గుండెత‌డి

  • 226 Views
  • 1Likes
  • Like
  • Article Share

    అల్లం నాగ్

  • విశాఖపట్నం.
  • 7893220777
అల్లం నాగ్

పండువెన్నెల్లో చందమామను చూస్తూ ఊసులు చెప్పుకోవడం... ఈ తరానికి తీరని కోరిక! ఉద్యోగమంటూ భర్త అర్ధరాత్రి పూట ఆఫీసులో గడుపుతుంటే... ఇంట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ భార్య!! ఇక్కడ పుష్ప పరిస్థితీ అదే! అలాంటి ఓ నిశిరాత్రిలో ఆమె మనసులో రేగిన కల్లోలమేంటి?
భర్తకు
దూరంగా పద్నాలుగేళ్లు గడిపిన ఊర్మిళాదేవిని తలచుకుని నిట్టూరుస్తాం. కానీ, ఈ కలియుగంలో కూడా భార్యలకు అలాంటి ఎడబాట్లు తప్పట్లేదు. సమయం పాడూ లేని షిఫ్టులు, రాత్రిపూట ఉద్యోగాలు.. భర్త పక్కన లేకుండా ఏ భార్య అయినా ప్రశాంతంగా నిద్రపోగలదా? ఎక్కడ ఏ చిన్న అలికిడైనా ఉలిక్కిపడాల్సిందే. నాన్న ఇంట్లో ఉన్న రోజు పిల్లలు కూడా ఎంత ధైర్యంగా నిద్రపోతారో! నాన్నా... నాన్నా.. అంటూ కలవరిస్తూ, మధ్యమధ్యలో లేస్తూ, అమ్మా... నాన్న ఇంకా రాలేదా? అని అడిగే పసిపిల్లలను ఏమని సముదాయించాలి? ఈ రాత్రి ఉద్యోగాలు చేసే మగధీరుల భార్యలంతా నాలాంటి ఆధునిక ఊర్మిళలే! కానీ, ఆవిడ అదృష్టవంతురాలు. నిద్రలోనే గడిపేసింది. మాకైతే ఆ నిద్ర కూడా కరవే...
      సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు... పక్కన పడుకున్న పిల్లల మీద ఓ చేయి వేసి ఆలోచనల్లో మునిగిపోయింది పుష్ప. 
      ఆరోజు పుష్ప, ఫణీంద్రల పెళ్లిరోజు. పదో వార్షికోత్సవం. ఫణీంద్ర సెలవుపెట్టాడు. కానీ, సాయంత్రం అయ్యేసరికి ‘‘అత్యవసరం...’’ అంటూ ఆఫీసు నుంచి ఫోన్‌. ‘‘పెళ్లిరోజున కూడా డ్యూటీ ఏంటండీ? వెü•్లద్దు’’ అని పుష్ప బతిమాలింది. బెట్టుచేసింది. అతను పట్టించుకోలేదు. ‘‘ఉద్యోగం నా రెండో భార్య’’ అంటూ వెళ్లిపోయాడు. చేసేది లేక జళ్లోని మల్లెపూలు విసిరికొట్టి, రోజూలానే కథలు చెబుతూ పిల్లలను నిద్రపుచ్చింది పుష్ప. తనకు మాత్రం నిద్రరావట్లేదు. పెళ్లయిన కొత్తలో జరిగిన సంఘటనలు గుర్తొస్తున్నాయి...

* * *

      తోడు లేనిదే గడప దాటనిచ్చేవారు కాదు నాన్న. ఇంట్లో కట్టుబాట్లకు కొదవలేదు. వాటి మధ్య తలొంచుకుని పెరగడంతో ఒంటరిగా బయటికి కాదు కదా, పక్కింటికి వెళ్లడమన్నా భయమే. ఊర్లోనే డిగ్రీ కశాశాల. చదువులకూ ఊరు దాటాల్సిన అవసరం రాలేదు. డిగ్రీ ఇలా పూర్తయిందో లేదో, నాన్న స్నేహితుడు ఆనందరావు మాస్టారు పెళ్లి సంబంధం పట్టుకొచ్చారు. ఆయన మాటంటే ఇంట్లో అందరికీ గురి. వెంటనే పెళ్లికూతుర్ని చేసేశారు. ఏదో చూడాలి కాబట్టి ఒకసారి అతని ఫొటో చూసిందంతే. తనకంటే ఏడాదే పెద్ద. విశాలమైన నుదురు. ఆకట్టుకునే కళ్లు. బాగా నచ్చాడు. ఈడూ       జోడూ తిరుగుండదన్నారు బంధువులంతా.
పెళ్లిపందిట్లోకి వెళ్లడానికి ఇంకా అరగంటే ఉంది. అంతా హడావుడి. పెద్ద కల్యాణ మండపం. ఆడపెళ్లివారికి కింద, మగపెళ్లివారికి పై అంతస్తులో విడిది. ‘‘ఎంత పొడవైన జడో మా అక్కది... ఎత్తగలడా మీ తమ్ముడు’’ పుష్ప పిన్ని కూతురు గీత, కాబోయే వదినతో సరసమాడింది. ‘‘ముహూర్తం తెల్లవారి రెండున్నరకు. అప్పటికి మావాడు చాలా చలాకీగా ఉంటాడు. అప్పటి దాకా మీ అక్క జడ చెరిగిపోకుండా కాపలా కాయవమ్మా కొంటె మరదలా’’ అంటూ తిప్పికొట్టింది ఫణీంద్ర అక్క.
      ‘‘అదేంటీ.. తెల్లవారుజాము ముహూర్తం అంటే ఎవరైనా నీరసమైపోతారు కదా. పెళ్లికొడుకు చలాకీగా ఉండటమేంటో’’ అనుకుంటూ అక్కాచెల్లెళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
      పెళ్లి ఘనంగా జరిగింది. ఆ తర్వాత అత్తవారింటికీ, అమ్మవారింటికీ ప్రయాణాలకే ఫణి సెలవులన్నీ అయిపోయాయి. పక్షం రోజులకే నగరంలో కొత్త కాపురం మొదలుపెట్టేశారు.  

* * *

      ఉదయాన్నే నాలుగు గంటలకే నిద్రలేచింది పుష్ప. తలంటు పోసుకొని వంటగదిలోకి దూరిపోయింది. గారెల పిండిని గ్రైండర్‌ వేసింది. మధ్యాహ్నం భోజనానికి ఏం కూరలు వండాలా? అని తెగ ఆలోచించింది. పెళ్లయిన తర్వాత ఆయన మొదటిసారి ఆఫీసుకు వెళ్తున్నాడు... సహోద్యోగుల దగ్గర అదిరిపోయేలా ఉండాలి మన వంటలు అనుకుంది. గుత్తొంకాయ కూర, పప్పుచారు, గోంగూర పచ్చడి సిద్ధం చేసింది. ఫణి లేస్తే, వేడివేడిగా గారెలు వేసి పెడదామని ఎదురుచూస్తోంది. 
      సమయం తొమ్మిది గంటలైంది.... అతను లేవలేదు. ‘అదేంటీ ఇవాళ ఈయన ఆఫీసుకు వెళ్లడా?’ అనుకుంటూ పడకగదిలోకి వెళ్లింది పుష్ప. దుప్పటి ముసుగెట్టి హాయిగా నిద్రపోతున్నాడు ఫణి. ‘లాభం లేదు.. నిద్రలేపకపోతే ఈరోజు ఉద్యోగం మంచంపైనే చేసేలా ఉన్నాడు’ అనుకుంటూ దుప్పటి తీసింది పుష్ప. 
      అతికష్టంగా కళ్లు తెరుస్తూ ‘‘ఏంటీ?’’ అన్నాడు ఫణి. ‘‘అంటే.. ఇవాళ మీరు ఆఫీస్‌కు వెశ్తానన్నారు కదా?’’ చెవి దగ్గర గొణిగింది ఫుష్ప. ‘‘అవును’’ అన్నాడతను. ‘‘టైమెంతయిందో తెలుసా మరి... తొమ్మిదిన్నర... లేవరా...’’ అందామె. ‘‘ఇప్పుడే లేచి ఏం చేయాలి? ఆఫీసు సాయంత్రం అయిదింటికి కదా’’ మెల్లగా అన్నాడు ఫణి. పుష్పకు ఏమీ అర్థం కాలేదు. ‘‘సాయంత్రం ఏంటండీ...’’ ఆశ్చర్యపోతూ అడిగింది. 
      ‘‘అదేంటి నీకు తెలియదా?’’ అన్నాడు ఫణి. ‘‘ఊ..హూ..’’ అడ్డంగా తలూపింది పుష్ప. తుళ్లిపడినట్లు లేచి కూర్చున్నాడు ఫణి. ‘‘పెళ్లికి ముందు మీ నాన్న నీకు చెప్పలేదా’’ అంటూ పుష్ప కళ్లలోకి చూశాడు. నిరుత్సాహం ఆవహించిన ముఖంతో అయోమయంగా చూస్తోంది పుష్ప. ‘‘మళ్లీ డ్యూటీ నుంచి ఎన్నింటికొస్తారు’’ నీరసంగా అడిగింది. 
      ‘‘రాత్రి రెండింటికి’’ ఫణి సమాధానంతో పుష్పకు బుర్రతిరిగింది.
      ‘ఈ వేళాపాళా లేని ఉద్యోగమేంటి? నాన్న నాకు చెప్పకపోవడమేంటి? రాత్రిపూట ఆయన లేకపోతే ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ... వామ్మో’ పుష్ప కళ్లలో భయం! ‘‘అయినా... ఇదేం ఉద్యోగం. రాత్రులు పనిచేయడమేంటి? మీది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అన్నారు కదా’’ కుండబద్దలు కొట్టినట్లు అడిగింది. సాఫ్ట్‌వేర్‌ అన్న మాట వినడమే తప్పించి ఆ ఉద్యోగాల గురించి పుష్పకు ఏమీ తెలియదు. డిగ్రీ చదివిందన్న మాటే కానీ, ఈ కాలం అమ్మాయి కాదు. పైగా చిన్నప్పటి నుంచి ఓ విధమైన కట్టుబాట్లతో పెరగడంతో పెద్దగా స్నేహితులూ లేరు. 
      గందరగోళంతో తలబాదుకుంటున్న ఆమె భుజాల మీద చేతులు వేసి మంచం మీద కూర్చోబెట్టాడు ఫణి. ‘‘చూడు బంగారం.. మేం పనిచేసే సంస్థ అమెరికా వాళ్లది. మనకు రాత్రయితే అక్కడ పగలు. వాళ్లు అక్కడ ఆఫీసులో ఉన్నప్పుడే మేం ఇక్కడి నుంచి కాల్స్‌ తీసుకోవాలి. పెళ్లికి ముందే మీ నాన్నగారితో ఈ విషయాలన్నీ చెప్పాను. నీతో మాట్లాడి, నీకు ఇష్టమైతేనే ఓకే చెప్పమని మరీ మరీ చెప్పాను. అయినా నీకు చెప్పలేదా’’ అన్నాడు.
      ‘ఏమో నాకు గుర్తులేదు’ పొడిబారిపోయిన గొంతుతో సమాధానమిచ్చింది పుష్ప. ఈ ఇరవై రోజులూ సీతాకోక చిలుకకు కొత్తగా రెక్కలొచ్చినట్లు ఎంత ఆనందంగా గడిచిపోయాయో. అంతలోనే పెద్ద కుదుపు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయింది పుష్ప. అన్నింటి కంటే ముఖ్యంగా ‘రాత్రులు నేను ఒంటరిగా ఉండగలనా?’ అన్న ప్రశ్నే ఆమెను తొలిచేస్తోంది. 
      ‘‘పుష్పా... నేను చెప్పేది విను. రోజూ రాత్రి పదకొండు గంటల వరకూ టీవీ చూస్తూనే ఉంటాం కదా. ఎంత! మరో మూడు గంటలు... నేను వచ్చేస్తాను. నిద్ర రాకపోతే అప్పటిదాకా టీవీ చూస్తుండు. ఎప్పుడన్నా మరీ భయంవేస్తే ఫోన్‌ చెయ్యి... పది నిమిషాల్లో నీ ముందుంటా. ఇక్కడికి దగ్గరే మా ఆఫీసు’’ అంటూ సర్దిచెప్పాడు ఫణి. ఈ మాటలతో పుష్ప మనసు కాస్త తేలికపడినా, ఆమె కళ్లలో ఏదో భయం కనిపిస్తూనే ఉంది. 
      ‘‘పోనీ కొన్ని రోజులు మీ ఇంటికి వెశ్తావా?’’ అన్నాడు ఫణి. ‘‘వద్దు. మీ దగ్గరే ఉంటాను’’ అంటూ భర్తని గట్టిగా కౌగిలించుకుంది పుష్ప. సాయంత్రం ఫణి ఆఫీసుకు బయలుదేరుతుంటే ఎదురొచ్చింది.
      ఆఫీసుకు వెశ్లాడే కానీ, ఫణి మనసంతా ఇంట్లోనే ఉంది. సహోద్యోగులంతా వచ్చి పెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. మధ్యలో ఏమాత్రం ఖాళీ దొరికినా పుష్పకు ఫోన్‌ చేస్తున్నాడు ఫణి. పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి రెండున్నర అయింది. చాలాసేపు తలుపు కొట్టినా పుష్ప తీయలేదు. నిద్రపోయి ఉంటుందనుకుని ఫోన్‌ చేశాడు.
      ‘‘హ..లో..’’ అంటూ నీరసంగా మాట్లాడింది పుష్ప. మెల్లగా వచ్చి తలుపుతీసింది. ఎప్పుడూ లేత గులాబీలా ఉండే ఆమె ముఖం వాడిపోయిన పువ్వులా మారింది. వెంటనే పుష్ప నుదుటి మీద చేయి వేసి చూశాడు ఫణి. కాలిపోతోంది. అటునుంచి అటే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మర్నాడు సాయంత్రానికల్లా పుష్ప అమ్మానాన్నలు వచ్చేశారు. 
      కూతురుకు తోడుగా నాలుగురోజులు ఇక్కడే ఉంటానన్నారు అత్తగారు. గతంలో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన మామగారిలో ఏదో మార్పు గమనించాడు ఫణి. ఒకరోజు ఉండి ఆయన వెళ్లిపోయారు.
      నాలుగు రోజుల్లో పుష్ప తేరుకుంది. అమ్మకు విశ్రాంతి ఇద్దామని ఆ రోజు వంటగదిలోకి వెళ్లింది. సరకులన్నీ ఖాళీ. ‘వదిలేస్తే మధ్యాహ్నం పన్నెండు దాటినా లేవడు’ అనుకుంటూ ఫణిని నిద్రలేపింది. ‘‘సరకులన్నీ నిండుకున్నాయి. తొందరగా పట్రండి’’ అంటూ పురమాయించింది. ‘‘తప్పదా...’’ అంటూ బద్ధకంగా లేచి, తయారై బజారుకు వెళ్లాడు ఫణి. 
      అసలే ఎండాకాలం... మిట్టమధ్యాహ్నం... సరకులు మోసుకొచ్చేసరికి ఫణి చొక్కా మొత్తం చెమటతో తడిసి ముద్దయింది. పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలో అనుకుంటూ ఇంట్లో అడుగుపెట్టాడు. తలుపు తెరవగానే వంటగదిలో లంగా ఓణీలో సన్నజాజి లాంటి నడుముతో అప్సరసలా దర్శనమిచ్చింది పుష్ప.
      ఎండలో తిరిగొచ్చిన నీరసమంతా వదిలిపోయింది ఫణికి. మెల్లగా వెళ్లి వెనక నుంచి భార్యను కౌగిలించుకున్నాడు. ‘‘ష్షూ.. ష్షూ..’’ అంటోంది పుష్ప! ఫణికి అర్థం కాలేదు. ‘‘వంట సంగతి తర్వాత చూద్దువు గానీ, ముందు శ్రీవారి...’’ అంటూ పక్కకు తిరిగి చూశాడు. గదిలో పాత్రలు సర్దుతున్న అత్తగారు కనిపించారు.
      అంతే! సిగ్గుతో బయటికి పరిగెత్తాడు ఫణి. వచ్చి సోఫాలో కూలబడ్డాడు. బుద్ధిమంతుడిలా టీవీలో లీనమైపోయాడు. నవ్వు ఆపుకుంటూ వెనకే వచ్చింది పుష్ప. సోఫా వెనక్కి వచ్చి ఫణి మెడ చెట్టూ చేతులు వేసింది. అతను ఉలకలేదు... పలకలేదు. ఫణి గెడ్డం కింద చేతులుంచి, తలను పైకి లేపింది. కళ్లూ కళ్లూ మాట్లాడుకున్నాయి కాసేపు.
      ‘‘అక్కడ మీ అమ్మ ఉన్న సంగతిని నువ్వయినా చెప్పాలి కదా’’ అన్నాడు ఫణి గారంగా. ‘‘అబ్బాయిగారు ఎక్కడ చెప్పనిచ్చారు... ఉడుంపట్టు పట్టేస్తేను! అయినా సరసానికి ఓ వేళ పాశా ఉండొద్దా శ్రీవారికి?’’ అంటూ బుగ్గ మీద గిచ్చింది పుష్ప. ఆమె చేతులు విదుల్చుకుని పడకగదిలోకి వెళ్లిపోయాడు ఫణి. మంచం మీద బోర్లాపడ్డాడు.  
      ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి వచ్చింది పుష్ప. ‘‘ఎందుకంత కోపంగా వచ్చేశారు’’ ఒత్తయిన ఫణి జుట్టులోకి వేళ్లు పోనిస్తూ అడిగింది. ‘‘నా ఉద్యోగానికి ఇదే వేశా.. పాశా..’’ అన్నాడతను. ‘‘అంటే పగలే వెన్నెల కురుస్తుందా తమరికి’’ అందామె కొంటెగా చూస్తూ. ‘‘అవును..’’ అన్నట్లు తలూపాడు ఫణి. ‘‘ఎంత ముద్దొస్తున్నారో’’ అంటూ అన్నంత పనీ చేసేసింది పుష్ప. ఆమెను అతను ఒళ్లోకి లాక్కున్నాడు. 

* * *

      ‘‘నాన్నా, తమ్ముడూ ఇంటి దగ్గర ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏమో! అసలే హోటల్‌ భోజనం మీ నాన్నకు పడదాయె’’ అంటూ విసవిసలాడుతున్న తల్లిని చూడగానే పుష్పకు విషయం అర్థమైంది. తనకా రాత్రుళ్లు ఒంటరిగా ఉండటం ఇంకా అలవాటు కాలేదు. అలాగని అమ్మను ఇక్కడే ఉండమనడం సబబు కాదు. ఏం చేయాలో తోచక ఆలోచనలో పడింది.
      అంతలో మార్కెట్‌ నుంచి వచ్చాడు ఫణి. ‘‘అమ్మ వెశ్తానంటోంది’’ అంది పుష్ప.
      ‘‘అదేంటి హఠాత్తుగా. మామయ్య ఏమైనా ఫోన్‌ చేశారా? మరి కొన్ని రోజులు ఉంటే పుష్పకు ధైర్యంగా ఉంటుందని..’’ అన్నాడు ఫణి అత్తగారితో.
      ‘‘లేదు బాబూ.. వెళ్లి మళ్లీ వస్తాను. పుష్పకు మెల్లగా అలవాటవుతుందిలే’’ అందావిడ.  
      సాయంత్రం అత్తగారిని బస్సు ఎక్కించి, అట్నుంచి అటే ఆఫీసుకు వెళ్లిపోయాడు ఫణి.

* * *

      ‘ఇవేం ఉద్యోగాల్రా బాబోయ్‌.. అమ్మను ఉండమంటే ఉన్నది కాదు.. ఈయన ఆఫీసులో ఏం చేస్తున్నారో... తొందరగా ఇంటికి వచ్చేస్తే బాగు’ టీవీ చూస్తున్నా పుష్ప మనసులో ఇవే ఆలోచనలు... 
      రాత్రి పదకొండున్నర అయింది. కిటికీ అద్దం నుంచి ఏదో టార్చ్‌ వెలుతురు వచ్చి పోయినట్లు కనిపించింది. పుష్పలో భయం మొదలైంది. ఎవడో దొంగ వచ్చాడనుకుని వెంటనే ఫణికి ఫోన్‌ చేసింది. పని మధ్యలో వదిలేసి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు ఫణి. తలుపు తీయడంతోనే తనమీదికి ఒరిగిపోయి ఏడ్చేసింది పుష్ప. ‘‘ఏమీ కాదు.. నేనున్నానుగా?’’ అంటూ ఓదార్చాడు. ఇంటి చుట్టూ చూసొచ్చాడు. ఎవరూ లేరు. పుష్పకు సర్దిచెప్పాడు.
      మర్నాడు మధ్యాహ్నానికే మామగారు వచ్చారు. పుష్ప వాళ్లమ్మకు ఫోను చేసింది కాబోలు అనుకున్నాడు ఫణి. ‘‘మా అమ్మాయి ఇంక ఇక్కడ ఉండలేదు. ఈ రాత్రి ఉద్యోగాలు వద్దు. మన ఊరు వచ్చేస్తే వంద ఎకరాల భూమి, పాడి పంటలు, తిండికి కొదవ లేదు. ఏదోలా కాలక్షేపం అయిపోతుంది’’ అన్నారు.
      పెళ్లినాడు కట్నమిస్తానన్నా తీసుకోని ఫణికి ఈ మాటలు రుచించలేదు. ‘‘నేను కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం. ఆత్మాభిమానాన్ని చంపేసుకుని మీ వెంట రావాలా? ఒకవేళ పుష్ప వస్తానంటే తీసుకెళ్లండి’’ అంటూ కరాఖండిగా చెప్పేశాడు.
      ‘‘ఆయన్ను వదిలి రాలేను నాన్నా... ఏదోలా ఇక్కడే సర్దుకుపోతాను... అలవాటు చేసుకుంటాను’’ అంది పుష్ప కన్నీళ్లతో. చేసేది లేక, భోజనం చేసి వెళ్లిపోయారు మామగారు. 
      ఫణి ఆ రోజు సెలవుపెట్టి ఇంటిదగ్గరే ఉండిపోయాడు. రాత్రి పదకొండు దాటింది. కిటికీ వైపే చూస్తున్నాడు. ఏదో వెలుతురు రావడం గమనించాడు. వెంటనే బయటికి పరిగెత్తుకెళ్లాడు. 
      పక్కింట్లో ఉండే పరంధామయ్యగారు అప్పుడే వచ్చారు. ఆయన విశ్రాంత సైనికోద్యోగి. మనిషి ఆజానుబాహుడు. ఇప్పుడు ఓ ప్రైవేటు సంస్థలో భద్రతాధికారిగా పనిచేస్తున్నారు. ఆయన బండి పార్క్‌ చేసేటప్పుడు హెడ్‌లైట్‌ వెలుతురు నేరుగా వీళ్ల కిటికీ అద్దాల మీద పడుతోంది. 
      ‘‘ఏమయ్యా.. ఇవాళ డ్యూటీకి వెళ్లలేదా’’ మాట కలిపారు పరంధామయ్య.
      ‘‘లేదండీ... సెలవు పెట్టాను. మీరు ఇంత రాత్రి వరకూ ఉండిపోయారేంటి’’ అడిగాడు ఫణి.
      ‘‘మొన్నే షిఫ్ట్‌ మార్చారయ్యా. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పదకొండింటి వరకూ’’ 
      ‘‘అవునా... మీ బండి వెలుతురు చూసి నిన్న పుష్ప భయపడిపోయింది. దొంగలేమోనని కంగారుపడింది. అదేంటో చూద్దామని ఇవాళ ఇంటిదగ్గరే ఉండిపోయాను’’ వివరించాడు ఫణి. అంతలో పుష్ప బయటికి వచ్చింది.
      ‘‘ఏమ్మా, ఈ కాలనీలో ఏ భయమూ ఉండదు. ఇక మీదట నేను రోజూ ఈ సమయానికే వస్తుంటాను. ఏదైనా అవసరమైతే మా ఇంటికి వచ్చేయమ్మా’’ అభయమిచ్చారు పరంధామయ్య. పుష్ప గుండెలు తేలికపడ్డాయి. ‘‘ఆంటీ చాలా మంచావిడ’’ అంటూ ధైర్యం చెప్పాడు ఫణి.

* * *

      కూతురు సాత్విక కాస్త కదిలేసరికి గతంలోంచి వర్తమానంలోకి వచ్చింది పుష్ప. అప్పటికీ ఇప్పటికీ ఎంత మారిపోయానో అనుకుంది. బొద్దింకను చూసినా పెద్దగా అరుస్తూ అంతదూరం పరిగెత్తేది. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో రాత్రులు ఒంటరిగా ఉండగలుగుతున్నందుకు కాస్త గర్వపడింది.
ఇంతలో కాలింగ్‌ బెెల్‌ మోగింది. ఫణి వచ్చాడు. తనతో ఏమీ మాట్లాడకుండానే గదిలోకి వెళ్లి పడుకుంది. ఆమెను అనుసరిస్తూ వచ్చిన ఫణి, ‘‘మేడమ్‌ గారు కోపంగా ఉన్నట్లున్నారు’’ అంటూ మీద చేయి వేశాడు. ‘‘నాకెందుకు కోపం? ఈ పెళ్లిరోజును మీ రెండో భార్యతో చేసుకున్నారుగా, బుద్ధిగా పడుకోండి’’ అంటూ పెదవి విరిచింది పుష్ప.
      ‘‘అది కాదు బంగారం..’’ ఫణి ఏదో చెప్పబోయాడు. ‘‘బంగారం లేదు.. వెండీ లేదు. ఇక మీదట ఏ పెళ్లిరోజుకీ సెలవు పెట్టక్కర్లేదు. నాకేనా పెళ్లిరోజు... మీకు కాదా?’’ అంటూ ఆమె రుసరుసలాడింది.
      ‘‘కోపమే..!’’ అంటూ ఆమె ముఖాన్ని తనవైపు తిప్పుకున్నాడు ఫణి. ఆమె చెక్కిళ్ల మీది కన్నీటి తడి తన చేతికి తగిలింది. ‘‘ఏడాదంతా ఈ రాత్రి చాకిరీ తప్పదు. ఆఖరికి పెళ్లిరోజున కూడానా...’’ అంటూ మరోవైపు తిరిగి పడుకుంది పుష్ప.
      ‘‘సాయంత్రం నేను డ్యూటీకి వెళ్లడమొక్కటే నీకు తెలుసు. ఇంటి దగ్గర బయల్దేరిన క్షణం నుంచి ఎన్నివేల సార్లు నువ్వు గుర్తొచ్చావో తెలుసా! పని చేస్తున్నా మనసంతా నీ దగ్గరే ఉంది. నువ్వేం చేస్తున్నావో, నిద్రపోయావో లేదో అని ఒకటే ఆలోచన. కాస్త ఎంగిలన్నాపడ్డావో లేదో అని అల్లాడిపోయా. నువ్వే నేనైనప్పుడు.. నీకు లేని ప్రశాంతత నాకెక్కడిది? నువ్వు పొందని ఆనందం నాకెలా దొరుకుతుంది? రాత్రిపూట నిన్నూ పిల్లలను వదిలి ఆఫీసుకు వెళ్తుంటే రోజూ ఎంత వేదన అనుభవిస్తున్నానో నాకు తెలుసు. నీ కంటి తడి నా చేతికి తగిలినప్పుడు.. నా గుండె తడి నీ మనసును తాకట్లేదా చెప్పు’’ అన్నాడు ఫణి. కన్నీళ్లు ధారలు కడుతుండగా లేచి, అతన్ని హత్తుకుంది పుష్ప. 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావుbal bharatam