ప్రగతి పథంలో

  • 155 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డాక్టర్‌ తాళ్లూరి లక్ష్మి

  • విశ్రాంత ప్రిన్సిపల్, వివేకవర్ధిని కళాశాల
  • హైదరాబాదు.
  • 9885051300
డాక్టర్‌ తాళ్లూరి లక్ష్మి

చదువులు, కొలువుల పేరుతో అందరూ అమెరికాకు వెళ్తున్న తరుణంలో ఓ అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సామాన్యులతో కలిసి నడుస్తూ జీవితానికి కావాల్సిన అనుభవం, సంతృప్తి, పరిపక్వత సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో చదువులకు ఆమె చెప్పిన పరమార్థమేంటి?
‘‘హౌ ఆర్యూ పెద్దమ్మా?
హౌ ఆర్యూ పెదనాన్నగారూ?’’ తెలుగూ, ఇంగ్లీషూ కలగలిపి వచ్చీరాని తెలుగులో వసుంధరనూ, నన్నూ పలకరించింది దివ్య. క్రీమ్‌కలర్‌ మిడీ మీద, నేవీ బ్లూ బ్లేజర్, హైహీల్డ్‌ షూస్‌తో ఫక్తు అమెరికా అమ్మాయిలా ఉంది. కొలంబస్‌ నుంచి పద్దెనిమిది గంటల ప్రయాణం కదా! మొహంలో రవ్వంత అలసట కనిపిస్తోంది.
      దివ్య వసుంధర చెల్లెలు భానుమతి రెండో కూతురు. ఇరవై ఏళ్ల వయసు ఉంటుంది. భానుమతి ఎప్పుడో నలభై ఏళ్ల కిందట పై చదువులకని అమెరికా వెళ్లి తనతోపాటే చదువుకున్న అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకుని, అక్కడే స్థిరపడిపోయింది. దివ్య అమెరికాలోనే పుట్టి పెరిగింది. తండ్రి తెలుగువాడు కాకపోవడంతో తెలుగు మాట్లాడటం అంతగా రాకపోయినా, అర్థం చేసుకోగలదు. దివ్య అక్క ధృతి అమెరికాలోనే మెడిసిన్‌ చదువుకుంటోంది.
      దివ్య ఆర్థికశాస్త్రంలో పట్టభద్రురాలై అదేదో అమెరికన్‌ ఫౌండేషన్‌ తరఫున రెండేళ్లపాటు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి భారత్‌కు వచ్చింది. ఫౌండేషన్‌ పని చండీగఢ్‌లో చేయాల్సి ఉన్నా, మేము హైదరాబాదులో ఉండటంతో మొదట ఇక్కడికి వచ్చింది. పలకరింపులయ్యాక అందరం కలిసి విమానాశ్రయం నుంచి ఇంటికి వచ్చాం. అర్ధరాత్రి అవడంతో ఇంటికి వచ్చీరాగానే అందరమూ నిద్రలోకి జారుకున్నాం.

*  *  *

      మర్నాడు పొద్దుటే కాఫీ తాగి దినపత్రిక చదువుతూ కూర్చున్నాను. వసుంధర వంటింట్లో ఏదో పని చేసుకుంటోంది. ఇంతలో దివ్య ‘‘గుడ్‌మార్నింగ్‌ పెదనాన్నగారూ!’’ అంటూ వచ్చి నా పక్కనే కూర్చుంది. వసుంధర కూడా దివ్యకు ఒక గ్లాసులో పాలు తెచ్చిచ్చి తన పక్కనే కూర్చుంది. ‘‘ఏమే అమ్మాయీ! అక్కడ పై చదువులు చదువుకోకుండా ఇక్కడ ఏముందని ఇలా వచ్చావ్‌? ఇక్కడి వాళ్లందరూ అక్కడికి వెళ్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తావ్‌?’’ అంది దివ్యతో.
      ‘‘అదేం లేదు పెద్దమ్మా! డిగ్రీ అయిపోయాక పై చదువుల కోసం అక్కడ మంచి యూనివర్శిటీల్లో సీట్‌ రావాలంటే అంతసులువైన పనికాదు. సబ్జెక్ట్‌లో మంచి మార్కులతోపాటు, కో-కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో కూడా క్రెడిట్స్‌ సంపాదించాలి. ఇండియాలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నా చదువుకు సంబంధించిన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటే మంచి క్రెడిట్స్‌ వస్తాయి. అప్పుడు పెద్ద యూనివర్సిటీల్లో సీటు సంపాదించవచ్చు. నేను ఫోర్డ్‌ ఫౌండేషన్‌ వంటి నాలుగైదు ఫౌండేషన్లలో ప్రాజెక్ట్‌లకోసం అప్లయ్‌ చేశాను. వాటిలో ఇండియాలో ఈ ప్రాజెక్ట్‌ నా స్వభావానికి సరిపోతుందని, భవిష్యత్తుకి తోడ్పడుతుందని స్టైఫండ్‌ తక్కువైనా ఇక్కడికి వచ్చాను’’.
      ‘‘స్టైఫండ్‌ ఎంతిస్తారేంటి?’’ 
      ‘‘నెలకి అయిదువేల రూపాయలిస్తారు. అందులోనే ఇంటి అద్దె, భోజనం, ఇతర ఖర్చులు అన్నీ సరిపెట్టుకోవాలి. నేను పనిచేసే మురికివాడల దగ్గరే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండాలి’’ 
      ఆ సమాధానానికి నేను, వసుంధర ఉలిక్కిపడ్డాము. దివ్యేమో అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయి. వాళ్ల నాన్న పెద్ద ప్రొఫెసరు. అమ్మ శాస్త్రవేత్త. పిల్లలిద్దరూ చిన్నప్పట్నుంచీ మంచి వసతులున్న ఇంట్లో పెరిగారు. బయటికి అడుగుపెడితే కార్లలోనే ప్రయాణం. ఇప్పుడు దివ్య ఓ మురికివాడలో ఉంటానంటోంది. అదీ ఒంటరిగా... ఇది సాధ్యమయ్యే పనేనా! అసలీ అమ్మాయి దేశంకాని దేశంలో ఒక్కతే ఎన్నిరోజులు ఉండగలుగుతుంది అనుకున్నాను. పైగా ఇంగ్లిషు తప్ప మరో భాష రాదు. అదే దివ్యతో అన్నాను.
      ‘‘పెదనాన్నగారూ! నేనిక్కడికి వచ్చేముందు హిందీభాష మీద ఓ క్రాష్‌కోర్సు చేశాను. అనర్గళంగా మాట్లాడలేకపోయినా, అవతలివారు మాట్లాడేది అర్థంచేసుకుని కొద్ది, కొద్దిగా జవాబివ్వగలను’’ అంది.
      ఆ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు వసుంధర నాతో అంది... ‘‘దీనికి బుద్ధి లేకపోతే పోయింది, భానుకేం పోయేకాలం వచ్చింది? వయసులో ఉన్న పిల్లను ఎక్కడో పంజాబ్‌లో పూరిళ్లలో బతకడానికి పంపడానికి. రేప్పొద్దునే దానికి ఫోన్‌చేసి నాలుగు దులిపేస్తాను’’.
      మర్నాడు పొద్దున అన్నట్లే చేసింది వసుంధర. అయితే భానుమతి మాత్రం ‘‘అది కాదక్కా. ఇక్కడ పిల్లలకు ఓ వయసొచ్చాక అంతా వాళ్ల ఇష్టానికే వదిలేస్తారు. మనం చెప్పాల్సిన నాలుగుమాటలు చెప్పి నిర్ణయం వాళ్లకే వదిలేయాలి. దివ్య కూడా తన కాళ్లమీద తను నిలబడతానంటే మేం మాత్రం చేయగలిగిందేముంది. అక్కడికీ మీ మరిదికూడా చెప్పాల్సినవన్నీ చెప్పి, ఇవ్వాల్సిన సలహాలన్నీ ఇచ్చారు’’ అంది.
      దివ్య మరో రెండ్రోజులు మాతో గడిపి మూడోనాడు ఎ.పి.ఎక్స్‌ప్రెస్‌లో దిల్లీ వెళ్లిపోయింది, అక్కడినుంచి చండీగఢ్‌ వెళ్తానంటూ. అక్కడికి వెళ్లాక అప్పుడప్పుడూ ఫోన్‌ చేసేది. చేస్తున్న పని గురించి చెప్పేది. మాకు తోచిన జాగ్రత్తలేవో చెబుతుండేవాళ్లం. పోనీ వెళ్లి ఒకసారి చూసొద్దామా అనుకుంటే, ఇక్కడి పనులతో కుదరలేదు.

*  *  *

      దివ్య చండీగఢ్‌ వెళ్లిన ఏడాదికి అనుకుంటా, ఓసారి ఆఫీసు పనిమీద నేను దిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి చండీగఢ్‌ దగ్గరే. అందుకే దిల్లీలో పనవగానే అక్కడికి వెళ్లాను. ఓ హోటల్లో దిగి దివ్యకు ఫోన్‌ చేశాను. 
      మర్నాడు పొద్దుటే దివ్య వచ్చి కలిసింది. మనిషిలో పెద్ద మార్పేమీ లేదు. శరీరఛాయ కొద్దిగా తగ్గినట్టనిపించింది. కాటన్‌ సల్వార్‌ కమీజు వేసుకుని ఆకుజోళ్లతో ఎంతో సాదాసీదాగా ఉంది. షోగ్గా మిడీ మీద బ్లేజర్‌ వేసుకుని హైహీల్డ్‌ షూస్‌ వేసుకుని అమెరికా నుంచి వచ్చిన ఆ అమ్మాయేనా ఇప్పుడు నా ముందున్నది అనిపించింది. కుశల ప్రశ్నలయ్యాక తనుండే చోటు, పనిచేసే స్థలం చూడాలన్నాను. దివ్య ‘‘అయితే ఆలస్యం ఎందుకు, ఇప్పుడే వెళ్దాం’’ అంది.
      ఓ ఆటోలో దివ్య ఇంటికి చేరుకున్నాం. ఊరికి దూరంగా ఓ మురికివాడలో అస్బెస్టాస్‌ రేకులు కప్పిన మూడుగదుల ఇల్లది. ఒకగదిలో ఇంటావిడ మన్‌జీత్‌ కౌర్‌ ఉంటోందట. మరోగదిలో దివ్య నివాసం. మూడో గదిలో ఇంటావిడ నడుపుతున్న కాకా హోటల్‌.
      దివ్య తాళం తీసి లోపలికి తీసుకెళ్లింది. గదిలో ఓ మూల ఓ చాప, దిండు. మరోమూల ఒక కుండ, గ్లాసు. తలుపులు లేని అలమారలో దివ్యబట్టలు, పుస్తకాలు. అటకమీద దివ్య అమెరికా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న సూట్‌కేస్‌. గదంతా సాదాసీదాగా ఉంది. నేను చాప మీద కూర్చున్నాను. దివ్య గుమ్మందాకా వెళ్లి ‘‘దీదీ! అంకుల్‌కి ఒక చాయ్‌ పంపు’’ అని హిందీలో ఇంటావిడకి చెప్పింది. ఆవిడిచ్చిన టీ తాగాక మేము పక్కవీధిలోని ఓ చిన్న రేకులషెడ్‌ దగ్గరికి చేరుకున్నాం. అది ఆ మురికివాడలో ఉండేవాళ్ల కోసం ఏర్పాటుచేసిన సంక్షేమ కేంద్రమట. అక్కడ పదిమంది మహిళలు దివ్యకోసం ఎదురుచూస్తూ నేలమీద కూర్చుని ఉన్నారు. దివ్య రాగానే లేచి ‘‘దీదీ! నమస్తే’’ అంటూ అభివాదం చేశారు. దివ్య అందరినీ పేరు, పేరునా పలకరించి నన్ను పరిచయం చేసింది. ఆ తర్వాత అక్కడ ఓ మూలనున్న కర్రపెట్టె తాళం తీసి అందులోంచి రంగురంగుల బట్టముక్కలు, అట్టముక్కలు, దారపు ఉండలు మొదలైన సరంజామా తీసి అందరికీ పంచింది. తన లాప్‌టాప్‌ తెరిచి ఏవో నమూనాలు చూపించి వాళ్లచేత పనులు ప్రారంభించింది. అందరూ తలో నమూనాలో పర్సులు, హ్యాండ్‌బ్యాగ్స్‌ తయారుచేస్తున్నారు. మధ్యమధ్యలో దివ్య సలహాలు తీసుకుంటూ మధ్యాహ్నం అయ్యేసరికల్లా తలా రెండు వస్తువులు తయారుచేశారు. ఆ తర్వాత ఇంటిదగ్గర పనిచేసుకునేందుకు వీలుగా కావాల్సిన సరంజామా తీసుకుని అందరూ వెళ్లిపోయారు.
      దివ్య, నేను గదికి తిరిగివచ్చి మన్‌జీత్‌ కౌర్‌ పెట్టిన వేడివేడి రొట్టెలు, కూర తిని కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి సంక్షేమ కేంద్రానికి వెళ్లాం. అక్కడ అప్పటికే ఓ డజనుమంది పిల్లలు కూర్చుని ఉన్నారు. వాళ్లుకూడా దివ్యని చూడగానే ‘‘దీదీ! నమస్తే’’ అంటూ పలకరించారు. దివ్య వాళ్లందరికీ ఒక నోట్‌బుక్, పెన్సిల్‌ ఇచ్చి ఇంగ్లీషు, హిందీ అక్షరాలు, లెక్కలు మొదలుపెట్టింది. ఓ గంటయ్యాక తను తెచ్చిన కథల పుస్తకాలు వాళ్లకిచ్చి వాటిలో బొమ్మల కథలు, మరెన్నో విషయాలు  చెప్పింది. ఆ తర్వాత అందరికీ బిస్కెట్లు ఇచ్చి ఇంటికి పంపించేసింది. మేమిద్దరం తిరిగి దివ్యగదికి చేరుకున్నాం.
      నేను దివ్యను ఆ రాత్రి భోజనానికి హోటల్‌కి తీసుకువచ్చాను. భోంచేస్తున్నప్పుడు దివ్య తను చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించింది. వాళ్ల అమెరికన్‌ ఫౌండేషన్‌ ప్రధాన కార్యక్రమం మురికివాడల్లో కష్టాల్లో ఉన్న మహిళలకు రకరకాల పనులు నేర్పి తమ కాళ్లమీద తాము నిలబడగలిగేలా చేయడం. వాళ్లతోపాటు వాళ్ల పిల్లలకు బడికి వెళ్లి చదువుకోవాలన్న జిజ్ఞాస కలిగించడం. దివ్య ఉంటున్న మురికివాడలో పదిమంది మహిళలకి రకరకాల పర్సులు, హ్యాండ్‌బ్యాగ్స్‌ తదితర గిఫ్ట్‌ వస్తువులు చేయడం నేర్పింది. వాళ్లు తయారుచేసిన వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా, హోటళ్లలో, ఎగ్జిబిషన్‌లలో అమ్మి వచ్చే లాభాలు అందరికీ పంచుతోంది. మొదట్లో అంతగా సంపాదన లేకపోయినా క్రమంగా వ్యాపారం పుంజుకుంది. ఇప్పుడు ఒక్కో మహిళ నెలకి అయిదువేల దాకా సంపాదించుకుంటోంది. నేర్చుకునేవాళ్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది.
దివ్య విషయానికి వస్తే... తను మొదట్లో ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. భాష సరిగ్గారాక ఒకరకమైన ఇబ్బందులైతే... మురికివాడలోని తుంటరి యువకుల సతాయింపులతో మరోరకం బాధ! ఈ పరిస్థితుల్లో మన్‌జీత్‌ కౌర్‌ అండగా నిలబడింది. ఆమే దివ్యకి హిందీతోపాటు, కొద్దికొద్దిగా పంజాబీ కూడా నేర్పింది. కొత్త వాతావరణానికి అలవాటుపడటానికి దివ్యకు కాస్త సమయం పట్టింది. ఎముకలు కొరికే చలిలో కటిక నేలమీద బొంతలు కప్పుకుని పడుకోవడం మొదట్లో కష్టమనిపించినా, క్రమంగా అలవాటు చేసుకుంది. ఇలా ఏడాదిగా తను ఎదుర్కొన్న కష్టసుఖాలు, చేదు అనుభవాలు దివ్య చెబుతూంటే ఆ అమ్మాయి తెగువకి, ధైర్యానికి ఆశ్చర్యమేసింది. ఆ మాటల్లో ఎక్కడా నిరాశ, నిస్పృహలు, నిస్సహాయత, బాధ కనిపించలేదు. అంతకుమించి ఏదో సాధిస్తున్నానన్న సంతృప్తి, ఆనందం కనిపించాయి. అయితే దానికోసం తను ఇంత కష్టపడటం అవసరమా అనిపించింది. అదేమాట తనతో చెబుతూ ‘‘దివ్యా! జీవితంలో ఉన్నతశిఖరాలకు చేరుకోవడానికి ఇవన్నీ అవసరమా’’ అన్నాను.
      ‘‘పెదనాన్నగారూ! ఇన్నేళ్లూ అమ్మానాన్నల చాటున వాళ్లు అమర్చిన సౌకర్యాల మధ్య అదే జీవితం అనుకుంటూ గడిపేశాను. ఈ అనుభవాలు నన్నో కొత్తమనిషిగా మార్చాయి. నా దృక్పథంలో ఎంతోమార్పు తెచ్చాయి. చదువంటే కేవలం పుస్తకాలు చదవడం, పరీక్షల్లో గ్రేడ్స్‌ తెచ్చుకోవడం కాదని, బడిలో సంపాదించుకున్న జ్ఞానం ఎదుటివాళ్ల సంక్షేమానికి ఉపయోగపడినప్పుడే చదువుకు సార్థకత అని తెలిసింది. పేదరికంలో మగ్గే బడుగు మనుషుల కష్టసుఖాల గురించి గట్టున కూర్చుంటే అర్థంకాదు. వాళ్లతో కలిసి జీవిస్తూ, వాళ్ల బాధలను మనమూ అనుభవిస్తేకాని, వాళ్ల సమస్యలకు సరైన పరిష్కారాలు చూపలేం. వారికి సరైనదారి చూపించి అభివృద్ధిలోకి తీసుకుని వెళ్లగలిగినప్పుడే మన చదువుకు కొంతైనా సార్థకత లభిస్తుంది. ఇకమీదట నేను ఎన్ని పెద్ద చదువులు చదివినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, తోటివాళ్లకు సాయపడటానికి, ముఖ్యంగా పేదల జీవితాల్లో మార్పుతు తీసుకురావడానికే ప్రయత్నిస్తా. మనం ఉన్న లోకమే సమస్తమూ అనుకోకుండా ఈ వసుధైక కుటుంబానికి ఏవిధంగా తోడ్పడగలనా అని ఆలోచిస్తున్నా’’ అంది దివ్య.
      నాకెంతో ముచ్చటేసింది. వ్యక్తివికాసం పెంపొందించి, మేధకి పదునుపెట్టే ఇలాంటి విద్యావిధానం మనదేశంలోనూ ఉంటే బాగుంటుందనిపించింది. ర్యాంకుల పోటీలో పాఠాలను బట్టీపట్టిస్తూ... అదే జ్ఞానంగా భ్రమింపజేస్తూ... చివరికి ఉద్యోగాల సాధనకు అవసరమైన కనీస పరిజ్ఞానం లేని నవతరాన్ని తయారుచేస్తున్న మన విద్యావిధానాన్ని తలచుకుంటే బాధేసింది. మన వ్యక్తిత్వాల్లో పరిపక్వత పెంచే చదువే ప్రగతికి మూలాధారం అని మనవాళ్లు ఎప్పటికి తెలుసుకుంటారో. ఇదేమాట దివ్యతో అన్నాను.  
      ‘‘ఈ సంవత్సరంలో ఇక్కడి చదువులనూ గమనించాను పెదనాన్న గారూ. అంతా ఒకే మూసలో సాగిపోతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. సమాజానికి దూరంగా, ఉద్యోగమే పరమావధిగా సాగే విద్యాభ్యాసం వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడదు. దానికోసం పాఠ్యప్రణాళికల స్థాయిలోనే ఎన్నో మార్పులు జరగాలి. మరోవైపు...  మనం బాగా చదువుకోవాలి. సామాజిక ఆర్థిక కారణాల వల్ల ఎదిగే అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్న వారికి మన విజ్ఞానం ద్వారా చేయూతనివ్వాలి. అప్పుడే సామాజిక ప్రగతి సాధ్యం. అలా ఒకరికొకరిని తోడు చేసే వ్యవస్థల ఏర్పాటుకోసం నాయకులు ఆలోచించే శుభదినం తొందరగా రావాలి’’ అంది దివ్య. తన ఆలోచనల్లోని పరిపక్వత నన్ను ముగ్ధుణ్ని చేసింది. వ్యక్తిగతంగా తన కలలన్నీ నిజం కావాలని మనసారా ఆశీర్వదించా. నావంతుగా చేయగలిగినంత సాయం చేస్తామని మాటిచ్చా. ఆ రాత్రి దివ్య చేస్తున్న కార్యక్రమాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను. మర్నాడు సంతృప్త హృదయంతో తిరుగు ప్రయాణమయ్యాను.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam