ఎస్కార్ట్‌

  • 175 Views
  • 9Likes
  • Like
  • Article Share

    పెండ్యాల గాయ‌త్రి

  • తెలుగు ఉపాధ్యాయురాలు
  • కనిగిరి, ప్రకాశం జిల్లా.
  • 8985314974
పెండ్యాల గాయ‌త్రి

ఎవరు వికలాంగులు? అవయవ లోపం ఉన్నవాళ్లా? ఆలోచనల్లో లోపాలు ఉన్నవాళ్లా? ఎవరు? హడావుడిగా హైదరాబాదు బయల్దేరిన గంగాధర్‌కు అనుకోకుండా ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం వెతక్క తప్పని పరిస్థితి అతనికి ఎందుకొచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది?
మనిషి
జీవితంలాంటిదే రైలు ప్రయాణం కూడా. బతుకుబండి నడవాలంటే ఎన్ని స్థాయులు మారాలో ఈ రైలుబండిలోనూ అన్ని స్థాయులున్నాయి. ఏసీ నుంచి జనరల్‌ దాక. ఈ యాభై ఏళ్ల జీవితంలో ఏనాడూ జనరల్‌ బోగీలో ప్రయాణించింది లేదు. కానీ, ఇవాళ రిజర్వేషన్‌ దొరికింది కాదు. సరే... విరమించుకుందామా అంటే, ఈ రైలు ఎక్కలేకపోతే తెల్లవారేసరికి హైదరాబాదు చేరుకోలేను. అబ్బా! ఫ్లాట్‌ఫాం పట్టనంత జనం. వీళ్లంతా జనరల్‌ బోగీకే ఎక్కుతారేమో! ఇక సీటు దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఈ మోకాళ్ల నొప్పులతో రాత్రంతా నిలబడి ప్రయాణించగలనా? 
      అదిగో... రైలొచ్చేసింది. అబ్బబ్బా! జనం పరిగెత్తి ఎక్కుతున్నారు. జనరల్‌ బోగీలో కాలు కూడా పెట్టలేకపోయాను. ఇప్పుడేంటి దారి? వెనక్కు వెళ్తే...? వామ్మో ఉరే! రైలు కదులుతోంది.. త్వరగా ఎక్కెయ్యాలి. కానీ... ఎక్కడ? ఎక్కడెక్కాలి? 
      ఈ జనరల్‌ బోగీ వెనక ఇంకో బోగి ఏదో ఉన్నట్టుందే!... హమ్మయ్య... రైలు కదిలేసరికి ఎక్కేశాను. అతనెవరు?... నేనెప్పుడూ చూడలేదే! మరేంటి నన్ను ఎగాదిగా చూస్తున్నాడు. దొంగనని అనుకుంటున్నాడా ఏంటి ఖర్మ! అతని చూపుల నుంచి తప్పించుకుని, ఖాళీ జాగా వెతుక్కుని కూర్చుంటుండగా అడిగాడు ‘‘నువ్వు వికలాంగుడివా?’’ అని. ‘ఛ! నేను వికలాంగుడనేంటి? నిక్షేపంలా ఉంటేను’ అందామనుకుని తలతిప్పి చూసేసరికి ఇద్దరు అంధులు, ముగ్గురు అంగవికలురు కూర్చుని ఉన్నారు.
‘‘ఇది వికలాంగుల బోగీ, మామూలు వాళ్లు ఎక్కకూడదు’’ అన్నాడు ఇంకో వ్యక్తి. ఆహా! ఆఖరికి ఈ స్థాయికి వచ్చానన్నమాట. ‘‘అయితే అతడికి ఏ లోపం కనిపించటం లేదే’’ అన్నాను ఒకతని వైపు వేలుచూపిస్తూ. ‘‘నేను మా అబ్బాయికి ఎస్కార్ట్‌ని. రెండు కాళ్లూ లేని నా బిడ్డని నేనే కాపాడుకోవాలిగా’’ చేతికర్రలు సీటు కిందకు నెడుతూ అన్నాడా వ్యక్తి. ఇంతలో ‘‘వారెవరనుకున్నారూ! ఓ డివిజన్‌కే ఎస్కార్ట్‌. గొప్ప రెవెన్యూ అధికారి గంగాధర్‌ గారు’’ అన్న మాటలు చెవినపడ్డాయి. ఇక్కడ నన్ను ఎరిగినవారెవరబ్బా అనుకుంటూ ఆవైపు చూశాను. చూపులేని ఓ యువకుడు.. నా గొంతు గుర్తుపట్టినట్లున్నాడు. ‘‘నిన్నెక్కడో చూసినట్లుందబ్బాయ్‌!’’ అన్నాను. ‘‘నాలాంటి వాళ్లని చాలామందిని చూసుంటార్లెండి. మీరసలే నియమ నిబంధనలు తూచతప్పక పాటించే అధికారి కదా!’’ అన్నాడతడు. 
      అతణ్ని ఎక్కడ చూశానో గుర్తుకువచ్చింది. ఇటీవల జరిగిన పోటీపరీక్షల సందర్భంలో ఓ పరీక్షాకేంద్రం బాధ్యతలు చూస్తున్నప్పుడు వీళ్లమ్మ, అతను వచ్చి కలిశారు. అరె! అతనికి అనుకూలంగా ఉండే వ్యక్తిని స్క్రైబ్‌గా తెచ్చుకుంటానంటాడు. అందుకు నేను అనుమతించాలంటాడు. వీళ్లమ్మ కూడా చాలా పెద్దకథే చెప్పింది. ‘‘అయ్యా! నా బిడ్డ సొంతంగా చదువుకోలేడు. ఎవరన్న దయతో చదివి వినిపిస్తే విని గుర్తుపెట్టుకోవాలి. పేదవాళ్లం. ఒకరికి ఇద్దరు అవిటి బిడ్డలు. ఈ పరీక్ష కోసమని బిడ్డ చాలా కష్టపడ్డాడు. మీరు ఎవర్నిబడితే వాళ్లని రాయడానికిస్తే వాళ్లు సరిగ్గా లేకపోతే నా బిడ్డ అన్యాయమైపోతాడు సార్‌!’’ అంటూ దండకం చదివింది. ‘‘మీవాడొక్కడి కోసం మా నిబంధనల్ని తుంగలో తొక్కమంటావా? స్క్రైబ్‌ను మీరు తెచ్చుకోవడం కుదరదు. మేమే కేటాయిస్తాం. అతనికి వచ్చింది చెప్పమని చెప్పు. అయినా ఎస్కార్ట్‌ లేకుండా ఒక్క పని కూడా చేసుకోలేడు. రేపు ఉద్యోగమొస్తే ఎట్లా చేస్తాడమ్మా? అవిటివాళ్లు ఉద్యోగాల్లో చేరితే దేశం ఏమైపోవాలి?’’ అని గట్టిగా మందలించి పంపించాను. పకడ్బందీగా పరీక్ష జరిపించాను. ‘‘చాలా సమర్థవంతంగా పనిచేశారండీ’’ అంటూ కలెక్టర్‌గారు కూడా అభినందించారు. పాతికేళ్ల నా సర్వీస్‌లో ఎక్కడా తప్పు జరిగింది లేదు.

* * *

      ఏదో స్టేషన్‌ వచ్చినట్లుంది. రైలాగింది. ప్లాట్‌ఫామ్‌ మీదున్న ప్రయాణికులు ‘‘తలుపు తెరవండి’’ అంటూ బాదుతున్నారు. ‘‘వికలాంగులు తప్ప ఈ పెట్టెలో వేరెవరూ ఎక్కకూడదు’’ లోపలివాళ్లు అరిచి చెబుతున్నారు. ‘‘వికలాంగులున్నారండీ!’’ అంటూ బయటవాళ్లు మరింత గట్టిగా అరుస్తున్నారు. ఓ వ్యక్తి లేచి వెళ్లి తలుపు తెరవడంతో దాదాపు పదిమంది లోపలికి వచ్చేశారు. ‘‘టీసీ వచ్చాడంటే అందర్నీ మధ్యలోనే దింపేస్తాడు. మామూలు వాళ్లంతా దిగండి..’’ అంటూ హితవు చెప్పాడు తలుపు తెరిచిన వ్యక్తి. గోలగోలగా అరుచుకుంటూ, ఒకరినొకరు నెట్టుకుంటూ అందరూ దిగిపోయారు.. ఇద్దరు తప్ప. వాళ్లలో ఒకతను కాలికేదో గుడ్డ చుట్టుకున్నాడు. తను వికలాంగుణ్నని, పక్కనున్న వ్యక్తి తన ఎస్కార్ట్‌ అని చెప్పాడు. రైలుబండి మళ్లీ పరుగందుకుంది.
      ‘‘వికలాంగులు సకలాంగుల మీద ఆధారపడుతున్నారో... సకలాంగులే వికలాంగుల అవకాశాలను వినియోగించుకుంటున్నారో అర్థం కావట్లేదు’’ నన్ను గుర్తించిన అంధ యువకుడు అన్నాడు. ‘‘తెల్లవారేసరికి ఎవరి దారిన వాళ్లం పోతాం. ఇంతలోకే అంత పెద్దమాటెందుకు బాబు!’’ కొత్తగా వచ్చిన ఇద్దరిలో ‘ఎస్కార్ట్‌’ భుజాలు తడుముకున్నాడు. ‘‘తెల్లవారితే మీకు వెలుగొస్తుంది. ఎన్ని రాత్రులు గడిచినా చీకటి తొలగని మా బతుకుల్లోకి మీరేనాడూ తొంగి చూడరు కదా!’’ లోపలికి చొచ్చుకువచ్చే సుడిగాలికి కిటికీ అద్దాన్ని అడ్డం వేస్తూ అన్నాడా కుర్రాడు. ‘‘ఎవరి బతుకులు వాళ్లు బతకడమే కష్టంగా ఉన్న రోజులు బాబూ ఇవీ’’ బదులిచ్చాడా వ్యక్తి. 
      ‘‘అవునండీ! అందుకే మా బతుకులను దెబ్బతీయొద్దంటున్నాం’’ ఈసారి మరో అంధుడు మాట విసిరాడు. ‘‘ఎవరికేంపనయ్యా! పనికట్టుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి’’ ఆవేశంగా అన్నాన్నేను. ‘‘భారతదేశం ఈ రైలుపెట్టంత చిన్నది కాదు సార్‌!’’ అన్నాడతడు. ‘‘ఇంత చిన్న రైలుపెట్టెలో కొద్దిగంటలే ప్రయాణం. నువ్వు రాద్ధాంతం చేయాల్సినంత పెద్దది కాదబ్బాయ్‌ విషయం’’ కాస్త కటువుగానే అన్నాను.
      ‘‘సార్‌! ఆరోజు మీరు పకడ్బందీగా నిర్వహించిన ఆ పరీక్షా కొద్ది గంటలే. కానీ, అది మా జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఇన్విజిలేటర్ల నుంచి పరీక్షా కేంద్రం ప్రధానాధికారి వరకూ, తనిఖీ సిబ్బంది, ఆఖరికి మంచినీళ్లు అందించేవాళ్లకు కూడా పరీక్షల నిర్వహణ మీద శిక్షణ ఇస్తారు కదా. ఒక్క పరీక్ష మీద ఇంత శ్రద్ధ ఎందుకండీ? ఎక్కడైనా ఏదైనా తేడా జరిగితే అర్హత ఉన్నవాళ్లకి అన్యాయం జరుగుతుందనే కదా. కానీ మా స్క్రైబ్‌ విషయంలో మాత్రం మీకే పట్టింపూ ఉండదు. పరీక్షకు పదినిమిషాల ముందు ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థులనో, అక్షరాలకు అంకెలకు తేడా తెలియని వ్యక్తులనో హడావిడిగా పిలిపించి మా పక్కన కూర్చోబెడతారు. ప్రశ్నపత్రం చదవడమే చేతకాని ఆ స్క్రైబ్‌లు మాకెక్కడ సమాధానాలన్నీ చెప్పేస్తారేమోనని మళ్లీ ఓ నిఘా! అసలు మీలో కొంతమందికైతే అంధులు స్క్రైబ్‌ సాయంతో పరీక్షలు రాస్తారన్న కనీస విషయమూ తెలియదు. నానా రకాలుగా చూచిరాతలకు పాల్పడే మామూలు అభ్యర్థులను మాత్రం పసిగట్టలేరు. సవాలక్ష బాధలకోర్చి సబ్జెక్ట్‌ అంతా నేర్చుకుని, అక్షరాలు రాని స్క్రైబ్‌లతో పరీక్షలు రాసే అంధులెక్కడ అధికారులైపోతారోనని మీబోటివాళ్లు భయపడుతుంటారు’’ నన్ను గుర్తుపట్టిన కుర్రాడు కలగజేసుకుని గద్గదస్వరంతో మాట్లాడాడు. 
      బోగీ అంతా నిశ్శబ్దం అలముకుంది. దాన్ని ఛేదిస్తూ మరో అంధుడు గొంతెత్తాడు. ‘‘అంతవరకైతే ఫరవాలేదండీ... మామూలు వాళ్లు నకిలీ ధ్రువపత్రాలు పుట్టించుకుని, రిజర్వ్‌ పోస్టుల్లో తిష్ఠవేస్తున్నారు. కష్టపడి చదువుకునే నిజమైన వికలాంగులను అన్యాయం చేస్తున్నారు. అటు ప్రైవేటు యాజమాన్యాలేమో వీళ్ల సామర్థ్యాన్ని పరీక్షించకుండానే పనిలోకి తీసుకునేందుకు నిరాకరిస్తున్నాయి’’ అన్నాడు. ఇంతలో కాళ్లు లేని ఓ వ్యక్తి కల్పించుకుని, ‘‘నిన్నో మొన్నో పేపర్‌లో చూశా. కంట్లో ఉన్న చిన్న మచ్చను అడ్డుపెట్టుకుని మెడికల్‌ సర్టిఫికెట్‌ సంపాదించి, వి.హెచ్‌ కేటగిరీలో ఎండీవో పోస్టులో చేరిపోయాడట. ఎవరో కూపీలాగి రెండేళ్ల తర్వాత అతని బండారాన్ని బయటపెట్టారు. ఆ ప్రబుద్ధుడి పేరు మధుబాబో ఏదో...’’ అన్నాడు.
      ఆ మాటలకు నా ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. మధుకర్‌ నా ఒక్కగానొక్క కొడుకు. రెండేళ్ల కిందట ‘‘ఓపెన్‌లో గ్రూప్‌టూ పోస్ట్‌ కొట్టా నాన్నా...’’ అంటూ పోస్టింగ్‌ ఆర్డర్స్‌ చూపించే సరికి ఉప్పొంగిపోయాను. కానీ, వాడు చేసిన వెధవ పనికి తలెత్తుకోలేకపోతున్నాను. వాడి చావుకు వాణ్ని వదిలేద్దాం అనుకుంటే, ‘ఉరేసుకుని చస్తాం’ అంటూ నా భార్య, కోడలు నా మెడకు ఉచ్చు బిగించారు. ఆ పోస్టింగ్‌ ఆర్డర్స్‌ను వి.హెచ్‌. నుంచి ఓపెన్‌లోకి మార్పించేందుకు ఎంతమంది కాళ్లు పట్టుకోవాలో!

* * *

      ‘‘ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ప్రయాణాలు మానేసి ఇంట్లో ఉండొచ్చు కదయ్యా!’’ సీటు మీద నుంచి కింద పడిపోయిన ఆ కాళ్లులేనతణ్ని లేపి కూర్చోబెడుతూ అంటున్నాడు మధ్యలో ఎక్కిన ‘ఎస్కార్టు’. ‘‘చూడండి! పడినా పైకిలేచినా ఫలితం అనుభవించేది మేమే కదా!’’ బదులిచ్చాడు ఆ వికలాంగుడు. ‘‘కర్ర ఆధారం లేనిదే కదల్లేడని జాలిపడి సలహా ఇస్తే ఇలా మాట్లాడతాడేమండి!’’ నా వైపు చూస్తూ అన్నాడా వ్యక్తి. అతడి మాట పూర్తి కాకముందే ఇందాక గట్టిగా మాట్లాడిన అంధ యువకుడు అందుకున్నాడు. ‘‘ఏవండీ.. మీరీ సమాజంలో ఏకాకిలా బతుకుతున్నారా? అమ్మానాన్నల మీద ఆధారపడకుండానే పెరిగారా? ఇప్పుడు భార్యాపిల్లల మీద ఆధారపడకుండానే బతుకుతున్నారా? సమాజం మీద ఆధారపడకుండానే డబ్బులు సంపాదిస్తున్నారా? అవునూ మీరూ ఎస్కార్ట్‌గా వచ్చినవాళ్లే కదా. మరి మీవాడెందుకు ప్రయాణం కట్టాడు?’’ అనేసరికి ఈ వ్యక్తి తలవాల్చేశాడు. 
      ‘‘మనుషులనేవారు ఒకరికొకరు బతకాలండీ! సాధ్యమైనంతవరకు సహకరించుకోవాలి. మనిషన్న వాడికి తప్పనిసరిగా పొరుగువారితో అవసరముంటుంది. అయితే మాకు ఆ అవసరం కాస్త ఎక్కువగా ఉంటుంది. అంతమాత్రానికే అదేదో శాపమని, ఖర్మని, కాని మాటలు చెప్పి మమ్మల్ని నిర్వీర్యం చేయకండి’’ ఆ కుర్రాడు అలా చెబుతుంటే దృష్టి మరల్చుకోలేకపోయాను. 
      ‘‘ఎన్ని మార్పులు వస్తున్నా ఈ వ్యవస్థ మాత్రం మమ్మల్ని చిన్నచూపు చూడటం మానలేదు. మాకు జన్మనిచ్చినందుకు మా అమ్మనాన్నలను వదలట్లేదు. ఉద్యోగాల్లో సమర్థవంతంగా రాణిస్తున్నప్పటికీ మమ్మల్ని సాటి మనుషులుగా కూడా స్వీకరించలేకపోతున్నారు. పెళ్లిళ్ల విషయంలో కులవివక్ష అయినా కాస్త సమసిందికానీ వికలాంగ వివక్ష మాత్రం వీడలేదంటూ కంటి చెమ్మ తుడుచుకున్నాడు మరో కుర్రాడు. ‘‘ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మా ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కుచెదరదు. కొత్త కళలకు ఊపిరులూదగలం. శాస్త్రాలను తిరగరాయగలం. ఈ సమాజం మాకు గోరంత సహకారం అందించగలిగితే మా వైకల్యాన్నే కాదు ఈ ప్రపంచాన్నే జయించగల శక్తిసామర్థ్యాలను అందిపుచ్చుకోగలం’’ అంటూ ఆ యువకుడు చెబుతుంటే చూడలేని ఆ కళ్లను కళ్లార్పకుండా చూస్తున్నారందరూ.
      అతని వాక్ప్రవాహానికి అడ్డొస్తూ రైలు వేగాన్ని తగ్గించింది. మరో స్టేషను వస్తున్నట్లుంది అనుకునేలోపే టీసీ లోపలికొచ్చాడు. నాలో భయం మొదలైంది. ఆయన వస్తూనే ‘‘వికలాంగులు, వాళ్లకు తోడుగా వచ్చినవాళ్లు కాకుండా మిగిలిన వాళ్లంతా లేవండి’’ అన్నాడు గంభీరమైన గొంతుతో. ఎవరూ కదల్లేదు. ‘‘ఏం! చెబుతుంటే వినిపించట్లేదా?’’ టీసీ స్వరం ఇంకాస్త గట్టిగా వినిపించింది. ‘‘ఇక్కడ వేరేవాళ్లు ఎవరూ లేరు సార్‌’’ అన్నాడు ఇంతలో కాలికి గుడ్డ చుట్టుకున్న వ్యక్తి. అతన్ని టీసీ పరిశీలనగా చూసి కాలికి చుట్టి ఉన్న గుడ్డను లాగేశాడు. ఏ సమస్యా లేదతనికి. ‘‘లే పైకిలే!’’ అంటూ టీసీ కొట్టినంత పనిచేశాడు. ‘‘ఏంటయ్యా! మా ఇష్టం ఎక్కడైనా ఎక్కుతాం. ఈ రైలు జనానిది... నీ బాబుది కాదు’’ అంటూ వాదనకు దిగాడు ‘ఎస్కార్టు’. టీసీ మారుమాట్లాడకుండా, ఎవరికో ఫోనుచేశాడు. ‘‘హలో... ఇన్‌స్పెక్టర్‌ ఒకసారి వికలాంగుల బోగీలోకి రండి’’ అంటుండగానే ‘‘సార్‌ ప్లీజ్‌ సార్‌! ఏదో తెలియక ఎక్కాం... క్షమించండి’’ అంటూ బతిమాలడం మొదలుపెట్టారా ఇద్దరు.
      టీసీ దృష్టి నావైపు మళ్లింది. నా వంట్లో వణుకు మొదలైంది. ‘‘నువ్వు ఎవరి ఎస్కార్ట్‌వి?’’ అడిగాడు. ‘‘అది అదీ!’’ నీళ్లు నమిలాను. ‘‘ఏమయ్యా! చూడ్డానికి పెద్దమనిషిలా ఉన్నావు... బుద్ధిలేదు...’’ టీసీ గొంతు ఖంగుమంటుండగానే ‘‘టీసీ గారూ... ఆయన నా ఎస్కార్టండీ’’ అన్నాడా కుర్రాడు... అతనే! నన్ను గుర్తుపట్టిన అంధ యువకుడు... ఆనాడు స్క్రైబ్‌ విషయంలో నేను కసురుకున్న అబ్బాయి!! ‘‘అలాగా...’’ అంటూ కిందకీ పైకీ చూసి, ఆ ఇద్దరినీ తీసుకుని వెళ్లిపోయాడు టీసీ. 
      రైలు మళ్లీ కదిలింది. మాటల్లేని నిశ్శబ్ద వాతావరణంలోకి గాలి చొరబడి సవ్వడి చేస్తోంది. పైకి లేచి అతని దగ్గరకు వెళ్లి రెండు చేతులూ పట్టుకున్నాను. ‘‘సార్‌!’’ అంటూ అతను లేచి నిల్చున్నాడు. అతనికెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాను. అతనే మాట్లాడాడు. ‘‘సార్‌! సాధారణంగా మీబోటి అధికారులు మా బోగీ ఎక్కారంటే ఏదో అర్జెంట్‌ పనిపడి ఉంటుంది. మీరు సమాజానికి ఎస్కార్ట్‌ లాంటి వారు. మీ ప్రయాణానికి ఆటంకం కలిగితే అక్కడ పని కుంటుపడుతుంది. అంతిమంగా ప్రజలు నష్టపోతారు. అందుకే అలా చెప్పాను’’ తన మాటలతో నా చెంప చెళ్లుమనిపించినట్లుగా తోచింది.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావుbal bharatam