సమాధి స్థ‌ల‌ము (క‌థాపారిజాతం)

  • 242 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పొట్లప‌ల్లి రామారావు

పొట్లప‌ల్లి రామారావు

అనాదిగా ధనిక దరిద్ర బేధాలు ప్రపంచాన్ని పాలిస్తూనే ఉన్నాయి. సమాధుల మధ్య మానవత్వాన్ని వెతుక్కునే పని సశేషమే. ఆ సమాధుల్లోని ‘మహాపురుషులను’ మేల్కొలిపి, దురాగతాలను ప్రశ్నించే అనంత ప్రయత్నాలకు ముగింపు...?
ధనికులు
బ్రతికి ఉన్నప్పుడే దరిద్రుల బాధిస్తారనుకునేవాణ్ణి. కాని చచ్చిన తరవాతగూడ దరిద్రుల వెన్నాడుతారని నాకు సమాధి ఆవరణలో కాలుపెట్టిన వెనుక తెలిసింది. అసలు నేను సమాధి ఆవరణలో ఎన్నడు కాలుపెట్టలేదు. అదేమిటో! నాకు సమాధిస్థలాన్ని చూడటంతోనె సుఖస్వప్నాల మీద దినాలు పుచ్చే మనిషి అంతిమదశను గూర్చి జాలిపుట్టేది. మనిషి చావును మరచిన చావు మనిషిని మరువదు కదా!
      మా ఊరు ఓ పెద్ద పట్టణము కాబట్టి ఏ మూలనో ఒక మూల, ఎవరో ఒకరు చస్తూ ఉండేవారు. యిక ఆ చచ్చినవాళ్లు ధనికులైతే, జనప్రవాహానికి అంతు ఉండకపొయ్యేది. ఆ చచ్చిన అతను వాళ్ళకేదో, దానశాసనము రాసి విడిచిపోయినట్టు, అతని యింటిచుట్టూ మూగుకునేవారు.
      సమాధి స్థలము వరకు ఆ చచ్చిన అతను వెనుక నడచి చాలమంది తమ దుఃఖాన్ని, సానుభూతిని కనబరచేవారు. పాపము! ఆ చచ్చిన అతను యింకా ఎక్కడో పొంచి చూస్తున్నట్టు వాళ్ళంత ఎంతో భయభక్తులతో ప్రవర్తించేది. పూలమాలికలు పైన కప్పేది. ఆయన బ్రతికి ఉండగా రెండు చేతులతో ధనము పంచినట్టు, వాళ్ళంత గుడ్డిగా డబ్బు వెదజల్లేది. బ్రతికి ఉన్నప్పుడు చూపించని వదాన్యత, సౌహార్దత, అతను చచ్చి, శాశ్వతముగా నిద్రించపోతున్నప్పుడు చూపించేది. కాని ఆ ఊళ్లో బీదలుగూడ చచ్చేవాళ్లు. అయిన బీదలు ఈ ప్రపంచములోకి ఎప్పుడు కాలుపెట్టింది, ఎప్పుడు నిష్క్రమించింది, ఎవడికి తెలియకపొయ్యేది.
      ఒకరోజు పెద్ద చిత్రశాలముందు నిలవబడి అక్కడి చిత్రాలను ఒక్కొటొక్కటిగా చూస్తున్నాను. ఆ చిత్రశాలనిండా విశ్వవిఖ్యాత మహాపురుషుల చిత్రాలున్నాయి. ఎవళ్ల ఘనతకు తగినట్టుగా వాళ్లు ఆ చిత్రాల్లో కనుపించారు. అవన్ని చూచివెనుక అనుకున్నాను ప్రపంచమంతాయింతేనా? యింకెవరులేరా ప్రపంచములో గొప్పవాళ్లు? అసలు ఈ ప్రపంచానికి గొప్పతనాన్ని, గుర్తించే సహృదయత, దూరదృష్టి ఉన్నదా అని. తెల్ల, నల్ల, అంతరవులతో, ధనిక, దరిద్ర, భేదాలతో, ఆత్మను చంపుకున్న యీ ప్రపంచమేనా గొప్పతనాన్ని గుర్తించి శ్లాఘించేది? ఈర్ష్యా, ద్వేషాలనుండి, సంకుచిత స్వాభిమానాలనుండి విముక్తి అయిననాడు కదా! గొప్పతనాన్ని గుర్తించేహక్కు ప్రపంచానికి కలిగేది. పై మాటలతో నా హృదయం నిండి నేను ఓ గొప్పవాణ్ణనే భావం నాలో ఏర్పడిపోయింది. నా దారిద్రం, సంఘంలో నాకున్న అల్పమాత్రస్వరూపం, మరచిపోయినానాక్షణాన. యింటివైపు రెండు అడుగులు వేశాను గర్వంగా. అంతే! యిక కదలలేదు. పది అడుగుల దూరం నుండి నాకభిముఖంగా ఓ స్త్రీ రావడం చూచాను. ఆమె చేతుల్లో మృత శిశువు చుట్టబడి ఉంది. ఆమె చెక్కిళ్ళపై నుండి సంతతధారగా కన్నీరు ప్రవహిస్తూ ఉంది. ఆమె వెనుక బంధువులు, మిత్రులు ఎవరులేరు. తనచుట్టూ యింత లోకమున్న, ఒంటరిగా పోతూ ఉంది. ఈ విశాల మానవ ప్రపంచములో ఆమెకు ‘నా’ అనేవారు ఒకరు లేరు. అయితే ఈ మనుషులంతా ఎవరు? ఆమెకు ఏమీకారా! ఏమి నేను? సిగ్గేసింది నాకు. ప్రపంచాన్ని విమర్శించే ఆత్రుత ఎక్కువ కాని, మనుషులకు తనును తాము విమర్శించుకొని తలవంచుకొని పోవడంచేత కాదు. పశ్చాత్తాపంగా ఆమె వెనక నడిచిపోయాను. ఆమె ఎక్కడో! దుఃఖపు వెల్లువలో కొట్టుకపోతు ఉంది. ఏమి! కొంచెము ఆ దుఃఖ హృదయాన్ని లాలిస్తే, ఏమి మునిగింది, మెల్లగా ఆమె దగ్గరకు పోయాను.
      ‘‘ఎవరమ్మా... ... మీ అబ్బాయేనా?’’
      ‘‘ఎవరైతె ఏముందినాయనా’’
      ‘‘ఏమైంది అసలు?’’
      ‘‘పాలు లేవు’’
      ‘‘పాలు లేవు?’’
      ‘‘అవును’’
      ‘‘తల్లివి కదు?’’
      ‘‘అయితే ఏమి చేయమంటావు?’’
      ‘‘తల్లులంతా ఏమి చేస్తారు?’’
      ‘‘నాలాటి తల్లులంతా ఏమి చేస్తారో, నేను అదే చేసాను.’’
      ‘‘అంటే?’’
      ‘‘పాలిచ్చాను’’
      ‘‘ఎవడికి?’’
      ‘‘రాక్షసుడికి’’
      ‘‘ఎవడు నీకొడుకేనా?’’
      ‘‘నా కొడుకు దేవత’’
      ‘‘మరి రాక్షసుడెవడు?’’
      ‘‘నాపాలు తాగినవాడు’’
      ‘‘ఎవరమ్మా ఆ రాక్షసుడు?’’
      ‘‘ఓ శ్రీమంతుని కొడుకు’’
      ‘‘ఏమి అతనికెందుకిచ్చావు?’’
      ‘‘యివ్వకుంటే వీడితోపాటు... ... నేను’’.
      ‘‘అవును నీవు పోయేదానివే. అయిన శ్రీమంతుల కాళ్ళకింద నలిగి ఎంతమంది నిత్యం ఈ ప్రపంచాన్ని వీడిపోవటం లేదు. ప్రపంచము విశాలమైందేకాని, మానవ హృదయము సంకుచితం కాబట్టి ఈ విశాలవిశ్వముగూడ సంకుచితమైపోతు ఉంది. సమతాదృష్టి నశించిన ఈ సంకుచిత ప్రపంచములో బలహీనులు అణగిపోతున్నారు. అయిన బలహీనులు అణగిపోతె ఎవడికేమి?


పొట్లపల్లి రామారావు (1917-2001)
పొట్లపల్లి రామారావు స్వాతంత్య్ర సమరయోధులు, రచయిత, తత్త్వవేత్త. వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజీలకు సమకాలికులు. నిరంతర అధ్యయనపరుడు. తెలంగాణ తొలితరం కథకుల్లో ఒకరైన ఈయన రచనలనేకం వెలుగులోకి రాలేదు. పొట్లపల్లి కథలను తరచిచూస్తే ఆనాటి తెలంగాణ జీవితాలు దర్శనమిస్తాయి. మంచీచెడుల మధ్య, ధనిక పేదల మధ్య వ్యత్యాసాలను చిత్రిస్తూ, సమసమాజాన్ని కాంక్షిస్తూ అక్షరయజ్ఞం చేసిన వ్యక్తి పొట్లపల్లి. మధ్యతరగతి ఆలోచనా ధోరణిని ప్రతిబింబించే రచనలనూ చేశారు.   
రామారావు స్వగ్రామం నాటి వరంగల్లు జిల్లాలోని తాటికాయల. ఈయన రచనల్లో ‘జైలు’ కథాసంకలనం ప్రసిద్ధమైంది. తెలంగాణ పోరాట కాలంలో కారాగరంలో ఉన్నప్పుడు రాసిన కథలివి. ‘అక్షరదీప్తి’, ‘చుక్కలు’, ‘మెరుపులు’ కవితా సంకలనాలు, ‘ఆత్మవేదన’ గేయాలు, ‘మా వూరు’ గల్పికలూ, నిజాం వ్యతిరేక జాతీయోద్యమ కాలంలో నాటికలూ రచించారు. ‘పొట్లపల్లి రామారావు జీవితం - సాహిత్యం’ పేరిట భూపాల్‌ వెలువరించిన పరిశోధన గ్రంథం ఆయన సాహిత్య కృషికి దర్పణంపడుతుంది.


      ఆమె తన సోద చెప్పుతుపోయింది. నేను వింటు, విన్నదాన్ని గూర్చి ఆలోచిస్తుపోయాను. మాట, మాటల్లోనే సమాధి ఆవరణ చేరుకున్నాము. గేటుముందు కాపలామనిషి కునికిపాట్లు పడుతున్నాడు. మా రాకడ చూచి అతను కొంచము కూడ కదలలేదు. నిర్లక్ష్యభావంగా కూర్చున్నాడు. మా ముఖాలు, వేషాలు చూచి ఎవళ్లో అనామకులు, అని అప్పటికప్పుడే గుర్తించాడు. ‘‘శవాలు మోసుకరావడం తప్ప వేరే పనిలేనట్టుగా ఉండే’’ అని గొణగుతు మా వెనుక నడచి వచ్చాడు ఆ కాపలా మనిషి. మేము అతని రాక చూచి అప్పుడప్పుడే సున్నముతో దిద్దిన ఓ గోరి ప్రక్కన నిలవబడి పోయినాము. దూర, దూరం వరకు అలాంటివే చక్కని సమాధులు బారులు తీరి ఉన్నాయి. కాపలా మనిషి వచ్చి ‘‘పదండి’’ అన్నాడు. ఆ సమాధుల మధ్య నిలవటానికి మాకు అర్హత లేనట్టు. కాపలా మనిషిని అనేది ఏముంది! బీదలు ఎవరికి లోకువ కారు? తలవంచుకొని నడిచి పోయినాము. ఆ తెల్లని సమాధివరసలు అయిపోయినాయి. ఆకు, అలము, ప్రత్యక్షమైంది. ఆ ఆకు, అలము మధ్య స్మృతి చిహ్నము కూడ లేని సమాధులు కనిపించాయి. అవన్ని భూమిలోకి కృంగిపోయి ఉన్నాయి. వాళ్లు బ్రతికి ఉన్నప్పుడు అణగి ఉన్నవాళ్లే కాబట్టి, చచ్చిన తరవాత వాళ్ల సమాధులు కూడా అట్లాగే నిర్మింపబడ్డాయి. కాపలా మనిషి ఓ గునపము యిచ్చి వెళ్ళిపోయాడు. ఎక్కడ త్రవ్వను? ఎక్కడ ఏ అనామకుడు నిద్రిస్తున్నాడో? ఎవడి నిద్ర భంగపరుస్తుందో ఈ గునపపు పోటు? ప్రపంచ భారము మోసి విశ్రాంతి తీసుకుంటు ఉన్న ఆ కష్టజీవుల మళ్ళి ఏ ముఖముతో నిద్రలేపడము? రాత్రి పగలుగా మార్చుకొని యిదివరకు శ్రమించింది చాలదు? అయిన ఈ త్యాగిని ఎక్కడ పడుకోపెట్టడము? సరే కానివ్వు’ అంటు ఓ దిక్కు త్రవ్వాను. శుష్కించిన ఎముకలు బైటబడ్డాయి. ‘అవును! అయింది. ఏ యిల్లాలు దుఃఖచిహ్నమో యిది? ఏ పతితుని ఆశాజ్యోతో! తీరిక ఉన్నప్పుడు ఎప్పుడో, కన్నీటితో ఈ స్మృతి చిహ్నాన్ని తడిపిపోతాయి గావున గునపముతో ఎముకలన్ని పెకిలిస్తే ఆ నిరాశజీవి గుండెలు చీలిపోవు?. అంత విశాలంగా ఉన్నాయే ఆ సమాధులు? వాటిప్రక్కన ఎక్కడైన పెట్టగూడదు? మెల్లగా అసమాధుల దగ్గరికి నడిచి పోయాను. పాలరాతితో కట్టబడి ఉంది. ఓ ధనికుని గోరి. తాను ఆక్రమించిన స్థలము చాలక చుట్టు యినుప గొలుసులతో ఆవరణ పెట్టుకున్నాడు. ఆ పెత్తనదారు ఆ హద్దులోకి ఎవడికి రా వీలులేనట్టు, ‘బ్రతికి ఉండగా మీరు చేసిన పని యిదే’ అని నిట్టూర్పు తీసి ఇంకొక సమాధి ప్రక్కకు నడిచిపోయాను. అదో మత గురువుది పాపం! ఆయన తన సమాధి చుట్టు పూలతీగల పెంచుకున్నాడు. బతికిఉండగా మనుషులకన్న పూలతీగనే ప్రేమించినట్టు, యింకా ముందుకుపోయాను. ఓ మేజరు నిద్రపోతున్నాడు. తాను యుద్ధాలు చేసి ఆక్రమించుకున్న భూభాగాల్లాగానె, ఆ ఆవరణమధ్య విశాల భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ సమాధిచుట్టు బలమైన రాతిగోడ పెట్టబడిఉంది. యింకా ఎవరో శత్రువులు మిగిలిఉన్నట్టు యింకా ముందుకుపోయినాను. ఆ అందమైన ఆ సమాధులన్ని కలియతిరిగాను. స్థలముంది కాని అదంతా అధికారులక్రింద, ఆక్రమింపబడి ఉంది. ఎక్కడ పడితే ఎవరి అధికారము అడ్డు తగులుతుందో! ఎవరికోపితులైతారో? చచ్చినవాళ్లమీద యింకా బ్రతికి ఉన్నవాళ్ల అధికారం ఉంది. చచ్చినవాళ్లందరు సమానులైన బ్రతికిఉన్నవాళ్లు ఒప్పుకోవద్దు. తలవంచుకొని ఆమె వద్దికి నడిచిపోయాను. ఆమె నిరాశగా నేను మరలిరావడం చూచింది. ఏమి మాట్లాడలేదు. చంటివాణ్ణి ఎత్తుకొని బయలుదేరింది. ‘ఎక్కడికి?’ అన్న ‘ఎక్కడికైన పోదాము’’ అంది. ‘‘సరే’’ అని ఆమె వెనుక బయలుదేరాను. మృతశిశువును మళ్ళీ తీసుకుపోతూ ఉంటే, తన యినాము డబ్బులు పోయినాయనే కోపంలో మామీదికీ లేచాడు కాపలామనిషి.
      ‘‘బయట ఎక్కడ పెడుతారు శాసన విరుద్ధం. జాగ్రత్త’’ అన్నాడు.
      ‘‘అవును! యిష్టము వచ్చినంత స్థలము ఆక్రమించుకోవడం శాసన విరుద్ధం కాదు, కాని యిష్టము వచ్చిన దిక్కు శవాన్ని పూడ్వడం శాసనవిరుద్ధం కదు?’’ అన్న.
      ‘‘అనుభవిస్తారు పోండి’’
      ‘‘యిప్పుడు అనుభవించే దానికన్న ఎక్కువనా’’. కాపలా మనిషి మాట్లాడలేదు. మేము ఆ చీకట్లో నడచిపోయాము. పట్టణము వెనుకడిపోయింది. దూర, దూరం, వరకు మనిషి అలికిడి కూడ లేదు. అంతా నిర్జన ప్రదేశం. పంచభూతాలు తప్ప యింకెవరు చూడటం లేదు. ధనికుల అధికారం, రాజసం, దరిద్రుల అసహాయత, న్యూనత, యివి, ఏవిలేని ఆ నిర్జన ప్రదేశంలో ఆ బాలుణ్ణి భూదేవి ఒడిలో వేసి ఓ పెద్ద నిట్టూర్పు తీశాము.

* * *

సౌజన్యం: పొట్లపల్లి గోపాలరావు 
(రామారావు గారి కుమారుడు)

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావుbal bharatam