అనుభ‌వం

  • 188 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।।సుమ‌న్‌ల‌త‌ రుద్రావ‌ఝుల‌

  • హైదరాబాదు.
  • 9849415728
డా।।సుమ‌న్‌ల‌త‌ రుద్రావ‌ఝుల‌

అదో మాదిరి హోటల్‌... పదకొండు పన్నెండేళ్ల చిన్నా ఓ బల్ల శుభ్రం చేస్తున్నాడు. ఇంతలో అక్కడికో వ్యక్తి వచ్చి కుర్చీలో కూలబడుతూ, ‘‘రేయ్‌... జల్దిపోయి ఓ దోశ, ఓ కప్పు గరం చాయ్‌ తీస్కరా పో!’ అన్నాడు.
      ‘‘సరే సార్‌!’’ అని చిన్నా వెళ్లాడు. కాసేపటికి దోశ ప్లేటు, సాంబారు, పచ్చడి గిన్నెలతో సహా తెచ్చిపెట్టి, మంచినీళ్ల గ్లాసు కూడా ఉంచాడు. ‘‘ఇంకేమైనా కావాల్నా సార్‌?’’ అలవాటుగా అడిగాడు. వద్దన్నట్లు తలూపి, తినటం ప్రారంభించాడు ఆ పెద్దమనిషి. వాలకం చూస్తే తాగినట్టు ఉన్నాడు.       ‘‘సరే సార్‌! మీరు తినేంతలో చాయ్‌ తెస్త! లేకుంటే సల్లగవుతది!’’ అంటూ తన పనిలో పడ్డాడు చిన్నా. 
      అతను తినటం పూర్తిచేసేసరికి వేడి వేడి చాయ్‌ తెచ్చి బల్ల మీద పెట్టాడు చిన్నా. ఎంగిలి పళ్లెం తీసి ట్రేలో వేస్తుండగా, కాస్తంత కప్పులో మిగిలిన సాంబారు బల్ల మీద చిందింది. ఆపైన ఆ వ్యక్తి తాగటానికి చాయ్‌ కప్పు దగ్గరగా లాక్కోవటంలో అతని చేతుల్లో పట్టు లేక అదీ తొణికి, చాయ్‌ కూడా ఒలికింది.
      చిన్నా తుడవబోయాడు. ఇంతలోనే ఆ పెద్దమనిషి చిన్నా చెంప చెళ్లుమనిపించాడు. ‘‘ఏందిరా, గిట్లనేనా తుడిసేది? ఎట్ల గలీజుగుందో సూడు! ఈడ ఎవరు తుడుస్తరు? తుడవనీకి నీ బాబొస్తడు బే?’’ అంటూ గట్టిగా అరిచేశాడు. చుట్టుపక్కల వాళ్లందరూ వీళ్లవైపు తిరిగారు. .
      చిన్నాకు తెలుసు, ఇలాంటప్పుడు తను ఒక్కమాట మాట్లాడినా, పెద్ద రభస అవటమే కాదు, తన కడుపు మీద తనే కొట్టుకున్నట్లవుతుందని! అందుకే, ఆ వ్యక్తి అనవసరంగా తనను కొట్టినా మౌనంగా ఉండిపోయాడు. మరోసారి బల్లను శ్రద్ధగా తుడిచి, సోంపు పళ్లెంలో బిల్లు తెచ్చి, అతని ముందుంచాడు.
      పర్సులోంచి డబ్బు తీస్తున్న ఆ వ్యక్తి చేతులు వణుకుతున్నాయి.
      అది చూసిన చిన్నా అతన్ని ‘‘సార్‌! మీకు పిల్లలున్నరా?’’ అని అడిగాడు మెల్లిగా!
      ‘‘ఆఁ ఉన్నరు!’’
      ‘‘ఆళ్లు సదువుకుంటున్నరా సార్‌?’’
      ‘‘ఆఁ! మంచిగ సదువుతున్రు! అయినా ఏందిరా పెద్ద మొగోని లెక్క ప్రశ్నలు యేస్తా బోతున్నవు? ఆఁ!’’ అంటూ ఎలాగో డబ్బు తీసి పళ్లెంలో పెడుతూ గద్దించాడా వ్యక్తి. 
      ‘‘ఏంలేదు సారూ! నువ్వు నన్ను సెంప దెబ్బ కొట్టి అడిగినవు గదా, మీ బాబొచ్చి తుడుస్తడా? అని! మా నాయన సక్కంగ తుడిసినన్ని దినాలు నేను గూడ మంచిగ స్కూల్కిపోయి సదువుకున్న! ఆయన తాగి తాగి, సచ్చినంక నేను ఈ పని జెయ్యవడితి సార్‌! సిన్న పిల్లగాడినే గాని, ఒక్క మాట జెప్త, జర్ర వినుకోన్రి సార్‌! మీ పిల్లగాళ్లకీ, సదువులు మానుకుని గిట్లా తుడుసుకుంటూ, సెంపదెబ్బలు తినుకుంటూ బతికే అక్కర రానీయొద్దు సారూ! గంతే!’’ అని డబ్బు పళ్లెం తీసుకుని కౌంటరు వైపు అడుగులు వేశాడు చిన్నా!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావుbal bharatam