తీర‌ని బాకీ

  • 452 Views
  • 3Likes
  • Like
  • Article Share

    చెన్నూరి సుదర్శన్

  • విశ్రాంత ప్రధానాచార్యులు
  • ములుగు, వరంగల్లు
  • 9440558748
చెన్నూరి సుదర్శన్

తల్లినీ, రూపాయినీ ఒకే గాటన కడతారు హరీ, గిరీ.. ఆమె ఆస్పత్రి పాలైనపుడు నేనూ నీ కొడుకునే అంటూ వస్తాడు మరో వ్యక్తి.. ఆ ముగ్గురు కొడుకుల కథ ఏంటీ..? ఆ తల్లి మనసు ఎలా సేదదీరిందీ...?
గాయాల్ల
ఎగిలిబారంగ కనకమ్మకు మంచం మీదికెల్లి లేవత్తలేదు. ‘ఏమైంది నాకు?’ అని గునుక్కుంట పక్కగోలె తిర్గబోయింది. తిర్గత్త లేదు. అసలు కాల్జేతులే ఆడ్తలేవు. తల్కాయె సుత లేపత్తలేదు. మన్సుల బుగులు సొచ్చి... ఒక్కపాలె ‘‘హరీ!’’ అని ఒర్రింది.
      హరి తను పండుకున్న సాయబాన్ల కెల్లి తాత్పరంగ లేచి కండ్లు నల్సుకుంట... వచ్చుడు వచ్చుడే ‘‘ఏం రోగమచ్చింది?’’ అని ముఖమంత చిట్లిచ్చుకున్నడు.
      ‘‘నా కాల్జేతులు కట్టసర్సుక పోయినైరా, కదుల్తలేవు. లేవత్తలేదు.’’ అనుకుంట ఏడ్వబట్టింది కనకమ్మ. ఆ మాయదారి రోగం వచ్చేదేందో ఆ గిరి గాని ఇంట్ల రావద్దా? ఏమైనా నా మెడకే సుట్టుకుంటది’’ అని కసురుకుంట కనకమ్మ కప్పుకున్న దుప్పటి లేపి సూసిండు హరి.
      ‘‘మాట్లాడత్తాంది, సూడత్తాంది, బాగనే ఇనత్తాంది. అన్నీ సరింగనే ఉన్నైగదా. మరి ఎందుకు లేవత్తలేదో?’’ గుడ్లెల్ల బెట్టి సూసుకుంట నోరంత బొంగురం లెక్కపెట్టి ఎకసక్కెంగ అడుగబట్టిండు హరి.
      కనకమ్మను లేపి కూసుండ బెట్టడానికి చూసిండు. కాని కనకమ్మ కూసోలేక పోతాంది. ‘ఇదేందో మాకంట్లం మీదికచ్చిన రోగమే’ అని మనుసుల తిట్టుకుంట... ‘‘అరేయ్‌ గిరీ! అవ్వకు పచ్చవాతం వచ్చిందిరా, కాల్జేతులాడ్తలేవు. ‘రోయిని’ పైవేటు దవకాన్లకు తీస్కపోతా! నీ వంతు కొన్ని పైసలు తీసుకొని దవకాన్లకు రా. జల్ది బయల్దేరు. ఈడున్నట్టు రావాల’’ తమ్ముడు గిరికి ఫోను చేసిండు. అదే ఫోను మల్ల అంబులెన్సుకు కొట్టిండు. అంబులెన్సు కోసం ఎదురు సూసుకుంట ‘‘మనుదేవ్‌ లేచి నాయనమ్మ లేంది బడికి పోనంటడేమో... నువ్వే దగ్గరుండి తీసుకపో’’ అని తన పెండ్లానికి హుకుం జారీ చేసిండు హరి.

* * *

      రోయిని దవకాన మైదానంల...
దూరంగా యాపచెట్టు కింద హరి, గిరి ఒకల్ల మీదికి ఒకలు ఎగిరెగిరి పడుకుంట వాదిచ్చుకుంటాండ్లు. సుట్టు పక్కలున్నోల్లు ‘కుక్కలు కలెబడ్తానయా!’ అన్నట్లు ఆశ్చర్యపోయి సూడ బట్టిండ్లు.
      ‘‘పైసలు చెట్లకు కాత్తానయా? సర్కారు దవకానకు తీస్కపోకుంట అవ్వను గీ పైవేటు దవకాన్లకెందుకు తీసుకచ్చినౌ. నీ తాన ముల్లె బాగా మూల్గుతాంటె నువ్వే కర్సు పెట్టుకో. నేను ఒక్క పైసియ్య. నాతాన దమ్మిడి సుత లేదు’’ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిండు గిరి. ఇద్దరి సందుల యాపచెట్టు బిర్ర బిగుసుకపోయి బీర్పోయి ఇంటాంది. కొమ్మ ఇసుర బుద్ధైత లేదు.
      చెట్టుకిందున్నా సల్ల చెమటలు పోయబట్టినై. హరి ముకం కందగడ్డ లెక్క పెట్టుకొని అవతలికి పోతాంటె గిరి సుత బిర్ర, బిర్ర నడుసుకుంట హరి ఎన్కనే ఉర్కబట్టిండు. ఏ సంగతీ తేలకపోయెటాల్లకు దవకాన గేటు దాటి బయట పడ్డరు. ఓటల్లకు పోయి ఫంక కింద కూకున్నరు. చాయ తాక్కుంట సోంచాయించ బట్టిండ్లు. అదంతా కమస్కం గంటసేపు బైసు నడ్సింది.
      కనకమ్మను సర్కారు దవకాన్ల చేర్పిద్దమనుకోంగనె ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరిగి దవకాన్ల అడుగు పెట్టిండ్లు.
      నూక్కచ్చిన నాల్గు గీరల బండి మీద కనకమ్మ కన్పియ్యకచ్చింది. అయినా బేపికరుగున్నరు. వాల్లల్ల తండ్లాట మచ్చుకైనా కనిపిత్తలేదు. ‘కాలురెక్కలు కదుల్త లేవాయె. యాడికి పాయె? పీడ ఇర్గడైతె బాగుండె!’ అని ఎవ్వలకు వాల్లె మన్సులనుకోబట్టిండ్లు. మెల్లంగ జారుకుందామని సూసిండ్లు గాని ఎదురుంగనే డాక్టరు రాబట్టిండు.
      ‘‘కనకమ్మను మీ తమ్ముడు సునీల్, అతని భార్య సుమేధలు వచ్చి తీసుక పోయిండ్లు. వాళ్లకు తెల్సిన దవకాన్ల సూపిత్తమన్నరు. ఆ రోగానికి ఏ మందులూ పని చేయవు. ఫిజియోథెరపీ చేయించాలె. సునీల్‌ మీకు ఫోన్‌ చేయలేదా?’’ అని డాక్టర్‌ అనెటాల్లకు హరి, గిరి కుత్కెలు దగ్గర పడ్డై. ‘‘ఆ! ఆ! పోన్‌ అత్తాంది. తమ్ముడే చేత్తాండు’’ అనుకుంట నక్క లెక్క డాక్టరు రూంలకెల్లి బయటపడ్డడు హరి సెల్‌పోన్ల మాట్లాడుతానట్టు నటన చేయబట్టె. ఏది ఏమైనా తమకు తెల్వకుండా పోతదా అనుకొని దవకాన పత్తా తెలుసుకోకుండా బేఫికర్గా హరి ఎన్కాల్నే గిరి తొవ్వ బట్టిండు.
సునీల్‌ అనే తమ్ముడు వాల్లకు లేడనే సంగతి బయట పెట్టలేదు. యిన్నాళ్లకు గీ కొత్త తమ్ముడు యాడ్నుంచి పుట్టుకొచ్చిండు? అని తమ తల్లి మీద ఎవరి మన్సుల వాల్లు అనుమాన పడబట్టిండ్లు. వాల్లకసలు తమ్ముడే లేడని డాక్టరుకు తెలుసన్న సంగతి వాల్లకు తెల్వదు. డాక్టర్‌ ముసిముసి నవ్వులు నవ్వుకోబట్టిండు.

* * *

      ‘‘పరీచ్చలన్నీ సేసి ఏదో సిండరోమంట నాకేమో నోరు తిర్గకపాయె, మాయదారి రోగమని చెప్పిండు డాక్టరు. అదో వైర్సట (వైరస్‌). నా పెయ్యిల సొచ్చిందట. గందుకే నాకాలు సేతులు సతికిల పడ్డయన్నడు. ఇది ముసలోల్ల మీదనే ఉర్కులాడ్తదట. ఇంకా బుడ్డిపోయిన బోటి పేగుల కూర తిన్నా ఇసోంటి వైర్సులు పెయ్యిల పుడ్తయన్నడు.
      ‘ముందుగాల ఆ వైర్సును ఖతం పట్టిచ్చి అటెన్క యాయామం (ఫిజియో థెరపీ) సేయించాలన్నడు. పురంగ నేను కోలుకొని నా పనులు నేను సేసుకోవాలంటే ఆర్నెల్లైనా పడ్తదన్నడు. ముందుగాల కొన్ని పైసలు కట్టమన్నడు డాక్టరు.’
      ‘ఇంగా ఈ గిరిగాడు రాలేదేంద’ని  బయటికిపోయిన హరి వాపస్‌ రాలే! నా కంట్లె నీల్లు, వాగు చెలిమలల్ల ఊరే నీల్ల లెక్క ఊరబట్టినై. అవి గూడ సచ్చుబడిపోతే బాద తప్పేదని ఎంత సంజాయించుకున్నా కంట్లె నీల్లు ఆగకచ్చినై. నాకో తుడ్సుకుందా మంటే చెయ్యి లేవదాయె. యాదికచ్చిన కొద్ది పానమంత ఔసిపోబట్టింది.
      నా గోస సూసి దేవుడే మిమ్మల్ని తోలిచ్చిండనుకుంటాన. కాని అయ్యా! మీరెవ్వలో నాకు తెల్వదు. కన్న కొడుకులే కనికరం లేకుంట పరారైండ్లు. మీరేమో నన్ను కంటికి రెప్పోలె సూసుకుంటాండ్లు. నాకంత అయోమయంగున్నది. మీకు నా మన్సుల కోటి దండాలు పెడ్తాన బాబూ! చేతులెత్తి మొక్కలేని దాన్ని, సమించండయ్యా’’ నిండు నీటి కడవలైన తన కండ్లతోటి దీనంగ సూసింది కనకమ్మ. సునీల్‌ కనకమ్మ కంట్ల నీల్లు తుడ్వబట్టిండు.
      ‘‘మద్దె నాత్రి లేసి ఆవలికి పోయచ్చిన, కడ్పులంత దేవినట్లై కక్కుకున్న. నాత్రి ఏం తిన్నా?’’ అని సోంచాయించుకుంట గడ్సిన దినం జర్గిందంత కండ్లకు కట్టినట్టు సెప్పబట్టింది కనకమ్మ.

* * *

      ‘‘ఇక్కడి నుంచి బస్తానకు ఎనిమిది, బస్సు కిరవై ఐదు, మల్ల అవతల ఆటోకైదు మొత్తం ముప్పె ఎన్మిది రూపాయలు, ఇగ్గో తీసుకొని పో’’ అనుకుంట చేతులున్న నోట్లను రెండు, మూడు సార్లు లెక్క బెట్టుకుంట చిల్లర రూపాయిల బిల్లల్ను తెర్లు మర్లు సేసి సూసుకుంట నాసేతిల పెట్టిండు గిరి. గీసందుల రూపాయి రెండు రూపాయిల బిల్లలు పాడై, ఒక్కతీరె కనబడబట్టె. ఏడ ఒక రూపాయి ఎక్కువ పోతదో అని వాని బయం వానిది.
      ఒక్కపాలె నోరు తెర్సి సూసిన. నా సూపుల్ని సూసి మల్లనేనేమైనా పైసలు అడుగుతనేమోననే బయంతోటి వాడు తలకాయె పక్కకు తిప్పుకున్నడు. తొవ్వ కర్సుకేదిరా కొడుకా! నోట్లె నాల్కె పెట్టుకొనే పోవాల్నార?...’’ చేతులు జోడిచ్చి పబ్బతి పట్టిన. ఈపాలి తొవ్వ కర్సుకు ఏమన్న ఇత్తెడేమోనని ఆశ... కొంగు సాపిన.
      కయ్య్‌న నా మీదికి ఉర్కచ్చిండు గిరి, నాగుపామోలె బుస గొట్టుకుంట. ‘‘తొవ్వ కర్సేంది? ఏందో కొత్త సాలు పెడ్తానవ్‌. పగటీలి బువ్వ తినే యాల్లకైతే అన్న ఇంటికే చేరబోతవ్, గింతట్లనె నీ కడ్పు కొట్టుకపోతదా? నీ చేసంచిలో దూపైతే తాగుతవని నీ కోడలు పిల్ల నీల్ల సీస సదిరింది గదా. ఇంకేం కావాలె? చిన్నపిల్ల లెక్క తోవల బెల్లం కొనుక్కొని చేతి మట్టకు రాసుకొని నాక్కుంట పోతవా ఏంది?’’ అనుకుంట గుడ్లుర్మి సూసిండు.
      ‘‘చిన్నోడికైతే తల్లితోటి ఎట్ల మాట్లాడాల్నో తెల్వదు. విద్దె, బుద్ధులు చెప్పిచ్చి ఏం లాబం? గీ చిన్నోడు గిరి, ఆ పెద్దోడు హరి దొందు దొందే. శేరు గొట్టంలో గింజలు పోసి సిగ బడగొట్టినట్టు సరిగ్గా లెక్కలు గట్టి చేతిల పైసలు పెడ్తరు. నాయనమ్మ అచ్చిందని ఎంతో సంబురంగా ఎదురంగ ఉరుకచ్చే పొలగాండ్లకు ఏమన్న కొన్కపోదామంటే చేతిల చిల్లిగవ్వ ఉండదాయె. ఒట్టి చేతులతోటి ఇల్లు చేరిపోవాలంటే మనసంతా కలికలైతది.
      నేను గట్లనే సాదిన్నా వాళ్లను? హరి, గిరి చిన్నప్పుడు ఏ చిన్న పని చెప్పినా చెయి సాచెటోల్లు. ఆ లేత, లేత చేతులు సూసి ముర్సిపోయేదాన్ని. సరింగ సేతులు సుత సాప శాతగాని చిన్న, చిన్న సేతుల్ల చివరికింత చెక్కెరన్నా పెట్టేదాన్ని. కిందింత మీదింత పారబోసుకుంట బుక్కెటోల్లు. మూతికంటిన చెక్కర తుడ్దామంటే నాకందకుంట ఉర్కెటోల్లు నాల్కెతోటి పెదవులు నాక్కుంట. గట్ల వాల్ల యాదుల దొంతులల్ల ఇంకా గిట్ల బతుకుతాన.
      పండుగలకు, పబ్బాలకు నేనేమన్న పురంగ లేకుంట ఉన్ననా? నాకున్న చీరలు సాలనుకొని పొలగాండ్లకే ఇంకో జత బట్ట లెక్కువ కుట్టిచ్చేదాన్ని. ఇప్పుడైతె కట్టుకునే చీరె ఇడిచే చీరెతోనే యీడ్సుకత్తాన. 
      ‘‘నీచీరైతె చిరుగులు పట్టలేదు గదా. పండుగకేమైన కొత్తచీరె కొనాల్నా అత్తా?’ అని అడుగే కోడండ్లను సూత్తాంటే నాకు కాల్సుకత్తది. కనికరం లేని పుట్క. ఇంక కొడుకులు సుత అదే తొవ్వ. పెండ్లాల పాటకు బుర్రకత శాత్రం తందాన తాన! 
      నా ముసలోడు నౌకరి నుంచి దిగి పోంగనే వచ్చిన పైసలన్నీ కొడుకుల పేర్ల మీదనే బాంకులేయించిన. అతీగతీ వీళ్లే గదా అని. ఈయన మనుండంగానే ఇద్దరు కొడుకుల, బిడ్డ పెండ్లిండ్లు సేసిండు గాని మనుమలు, మనుమరాండ్లను సూడకుండనే కాలం సేసిండు. ఆనాటి సంది నా బతుకు ఆగమై పోయింది. ఓ నెల హరి తాన, ఇంకో నెల గిరి తాన ఉండాలని గిరి గీసిండ్లు. లెక్కలేసిండ్లు. లెక్కలల్ల తేడా అత్తాందట. రోజులెక్కువ తక్కువ అయితానయని రెన్నెల్ల సొప్పున కరారు సేసి నన్ను సెడుగుడాడుకుంటాండ్లు.
      ఎవరింట్లున్నా ఇంటిపని వంటపని నాకు తప్పదయ్యె! ఇంత చేసినా పనిమనిషి కంటే కటినంగా సూడ్డం వాళ్లకు ఎన్నతో పెట్టిన విద్దె. కోడల్లనని ఏం లాబం? నా కొడుకులకుండాలె. ముసలోలుండే ఆట్టల్ల ఎయ్యిమంటె ఎయ్యరు. ఆండ్ల పైసలెవలు కట్టాలె అంటరు. ఇంట్లైతె వాల్ల ఎంగిలి సేయి ఇదిలిత్తె నాకు సాలైతదాయె.
      బిడ్డ మీద పానం కొట్టుకుంటాంటంది. పెళ్లప్పుడు సూసిన. మల్ల బిడ్డ మొకం సూల్లే. ‘సెల్లెలా!’ అని వీళ్లు పిలువందే ‘అన్నా!’ అని అదెట్లత్తది? ఏం కోపాలో ఏమో. ఎప్పుడైనా మన్సుపడి సూసి అత్తనంటే ఇంక ఎళ్తే అటే. మల్ల మా కడ్ప తొక్కద్దని మొకం మీద చెప్పుతోటి ఈడ్సి కొట్టినట్టు సెప్తరు. గుండెకాయను జల్లెడ లెక్క తూట్లు పడేత్తరు. అదేం తప్పు సేసిందని? మా కులపోడు కాకున్నా తనిట్ట పడిందని నా మొగడు ముందుకై లగ్గం సేసిండు. ఆ లగ్గానికి కొడుకలు, కోడండ్లు రాలే. ఈ కాలంల అదేమైనా తప్పా? బిడ్డా!
      ఎంతైనా అన్నలుగదా అని అదోపాలి పెద్దోని ఇంటికత్తే దాన్ని గడ్పతొక్కనీయ లేదు. బైట నుంచి బైటికే ఎల్లగొట్టిండ్లు. నేను రెక్కలిర్గిన పచ్చి లెక్క ఏడ్సిన.
      ‘‘అవ్వా ఎక్కడికి? బస్‌టానకేనా? ఎక్కు’’ అని ఆటో పిలగాడు అనేదాన్క నేను మేన్‌రోడ్డు మీదకచ్చి నిలబడ్డనన్న సంగతే సూసుకోలే. నాచేతిలున్న సంచి తీసుకొని లోపలపెట్టి, శాన జాగర్తగ నన్ను ఆటోల కూకోబెట్టిండు. ఆటో పిలగాడు సూయించే మర్యాద సుత నా కొడుకులు నా మీద సూయించరు. నా చిన్న కొడుకైతె వాని కారు ముట్టుకోంగనే ముట్టుడైనట్లు నీళ్లు సల్లి తుడ్సుకుంటడు. గసోంటిది నన్ను బస్‌టాన దాక కార్ల దింపుతడా! ఎంత దశా!! అదే పెండ్లాం బైటికి పోదామంటె మాత్రం కారు లేనిది కాలు బైటపెట్టరు.
      పెద్ద కొడుకు హరి ఊల్లె బస్సు దిగి ఆటో కోసం సూత్తాన. నా మనుమడు మనుదేవ్‌ నన్ను యాడికెల్లి ఎట్ల సూసిండో, ఏమో ‘‘నాయినమ్మా!’’ అని పిల్సుకుంట జింక పిల్లలెక్క ఎగురుకుంట రాబట్టిండు. మెల్లంగ, మెల్లంగ అంటనే ఉన్నా, న్యాలకు కరుసుకొని కొడుకు పడనే పడ్డడు. ‘సదువు శారెడు, బలపాలు దోశె’డన్నట్లు అ, ఆలు సదివే పోరనికే బియ్యపు బత్తోలె ఈపుల పుత్తకాల సంచి, వాన్ని లేవనిత్త లేదు. నాకేమో ఉర్క శాతగాదాయె. పానమంత తల్లడిల్ల బట్టింది. పాపం! ఎవలో తొవ్వపొంటి పోయెటాయ్నె లేపిండు.
      మనుదేవ్‌ నవ్వు మొకం సెనంల సెరువైంది. ఎక్కెక్కి పడి ఏడ్వబట్టిండు. మోకాల్లు, మోసేతులు కొట్టుకపోయినై. కుడికాలు మల్సుక పోయినట్టుంది. కుంట బట్టిండు. నాపైపానం పైనే పోయింది. నా ఆకలి ఆమడదూరం పోయింది. చేసంచి చేతి కట్టే కిందపడేసి మనుదేవ్‌ను దగ్గరికి తీసుకున్న. కుడికాలు రెండు మూడుసార్లు  జాడియ్యమంటే, ఏడ్సుకుంటనే జాడిచ్చిండు. వాన్ని సూత్తాంటె నాకండ్లల్ల నీల్లు తిర్గినై.
      పక్కనే ఉన్న చేతి వైద్గుని దగ్గరికి తీస్కపోయి మనుదేవ్‌ కాలుకు పట్టి గట్టిచ్చిన. నా దగ్గర ఆటో కిరాయికే ఉన్న  పైసలు వైద్గుని సేతిలపెట్టి ‘గవే ఉన్నయని’ దండం బెట్టిన. మనుదేవ్‌కు కాలుదీసి కాలు ఏయత్తలేదు. పుత్తకాల సంచి ఆడనే ఉంచిన. మనుదేవ్‌ వైద్గున్నడిగి హరికి పోన్‌ సేసిండు. ‘మీటింగుల ఉన్న. వచ్చుడు కుదరది. నాయనమ్మను తీసుకొని ఇంటికి పొమ్మన్నడట.’
      నా చేతిలోని సంచిని సంకకేసుకొని మనుమన్ని భుజంమ్మీద కూకోబెట్టుకున్న. కనబడ్డ చెట్టు నీడ కింద కూకుంట లేసుకుంట హరిగాని ఇంటికి చేరెటాల్లకు కండ్లల్ల సీకట్లు కమ్మి గల్మల్లనే కూలబడ్డ.
      ‘‘అమ్మా! నాయనమ్మ పడ్డదే’’ అని మనుదేవ్‌ గావుకేకలు పెట్టిండు. కోడలు నిమ్మలంగ మంచినీల్లు పట్టుకచ్చిచ్చింది. నీల్లు తాగి, కాల్లు చేతులు కడుక్కొని పెరుగన్నం రెండు ముద్దలు కడుపులోపల్కి దిగెటాల్లకు పోయే పానం నిలబడ్డట్టైంది.
      హరి వచ్చుడు వచ్చుడే ‘‘నడ్సుకుంట ఎందుకు వచ్చినౌ? తమ్ముడు ఆటోకు పైసలియ్యలేదా? తొవ్వ పొంటి ఏమన్న కొనుక్క తిన్నవా ఏంది?’’, అని కైక్కుమన బట్టిండు. నేను నోరు ఇప్పలేదు. మనుదేవ్‌ ఏడ్సుకుంట పూస గుచ్చినట్టు చెప్పేటాల్లకు హరి కుత్కె దగ్గరపడ్డది.
      ‘‘నాయనమ్మకేమైనా కావాలె, మిమ్మల్ని సంపేత్త’’ అనుకుంట నాల్కెను ఎన్కకు మల్పి, ముఖమంతా కండ్లు చేసుకొని సూపుడేలుతోటి మనుదేవ్‌ బెదిరయ్య బట్టిండు. కొడుకూ, కోడలు బీర్పోయిండ్లు.
      నేను మనుదేవ్‌ను దగ్గర్కి తీసుకొని ‘‘గట్లనద్దురా. పెద్దోల్లతోటి గట్లనే మాట్లాడ్తరా?’’, అనేటాల్లకు వాడు నా ఒల్లె ఒదిగిపోయి ఆరుద్ర పురుగు లెక్క ముడ్సుకపోయిండు. ఆనాత్రి నాకొక్కదానికే బోటికూర తోటి బువ్వపెట్టింది కోడలు. నా మీద ఎంత పేమా! అని బమిసిన. కాని తింటాంటె ఏందో బుడ్డిపోయిన వాసన వచ్చింది. తెల్లారింది లేవత్త లేదు. హరి నన్ను దవకాన్లకు తీస్కపోయిండు.

* * *

      కనకమ్మ కథ ఇంటాంటె సునీల్, సుమేధల కండ్లల్ల నీల్లు కారబట్టినై. ‘‘అమ్మా! నేనూ నీ కొడుకునే అనుకో. నా పేరు సునీల్, ఈమె నీ కోడలు సుమేధ. మమ్మల్ని దీవించాలె కాని దండంపెట్టద్దు. నువ్వు దండంపెడ్తే మాకు ఆయుస్సు తగ్గుతది. ఇంక నువ్వేమీ సోంచాయించకు. నిన్ను సూసుకొనే బాధ్యత మాది. సుమేధ నీ దగ్గర్నే ఉండి సేవలు చేస్తది. దైర్నం సెడద్దు. మన్సుల ఎస్మంటి రంది పెట్టుకోకు. అట్లైతెనే జల్దిన కోలుకుంటవ్‌’’ అనుకుంట సునీల్‌ జీవన ఆయురేదం దవకాన డాక్టర్‌ తోటి మాట్లాడిండు. తాను జి.బి.సిండరోమ్‌ వైర్స్‌ పాకిన గిసోంటి రోగుల్ని పత్తేకంగ కేర్ల (కేరళ) పాంతం వైద్గం (వైద్యం) లెక్కనే టీట్‌మెంటు చేత్తనని సెప్పిండు. కేర్లకెల్లి తెప్పిచ్చిన ఆయురేద నూనెతోటి మాలిష్‌ చేయిత్తనని ఒక నెల లోపల్నె కనకమ్మ పరిస్థితిల మార్పు అత్తదని, రెండు నెల్లలోపల్నే తాను నడిచేలా చేత్తనని భరోసా ఇచ్చిండు డాక్టర్‌. ఒక ఆయాను సుత ఏర్పాటు చేసిండు.
      కనకమ్మ దవకాన్ల చేరిన తెల్లారి తన బిడ్డ రమ్య కండ్ల ముందర అగుపడెటాల్లకు ఇది కలగిట్లనా ఏంది? అన్నట్టు సూడబట్టింది. కనకమ్మను సూడంగనె రమ్య కెక్కడలేని దుక్కం రాబట్టింది. కలగాదు బిడ్డ నిజంగనే తన ముందర నిలబడ్డ దనిపియ్యంగనే దెబ్బకు రోగం పోయినట్లు లేవబోయింది కనకమ్మ. కాని లేవశాతగాలె. తల్లి అవత్త సూసి రమ్య తల్లి మీదపడి గొల్లుమన్నది. సుమేధ ఓదార్చసాగింది.
      సునీల్‌ను సూసుకుంట కండ్లతోనే ‘నా పానం నిలబెట్టినౌ కొడుకా’ అన్నట్లు సూడబట్టింది కనకమ్మ. నిత్తె కేర్ల నూనెతోటి మాలిష్, దినం తప్పించి దినం కరెంటు షాకులిచ్చుడు, యాయామం. ఈటికి తోడు సుమేధ సొంత తల్లి లెక్క అర్సుకొనడంతో అనుకున్న గడువు కంటె ముందే కనకమ్మ వాకరు పట్టుకొని నిల్సుండడం, మెల్లంగ, మెల్లంగ అడుగులేయడం చూసి డాక్టర్‌ ఆశ్చర్యపోయిండు. ఆ గొప్ప సునీల్, సుమేధలకే దక్కుతదని చెప్తాంటే కనకమ్మ రెండు చేతులెత్తి సునీల్‌కు దండం బెట్టింది.
      ‘‘కాదమ్మా, గొప్పదనమంతా నా సెల్లెలు రమ్యదే. తాను ఒఠ్ఠి మనిషిగాకున్నా సుమేధకు సారగంల సాయం సేసింది’’ అంటూ కనకమ్మ చేతులు పట్టుకొని సంబురపడబట్టిండు సునీల్‌. 
      కనకమ్మ డిచ్చార్జి అయింది. ఇంట్ల కడుగుపెట్టంగనే ఇద్దరు పిల్లలు ‘‘నాయనమ్మా!’’ అనుకుంట ఉర్కచ్చిండ్లు. ఎన్కాల్నె సిరునవ్వుల తోటి సుమేధ. పిల్లలను గుండెలకొత్తుకుంట సుమేధ వంక నోరు తెర్చి సూడబట్టింది కనకమ్మ. ‘ఇంత చిన్న వయసుల ఇద్దరు పిల్లలా?’ అన్నట్లు.
రమ్య, సునీల్‌ ఒక్కతోటోల్లే. కనకమ్మ సూపును తెలుసుకున్న సుమేధ ‘‘ఈ సందుల మా ఇంటిపక్క పాతమిద్దె కూలి తల్లిదండ్రులు సచ్చిపోతె అనాదలైన ఈ పిల్లలను సాదుకుంటానం. బాబుపేరు అవినాష్, పాపపేరు అనూష. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. పెండ్లయిన కొత్తలో కారు ప్రమాదం జరిగింది. గర్భసంచి తీసెయ్యకుంటే నా పానానికే పమాదమని ఆప్రిషన్‌ సేసి తీసేసిండ్లు’’ అని చెప్తాంటె కనకమ్మ, రమ్యలు బీర్పోయి ఇనబట్టిండ్లు.
      ఏనాటి అనుబందమో! ఇసోంటి మంచి మనుసుల ఇంట్ల అడుగు పెట్టుడు అని మన్సులో దేవున్ని మొక్కుకుంట కండ్లు మూసి తెర్సెటాల్లకు ఎదురుంగ గోడకు పూలదండేసి, దీపం ఎలిగిచ్చి ఊదుబత్తీలు పెట్టిన నిలువెత్తు పోటువ కన్పిచ్చింది. కనకమ్మకేదో యాదికత్తానట్టు కాబట్టింది.
      సునీల్‌ వంక సూసింది.
      ‘‘అవునమ్మా, డాక్టర్‌ లచ్చుమయ్య మానాయన. ఈ మద్దెనే కాలం సేసిండు. మీ బతుకు పయనాన్ని సూసుకుంటనే ఉండేటోడట. ‘మనమెంత సేసినా తక్కువే. కనకమ్మ బాకి తీరనిది’ అని నాతోని అనేటోడు. ‘ఆ మహాతల్లి ఇప్పుడు ఆపదలో ఉంది వెళ్లి ఆదుకోరా’ మాకు సెప్పిన ఆకరి మాట అదే. చాతిల నొప్పచ్చింది. మమ్మల్ని ఇడ్సి ఎళ్లిపోయిండు. నాయన దినాలెల్లినంక నేను హరి ఇంటికి వచ్చిన. అప్పుడే హరి నిన్ను రోయిని దవకానకు తీసుకపోంగ సూసి మీ ఎన్కాల్నె అచ్చిన. హరి దవకాన కెల్లి బైటికి పోవుడు, గిరిని కలుసుకొని మాట్లాడుకొనుడు, ఏందో కీసులాడుకుంట ఇద్దరూ కోపంగా బైటికి ఎల్లిపోవుడు సూసిన. ఇంగత్తలేరు, అంగత్తలేరు.
      ఆ డాక్టర్‌ మానాయన దోస్తే. ఇషయమంత సెప్పి ఒప్పిచ్చి నిన్ను తీసుకచ్చిన. నేను పుట్టిన సెనంలనే తల్లిని పోగొట్టుకున్న దురదుట్టవంతున్ని. నన్ను మీ పొత్తిల్లకు తీస్కొని మీ అమ్మాయి రమ్యతోబాటు నాకూ పాలిచ్చి నాకు పానదానం సేసావని నాయన నీ గురించి  గొప్పగా సెప్పెటోడు. నాకు పోతపాలు యిమిడేవి గావంట. పెయ్యంత దద్దుర్లు లేసేటియట. కక్కుడు, నీల్లకు నీల్లు పారుకునేదట. రోజురోజుకీ నా పానం దగ్గర పడబట్టిందట. ఇంక నేను బతుకనని నా మీద ఆశ వదులుకున్నడట మానాయన. వచ్చే పానం... పోయే పానం అన్నట్లు నేను గావర చేత్తాంటె నాకు తల్లి పాలు పట్టాలని నువ్వు తెలుసుకొని నువ్వు సేసిన సాయం నా జన్మల తీరని బాకి. ఏ జన్మల బంధమో. నేను తిర్గి బతికి బట్టకట్టిన. ‘ఒక డాక్టరుగా నేను చేయలేని పనిని ఆ మహాతల్లి సేసింది. తన బిడ్డతోబాటుగా నీకూ పాలిచ్చింది. ఇప్పుడామె పరిత్తితి అద్వాన్నంగా తయారైంది. కొడుకులు ఆమె బాగోగులు పట్టించుకుంట లేరు. ఆమెను ఆదుకొని కొంతలో కొంతైనా నీ బాకీ తీర్సుకో’మన్న తన ఆఖరి మాటలే నన్ను నీ కాడికి తీసుకచ్చినై. నీకు కొడుకులను, మనుమన్ని సూడాలనే బుద్ధి పుట్టినప్పుడల్లా నేను తీస్కపోయి సూయించుకొని వత్త. నీ దీవెన్ల తోటి సచ్చిబతికిన నేను మీసేవ సేసుకుంట’’ అనుకుంట సునీల్‌ బతిలాడ్తాంటె కనకమ్మ మనసు ఎన్నపూసోలె కర్గిపోబట్టింది. తన కడుపులో పుట్టకపోయినా సునీల్‌ సూయించే పేమ తన రెండు కాల్లను కట్టేసింది.
      కంట్లె నీల్లు తుడ్సుకుంట కన్నద్దాలు సదురుకుంటాంటె కిటికీల కెల్లి హరి, గిరి దొంగ పిల్లుల లెక్క నక్కి, నక్కి తమ మాటలన్ని ఇంటానట్లు కనకమ్మ పసిగట్టింది.

* * *

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోని


కొత్త పలక

కొత్త పలక

కుప్పిలి సుదర్శన్‌bal bharatam