రేపటి బతుకు కోసం...

  • 240 Views
  • 5Likes
  • Like
  • Article Share

    పాలకొల్లు రామలింగస్వామి

  • ఉపాధ్యాయుడు,
  • పార్వతీపురం, విజయనగరం.
  • 9441416049
పాలకొల్లు రామలింగస్వామి

తన నోటికందిన కూడు నేలపాలైందని ఊరి రైతాంగాన్నెదిరించాడు ఓ జాలరి.. ఆ రైతులు తనపై పగబట్టారని తెలిసినా వాళ్లకు ఉపకారమే చేశాడు.. ఎందుకూ అంటే...
తెల్లవారింది.
ఊరంతా గుప్పుమంది. గూలవీధి ఆగ్రహావేశాల్తో భగ్గుమంది. ఎక్కడ చూసినా గుసగుసలు, వాదోప వాదాలు. రచ్చబండ మీద.. శివాలయం అరుగు మీద... టీపాకల్లోన.. రామ్మందిరంలోన... నూరుపుకళ్లాల్లోన... కిరాణా కొట్టు దగ్గిర... అన్నిచోట్లా ఒకటే చర్చ.
      గ్రామానికి తూర్పునున్న బుక్కూరు చెరువు వైపు జనం గుంపులు గుంపులుగా సాగుతూ... అట్నుంచి అనేక సందేహాలై తిరిగొస్తూ చెరువు దగ్గర అరుపులు... కేకలు... శోకాలు... శాపనార్థాలు..
ప్రత్యర్థుల్లా ఎదురెదురుగా రైతులు, మత్స్యకారులు. ఎవరూ తగ్గడం లేదు. ఎంతకీ తెగడం లేదు. అంతా ఉద్రిక్తత.
      మధ్యాహ్నం దాటింది. వాతావరణం చల్లబడింది కానీ ఊరింకా చల్లబడలేదు. గ్రామంలోకి వేసిన తార్రోడ్డు వెంట ఒక కిలోమీటరు మేర ఆవరించుకొని ఉంటుంది బుక్కూరు చెరువు! దాన్ని దాటితే పచ్చని పొలాలు, మామిడి తోటలు, ఇంకా పైన కళ్లాలు, విశాలమైన వీధులు.
సగానికి పైగా తూటిబడ్డు చెట్లు, కనువిందు చేస్తూ నీట్లో తేలే తామరాకులు ఆ చెరువుకు సహజాభరణాలు. చుట్టుపక్కల అయిదారు పల్లెల వ్యవసాయానికి అదే ఆధారం. ఇదీ నిన్నటి పరిస్థితి... కానీ నేడలా లేదు. సగానికి తగ్గిన నీరు, దానిపైన తేలిన బూడిదరంగు నీటితెట్టు, గోగునార కట్టల దుర్గంధం, ముసిరిన దోమల మధ్య అసంఖ్యాకంగా, చిందరవందరగా తేలుతున్న చచ్చిన చేపలతో అంతా అస్తవ్యస్తంగా ఉంది. 
      జనంలో... ఒక్కసారిగా కలకలం... రహదారి మీద జీపొచ్చి ఆగింది. దాంట్లోంచి మత్స్యశాఖ ఇన్‌స్పెక్టర్, ఎంపీడీఓ, తహసీల్దారు, ఇంకొందరు మండల అధికారులు దిగి గట్టుపైకి వెళ్లేరు. ఆ వెనకే పత్రికా విలేకర్లు, ప్రజాప్రతినిధులు. అంతా పరిశీలించేరు. రకరకాల భంగిమల్లో ఫొటోలు తీసేరు. కుర్చీలెవరో తెచ్చి వేసేరు. కూర్చున్నారంతా! జనమంతా గుమిగూడేరు. దర్యాప్తు మొదలైంది. ‘‘చేపలెప్పుడు చచ్చిపోయాయి?’’ తహసీల్దారు గొంతు ఖంగుమంది. 
      ‘‘కోడిగుజ్జామున. మా అప్పడు దద్ద దొడ్లోకని సెరువుగట్టికి వొచ్చినాడు బావ్‌. సూత్తే పున్నమి ఎలుగులో.. సచ్చిన సేపలన్నీ తేలి అవుపడ్డాయి. ఎలగ సచ్చిపోనాయో యేటోగాని మా బతుకులు బుగ్గైపోనాయి’’... గుంపులోంచి ఎవరిదో సమాధానం.
      ‘‘చేపలెలా చచ్చిపోయాయో... ఎవరైనా చెప్పగలరా?’’
      ‘‘నాను సెప్తాను బావ్‌’’ పట్టేసిన గొంతును సవరించుకుని అన్నాడొకతను కాసేపటికి. 
      నిశితంగా అతణ్ని చూసేడు తహసీల్దారు. ఎండిన జీడిపిక్కలాంటి దేహం, కన్నీటి చారికలు కట్టిన ముఖం, ఎర్రబారిన కళ్లతో... ఘనీభవించిన దుఃఖం లా ఉన్నాడతను. పేరు పరసయ్య.
      ‘‘చెప్పు..’’
      ‘‘ఈ సెర్లోన ఊరి రైతులంతా జనువులు వోరేసినారు బావ్‌. అదే మా కొంప ముంచింది. అందికే సేపలన్నీ సచ్చిపోనాయి’’ స్థిరంగా అన్నాడు పరసయ్య. తహసీల్దారుకు నమ్మకం కలగలేదు. మళ్లీ ప్రశ్నించేడు.
      ‘‘అవును బావ్‌. నాను సెప్పింది నిజం. జనువులు వోరబెడ్డం వల్ల నీరు సిక్కనైపోద్ది. పులిసిపోయి కంపు కొడతాది. నలుపులైతే పర్నేదు గానీ తెలుపుల కదిపడదు. తట్టుకోనేవు. సెరువు నిండా నీలున్నా బాగున్ను. ఎటొక్కాసి ఎలిపోతాయి. కానీ నీలే లేనప్పుడు ఏటవుతాయి? సచ్చిపోవా? తన పాతికేళ్ల చేపల పెంపకం అనుభవంలో చోటు చేసుకున్న విషాద సంఘటన ఇదేనని వివరించేడు నలభైయేళ్ల పరసయ్య. ‘‘తెలుపులంటే... ఏయే చేపలోయ్‌?’’ ఎవరో విలేకరి గొంతులో ఉత్సాహం. ‘‘బంగారు పాప, బొచ్చు, రాగెండి, కట్ల, ఎరమేను, రోయి, సిలవరి కింగు, గడ్డిసేప, బీపులైటు, వొల్లంకిల్ని తెలుపులంతారు బావు. అన్నిటికన్నా బంగారు పాపలే మంచివి. బరువెక్కువ. డబ్బులొత్తాయి. ఇందలున్నవన్నీ అవే బావ్‌!’’
      ‘‘చెరువులో ఇంత తక్కువ నీళ్లున్నాయేంటీ?’’ 
      ‘‘మరదేగదా సెప్పుతన్నాను. కరమంటే కప్పకి కోపము, ఇడమంటే పాముకి కోపములాగైంది మా బతుకు. నీళ్లన్నీ రైతులు పొలాలకి కట్టేసేరు. మామేటవుతామో ఆలోసించనేదు’’... పరసయ్య ఆవేదన వాతావరణాన్ని వేడెక్కించింది. కొంత మందిలో ఆవేశం కట్టలు తెచ్చుకుంటోంది.
      ‘‘ఏట్రాయ్‌ పర్సిగా.. ఇందాకట్నుంచి సూత్తన్నాను. ఏటలాగ నీలుగుతన్నావేటి? సెరువుండి దేనికిరా? నీలు కట్టుకోవద్దా? అదునులోని వొరసాలు పడక, సెర్లోని నీటిని కట్టుకోక.. సేలేటవ్వాలి!? ఎనకా ముందు సూస్కొని మాట్లాడు!!’’ కోపంగా అన్నాడు నారన్నాయుడు. అతనో పార్టీ యువనేత.
      ‘‘పర్సిగా... ఏటి సంగతి? తందనాలాడతన్నా వేటి.. తప్పంతా మాదే అయినట్టు ఎగిరెగిరి పడతన్నావేటి? సెరువు మీదొక్కలిదే కాదు. అందరిదీ. ఏ సిల్లంగో, సీటకమో పెట్టేసి సేపల్ని సంపీసేరేటో. ఎవులికి తెల్సు’’... ఊగిపోయేడు సీతంనాయుడు. అతనే ఊరిపెద్ద. పైగా సర్పంచ్‌ గారి పెనిమిటి, కనుక అతని మాటకి ఎదురులేదు.
      జనంలో ఒక్కసారి అలజడి. మళ్లీ పరస్పర నిందారోపణలు. పరిస్థితి అదుపు తప్పుతోందని తాసీల్దారు లేచేడు.
      ‘‘దయచేసి అంతా సంయమనం పాటించండి. గొడవలు పడొద్దు. ఈ చేపల మృతికి కారణాలు తేల్చాల్సింది మీరో నేనో కాదు, ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు. కాబట్టి అంతవరకు ఓపికపట్టండి’’... చెప్పాల్సింది చెప్పి కూర్చున్నాడు. గొడవ సద్దుమణిగింది. మళ్లీ ప్రశ్నల పరంపర మొదలైంది.
      ‘‘చేపల రేటు ఎంత ఉండొచ్చు?’’
      ‘‘సుమారు లచ్చ రూపాయలు ఉంతాయ్‌ బావ్‌. అప్పులు సేసి వొదిలిన సేప్పిల్లల్ని ఈ అయిదు మాసాలూ కంటికి రెప్పల్లాగ కాసినాం. సరిగ్గా పంట సేతికందికొచ్చిన టయానికి, ఇదిగో ఇలాగైనాది. ఇక మాకేటి దిక్కు?. పిల్లా జెల్లాతో మావెలాగ బతకాల?..’’ అంటూ అందిన చేపల్ని ఒడ్డున పడీసి గొల్లుమన్నారు గంగపుత్రులు. 
      మత్స్యశాఖ ఇన్‌స్పెక్టరు చేపల్ని పరీక్షించి జనం ముందుకు వచ్చేడు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ చెరోపక్క నిలబడ్డారు. ‘‘దయచేసి అంతా ప్రశాంతంగా వినండి. ఆవేశకావేశాలకు లోనుకావొద్దు. గోగుల ఊరవేత వల్ల చెరువునీరు కలుషితమైంది. దాని మూలాన చేపలు ఇన్‌ఫెక్షన్‌తో చచ్చిపోయాయి. చెరువులో నీళ్లు లేకపోవడమూ మరో కారణమే. దాన్ని కాదనలేం. చేపల చెరువుల్లో గోగుల ఊరవేత నిషిద్ధమని ఎన్ని సార్లు హెచ్చరించినా మా మాట ఎవరూ ఖాతరు చేయడం లేదు’’... కొంచెంసేపు ఆగేడు ఇన్‌స్పెక్టరు. వ్యతిరేక నినాదాలతో రైతులంతా అడ్డు చెప్పేరు. దాంతో అతను సర్దుకున్నాడు. ‘‘దయచేసి అర్థం చేసుకోండి. ఇది చాలా సున్నితాంశం. ఏ ఒక్కరి ప్రయోజనాలు ఇందులో దెబ్బతినకూడదు. రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని ప్రభుత్వానికి లేఖ రాస్తాను. ఇది తప్ప నేను చేయగలిగిందేమీ లేదు’’... ఇన్‌స్పెక్టర్‌ వివరణకు శాంతించేరు రైతులు. విన్నదీ, చూసిందీ రాసుకునెళ్లారు విలేకర్లు. 
      ‘‘దర్యాప్తు నివేదికను కలెక్టరు గారికి నివేదిస్తాం. రెండు రోజులు పోయాక ఆఫీసుకు రండి. ఏ విషయమూ చెబుతాను’’... జీపెక్కుతూ అన్నాడు తాసీల్దారు.
‘‘మీదయ బావు!’’ చేతులు జోడించేరు జాలర్లు. అధికార్ల జీపు కనుమరుగైంది. 

*  *  *

      ఉండచుట్టి విసిరేసినట్టు గ్రామంలో ఒక మూలనుంటుంది గూలవీధి. వెదురు తడపలతో గృహోపకరణాలు చేస్తూ కొందరూ, సిలపలతో వలల్ని అల్లుతూ మరికొందరూ.. ఎవరి పనుల్లో వాళ్లు తలమునకలై ఉన్నారు. ఆ వీధిలో ఓ గుడిసెలో భగభగా మండుతోంది కటిక్కర్రలపొయ్యి.
దాన్నుంచి నేరుగా దించిన కుండను నేలపైనున్న దాగర్లో మెల్లగా ఒంపింది అప్పమ్మ. బెల్లం పాకంతో కలగలసిన వేడి వేడి మురీలను కాలే చేతుల్తో గబగబా ఉండలుగా చేసి మానిలో వేసింది. ‘పాతవి పాతిక, కొత్తవి పాతిక’ కలిపితే మొత్తం ఏభై. నాలుగు కుంచాలు దాన్నిం వొత్తాయి గావాల. పదిరోజులు సరిపోతాయి. అతగానొచ్చేలోగా ఈటిని అమ్మేసి గప్పున తిరిగొచ్చీయాల’’ నెత్తిమీద మానిని పెట్టుకుని అనుకుందామె.
      నెమ్మదిగా కళ్లాలవైపు దారితీసింది. నూర్పులు జోరుగా సాగుతున్నాయి. ఎటుచూసినా దుమ్మూ ధూళీ, పశువుల అదిలింపులూ, ఎత్తైన గడ్డిదిబ్బలు, ధాన్యం బస్తాల వరసలు.
      ‘‘అప్పమ్మా... ఇలాగరమ్మీ!’’ ఎవరిదో నాయిరాలు పిలుపు. దుమ్మూ ధూళీ నిండిన మనుషుల్తో కళ్లమంతా సందడి!
      ‘‘ఎలాగ ఇస్తన్నావమ్మీ ఉండలు’’ అడిగిందామె.
      ‘‘కుంచానికి పన్నెండమ్మా!’’ మాని కిందికి దించుతూ అంది అప్పమ్మ.
      ‘‘ఏవీ, ఎంతేసి ఉన్నాయో సూపించిమీ!’’ 
      మూత తీసింది అప్పమ్మ. 
      ‘‘సిన్నవే ఉండలు. పదిహేనిచ్చిద్దు’’
      ‘‘నేదమ్మా... కిట్టదు’’
      ‘‘సర్నే... ఇద్దరిదీ కాదు. పద్నాలుగిచ్చీ’’
      బేరం కుదిరింది. నెయ్యుండల్ని లెక్కపెట్టి ఆమె గిన్నెలో వేసింది. కుంచం ధాన్యాన్ని సంచిలో పట్టించుకుంది అప్పమ్మ.
      ‘‘అప్పమ్మా... మొన్నామజినైన తగువేటయ్యింది’’ అడిగిందామె.
      ‘‘ఏటిసెప్పవంతావమ్మీ... మా పాట్లు. గరుగుబిల్లనీ, పార్తుపురమనీ నిన్నటిదాకా తిప్పించినారు. ఈ పొద్దేమో ఇజియనగరం రమ్మన్నారు. మావోల్లంతా ఎల్లినారు. ఇంకా రానేదు... ఏటోనమ్మా ఆల్దయ...’’
అప్పమ్మ నిర్వేదం చూసి ఆమెకు జాలేసింది.
      ‘‘ఏమాటకామాటే సెప్పుకోవాల. మొన్న మీకు జరిగింది అన్నేయమే. పది రూపాయలు పోతేనే ఉసూరుమంతాది గదా... అలాంటివి ఏలుకుఏలు నీటి పాలైపోతే గోరం కాదూ... ఆ భగమంతుడు మీయందు ఎలాగున్నాడో యేటో సూడాల.. ఎల్లిరా అప్పమ్మ సేనసేపట్నుంచి నిలబడి పోనావు’’ ఓదార్చిందామె.
      అప్పమ్మ ఇంటికి చేరేసరికి గుమ్మంలోనే కూర్చుని ఉన్నాడు పరసయ్య.
      ‘‘ఔనో ఎంత సేపయింది ఇంటికి వొచ్చి’’ గుడిసెలోకి దూరుతూ అంది అప్పమ్మ.
      ‘‘పావు గంటపైనే అయ్యిందిలే’’ కాలు చేతులు కడుక్కోవడానికని పెరట్లోకి తోవ దీస్తూ అన్నాడు పరసయ్య. మానిని అటక మీద పెట్టి చకచకా కంచంలో అన్నం, చారు, రెండు పిండొడేల్ని పెట్టి తెచ్చి ముందు పెట్టింది. క్షణాల్లో అతను ఖాళీ చేసి... నులకమంచం మీద చేరబడ్డాడు.
      ‘‘ఎల్లిన పనేటయ్యింది?’’
      తనకెదురుగా కూర్చుని ప్రశ్నించిన భార్యవైపు నిస్తేజంగా చూసేడతను.
      ‘‘ఏటంటే ఏటిసెప్పమంతావు. దరిద్దంగొట్టోడికి దండులో కెల్లినా కూడు కరువంటే ఇదే. తలరాత మారుద్దా సెప్పు?’’ అన్నాడు.
      భర్త నిస్పృహ చూసి మళ్లీ అడిగిందామె... ‘‘అసలింతకీ... అక్కడేటి జరిగినాది?’’
      ‘‘కలెట్రుగారు నేేరు. కేంపు ఎల్లేరట. రిపోట్రు జాయింటి కలెట్రుగారు సూసి నారు. అన్నీ ఇన్న తర్వాత ఇనుసురెనుసు లాంటిదేటైనా సేసినారా అన్నారు. లేదన్నాము. కప్పను తన్నిన పామునాగ అతగాడు పల్లకుండిపోనాడు... సేన్సేపు... ఏటనకుంట’’
      ‘‘ఇనుసురెనుసు.. అంటేటి?’’
      ‘‘మనకి ఎల్లయిసీ పాలసీల్లాగా సేపలకి ఉంతాయట. మనకింతదాక తెలీదు. సెయ్యనేదు. ఏమో మునుముందు సెయ్యాలగావాల’’ అన్నాడు పరసయ్య. 
      ఏం జవాబివ్వాలో తెలీక మౌనంగా ఉండిపోయింది అప్పమ్మ.
      ‘‘ఔనువోయ్‌ బావా. తెలిగేసి ఉన్నావా.. తొంగోనున్నావా?’’...అంటూ పక్కింటి చిన్నోడు పరసయ్యతో హాస్యమాడాడు.
      ‘‘గాబరెందుకు పడతావరా నాయన. ఈలజ్జుగుజ్జులేవో తేలిపోతే మనపనిక ఇంటిల తొంగోడమేనిలే’’... వెటకారమాడేడు పరసయ్య మంచం మీద లేచి కూర్చుంటూ.
      ‘‘బావా... తెలీకడుగుతున్నా. మన డబ్బులు మనకొత్తాయంటావా?’’ 
      ‘‘ఇంకా అర్థం కాలేదురా సన్నాసీ. ఇనుసురినుసుంటేనే డబ్బులని అన్నారంటే అర్థమేటి? లేపోతే రావనే కదేటి. పైకి రాత్తాము, డబ్బులొత్తే ఇత్తాము అంటే అయన్నీ వొట్టిమాటలు. పనయినప్పుడే అయ్యిందనుకోవాల’’ అన్నాడు పరసయ్య. అలా అక్కడో చిన్నపాటి సమావేశమై క్షణాల్లో వాడిగా, వేడిగా మారింది. చివరికి న్యాయపోరాటం తప్ప మార్గం లేదని అభిప్రాయానికొచ్చారు.
      ‘‘వొరేయ్‌ గుంటల్లార... పేదోడి కోపం పెదవికి సేటంతారు. పెద్దోల్లతో తగువు. మనం నిలబడగలమేటి?! పోన్లెండి ఆలపాపాన ఆలే పోతారు. వొకేల ఏ దానికేదైనా అయితే మనకే కస్టము. వూర్లోన ముకముకాలు సూస్కో లేమురా!’’ భవిష్యత్తుపై అనుమానాల్ని ఊహించుకుంటూ అభిప్రాయపడింది వృద్ధతరం. 
      ‘‘అలగని నిండా మునిగి పోతుంటే.. మనకెందుకులే అని సూస్తూ ఊర్కోమంతావా? రేప్పొద్దున్న ఊరొగ్గీసి పారిపోండ్రా అంతారు. పారిపోతామా? ఏం మాట్లాడుతన్నారు..? ఇలాగ పెతిదానికీ బయపడిపోబట్టే మన బతుకులు ఇలగున్నాయ్‌. ఏటైతే అదయ్యింది. తర్వాత సూసుకుందుము. కేసెయ్యాల, ఆల సంగతేంటో సూడాల’’ ముక్తకంఠంతో పట్టుబట్టింది యువతరం. 
      తలొంచకతప్పలేదు పరసయ్యకు. మర్నాడు చందాలు పోగయ్యాయి. అప్పు చేసి కొంతమంది, ఇంట్లో వస్తువులు తనఖా పెట్టి మరికొందరు డబ్బులిచ్చేరు. మూకుమ్మడిగా పట్నంలో వకీలును కలిశారు. కోర్టులో కేసు నమోదైంది. 
      అనుమానితులందరికీ ప్రతివాదులుగా నోటీసులందేయి. తమ కనుసన్నల్లో, కుక్కిన పేనుల్లాగా బతికే జాలర్లంతా ఇలా న్యాయస్థానంలో తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం జీర్ణించుకోలేక రగిలిపోయింది పెత్తందారీ వ్యవస్థ.
      కోర్టుకి హాజరవ్వాల్సిన రోజు. ఉదయం ఎనిమిది గంటలకి... బస్సెక్కడానికి జాలర్లంతా స్టాపు దగ్గర నిల్చున్నారు. దాని వెనుక శివాలయం అరుగు మీద అందరిలాగే... సీతంనాయుడు, నారన్నాయుడు కూర్చున్నారు. మత్స్యకార్లను చూసి సైగ చేసుకున్నారు.
      ‘‘అవున్రా... నారన్నాయుడూ... మన చుట్టూ కుక్కల్లా తిరిగినోలకి అంత ధవిర్యం ఎక్కడ్నుండొచ్చిందిరా. ఏటి సూసుకొని అంత పొగరు. ఆలసొమ్మేదో తినీసినట్టు... కోర్టులో కేసెయ్యడమేటి? రేప్పొద్దున్ని ఏ పించినో, ఇల్లతలమో అని నా గుమ్మం ఎక్కమను. అప్పుడు సూపిత్తా తడాఖా!’’ బాహాటంగానే దుర్భాషలాడేడు సీతంనాయుడు. విషయం జాలర్లకు అర్థమైంది.
      ‘‘ఇల్లలకగానే పండగకాదు. కోర్టులో కేసేసీగానే సంబరం కాదురా. అది నిరూపనవ్వాల. అంతేకాదొరేయ్, ఊర్లో మరో సెరువునేదు. వొరసాల్లేక ఎవసాయాలు పోతాయని సెర్లోని నీళ్లు కట్టేమని కోర్టులో వాదిస్తాము. కేసు నిలబడతాదేటి? ఇదిగో... ఇప్పుడే సెబుతున్నా. తప్పయిపోయిందని కేసు ఎనక్కి తీసుకుని రాజీకొస్తే సరేసరి. లేప్పోతే ఈ ఊర్లో బతకలేరు. దెబ్బకి ఊరొగ్గీసి పారిపోవాల ఒక్కొక్కడు’’... ఆవేశంతో ఊగిపోయాడు నారన్నాయుడు. పరసయ్య సహించలేక చరచరా వాళ్ల ముందుకు వెళ్లేడు. ‘‘బావుల్లార, మీకు శతకోటి దండాలు. మీరు పెద్దోలు. చట్టం తెలిసినోలు. ఎందుకలాగ ఇందాకట్నుంచి రాలిపోతున్నారు? మీ నోటంట మరొక్కమాట వొచ్చిందంటే ఇక మామూ ఊర్కోము. తిన్నగా ఆర్డీవ కాడికెల్తాం. ఎల్లమంతరా సెప్పండి. నిండా మునిగినోడికి సలేటి. మామూ అన్నింటికి తెగించే ఉన్నాము. కానీ, బావూ, వొకమాట... మా బతుకులోని బాదేటో మీకు తెలీదు. మీరు బాగుండాలని ఎదుటోలు ఏటైపోయిన బాదనేేదన్న మీ ఆలోసన సెడ్డదని మీకు తెలియాల. అవసరమైతే మావంతా ఒకేమాట మీద నిలబడి ఎదిరించగలమని మీకు బోదపడాల. వచ్చే యేడు నుంచైనా... మా కూట్లో బుగ్గిపొయ్యకుండా మా మానాన మమ్మల్ని బతకనివ్వగలగాల. దానికోసమే ఈ కోర్టులు, కేసులు. తెలిసినాదా?!’’ సౌమ్యంగా అన్నాడు పరసయ్య.
      వినకూడని మాటేదో విన్నట్టుగా వాళ్లిద్దరూ నిశ్శబ్దమైపోయారు. అక్కణ్నించి క్షణాల్లో జారుకున్నారు.
      ‘‘ఔనర్రా... ఇక్కడున్నారా? మీ గురించి ఎక్కడని తిరగడం!?’’ అంటూ గాబరాగా వచ్చాడు చిన్నోడు.
      ‘‘ఏట్రా... ఏటైంది.!?’’
      ‘‘రోడ్డు బాగోలేదని.. రాత్తిరినుంచి బస్సులాపీసేరట. రావుపల్లి వరకే బస్సులు. ఇప్పిడే తెల్సింది’’
      ‘‘సరిపే.. మజ్జిలోన ఇదొకటా. పదండ్రా. మరెందుకునేటు!?’’ ఉస్సురుమంటూ అందర్నీ సమాయత్తపరిచేడు పరసయ్య.
      రావుపల్లికి కనీసం అరగంట నడాలి. తర్వాత బస్సు ప్రయాణం గంట. వెరసి గంటన్నర. జాలర్లంతా నడకను ప్రారంభించి అప్పటికే పావుగంటైంది. రెండు గ్రామాల మధ్య ఆకుపచ్చని... నిర్మానుష్య ప్రాంతం. దారి పొడవునా ఇరువైపులా వరికోతలు అయిపోగా మిగిలిన మొజ్జులతో ఉన్న పొలాలు, మధ్యలో అంతరపంటగా ఇప్పుడే పువ్వు కడుతున్న పెసరచేలూ అల్లిబిల్లిగా విస్తరించి ఉన్నాయి. 
      ఈ మత్స్యకారుల గుంపు తప్ప మరెవరూ లేరక్కడ. అయితే చొరబడి ఎంత సేపయ్యిందోగానీ చేను మేస్తూ... పశువుల గుంపొకటి పొలాల్లో కలిదిరుగుతూ దూరంగా కనిపించింది. అవన్నీ సీతంనాయుడు, నారన్నాయుళ్ల పొలాలే.
      ‘‘వొరేయ్, అటు సూడండ్రా. అలువుడ్ని బలువుడు కొడితే బలువుడ్ని బెమ్మదేవుడు కొట్టాడట. అలగుంది తీరవ. పోన్లే, కడుపునిండా తిననీ’’ అన్నాడొకడు గుంపులో.
      ‘‘ఆలకి... అలాగే అవ్వాల... నేప్పోతే ఊర్లోంచి తన్ని తగిలేత్తామంటారా. మన ఉసురు తగల్దా. అక్కడేటీ జరగనేదు. మనం సూడనేదు. పదండి, పదండి. మనకెందుకు?’’ తొందరచేసేడు మరొకడు.
      ఈ మాటలు పరసయ్య చెవినబడ్డాయి. 
      ‘‘బాగుందిరా మీ వరస. ఆల్తో మనకి తగువులుంటే మాత్తరం మజ్జిలో ఈ పెసరసేనేటి సేసింది?! ఆలకి నస్టమొస్తే మన కష్టం తీరిపోద్దా. అదేం తీరవరా? డబ్బెంత పోసినా పోయిన పంట తిరిగిరమ్మంటే వొస్తదా? సేతికందిన కూడు నోటికందక నానాయాతన పడుతున్నోలం. మనలాంటోల నోట రావాల్సిన మాటలు కావర్రా..’’ అన్నాడు పరసయ్య. 
      మిగిలినోళ్లు అదోలాచూసేరు. కానీ అప్పటికే పశువుల్ని తోలడానికి పొలాల్లోకి పరుగుపరుగున దారితీసేడు పరసయ్య..!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోని


కొత్త పలక

కొత్త పలక

కుప్పిలి సుదర్శన్‌bal bharatam