ఉల్లిపాయ - నిమ్మకాయ

  • 197 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మానస ఎండ్లూరి

  • పరిశోధక విద్యార్థిని, తెలుగు విశ్వవిద్యాలయం,
  • రాజమహేంద్రవరం
  • 9160734990
మానస ఎండ్లూరి

కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. వాటిని వదులుకోవడం వారివల్ల కాదు! ఇక్కడ కూడా ఓ పెద్దమనిషికి అలాంటి అలవాటే ఉంది... అదికూడా ప్రత్యేకంగా భోజనం చేసేటప్పుడే! అదేంటి? దానివల్ల ఏయే సందర్భాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి?
ఆదివారం!
అందరికీ విశ్రాంతి దినం. అమ్మకు తప్ప!
      కోడికూర, గోంగూర పచ్చడి, మిరియాల రసం, అన్నం వండి భోజనాల బల్లమీద సర్దుతోంది అమ్మ. నేనూ నాన్నా హాల్లో టీవీ చూస్తున్నాం.
      నాన్నంటే ఆకాశమంత ప్రేమ, ఇసుక రేణువంత భయం! నన్నూ అమ్మనూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు కానీ మహా మొండి మనిషి! అనుకున్నది అనుకున్నట్టు జరిగి తీరాల్సిందే!
      అమ్మ నాకూ నాన్నకూ భోజనం హాల్లోకే తెచ్చింది. ముగ్గురం కలిసే భోంచేద్దామని ఎన్నిసార్లు చెప్పినా వినదు. ఒక్కత్తే ఆఖర్లో తింటుంది. నాన్న పళ్లెంలో అన్నం కూరలు వడ్డించి ఏదో మర్చిపోయినట్టు హడావుడిగా వంటగదిలోకి వెళ్లింది అమ్మ.
      ‘‘సరితా! ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఉల్లిపాయా నిమ్మకాయ పెట్టమని!!’’ ప్రతీసారీ నాన్న చెప్పాల్సిందే! ‘ఆ తెస్తున్నా! అబ్బా...!!’ కెవ్వుమంది అమ్మ.
      నేను వెంటనే లోపలికి పరిగెత్తాను. బొటనవేలు తెగింది అమ్మకి! అమ్మని తప్పుకోమని, ఉల్లిపాయలు కోసి నాన్న ఎదురుగా పెట్టాను. అవి తెచ్చేదాకా ఆయన భోజనమే మొదలు పెట్టలేదు!
      ‘‘ఎందుకు నాన్నా అంత కంగారు పెడతారు? అమ్మ చెయ్యి తెగింది! ఉల్లిపాయ నిమ్మకాయ లేకపోతే ముద్ద దిగనట్టు చేస్తారు!’’ కోపంగా అన్నాను.
      ‘‘కోడికూరలోకి అవి రెండూ లేకపోతే ఎలాగమ్మా? అయినా మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ కొత్తే!’’ ఉంగరాలుగా కోసిన ఉల్లిపాయల మీద నిమ్మచెక్క పిండుతూ అన్నారు నాన్న.
      భోజనం పెట్టకుండా ఒట్టి ఉల్లిపాయా నిమ్మకాయలు పెట్టినా ఊరుకుంటారేమో గానీ అవి లేకుండా మాత్రం నాన్న భోజనం పూర్తవదు!        

* * *

      పోయినేడాది ఎండాకాలంలో నాన్నమ్మ చనిపోయిందని ఫోనొచ్చింది. హుటాహుటిన బయల్దేరాం. ఎనిమిది గంటల రైలు ప్రయాణం చేసి పెదనాన్న ఇంటికి చేరుకున్నాం. నాన్నమ్మ చనిపోయింది అక్కడే. మా చిన్నత్త ఆస్ట్రేలియా నుంచి రావడానికి రెండ్రోజులు పడుతుండటంతో నాన్నమ్మని మార్చురీలో ఉంచారు. మరుసటి రోజు పొద్దున్నే బంధుమిత్రుల సందర్శనార్థం ఇంట్లో ఐస్‌బాక్స్‌లో పెట్టారు.
      నాన్న రోదనకి అంతులేదు! వెళ్లిన దగ్గరినుంచీ పచ్చిగంగ కూడా ముట్టకుండా ఏడుస్తూనే ఉన్నారు. అమ్మ, నేను, పెదనాన్న, పెద్దమ్మ ఎంత చెప్పినా తినలేదు. 
      మరుసటి రోజు నేను పక్కింట్లో అన్నం వండి, తోటకూర రుబ్బి తాలింపు పెట్టి తీసుకొచ్చాను నాన్నకి. తిననంటే తిననని మొండికేశారు. పెదనాన్న గట్టిగా మందలించడంతో మెల్లగా ఒక్కో ముద్దా తినడం మొదలుపెట్టారు. మూడో ముద్దకి ఏదో అడుగుతున్నారు నాన్న. పాపం మాట్లాడటానికి ఓపిక లేక మంచినీళ్లు ఇమ్మని సైగ చేస్తున్నారనుకుని నీళ్లిచ్చాను. 
      ‘‘కాదు! ఉల్లిపాయ కావాలి’’ అన్నారు! ఆ దెబ్బకి కానీ అర్థం కాలేదు మాకు! నాన్నకి తల్లి లేకపోయినా ఉల్లి మాత్రం ఉండి తీరాల్సిందేనని!!
      ఆ తర్వాత రెండేళ్లకి మంచి సంబంధం చూసి వైభవంగా నాకు పెళ్లి చేశారు. పెళ్లి తంతంతా పూర్తయ్యాక అందరం భోజనానికి కూర్చున్నాం. నాన్నకూ, శ్రీవారికీ మధ్యలో నేను.. 
      అందరూ భోజనం మొదలుపెట్టారు. కానీ నాన్న అటూ ఇటూ దిక్కులు చూస్తున్నారు!
      ‘‘ఏంటి నాన్నా?!’’ చెవిలో అడిగాను.
      ‘‘అదే! ఉల్లిపాయ నిమ్మకాయా...’’
      ‘‘అబ్బా! కాస్త ఇప్పుడన్నా వాటిని క్షమించు నాన్నా! అందరూ ఏమనుకుంటారూ?’’
      ‘‘ఏంటి బావగారు? ఏమంటుంది మా కోడలు?’’ వియ్యంకుడు.
      ‘‘అబ్బే ఏం లేదండి! హిహిహి!’’ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నాన్న.
      ‘‘ఇవిగో! ఇక తినండి!’’ నాన్న విస్తరిలో రెండు ఉల్లిపాయ ముక్కలు, త్రికోణాకారపు నిమ్మచెక్కలు వేస్తూ అంది అమ్మ!
      లక్ష దీపాల వెలుగూ వెయ్యేనుగుల బలం వచ్చినట్టుంది నాన్న మొహం!!

* * *

      ‘‘ఏంటీ మీ నాన్న? బోడి ఉల్లిపాయ నిమ్మకాయ కోసం అన్నం తినకుండా అరగంట సేపు కూర్చోవాలా?’’ కోపంగా అన్నాడు నా భర్త క్రాంతి.
      ‘‘అయిపోయింది కదా! ఇంకెందుకు గొంతు చించుకుంటున్నావు?’’ పిల్లనెత్తుకుంటూ అన్నాను. ‘‘ఏంటి అయిపోయేది? నా పరువు తీశాడు! సర్దుకుపోవడం తెలియదా మీ నాన్నకి? ఉల్లిపాయ నిమ్మకాయ లేకుండా తినలేకపోతే వాటినే మాలకట్టి మెళ్లో వేసుకు తిరగమను! ఏ క్షుద్రపూజలు చేసుకునేవాడో అనుకుంటారు! మనవరాలి బారసాలకొచ్చి ఉల్లిపాయ నిమ్మకాయల్లేవని అలకేంటో నాకర్థం కాదు!’’
      ‘‘మర్యాదగా మాట్లాడు క్రాంతీ! ఆయన ఎదురు చూశారు. అలగలేదు! ఇంటికొచ్చిన మావగారిని ఎలా చూసుకోవాలో తెలియదు! నువ్వు మా నాన్నగార్ని తక్కువ చేసి మాట్లాడతావా? ఆయన్ని అవమానించిన ఇంట్లో నేనుండలేను!!’’ బ్యాగ్‌తో బయల్దేరాను.
      అలా మా నాన్న ఉల్లి నిమ్మల ‘పిచ్చి’ మేం కారాలూ మిరియాలూ నూరుకునే దాకా తీసుకొచ్చింది!!

* * *

      తర్వాత కొంతకాలానికి నాన్న కాన్సర్‌తో బాధపడుతూ మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు! పెద్దకర్మ రోజు ఆయన ఫొటో ముందు ఆయనకు ఇష్టమైనవన్నీ వండి వడ్డించి పెట్టారు. అప్పుడూ ఎవరూ ఉల్లిపాయ నిమ్మకాయల గురించి పట్టించుకోలేదు!
      నేను వెళ్లి నిమ్మకాయ అడ్డంగా కోస్తుంటే నాన్న జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నట్టు అనిపించాయి. ఉల్లిపాయ కోసిన ప్రతిసారీ కళ్లు తుడవాల్సిందే! కానీ ఇప్పుడు దాన్ని చూస్తుంటేనే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. ఎన్ని వేల ఉల్లిపాయలు కోస్తే నాన్న మళ్లీ తిరిగొస్తారు?! ఆయన ఉన్నప్పుడు       తిట్టుకుంటూ గొణుక్కుంటూ సణుక్కుంటూ వంటింట్లో ఏ మూలో సగం ఎండిపోయిన నిమ్మకాయ కోసిచ్చేదాన్ని!
      అదేంటో! నాన్న అడిగినప్పుడల్లా నిమ్మకాయలు కనిపించేవే కాదు! ఇప్పుడు విరివిగా కనిపిస్తున్నాయి, ఏ దుకాణంలోకెళ్లినా.. ఏ జ్ఞాపకాల్లోకెళ్లినా! 

* * *

      మా పాప మూడో పుట్టినరోజు వేడుకకు వచ్చిన అతిథులందరూ సెలవు తీసుకుంటున్నారు... ‘‘ప్రగతీ! ఇలా రా! త్వరగా!’’ క్రాంతి అరుపులు. ‘‘అబ్బబ్బా! అన్నిటికీ తొందరే ఈయనకి! మళ్లీ కలుద్దామండీ!’’ ఆఖరి అతిథికి వీడ్కోలు చెప్పి లోపలికి వచ్చాను. పాపకి పట్టుబట్టలు మార్చి గౌను వేసి భోజనాల బల్లమీద కూర్చోబెట్టాడు క్రాంతి. ఎదురుగా పెద్ద అరటాకులో కొంచెం బిర్యాని కొద్దిగా పెరుగూ వేసున్నాయి. పాపకి అన్నం తినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. 
      ‘‘ఏంటీ నీ గావుకేకలు?’’ జారుతున్న కొంగు భుజం మీద వేసుకుంటూ అడిగాను. ‘‘నీ కూతురు ఏమడుగుతోందో చూడు!’’ పాప తల నిమురుతూ అన్నాడు క్రాంతి. ‘‘ఏం కావాల్రా తల్లీ?’’ బుగ్గలు నొక్కుతూ అడిగాను మా పాపని. 
      ‘‘అమ్మా! ఉల్లిపాయ నిమ్మలాయ కావాల!’’ ముద్దుముద్దుగా చెప్పింది. 
      నాన్న వెళ్లిపోయినప్పటి నుంచీ అవి తినడం మానేశాను. క్రాంతికి అసలు అలవాటే లేదు! మరి దీనికెలా వచ్చిందీ అలవాటు?? అమ్మ మాతోనే ఉంటున్నా తనకూ ఆ అలవాటు లేదు! పాప ఇంతకు ముందెప్పుడూ అడిగిందీ లేదు! ఇదేంటీ కొత్తగా!?
      నా ఆలోచనలకు తెరపడుతూ పాప గొంతు మళ్లీ బిగ్గరగా వినిపించింది. ‘‘అమ్మా! ఉల్లిపాయ్‌ నిమ్మలాయ్‌ కావాల...’’
      నా కన్నీళ్లు వరదలయ్యాయి...
      ‘‘మీ నాన్నే మళ్లీ మన పాపగా పుట్టారనిపిస్తుంది కదూ!’’ అంటూ నా భుజం చుట్టూ చేతులు వేశాడు క్రాంతి.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam