీ, దాని దూడని విడిపించి, ఇంటిముఖం పట్టాడు. రావుడు పట్టరాని ఆనందంతో కులుకుతూ నడుస్తూంటే, దూడ ఆపుకోలేని సంతోషంతో చంగనాలు పెడ్తోంది. వాటి ముఖాల్లో కూడా ‘మా ఇంటికి వెళ్తున్నాం’ అన్న భావనతో చెప్పలేనంత ఆనందం తాండవిస్తోంది.
      తమ ఇంటి మహాలక్ష్మి లాంటి రావుణ్నీ, దాని లేగదూడనీ చూస్తూనే శాస్త్రి కుటుంబం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయింది. ఆ ఇంట ఓ పెద్ద శుభకార్యం జరుగుతున్నంత ఆనందం వెల్లివిరిసింది. తల్లీబిడ్డల్ని ఆబగా కౌగిలించుకుని, ఆనంద బాష్పాలతో వాటిని అభిషేకించారు. తమ ఇంటిపెద్ద ఓ సమర్థుడైన వ్యక్తిగా అతని మీద గౌరవం పెరిగిపోయింది వాళ్ల మనసుల్లో.
      ఇంతలో ‘‘మావయ్య గారూ! తాతగారు మిమ్మల్ని ఓసారి వచ్చి పొమ్మన్నారు’’ అన్న పిలుపు. తలలు అటు తిరిగాయి. గుమ్మంలో చైనులుగారి మనవరాలు.
      ఉలిక్కిపడ్డ గౌరీనాథశాస్త్రి సంభ్రమాశ్చర్యాలతో చూశాడు ఆ అమ్మాయి వైపు. మిగిలిన కుటుంబ సభ్యులూ ఆశ్చర్యానికి గురయ్యారు. చైనులు గారిల్లు తమ ఇంటి ఎదుటిదే అయినా, ఆయన తమకి అతి దగ్గరి బంధువే అయినా, ఆయన తమని పలకరించి రెండు పుష్కరాల కాలం దాటిపోయింది. ఆయన మహా పండితుడు, జ్యోతిష్కుడు. అందులో సందేహం లేదు. ఆయనపట్ల తమకు అపారభక్తీ, గౌరవాలున్నాయి ఇప్పటికీ. బహుశా తమ బీదతనం కారణమేమో మరి తెలియదు. ఆయనింట తరచూ జరిగే శుభకార్యాలకి మొక్కుబడిగా మాత్రమే తమకు పిలుపు వస్తుంది. ఎప్పుడూ తమది ఆఖరిబంతి భోజనమే. అలాంటిది ఆయన తనని ఓసారి వచ్చి పొమ్మని కబురు పంపడమా?
      భార్య ముఖంలోకి చూశాడు శాస్త్రి.
      ‘‘త్వరగా వెళ్లండి. ఏ కళనున్నారో కబురంపారు. మీరీ వార్త కూడా చెబితే సంతోషిస్తారు’’ అంది గాయత్రి ఉత్సాహపరుస్తూ.
      ఆదరాబాదరా పంచె సర్దుకుని, భుజం మీద కండువా వేసుకుని, తన ఇంటి బయటికి వచ్చి, లంకంత ఎదురింటిలోకి అడుగుపెట్టాడు శాస్త్రి.
      ఉయ్యాలబల్ల మీద ఓ కాలు మడిచి ఇంకో కాలు కిందికి వేళ్లాడేసుకుని, మునివేళ్లతో నేలని తన్నుతూ, బొక్కి నోటి చిరునవ్వు సాయంతో చిన్నగా ఊగుతూన్న చైనులుగారు సాక్షాత్తూ సిద్ధివినాయకుడిలా కనిపించారు శాస్త్రి కంటికి. చేతులు జోడించి, రివ్వునపోయి, ఆయన పాదాలని కళ్లకి అద్దుకున్నాడు శాస్త్రి.
      ‘‘దీర్ఘాయుష్మాన్‌భవ!’’ అని దీవించి, పెదవులు బిగించి బెల్లించి చూస్తూ, ‘‘శభాష్‌ రా అబ్బాయ్‌! ప్రయోజకుడివయ్యావు’’ అన్నారాయన. చేతులు కట్టుకుని వినయంగా నిలుచున్నాడు శాస్త్రి.
      ‘‘పైకి వచ్చావు అదీ సంతోషం. పాండిత్యం అనేది మన వంశంలో నాతోనే అంతరించిపోకుండా ఓ కాపు కాయడానికి నువ్వున్నావు అనే ధైర్యాన్ని కలిగించావు నాకు. ఇక నేను పోయినా ఫర్వాలేదు’’
      ‘‘బాబాయ్‌ గారూ.. అంతమాట..’’
      ‘‘తప్పదు కదరా అబ్బాయ్‌! చిన్న వయసా నాది? ఎనభై ఏడేళ్లు! ఏమైనా సంతోషం. నీకు సన్మానం అని తెలిసింది. పోయినేడాది నాకు చేశారు ఆ సభవాళ్లు సన్మానం. అమెరికా కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు నీకు. మంచి గౌరవం ఇది నీకు. అయితే ఇంకా పైకి ఎదగడానికి ఒక్కటి మాత్రం గుర్తుంచుకో సుమా. నిన్ను ఈ సన్మానానికి సిఫార్సు చేసినవాళ్లని మాత్రం మర్చిపోకు’’
      ఒక్కసారిగా ఉలికిపాటుతో కూడిన స్ఫురణతో లోనుంచి ఆశ్చర్యం, ఆనందం తన్నుకొస్తూండగా ‘‘బాబాయ్‌ గారూ! వాళ్లకి మీరుగానీ నా పేరు..’’ అని శాస్త్రి అంటూండగా, పొంగుతూన్న ఛాతీతో, పెదవుల చాటు గుంభనపు నవ్వుతో, ‘‘అదంతా నీకెందుకూ? నువ్వు అర్హుడివి! అందులో శంకలేదు. ఇంకేవిటీ? లక్ష రూపాయల పండిత సంభావన కూడా నిన్ను వరిస్తుంది. కచ్చితంగా చెప్పగలను. సన్మానం రోజున సభకు వెళ్లేముందు నాకో మారు కనిపించు చాలు..’’ అన్నారు ఆయన. 
      ‘‘ఎంతమాట! మీ ఆశీర్వాదం తీసుకునే వెళ్తాను బాబాయ్‌’’ అని, ఆయన పాదాలకి మరోసారి నమస్కరించి, సెలవు తీసుకుని, సముద్ర కెరటంలా తిరుగు ముఖం పట్టాడు శాస్త్రి.

* * *

      సాహితీ ప్రియులతో విరిసిన తామరపూలతో నిండిన చెరువులా ఉంది సభ. ‘శారదా సాహితీ సభ’ వారు నిర్వహించే కార్యక్రమాలు మృష్టాన్న భోజనాల్లా ఉంటాయని రసిక జనమంతా సభా ప్రారంభ సమయానికి ముందే వచ్చి ఠణాయించి కూర్చున్నారు. కార్యకర్తలతో బాటు సభాసదులు కూడా దృష్టిని ప్రధాన ద్వారంవైపే నిలిపి ఉంచారు. సూర్యగారు కూడా వచ్చేశారు. ఇంక శాస్త్రిగారు రావడమే తరువాయి.
      సరిగ్గా సభా ప్రారంభానికి నిర్ణయించిన సమయానికి ఒక్క నిమిషం ముందు కార్లోంచి దిగాడు గౌరీనాథశాస్త్రి. అతనికి చచ్చేంత సిగ్గుగా ఉంది. సభవాళ్లు సన్మానం రోజున ఏదైనా వాహనమిచ్చి మనిషిని పంపిస్తామంటే వద్దని వారించిన తను ఇలా ఒంటి మీద కొత్త పంచె, కశ్మీరీ శాలువాతో ఇంత ఖరీదైన కారులో రావడం, అదీ సరిగ్గా వేళకి ఒక్క నిమిషం ముందు అందరూ తన కోసం ఆందోళనతో ఎదురు చూస్తూండగా రావడం తనకేమో అలవాటు లేని ఆపోశనగా ఉండి, ఉక్కిరి బిక్కిరి గానూ, చచ్చేంత సిగ్గుగానూ ఉంది. చైనులు బాబాయికి కోపమొచ్చినా, ప్రేమ వచ్చినా ఉపద్రవమే!
      వేద పండితుల మంత్రోచ్చారణతో, పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి, వేదిక మీదికి తీసుకుపోయారు కార్యకర్తలు శాస్త్రిని. అతను కారు దిగినప్పటి నుంచీ వేదిక మీదికి చేరే వరకూ నిలబడి ఉన్న సభికులు సముద్ర ఘోషతో కరతాళ ధ్వనులు చేస్తూనే ఉన్నారు.
      తనకు చూపించిన ఆసనంలో ముడుచుకుపోయి కూర్చున్నాడు శాస్త్రి.
      సభ ప్రారంభమైంది.
      అధ్యక్షుడి తొలి పలుకులూ, వేదిక మీదున్న పెద్దల ఉపన్యాసాలూ ముగిశాయి.
      ‘‘ఇప్పుడు కవిగారికి సన్మానం’’ అన్న ప్రకటన వింటూనే మరింత ముడుచుకుపోయాడు శాస్త్రి. కార్యకర్తలు వచ్చి, శాస్త్రి చేతులు పుచ్చుకుని వినమ్రంగా ప్రత్యేక ఆసనం దగ్గరికి నడిపించారు. సభకు శిరస్సు వంచి నమస్కరించాడు శాస్త్రి.
      కరతాళ ధ్వనులు మార్మోగిపోయాయి.
      ఉప్పొంగిన ఆనందంతో శాస్త్రి కళ్లలో చెమ్మ ఊరింది. ప్రత్యేక ఆసనంలో కూర్చోమన్నారు కార్యకర్తలు. కూర్చోవడానికి అతను బిడియపడుతుంటే సభాధ్యక్షుడు, ముఖ్య అతిథి కలిసి ‘‘మీరు కూర్చోవాలి’’ అంటూ బలవంతపెట్టి కూలేశారు ఆ కుర్చీలో. ముడుచుకుపోతూ సభాసదుల్లోని మొదటి పంక్తిలోని వారివైపు దృష్టిని సారించిన శాస్త్రి ఆనందంతో తుళ్లిపడ్డాడు. అక్కడ ఆశీర్వదిస్తూన్నట్లుగా అభయముద్రతో చైనులు బాబాయ్‌! తన సన్మానానికి చైనులు బాబాయంతటివాడు రావడమా? పరవశంగా ఆయనవైపు చేతులు జోడించాడు శాస్త్రి. లాలనగా నవ్వాడాయన.
      సన్మాన కార్యక్రమం ముగిసింది.
      ‘‘ఇప్పుడు కవిగారి ప్రతిస్పందన’’ అన్నాడు అధ్యక్షుడు మైకులో.
      ఒంటి మీదున్న పూలహారాలన్నింటినీ కార్యకర్తలు తీసి పక్కన పెట్టాక, రెట్టించిన ఉత్సాహంతో రసిక జన మనోరంజకంగా అద్భుతంగా ఉపన్యసించాడు శాస్త్రి. తను కవిత్వ పఠనం చేస్తున్నప్పుడు అందరితో బాటు ఆనందిస్తూ, చైనులు బాబాయ్‌ కూడా భేష్‌ అన్నట్లుగా శిరః కంపన చేస్తూంటే గంగా ప్రవాహంలా సాగిపోయింది ఉపన్యాసం.
      ఉపన్యాసం ముగిసింది. చప్పట్లతో సభ దద్దరిల్లిపోయింది. సూర్యగారు మైకు అందుకున్నారు. శాస్త్రి ఉపన్యాసంలోని చెణుకుల్నీ, కవిత్వంలోని ఘనతనీ తిరిగి సభకు గుర్తు చేస్తూ మాట్లాడుతున్నారు.
      ‘చివర్లో తనకు లక్ష రూపాయల సంభావనని ప్రకటిస్తారు ఆయన’ లోలోనే అనుకుని, వినయ విధేయతలతో, ధన్యవాదాలు తెలియజేస్తూ స్వీకరించడానికి సిద్ధమవుతున్నాడు శాస్త్రి.
కానీ.. అలా జరగలేదు. ఆయన ఉపన్యాసం, వందన సమర్పణ కూడా ముగిశాయి. వేదిక మీదున్న ఒక్కొక్కరే దిగి వెళ్లిపోతున్నారు. సూర్యగారు కూడా వేదిక దిగిపోయి, చైనులు గారికి పాదాభివందనం చేసి, చేతులు జోడించి ఆయనతో ఏదో వినయంగా మాట్లాడుతున్నారు. కార్యకర్తలు వేదిక మీది కుర్చీలూ, బల్లలూ సర్దేస్తున్నారు. దిగ్భ్రమకు లోనైన శాస్త్రి అలా శిలా ప్రతిమలా కూర్చునే ఉన్నాడు. తనని ఆరోజు ఈ సన్మానానికి ఆహ్వానించడానికి వచ్చిన పెద్ద మనిషి తన భుజం తట్టుతూ, కుదుపుతూంటే ఉలిక్కిపడి ఆయన కళ్లలోకి చూశాడు అయోమయంగా.
      ఆయన ‘‘అలాగే కూర్చుండి పోయారేమిటి శాస్త్రి గారూ? లేవండి. సభ అయిపోయింది’’ అని వెళ్లిపోబోయి ఆగి, కొంచెం బాధతో కూడిన చిన్న గొంతుతో ‘‘లక్ష రూపాయల పారితోషికం ముట్టలేదని మీకు లోలోన చాలా బాధగా ఉంది కదండీ. పాండిత్యం ఉంటే చాలదండీ కవి గారూ.. కొంచెం లౌక్యం కూడా అవసరం మీకు. ఓ పేద పండితుడికి ఆ లక్ష ఇస్తాడని చెప్పా మీకు. మీరేమో ధగధగలాడుతూన్న ఈ అరువు ఖరీదు బట్టలతో వచ్చారు. పైగా సరిగ్గా సభా ప్రారంభవేళకి దర్జాగా ఖరీదైన కారులో దిగితిరాయె. మీ పేదరికాన్ని ఆయన ఎలా అర్థం చేసుకుంటాడు చెప్పండి? ఏదేమైనా మీరే చేతులారా పాడుచేసుకున్నారు. అంతా మీ దురదృష్టం’’ అని వెళ్లిపోయాడు.
      శాస్త్రి మెదడు మొద్దు బారుతోంది..
      సూర్య భుజం మీద చనువుగా చెయ్యేసి, బయటికి నడుస్తూ గుమ్మం దగ్గర ఆగి, తన వైపు తిరిగి, అదోలా నవ్వుతూన్న చైనులు బాబాయి నవ్వులో ‘చూశావురా కుంకా నా దెబ్బ ఎలా ఉందో? కుర్ర కుంకవి.. లక్ష రూపాయలు కొట్టేద్దామనే? ‘‘మా ఇంటి బిడ్డకి అంత ఘన సన్మానం అంటే ఊరికే పంపిస్తామట్రా వెర్రి నాగన్నా.. నీ ఆనందం మా ఆనందం కాదూ’’ అంటూ ప్రేమగా కసిరి, కొత్త పంచె, శాలువా ఇచ్చి, నా కారులో దర్జాగా పంపించిందీ, ఇలా దెబ్బ తియ్యడానికే..’ అన్న భావాన్ని చదువుతూన్న గౌరీనాథశాస్త్రికి తను అందరి ముందూ నగ్నంగా నిలబడినట్లుగా అనిపిస్తోంది.
      తనను సన్మానానికి ఆహ్వానించిన ‘శారదా సాహితీ సభ’ని ‘మయసభ’గా మార్చెయ్య గలిగిన చైనులు బాబాయి అఖండ వికృత మేధాశక్తి ముందు తన పాండిత్యం వామనాకృతిని దాల్చి సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోతున్నట్లుగా అనిపిస్తోంది.
      ఖాళీ అయిన సభలోంచి బయటికి నడిచి కుటుంబసభ్యులు, రావుడు, దాని దూడ ‘ఇదా నీ నిర్వాకం?’ అన్నట్లుగా తనవైపే ఉక్రోషంగా చూస్తూన్నట్లు అనిపిస్తూండగా ‘పండిన పాండిత్యం పదిమందికి మేలు చేయాలి గాని, ఇలా ఈర్ష్యాసూయలకి పాదులు కట్టి ప్రాణం పోయడానికా?’ అని బాధపడ్తూ, కన్నీళ్లని చెలియలికట్ట దాటకుండా రెప్పల చాటున బిగపట్టి కాళ్లీడ్చుకుంటూ ఇంటిముఖం పట్టాడు గౌరీనాథ శాస్త్రి.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam