వరుడు

  • 578 Views
  • 5Likes
  • Like
  • Article Share

    ఇందూ రమణ

  • సింహాచలం, విశాఖపట్టణం జిల్లా
  • 9951171696
ఇందూ రమణ

తల్లి లేని పిల్లలను కళ్లలో పెట్టుకుని సాకుతాడు ఆంజనేయులు... వాళ్లు పెద్దయ్యాక అమెరికా ఉద్యోగాలని భార్యలతో ఎగిరిపోతారు. నాయనమ్మను వృద్ధాశ్రమంలో పడేసి తండ్రిని వాళ్ల దగ్గరకు వచ్చేయమంటారు విష సంస్కృతి తలకెక్కిన కొడుకులకు ఆ తండ్రి సమాధానమెలా ఇచ్చాడు...?
పెళ్లి చూపులు.

      బోర్డు చూసి తను వెదుక్కుంటూ వచ్చిన చిరునామా ఇదేనని ఆటో అబ్బాయికి చెప్పాడతను. నెమ్మదిగా ఆటో దిగాడు.
      అరవై ఆరేళ్లకు పైబడి ఉంటుంది ఆయన వయసు. కానీ అలా కనిపించడు. ఆరడుగుల ఎత్తు. దానికి తగ్గ లావు. దృఢంగా ఉన్న శరీరం. నిటారుగా బోర విరుచుకుని నిలబడ్డ విగ్రహం. ఎవరైనా చూస్తే పెద్ద పోలీసు ఆఫీసరు అనుకుంటారు. కానీ, కాదు. ప్రభుత్వ సంస్థలో పెద్ద హోదాలో ఉద్యోగం చేసి ఆరేళ్ల క్రితం పదవీ విరమణ చేశాడు.
      అతను నెమ్మదిగా ఆ భవనంలో ప్రవేశించాడు. అప్పటికే అక్కడ పదిమందికిపైనే పిల్లల తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. హాలంతా శీతలీకరణ చేసినట్టుంది. హాల్లో అడుగు పెట్టగానే ఒళ్లంతా చల్లబడి పోయింది. లోపల అద్దాల గదిలో నుంచి బయట హాల్లో కూర్చున్న తనని ఆశ్చర్యంగా చూసి నవ్వుతూ పలకరించాడు పెళ్లిళ్ల పేరయ్య రామకృష్ణ.
      అతను గుంభనంగా చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
      లోపలినుంచి అతనే గబాలున బయటికొచ్చి ఆయన దగ్గరికి వెళ్లాడు. ‘‘సార్‌! అప్పుడే మీ మనుమలు పెళ్లికి ఎదిగిపోయారా?’’ ఆశ్చర్యంగా అంటూ ఆయనతో కరచాలనం చేసి తన గదిలోకి తీసుకెళ్లాడు. 
      ‘‘సార్‌! మిమ్మల్ని కలిసి చాన్నాళ్లయింది. మీ మేలు మర్చిపోలేను. ఆ రోజుల్లో మీ ఇద్దరబ్బాయిలకు సంబంధాలు చూసి పది మందిలో పేరు, పలుకుబడి సంపాదించబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. సొంత భవనంలో కార్పొరేట్‌ ఆఫీసు స్థాయిలో ‘పెళ్లిళ్ల వేదిక’ని నడుపుతున్నానంటే అదంతా మీ చలవ.’’ గుక్కతిప్పుకోకుండా అన్నాడు పెళ్లిళ్ల పేరయ్య.
      ‘పునాది మరువని వాడు పైకొస్తాడు. పునాదే లేనివాడు పుట్టగతులే లేకుండా పోతాడు. ఇతను బతక నేర్చినవాడు’ మనసులోనే అనుకున్నాడతను.
      ‘‘నీతో పనిపడి వచ్చాను’’ 
      ‘‘అదెంత మాట. చెప్పండి సార్‌! నేనేం చేయాలో?’’
      ‘‘ఓ మంచి అమ్మాయిని చూసిపెట్టు’’
      ‘‘సా... ర్‌...? మీకు పెళ్లికెదిగిన మనుమలున్నారా? లేదా ఇంకెవరికైనా..’’ 
      ‘‘లేదు. నా కోసమే!’’ స్థిరంగా అన్నాడతను.
      పెళ్లిళ్ల పేరయ్య అదిరి పడ్డాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎదురుగా ఉన్నది చిన్నమనిషి కాదు. పదిహేనేళ్లక్రితం పరిచయమై తనకింత పేరు ప్రఖ్యాతులు రావడానికి కారకుడు. అతనితో తనకు చాలా ఏళ్ల పరిచయం. ‘కానీ, సార్‌ కోరింది... అదీ... ఈ వయసులో...’ పెళ్లిళ్ల పేరయ్యకి బుర్ర గిరగిరా తిరిగిపోయింది.
      ‘‘సార్‌..! మీరు చెప్తున్నది అర్థం కాలేదు’’, అయోమయంగా అన్నాడు.
      ‘‘సూటిగానే చెప్తున్నాను. నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అరవై ఆరేళ్ల నన్ను, ఎనభై ఆరేళ్ల మా అమ్మని కంటికి రెప్పలా చూసుకునే పెళ్లికూతురు కావాలి.’’
      ఆ మాటలు వింటూనే అచేతనంగా ఉండిపోయాడు నిర్వాహకుడు రామకృష్ణ.
      ‘‘త్వరగా చూడు. ఇదిగో ఈ అడ్వాన్స్‌ ఉంచు. ఇది నా సెల్‌నంబర్‌’’ అంటూ కుర్చీలోంచి లేచి, మారు మాట్లాడకుండా వెనుదిరిగాడాయన. తన సమాధానం వినకుండానే వెళ్లిపోతున్న ఆయనకి ఏం చెప్పాలో అర్థంకాక తల పట్టుకున్నాడు రామకృష్ణ. ‘ఈయనకి ఏమైందబ్బా?’ అనుకున్నాడు మనసులోనే.

 

*  *  *

      ఆయన పేరు ఆంజనేయులు. కేంద్ర ప్రభుత్వోద్యోగిగా పనిచేసి ఆరేళ్లక్రితమే రిటైరయ్యాడు. ఇద్దరు కొడుకులు విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.
ఆంజనేయులు భార్య హఠాత్తుగా ఓ ప్రమాదంలో చనిపోయింది. అప్పటికి  పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. ఇంకా పాఠశాల చదువుల్లోనే ఉన్నారు. ఆంజనేయులు తల్లి.. ‘‘పిల్లలు చిన్నవాళ్లు. నాకేమో వయసు మీదపడుతోంది. నాకేదన్నా అయితే వీళ్లనెవరు చూస్తారు. మళ్లీ పెళ్లి చేసుకోరా’’ అని ఎంతగానో బతిమాలుకొంది. 
      అయినా ఆంజనేయులు వినలేదు. సరికదా తల్లిని కోప్పడ్డాడు.
      ‘‘పిల్లలు చూస్తే నోరులేనివాళ్లు. అదెవర్తో వచ్చి గొడవచేసి నన్ను తనతో రమ్మంటే ఈ పిల్లల గతి, నీ గతి ఏమవుతుందో ఆలోచించవా?’’ అంటూ తల్లినే తప్పుపట్టి పాతికేళ్ల క్రితమే ససేమిరా పెళ్లి చేసుకోనన్నాడు. కొడుకు మాటకి ఎదురు చెప్పలేకపోయింది ఆమె. కొడుకుని, మనుమళ్లని కళ్లలో పెట్టుకొని సాకింది.
      ఇద్దరు కొడుకులకు మంచి సంబంధాలు చూసి తల్లీకొడుకులు ఎంతో ఘనంగా పెళ్లి చేశారు. అప్పటికే ఆంజనేయులు అధికారి స్థాయికి ఎదిగాడు. పెళ్లిళ్లు వైభవంగా చేయడంతో అమ్మాయిలు, వాళ్ల కుటుంబాల బాగోగులు చూసిన వాళ్లు, ఆంజనేయులుకు తెలిసిన వాళ్లందరూ ఇంత మంచి సంబంధాలు ఎలా వెతికి పట్టుకున్నావని అడిగితే... ఆంజనేయులు మురిసిపోతూ పెళ్లిళ్ల పేరయ్య రామకృష్ణను అందరికీ పరిచయం చేశాడు.
      పిల్లలకి పెళ్లిళ్లు కావడంతో అందరికీ అనువుగా ఉంటుందని అయిదు వందల గజాల్లో పెద్ద ఇల్లు కట్టించాడు ఆంజనేయులు. అందరూ హాయిగా కలిసుండొచ్చని ఆనందంతో పొంగిపోయాడు. అయితే త్వరలోనే తనకు నిరాశ కలుగుతుందని ఊహించనేలేదు ఆంజనేయులు. ఆయనే కాదు. కొడుకు సంసారాన్ని చూసుకొని సంబరపడిపోతున్న ఆంజనేయులు తల్లి కూడా ఆ షాక్‌కి తట్టుకోలేకపోయింది.
      ఓ రోజు...
      పెద్దకొడుకు తండ్రి దగ్గరికొచ్చి తను అమెరికా వెళ్తున్నానని చెప్పాడు. ఆ క్షణం మాత్రం ఆంజనేయులు ఎంతో సంతోషపడ్డాడు. తను ఇండియా దాటి ఎరుగడు. కొడుకు అదీ అమెరికా వెళ్తున్నాననగానే ఎంతో పొంగిపోయాడు. ఆనందంగా వీడ్కోలు పలికాడు.
      రెండు నెలలు తిరగకముందే అమెరికాలో అన్నయ్య పని చేస్తున్న కంపెనీలోనే నాకూ ఉద్యోగం దొరికిందని చెప్పాడు రెండో కొడుకు. ఆంజనేయులు ఓ క్షణం ఆశ్చర్యపోయాడు. మరుక్షణం నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేక పోయాడు.
      ఆ మరునాడే రెండో కొడుకు కూడా అమెరికా చెక్కేశాడు. అప్పుడే అనుమానం కలిగింది ఆంజనేయులుకి. అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కునే అమెరికా వెళ్లుంటారని... కానీ దానికి వాళ్ల భార్యల మద్దతు కూడా ఉందని.. అనుకున్నట్టే జరుగుతోందనీ ఊహించలేదు.
      ఆరు నెలలు తిరక్కుండానే అన్నదమ్ములు ఇండియా వస్తున్నట్లు ఫోన్‌ చేశారు. వచ్చీ రాగానే పెట్టేబేడా సర్దుకొని, పెళ్లాల్ని కూడా తీసుకెళ్తున్నట్టు చల్లగా చెప్పారు.
      ఆంజనేయులు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. మౌనంగా గోడకు చేరగిలబడిపోయాడు. ఆంజనేయులు తల్లే నానా రభస చేసింది. ‘‘మీ అందరి కోసమే కదరా! మీ వెర్రి నాన్న ఈ లంకంత కొంప కట్టాడు. ఇప్పుడు ఈ ఇంట్లో మేమిద్దరమే బిక్కుబిక్కుమంటూ గడపాలా?’’ ఏడుస్తూ అంది ముసలమ్మ.
      ‘‘అయితే, ఈ ఇంటి కోసం లక్షలు ఆర్జించే ఉద్యోగాన్ని వదిలేసి మా బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోమంటావా? ఈ వేళో రేపో రాలిపోయే మీ కోసం మేమూ ఇక్కడే ఉండి నాన్నలా ఎదుగూ బొదుగూ లేని జీవితం గడపాలా? నో! నెవ్వర్‌!’’ ఇద్దరూ దాదాపు ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.
      ‘‘నోర్ముయ్యండి. మా అమ్మ కోసం, నా కోసం మీరేం త్యాగాలు చెయ్యక్కర్లేదు. మీ బాగోగులు మీరు చూసుకోండి’’, గుండెల్లోనే బాధను దిగమింగుకొని గంభీరంగా అన్నాడు ఆంజనేయులు.
      ‘‘శుభం. వెళ్లండి’’ తల్లీకొడుకులు మరేం మాట్లాడకుండా నలుగుర్నీ నవ్వుతూ ఆశీర్వదించి అమెరికాకి సాగనంపారు.
      ‘‘అమ్మా! నాకింకా నాలుగేళ్లు సర్వీసుంది. నేనున్నంత కాలం నీకీ కొడుకు దూరం కాడమ్మా. నీకు నేను, నాకు నువ్వు. మనకి మనం ఈ తోడు చాలమ్మా’’, కొడుకులూ కోడళ్లను విమానాశ్రయంలో వదిలేసి వస్తున్నప్పుడు గుండెల్లోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదిమి పట్టలేక తల్లి భుజం మీద తల పెట్టుకొని చిన్నపిల్లాడిలా వలవలా ఏడ్చేశాడు ఆంజనేయులు.
      ‘‘ఒరేయ్‌ కన్నా! వాళ్లు తల్లి లేని పిల్లలు. అమ్మ విలువ నీకు తెలిసినంతగా వాళ్లకు తెలీదురా!’’ అంటూ చెట్టంత కొడుకుని ఒడిలో పెట్టుకొని తల నిమురుతూ ఓదార్చిందామె.
      నాలుగేళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఆంజనేయులు పదవీ విరమణ చేశాడు. ఓ రోజు ఉన్నట్టుండి పెద్దకొడుకు ఫోన్‌ చేసి అడిగాడు.
      ‘‘నాన్నా! మీరు రిటైర్‌ అయ్యారు కదా! మీ చేతికి కేష్‌ ఎంతొచ్చిందేమిటి?’’ అని. అలా పెద్దకొడుకు అడగడంతో... ‘‘ఎంతొచ్చినా ఏముందిరా? రిటైరయ్యాక మీరులేని దిగులు తెలుస్తోందిరా. ఏం చేయాలో అర్థం కావటంలేదు’’ బేలగా అన్నాడు ఆంజనేయులు.
      ‘‘ఇంకా అక్కడ అంత పెద్దిల్లు మనకెందుకు నాన్నా. అమ్మిపడేసి అప్పులేమన్నా ఉంటే మొత్తం కట్టేసి ఏమైనా మిగిలితే బ్యాంకులో వేసుకుంటే పోలా? ఆ గొడవలన్నీ తేల్చుకొని మీరోసారి మా దగ్గరికి అమెరికా రావచ్చు కదా?’’ అన్నాడు మీమాంసగా.
      ‘‘నేనొక్కణ్నే ఎలా రాగలను. మీ నాయనమ్మ ఉందికదరా?’’ అప్పటికే ఆంజనేయులుకి మతిపోయింది.
      ‘‘నాన్నమ్మని వృద్ధాశ్రమంలో ఉంచి రండి నాన్నా’’, రెండో కొడుకు ఉచిత సలహా.
      కొడుకుల మాటలకు అసహనంతో నిస్సహాయంగా కుర్చీలో కూలబడిపోయాడు ఆంజనేయులు. కొడుకులు కొరివి పెట్టడానికి కూడా ఆలోచించే రకమని అర్థమైంది. చివరికి నాన్నమ్మని కూడా ఓ వస్తువులానే  భావించారు. ఎక్కడో పడేసి అమెరికా రమ్మంటున్నారు. ఇన్నాళ్లూ మా అమ్మ చేతి ముద్ద తిని పెరిగామనే ఇంగితం కూడా మర్చిపోయారు... విశ్వాసఘాతకులు. పళ్లు పటపటా కొరుక్కున్నాడు ఆంజనేయులు. అంతకంటే ఇంకేం చేయగలడు?
వంటగదిలో ఉన్న ఆంజనేయులు తల్లికి విషయం కొంతవరకు అర్థమైంది.
      ‘‘పోనీలేరా! వాళ్లకు అక్కరలేని ఆస్తి నీకెందుకు. అమ్మిపడెయ్‌!’’ తేలికగా అందామె. 
      అయినా ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లును అమ్మబుద్ధి కాలేదు ఆంజనేయులుకి. ఆరేళ్లు గడిచిపోయాయి. లంకంత కొంప. తల్లో మూల తనో మూల శుభ్రం చేసినా తెల్లారడం లేదు. పనిపిల్లలు కూడా దొరకటం లేదు. చివరికి ఇల్లు అమ్మడమే పరిష్కారం అనుకుని ప్రకటన ఇచ్చి, ఎంతో ఇష్టపడి, కష్టపడి కట్టుకున్న అంత పెద్ద ఇల్లు అమ్మకానికి పెట్టాడు ఆంజనేయులు.
      బ్యాంకు అప్పు పోగా మిగిలిన డబ్బుతో ఫ్లాట్‌ తీసుకున్నాడు. ఇంకా పాతిక లక్షలకు పైగా మిగిలితే బ్యాంకులో తల్లిపేర తనపేరా డిపాజిట్‌ చేశాడు. తల్లికి తెలియకుండానే ఇప్పుడు పెళ్లి నిర్ణయం తీసుకున్నాడు ఆంజనేయులు.
      ఆ రోజుకు వారం రోజులవుతోంది పెళ్లిళ్ల పేరయ్య రామకృష్ణని కలిసి. ఇంకా ఏ కబురూ అందలేదు. ఫోన్‌ చేశాడు. అట్నుంచి సమాధానం లేదు.
      పదో గంటకల్లా ‘పెళ్లిచూపులు’ కార్యాలయంలో అడుగుపెట్టాడు ఆంజనేయులు.
      పూజ ముగియగానే హాల్లో ఆంజనేయుల్ని చూసిన రామకృష్ణ గతుక్కుమన్నాడు. ఈయన్ని ఎలా వదిలించుకోవాలా? అని ఆలోచిస్తూ మొహాన నవ్వు పులుముకుంటూ హాల్లోకి వచ్చాడు. ‘‘వెల్‌కమ్‌ సార్‌! రండి... మీక్కావలసిన ఫొటోలు లోపలున్నాయి’’, అంటూ ఆంజనేయుల్ని తన ఛాంబర్లోకి ఆహ్వానించాడు రామకృష్ణ.
      మౌనంగా పెళ్లిళ్ల పేరయ్యని అనుసరించాడు ఆంజనేయులు.
      రామకృష్ణ ఇచ్చిన ఆల్బం తీసుకుని గబగబా తిరగేశాడు ఆంజనేయులు. అందులో ఉన్న ఫొటోల పక్కనే వాళ్ల వివరాలు రాసి ఉన్నాయి. అందులో పెళ్లికాని ముదర బ్రహ్మచారిణిలే ఎక్కువ మంది. కొందరు పెళ్లైన వెంటనే భర్త పోయినవాళ్లు ఉన్నారు. ఫొటోల అలంకరణని బట్టి చూస్తే ఆమాత్రం... ఈమాత్రం కట్నం కూడా ఇచ్చుకోగల స్తోమత ఉన్నవాళ్లలాగే కనిపిస్తున్నారు. కొద్దిసేపు వాటిని పరీక్షగా చూసి గబాలున ఆల్బం మూసేసి రామకృష్ణ ముందుకు తోసేశాడు. 
పెద్దాయన పరిస్థితి రామకృష్ణకి ఏమీ బోధపడటం లేదు.
      ‘‘నాకు వీళ్లెవరూ నచ్చలేదు. నాకు పిల్ల కాదు. తల్లి కావాలి. పెళ్లాంగా కాదు. అమ్మగా రావాలి’’ దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు ఆంజనేయులు.
      రామకృష్ణకి పిచ్చెక్కిపోయింది. ‘సమాజంలో గౌరవ మర్యాదలు గల వ్యక్తి. అరవై ఆరేళ్ల వయసులో పెళ్లికోసం ఉబలాట పడుతున్నాడు. సరే, కానీ... ఈ తిక్కేమిటో అర్థం కావటంలేదు. ఏం చేయాలో అర్థం కావటంలేదు.’
      ‘‘సార్‌! ఈ ఆదివారం పత్రికా ప్రకటన ఇస్తాను. అందులో మీకు నచ్చేవి రావచ్చు. ఒక్క రెండు రోజులు ఓపిక పట్టండి. ప్లీజ్‌’’, అంటూ ఆంజనేయులు చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు రామకృష్ణ.
      ‘‘అలాగే! ఆలస్యం చెయ్యకు’’, అంటూ వెళ్లిపోయాడు ఆంజనేయులు. వారం తిరక్కుండానే మళ్లీ రామకృష్ణ కార్యాలయానికి వచ్చాడు ఆంజనేయులు.
      ‘‘సార్‌! మన ప్రకటనకి మంచి స్పందన వచ్చింది. ఇదిగో! ఇవి చూడండి’’, అంటూ తన డెస్క్‌లాగి ఓ ఫైల్‌ తీసిచ్చాడు. తెరిచి చూశాడు ఆంజనేయులు. దాదాపు యాభై వరకూ ఫొటోలు, బయోడేటాలు పిన్‌ చేసి ఉన్నాయి. అన్నీ ఒకొక్కటే విప్పి చూసి పక్కన పడేస్తున్నాడు. యాభైలో ఒకే ఒక్క దానికి ఫొటో జత చేయలేదు. వివరాలతోపాటు ఆమె రాసిన లేఖ చదివాడు ఆంజనేయులు. రామకృష్ణ తన పని తను చేసుకుంటూనే ఓరకంట ఆంజనేయుల్ని గమనిస్తున్నాడు.
      ఫొటోలన్నీ చూస్తూ కింద పడేస్తున్న ఆంజనేయుల్ని చూసి తల బాదుకోవాలనిపించింది రామకృష్ణకి.
      ‘‘ఇది కన్ఫర్మ్‌ చెయ్యి’’, అంటూ ఓ లేఖ ఇస్తూ అన్నాడు ఆంజనేయులు.
      ‘‘సార్‌! ఇందులో ఫొటో లేదు. ఈ లేఖ చదివారా? పెళ్లి చేసుకోకపోయినా కనీసం ఇంట్లో పని మనిషిగానైనా రావడానికి అంగీకరిస్తూ రాసిందామె. అయినా, మీ హోదాకి, మీలాంటి వాళ్లకి తగని మనిషిలా ఉంది సార్‌. అదీకాక ఇద్దరు పిల్లల తల్లి’’ అందులో వివరాలు ముందే చదివిన రామకృష్ణ అన్నాడు.
      ‘‘పని మనిషిగానైనా వస్తానని రాసిన ఆమె అవసరం, ఔదార్యం నాకు నచ్చాయి. ఇక ఫొటోతో మనకి పనేముంది’’, గంభీరంగా అన్నాడు ఆంజనేయులు.
      ‘‘సార్‌! ఇద్దరు పిల్లల తల్లి...’’ ఏదో చెప్పబోయాడు రామకృష్ణ.
      ‘‘నాకు తెలుసు. ఇద్దరు ఆడపిల్లలు. కూలికెళ్తూ వాళ్లని చదివించుకుంటోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వెధవ పెళ్లాం పిల్లల్ని పోషించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నెం పున్నెం ఎరుగని పసివాళ్ల కోసమే ఆమె జీవిస్తోంది. అంతేనా, ఇంకేమైనా రాసి ఉందా?’’, సూటిగా రామకృష్ణ మొహంలోకి చూస్తూ అన్నాడు ఆంజనేయులు.
      ‘‘అలాగే సార్‌! ఇందులో అడ్రస్‌ రాసి ఉంది. వెంటనే హైదరాబాద్‌ రమ్మని చెప్తాను. మీరెప్పుడంటే అప్పుడు రిజిస్ట్రారాఫీసుకు వెళ్దాం. ఎందుకైనా మంచిది ఓసారి రాజమండ్రి వెళ్లి విచారించమంటారా?’’ అన్నాడు రామకృష్ణ.
      ‘‘అక్కర్లేదు. ఆ ఉత్తరం చదివితే చాలు. ఆమె సంస్కారం తెలుస్తుంది. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలు. ఔనా?’’ తన అన్వేషణ ఫలించినందుకు తృప్తిగా అన్నాడు.
      ‘‘అలాగే సార్‌! మిగతావన్నీ నేను చూసుకుంటాను’’ అన్నాడు రామకృష్ణ.
      అరగంటలో ఇల్లు చేరుకున్నాడు ఆంజనేయులు. తన పెళ్లి ప్రయత్నాలన్నీ తల్లికి వివరించి చెప్పాడు ఆంజనేయులు.
      ఆ రాత్రి కొడుకులు కోడళ్ల దగ్గర్నుంచి ఫోన్‌. చాలా సీరియస్‌గా ఇద్దరూ తండ్రిని దుర్భాషలాడారు. రామకృష్ణ ద్వారా విషయం కొడుకులకు చేరిందని తెలిసింది ఆంజనేయులుకి. అయినా కించిత్‌ చెక్కు చెదరలేదు. నవ్వి ఊరుకున్నాడు.
‘చిరంజీవులకు...
      నా ఆశీస్సులు. ఈ వయసులో నేను పెళ్లెందుకు చేసుకుంటున్నానో మీకు తెలీదా? మా అమ్మని, నన్ను అనాథల్లా వదిలేసి మీ దారి మీరు చూసుకున్నారు. ఈ లోకంలో ఎనభై ఆరేళ్ల మీ నాయనమ్మ, అరవై ఆరేళ్ల మీ కన్నతండ్రి... ఏ తోడూనీడా లేకుండా ఎలా బతుకుతాడో ఒక్కక్షణం ఆలోచించారా? మా అమ్మకి, నాకు సమయానికి కాస్త అన్నంపెట్టే అమ్మకోసం, మేం మంచానపడితే తల్లిలా సేవ చేయడానికి మానవత్వం ఉన్న మనిషి కోసం పెళ్లి చేసుకుంటున్నాను’.
      ‘ఇల్లుంది. కావలసినంత డబ్బుంది. కానీ, దాహమేస్తే కాసిని నీళ్లు గొంతులో పోసేందుకు నా అన్నవాళ్లే కరవయ్యారు. అందుకే ఇద్దరు ఆడపిల్లల తల్లిని కావాలనే పెళ్లి చేసుకుంటున్నాను. ఆ పిల్లలకి తండ్రిగా బంగారు భవిష్యత్తు ఇవ్వాలని. మా అమ్మ కోసం, నా కోసం సేవ చేస్తామన్న వాళ్ల బతుకులకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనేరా పెళ్లి చేసుకుంటున్నాను. నావల్ల వాళ్లకి మేలు జరగాలి. మా అమ్మ, నేను బతికున్నంత కాలం వాళ్లకి ఏలోటు రాకుండా చూస్తాను. మా తదనంతరం ఇప్పుడు మేం ఉంటున్న ఇల్లు వాళ్ల పేరే రాసేస్తాను. బ్యాంకులో మేం ఖర్చు చేసుకోగా మిగిలిందాన్ని కూడా ఆమెకే నామినీ ఇస్తాను. తప్పంటారా? ఇన్నేళ్లు పెంచి పెద్ద చేసిన పిల్లలు మమ్మల్ని ఎంగిలాకుల్లా విసిరేసి వెళ్లిపోయినప్పుడు... ఆ ఎంగిలాకుల్నే నమ్ముకొని బతకడానికొస్తున్న ఆ మహాతల్లికి ఇంతకంటే ముసలాళ్లం ఏం చేయగలం? నా పెన్షన్‌ కూడా నా మరణానంతరం నా భార్యకే- అదే ఆమెకే వస్తుందట. ఆమె బతికి ఉన్నంత కాలం ఇద్దరు ఆడపిల్లల్ని బాగా చదివించి దర్జాగా పెంచుకోగలదు కదా!’
      ‘ఇప్పుడు చెప్పండి. నేను చేస్తున్నది తప్పా? నవమాసాలు మోసి కని పెంచిన మా అమ్మ బాగోగులు చూసుకోవడానికి ఓ తల్లిని ఇంటికి తేవడం నేరమా? ఇన్నాళ్లూ నాది, నా వాళ్లు అని స్వార్థంతో మీ కోసం మూడో వ్యక్తి రాకుండా బతికితే మిగిలిందేమిటి? కాటికి కాళ్లు చాపుక్కూర్చున్న అమ్మకు, మీ బాగుకోసం శ్రమించిన నాకు మీరిచ్చిన బహుమతి ఈ ఒంటరి బతుకు. అంతేనా? మీ దారి మీది. మా దారి మాది. మా అమ్మకు అమ్మ కావాలి. నాకు తల్లి కావాలి. ఆ తల్లికి పిల్లలు కావాలి. ఆ పిల్లలకు భవిష్యత్తు కావాలి. అందుకే పెళ్లి చేసుకుంటున్నాను.’’
      ఇంకేమీ రాయాలనిపించలేదు. మెయిల్‌ పంపి మౌనంగా కళ్లు మూసుకున్నాడు.

 

* * *

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోని


కొత్త పలక

కొత్త పలక

కుప్పిలి సుదర్శన్‌bal bharatam