ఎర్రని కన్నీరు (క‌థాపారిజాతం)

  • 475 Views
  • 10Likes
  • Like
  • Article Share

    ఎస్‌.ఎస్‌.లాల్‌

ఎస్‌.ఎస్‌.లాల్‌

ప్రేమ... పెళ్లి... సంసారం... జీవితం... కాలం కలిసివస్తే ఇవన్నీ తీపిగుర్తులే! అయితే... ఈ ప్రయాణంలో ఎక్కడ తేడావచ్చినా జంటలో ఏవరో ఒకరికి విషాదమే మిగులుతుంది. ఇక్కడా ఓ జంట ఉంది... తోడూనీడగా సాగాల్సిన వాళ్ల పయనం చివరికి ఎవరికి ఏం మిగిల్చింది?
‘‘ఆప్‌థాల్మాలజి’’
మాట డెబ్బయినాలుగో పేజీ తీశాడు, డాక్టర్‌ రాజు. ‘మయోపియా’ మొదటి ప్రకరణం అది. సరిగ్గా అదే పేజీలో వనజ కళ్లు కనిపిస్తాయి, డాక్టర్‌ రాజుకు.
      తను బై.పి.సి. గ్రూపుతో చదువుతున్నప్పుడు వనజ నంబరు నూట డెబ్బయినాలుగు. రాజు నంబరు నూట డెబ్బయి అయిదు. అలా జీవితాంతం వరకూ పుస్తకంలో పేజీల్లా అంటుకుపోవాలనుకున్నాడు, రాజు.
      పక్క బెంచీలో కూచున్న వనజ చూపు తన మీద పడినప్పుడు కొన్ని వేల వాడి బాణాలు గుండెను దూసుకుపోయేవి. కళ్లు మూసుకున్నా, కళ్లు తెరిచినా ఆ కళ్లే కనిపించేవి. నడిచినా ఆ కళ్లే వెంటపడేవి.
కోలగా సాగిన ఆ కళ్ల మధ్య నుంచి తొంగి చూసే నల్లని పాపలు మబ్బుల మధ్య దాగిన నక్షత్రాలో, మత్తెక్కించే చంద్రబింబాలో అర్థమయ్యేదికాదు.
      ఆ సంవత్సరమే వనజ పెళ్లి అయింది. రాజుతో కాదు.. రెడ్డితో..! ఆ క్షణమే అతని జీవితం గుడ్డిదైంది. ఆరు నెలలు వేళకు అన్నపానాలు ముట్టక జానెడు గడ్డం పెంచాడు. ఏ కారణం వల్ల తన జీవితంలో చీకటి పేరుకుందో, ఆ కారణాన్ని శోధిస్తూ రాజు కళ్ల డాక్టర్‌ అయ్యాడు. అప్పటికి ఇప్పటికి పెళ్లి తలపెట్టలేదు.
      అది ఆనాటి కథ.
      రాజు ఇప్పుడు అదే పుస్తకం, అదే పేజీ తీసేసరికి రోజూ కనిపించే వనజ కళ్లు కనిపించలేదు.
      ఈసారి భారతి కళ్లు కనిపించాయి. తను మర్నాడు ఆపరేషన్‌ చెయ్యబోతున్న కళ్లు అవి. వనజ ఆనాటి సమస్య అయితే భారతి ఈనాటి సమస్య. ఈ ఆపరేషన్‌ మీదే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది, మరి!
      రాజు ఆ ఊళ్లో వైద్యం ఆరంభించినప్పుడు ఐ స్పెషలిస్ట్‌ రంగాచారికి పోటీ అనుకున్నారు. ఇక రంగాచారి ప్రాక్టీసు పడిపోతుందని కొందరు లొట్టలు వేశారు.
రంగాచారి పేరు ప్రతిష్ఠలు కించిత్తయినా తరగలేదు. కాని రాజు ఖర్చు మాత్రం రోజు రోజుకూ అధిగమిస్తూంది. అడపా తడపా రెండు మూడు కేసులు వచ్చినా నాలుగు రోజులు చూసి రంగాచారి దగ్గరికే లగూ తీస్తున్నారు.
      ఇక తన దగ్గర వైద్యం చేయించుకునేవాళ్లు కేవలం 2.బి. డ్రాప్స్‌ కోసం వచ్చేవాళ్లే! ఇన్నాళ్లకు రాక రాక వచ్చిన మొదటి ఆపరేషన్‌ ఇది. ఇదయినా సక్సెస్‌ చేసుకొనకపోతే తనకు భవిష్యత్తు లేదనే చెప్పాలి.
      మరొకసారి ఆ ప్రకరణం చదివి, సిగరెట్‌ వెలిగించి పై కప్పుకేసి చూశాడు, రాజు. మళ్లీ భారతి కళ్లు కనిపించాయి. వనజ కళ్లు కూడా అలాగే ఉండేవి. ఆ రోజుల్లో అతనికి స్త్రీల కళ్లలో అందం, ఆకర్షణ, చిలిపితనం కనిపించేవి. ఇప్పుడు ఆ అందంతోపాటు వ్యాధికూడా కనిపిస్తుంది.
      ‘గ్లాకోమా’తో వచ్చిన సుజాత కళ్లు తనకేసి ఎలా చూసేవని. చలికాలం నడిరాత్రి దుప్పటి కప్పుకున్నట్లు ఉండేది ఆ చూపు. తనకు ఆ చూపు తాలూకు బాధ హృదయానికి చేరేదికాదు. మనస్సులోనే ఆగిపోయేది. ఆ వ్యాధి నివారణకు చెయ్యవలసిన కార్యక్రమం పురమాయిస్తుంది మనస్సు. అంతే!
      గడియారం పదకొండు గంటలు కొట్టింది. రాజు నైట్‌డ్రెస్‌ వేసుకొని పడకగదిలోకి వెళ్లబోయాడు. బయట బూట్ల టక టక వినిపించింది. గుమ్మంవేపు చూశాడు, రాజు.
      వస్తున్న వ్యక్తి ఎవరో కాదు.. ప్రభాకరరావు. భారతి భర్త! ఇంత రాత్రివేళ అతని రాకకు కారణం అర్థంకాలేదు. ‘‘రండి’’ అన్నాడు రాజు చిరునవ్వు పెదాల మీదికి తెచ్చుకొని. ప్రభాకరరావు నిలబడి రాజు కళ్లలోకి లోతుగా చూశాడు.
      ‘ఈ ఆపరేషన్‌ రంగాచారిచేత చేయిస్తాను’ అని అంటాడనుకున్నాడు, రాజు.
      ‘‘రాత్రివేళ ఇలా వచ్చారేం?’’ రాజు ముభావంగా అన్నాడు.
      ‘‘మీతో మాట్లాడాలి’’ గాభరాగా సమాధానం చెప్పాడు ప్రభాకరరావు.
      ‘‘నాకు తెలుసు- మీరేం మాట్లాడబోతున్నారో. మీకెటువంటి సందేహం వద్దు, నేనీ ఆపరేషన్‌ సక్సస్‌ చేస్తాను’’ ధైర్యంగా అన్నాడు, రాజు.
      ప్రభాకరరావు ముఖం ఎర్రబడింది. ఏదో చెప్పబోయి గుటక వేశాడు. ‘‘ఇలా కూచోండి’’ పడకకుర్చీ ముందుకు లాగి కూర్చోబెట్టాడు. ‘‘కొత్త డాక్టర్ల మీద అందరికీ నమ్మకం ఉండదు. అదీ కొంతవరకూ నిజమే అయినా నాకు ఈ ఆపరేషన్‌ చెయ్యగల సమర్థత ఉంది. బిలీవ్‌.. మీ...’’
      ప్రభాకరరావు తల వంచుకొని నేలకేసి చూస్తూ అన్నాడు. ‘‘నేను చెప్పబోయే విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఇలా ఎవరూ చెప్పరు.. ఇలా ఎవరి జీవితంలోనూ జరగదు..’’
      ‘‘చెప్పండి...’’
      ‘‘మీరు యువకులు, మరొకరి హృదయాన్ని అర్థం చేసుకోగల వివేకం మీకు ఉంది. అందుకనే మీ దగ్గరికి వచ్చాను’’.
      ‘‘ధైర్యంగా చెప్పండి’’
      ‘‘నేను చెప్పింది విని నన్ను అపార్థం చేసుకోవచ్చు. కాని నా బాధను అర్థం చేసుకుంటే నన్ను తప్పక అభిమానిస్తారు’’.
      ‘‘సంకోచం వద్దు, నిర్భయంగా చెప్పండి’’.
      ‘‘రేపు మీరు చెయ్యబోతున్న ఆపరేషన్‌ సక్సస్‌ కాకూడదు’’ ఠక్కున తలపక్కకు తిప్పుకున్నాడు, ప్రభాకరరావు.
      ‘‘అంటే...?’’
      ‘‘ఇక భారతి కళ్లు కనిపించకూడదు’’ అతని గొంతులో జీర వినిపించింది.
      రాజు కళ్లముందు చీకట్లు కమ్ముకున్నాయి. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఓ క్షణం ఆలోచించి అన్నాడు ‘‘మీ కోరిక చాలా విచిత్రంగా ఉంది’’.
      ‘‘అలా అంటారని నాకు తెలుసు, డాక్టర్‌. నాబాధ అటువంటిది’’.
      ‘‘మీబాధ కోసం మీభార్యను గుడ్డిదాన్ని చెయ్యమంటారా?’’
      ‘‘ఆ బాధ నా ఒక్కడిదీకాదు. అది నా కుటుంబానికి, వంశానికి సంబంధించింది’’.
      ‘‘అంటే...?’’
      ప్రభాకరరావు లేచి కిటికీ దగ్గరికి వెళ్లాడు. ‘‘మీరేమైనా అనండి. ఇది నావల్ల కాదు’’ కచ్చితంగా అన్నాడు, రాజు.
      ప్రభాకరరావు ఒక్క అంగలో వచ్చి అతని చేతులు పట్టుకున్నాడు. ‘‘డాక్టర్, ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. భారతి కళ్ళు నయం అయితే అది ఇక నాతో ఉండదు. లేచిపోతుంది. ఇక నాకు ఆత్మహత్య తప్ప వేరే గతిలేదు. నా కుటుంబ గౌరవాన్ని, మా దాంపత్యాన్ని కాపాడేందుకు ఇదొక్కటే దారి’’ బావురుమన్నాడు, ప్రభాకరరావు.
      రాజు మాట్లాడలేక పోయాడు.
      ‘‘ఇది మీవల్ల కాకపోతే మరోచోట, మరో డాక్టర్‌చేత చేయిస్తాను, చెప్పండి...’’ ఆవేశంతో అతని శరీరం కంపించిపోతూంది.
      ‘‘సరే’’అన్నాడు, రాజు. ఆ రాత్రి డాక్టర్‌ రాజుకు నిద్రపట్టలేదు. కాస్త కునుకు పట్టినా ఏదో ఒక పీడకల వస్తూనే ఉంది.

* * *

      ఎర్రని నులివెచ్చని నీరెండ కిటికీ లోనుంచి టేబులుమీద పడుతూంది. మాస్క్‌ తీసేస్తూ ఆపరేషన్‌ థియేటరు నుంచి బయటికి వచ్చి, కుర్చీలో కూలబడ్డాడు, రాజు. ప్రభాకరరావు జంకుతూ అన్నాడు ‘‘సక్ససా?’’ అంటే, ఆమాటకు అర్థం ‘భారతి గుడ్డిదైందా?’ అని.
‘‘సక్సస్‌’’ అన్నాడు, రాజు నిర్జీవంగా. నోట్లకట్ట టేబులు మీద ఉంచి లేచాడు, ప్రభాకరరావు.
      ‘‘ఆగండి. ఒక విషయం మాత్రం మీతో చెప్పాలి. మీ కోరికి ప్రకారం భారతి కళ్లు కనిపించవు. రెటీనా పొరలు పూర్తిగా కత్తిరించడం వల్ల సూర్మరశ్మి కంటికి సోకకూడదు. ఆమె ఎప్పుడూ కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకోవాలి. అలా పెట్టుకోని పక్షంలో మతి భ్రమించవచ్చు’’.
      మౌనంగా తల ఊపి వెళ్లి పోయాడు, ప్రభాకరరావు. రాజు పెదవుల మీద చిరునవ్వు బరువుగా మెరిసింది, ముందున్న నోట్లకట్టను, దూరంగా వెళ్లుతున్న ఓ మానవాకారాన్ని చూసి.

* * *

      ఈ పదిహేను రోజులనుంచి భారతి మాటల్ని, చేష్టల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు, రాజు. తనకెటువంటి సందేహాన్ని కల్పించకపోయినా ఆమె ప్రవర్తనలో ఏదో అతిశయం వింతగా కనిపిస్తూంది. ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడదు. నవ్వదు. మాట్లాడటం ఆరంభిస్తే గంటల తరబడి మాట్లాడుతుంది. మనసిచ్చి నవ్వుతుంది.
      సాయంత్రం నాలుగు గంటలకు కిటికీలకు తెల్లని పరదాలు, వెచ్చని సూర్మరశ్మి లేని గదిలో కట్లు విప్పుతూ నెమ్మదిగా అన్నాడు ‘‘నేను డాక్టర్ని. కళ్ళను మాత్రం ఇవ్వగలను. ఇవి భౌతిక ప్రపంచాన్ని మాత్రం చూడగలవు. కాని మనోనేత్రం అనేదొకటుంది చూశారూ? అది ఉంటే ఈ కళ్లు అవసరం లేదు’’.
      శ్రద్ధగా వింది భారతి.
      ‘‘మీకట్లు విప్పేశాను. ఇక చూడండి. మొదట కిటికీ నుంచి కనిపించే ఆకుపచ్చ. తరువాత ఈ టేబులు మీద ఉన్న రోజా పువ్వులు..’’
      భారతి చూసింది. కనురెప్పలు తుమ్మెద రెక్కల్లా కొట్టుకున్నాయి. క్రమంగా డాక్టర్‌ కేసి కృతజ్ఞతాపూర్వకంగా చూసి అంది ‘‘థాంక్యూ, డాక్టర్‌. మీమేలు మరిచిపోలేను’’.
      ‘‘ఇది నా కర్తవ్యం. ప్రతి మనిషికీ కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. వాటిని గుర్తించినప్పుడే జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది’’.
      అవునన్నట్లు తల ఊపింది, భారతి.
      ‘‘నేను చాలా రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. చెప్పగలరా?’’
      ‘‘అడగండి’’.
      ‘‘నిక్షేపంలాంటి భర్తని, చక్కని దాంపత్యాన్ని దూరం చేసుకొని ఎవడో ఓ బికారి వెంట పడిపోయే స్త్రీని ఏమనాలి?’’
      భారతి వెంటనే సమాధానం చెప్పలేదు. ఓ క్షణం ఆలోచించి తాపీగా అంది ‘‘తోడు నీడలా ఉన్న భార్యని, తియ్యని దాంపత్యాన్ని దూరం చేసుకొని పొరుగు పంచలు పట్టుకు తిరిగే భర్తని ఏమంటారో అదే అనాలి’’.
      ‘‘సమాజం ఇద్దరికీ ఒకే నీతి ఇవ్వలేదు. నన్ను ఛాందసుడనుకున్నా, ఆ పాతలోనూ కొంత మంచి ఉందనే నా అభిప్రాయం’’.
      ‘‘డాక్టర్‌!’’ చురచురా చూస్తూ అంది భారతి. ‘‘మీ మాటలో దాగిన సత్యాన్ని గ్రహించలేనంత అవివేకినికాదు. ఉన్న విషయం చెబుతున్నాను. నా భర్త ఇక్కడికి తీసుకువచ్చింది నా కళ్లు నయం చేయించా లని కాదు. కొత్త డాక్టర్‌ చేత ఆపరేషన్‌ చేయిస్తే నా కళ్లు పోతాయని. అసలు నాకు కళ్లు ఉన్నా లేకపోయినా ఒకటే’’.
      ‘‘మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం. మీ భర్తతో మీ కళ్లు పోగొట్టానని చెప్పాను. మీ దాంపత్యం ఒక దారికి రావాలంటే మీరు కొంతకాలం గుడ్డిదానిలా నటించాలి. ఎప్పుడూ ఈ కూలింగ్‌గ్లాసెస్‌ పెట్టుకోండి’’ రాజు కళ్లద్దాలు అందించాడు. చిరునవ్వు నవ్వుతూ తీసుకుంది భారతి. నవ్వుతున్న ప్పుడు పళ్ల పైవరస తళుక్కున మెరిసింది.

*  *  *

      నాలుగు నెలల తరువాత ఓ రోజు ప్రభాకరరావు ఇంటికి వెళ్లాడు, రాజు.
      ప్రభాకరరావు స్థితిపరుడే. పెద్ద మేడ. చుట్టూ విశాలమైన తోట. నాలుగు తరాల వరకూ చాలినంత ఆస్తి ఉంటుందని అంచనా వేశాడు. అతన్ని డ్రాయింగ్‌రూమ్‌ సోఫాలో కూర్చోబెట్టి ప్రభాకరరావు లోపలికి వెళ్లాడు. భారతి కోసం అటూ యిటూ చూశాడు. పక్కగది నుంచి సన్నగా నాజూగ్గా ఉన్న ఒక అమ్మాయి చరచరా మేడమెట్లు ఎక్కి వెళ్లిపోయింది.
      ప్రభాకరరావు బయటికి వస్తూ లేనిపోని నవ్వు తెచ్చుకొని అన్నాడు. ‘‘మా భారతి కోసం ఒక నర్సుని ఎపాయింట్‌ చేశాను’’.
      ఆ అమ్మాయిని చూడగానే నర్సులా కనిపించలేదు. ఓ క్షణం నిశ్శబ్దంగా చూసి అన్నాడు ‘‘నా పేషంటుని చూడాలని వచ్చాను’’.
      ‘‘మేడ మీద నిద్రపోతూంది, రేపు వస్తారా?’’
      ఆ మాటతో భారతిని చూడాలనే వాంఛ ఇంకా ఎక్కువైంది. ఏవో అర్థంకాని సందేహాలు అతని మనస్సును గుంజుతున్నాయి.
      మర్నాడు సాయంత్రం గేటు తెరుచుకొని లోపలికి వస్తున్న రాజు తన కళ్లనే నమ్మలేకపోయాడు. దూరంగా సిమెంటు బల్లమీద భారతి ఒంటరిగా కూర్చుంది.
      ఆమెకు ముప్పయి గజాల దూరంలో ప్రభాకరరావు, నర్సు పేరుతో చలామణి అవుతున్న ఆ సన్న అమ్మాయి గడ్డి మీద కూర్చుని సరసాలాడుతున్నారు.
రాజు టక్కున వెనక్కు తిరిగి వచ్చేశాడు. అతని తల్లో వెయ్యి ప్రశ్నలు లుకలుక లాడాయి. ప్రభాకరరావు భారతిని గుడ్డిదను కుంటున్నాడు. కాబట్టి తన చేష్టలు ఆమె చూడలేదన్న భ్రమతో ఆమె కళ్ల ముందే యీ సాహసానికి ఉపక్రమించాడన్న మాట. అయితే భారతి యీ వేదన ఎలా భరిస్తూందో ఊహించలేకపోయాడు, రాజు.
      మర్నాడు ఎలాగయినా ప్రభాకరరావుకు నిజం చెప్పి అతని భ్రమ దూరం చెయ్యాలనే ఉద్దేశ్యంతో క్లబ్బుకు వచ్చాడు, రాజు. ప్రభాకరరావు అప్పుడే టెన్నిస్‌ ముగించి ఎడ్వకేట్‌ రంగనాథంతో ఏదో మాట్లాడుతూ కూర్చున్నాడు. రాజు అతని ప్రక్కనున్న కుర్చీలో కూర్చున్నా అతని ధోరణి రాజు రాకను గుర్తించినట్లులేదు.
      ‘‘అవును. ఒప్పుకుంది. రేపు పదింటికి రండి. రాసిస్తుంది’’ ప్రభాకరరావు లోతుగా అన్నాడు.
      ‘‘సరే, వస్తాను’’.
      ‘‘ఇందులో ఆక్షేపణ ఏముంది? గుడ్డిదైంది. ఆమే స్వయంగా రెండో పెళ్లికి సమ్మతి తెలియజేసినప్పుడు లీగల్‌గా ఎటువంటి చిక్కులూ రావనుకుంటాను’’.
      ‘‘రావు’’.
      విషయం అర్థం చేసుకున్నాడు, రాజు. ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోయింది. సరిగ్గా ప్రభాకరరావు చెప్పిన సమయానికి అతని ఇంటికి వెళ్లాడు. సోఫాలో రంగనాథం కూర్చున్నాడు. ఆ సన్న అమ్మాయి నాలుగు అడుగుల దూరంలో నిలబడి చూస్తూంది.
      భారతి చేత ప్రభాకరరావు ఏదో వ్రాయిస్తున్నాడు. రాజు తిన్నగా ఆమె దగ్గరికి వెళ్లి ఆదుర్దాగా అన్నాడు ‘‘అమ్మా, ఏం రాస్తున్నావ్‌?’’.
      ‘‘వారి రెండో పెళ్లికి నా సమ్మతం’’. నుదుటి మీద పేరుకున్న చెమట తుడుస్తూ కూలింగ్‌గ్లాసెస్‌ సర్దుకుంది భారతి.
      ‘‘ఏ కారణంతో సమ్మతిస్తున్నావ్‌?’’
      ‘‘అది గుడ్డిదయ్యా. అంతకన్నా ఏంచేస్తుంది?’’ ప్రభాకరరావు గొంతు కటువుగా వినిపించింది.
      ‘‘గుడ్డిది కాకపోతే...’’
      ఓ క్షణం ఎవరూ మాట్లాడలేదు.
      ‘‘ఎలా కాదు?’’ గుక్క తిప్పుకొని ప్రభాకరరావు అన్నాడు.
      ‘‘ఆపరేషన్‌ చేసిన డాక్టర్ని నేను. ఆమె గుడ్డిది కాదని చెబుతున్నాను’’ ఆ దెబ్బతో అతగాడు దిగజారిపోతాడని రాజు నమ్మకం.
      ప్రభాకరరావు కళ్లు కెంపులెక్కాయి. శరీరం కోపంతో కంపించింది. గిరుక్కున తిరిగి ‘‘ఇంతకాలం గుడ్డిదానిలా నటిస్తూ నన్ను మోసం చేశావన్నమాట!’’ అని ఒళ్లు తెలియని కోపంతో అరుస్తూ ఆమె కళ్లద్దాలు లాగేశాడు.
      ఆ కళ్లద్దాల వెనుక ఆమె కళ్లు కనిపించలేదు.. రెండు పుళ్లు కనిపించాయి! ఆమె ఏనాడో తన కళ్లను పొడిచేసుకుంది!
      ‘‘భా... ర... తీ!’’ ప్రభాకరరావు నోట అప్రయత్నంగా వచ్చిన అరుపది.
      నిశ్శబ్దం... వెలుగు చీకట్ల సంఘర్షణ లాంటి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దానికి లయగా భారతి కళ్ల వెంట రెండు ఎర్రని చారలు సన్నగా జారాయి. 

సౌజన్యం: జానీలాల్‌ (ఎస్‌.ఎస్‌.లాల్‌గారి అబ్బాయి)

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావుbal bharatam