తీరం

  • 186 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వి.వి.భరద్వాజ

  • విశ్రాంత ఎగ్జిక్యూటివ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్,
  • విశాఖపట్నం.
  • 9000552080
వి.వి.భరద్వాజ

ఒకరిది పంతం... మరొకరిది పట్టుదల! బాధ్యతల్లోంచి వచ్చిన అహం ఒకరిది... ఆత్మగౌరవం అనుకునే నిర్లక్ష్యం మరొకరిది. వీళ్లిద్దరి మధ్య నలిగిపోయి... అందరూ ఉన్నా ఒంటరిదైపోయిన దైన్యం ఇంకొకరిది! ఈ మూడు జీవితాలతో కలిసి కాలం ఆడిన నాలుగు స్తంభాలాట... 
నిశ్శబ్ద
వాతావరణాన్ని బద్దలుగొడుతున్న చర్చి గడియారం గంటలు భయం పుట్టిస్తున్నాయి. అందులోనూ వీధంతా చిమ్మచీకటి... నా గుండెల్లో ఆందోళన, అలజడి, గుబులు ఒకదానికొకటి తోడై భయం గుప్పెట్లోకి జారిపోతున్నాను. ఇది చాలదన్నట్లు హఠాత్తుగా ఉరుములు, మెరుపులు... నాలో ఉలికిపాటు రెట్టింపవుతోంది. ఇదీ సమయం... కాదు... కాదు ఇదే సమయం కరెంటు పోవడానికి- అదీ జరిగిపోయింది. భయంకరంగా ఉంది వాతావరణం. అన్నీ ఒక్కసారిగా దాడి చేస్తున్నాయి. ఏం చెయ్యటానికి ఏదీ అనుకూలించట్లేదు. పోరాడే శక్తి సన్నగిల్లుతోంది రాన్రానూ... నాకు నేనే ధైర్యాన్ని కూడదీసుకుంటున్నా. కలసిరాని కాలంతో పాటు వ్యతిరేకంగా వ్యవహరించే మనుషులతోనూ పోరాటం! ఇందులోనే నేను అమానుషంగా బలయ్యాను. దానికి ఎవరిని నిందించాలి? అయినా... నేను నిలబడ్డాను. ఇంతటి ప్రతికూల వాతావరణంలోనూ ఏదో సాధించాలన్న తపనతో నా బతుకుబండిని ముందుకు నడిపిస్తున్నాను. దైన్యంతో సంపాదించే దానికన్నా, ధైర్యంతో సాధించేదే చిరస్థాయిగా నిలుస్తుందనే వారు అమ్మమ్మా తాతయ్యలు. 
      నా ఆలోచనలను ఖండిస్తూ ఆకాశం గర్జించింది. వాస్తవంలోకి వచ్చాను. అలా ఒకటి... రెండు... నిమిషాలు గడుస్తున్నాయి బరువుగా... మళ్లీ వెనక్కిపోయాయి ఆలోచనలు...

* * *

      ఎప్పుడో జరిగింది. నిజానికి సరిగా గుర్తులేదు. నాకు నిండా పదేళ్లు లేవు అప్పటికి... అదీ ఎవరో అనగా... వినగా... వినగా నాకు బోధపడింది. అదో దుర్ఘటన... దానికి బలి అయింది నేను... కచ్చితంగా నేనే. కానీ, దీనికి ఎవరు బాధ్యులు అని ఆలోచించడం మానేశాను చాలా కాలంగా. కారణం... ప్రస్తుతం నేను స్థిరపడాలి. నా ఆశయాలు, ఆశలు సాధించుకోవాలి. ఇందుకోసం వెలుగువైపు దారి చూసుకోవాలి. చీకటికి వెలుగేంటో, వెలుగులో ఉండే ఆనందమేంటో చూపించాలి. ఇప్పుడు ఇరవై రెండేళ్లు. ఇంకొద్ది రోజుల్లోనే నా గమ్యాన్ని చేరుకుంటా. ఈ ఆశావహ దృక్పథం అమ్మమ్మా తాతయ్యల సాంగత్యం ద్వారానే అలవడింది. మరి ఇప్పుడెందుకు భయం ముప్పిరిగొంటోంది!? ఎందుకంటే... విధి ఇంకో పంజా విసిరింది నిర్దయగా!
      అమ్మమ్మ కూడా అమ్మ దగ్గరికి వెళ్లిపోయింది. నన్నూ, తాతయ్యనూ విడిచి తిరిగిరాని దూరాలకు చేరిపోయింది. నాకు అయిదారేళ్లప్పుడనుకుంటా- అమ్మను పోగొట్టుకున్నాను. అప్పటి నుంచి అంతా తామై ఇంతవరకూ నన్ను కాపాడుకొచ్చారు అమ్మమ్మా, తాతయ్య. కంచెలా నిలబడుతూ ఇంతవరకు ఈ కొమ్మకు చేదోడుగా నిలిచారు. నాకు వాళ్లే దేవుళ్లు. నిజానికి అమ్మ రూపాన్ని ఫొటోలో చూడటమే! ఇక నా జన్మకు బాధ్యులైన మరో వ్యక్తి... ఆయన్ని ప్రత్యక్షంగా చూసెరగను. అసలు ఆయన ఎవరో తెలియకుండానే గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు గడుపుకొచ్చాను. ఇన్నాళ్లూ ఈ బాధను పంటి బిగువున బంధించాను. ఒక్కోసారి అనిపిస్తుంది- నన్నెందుకు మిగిల్చావు దేవుడా! అమ్మతోపాటు నన్ను కూడా... కాకుంటే అమ్మనుంచి నన్నే తీసుకెళ్లిపోయి ఉంటే ఈ విహ్వలతకు తావుండేది కాదు కదా అని! విధివిలాసం.. అది నాకు వైపరీత్యం. తాతయ్య అమ్మమ్మలకు విధి విలాపం. మరి ఆ వ్యక్తికి విధి విన్యాసం. అందరం ఆ విధి ఆడించిన నాటకంలో పాత్రలమే. నిడివి ఎంత అనేది మన చేతుల్లో లేదు. నిర్దేశించిన గమ్యం వరకూ నడవాల్సిందే... నటించాల్సిందే. 
      ఫెడేల్‌మనే శబ్దంతో మళ్లీ నా ఆలోచనలకు అంతరాయం. ఉరుముతో పాటు మెరుపు... ఆపై పిడుగు పడిందనిపించింది. అదేదో నా మీద పడుంటే బాగుండును... పీడా వదిలేది తాతయ్యకు. అనుకున్నవన్నీ జరగవుగా! ఎలా పెట్టారో కానీ నా పేరు- సంధ్య. పొద్దు కుంగే సమయం. చీకటికి చేరువ కావాలి ప్రతిరోజూ... ఇప్పటి వరకు చేరువులోనే ఉన్నా. దీనికి కారణం- నాన్న. ఆయన పేరు శ్రీరామ్‌ అని తెలుసుకున్నా. మనస్పర్ధల వల్ల ఆయన్ను దూరంగా ఉంచేశారట. అమ్మకు ఏదో జబ్బుచేసి చనిపోయింది. అప్పట్లో అమ్మమ్మా తాతయ్యలు తప్ప మిగిలిన వాళ్లందరూ నష్టజాతకురాలినని నన్ను ఆడిపోసుకున్నారట. అమ్మమ్మా తాతయ్యల పంతాలు, పగలు... తరచూ పరిధులు దాటే నాన్న కోపం, ఆయన అస్థిరత్వం... అన్నీ కలిసి నాన్నను మాతో చేరనివ్వకుండా, కనీసం మేం ఎక్కడ ఉన్నామో కూడా తెలియనివ్వకుండా చేశాయి. అందరూ కలిసి మమకారాలను మలినం చేశారు. 
      ఇక అమ్మ తరఫువాళ్ల గేలి, కేళి- చెప్పడం అనవసరం. ఎందుకంటే నేను భరించి తీరాలి- నాన్న ఆసరా లేనిదాన్ని. ఏంటీ ఈరోజు ఇంతగా మనోవేదనకు గురవుతున్నాను! ఇంతవరకు నన్ను సాకటం నిజంగా ఓ సవాలు తాతయ్య, అమ్మమ్మలకు. అప్పుడే నాన్నకు అప్పజెప్పి ఉంటే- అయినా అలాంటిదేం జరగలేదుగా! కారణం- అప్పటికి నాన్న స్థిరపడలేదు. ఆర్థిక అస్థిరత, అపరిపక్వత, బాధ్యత లేకుండా తిరగడం, సముదాయించే వారి మాటను లెక్కచెయ్యకపోవటం- దరిమిలా నేను బలయ్యాను. నాన్నకీ, తాతయ్యకూ మధ్య ఆ రోజుల్లో పచ్చగడ్డి వేస్తే మంట రగిలేది. ఇద్దరికీ అహాలు... పంతాలు! ఇద్దరిలోనూ కనికరమూ ఉండదు. కర్కశత్వమూ కొంత... కొంత... ఇద్దరిలో! వాటన్నింటికీ నేను బలి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా తాతయ్య నాకు ఫీజులు కట్టి, చదువు ప్రాధాన్యం చెప్పి, దాని మీద ధ్యాస పెట్టించి, స్థిరత్వం ఎలా ఉంటుందో నేర్పించారు. 
అన్యమనస్కంగా పక్క వేసుకుని, కిటికీలోంచి చూస్తున్నా... తెలియకుండా జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట కట్టాలని కళ్లు మూసుకున్నా...

* * *

      ‘‘నేను, సంధ్యా! నాన్నని... ఎలా ఉన్నావు?’’ ఆర్తిగా అడుగుతున్నట్లుంది ఆ పిలుపు. బహుశా ఇలాగే ఉంటుందేమో ఆయన గొంతు... అవునులే అసలు ఎప్పుడైనా వింటేనేగా. 
      ‘‘నేనేనా మీ నాన్ననని అనుమానంగా ఉందా? సహజమే... నా రూపం కూడా నీకు సందేహాస్పదమే కదా. నేను ఉండి కూడా... లేనంత... అదే చేరువలో లేనంత దూరంగా జరిగిపోయాను కదా!! నిజం.. నమ్మమ్మా! ఆ పరిస్థితిల్లో ఇమడలేకపోయాను. నన్ను నేను ఇముడ్చుకోలేకపోయాను. అయినా సరే, కనీసం రెండో మాటకు తావివ్వలేదు మీ తాతయ్య. కర్మ సిద్ధాంతం వల్లెవేయటం లేదు సుమా! కాలం విసిరేసిన, కాలగతిలో నెట్టివేతకు గురైన వ్యక్తిగా, దోషిగా మిగిలాను. పరిస్థితులు నాకు అనుకూలించలేదు. అసహనం ఎక్కువైంది. నాలో ధైర్యం సన్నగిల్లి ఆ జాగాలో ద్వేషం, అహం ప్రవేశించాయి. నిన్నూ, అమ్మనూ దూరం చేసుకున్నాను. మీ అమ్మమ్మా తాతయ్యలూ అంతే! యుక్త వయసు ఉడుకురక్తం నాది. వాళ్లది మంకుతనం, మొండివైఖరి. వాళ్లు చెప్పిందే వేదం.. నాదంతా వాళ్లకి ఖేదం. వాళ్ల దృష్టిలో నేను స్థిరత్వం లేని వాణ్ని. ఆ స్థిరత్వం కోసమే అప్పట్లో నా ఆరాటం, పోరాటం- సాధించింది ఏమీలేదు కానీ మీకు దూరంగా జరిగిపోయాను. అంతలోనే అనేకం జరిగిపోయాయి. ఇప్పుడు తప్పొప్పుల పట్టిక వినిపించటం కాదుకానీ, బెర్లిన్‌ గోడను సైతం కూలదోసి చరిత్రను తిరగరాశారు. మరి మన మధ్య ఎన్నాళ్లీ ఇనుప గోడను ఇలా ఉంచుకోవడం? 
      ‘‘అయినా... నేనుగా ప్రయత్నించాను. మావాళ్ల ద్వారా రాయబారం పంపాను. వాళ్ల ఎదుటే- బక్కెట్టు నీళ్లు కొట్టి ఇల్లు కడిగేసుకున్నారు. మీకు, మాకు బంధాలు తెగిపోయాయి అని చెప్పకనే చెప్పారట మీ అమ్మమ్మా తాతయ్యలు. నా తపనంతా నీ మనుగడ కష్టం అవుతోందనే! ఇంతలోనే అమ్మ అనంత దూరాలకు వెళ్లిపోయింది. నీ మీద బెంగ ఇంకా పెరిగింది. నీకోసం వాకబు చేశా... ఇంటి విషయాలు తెలిశాయి. నిన్ను కలవాలని, నిన్ను కలుపుకోవాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ, కుదర్లే. నా అంతట నేను కలవలేను, పోనీ సయోధ్య కుదిర్చేవారు ఉన్నారా అంటే లేరు. ఇక ఎలా కలవడమో తెలియదు. ఓరోజు అప్రయత్నంగా అంతర్జాలంలో కనిపించావు. అప్పటి నుంచి నిన్ను... అదే నీ ఫొటోను చూడందే నేను నిద్రపోను. చూసిన ప్రతిసారీ నా కళ్లు చెమ్మగిల్లుతాయి. దగ్గర దగ్గర పద్దెనిమిదేళ్లు నిండిపోయాయి. మనం కలుసుకోని కాలమిచ్చిన తీర్పు ఇంత భయంకరమా!! నేను పరాజితుణ్ని. నా జాడ ఇది అని చెప్పుకోలేని పరిస్థితి... అయినా, ఎప్పటికైనా నిన్ను కలవాలనే ఆశ...’’ ఇంతలో ఫెడేల్‌మని పిడుగు శబ్దం... కల కనుమరుగైంది!
      ఇదంతా కలా! కలేనా! కన్నీళ్లు ధారలు కట్టాయి. పక్కమీంచి లేచి టైం చూశా... మూడైంది. మరి నిద్ర పట్టలేదు. ఆ కల నిజమైతే ఎంత బాగుండు! అవుతుందేమో! ఇప్పుడు నాలో భయం తగ్గిపోతోంది. ధైర్యం తిరిగి వస్తోంది. ఒకే ఒక్క కల... ఎంతటి మనోధైర్యాన్ని మోసుకొచ్చింది! ఈలోగా తాతయ్య మంచం దగ్గరకి వచ్చి చూశాను. మేల్కొనే ఉన్నారు.
      ‘‘ఏమ్మా.. నిద్ర పట్టలేదా, భయం వేస్తోందా... రెండు, మూడు వారాల్లో క్యాంపస్‌ ఇంటర్వ్యూలుంటాయి మంచిగా ఎదుర్కోవాలి. గెలవాలి. మధ్యలో ఇలా నిద్రలేవడాలు, మేల్కొని ఉండటాలు వద్దమ్మా!! నిన్నూ నన్నూ చూసేవారు లేరు- నన్ను నువ్వు, నిన్ను నేను చూసుకోవడం తప్ప...’’ ఎందుకో తాతయ్య హెచ్చరిక నాకో పాఠంలా తోచింది. 
      తాతయ్య ఉద్యోగ విరమణ చేసి దాదాపు ఇరవై ఏళ్ల పైమాటే. ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడిగా చేశారు. చాలా నిక్కచ్చి మనిషి. తప్పుచేస్తే చెయ్యి చేసుకోవటంలో ఆడా, మగా తేడా లేదు. అందుకే అందరికీ ఆయనంటే హడల్‌. శిలా హృదయం- ఎప్పుడోకానీ కరగదు. కానీ, అలాంటి రాయి నుంచే అందమైన ఆకృతి సుకృతంగా వెలువడుతుంది. ఆయన ఎదుర్కొన్న పరిస్థితులకు అనుగుణంగానే ఆ కఠిన, అహంభావ ధోరణిని అలవరుచుకొన్నారు. అదే ఆయన బలం, బలహీనత. ఏది ఏమైనా ఇన్నాళ్లుగా ఆయనే నాకు అన్నీను. 
      ఇలా నా ఆలోచనలు సాగుతూ ఉండగానే భళ్లున తెల్లారింది. తాతయ్య నెమ్మదిగా పక్క మీద నుంచి లేచి నన్ను రమ్మని సైగ చేశారు. నా నెత్తిమీద చెయ్యి వేస్తూ... ‘‘ఒరే... నీకు పెళ్లి చేసేసి ఇంక సెలవ్‌ తీసుకుంటానమ్మా!’’ అన్నారు. ‘‘తాతయ్యా... ఇప్పుడే నాకు పెళ్లేంటి? ఉద్యోగం చెయ్యాలి, నా జీతంతో ఓ ఇల్లు కొనాలి. వరండాలో ఊయల్లో ఊగుతూ మీరింకా ఎన్నో పాఠాలు చెబుతుంటే నేను వినాలి. నా చేతి వంట తింటూ నువ్వు సేదతీరాలి. తాతయ్యా, మీరే కాదు... అమ్మమ్మని కూడా ఇలాగే చూసుకోవాలనుకున్నా. హాయిగా మనిద్దరితో కాలం గడుపుతుందనుకున్నా. అమ్మమ్మ వినలే... అమ్మ దగ్గరికి వెళ్లిపోయింది. కనీసం మీరైనా నా కోరిక మన్నించు. ఇంకో కోరిక తాతయ్యా...’’ ఇక గొంతు పెగల్లేదు. రాత్రి కలను గొంతులోనే నొక్కేసుకున్నా. కాలమే దాన్ని నెరవేరుస్తుందని గుండెను దిటవు చేసుకున్నా.
      తాతయ్య రెప్పవాల్చకుండా నన్నే చూస్తున్నారు. నా ఆశ సంగతి అలా ఉంచితే... ఎన్నెన్ని మధుర జ్ఞాపకాలు అమ్మమ్మా తాతయ్యలతో.. అవన్నీ నెమరువేసుకుంటున్నా. కానీ, ఇదంతా గమనించలేని, గ్రహించలేని స్థితిలో అలా నా ఒళ్లో వాలిపోయారు తాతయ్య.
      అలలు విరిగిన చోట ఆనవాలైనా మిగలదు. మనసు చెదిరిన చోటున కన్నీళ్లయినా మిగలవు. ఆ అలలు, ఈ కన్నీళ్లు - నీళ్లే అయినా మన హృదయాల్ని పునీతపరిచే, తేలిక పరిచే శక్తి వాటికుంది.
      కొన్నాళ్లు గడిచాయి బరువుగా...

* * *

      ‘‘సర్‌... లోపలికి రావచ్చా’’ స్ప్రింగ్‌ డోర్‌ని ముందుకు జరుపుతూ అంది సంధ్య. 
      ‘‘రండి’’- లోపలి గొంతు.
      ఎదురుగా కూర్చున్న వ్యక్తిని చూసింది సంధ్య. తన ఎదుట నిల్చున్న అభ్యర్థిని పరిశీలనగా చూస్తున్నాడు అతడు. 
      తను అంతర్జాలంలో రోజూ చూసే ఫొటోనే! కళ్లెదురుగా!!
      సంధ్య తీరం చేరింది.

* * *

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావుbal bharatam