మనసుంటే మార్గం

  • 448 Views
  • 26Likes
  • Like
  • Article Share

    కోగటం వీరాంజనేయులు

  • కర్నూలు.
  • 8008771080
కోగటం వీరాంజనేయులు

చదివిన చదువుకు తగ్గ కొలువు దొరికితేనే ఉద్యోగం చేస్తాననే వీరా, అమ్మానాన్నల కష్టం మీద నిస్సిగ్గుగా బతికేస్తుంటాడు. అమ్మ కన్నీళ్లు కూడా మార్చలేని అతని ప్రవర్తనను నిగ్గుదీసిన పిల్లల చేతలేంటి? 
‘మహాలక్ష్మి
మార్కెటింగ్‌... సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కావలెను. ఆకర్షణీయమైన జీతం...’ 
      ఊ..హూ... ఇది మనకు నప్పదు. 
      ‘ఎక్స్‌లెంట్‌ ఇంగ్లిషు మీడియం స్కూల్‌... అడ్మినిస్ట్రేషన్‌కు వ్యక్తి కావలెను’ ఇంత బతుకూ బతికీ ఈ బడిలోనా... 
      ‘మల్టీనేషనల్‌ కంపెనీ... ఆకర్షణీయమైన జీతం, టీఏ, డీఏ అదనం.. కాంట్రాక్ట్‌.......’ వద్దు బాబోయ్‌.... ఆ టార్గెట్, ఈ టార్గెట్‌ అంటూ సతాయిస్తారు. నా వల్ల కాదు. 
      అయినా... మనలాంటి ప్రతిభావంతులకు ఏసీ గదిలో పది మందితో పనిచేయించే ఉద్యోగం కావాలిగానీ... ఇలాంటి చెత్త పోస్టులెందుకూ? ఎన్నేళ్లు ఖాళీగా ఉన్నా మంచి ఉద్యోగం వచ్చేదాకా రాజీ పడేది లేదు... రిలయన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గానో, ఇన్ఫోసిస్‌లో అడ్మినిస్ట్రేటర్‌గానో అయితే... ఓకే... 
      ఇలా వీరా కలల్లో తేలిపోతుండగానే ఫోన్‌ గట్టిగా మోగింది. ‘అరె.. కనీసం కలలైనా రిచ్‌గా కననివ్వరా?’ అంటూ ఫోన్‌ అందుకున్నాడు. 
      ‘‘నాయనా వీరా.. నేను అమ్మని...’’ 
      ‘‘ఆ... డబ్బు పంపారా?’’ 
      ‘‘కౌశిక్‌కి ఇప్పుడే ఇచ్చాను. వాడు రాత్రికి వస్తాడంటా. నీకు రేపు పొద్దున్నే ఇస్తాడు’’ 
      ‘‘ఆ సరేలే... నాలుగు రోజుల నుంచి చెబుతున్నా డబ్బు కావాలని... ఇక్కడ చస్తున్నాను. రూం ఓనరు మాటిమాటికీ వెంటపడుతున్నాడు. మెస్‌ బిల్లు కూడా కట్టాలి’’ వీరా కోపంగా అంటుంటే అవతల అమ్మ గొంతు మూగబోయింది. ఈ డబ్బు సర్దడానికి తను పడ్డ కష్టం తలచుకుంది.
      ‘‘ఏమన్నా అంటే మౌనంగా ఉంటావు. మాట్లాడూ...’’ వీరా గట్టిగా అన్నాడు. 
      ‘‘అది కాదు నాయనా...’’ నోరు విప్పేలోగానే మళ్లీ అందుకున్నాడు. ‘‘నాకు  తెలుసమ్మా... ఈ డబ్బుకే అంత కష్టపడ్డాను. ఇంత కష్టపడ్డాను... అంటావు’’ అమ్మ వింటూనే ఉంది. 
      ‘‘ఉద్యోగం సంగతి ఏమైందిరా...’’ అమ్మ గొంతులో మాట ఉండగానే... వీరాలో అసహనం తన్నుకొచ్చేసింది. ‘‘త్వరగా ఉద్యోగం తెచ్చుకోవాలని నాకూ తెలుసు... నాకు తగ్గ ఉద్యోగం దొరకాలి కదా! దొరకగానే అప్పు తెచ్చిన డబ్బు మొత్తం ఇస్తాను’’ అన్నాడు చిరాగ్గా. 
      అంతా విన్నాక... గుండెలోని బాధనంతా గొంతులోకి తెంచుకుని నోరు విప్పింది అమ్మ. ‘‘... మీ నాయనకు బాగాలేదు. పనికి పోలేకున్నాడు. వేసిన పంట... మట్టిలోకే పాయే. చేతిలో చిల్లిగవ్వ లేదు. దినం గడవటమే కష్టంగా ఉంది. ఆస్పత్రిలో చూపించుకుని, మంచి మందుబిళ్ల తిందామన్నా లెక్క లేదు. ఇప్పటికే తెలిసిన వాళ్లందరి దగ్గర అప్పులు చేశాడు. ఇక అడగలేకున్నాడు. మాయమ్మ తీయించిన ఉంగరం ఒకటి నా పెట్టెలో ఉంటే దాన్ని తాకట్టు పెట్టి కౌశిక్‌కి అయిదు వేలిచ్చాను. మీ నాన్నకు తెలీదు. ఈడ పరిస్థితి ఏమీ బాగాలేదు నాయనా.. నువ్వు తొందరగా పనిచూసుకో... ఇంక నా దగ్గర డబ్బుల్లేవు... ఆరోగ్యం జాగ్ర..’’ పేదరికానికి మాట్లాడే హక్కుండదంటూ... ఫోన్‌ కట్‌ అయింది. అమ్మ ఏడుపు ఇంకా వీరా చెవులను తాకుతూనే ఉంది. 
      ‘తొందరగా ఉద్యోగమంటే ఎలా? చదివిన చదువేంటి? మన తెలివితేటలేంటి?’ అనుకుంటూ... చిన్న ఉద్యోగమైనా చేయక తప్పని తన పరిస్థితిని ఫోన్‌లా పక్కన పడేసి లేచాడు వీరా. కుటుంబ బాధలు మనసును తాకుతున్నా... మెదడు వాటిని అంగీకరించడం లేదు. మనసు మాట మెదడు వింటే తప్పులు జరగవు. కాని దురదృష్టవశాత్తు మనసు మీద మెదడు ఎప్పుడూ ఆధిపత్యం చలాయిస్తుంటుంది. 
      నిద్రమత్తు వీడని ఒంటిని, ఆలోచనలు చుట్టుముట్టిన మనసునూ విదుల్చుకున్నాడు వీరా. ‘అయిదు వేలల్లో ఓ వెయ్యి ఓనర్‌ ముఖాన కొట్టి, పదైదొందలు మెస్‌ బిల్లు కట్టాలి. ఉద్యోగ వేటలో పడి సినిమాకు పోక వారం రోజులైంది. రేపు ఆ కొత్త సినిమాకు ఎట్లైనా పోవాలి...’ అంటూ నోట్లో బ్రష్‌ పెట్టుకుని బయటికి నడిచాడు. 
      ఆదివారం కదా! ఇళ్ల గేట్ల ముందు పేపర్‌ చదివేవారు కొందరైతే.. దమ్ము కొట్టే వారు ఇంకొందరు.. కబుర్లు చెప్పుకుంటూ మరికొందరు... వీధి మొత్తాన్ని అలా చూస్తూ... బ్రష్షును టకటకలాడిస్తూ నిలబడ్డాడు వీరా. ‘24’ సినిమాలోలా ఆదివారాన్ని అలా బంధించి ఉంచే ఫ్రీజింగ్‌ వాచ్‌ ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటూ కలల్లోకి వెళ్లాడు. 

* * *

      అయిదుగురు పిల్లలు... పిల్లలంటే పిల్లలు కాదు... పిడుగులు... దూసుకొస్తున్నారు. పాదరసంలా కదులుతున్నారు. వీధిలో ఇంటింటి గేటును పలకరిస్తున్నారు. వారంలోని మజ్జునంతా ఒంట్లో నింపుకుని గేట్ల ముందు తూగుతున్న వారిని కదుపుతున్నారు. వారి చూపులు సూటిగా ఉన్నాయి. వారి చేతులు వేగంగా కదులుతున్నాయి. కళ్లు దేన్నో వెదుకుతున్నాయి. అడుగుతున్నారు. చెబుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ముందుకు వస్తున్నారు. వీరా ముందుకొచ్చాడొక అబ్బాయి. చందానో, మరేదో అడుక్కోవడానికో వచ్చింటుండాని ముఖం చిట్లించాడు. 
      ‘‘సార్, పని ఏమైనా ఉందా?’’ గట్టిగా, సూటిగా అడిగాడు ఆ పిల్లాడు. వాడి  చొరవ, తెగువ వీరాకు గుచ్చుకున్నాయి. ‘నేనింత చదువుకున్నాను. నాకే పని దొరకట్లేదు. వీడికేం పని ఉంటుంది. అయినా వీడేం చేయగలడు?’ వీరా మాట నోరు దాటలేదు.  
      ‘‘చెప్పండి సార్‌.. ఏ పనైనా చేస్తాం’’ పిల్లాడు మళ్లీ అడిగాడు. ‘‘ఇంతకీ ఏం పని చేస్తార్రా?’’ ఒళ్లు విదిలించుకున్న వీరా కాస్త వ్యంగ్యంగా అడిగాడు. 
      ‘‘ఏదైనా సార్‌... ఇళ్లు శుభ్రం చేస్తాం. ట్యాంకుల నుంచి పాత్రల వరకూ అన్నీ కడుగుతాం. ఫ్రిజ్, టీవీ, షోకేస్, అల్మారా తుడుస్తాం. అడ్డమున్న చెట్ల కొమ్మలు తీసేస్తాం. గార్డెన్‌లో మొక్కలకు పాదులు చేస్తాం. మొక్కలు నాటుతాం... సామాన్లు సర్దుతాం....’’ చెప్పుకొంటూ పోతున్నాడు ఆ అబ్బాయి. వీరా మెదడు ఒక్క నిమిషం ఆగిపోయింది. ‘నాకు ఒక్క పనే దొరకట్లేదు. వీడికి ఇన్ని పనులా?’ వీరా ఇలా అనుకుంటుండగానే పక్కింటి వాళ్లను పలకరించడానికి వెళ్లిపోయాడు ఆ కుర్రాడు 
      పక్కింటి భరత్‌ ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. ఆదివారం తప్ప ఏ రోజూ కనిపించడు. భరత్‌ ఆ అబ్బాయిని పిలిచాడు. ‘‘ప్రహరీలో రాలిన చెట్ల ఆకులను శుభ్రంచేసి ట్యాంకు కడిగిపెడతారా?’’ అని అడిగాడు. ‘‘ఊ... ఓకే సార్‌...’’ అంటూ పిల్లాడు వేగంగా కదిలాడు. ఆ చుట్టుపక్కల ఇళ్ల ముందు తిరుగుతున్న మిగతా నలుగురు పిల్లలనూ పిలిచాడు. ‘‘రే.. నువ్వు అటు వైపు... నువ్వు ఇటువైపు...’’ అందరికీ పనులు పురమాయించాడు ‘‘సార్, చీపురులుంటే ఇవ్వండి’’ అనడిగాడు. భరత్‌ తెచ్చివ్వడంతోనే పిల్లలు వేగంగా... శుభ్రంగా.. పని చేసుకుపోతున్నారు. 
      ఇదంతా వీరా గమనిస్తూనే ఉన్నాడు. 
      భరత్‌ వాళ్లతో మాటలు కలిపాడు. 
      ‘‘మీ పేర్లు ఏంట్రా?’’ 
      ‘‘శేషు, కృష్ణ, నివాస్, షఫి, అనిల్‌...’’ శేషు సమాధానం చెబుతూ అక్కడున్న చెత్తను ఎత్తుతున్నాడు. 
      ‘‘ఎక్కడుంటారు?’’ 
      ‘‘ఇక్కడే పక్కన మురికివాడలో...’’ 
      ‘‘చదువుకోవచ్చు కదరా?’’ 
      ‘‘చదువుకుంటున్నాం సార్‌. నేను ఎనిమిది. వాళ్లిద్దరు ఏడు... వీళ్లిద్దరు ఆరు..’’
      ‘‘మరి ఈ పనులేంట్రా?..’’  
      ‘‘డబ్బు కావాలి సార్‌.. మా అమ్మానాన్నల కూలి మూడు పూటల తిండికే సరిపోదు...’’ శేషు చెబుతున్నాడు. 
      గోడ పక్కన నిలబడి చూస్తున్న వీరా కళ్లు, చెవులు పెద్దవి అయ్యాయి. ఇంత వయసొచ్చినా ఇంకా అమ్మానాన్నల కష్టం మీద... కాదు కాదు... కన్నీళ్ల మీద బతుకుతున్నందుకు అంతరాత్మ సిగ్గుపడింది.
      ఇన్ని మాటలు మాట్లాడుతున్నా పిల్లలు ఎక్కడా పని ఆపట్లేదు. ఒకరు చీపురుతో గోడల మీద బూజు దులుపుతున్నారు. నెలరోజులుగా పేరుకుపోయిన చెట్ల ఆకులు ఒకరు ఎత్తుతున్నారు. మరొకరు మొత్తం ఊడ్చి కుప్పవేస్తున్నారు. ఇంకొకరు అదంతా చెత్తకుప్పలో పడేసి వస్తున్నారు.  
      ‘‘రోజూ ఇలా పనులు చేస్తుంటే... ఎప్పుడు చదువుతార్రా?’’ వాళ్లు పని ఆపట్లేదు... భరత్‌ ప్రశ్నలు ఆపలేదు.  
      ‘‘రోజూ కాదు సార్, ఆదివారం మాత్రమే. మిగతా రోజుల్లో బడి ఉంటుంది కదా!’’ అన్నాడు శేషు. 
      అంతలోనే ప్రహరీలో పని పూర్తయింది. ట్యాంకు ఎక్కారు. రెండు బకెట్లు, రెండు జగ్గులు, ఒక స్పాంజి అడిగి తీసుకున్నారు. ఇద్దరు లోపలికి దిగారు. ఇద్దరు బయట ఉన్నారు. లోపల ఉన్న వాళ్లు నీళ్లు ఎత్తిస్తుంటే... బయట ఉన్న వాళ్లు ఒకరికొకరు అందుకుంటూ ప్రహరీ బయటి మురుగు కాలువలో పోసివస్తున్నారు. 
      చకచకా పని పూర్తిచేశారు. 
      ‘‘ఎంతివ్వాలిరా...?’’ భరత్‌ వాళ్ల పనిని మెచ్చుకుంటున్నట్టు అన్నాడు. 
      ‘‘మీ ఇష్టం సార్, మా కష్టం చూడండి... మీ సమయం చూడండి... ఇవ్వండి...’’ అన్నాడు శేషు వినయంగా. 
      భరత్‌ రూ.200 ఇచ్చాడు. శేషు తీసుకున్నాడు. మిగతా వారివైపు చూశాడు. అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి. 
      ‘‘ప్రతీ ఆదివారం వచ్చి నేను ఉన్నా లేకపోయినా ఇక్కడ ప్రహరీ శుభ్రం చేసి వెళ్తారా?’’ భరత్‌ అడిగాడు. అందరూ సంతోషంగా ఊ.... అంటూ తలూపారు. 
      ‘‘ఈ డబ్బుతో ఏం చేస్తార్రా?’’ ఆగలేక అడిగేశాడు భరత్‌. 
      ‘‘నాకు నోట్సులు కావాలండీ. టీచర్‌ సోషల్‌కు, సైన్సుకు ఒకే బుక్కు ఏంటని కొట్టింది. సోమవారం వేర్వేరుగా చూపిస్తానని చెప్పాను. కృష్ణ చెప్పులు తీసుకుంటాడు. మొన్న కాల్లో ముల్లు గుచ్చుకుని బాగా ఏడ్చాడులేండి. మూడు రోజులు నడవలేకపోయాడు. షఫిగాడు వాళ్ల చెల్లికి కారుబొమ్మ కొంటాడు. దానికి కారంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అడుగుతుంటుంది. వాళ్ల అమ్మ ఏమో తర్వాత కొనిస్తా అంటుంటుంది. ఈ వారం దానికి కారు వచ్చినట్టే. అనిల్‌ వాళ్ల అమ్మకి బాగా లేదు సార్‌. వాళ్ల నాన్నలేడు. మందులు తీసుకెళ్లాలి. అందరికీ చాలా పనులున్నాయి సార్‌. డబ్బు మిగిలితే సాయంత్రం పానీ పూరి తింటాం..’’ అంతకు ముందు వచ్చిన డబ్బును, ఈ డబ్బునూ లెక్కలు వేస్తూ చెబుతున్నాడు శేషు. 
      ‘‘ఇన్నింటికి ఈ డబ్బు సరిపోతుందా?’’ ఆశ్చర్యంగా భరత్‌ ప్రశ్న. 
      ‘‘ఇంకా చాలా ఇళ్లు ఉన్నాయి కదండీ..’’ అంటూ అందరూ బయటికి కదిలారు. 

* * *

      శేషు మాటలు వీరా గుండెల్లోకి ఈటెల్లా దిగాయి. మెదడులో ఆలోచనలై పొడుచుకున్నాయి. వీళ్ల ఖర్చులకే కాక... తమ్ముళ్లు, చెల్లెళ్ల కోసమూ సంపాదిస్తున్నారా?... ప్రశ్నలు మనసును కత్తుల్లా పొడుస్తున్నాయి. అంతరాత్మ బయటకొచ్చి గతాన్ని తోడుతోంది. ప్రశ్నిస్తోంది. కష్టపడి పనిచేసి అవసరాలు తీర్చుకుంటున్న పిల్లలతో ఇంత వయసు వచ్చినా ఇంకా అమ్మానాన్నల నుంచి డబ్బు తెప్పించుకుంటున్న వీరాను పోల్చి నిలదీస్తోంది. 
      ‘మీ నాన్నది వ్యవసాయం, అమ్మేమో నాన్నకు సాయం. పొలం పండితే తినాలి. లేకపోతే లేదు. మూడేళ్లుగా కరవు. ఊర్లో కన్నీటి చుక్కలు తప్ప... వాన చుక్క రాల్లేదు. నీ చదువుకే బోలెడు అప్పులు చేశారు. ఇప్పటికీ నీ ఖర్చులకు డబ్బులు పంపుతున్నారు. ఇక్కడ నువ్వేమో ఖాళీగా తిరుగుతున్నావు. కురవక కురవక మొన్న కాస్త వాన కురిస్తే, మీ నాన్నకు సత్తువ లేక పంట వేయలేదు. అమ్మ ఫోన్‌ చేసి- నాయనా! మీనాన్నకు ఒంట్లో బాగోలేదు. వచ్చి విత్తనం వేసిందాక ఉండిపోరా... పనోళ్లతో బాగా ఇబ్బందిగా ఉంది. నువ్వుంటే కొండంత ధైర్యంగా ఉంటుంది- అని నోరు తెరిచి అడిగితే, వెళ్లలేదు. ఇంత చదువుకుంది మట్టిపనులు చేయడానికా? అని అమ్మను గదమాయించి ఫోన్‌ పెట్టేశావు. ఆ పిల్లల్ని చూడూ! చదువుకుంటూనే ఉన్నారు.. అయినా అమ్మానాన్నలకు భారం కాకూడదని పని చేస్తున్నారు. పెద్దవాళ్లకు అంతోఇంతో సాయపడుతున్నారు కూడా. నువ్వేం చేస్తున్నావు? ఒంటిమీదికి ముప్ఫయ్యేళ్లు వచ్చినా ఇంకా తల్లిదండ్రుల కష్టం మీదే బతుకుతున్నావు. ఆ పని నాకు సరిపోదు. దీన్ని నేను చేయలేను. నా చదువు ఇందుకేనా? అనుకుంటూ బతికేస్తున్నావు... నీకు సిగ్గులేదు. అసలు నీకు పని చేయాలని లేదు. ఉంటే... ఏదో ఒకటి చేసేవాడివి... మీ అమ్మానాన్నలకు ఇబ్బంది కలుగకుండా చేసేవాడివి. పని ఎక్కడా దొరకదు. వెదుక్కోవాలి. వెదికి పట్టుకోవాలి. పనిచేయాలి. యజమానిని మెప్పించాలి. ఉద్యోగంలోనే కాదు, జీవితంలోనూ అప్పుడే ఉన్నతి. లేకపోతే ఇలాగే ఉండిపోతావు. అబ్దుల్‌ కలాం హఠాత్తుగా శాస్త్రవేత్త అయిపోలేదు. మొదట్లో పేపర్‌ బాయ్‌గా పనిచేశారు. నా తెలివితేటలకు ఈ పని ఎందుకు చేయాలి? అని అనుకుని ఉంటే అసలు ఆయన బడికి వెళ్లగలిగేవారే కాదు...’ అంతరాత్మ నిలదీస్తుంటే వీరాకు ముఖంలో కత్తివేటుకు నెత్తురుచుక్క లేకుండా పోతోంది. 
      పిల్లలు ప్రహరీ, ట్యాంకే కాదు... వీరా మెదడుకు పట్టిన సోమరితనాన్నీ, నిర్లక్ష్యాన్నీ శుభ్రం చేశారు. ఇప్పుడు అతని మెదడు మీద మనసు పైచేయి సాధించింది. వెంటనే స్నానం చేసి, గదిలో కొక్కికి తగిలించిన ప్యాంటు, చొక్కా వేసుకుని బయటికి బయలుదేరాడు. 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావుbal bharatam