మోహనరావు మోటరుబైకు

  • 198 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కుంతి

  • తెలుగు ఉపాధ్యాయులు, జవహర్ నవోదయ విద్యాలయం
  • సికింద్రాబాదు
  • 8790920745
కుంతి

ముద్దుల భార్య ముచ్చటపడి అడిగిన ఓ కోరిక... తొలిరాత్రి నాడు మోహనరావుకు ముచ్చెమటలు పట్టించేసింది. అప్పటి నుంచి అతని జీవితం... పల్లేర్ల బాట మీద చెప్పుల్లేని నడక మాదిరిగా తయారైపోయింది. మరి చివరికి అతని కథ ఏమైంది?
ఆ గదిలో
అత్తరు పరిమళాలు పలుచబడ్డాయి. వెలిగి వెలిగి పొగనింపిన అగరుధూమం ఆగిపోయింది. అంతవరకు తొలిరేయి శృంగార సామ్రాజ్యాన్ని ఏలిన రతీమన్మథులు మోహనరావు, చారులతలు డస్సిపోయి, విడివడి ఆనందంలో ఓలలాడుతూ, మౌనంగా సేదతీరుతున్నారు. చారులత భర్తవైపు తిరిగి తన చీరచెంగుతో, అతని ముఖం తుడిచి, అంతలోనే సిగ్గుతో మరోవైపు తిరిగింది. మోహనరావు భార్యను తనవైపు తిప్పుకున్నాడు. ఆమె కళ్లలోకే చూస్తూ, ‘‘చారూ! నా జీవితంలో ఇంత ఆనందాన్ని ఎప్పుడూ పొందలేదు. ఈ క్షణంలో నీకు ఏదైనా కానుక ఇవ్వాలనిపిస్తోంది. కొంత డబ్బు బ్యాంకులో పొదుపు చేశాను. వజ్రాల హారం కావాలా? డార్జిలింగ్‌ ట్రిప్‌ కావాలా? చెప్పు.. నీకేం కావాలో అది చేస్తా’’ అన్నాడు కావ్యనాయకుడిలా.
      చారులత భర్తకేసిచూస్తూ, ఏదోచెప్పలేక ఇబ్బందిపడుతూ, మౌనంగా ఉండిపోయింది. ‘‘నీకేం కావాలో కోరుకో... అది తీర్చలేకపోతే నా జన్మ వ్యర్థం. తొలిరాత్రి నాడు భార్య కోరే మొదటి కోరికను తీర్చనివాడు మగాడే కాదు. సందేహించక అడుగు’’ అంటూ మళ్లీ రెట్టించాడు మోహనరావు.  
      చారులత భర్త చేతిని తన చేతిలోకి తీసుకొని, ‘‘మరీ.. మరీ..’’ అంటూ ఆగిపోయింది.
      ‘‘చెప్పు చారూ! పాములపుట్టలో చేయిపెట్టాలా, సప్త సముద్రాలు ఒడిసి పట్టాలా, కొండలు పిండి చేయాలా’’ అంటూ నాటకీయంగా చెలరేగిపోయాడు మోహనరావు.
      ‘‘నాకు చిన్నప్పటి నుంచీ బైకుమీద షికారుకెళ్లడమంటే ఇష్టమండీ. నిన్నటి దాకా మా నాన్నగారు, అన్నయ్యలు నన్ను తిప్పేవాళ్లు. పెళ్లయ్యాక భర్తతో సినిమాలకు, షికార్లకు బైకు మీద చక్కర్లు కొట్టాలని కలలు కనేదాన్ని, పొద్దున అత్తయ్యగారు మాటల సందర్భంలో మీకు బైకు నడపడం రాదని అన్నారు. అప్పటి నుంచి చాలా దిగులుగా ఉంది. నాన్నగారు లాంఛనంగా బైకు కొనిపెడతానంటే మీరొద్దన్నారు. అది మీ ఆదర్శమనుకున్నాను కానీ, మీకు అసలు బండి నడపడమే రాదని ఊహించలేదు. మీరు నిజంగానే ఆదర్శాలు కలవారనుకోండి... మీకు నా మీద అంత ప్రేమే ఉంటే, బహుమతి ఇవ్వాలని అనుకుంటే, వెంటనే బైకు కొనేయండి. ఎంచక్కా మనం ఝాంఝాం అంటూ ఊరంతా చుట్టెయ్యవచ్చు’’ నెమ్మదినెమ్మదిగా చెప్పాల్సిందంతా చెప్పేసింది చారులత. పక్కలో బాంబులు పడ్డట్టుగా ఉలిక్కిపడ్డాడు మోహనరావు. ఒకేసారి వేల సునామీలు చుట్టుముట్టినట్లుగా తోచింది. ఇలా బలహీన సందర్భాల్లో భార్యలదగ్గర నోరుజారి కష్టాలపాలైన పురాణపురుషులు గుర్తొచ్చారు. తొలిరేయి మత్తు మొత్తం దిగిపోయింది. అసలు అతనెందుకు ఇలా జావగారిపోయాడంటే... 

* * *

      మోహనరావు డిగ్రీ చదువుతున్న రోజులవి. తోటివారంతా స్కూటర్లు, మోటర్‌ సైకిళ్లు ఎక్కి తిరగడం చూసి తానూ అలా చేయాలనుకునేవాడు. ఇంట్లో వాళ్లెవరికీ బండి లేదు. కొనే స్థోమతా లేదు. సైకిల్‌ మాత్రం ఉండేది. అది నేర్చుకున్నాడు. ‘‘సైకిల్‌ వస్తే మిగతా బళ్లు నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు’’ అన్న సూత్రం ఆధారంగా మిత్రుడి మోపెడ్‌ అడిగి, దాన్ని ఎలా నడపాలో కొంత తెలుసుకుని షికారు బయలుదేరాడు. కొంతదూరం బాగానే వెళ్లాడు. ఇంతలో అమ్మాయిల కాలేజీ గేటు దగ్గరికి రాగానే బండి ఆగిపోయింది. దాన్ని స్టార్ట్‌ చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఎంతకీ కావట్లేదు. ఒళ్లంతా చెమట పట్టింది. అప్పుడే సరిగ్గా కాలేజీ వదలడంతో, అమ్మాయిలంతా బయటికొస్తున్నారు. ఇతని అవస్థను చూసి వాళ్లు తమలో తాము నవ్వుకుంటూ పోతున్నారు. కిక్‌ కొట్టడం ఆపి, చైన్‌ మిగిలిన భాగాలను పరిశీలించాడు. ఆ ప్రయత్నంలో చేతులు మురికి పట్టాయి. కంగారులో చెమట పట్టిన ముఖాన్ని ఆ చేతులతోనే తుడుచుకున్నాడు. ముఖం మసితో, మనసు అవమానంతో నల్లబడింది. ఏదో చేయబోయాడు. చైన్‌ ఊడిపోయింది. పెట్రోల్‌ పైపు లీకైంది. నిస్సహాయత ఆవరించింది. అమ్మాయిల ముందు రథచోదక నైపుణ్యహీనుడై, భూమిలో రథం కుంగిపోయిన వేళ దీన కరుణాంతరంగుడైన కర్ణుడైపోయాడు. ఖిన్నుడై, చేష్టలుడిగి నిల్చున్నాడు.  ఇంతలో దైవం ఎవరో ఓ కాలేజీ అమ్మాయి రూపేణా అక్కడికి వచ్చింది. అతని దీనావస్థను గమనించింది. ఒక్క నిముషంలోనే బండిని బాగుచేసి, స్టార్ట్‌ చేసింది. నవ్వుతూ ‘‘దీన్ని ఇంటిదాకైనా తీసుకెళ్లగలరా’’ అంటూ బండిని అతని చేతికి అందించింది. ఆమె నవ్వు, మాటలతో పుండుమీద కారం చల్లినట్లు అనిపించినా దిగమింగుకున్నాడు మోహనరావు. నిస్సహాయంగా నవ్వుతూ, ధన్యవాదాలు చెబుతూ ఇంటిముఖం పట్టాడు. ఆ తర్వాత మోహనరావు బండి కొనుక్కోలేదు. ఇతరుల బండిని అడగాలనీ అనిపించలేదు.

* * *

      మోహనరావు పీజీకి వచ్చాడు. అందగాడు, తెలివైనవాడు, సంభాషణా చాతుర్యం కలవాడు కావడంతో అమ్మాయిలు అతణ్ని  బాగా ఇష్టపడేవారు. రాధ మరీనూ. డబ్బుతో పాటు ఇంట్లో స్వేచ్ఛ ఉన్న అమ్మాయి. కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఆమె తన కైనెటిక్‌ హోండా తీసుకొచ్చింది. మోహనరావుకు ఆ అమ్మాయితో ప్రేమా దోమా ఏమీ లేవు. కానీ ఓ మంచి స్నేహితురాలిలా చూసేవాడు. ఆ రోజు కార్యక్రమాలన్నీ అయ్యేసరికి బాగా రాత్రయింది. ‘‘మోహన్‌... ఇంత రాత్రి ఒంటరిగా వెళ్లాలంటే కొంచెం భయంగా ఉంది. కాస్తాతోడు రారాదూ’’ అంది రాధ. 
      ‘‘ఓ! దానికేం భాగ్యం’’ అన్నాడు. కానీ ఆమె బండి ఇతని చేతిలో పెట్టి, ‘‘నువ్వు నడుపు, నేను వెనక్కి కూర్చుంటా’’ అనేసరికి, ఆమెకు ఏమని సమాధానం చెప్పాలో మోహనరావుకు అర్థం కాలేదు. బండి నడపడం రాదంటే ఆడపిల్ల ముందు తక్కువైపోతాం... ఏం జరిగితే అది జరుగుతుందని బండి తీశాడు. తనకు బండి నడపడమే సరిగ్గా రాదు. పైగా రాధ ఒకవైపు కూర్చోవడంతో బండి పక్కకు వాలుతోంది. భయంతో ఎట్లాగో నడుపుతున్నాడు. ఆమె కులాసాగా కబుర్లు చెబుతోంది. అందమైన అమ్మాయి భుజం మీద చెయ్యేసి మాట్లాడుతుంటే, ఆ ఆనందాన్ని అనుభవించలేని స్థితిలో, లోలోపల కంగారుపడుతూ నడుపుతున్నాడు. రోడ్డు మీద పెద్దగా రద్దీ లేదు కానీ, రాత్రివేళ కావడంతో వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఇంతలో ఎవరో ముగ్గురు కుర్రాళ్లు బైకుమీద వేగంగా వెళ్తూ వీళ్లను చూశారు. ఈ జంటను ఏడిపించడానికి అన్నట్టు ఆ బండి నడిపే కుర్రాడు దూరం నుంచే ఓ కట్‌ కొట్టాడు. అంతే! అప్పటికే భయంభయంగా నడుపుతున్న మోహనరావు చేతినుంచి బండి పట్టుతప్పి... సరాసరి గుంటలో పడింది. ఇద్దరికీ దెబ్బలు తగిలాయి.
      ‘‘ఏంటి మోహన్‌! అప్పట్నుంచి చూస్తున్నాను. చాలా పూర్‌గా డ్రైవ్‌ చేస్తున్నావు. ముందే చెప్పొచ్చుగా నాకు చేతకాదని... నేనే నడిపేదాన్ని’’ అని రాధ అంటుంటే... బండి మీద మోహనరావు అయిష్టత మరీ పెరిగిపోయింది.   
      ఉద్యోగంలో చేరాక ఆఫీసుకు బస్సులో వెళ్లొస్తూండేవాడు. అది కాస్త దూర ప్రయాణం కావడంతో అనేక కష్టాలు పడేవాడు, ‘‘ఇన్ని బాధలు పడటమెందుకు? ఒక బండి కొనుక్కోరాదూ’’ అని సహోద్యోగులు సలహాలిచ్చేవాళ్లు. ‘‘లోన్‌ తీసుకోవచ్చు కదా’’ అని మరొకరు అనేవారు. ‘‘ఇప్పుడు నా సమస్య బండి కొనుక్కోలేకపోవడం కాదు, దాన్ని నడపలేకపోవడం..’’ అని వాళ్లందరికీ చెప్పలేకపోయేవాడు మోహనరావు. ఒకరోజు సన్నిహిత మిత్రుడు పార్థసారథి, ‘‘చూడు మోహన్‌! నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. బండి నడపటం చాలా సులభం. ఇవాళ నా స్కూటరు నడుపు. మనం వెళ్లేదారిలో పెద్దగా రద్దీ ఉండదు. వెనక కూర్చొని చెబుతుంటాను. ఆ ప్రకారం నడుపు’’ అన్నాడు. అనడమే కాదు, స్కూటర్‌ మోహనరావు చేతికిచ్చి, తాను వెనక కూర్చున్నాడు. క్లచ్, గేర్లు, ఎక్సలేటర్‌.. ఇలా ఏవేవి ఎప్పుడెప్పుడెలా వాడాలో చెబుతూ, నెమ్మదిగా నడిపేలా చూస్తున్నాడు. మోహనరావుకు బండి తనకు స్వాధీనమవుతుందని అనుకుంటుండగానే, ఓ చౌరస్తా వచ్చింది. నాలుగువైపుల నుంచీ వస్తున్న వాహనాల వేగం ఒక్కసారిగా అతన్ని భయపెట్టింది. ఓవైపు పార్థసారథి మొత్తుకుంటున్నా ఆ కంగారులో అడ్డదిడ్డంగా నడపడంతో బండి వెళ్లి డివైడర్‌కు గుద్దుకుంది. ఇద్దరికీ గాయాలయ్యాయి. స్కూటర్‌ కూడా బాగా దెబ్బతింది. ఆ తర్వాత మళ్లీ బండి నడపకూడదని నిశ్చయించుకున్నాడు మోహనరావు. దీనికి తోడు అప్పుడప్పుడు తన కళ్లపడ్డ రోడ్డు ప్రమాదాలు అతని భయాన్ని మరింత పెంచాయి. అలా అలా డ్రైవింగ్‌ ఫోబియా పెరిగిపోయింది.  

* * *

      ‘‘చారూ ఇదీ కథ! చాలా విషయాల్లో సమర్థత పెంచుకున్నాను డ్రైవింగ్‌ తప్ప. యముడు సావిత్రితో పతి ప్రాణాలు తప్ప ఏవైనా కోరుకోమన్నట్లుగా నువ్వూ ఇంకేదైనా కోరుకో నీ ముచ్చట చెల్లిస్తాను’’ అన్నాడు ప్రేమగా మోహనరావు. తన ఆశల సౌధం కుప్పకూలిపోవడంతో చారులత బాగా నిరుత్సాహపడిపోయింది. కానీ తాను చిన్నప్పుడు చదివిన ‘‘ఆరంభించరు నీచమానవులు’’ అన్న సుభాషితం గుర్తుకు తెచ్చుకొని, దాని అర్థాన్ని భర్తకు వివరించింది. ‘‘చూడండి మీకు కలిగిన అనుభవాలను వింటుంటే నాకు తెలిసిందేంటంటే... ఒకటి.. మీరు డ్రైవింగ్‌ బాగా నేర్చుకోలేదు. రెండు.. మీరెక్కువసార్లు బండి నడిపి అనుభవం గడించలేదు, ఇక కిందపడటం, దెబ్బలు తగలడం అంటారా... బండి నేర్చుకుంటున్న కొత్తల్లో ఇలాంటివి మామూలే. మీరు మనసులో ఏవో భయాలను పెట్టుకొని జీవితాన్ని కష్టాలపాలు చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో బండి లేకపోవడం ఎంత ఇబ్బందో మీకు తెలియంది కాదు, కాబట్టి వెంటనే బండిని కొని, నేర్చుకోండి’’ అంది చారులత స్థిరంగా దృఢంగా.
      మోహనరావు మాత్రం ఆ ఒక్కటీ తప్ప, ఆమె ఇతర కోరికలన్నీ తీర్చాడు. సినిమాలకు, షికారులకూ బస్సుల్లో, ఆటోల్లోనే ప్రయాణం. వచ్చేటప్పుడూ పోయేటప్పడూ బోలెడు బాధలు. అయినా మోహనరావు చారులత మాట వినట్లేదు. అయినా సరే, ఆమె తన ప్రయత్నాన్ని ఆపలేదు. పత్రికల్లో, టీవీలో వచ్చే ప్రకటనలను చూసి, ‘‘అదిగో ఆ బండి కొనండి, ఇదిగో ఇది బాగుంటుంది’’ అంటూ పోరుతుండేది. 
      ఆమెలో ఈ కోరిక విశ్వరూపం దాల్చుతున్న కొద్దీ అతనికి భయమేసేది. దానికి తగ్గట్టుగా ఓ రోజు ఇంటికి రాగానే, గుమ్మంముందు కొత్త బైక్‌ కనిపించింది. ‘‘నేను ఎఫ్‌డీల రూపంలో దాచుకున్న డబ్బులు వచ్చాయి. మీకు బహుమతిగా దీన్ని కొన్నాను. మీరెలా అయినా నడపాల్సిందే’’ అనేసి తాళంచెవి చేతిలో పెట్టింది. ‘‘కానీ చారూ... నాకు డ్రైవింగ్‌ సరిగ్గా రాదు. పైగా ఇది గేర్లబండి’’ అంటూ ఏదో చెప్పబోయాడు మోహనరావు. 
      ‘‘అందుకే పక్కింటి రామాన్ని అడిగాను. ఉదయం ఏడు గంటలకు వచ్చి ఓ వారం మీకు బండి నేర్పుతాడు. రేపటి నుంచే ప్రారంభం... వెళ్లి నేర్చుకోండి’’ అంటూ ఆజ్ఞాపించి, తన పనిలో పడిపోయింది.
      డ్రైవింగంటే భయంతో పాటు ఆసక్తి కూడా కోల్పోయిన మోహనరావు, ఇష్టం లేని భార్యతో కాపురం చేస్తున్నవాడిలా మొదటిరోజు అన్యమనస్కంగా శిక్షణలో పాల్గొన్నాడు! దాంతో కింద పడటం, దెబ్బలు తగిలించుకోవడం యథామామూలుగా జరిగిపోయాయి.  కానీ, చారులత భర్తకు కాపడం పెట్టి, కట్లుకట్టి ‘పడ్డవారెప్పుడు డ్రైవింగ్‌ రానివారు కాదులే’ అని ధైర్యం నూరిపోసింది. యుద్ధరంగానికి వెళ్లే భర్తను ఉత్సాహపరిచే వీరపత్నిలా వెన్నుతడుతూ ఆ వారం రోజులు శిక్షణ ఇప్పించింది. ఆ తర్వాత తన మంగళ సూత్రాన్ని గట్టిగా నమ్మి ‘‘మీరు బస్సులో వెళ్లొద్దు. మీకేమీ కాదు, బండిమీదనే ఆఫీసుకెళ్లండి’’ అని పరమశివుణ్ని హాలాహలం స్వీకరించమని చెప్పిన పార్వతిలా ఆదేశించింది. అప్పటి నుంచి రోజూ మోహనరావు ఇంటినుంచి బయటికెళ్లినపప్పుడల్లా బండిని తీసుకుని బయలుదేరడం, నడిస్తే అరగంట, బస్సులో అయితే పావుగంట వెళ్లాల్సిన దూరాన్ని బండిమీద గంటసేపు ప్రయాణం చేయడం, ఎక్కడో దూరాన పెద్ద వాహనం కనిపిస్తే తనబండిని ఇక్కడే ఆపేయడం, అడపాదడపా కిందపడటం, రద్దీ ప్రాంతాల్లో, నాలుగు కూడళ్లలో బండిని నడపకుండా హాయిగా తోసుకుంటూ వెళ్లడం... ఇలాంటి కాలక్షేపంతో తన బతుకుబండిని ఈడ్చుకొస్తున్నాడు. 
      ఈ బాధల నుంచి ఎలా విముక్తి పొందాలో మోహనరావుకు అర్థం కావట్లేదు. తెల్లవారగానే మళ్లీ బండిని ఎక్కాలన్న భయం, ఆ రోజు బండి మీద వెళ్తూ దార్లో ఎదుర్కొన్న అనుభవాలు అన్నీ కలిసి రాత్రిపూట అతణ్ని చారులతకు దూరం చేసేవి. ఇక దీనికి పరిష్కారం ఎప్పటికప్పుడు వెతకాల్సిందే అని గట్టిగా అనుకునేవాడు. కానీ, ఏమీ చేయలేకపోయేవాడు. సాధారణంగా అతని సహోద్యోగులు ఎవరూ తమ బళ్లను ఇతరులకిచ్చేవాళ్లు కాదు. ‘ఒకవేళ ఇస్తే వాళ్లు బండిని పాడుచేస్తే గట్టిగా ఏమీ అనలేం, వేలకు వేలుపోసి కొనుక్కున్నది పాడైతే భరించలేం’ అన్నది వాళ్ల బాధ. అయితే దీనికి భిన్నంగా మోహనరావు ఎవరైనా అడిగినదే తడవుగా బండి ఇచ్చేసేవాడు. ‘ఏదైనా ప్రమాదం జరిగితే బాగుండు.. బండి తీసుకున్న వాళ్లకి ఏమీ కాకూడదు కానీ, ఇక బండి నా చేతికి రాకూడదు’ అనుకునేవాడు. మోహనరావు ఉస్సూరుమనిపిస్తూ, బండి తీసుకెళ్లినవాళ్లు దాన్ని పువ్వుల్లో పెట్టి తెచ్చి ఇవ్వడమేకాక, పెట్రోల్‌ కూడా పోయించి ఇచ్చేవారు. ఇక తను బండి నడుపుతున్నపుడు నడిచి వెళ్తున్నవాళ్లని, బస్సుల్లో, ఆటోల్లో వెళ్తున్నవాళ్లని చూసి ఈర్ష్య పడేవాడు మోహనరావు. తనకు ఆ అదృష్టం లేకుండా పోయిందే అని బాధపడేవాడు. ఇలా కాలం గడుస్తుండగా ఓ రోజు అతనికో దివ్యమైన ఆలోచన వచ్చింది.

* * *

      ఆ మర్నాడు సాయంత్రం నగరంలోని ఓ పెద్ద షాపింగ్‌మాల్‌కు వెళ్లి, బండిని అక్కడే ఓ పక్కన పెట్టాడు. తాళం కూడా దానికే ఉంచి, మాల్‌ లోపలికి వెళ్లాడు. చారులతకు చీరలు కొని బయటికి వచ్చాడు. ఈపాటికి బండిని ఎవడో ఒకడు ఎత్తుకెళ్లిపోయి ఉంటాడులే అనుకుంటూ వచ్చిన మోహనరావు ముఖం మళ్లీ వాడిపోయింది. తను పెట్టిన చోటే ఉన్న బండిని చూసి నిట్టూర్చాడు. ఇంతలో మరో ఆలోచన వచ్చింది. ఏదైతే అదే అవుతుందిలెమ్మని దాన్ని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు.
      ఒంటరిగా చేతిలో సంచులతో, దిగాలు ముఖంతో వచ్చిన భర్తను చూసి, ‘‘ఏంటీ! ఏమైంది, బండి లేదేంటీ?’’ అంది చారులత. ‘‘చారూ! ఘోరం జరిగింది. చీరలు తీసుకుని మాల్‌ బయటికి వచ్చి చూసేసరికి బండి లేదు. ఎవరో ఎత్తుకుపోయినట్లున్నారు. చాలా వెతికాను. లాభం లేకపోయింది. ఇక లాభం లేదనుకొని ఇంటికి వచ్చాను’’ అంటూ బాధ నటించాడు మోహనరావు. 
      ‘‘అయినా తాళం వేసిన బండిని ఎవరు తీసుకెళ్తారు? మీరు బాగా చూశారా లేదా?’’ 
      ‘‘లేదు చారూ!! బండి పెట్టి, తాళం వేయడం మర్చిపోయా. అది నా పొరపాటే. బాగా రాత్రయింది. పోలీస్‌స్టేషన్‌ అక్కడికి చాలా దూరం. రేపు వెళ్లి ఫిర్యాదు ఇస్తా’’ అన్నాడు మోహనరావు. చేసేది లేక ‘‘సరే’’ అంది చారులత నీరసంగా. ఆ రాత్రి తన బండిని ఎవరో ఎత్తుకుపోయినట్లు, దాన్ని ఏ పార్టుకు ఆ పార్టు విడదీసి అమ్ముకున్నట్లు కలగన్నాడు మోహనరావు. చారులత దిగులుగా ఉన్నా, అదేదీ పట్టించుకోకుండా చాలారోజుల తర్వాత చెలరేగిపోయాడు. ఆ తర్వాత హాయిగా నిద్రపోయాడు.

* * *

      తెల్లవారింది. ఆనందంగా లేచి, ఆఫీసుకు వెళ్లడానికి తయారవుతున్నాడు మోహనరావు. ఇంతలో గేటు చప్పుడైంది. పోలీస్‌ జీపు ఇంటి ముందు ఆగింది. దాని వెనకాల తన బైకుమీద మరో పోలీసాయన వచ్చి ఇంటి ముందు ఆగాడు. అందరూ లోపలికి వచ్చారు. మోహనరావు సంభ్రమాశ్చర్యాలతో వాళ్లను ఆహ్వానించాడు. 
      ‘‘మోహనరావు మీరే కదా!’’ 
      ‘‘అవును సార్‌! కూర్చోండి’’
      ‘‘నిన్న రాత్రి శంషాబాద్‌ హైవేమీద ఈ బండి మీద వెళ్తున్నవాడెవడో ఓ కారును గుద్దేశాడు. వాడి కాళ్లు విరిగాయి కానీ, బండి సుబ్బరంగా ఉంది. ఆరా తీస్తే బండి మీదని తెలిసింది. స్టేషన్‌లో చూస్తే బండి పోయినట్లు ఫిర్యాదేమీ లేదు. ఏం... ఎందుకివ్వలేదు’’ గట్టిగా అడిగాడు ఇన్స్‌పెక్టర్‌. 
      ‘‘నిన్న రాత్రి కోఠీ బిగ్‌మాల్లో షాపింగ్‌ చేసి, వచ్చి చూసేసరికి బండి కనిపించలేదు. ఇప్పుడొచ్చి ఫిర్యాదు ఇద్దామనుకుంటున్నాను’’ భయపడుతూ అన్నాడు మోహనరావు.
      ‘‘అయినా ఇంత నిర్లక్ష్యమైతే ఎలాగండీ? తాళం చెవులు దానికే ఉన్నాయి. మీ అదృష్టం బాగుంది కాబట్టి బండి మళ్లీ చేతికొచ్చింది’’ అని వాంగ్మూలం తీసుకుని, జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయారు పోలీసులు. మోహనరావు నీరసంగా సోఫాలో కూలబడిపోయాడు. తన బండి విషయంలో పోలీసులు ఇంత నిజాయతీగా వ్యవహరించడం తన అదృష్టం అనుకోవాలో, దురదృష్టం అనుకోవాలో అర్థంకాక తలపట్టుకున్నాడు. 
      చారులతకు మాత్రం ఆనందం అవధులు దాటింది. కొత్త బండికి తీసినట్లు మళ్లీ దానికి దిష్టితీసి, బొట్లు పెట్టింది. ఆ తర్వాత బండి తాళం చేతిలో పెట్టి, ‘‘ఇక ఆఫీసుకు బయల్దేరండి’’ అంది. ‘తప్పదా?’ అన్నట్టు ఆమె వైపు చూస్తూ, ఉసూరుమంటూ బయటికి నడిచాడు మోహనరావు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావుbal bharatam