విశ్వామిత్రుడు

  • 530 Views
  • 1Likes
  • Like
  • Article Share

    కడయింటి కృష్ణమూర్తి

  • విశ్రాంత ఏఈ, ఎలక్ట్రిసిటీ
  • గోవా
  • 9422846926
కడయింటి కృష్ణమూర్తి

రెండు కుటుంబాలు... రెండు కథనాలు... కానీ అంతఃసందేశం ఒక్కటే! అదే... కలిసి ఉంటే కలదు సుఖం! రోజూ ప్రతికూల వార్తలు వినీ వినీ సానుకూల దృక్పథమే పోతోంది మనుషుల మనసుల్లోంచి. చూడాలేగాని, ఉన్నంతలో సంతోషంగా జీవితాలను గడిపేసేవాళ్లు మన మధ్యలోనే కనిపిస్తారు!
ట్రింగ్, ట్రింగ్, ట్రింగ్‌...
ఫోను మోగుతోంది.
      ‘ఈ వేళప్పుడెవరబ్బా.., వస్తున్నా ఉండవే భడవకానా, అదే పనిగా మోగడమేనా? చేతిలో పని పక్కనపెట్టి రావాలా! ఏంటంత తొందర’ అని విసుక్కుంటూ వెళ్లి తీసింది సీతమ్మ. 
      అవతలినుంచి కోడలు మైథిలి. ‘‘అత్తయ్యా! నేనూ మీ మనవడూ రేపు వస్తున్నాం. మామయ్యగారిని స్టేషనుకు రమ్మనండి. ఉదయం తొమ్మిదిన్నరకల్లా అక్కడుంటాం’’ అని చెప్పి పెట్టేసింది. ‘దీని తొందర దొంగల్దోల. నన్ను మాట్లాడనీయ కుండా పెట్టేసింది’ అనుకుంటూ పడగ్గది వైపు చూసింది సీతమ్మ.
      రఘురామయ్యగారు అప్పటికే ముసుగుతన్ని గుర్రుపెడుతున్నారు. ‘సర్లే, ఈయన్ని ఇప్పుడు లేపి కంగారుపెట్టడం దేనికి? లేచారంటే, ఇప్పుడే హడావుడి పడిపోతారు. వంటిల్లు సర్దేసి ఇక పడుకోవాలి’ అనుకున్నదల్లా కోడలు వస్తున్నదనేసరికి మళ్లీ వంటింటి తలుపులు తీసి దీపం వేసింది సీతమ్మ. సమయం పది కావస్తోంది. వంటగది తలుపులు వారగా వేసింది. కోడలికి పెసరపప్పు జంతికలు అంటే చాలా ఇష్టమని ఓ డబ్బా నిండా చేసి పక్కనపెట్టింది. చిన్నవెధవకి కజ్జికాయలు ఇష్టం. అవికూడా చేసింది. కజ్జికాయలు లావుగా ఉబ్బుతాయి గదా, ఒక్కొక్క దాన్ని పిడికిటితో కొట్టి ఆ శబ్దానికి పగలబడి నవ్వుతాడు. దాన్ని అందరూ చూడాలి. చూడకపోతే అదొక పేచీ. తర్వాత ఆ ముక్కలు తిన్నవి తిని మిగిలినవి కెలికేసి, మళ్లీ మరోటి తీసుకుని అదే పని. ఇదంతా తలుచుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంది సీతమ్మ.
      ‘పిచ్చి వెధవా, నీ ఆ ఆట చూడటానికే గదరా నేనీ అర్ధరాత్రి ఇవి చేస్తూంట’ అనుకోగానే ఆమె కళ్లలో తడి. వాళ్లు రాగానే దోసెలు చేసి పెట్టడానికి పప్పు నానబెట్టింది. కొంచెం అటుకులు నూనెలో తేల్చి ఉప్పుకారం వేసి పెట్టింది. మనవడు వచ్చీరాగానే ఏదడిగితే అది చేతికందివ్వాలని ఆమె తాపత్రయం. అలాగే కోడలికి కూడా. 
      ‘వచ్చినప్పుడల్లా అడిగి మరీ నాతో తలంటు పోయించుకుంటుంది పిచ్చిపిల్ల. కూతుళ్లు లేని నాకు ఆ కాస్త కొరతా తీర్చింది’ అనుకుని కళ్లు తుడుచుకుంది. కుంకుడుకాయలు ఉన్నాయో లేవో చూసింది. నలుగు పెట్టడానికి శనగపిండి, నువ్వులనూనెలనూ చూసుకుంది. అన్నీ ఉన్నాయి, కుంకుడుకాయలు దంచి పెట్టింది. కొట్టుడు పసుపు ఓ డబ్బాలో తీసిపెట్టింది. సాంబ్రాణి పొగ వేయడానికి అన్నీ సిద్ధంచేసింది. దువ్వెనలు శుభ్రంగా కడిగి పెట్టింది. చిక్కు దువ్వెన ఎక్కడుందో వెతికి అందుబాటులో పెట్టుకుంది. ఇంకా ఆలోచిస్తూ గడియారం వంక చూసింది. మూడు కావస్తోంది.
      ‘అమ్మో! ఇంకో గంటలో ఈయన లేస్తాడు’ అనుకుంటూ అన్నీ సర్దేసి నడుం వాల్చింది. కళ్లు తెరిచేసరికి ఆరు కొడుతోంది గడియారం. ‘అయ్యో! ఈయనకి నాలుగింటికే కాఫీ తాగే అలవాటు. ఈ రోజు ఆలస్యం అయిందే’ అని కంగారు పడుతూ లేచింది. 
రఘురామయ్యగారు అప్పటికే కాఫీ పెట్టుకుని తాగి, తన పని తాను చేసుకుంటున్నారు. భార్య నిద్రలేవడం చూసి, ‘‘ఏమైంది? ఇంతసేపు నిద్రపోయావు. ఆరోగ్యం బాగుందా, కళ్లెందుకు ఎర్రగా ఉన్నాయి’’ అని అడిగారు. ‘‘ఆఁ అదేం లేదు. ఏదో అలా నిద్ర పట్టేసింది’’ అని దొరకని దొంగలా తప్పించుకుంది. 
      ‘‘వంటిల్లు అంతా నూనె మరకలున్నాయి, ఏం చేశావేంటి రాత్రి’’ 
      ‘‘ఏం లేదండీ, రాత్రి మీరు పడుకున్న తర్వాత మైథిలి ఫోను చేసింది’’ 
      ‘‘ఆఁ ఆ!! మైథిలి ఫోను చేసిందా, ఆ భడవ మాట్లాడాడా...’’ 
      ‘‘ఆగండాగండి, మీరు ఇప్పుడు తొమ్మిది గంటలకు స్టేషనుకెళ్లాలి, వాళ్లు వస్తున్నారు’’ 
      ‘‘ఇప్పుడా చెప్పడం!? అదీ సంగతి. రాత్రంతా జంతికలు, కజ్జికాయలు ఇంకా ఏవేవో చేసి ఉంటావు. అందుకే ఆలస్యంగా లేచావు. అన్ని మార్కులూ నువ్వే కొట్టేయాలని. అవునా?’’ చిరుకోపమూ చిరునవ్వూ కలగలిపి తల దువ్వడం మొదలుపెట్టారు రఘురామయ్యగారు. ‘‘ఇప్పుడే ఎందుకండీ, సమయం ఏడే’’ అంది సీతమ్మ.
      ‘‘స్టేషనుకు కాదు కూరగాయలకు. పోయినసారి వాడు ఉర్లగడ్డ బజ్జీలు అడిగితే నువ్వు అరటికాయతో చేసి పెట్టావు. వాడు పేచీ పెట్టాడు గుర్తుందా! అందుకని మైథిలికీ, వాడికీ ఇష్టమైన కూరలన్నీ తేవడానికి వెళ్తున్నాను’’ అని బయల్దేరారు. మళ్లీ వెనక్కితిరిగి ‘‘ఈలోగా నువ్వు వంట మొదలుపెట్టు. కోడలు రాగానే వంటపని అప్పజెప్పేసేవు సుమా. పాపం అక్కడ అన్నీ తనే చూసుకోవాలి. ఇక్కడైనా కాస్త విశ్రాంతి తీసుకోనీ’’ అని బయటికి నడిచారు.
      మరో నలభై నిమిషాల్లో ఆయన తిరిగి వచ్చారు. ‘‘నీళ్లు పెట్టాను. త్వరగా స్నానం చెయ్యండి, నేను కూడా వస్తాను స్టేషనుకు’’ అంది సీతమ్మ. తర్వాత ఇద్దరూ బయల్దేరారు. రైలు రావడానికింకా ఇరవై నిమిషాలు ఉందనగా స్టేషను చేరారు. 
      కాసేపటికి కొడుకుతో సహా రైలు దిగుతోన్న మైథిలిని చూసేసరికి రఘురామయ్య, సీతమ్మ గార్ల కళ్లలో దీపావళి వెలిగింది. దగ్గరికి రాగానే కొడుకును తాతగారి కందించి ‘‘మామయ్యా, ఇక వీడి పని మీదే’’ అంది మైథిలి. సీతమ్మ ముఖం చిన్నబోయింది. 
      ‘‘అత్తయ్యా! ఇక నన్ను చూసుకునే పని మీదే’’ అని చేతుల్లో వాలేసరికి సీతమ్మ ముఖం మతాబులా వెలిగింది. ‘‘నా తల్లే, నా తల్లే’’ అని కోడలి నుదుటి మీద ముద్దు పెట్టుకుని పొదివి పట్టుకుని నడిపిస్తుండగా, అక్కడ మనవడు తాత మెడకు దాదాపు వేలాడుతూ తాత నోట్లో నోరు పెట్టి ముచ్చట్లాడుతున్నాడు. రఘురామయ్య సీతమ్మలు సంతోషంతో తమ వయసుల్ని పాతికేళ్లకు కుదించుకున్నారు. ఇల్లు చేరేవరకూ మనవడి నోటికి మూతలేదు. తాతయ్య చెవులు గజ కర్ణాలయ్యాయి. మైథిలీ, సీతమ్మల ముచ్చట్లు మొదలయ్యాయో లేదో ఇల్లు వచ్చేసింది.
స్నానానికి వేణ్నీళ్లు పెట్టింది సీతమ్మ. ముందు మనవడికి స్నానం చేయించారు. స్నానం చేస్తున్నంతసేపూ తాతయ్యతో పోయించుకుంటానని పేచీ. అప్పటికే రఘురామయ్య తుండుగుడ్డ తీసుకుని మనవడి ఒళ్లు తుడవడానికి తయారుగా ఉన్నారు. ఆ మాత్రానికే మనవడు సంతోష పడిపోయాడు. తడి ఒంటితోనే తాతయ్య వీపెక్కాడు. తాతయ్య చేత్తోనే పాలు తాగాడు. కజ్జికాయలు వీరోచితంగా పగలగొట్టి అందరి వంకచూశాడు. అమ్మ తన వంక చూడటం లేదని, ఒక కజ్జికాయ తీసి ఆమెకేసి విసిరాడు. ముక్కలన్నీ ఏరి తాతయ్య చేతిలో పెట్టి తన నోట్లో పెట్టించుకున్నాడు. నాన్నమ్మ నోట్లో పెట్టాడు. తాతయ్యతో కలిసి దోసెలు తిన్నాడు. కాసేపు నానమ్మ వీపెక్కి ఇల్లంతా తిరిగాడు. తాతయ్యతో కలిసి బంతాట ఆడాడు. ఆరు పదులు పైబడిన సీతమ్మకీ, డెబ్భైకి దగ్గరగా ఉన్న రఘురామయ్య గారికీ ఇంత హుషారు ఎక్కణ్నుంచి వచ్చిందో?
      సీతమ్మ మైథిలికి తలంటి పోసింది. తల ఆరేవరకూ తుడిచింది. సాంబ్రాణి పొగ వేసింది. వదులుగా జడ వేసింది. కుండీలో పూసిన పసుపు రంగు గులాబీ తెచ్చి సిగలో తురిమింది. కళ్లకు కాటుకా, నుదుట బొట్టూ పెట్టింది. మైథిలి గుళ్లో అమ్మవారిలా అన్నీ చేయించుకుంది. సీతమ్మ కూడా అమ్మవారికెలా శ్రద్ధగా, భక్తిగా చేస్తుందో అంత శ్రద్ధగానూ కోడలికి అలంకారం చేసింది. అంతా అయిన తర్వాత తన దిష్టే తగిలేలా ఉందని దిష్టి తీసింది. తర్వాత మైథిలి వంటింట్లోకి వెళ్లింది. ‘‘అత్తయ్యా ఒక్కమాట... ఈ రోజు నేను మీ ఇద్దరికీ వడ్డిస్తాను. తర్వాత నేను తింటాను, నాకు మీరు వడ్డించండి’’ అంది. ‘‘సరేనమ్మా, మరి మీ మామయ్య...’’ అని అడిగింది సీతమ్మ. 
      ‘‘మామయ్యా... భోంచేద్దాం రండి’’ అంటూ వెళ్లి ఆయన్ను పిలుచుకొచ్చింది మైథిలి. మనవడితో సహా వచ్చాడాయన. ‘‘నువ్వూ కూర్చో తల్లీ’’ అన్నాడు. మైథిలి, మనవడితో కూర్చుని తినడం రఘురామయ్యకు ఇష్టం. అత్తామామలకు స్వయంగా వడ్డించి తర్వాత తాను  తినడం మైథిలికి ఇష్టం. ఈసారికి కోడలి మాట నెగ్గించాలనుకుని భోజనానికి కూర్చున్నారు రఘురామయ్య. సీతమ్మ కూడా కూర్చుంది. మధ్యలో మనవడు. వాడికీ ఓ పీట.. ఓ పాల అరటాకు. తాతయ్యలాగే బాసింపట్టు వేశాడు. అదంతా ఆరు కళ్లు గమనించాయి. ఏవేవో కబుర్లు చెబుతూ మైథిలి మనసుదీరా పెద్దవాళ్లకు వడ్డించింది. మధ్యమధ్యలో మనవడి పేచీలు. ఒక ముద్ద తాతయ్య దగ్గర ఒక ముద్ద నానమ్మ దగ్గర. అది చూసి మురుస్తూ మైథిలి. తర్వాత సీతమ్మ మైథిలికి వడ్డించింది. 
      వంటిల్లు సర్దేసి అందరూ కూర్చున్నారు. మైథిలి అక్కడి కబుర్లు చెప్పింది. భర్త తనను ఎంత బాగా చూసుకుంటున్నాడో చెప్పింది. పొరపొచ్చాలు రాకుండా తామెలా సర్దుకుని పోతున్నామో చెప్పింది. అభిప్రాయ భేదాలు రావని కాదుగానీ, అలా వచ్చినప్పుడు ఒకరు మౌనం వహిస్తే రెండోవారే సర్దుకుంటారనే మామయ్య సలహా ఇద్దరమూ పాటిస్తామని, దానివల్ల ఎక్కువసార్లు ఇద్దరూ మౌనం పాటించి సమస్య చేయి దాటిపోకుండా చూసుకుంటామనీ అంది. అంతా చెప్పి చివరగా, ‘‘అత్తయ్యా ఈ రోజునుంచీ వంటా వార్పూ, ఇంటి పనీ అన్నీ నేనే చేస్తాను. మీకు పూర్తి విశ్రాంతి. మామయ్య నా మాట మన్నిస్తారు’’ అంది. వెంటనే సీతమ్మ ‘‘అది కాదురా నాన్నా, నువ్వు వచ్చేముందే మాట తీసుకున్నారు మీ మామయ్య. నీకేమీ పనులు చెప్పకూడదని..’’ అంది. 
      ‘‘అత్తయ్యా, మీరు ఇక్కడ ఎప్పుడూ ఏదో ఓ పని చేస్తూనే ఉంటారు. అక్కడికొస్తే నన్ను ఏ పనీ ముట్టుకోనివ్వరు. విశ్రాంతి అనే మాట మీరెప్పుడో మరచిపోయారు. నా తృప్తి కోసం నేనున్నన్నాళ్లూ అన్ని పనులూ నేనుచేస్తాను. నేను సరిగా చేస్తున్నానో లేదో చూస్తూ ఉండండి. తప్పు చేస్తే సరిదిద్దండి’’ అని మామయ్య వంక చూసింది మైథిలి. అంత అభిమానంగా అడుగుతున్న కోడల్ని ఏమనలేక, అలాగని అంగీకరించనూ లేక అలా ఉండిపోయారు రఘురామయ్య. కానీ ప్రేమతో అడుగుతున్న కోడల్నే గెలిపించాల్సి వచ్చింది, ఒక్క షరతుమీద. పిల్లవాడి పనులన్నీ తాము చేస్తామనీ, కోడలి అలంకార వ్యవహారం అంతా అత్తగారిదేననీ. మైథిలి సంతోషంగా తలూపింది. పాతికేళ్ల వృద్ధ దంపతులకు ఆ మాత్రానికే కళ్లు చెమర్చాయి.

* * *

      దాదాపు ఇదే సమయంలో మరో ఇంట్లో...
      ‘‘అలాకాదు తల్లీ, నువ్విలా రా’’ అని వంట దగ్గరినుంచి కోడల్ని తప్పించి తాను రంగంలో దిగింది కమలమ్మ. ‘‘అది కాదత్తయ్యా అన్నీ మీరే చేస్తే నేనెప్పుడు నేర్చుకునేది’’ అంది అరుణ.             ‘‘నేర్చుకుందువు గానీలేమ్మా తొందరేముంది. నేను నేర్పిస్తానుగా, నువ్వింకా చిన్నదానివి. నేనున్నప్పుడు నన్ను చెయ్యనీ, నేను వెళ్లిన తర్వాత నీకు తప్పదు గదా!’’ అంది కమలమ్మ.
       ‘‘ఏంటీ గుసగుసలు’’ అంటూ వచ్చారు మాధవయ్యగారు. ‘‘చూడండి మామయ్యా, అత్తయ్య నన్నే పనీ చెయ్యనివ్వట్లేదు’’ అంది అరుణ. అది ప్రేమ ఫిర్యాదు.
      ‘‘అది చూద్దామనే వచ్చాను, చెయ్యనీయమ్మా, నువ్వు చిన్నపిల్లవు. నువ్వు పనులు చేస్తూ ఉంటే మాకెలాగో ఉంటుంది’’ అన్నారాయన. మాధవయ్యగారికీ కమలమ్మకూ కోడలిని ఏ కష్టమూ రాకుండా చూసుకోవాలని ఉంటుంది. అరుణకు అత్తా మామలను కూర్చోబెట్టి పూజించాలని కోరిక. అంతా ప్రేమ చనువు.
      ‘‘అది కాదు మామయ్యా’’ అనేదో చెప్పబోయింది అరుణ. ‘‘అదీ కాదు ఇదీ కాదు, నువ్విలారా’’ అని అరుణను ముందు గదిలోకి తీసుకెళ్లారు మాధవయ్య. ‘‘దీంట్లో ఇది ఎలా ఆడాలో చెప్పు నాకు’’ అని కంప్యూటర్‌ తెరిచారు. ‘‘ఇదెందుకు మామయ్యా ఇప్పుడు మీకు’’ అని కోడలు ఆరా తీసింది. ‘‘ఆఁ ఎందుకా? మొన్న సీత నన్ను ఓడించిందీ ఆటలో. అంత చిన్నపిల్ల చేతిలో ఓడటమా!’’ అనేసరికి అరుణ లేత పెదవుల మీద చిరునవ్వు చిందులాడింది.
      సీత అంటే మాధవయ్య గారి మనుమరాలు. అరుణ కూతురు. ఇప్పుడు బడికెళ్లింది. పన్నెండు తర్వాత వస్తుంది. కిలకిలా నవ్వుతూ అచ్చు రామచిలకలా ఉంటుంది. ఏ ఆట ఆడినా సరే తాతయ్యతోనే ఆడాలి. ఆడిన ప్రతిసారీ తానే గెలవాలి. ఓడినందుకు గానూ తాతయ్య తనను వీపు మీదెక్కించుకుని తిప్పాలి. అదీ పందెమూ, ఆనవాయితీనూ. (ప్రతిసారీ మనవరాలే గెలవాలనేది అసలు ఒప్పందం. అది తాతా మనవరాళ్ల మధ్య లోపాయికారి శాశ్వత ఒప్పందమూ, రహస్యమూ! ఎవరికీ తెలియదు) ‘‘అదేమిటే ఎప్పుడూ నువ్వే ఎలా గెలుస్తున్నావు’’ అని అమ్మ అంటే             ’’తాతయ్య గెలిస్తే నేను ఆయన్ను వీపుమీద మోయలేనుగా! అందుకని నేనే గెలుస్తూ ఉంటాను’’ అని పెద్ద ఆరిందాలాగా కళ్లు పెద్దవి చేసి సీత చెబుతూ ఉంటే అందరూ వాళ్ల కళ్లు పెద్దవి చేసి చెవులారా వింటారు.
      ‘‘అదేమిట్రా నా దగ్గరే నేర్చుకుని నన్నే ఓడిస్తున్నావ్‌’’ అని తాతయ్య అంటే ‘‘దానర్థం మా తాతయ్య... నాకు... బాగా... నేర్పించాడని’’ తల పైకీ కిందికీ ఊపుతూ తగిన సమాధానం చెబుతుంది సీత. ఊళ్లో ఎన్నో తగవులు తీర్చిన మాధవయ్య గారికి మనవరాలినెలా గెలవాలో తెలియట్లేదు. అదే అంటే ‘‘నేను తాతయ్యని మించిన మనవరాలిని, కావాలంటే తాతకు దగ్గులు నేర్పుతాను’’ అంటూనే ‘‘తాతయ్యా, ఇక్కడ మాత్రం గెలుపు నీదే’’ అని నవ్వుతూ దగ్గుతుంది సీత.
      అయితే కంప్యూటర్‌ దగ్గర మాత్రం తాతయ్య ‘నిజంగానే’ ఓడిపోతున్నాడు. సీతకు కదిలినంత వేగంగా తన వేళ్లు కదలడం లేదు. అవేవో అప్, ఎస్, నో, ఎంటర్, షిఫ్ట్‌ అని, తొందరగా నొక్కు తాతయ్యా అంటుంది. తనదేమో నిదానమే ప్రధానం అనే సూత్రం. అదే తననోడిస్తోంది. అన్ని ఆటల్లోనూ మనవరాల్ని ‘గెలిపించే’ తాతయ్య ఇక్కడ మాత్రం ఒక్కసారైనా గెలవాలని ఆశ పడుతున్నాడు. ఎన్ని ఆటలాడినా సరే, సీత అలసిపోయి ఇక చాలు తాతయ్యా, అనడమే గానీ తాతయ్య ఎప్పుడూ అలసిపోడు. కొన్ని ఆటలు మనవరాలు గెలుస్తుంది. కొన్ని ఆటలు తాతయ్య గెలిపిస్తాడు. కొన్ని ఆటలు నిజంగా ఓడిపోతాడు, కొన్ని ఒప్పందం ప్రకారం ఓడిపోతాడు. ఈ ఆటల పోటీలన్నింటికీ అరుణ గెలుపోటముల నిర్ణేత.
      మాధవయ్యగారికి కిటుకులు నేర్పడానికి అరుణ ప్రయత్నాలు పాక్షికంగానే ఫలితాలిస్తున్నాయి. ఇంతలో ‘‘వంటయ్యింది’’ వంటింట్లోంచి కేకేసింది కమలమ్మ. అరుణ గడియారంకేసి చూసింది. పన్నెండున్నర. సీత బడినుంచి వచ్చి తాతయ్యతో అప్పటికే రెండు ఆటలు గెలిచి ఆయన వీపుమీద పెరడంతా తిరిగేసింది. అరుణకేదో అనుమానం తోచింది. ప్రతిరోజూ పది గంటలకు తను అత్తయ్యకు సాయం చేయడానికి వెళ్లడం.. అత్తయ్య మృదువుగా మాట తప్పించడం.. మామయ్య తనను కంప్యూటర్లో ఆటలు నేర్పించమని అడగటం.. అలా పన్నెండు కావడం.. ఇవన్నీ చూస్తుంటే, అత్తయ్య మాటలు గుర్తొచ్చాయి. ‘‘నేనున్నన్ని రోజులూ నువ్వు హాయిగా ఆటాపాటలతో నవ్వుతూ ఉండమ్మా, అదిచూసి నేనూ మీ మామయ్యా సంతోషిస్తాం. సీత విషయం మీ మామయ్యా, నీ పనులు ఇంటి పనులూ నేనూ సంతోషంగా చేస్తాం. నువ్వు మన ఇంటి మహారాణివి తల్లీ’’ అందప్పుడు కమలమ్మ. ‘ఇదా వీళ్ల ప్రణాళిక’ అని అరుణ అనుకునేసరికి కను కొలుకుల్లో నీళ్లు నిలిచాయి. 
      ‘మా అమ్మానాన్న కూడా ఎన్నడూ ఇలా అనలేదు. వీళ్లనెప్పుడూ బాధపెట్టకూడదు. వాళ్ల అభీష్టమే నెరవేరనీ, వాళ్ల సంతోషమే నా సౌభాగ్యం. వీళ్ల సంతోషం చూసి శ్రీవారు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సీత సరే సరి. అత్తయ్య దగ్గర మామయ్య దగ్గర తానాడింది ఆట, పాడింది పాట. అలాగని సీత చదువులో ఏమీ వెనకబడటం లేదు. తెలుగు పద్యాలు, ఆంగ్ల పద్యాలు, సామెతలు అలవోకగా చెప్పేస్తోంది. మాటతీరు కూడా సంస్కారవంతంగా మారింది. భోజనం విషయంలో పేచీలు పెట్టడం లేదు. అంతా మామయ్య చేతి చలవ. సీతకు మావయ్య అన్నం తినిపించే పద్ధతి చూసి నేను కూడా అన్నం తినడం నేర్చుకున్నట్లుంది. అదేం విచిత్రమో మామయ్య ఒక్కమాట చెబితే చాలు. మంత్రం వేసిన మనిషిలా శుభ్రంగా తినేస్తుంది. తినే ముందు మామయ్య నేర్పించిన శ్లోకం చెబుతుంది. నిద్ర లేవగానే నేలతల్లికి దణ్నం పెట్టి ఏదో శ్లోకం చెప్పి మంచం దిగుతోంది. స్నానానికో శ్లోకం. బడికి వెళ్లేటప్పుడు దేవుడికి దణ్నం పెట్టుకుని గానీ పోవడం లేదు.       ముఖాన బొట్టు లేకుండా బయటికి పోదు. టీచరు కూడా సీత గురించి చాలా మంచిగా చెబుతోంది. సీతను చూసి ఇంకా కొందరు బడికి బొట్టు పెట్టుకొని వస్తున్నారట. బడికి వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు బస్సులో కూడా పిల్లలతో ఏవో పద్యాలు, శ్లోకాలు చెప్పిస్తోందిట’... అన్నీ గుర్తుచేసుకుంటున్న అరుణ మనసులో ఆనందవీచికలు వీస్తున్నాయి. 
      ‘‘నువ్వు ఇన్ని శ్లోకాలు ఎప్పుడు నేర్చుకున్నావే’’ అని సీతను అడిగింది అరుణ. ‘‘అన్ని ఆటల్లోనూ తాతయ్యే ఎందుకు ఓడిపోతున్నాడనుకున్నావు’’ అంది సీత. ‘‘దానికీ దీనికీ ఏంటే సంబంధం’’ అంటే, ‘‘ప్రతి గెలుపుకీ తాతయ్య వీపెక్కి తిరుగుతానా! ప్రతిసారీ ఒక్క శ్లోకం అయినా అప్పజెప్పే వరకూ తాతయ్య నన్ను దించరు తెలుసా? పాతది అప్పజెప్పాలి. అప్పుడు కొత్తది నేర్పిస్తారు. ఇలా రోజుకు కనీసం రెండు మూడు శ్లోకాలు లేదా పద్యాలు నేర్చుకుంటున్నాను తెలుసా!’’ అని ఆటల్లో మునిగిపోయింది. అరుణ పెదవుల మీద చూపుడువేలు నిలిచిపోయింది. చదువు ఇలా కూడా చెబుతారా? ఇన్ని రోజులనుంచి తను గ్రహించనే లేదు. ఇందుకేనేమో ‘ఇంట్లో పెద్దవాళ్లుంటే చద్దన్నం మూట ఉన్నట్లే’ అన్నారు. మామయ్య కంప్యూటర్‌ ఆటలు గెలవలేకపోతేనేం. తన చాతుర్యంతో దేశాన్నే గెలిపిస్తాడు. ఆయన ‘నా’ మామయ్య.. ‘ఒక్క నాకే మామయ్య’ అనుకుని మౌనంగా ఇంట్లోకెళ్లింది అరుణ.
      ‘‘సీతను భోజనానికి పిలవమ్మా’’ అన్నారు మాధవయ్య. అది విననట్లే వంగి మామయ్య పాదాలకు నమస్కారం చేసింది అరుణ. ‘‘అరె ఇదేమిటమ్మా, లే’’ అని లేవదీసి తలమీద చెయ్యివేసి, తన తలను తలతో తాకించారాయన. ఇదో ఆశీర్వచనం. ఇది అమోఘం. ఏదో చల్లని పదార్థం మెల్లగా గొంతు దిగిన అనుభూతి. ఇలా తలను తలతో తాకించడం విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చేసేవాడట. అంటే మామయ్య రామాయణంలో చెప్పినదాన్ని పాటిస్తున్నాడు. ఆశీర్వదిస్తున్నాడు. ఎన్నోసార్లు సీతను అలా చేస్తుంటే అరుణకేమీ తెలిసేదికాదు. ఇప్పుడు తెలిసింది. ‘మామయ్యా మీరు విశ్వామిత్రుడికంటే గొప్పవారు, త్రేతాయుగాన్ని కలియుగానికి అన్వయించారు. మీదంతా మౌన వ్యాఖ్యానం’ అనుకుంది మనసులో.

* * *

      ఇప్పటికీ మైథిలి, అరుణల్లాంటి కోడళ్లూ, సీతమ్మ, కమలమ్మల్లాంటి అత్తలూ ఉన్నారు. ఇక రఘురామయ్య, మాధవయ్య గార్లకూ లోకంలో లోటులేదు. 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam