భక్తి చెప్పుల మీద!!

  • 160 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వి.ఆర్‌.గణపతి

  • విశ్రాంత ఆంధ్రాబ్యాంకు మేనేజరు,
  • కరీంనగర్.
  • 9160061172
వి.ఆర్‌.గణపతి

దినాము ఇరవై గంటలకన్న ఎక్కువనే! కమ్‌ సే కమ్‌ రెండు గంటలు సుత రికాము లేకుంట మనుషుల జాతర! దినానికి ఇరవై గంటలు! వారానికి ఏడు దినాలు! నెలకు నాలుగు వారాలు!... యాడాది పొడుగూత! యాష్ట కస్తున్నది. అమ్మగారు సుత పరేషాన్‌ అయితున్నది! ఏం చెయ్యాల్నో మనుసున పడుతలేదు! ఏమన్న చేసుడే! ఏం చెయ్యాలె? ఎట్ల చెయ్యాలె???

* * *

      క్యూ కాంప్లెక్సులన్నీ నిండి పోయినయి. మనుషులు! మనుషులు! లొల్లి లొల్లి! ఆగమాగం! పెయ్యిల నెత్తురు కరిగి చెమటై కారంగ రిక్షా తొక్కే వెంకటి క్యూల ఉన్నడు! ఆని ఎన్కనే మండలాపీసుల కొలువు జేసే నారాయణ! నలుగురికవతల ఊరోళ్ల ఆపతికి అవుసరానికి వాళ్ల బతుకులను కుదువ పెట్టుకొని మిత్తికి పైసలు తిప్పి కుబేరుడైన నాగేస్పర్రావు! అగో, గక్కడ సూసిండ్రా, కట్టని బిరిడ్జీలకు, ఎయ్యని రోడ్లకూ ఇకుమతి తోటి బిల్లులు పాస్‌ సేయించుకునేటి గుత్తేదారు గురవయ్య! పతాకం పర్సంటేజీలు మాత్రమే లెక్క సూసుకొని గుడ్డిగ సంతకాలు పొడిసేటి ఇంజినీరు ఈశ్వర ప్రసాదు! సర్కారు దవాఖానల జీతం తీసుకుంట, రోగులను తన సొంత ‘మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌’లోనే వైద్యం చేసే డాక్టరు ధన్వంతరి! ఇరవై ఆటోలను దొంగపేర్లతోటి కిరాయికి నడిపిస్తున్న పోలీసు అమీన్‌సాబు యాద్గిరిరెడ్డి! సదువుకున్న సదువును పైరవీలకు సెటిల్మెంటు దందాలకు వాడుకొని కోట్లు కమాయించిన వకీల్‌ వరహాల్రావు! ఈళ్లందరికీ కొండ లెక్క భరోసాగా నిలబడి ప్రజల సేవజేసేతందుకే ఈ కలికాలంల అవతారం ఎత్తి, ఏ ఎండ కొడ్తే ఆ జెండా నీడకు అతుక్కుపోయి ఎప్పటికీ సల్లసల్లటి ఎర్రబుగ్గ కారులనే బుర్రబుర్ర పొయ్యేటి ‘అప్నా నేతా’ లీడరుసాబు రామిరెడ్డి దొర! అందరు వరసలనే ఉన్నరు. అందరి కండ్లల్ల ఎగిర్తం, తొందర! ఓపిక లేనితనం! ఉర్కులాట!!
      ఏమైందో ఏమోగాని ఉన్నట్టుండి అంతట దీపాలు మలిగి పోయినయి! చిక్కటి నల్లటి దుప్పటి కప్పినట్టు చీకటి! చిమ్మంజీకటి! అందరూ పరేషాన్‌ పరేషాన్‌! ఆగమాగం ! లొల్లి లొల్లి ! గాయి గాయి!! 
రెండు నిమిషాలు గట్లనే ఎక్కడోళ్లక్కడే నిలబడ్డారు అందరు! ఒక్కసారి అందరి కండ్లూ మెరిసిపోయే, మెరుపు లెక్క వెల్తురుతోటి జ్యోతి! అందరు నోర్లు తెరిసిండ్రు. ఇచ్చెంత్రం! గుడి లోపట ఉండేటి మనిషెత్తు ఎంకన్న దేవుడు... అంత్రంల... గంత ఎత్తుల... అందరికీ కనిపించుకుంట...!! 
      ‘‘గోవిందా! గోవిందా!!’’.. భక్తితోటి పెయ్యి మరిసిన జనం!!
      చెవులల్ల ఇయర్‌ ఫోన్లు పెట్టుకున్నట్టు... అందరికీ మంచిగ ఇనపడుతున్నది దేవుని మాట...!!
      ‘‘భక్తులారా! మీరందరూ భూమి నాలుగు చెరగుల నుంచీ అనేక కష్టనష్టాలకు ఓర్చి రావటం నన్ను కదిలించింది. మీకు ఈ ఏకాదశి సందర్భంగా ఓ గొప్ప అవకాశం!! నన్ను ఒక్క క్షణం చూడటానికే ఎన్నో గంటల నుంచి ఓపికగా శ్రమను లెక్కచెయ్యకుండా నుంచున్నారు కదా! ఉన్న పళాన మిమ్మల్నందర్నీ సాక్షాత్తు నా నిలయం వైకుంఠానికి తీసుకెళ్తాను! అక్కడ మీకు సకల సౌఖ్యాలూ సమకూర్చుతాను! పునర్జన్మ లేకుండా ముక్తిని ప్రసాదిస్తాను! ఓ గంట సమయం ఇస్తున్నాను! రావాలనుకునే వాళ్లు సిద్ధంగా ఉండండి!’’
      ...మాయమైపోయిండు దేవుడు! అంతట మల్ల చిమ్మంజీకటి కప్పుకున్నది! గంట కాంగనే అంతట దీపాలు ఎలిగినయి!
వరసల్ల ఒక్క మనిషీ లేడు! గుడిల, గర్భగుడిల పూజలు చేసుకుంట ఉండేటి అయ్యగార్లు సుత మాయం! దేవస్థానంల కొలువు చేసేటి ఉద్యోగులు, ఆఫీసర్లు... అందరూ పరార్‌!! జనాన్ని గదమాయించేటి బందోబస్తు పోలీసోల్లు... ఒక్కడుంటే ఒట్టు! ఎక్కడా ఎవరూ లేరు! అంతా ఖాళీ!! దేవుడు నవ్వుకుంట మెల్లగ కండ్లు మూసుకొని పరుపు మీద ఒరిగిండు!!
      నాకు బుగులేసింది! కండ్లు బిగ్గిత మూసుకున్న...! గట్టిగ ఒర్రిన... ‘‘దేవుడా...! దేవుడా’’ అంట..!!
      భుజంమీన ఎవల్లో సరిసినట్టయింది! కండ్లు తెరిసిన...! ఎదురుంగ జయమ్మ..!
      ‘‘ఏమైందయ్యా... గట్టిగ ఒర్లుతున్నరు... నిద్రల..? పాడు కలగిట్లనా...?’’
      ... అటీటు జూసిన. మా ఇల్లే!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam