కోడిగుడ్డు పొరటు

  • 587 Views
  • 27Likes
  • Like
  • Article Share

    పేరూరు బాలసుబ్రమణ్యం

  • కొరమేనుగుంట, తిరుపతి.
  • 9849224162
పేరూరు బాలసుబ్రమణ్యం

ఇస్కూలుకు పోయే పిలగాడికి గోళీలాటంటే భలే ఇష్టం. కానీ, వాడి నేస్తంతో ఏనాడూ ఆడి గెలిచిన దాఖలా లేదు. గెలవాలంటే వాడిలా గుడ్డుపొరుటు తినాలనే నమ్మకం బాగా పెరిగిపోయిందా పిలగాడికి.. మరి ఆ తర్వాత...?
నిద్రపడకమింద
నించి లేచి కళ్లు పులుముకుంటా పాసిపొండ్లతోనే ఈదిలోకి పొయ్యినా. నాదమునిగోడు ఉండాడేమోనని చూశా, లేడు. వోడింకా నిద్రలెయ్యనట్టుండాది. వోడేకాదు.. గోలీల గుంతకాడ ఎవురూలేరు.
      మావూళ్లో ఇస్కూలికి తనీగా బిల్డింగు లేదు. రాములోరి గుడిలోనే బడి. గర్భగుడిలో దేముడు, గుడి బయట హాలులో మద్దెల, తాళాలు, గెరడగమ్మ, మా ఇస్కూలి రిజిష్టరు ఉంటాయి. హాలు బయట వరండాలో మా అయ్యోరూ మేమూ. 
      రేణిగుంట నించి మా పొట్టిపొట్టయ్యోరు వచ్చేకొందికే నాదమునిగోణ్ని నిద్రలేపైనా గోలీలకి పిలవాల. ఎట్టయినా వోడిపైన గెలిచి, ఒక్క తడవైనా వోడ్ని ముట్టిలరిగిపోయేట్టు డోకించాల.
      ఎండాకాలం వచ్చినప్పట్నుంచి తెల్లారీ సాయంత్రాలూ వోడితో పోటీపడి ఆడ్నా, ఆడితో డోకించడం కుదర్లా. నాదమునిగోడు కూచ్చోని చూపుడేలుతో గురిచూసి గోలిని కొట్నాడంటే అర్జునుడు బాణం వొదిల్నట్టే. టపీమని మా గోలీని కొట్టి, తోక అని ఒకతడవ- తొంభై అని ఇంకోతడవ- మూడోసారి కొట్టి నూరు అనేస్తాడు.
      వోడికి అంతగురి అంత బలం ఎట్టొచ్చిందంటే కారణం వాళ్లవ్వే. వాళ్లవ్వంటే మాపెద్దమ్మ పేరు సీతమ్మ. ఆయమ్మ వీడికి రోజూ రెండు నాటుకోడి గుడ్లు పొరుటి నంజుకోమని పెడుతుందంట. ఆదివారమైతే ఉడకబెట్టిన గుడ్లు మసాలాకూరి పిరింగా తినిపిస్తుందంట. అందుకే వోడి కాళ్లల్లో ఏళ్లల్లో అంత బలముండాదని నాకూడా గోలీలాడే సుబ్రమణిగోడు, గోవిందు, సిద్దిలుగోడు, ఎంకటరెడ్డిగోడు చెప్పుకుంటుంటారు. అది నిజం గూడా.
      మా సీతమ్మపెద్దమోళ్లది అంగిడిల్లు. ఆమెకి ఒక్కతే కూతురు. అంటే మా అక్క కొడుకే నాదమునిగోడు. వాడంటే మా పెద్దమ్మకి వల్లమాలిన పేమ. దాంతో వోడు సెనారమైన నాటుకోడిగుడ్డు పొరుటు లేందే అన్నం ముద్ద ముట్టడంట.
      ఆమాటే మాయమ్మ చిన్నమ్మతో అంటే ‘‘వోళ్లు ఇచ్చిపెట్టుకున్నోళ్లురా నాయినా! తింటారు. మీనాయిన్ని ఇక్కడ కొరమేనుగుంటలో ఏరే వొండుకోమని సట్టికుండా పంచిచ్చేనాటికి, నేను మీ చెల్లి కళావతిని కని పక్కలో ఏసుకోని ఏర్పేడుకి ఆపక్క అడివి కిందుండే దుగ్గపేరిలో మాయమ్మోలింట్లో ఉండాను. అప్పుడైనా నా ఆడదాన్ని రానీయని ఈ మొగోడు నోరిప్పుంటే ఒట్టు. తిరపతి కొసాన కొరమేనుగుంటలో వుండే మాయత్త ఏడుమంది కొడకల్లో చిన్నోడని ఎంకటేసులని పేరుబెట్టుకున్నాది మీ నాయినకి. ఆ కొండమిందుండే నల్లరాయి మాదిర్తోనే గొమ్మొని నిలబడుకోని మాయత్త, మాబావోళ్లు పంచిచ్చిన రొండు కుంచాల సద్దలు, మూడు దబరాలు, రొండు మూకుళ్లు, ఒక సత్తులోటాయి, ఒక తొర్రికుండ, ఒక మొర్రికుండ ఊరుకి కడానుండే మూడంకణాల గొడ్లకొట్టాంలో తీసిపెట్టుకోని వున్నేడు. ఏంజెయ్యమంటావ్‌ నన్నూ’’ అంటా మాయమ్మ వోళ్ల పాతికేళ్ల వొగిసులో ఏరేబొయ్యిన కతెత్తుకునింది.
      ‘‘మో! నేన్నిన్నడిగింది కోడిగుడ్డు పొరుటుమా. నువ్వు ఏడికేడికో పోతాండావు. ఇట్టజేసి కదమో నువ్వు నన్ను కడుపులో పెట్టుకోనుండగా కూడుకూరగా తినకుండా నన్ను ఇట్టా ఒకిటిన్నర కాలుతో కనింది. ఇపుడైనా మా కడుపు నిండా బువ్వబెట్టి, వారంలో ఒక్కరోజైనా చియ్యలకూరో, కరవాడుకూరో కనాగష్ఠం గుడ్డుపొరుటైనా చేసిపెట్టిచస్తివా!’’ అని పోలియా జబ్బుతో సన్నగా ఎండిపోయుండే నా కుడికాలుని చూపిస్తా నిష్ఠూరకపొయ్యినాను నేను.
      దానికి మాయమ్మ ‘‘వొరే నాయినా! మీ అన్నా అక్కాగూడా ఇట్టా మానందీసి మాకులకు కట్టలేదు కదరా! చివరికి మమ్మల్ని ఈదిలో నిలబెట్టబోయేది మాత్తరం నువ్వేరా’’ అని ఏడస్తా పాటెత్తుకునింది.
ఇంక ఈమితో తెగదని ఇస్కూలుకి రెడీ అవడానికి చెంబుతో నీళ్లెత్తుకోని వంకలోకి పోదామని బయల్దేర్నా.
      మా కసువామిలో ఎనకవార క్కొ..క్కొ..క్కో.. అని అరస్తా కాళ్లతో నేలని గీకతావుండాది కడ ఇంటోళ్ల నల్లకోడి. దాన్ని అదేవాటంతో చూస్తావున్నే. అది కాసేపటికి మా ఎద్దు మూతిపెట్టి పెరక్కతిన్న బొక్కలోకి దూరింది.
      ఈ కడ ఇంటోళ్ల నల్లకోడి మావామిలో ఎందుకట్టా దాక్కునిందో అర్థంగాక ఆలోచనజాస్తా వంకలోకి బొయ్యినా.
      పని ముగించుకోని తిరిగొచ్చేటప్పిటికి మా వామిలో నల్లకోడి కనపడలేదు. ఏమైందో చూద్దామని వామిలోని ఆ బొక్కలో చెయ్యిపెట్టా. అంతే ఒక్కసారిగా పెట్టున గట్టిగా క్కొ..క్కొ..క్కో..క్కో.. అంటా భయపడి ఆ నల్లకోడి ఎగిరిదూకి ఎళ్లిపోయింది.
      బొక్కలోకి ఎందుకు పోయిందా అని చెయ్యిపెట్టి చూద్దునా! పెద్ద గుడ్డు పెట్టుండాది. చుట్టుపక్కల చూసినా ఎవురూ లేరు. ఎగిరిగంతేసి సంతోసంగా గుడ్డు చెయ్యిజారకుండా మెల్లిగా తీసుకోని నిక్కరజోబిలో ఏసుకోని జాగర్తగా ఇంటికొచ్చేసినాను. మాయమ్మ సద్దికూట్లోకి చింతపొండు వూరుబిండి నూరతావుండాది.
      నేను మా అమ్మ దగ్గరికెళ్లి మెల్లిగా ‘‘మో! ఇదిగో నాటుకోడిగుడ్డు అంతపసుప్పొడి అంతమిరప్పొడేసి పొరిటియ్యిమో సద్దికూట్లోకి నంజుకోని తినేస్తా’’ అన్నేను.
      మాయమ్మ నన్ను ఎగాదిగాజూసి ‘‘ఏడిదిరా నీకీగుడ్డు’’ అనడిగింది.
      ‘‘ఎక్కడిదైతే నీకెందుకుమా! అమ్మాపెట్టదు.. అడక్కతిన్నీదు! అన్నట్టుండాది నీ బెదిరింపు’’ అని మాయమ్మదెగ్గిర ముదిగొద్ది మాటలు మాట్లాడ్నా. మాయమ్మ ఏమీజెప్పకుండా గొమ్మోనుండాది.
      మళ్లీ నేనే మాయమ్మతో ‘‘మో! ఇప్పుడు నువ్వు పొరటతావా లేకపోతే నేంబొయ్యి ఈ గుడ్డు మా కమలాపెద్దమ్మ దగ్గిరిచ్చి పొరుటుకోమంటావా’’ అన్నేను. దాంతో మాయమ్మ మళ్లా ఏడుపెత్తుకునింది.
      ‘‘మా జాతి జల్మలో ఇట్టాంటి దొంగపని నేనుగానీ నా మొగుడుగానీ నాఇంట్లో నా పెద్దబిడ్డలిద్దురుగానీ చేసి ఎరుగుదురా? నువ్విట్టా దొంగతనానికి తయారైనావంటే నేను బతికేం లాభం. నేంబొయ్యి మెట్లులేని చేందబాయిలోనో లేకపోతే నీళ్లులేని ఆ మొబ్బోళ్ల బాయిలోనో పడిచావడం ఖాయం’’ అంటా అగిత్తంగా ఏడస్తా లేచిబయల్దేరింది. నాకా ఉచ్చలుతోతుండాయి.
      మాయమ్మ సంగతి నాకు బాగా తెలుసు. అన్నంతపని చేసినా చేస్తందని బయటపడి నేనూ ఏడ్చినంత పనిచేసి ఏం జరగతుందో అది జరగనీ.. అని వామిలో కడ ఇంటోళ్ల నల్లకోడి కతంతా చెప్పేసినా.
      దాంతో మాయమ్మ సంతోసించి కొంగుతో కళ్లలో నీళ్లుతుడుసుకుంటా ‘‘నాయనా నడిపోడా! నువ్వు నామంచి బిడ్డవుగానీ ఈగుడ్డు తీసుకోని సైగ్గాబొయ్యి ఆ కడయింటోళ్ల పందిట్లో తిన్నికిందుండే కోళ్లమూకుట్లో పెట్టేసొచ్చేయరా’’ అనిజెప్పింది.
      నాకా పచ్చిమిరపకాయ కచకచ నమిలినంత కోపమొచ్చింది. మా కసువామిలోకొచ్చి మా జాగాలో పెట్టిన గుడ్డును పెట్టేసిరావడానికి మనసొప్పక మాయమ్మ మాటకాదనలేక తిట్టుకుంటా పొయ్యి ఆమె చెప్పినట్టే చేసినా. ఇంక ఆ పొద్దు నుండి నాటుకోడి గుడ్డుమింద ఆశ చంపుకున్నే.
నాదమునిగోడు మాత్రం మమ్మల్ని గోలీలాటలో వోడగొట్టి వరసబెట్టి డోకిస్తానే ఉండాడు. మేంగూడా పట్టినపట్టు వదలకుండా వోడితో గెలవాలని గెట్టిగా పెరకలాడతానే వుండాం. కానీ నాటుకోడుగుడ్డు నాదమునిగోడు దగ్గర మాపప్పులేం వుడకడం లేదు.
      ఒకరోజు తెల్లార్తోలేసి కళ్లు పులుముకుంటా ఎదురుగా కేలండరులోని ఎంకటేసులు సామికి దణ్ణం పెట్టుకోని ‘‘సామి ఈరోజైనా నాదమునిగోడు నాచేత ఓడిపోవాల సామి నేను నీకొండకొచ్చినప్పుడు ఇంట్లోళ్లకి తెలవకుండా ఐదుపైసలో, పదిపైసలో నీ వుండీలో ఏసేస్తాను సామీ’’ అని మొక్కుకుంటావుండా, అంతలో ఈదిలో గల్లంతుగా అరుసుకుంటావుండారు. ఆ అరుపులు ఎవరివబ్బా అని దుప్పిటి ఇదిలించేసి పరిగెత్తినా కాలు ఎగరేసుకుంటా.
      నడివీధిలో రాములోరి గుడికాడ ఆడోళ్లు, మొగోళ్లు, ముసులోళ్లు, పిలకాయలు కటవలుగట్టుకోనుండారు. కడ ఇంటోళ్ల మొదుటిది సంజీవమ్మ, వీరనాగులాపురం నారక్క జుట్లుపట్టుకున్నేరు. అట్టా బండకూతలు కూసుకుంటావుండారు. కోడిపందేలపుడు చుట్టూరా నిలబడి జాతరజూసినట్టు చూస్తండారేగానీ ఒక్కరైనా వోళ్లిద్దర్ని ఆపుదురా ఆపరే.
      ఆడికి కడింటి మొదుటిది ‘‘నాసవుతుల్లారా! అట్టా నిలబడుకోని ఏడికి జూస్తుండారేగానీ, ఇది అన్నేయం అనీ ఒక్కరైనా అంటుండారా.. మీదూముదగలా’’ అని సాపిచ్చినా, జనం ఒక పిట్టు కదలక మెదలక మమ్మల్నిగాదులే అనేసి ఎపుడెప్పుడు జుట్లుపట్టుకుంటారా అని చూస్తాండారు. కాసేపిటికి వాళ్లిద్దరి బండకూతల్లో రచ్చెందుకొచ్చిందో నాకు మొత్తం అర్థమైపోయింది.
      మా వామిలో నెలకింద గుడ్డుపెట్టిన కడ ఇంటోళ్ల నల్లకోడి మాయమ్మ తరిమేసినాక నారక్కోళ్ల వసారాలో అటకెక్కి రోజుకొక గుడ్డుపెడితే నారక్క సుబ్బరంగా పొరుటుకోని తినేసుండాల. లేదా.. అమ్మేసి ఉండాల. కోడి గుడ్లన్నీ పెట్నాక పొదుగుకొస్తే గుడ్లు పెట్టిందగ్గరకే ఎల్లి చట్టంగా పొదుక్కి కూచుంటంది.
      అమ్మో! మాయమ్మ నామాటిని ఆ రోజు నుంచి నల్లకోడి గుడ్లు తీస్కోని మాకు పొరిటిచ్చి వుంటే... ఇంతగలాటా మాఇంటి ముందకొచ్చేసుండదా అనుకుని, మాయమ్మని మెచ్చుకోని ఆ రచ్చకాడ్నే ఇంటావుండా ఏంజరగతుందా అని.
      కోళ్లకి కత్తులుకట్టి వదిలేస్తే ఎట్నో... అట్టా ఇద్దురూ తగ్గలేదు. మొగోళ్లు మూగోళ్ల మాదిర్తో గొమ్మోనుండారు. 
      అంతలో మావూరి పెద్దమనిసి నాగిరెడ్డి ఆడికొచ్చి ఇద్దర్నీ దబాయించి నోరుమూయించి కోణ్ని మూడుమాట్లు బాయిలో ముంచిలేపి ఊరుగెమినిలో వొదలమన్నేడు. అట్టే చేసినారు. అది నేరుగా నారక్కోళ్ల అటకపైకి పరుగో పరుగు.
      ‘‘అమ్మే! నారక్కా మనుసులు అబద్దం సెపతారేమోగానీ, నోరువాయిలేని కోడి అబద్దం చెప్పదుగా. నీ ముప్ఫైగుడ్లకి యాభైగుడ్ల డబ్బు కడితేకట్టు, లేదంటే.. మనవూరి పద్దతి పెకారం ఇద్దురూ చిన్న చెర్లో మూడు మునకలేసి రండి. రాములోరి గుడికాడ కర్పూరం చేతిలోపెట్టి ఎలిగిస్తా, నేను నల్లకోడిగుడ్లు తియ్యలేదని నువ్వు సత్తెం చేసేయాల. లేదంటే తినిందని కడింటి మొదుటిది సత్తెం చేసేస్తాది’’ అని తీరుపు చెప్పేసినాడు నాగిరెడ్డి.
      కడ ఇంటామి రెడీ అనేసింది. నారక్క మొండికి తిరిగేసింది. ‘అయితే డబ్బుకట్టు’ అని ఊరంతా నిలేసినారు.
      అప్పటిదాకా ఇదంతా నోరుమెదపకుండా చోద్యంజూస్తావున్న నారక్క మొగుడు గబగబా అక్కడికొచ్చి పెళ్లాం జుట్టుపట్టుకోని నాలుగు ఉతుకులు ఉతికేసి ‘‘చే పనికి మాలిందానా! వాగింది చాలు.. నోరుమూస్కోని ఆ డబ్బు కట్టేసిరా. అంతా ఆ దేముడే చూసుకుంటాడు’’ అని డబ్బు చేతిలో పెట్టి మళ్లీ నాలుగు పెరికినాడు.
      ఆ డబ్బులు తీసుకుంటానే ‘నీ చేతులిరిగిపోనూ’ అని సాపిస్తా డబ్బును నాగిరెడ్డి చేతిలో పెట్టేసి, కడ ఇంటోళ్ల కోడిని సాపిస్తా ఇంట్లోకి దూరింది నారక్క.
      నేను ఇదంతా చూసినాక ఇంటికి పరిగెత్తాను. మాయమ్మ నాయనలు ఇంకా నిద్రలెయ్యలేదు. పాపం రాత్రంతా ఎంట్లు పెడతానేవున్నేరు. అందుకే అలిసిపొయ్యి లెయ్యిలే. నేంబొయ్యి మాయమ్మ కాళ్లద్దుకుని బయటికొచ్చేసి నాదుమునిగోడి కోసం ఈదిలోకి పొయ్యినా.
      అక్కడ నాగిరెడ్డి, కాటన్‌మిల్లు కాడ్నించి వచ్చే సాయిబు మాటలాడుకుంటాండారు. నేను చాటుగా దాక్కుని చెవులొగ్గా.
      ‘‘రెడ్డా! నారక్క నాకు నాటుకోడిగుడ్డు ఇచ్చినప్పుడంతా ‘ఎవురికీ చెబ్బాక సాయిబా.. నా కోడిగుడ్లు అమ్ముకున్నే, నాకు రూకలొచ్చేది ఈ ఊళ్లో నా సవుతులకీ వొప్పదు’ అని ఎందుకనిందో నాకు ఇప్పుడు అర్థమవతాండాది. వస్తా రెడ్డా! మీ ఊళ్లో గలాటా నాకెందుకా?’’ అని నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు.
      ఇదంతా ఇన్నాక ‘అమ్మ నారక్కత్తా!’ అని ఆచ్చర్యపోయినా.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావుbal bharatam