సీతాకోక చిలుకలు

  • 164 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చల్లా సురేష్‌కుమార్‌

  • ఉపాధ్యాయుడు, విశ్వనాథపురం,
  • విజయనగరం
  • 8500174354
చల్లా సురేష్‌కుమార్‌

ఒకరి ఆనందం, బాధ వాళ్ల వ్యక్తిగతం. కానీ, వాటి తాలూకు ఛాయలు పక్కవాడి మీద పడటం, వాళ్లనూ ఏదో ఉద్వేగానికి గురిచేయడం... వింతగా ఉండదూ? ఇక్కడ కూడా హారికది అలాంటి పరిస్థితే! మరి ఏ బడిలో ఏ మాస్టారూ చెప్పని ఓ పాఠాన్ని తను ఎలా నేర్చుకుంది?   
హారికకు
భాష రాదు. అందుకే నేను... సీతాకోకచిలుకను చెబుతున్నాను. ఓ రోజు... చాలా మంచిరోజు... నాకు బాగా గుర్తుంది. ఆ రోజు సమస్త జీవరాశుల హృదయాలూ దూదిపింజల్లా తేలిపోయాయి. బాహ్య, అంతర ప్రకృతులు రెండూ ఆహ్లాదకరంగా అనిపించాయి. సున్నితమైన మా రంగుల రెక్కలను చించేయడానికి ఉవ్విళ్లూరే కఠినమైన చేతులు, ఆ రోజు మమ్మల్ని సుతిమెత్తగా తాకడానికి తెగ ప్రయత్నించాయి.
      ఎప్పుడూ అల్లరిచేసే హారిక ఆ రోజు అమ్మమాట జవదాటలేదు. ఆ రోజు కూడా తనకు బడికైతే వెళ్లాలనిపించలేదు కానీ, అమ్మ దిగబెడితే వచ్చింది. ఆనందంగా ఉన్న అమ్మముఖం ఆ రోజు హారికకు బహుమతిలా అనిపించింది. కానీ, అమ్మ ఎప్పుడు సంతోషపడుతుందో, ఎప్పుడు       బాధపడుతుందో గుర్తించలేని పసిహృదయం హారికది. అయినాసరే, అమ్మ నవ్వితే తనూ నవ్వుతుంది. 
      ఆ రోజు తరగతిలో హారికే కాదు, మిగిలిన పిల్లలెవరూ అల్లరిచేయలేదు. ఇంట్లోనూ, వచ్చేదారిలోనూ, ఊళ్లో వాళ్లందరూ ఆ రోజెందుకో మనసారా నవ్వుతుండటంతో మాస్టారి హృదయం కూడా మనిషిలా స్పందించింది. దాంతో గొంతుకు మనసు కలిపి పాఠాన్ని పాటలా అందంగా పాడారు. పాఠం పేరు ‘సీతాకోకచిలుక’. దాంతో ఇంతకుముందే పరిచయం ఉండటంతో హారిక ఆ పాఠాన్ని తన్మయత్వంతో వింది. మా సీతల కోకలు చించేసే చేతులమధ్య మమ్మల్ని ఆప్యాయంగా పలకరించే ఆ లేత హృదయం అంటే మాకు చాలా ప్రేమ. మాస్టారు ఇంతకుముందు చెప్పిన ఏ పాఠమూ ఆమెకు గుర్తులేదు. కనీసం అందులోని విషయమేంటో కూడా తనకు తెలియదు. కానీ, ఆ రోజునుంచి ఆమెకు బడిమీద మమకారం కలిగింది. 
      ఆ రోజునుంచి మాతో ఆమె అనుబంధం మరింత పెరిగింది. మాస్టారు పాడిన పాటను కంఠోపాఠంగా మార్చుకుని మాకోసం గొంతెత్తి ఆలపించింది. రూపాయి పెట్టి బడి ఆవరణలో కొనుక్కున్న దుంపను మేము తింటామనుకుని కాకి ఎంగిలిచేసి ఇచ్చింది. చిన్నది కదా! మా ఆహారం తెలియదు. మేం తినకపోయేసరికి తనే తినేసింది. పేరుకి ప్రభుత్వ పాఠశాల అయినా ఆ భవనాన్ని ‘దుంపలబడి’ అని మాకు పరిచయం చేసింది.
      మనిషి ఎంత ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడో అంతే అథఃపాతాళానికి పడిపోతాడు. నిబ్బరం పోయి కడుపు మండిన ఆకలికీ, అధికపీడనం నుంచి అల్పపీడనానికీ, ప్రేమ పోయి ఖేదానికీ, వసంతం నుంచి శిశిరానికీ, వర్షం పోయి ఎండకీ... ప్రకృతి కూడా ఎప్పుడూ స్థిరంగా ఉండదు. దానికి తగ్గట్టే, మరుసటి రోజు సమస్త జీవరాశుల హృదయాలు కల్లోల సంద్రాల్లా ఉన్నాయి. బాహ్య, అంతర ప్రకృతులు వేదనతో నిండిపోయాయి. ఆ క్షణంలో మేం పొరపాటున ఎవరి దగ్గరికైనా వెళ్తే, మా రెక్కలను చీల్చిపారేసేంత కసిగా ఉన్నాయి. 
      ఇదంతా అర్థం చేసుకోలేని పసిపిల్ల హారిక ఉత్సాహంగా బడికి బయల్దేరింది. నిన్న మాస్టారు పాడిన పాట ఇంకా తన మదిలో మెదులుతోంది. ఇవాళకూడా ఆయన అలాంటి పాటే పాడతారన్న ఆశతో బయల్దేరింది. తనంతట తానుగా బడికి వెళ్తుండటంతో, అమ్మ వెంట రాదనుకుంది. కానీ, చెల్లెలు భూమికను చంకలో వేసుకుని, అమ్మ బయల్దేరింది. తానే యాగీ చేయకపోయినా ఆమె ఎందుకు వస్తోందో హారికకు అర్థం కాలేదు. రాత్రి తాను పడుకునేవరకూ విరబూసిన బంతిపువ్వులా ఉన్న అమ్మ మొహం ఉదయం లేచేసరికి వాడిపోయింది. పరధ్యానంలో హారికను బరబరా ఈడ్చుకుపోతోంది.
      మధ్యలో బంగారమ్మ ఎదురైంది. ఆవిడతో మాట కలిపింది అమ్మ. పక్కనే ఉన్న ఉమ్మెత్తపువ్వును చూస్తూ, మధ్యమధ్యలో వాళ్ల హావభావాలను పరిశీలిస్తోంది హారిక. చంకలో చెల్లెలు అక్కను చూస్తోంది. 
      ‘‘మరదలకు మగోడు పుట్టాడు... మరి మనకి...’’ అంటూ రాత్రి తాగొచ్చి తగవులాడిన భర్త సంగతిని బంగారమ్మకు చెబుతోంది హారిక తల్లి. వాడు ఉడుక్కుని గిల్లిన గిల్లుళ్లను చూపిస్తోంది. కన్నీరు పెట్టుకుంటోంది. ఆమె దుఃఖం, సంతోషంగా ఉన్న హారికకు అర్థం కాలేదు.
      ‘‘పోనీ ఈ గుంటైనా నాలా అవకూడదని బడికి పంపితే, రోజూ మొరాయిస్తోంది... చూడు పెద్దమ్మా!’’ అని హారికను చూపిస్తూ, తలమీద మొట్టికాయేసింది అమ్మ. దెబ్బకు పువ్వును వదిలి ఈ లోకంలోకి వచ్చింది హారిక. తనను ఊరడించడానికి, సిక్కం విప్పి రూపాయి చేతిలో పెట్టింది బంగారమ్మ. దాంతో ఆ పసిముఖంలో పున్నమి వెన్నెల కురిసింది. తేలికైన హృదయాలతో తల్లీబిడ్డలు బడికి చేరుకున్నారు.
      హారికకు రంగు, రుచి, వాసనలు మాత్రమే తెలుసు. వాటితో కూడిన వస్తువుల పేర్లు ఇప్పుడిప్పుడే తనకు పరిచయం అవుతున్నాయి. బడి ప్రహరీ దగ్గరికి చేరుకునేసరికి అప్పుడే ఉడకబెట్టిన పెండలం దుంపల వాసన వైపు మనసు మళ్లింది. దుంప కావాలని అమ్మని అడిగింది. బంగారమ్మ ఇచ్చిన రూపాయి ఉంది కదా అని ఆమె కూడా కాదనలేదు. పావలాకి రెండు దుంపలు. మిగిలిన ముప్పావులాని కొంగున ముడేసుకుంది. 
      అక్కాచెల్లెళ్లిద్దరికీ చెరో దుంప పంచితే హారిక సహించలేదు. రెండూ కావాలని ఏడుపు. ‘‘తినేస్తన్నవే గుంట!’’ అని అమ్మ మరో పావలా తీసి, ఇంకో రెండు దుంపలు కొనింది. ఒకటి హారికకు ఇచ్చి, మరొకటి తనే తినేసింది. హారిక ఏడుపు ఆపలేదు. ఈసారి దుంపకు బదులు మొట్టికాయ దక్కింది. దాంతో తీవ్రత పెంచి ఎక్కబీక్కుంది. సహించలేక అమ్మ బరబరా బడిలోకి ఈడ్చుకుపోయింది.
      ఒక రూపాయంటే ఎంతో హారికకు తెలియదు. ‘‘అన్నీ నువ్వే తీసేసుకుంటావు. నా మూడు రూపాయలు ఇవ్వకపోతే పొడిసేత్తను..’’ ఏడుస్తూ అమ్మను తిట్టింది. ఆమె హావభావాలకు అమ్మ నవ్వింది. ఎందుకంటే తాను అచ్చం అలాగే అత్తని తిట్టేది. హారికలో ఆమే కనిపించింది. ముసిముసిగా నవ్వుకుంది. అత్తాకోడళ్ల తగవులను దగ్గర నుంచి చూసిన హారికకు వాళ్ల తిట్లూ, మూతివిరుపులూ అతి సునాయాసంగా సంక్రమించిన వారసత్వ సంపదలు.
      అప్పటికింకా బడి గంట కొట్టలేదు. మాస్టారు ఆఫీసుగదిలో ఏదో రిజిస్టర్‌లో ముఖం దూర్చి పరిసరాలను మరిచిపోయారు. ‘‘ఏమండీ! మా అత్తకి శుక్రవారం గుడ్డు ఇవ్వలేదు?’’ వస్తూనే ప్రశ్నించింది అమ్మ. చేసే పనిమధ్యలో ఆపి తలెత్తిన మాస్టారు ‘‘చూడండీ... పిల్ల బడికి వస్తేనే గుడ్డు ఇచ్చేది. అయినా మీ అత్తకు ఎందుకు ఇస్తాం?’’ కటువుగా అన్నారు. అప్పటికే ఆయన్నెవరో గాయపరిచారు. ఆ గాయాన్ని ఆమె వెళ్లి మరింత పొడిచింది. వండేవాళ్లతో కుమ్మక్కై మాస్టారు గుడ్లను తినేస్తున్నాడన్న అపవాదు ఉంది. వాస్తవానికి మాస్టారు కక్కుర్తి మనిషి కాదు. అందుకే అతనికి అంత కోపం.
      ‘‘ఈ రోజునుంచీ హారిక వచ్చేస్తది. బాగా భయం చెప్పండి. కొట్టినా ఏమీ అనం’’ అని బిడ్డను చేతిలో పెట్టింది అమ్మ. ‘‘నేనొక్కణ్నే కాదు ఇంటికాడ మీరూ చదివిస్తుండాల’’ మాస్టారు బాధ్యతకు బదులు మరొకటి అప్పజెప్పారు.
      ‘చదువు... చదువు...’ అని చెప్పడం తెలుసుగానీ ఎలా చదవాలో, చదివించాలో తెలియని అతిమామూలు తల్లిదండ్రుల లాంటోళ్లే హారిక అమ్మానాన్నలు కూడా. అలాంటి అమ్మ మాస్టారుకు ఏమని బదులివ్వగలదు!? పైగా... బడిలో పాఠాలు చెబుతారు. అవి మాత్రమే చెప్పాలి. కానీ, ఆ అమాయకురాలు... భయం నేర్పమని అడిగింది. 
      మాస్టారు కోపంగా ఉన్న సంగతి అర్థమైంది కాబోలు, కారుతున్న హారిక ముక్కును కొంగుతో పిండి వెళ్లిపోయింది అమ్మ. కొద్దిసేపటికి హారిక ఏడుపు ఆగింది, కానీ ఆ రోజంతా ముక్కు ఎగబీలుస్తూనే ఉంది.
ఇంతలో బడిగంట మోగింది. పిల్లలందరూ ప్రార్థనకి సమాయత్తం అయ్యారు. ఏం చేయాలో హారికకు తెలియదు. ఎందుకంటే ఏ రోజూ ఆమె సమయానికి బడికి రాలేదు. పోనని మొండికేయడం, అమ్మ లాక్కురావడం, అలా గంట కొట్టిన గంటకు బడికి చేరడం రోజూ జరిగే తంతు. కానీ, ఇవాళ హారిక సమయానికి వచ్చింది. అందుకే మిగతా పిల్లలు అలవాటుగా లైను కట్టడం మొదలుపెడితే తను దిక్కులు చూస్తోంది. ఇంతలో తల వెనక బలంగా చేయి తాకింది. తూగిపడబోయిన ఆమెను కొట్టిన మాస్టారే అందుకుని లైనులో నుంచోబెట్టారు. ఊహించని దెబ్బకు ఉలిక్కిపడింది హారిక. ఏం జరిగిందో అర్థంకాక, చుట్టూ నవ్వుతోన్న పిల్లలను చూసింది. బిక్కమొహం వేసి ఏడుపు లంకించుకోబోయింది. 
      ఈలోగా అర్థంకాని పదాలను యాంత్రికంగా పలుకుతూ... ఒకరు బిగ్గరగా, ఒకరు నెమ్మదిగా, ఒకరు పెదవులనాడిస్తూ ప్రార్థన ప్రారంభించారు పిల్లలు. హారికకు వచ్చే ఏడుపు ఆగిపోయింది. కానీ, ఆ ప్రార్థన ఎందుకో తనకి తెలియలేదు. ఒక్క విషయం మాత్రం ఆ చిట్టిబుర్రకు బోధపడింది. అదే... బడిలో నిన్నటి ఆహ్లాదకర వాతావరణం లేదని! ఇంట్లోనో, పక్కబడి మాస్టారో, పై అధికారో లేక పిల్లల తల్లిదండ్రులో ఎవరివల్లో మాస్టారుకు గాయమైంది. దాని తాలూకు సలుపు బడి వాతావరణంలో కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే ఓ వ్యక్తి తాలూకు సంతోషమో, బాధో మరొకటో ఏదైనాసరే, పక్కవ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. మనుషుల్లో మాత్రమే కనిపించే ఇలాంటి ప్రత్యేక జీవనాన్ని ఇంకెక్కడా నేను చూడలేదు. 
ప్రార్థన అయిపోయింది. తరగతి గదిలో పాఠం మొదలైంది. కానీ, ఆ రోజు మాస్టారు భాష మారిపోయింది. ‘ఏమే, ఏంట్రా, యెదవా, గుంటా...’’ ఇలా ఏదో ఒకటి వాక్యానికి చివర దొర్లుతూ పాఠం ప్రారంభమైంది. 
      ‘‘అందరూ నోటి మీద వేలెయ్యండి. పెన్నూ, పుస్తకాలను లోపల పెట్టండి. తిన్నగా వినండి లేకపోతే...’’ మాస్టారు నిబంధనలు జారీ చేశారు. పిల్లలందరూ మూతులూ, చేతులూ బిగించారు. చెవులతో వింటున్నట్టున్నారే గానీ ఒక్కొక్కరి హృదయాలు ఎక్కడ ఉన్నాయో ఎవరూ ఊహించలేరు. 
      ఉన్నపళంగా పాఠాన్ని బలంగా కుక్కేస్తున్నానని మాస్టారికి తెలియదు. పిల్లలకు తెలుసు. సర్కస్‌లోలా చెప్పింది చేస్తుండాలి. అక్కడి జంతువుల మాదిరిగానే తమకూ గొంతులేదు. మాస్టారు యువకుడు. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మొదటిస్థానంలో వచ్చినవాడు. ఆయనకు తన జీతం, నెలకు పూర్తి చేయాల్సిన సిలబస్‌ మాత్రమే చేతనంలో ఉంటుంది. మరి పిల్లల సంసిద్ధత..?
      దాహంగా ఉన్న గుర్రానికి మనం నీటితొట్టి చూపిస్తే చాలు. కానీ, దాహంగా లేని దాన్ని ఏం చేయగలం? కనీసం తొట్టివరకూ కూడా మోసుకుపోలేం. ఇక్కడ కూడా అంతే! పిల్లల సంసిద్ధత గురించి మాస్టారుకు పట్టింపు లేదు. పుస్తకంలో ఉన్న ప్రతీ అక్షరం పిల్లల మెదడులోకి ఎక్కిపోవాలన్నదే ఆయన గమ్యం. ఆయన దృష్టిలో అంత బాగా పాఠాన్ని ఎవరూ చెప్పలేరు.
      అలాంటి వాతావరణంలో పిల్లలకు ఏం చేయాలో తెలుసు. అర్థం కాకపోయినా అయినట్లు నటించాలి. నరనరాలు నిలువనీయకపోయినా పిల్లచేష్టలను బలవంతంగా అణచుకోవాలి. వాళ్లకు బడి నేర్పిన పాఠాల్లో బాగా అర్థమైంది అదే. పరిసరాల గుణ్యత! జీవరాశికి ప్రకృతి నేర్పిన గొప్పపాఠం. 
      మాస్టారి పాఠం పూర్తయింది. లేచి ఒకరి తర్వాత ఒకరు ఒంటేలు చూపి బయటకెళ్తున్నారు. వాస్తవానికి జారుకుంటున్నారు. అది ప్రశ్నలు అడిగే సమయం. అప్పటికే భయోత్పాతపు కొరడా దెబ్బలకి విలవిల్లాడి పోయి ఉన్నారు పిల్లలు. అందుకే మెల్లగా జారుకుంటున్నారు. ఇంతలో హారిక వంతు వచ్చింది. నిజంగానే తనకు ఒంటేలు వస్తోంది. లేచింది... ‘‘మాషేరూ బుల్లొత్తంది!’’ అని చూపుడు వేలు చూపింది. చిటికెన వేలికి, చూపుడు వేలికి తేడా తెలియదు. అందరు గొల్లుమని నవ్వారు. ఇంతలో...
      ‘‘మాషేరూ నీరజ పాసకని ఇంటికెళ్లిపోయింది!’’ అని శివానీ వార్త మోసుకొచ్చింది. ఇక ఎవరినీ బయటికి పంపకూడదని మాస్టారు నిర్ణయం తీసుకున్నారు. హారికను బలవంతంగా కూర్చోబెట్టేశారు.
ఇంటికివెళ్లి నీరజ, అమ్మని తీసుకొచ్చింది. వాస్తవానికి నీరజ నిన్నటి గైహికం చేయలేదు. ఆ భయంతో బడికివచ్చిన తనను మాస్టారి కోపం మరింతగా జడిపించింది. తరగతిగదిలో ఏడుస్తూ కూర్చుంది. నీరజవి పెద్దకళ్లు. కాటుక కన్నీటికి కరిగి కళ్లంతా అలుముకుంది.  
      ‘‘మాషేరూ.. నీరజ వర్క్‌ చేయలేదు ఈసారికేటీ అనకండి. గానీ అదిగో ఆ హారికను చూడండి. దాంతో కిలారిపేట వైపు గోరింటాకు ఏరడానికి ఎలిపోతుంది మా పిల్ల. అదంతా అడవి! భయం లేకుండా వెళ్లిపోతారు అదీ ఇదీనూ. మేం కాదు గాని మీరు చెప్తే వింటాది. కొంచెం భయం చెప్పండి. సాయంత్రం దాంతో తిరగొద్దని చెప్పండి’’ అని నీరజ తల్లి వాపోయింది.
      నీరజ, హారిక స్నేహితురాళ్లు. బళ్లోనూ, ఇంట్లోనూ వాళ్ల స్నేహానికి ఎన్నో ఆంక్షలు. గోరింట ఏరడం, నూరడం వాళ్లకి చాలా ఇష్టం. బాగా పండాలని ఇటుకబెడ్డ వేస్తారు. వాళ్లకి అలా చేతికి పండే ఎరుపు రంగులోంచి అనేక ప్రశ్నలు పుట్టుకొచ్చి వాళ్ల మదిలోకి చేరతాయి. వాటికి సమాధానాలు మాత్రం వాళ్లకు దొరకవు. 
      అమ్మ వెళ్లిపోయాక మాస్టారు నీరజని పిలిచారు. గైహికం చూపించమన్నారు. భయంభయంగా దగ్గరికొచ్చింది నీరజ. ‘‘ఏమే మాట్లాడవు... నిన్నంతా ఏం చేశావు?’’ అని పిల్టీ పట్టుకుని ముందుకు లాగారు మాస్టారు. రెప్పేయకుండా ఆయన్నే చూస్తోందా పిల్ల. భయంతో ఒకటికి నాలుగుసార్లు కొట్టుకుంటున్న నీరజ గుండె చప్పుడు మాస్టారుకు తప్ప అందరికీ వినిపించేటంత నిశ్శబ్దం. చుట్టూ పిల్లలు బిక్కచచ్చిపోయారు. ఆయనలో ఎన్నో జన్మల తీవ్రగాయాలు నిద్రలేస్తున్నాయి. విస్తాపనం చేసుకోవడానికి గొంతులేని ఓ జీవి దొరికింది. దానికి గాయమై బాధపడితే తన మనసు శాంతిస్తుంది. 
      మాస్టారు అదుపు తప్పారు. తుపాను గాలికి వేళ్లతో సహా ఊడిపడిన చెట్టులా కుదేలై ఊహించని దిక్కులో బోర్లాపడింది నీరజ. గాయపరచాలన్న కసిని, ఆయనలో ఏ మూలనో ఉన్న శక్తి నిగ్రహించి నీరజని దూరానికి విసిరేసింది. నీరజ ఏడుపు తీవ్రత పెంచింది. ‘‘ఆపుతావా... ఆపవా?’’ మాస్టారు అప్రయత్నంగా వాయువేగంతో తన దగ్గరికి చేరుకున్నారు. నీరజ ఏడుపూ ఎక్కిళ్లతో నోరు చిన్నది చేసేసి, రెప్పేయకుండా అలాగే మాస్టారిని చూస్తుండిపోయింది. అంతలో...
      కనిపించని దైవం రాలేదు కానీ, కనిపించని గాలి మాత్రం వచ్చింది. గోడకు నిలువుగా నిలబెట్టిన క్యారమ్‌బోర్డును నేలకు పడగొట్టింది. గుండెలాగిపోయే పెద్దశబ్దం. అందరూ ఉలిక్కిపడ్డారు. కొట్టబోతున్న మాస్టారు ఆగిపోయారు. నీరజ ఏడుపూ ఎక్కిళ్లూ ఆగిపోయాయి. ఎప్పటినుంచో ఉగ్గబట్టిన మూత్రాన్ని వదిలేసి, హారిక నిశ్శబ్దాన్ని ఏడుపుతో ఛేదించింది. మాస్టారు అదుపులోకి వచ్చారు. ఆయన గుండెలో ముల్లు గుచ్చుకున్నట్టయింది. 
      హారిక కళ్లతో కొట్టొద్దని ప్రాధేయపడింది. ఈ క్షణంలో ఆమె మొహం చూస్తే క్రూరమృగమైనా కరగక మానదు. తానే స్థితిలో ఉన్నాడో ఆలస్యంగా అర్థం చేసుకున్నారు మాస్టారు. ఇంతవరకూ నరకంలో ఉన్నట్టనిపించింది. ఆయనకు గాయం ఎలా అవుతుందో తెలియదు. అయ్యాకే తెలుస్తుంది దాని నొప్పి. నీరజ, హారికల బాధ గాఢంగా గుండెల్ని పట్టేసింది. ఎందుకు ఇలా చేశానో అని వెయ్యిసార్లు ప్రశ్నించుకున్నారు. క్షమాపణ అంటే ఏంటో తెలియని నీరజ, హారికలను బుజ్జగించి, బుదగరించి లెక్కలేనన్నిసార్లు క్షమాపణ వేడుకున్నారు. నేలని పరుచుకున్న మూత్రాన్ని తానే స్వయంగా తుడిచారు. ఇద్దరినీ గుండెలకు హత్తుకున్నారు.
      ‘వ్యక్తిగతమైన సవాలక్ష సమస్యలను పిల్లల మీద మోపే హక్కు ఎవరిచ్చారు?’ అని కుమిలిపోయారు. క్షమాపణ అడిగినా అర్థంకాక చూస్తూ నిలబడిన పిల్లల స్పందన ఆయన్ను ఇంకా తీవ్రంగా కలచివేసింది. ‘బడిలోకొచ్చేటప్పుడు వెంటవచ్చిన ఉద్వేగాలను వదిలేసి రావాలి’ అని ఆయనకు అంతరదృష్టి కలిగింది.
ఇంతకీ ఎవరు ఎవరికి పాఠం చెప్పారు? మాస్టారు పిల్లలకా? పిల్లలు మాస్టారికా?
      ఎవరూ ఎవరినుంచీ ఏమీ నేర్చుకోలేదు. సృష్టిలో ఏ శక్తినీ సృష్టించలేం, నాశనం చేయలేం. కేవలం శక్తిని బదలాయించగలం. హారికను ఇంతకుమునుపు అమ్మకూడా ఏడిపించింది... నవ్వించింది... భయపెట్టింది... చిరాకుపడింది... అన్నింటితోపాటూ అప్పుడప్పుడూ ప్రేమించింది కూడా. ఇప్పుడు మాస్టారూ అంతే! కొత్తపాఠం నేర్చుకున్నాక హారికకూ ఒకటి అర్థమైంది. బాల్యాన్ని దాటుతూనే, ఆ నిర్మలత్వాన్ని కూడా కోల్పోయిన మనుషులందరూ సమానమే. అందరూ రెక్కలు తెగిన సీతాకోకచిలుకలే. అందులో అమ్మ, మాస్టారు కూడా ఉన్నారు. అందుకే అందరిలాగే రోజూ బడికి వెళ్లడానికి నిశ్చయించుకుంది. 
      ఆమెకోసం వెళ్తున్నాను. ఇక తను మా రంగుల లోకంలోకి రాదు. చూస్తే నా రెక్కలు తెగే సమయం వచ్చేసింది. ప్రాణాలు పోనున్నాయి. ఈలోపే తన చేతులతో రెక్కలను చింపించేసుకోవాలి.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam