నవ్వు

  • 442 Views
  • 3Likes
  • Like
  • Article Share

    వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు

  • హైద‌రాబాదు
  • 8374846248
వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు

యాంత్రిక జీవనంలో వెకిలితనం, అసూయాద్వేషాలు, అసభ్యత, నిస్సహాయతలే నవ్వడానికి కారణాలు.. అలాంటిది అసలు నవ్వే కాదంటూ స్వచ్ఛమైన నవ్వు కోసం ఓ యువకుని అన్వేషణ...
ఈ సృష్టిలో
నవ్వే అదృష్టం ఒక్క మానవుడికే ఉందని, దానివల్లే ఆనందం, ఆరోగ్యం పొందుతాడనీ చిన్నప్పటి నుంచి వింటున్నాను. కానీ, ఈ నవ్వడం ఎలా, దానివల్ల పొందే ఆనందం ఎలా ఉంటుందని తెలుసుకోడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాను. బహుశా, అనాథను కనుకే నాలో పేరుకుపోయిన నిరాశ, నిస్పృహలు నవ్వుకు దూరం చేశాయనుకుంటున్నా. అందుకే ఈ ‘నవ్వు’ సంగతేంటో తేల్చుకుందామనుకున్నా.

* * *

      ఆ మధ్య ఒక మహానుభావుడు మనస్ఫూర్తిగా పళ్లికిలిస్తే అదే నవ్వు అని చెప్పాడు. ఇలా ఇతర జీవరాశులు ఎంత ప్రయత్నించినా చేయలేవని అన్నాడు. సరే, ఇదేదో ప్రయత్నిద్దాం. నవ్వు వల్ల వచ్చే ఆనందం లేకపోయినా, కనీసం నా నవ్వునైనా చూసుకుందామని మనసు లగ్నంచేసి, అద్దం ముందు కూర్చుని ఎంతో మురిసిపోతూ, రకరకాల హావభావాలతో పళ్లికిలించాను. ఎంత పళ్లికిలించినా, అది నవ్వులా అనిపించలేదు. పైగా అద్దం నా చిన్నపళ్లని కోరల్లా చూపిస్తూ, నా అందమైన ముఖాన్ని రాక్షసుడిలా మార్చింది. వెంటనే ఆ ప్రయత్నం విరమించాను.

* * *

      చిన్నప్పుడు నా మిత్రులు చెప్పిన విషయం ఒకటి గుర్తుకొచ్చింది. కితకితల వల్ల భలే నవ్వు వస్తుందని. చిన్నప్పుడు ఎలాగూ నవ్వు రాలేదు. ఇప్పుడోసారి ప్రయత్నిద్దామనిపించింది. పొట్టలో, పక్కటెముకల్లో వేళ్లని నాట్యమాడించాను. ఊహూ! నవ్వు రాలేదు. కితకితలు మనం పెట్టుకుంటే మనకు నవ్వు రాదనిపించింది. ఇలా లాభం లేదనుకొని మా పక్కింటాయన్ని పిలిచి కితకితలు పెట్టమన్నాను. పాపం, ఆయన నాకు నవ్వు తెప్పించాలని ఓ అరగంట శ్రమించాడు. అప్పుడొచ్చింది విపరీతంగా నాకు.. నవ్వుకాదు, పక్కల్లో నొప్పి.

* * *

      ఓ రోజు మా ఎదురింట్లో  దొంగలుపడ్డారని పరామర్శకెళ్లాం. ఏవేవో పోయాయని వాళ్లేడిచారు. తర్వాత బైటికి రాగానే చాలామంది పెదాలు కాస్త విచ్చుకున్నాయి. వాళ్ల పళ్లు కనబడ్డాయి. వాళ్లు మనసులో ఆనందం పొందుతున్నట్లు గ్రహించాను. అప్పుడనిపించింది, ఎదుటివాడి కష్టంలో వచ్చే నవ్వులో కూడా ఆనందం ఉందని. పైశాచికానందం అంటే ఇదేనేమో? కానీ, ఇలాంటి నవ్వుల్లో వచ్చే ఆనందం నాకక్కర్లేదనిపించింది. అసలైన నవ్వుకోసం నా ప్రయత్నాలు సాగించాను.

* * *

      మొన్నామధ్య నా సహోద్యోగి నాకో సలహా ఇచ్చాడు. ఊళ్లోకి జంతువులతో విన్యాసాలు చేయించే గుంపు ఒకటి వచ్చిందని, ఆ విన్యాసాల వల్ల తప్పక నవ్వు వస్తుందనీ పైగా కేతిగాడు కడుపుబ్బ నవ్విస్తాడనీ. సరేనని ప్రదర్శనకి వెళ్లాను. ఎన్నో రకాల జంతువులు రకరకాల భంగిమల్లో విన్యాసాలు చేస్తున్నాయి. నా చుట్టు పక్కలవాళ్లంతా పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. నాకు మాత్రం నవ్వు రావడంలేదు. ఇంతలో కేతిగాడొచ్చాడు. ఏవేవో చేష్టలు చేస్తున్నాడు. జనం మళ్లీ పగలబడి నవ్వుతున్నారు. ఊహూ! నాకు మాత్రం నవ్వురావడం లేదు. పైకి విన్యాసాలు చేస్తున్నా, ఎక్కడో వాళ్ల మనసుపొరల్లో బాధ కనిపించింది నాకు. అక్కడింక నవ్వు రాదని నిర్ధరించుకున్నాను.

* * *

      నా స్నేహితుడికి నా బాధను చెబితే, కొన్ని సూచనలిచ్చాడు. హాస్య ప్రధాన సాహిత్యం చదవమనీ, హాస్య చలన చిత్రాలు చూడమనీ. చాలా సాహిత్యం చదివాను. ఎన్నో చలన చిత్రాలూ చూశాను. చాలావరకూ వ్యక్తులనో, కులాన్నో, మతాన్నో కించపరచడమే హాస్యమన్నాయవి. మంచి సాహిత్యంవల్ల, చిత్రాలవల్ల కొంత ఆహ్లాదమనిపించినా, నాక్కావాల్సిన నవ్వును నాకివ్వలేకపోయాయి. విషయం వాడికి చెప్పాను. ఊళ్లో ఉన్న ‘బురిడి’ చిత్రశాలలో ఆడుతున్న ‘నవ్వకపోతే పోతావ్‌’ చిత్రం బావుందని చూడమన్నాడు. సరే ఇదీ ప్రయత్నిద్దామనిపించింది. ఆ చిత్రం పేరు మాత్రం నన్ను బెదిరిస్తున్నట్టనిపించింది. యమరద్దీలో ఎలాగోలా లోపలికి దూరాను. ఓ సన్నివేశంలో కథానాయకుడు గోడమీద మూత్రం పోయగానే హాలంతా నవ్వులు. ఆశ్చర్యమేసింది. నాకసలు నవ్వే రాలేదు.
      ఇహ లాభం లేదని ఓ మానసిక వైద్యుణ్ని సంప్రదించి చరిత్రంతా చెప్పాను. ఓపిగ్గావిని, నా పుట్టుక, ఒంటరితనమే, నాకు నవ్వు రాకుండా మనసు కరడుగట్టడానికి ముఖ్య కారణాలని తేల్చి, నోరు తిరగని ఓ రోగం పేరును నాకు అంటగడుతూ పెళ్లిచేసుకుంటే పరిష్కారం దొరుకుతుందన్నాడు. పెళ్లితో సమస్యకు పరిష్కారమా అని ఆశ్చర్యంగా అడిగిన నాకు ‘‘ఈపెళ్లి అనేది, ఆపైవాడు మనిషికి ఇచ్చిన శాపం, వరంతో కలిపిన పదార్థంలాంటిది. పెళ్లి జ్ఞానిని అజ్ఞానిని చేస్తుంది. అజ్ఞానిని జ్ఞానిని చేస్తుంది. ఉన్న గుణం పోగొడుతుంది. లేని గుణం తెచ్చిపెడుతుంది. మొత్తానికి జీవితాన్నే మార్చివేస్తుంది’’ అని వివరించాడు. ఆహా! ఏమి ధర్మప్రవచనం! ఆసుపత్రికొచ్చానా ఆలయానికొచ్చానా అనిపించింది. కానీ, నాకు పిల్లను వెతికి పెళ్లి చేయటానికి ఎవరూ లేరని, అంతేకాక మరో ఐదు సంవత్సరాల వరకూ నాకా ఉద్దేశమేలేదనీ చెప్పాను. చేసేదిలేక, అతను నాకు మరో పరిష్కారమంటూ కొన్నాళ్లపాటూ ఏవో హాస్యానికి సంబంధించిన పుస్తకాలు, చిత్రాలు చూపించడం, చిత్ర, విచిత్రమైన ఆసనాలు వేయించడంలాంటి పనులు ఎన్నో చేశాడు. అయినా నా సమస్య, సమస్యగానే ఉండిపోయింది. దాచుకున్నదంతా వాడికి దోచిపెడుతున్నట్టుందని వెళ్లడం మానేశాను.

* * *

      ఓ రోజు మా వీధిలో ఉండే ఓ నలుగురు పెద్దవాళ్లు ఇంటికొచ్చారు. ఆదివారంనాడు వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పి, నన్నూ రమ్మన్నారు. ఒంటరిగాడిని, సెలవు రోజే కదా అనుకొని సరేనని బయల్దేరాను.
      చుట్టూ పచ్చని చెట్లతో కళకళలాడుతూ, చిట్టడవిని తలపిస్తోందా ప్రదేశం. అన్నివైపుల నుంచి పక్షుల కిలకిలలు, కోతుల కిచకిచలు ఆహ్లాదకరంగా ఉందా ప్రదేశం.
      అప్పటికప్పుడు వండిన అల్పాహారాన్ని ముందుగా దేవుడికి నైవేద్యంగా పెట్టి, ఆపై అందరికీ వడ్డించారు. అల్పాహారం తిన్న తర్వాత మా బృందంలోని ఓ పెద్దతను కార్తీకమాస విశిష్టత, వనసంతర్పణ ఆవశ్యకత గురించి ఓ గంటసేపు చక్కగా వివరించారు. ఎంతమంచి సంస్కృతి కదా మనది అనిపించింది. 
      ఇక, హాస్యవల్లరితో రకరకాల సరదా కార్యక్రమాలు మొదలయ్యాయి.  ఒకతనులేచి, ఒక హాస్యగుళిక విసిరాడు. 
      ‘‘పెద్దవెంగళప్ప, చిన్న వెంగళప్పతో.. ‘చిన్నాడా, చిన్నాడా మరేమో నాల్గురోజుల క్రితం నన్నో చీమకుడితే, దానికో లెంపకాయకొట్టి, ఇంకెప్పుడూ నన్ను కుట్టకు అని చెప్పి, మన సందు చివర వదిలేశాన్రా. అయితే అది నిన్న రాత్రి నేను ఇంటికి వెళుతుంటే గుర్తుపట్టి కక్షతో మళ్లీ కుట్టాలని  తరుముకొచ్చిందిరా.’.
      ‘మరేం చేశావురా పెద్దాడా, ఇంటికెళ్లి తలుపేసేసుకున్నావా?’ అన్నాడు చిన్న వెంగళప్ప.
      ‘లేదురా, అది మా ఇల్లు గుర్తుపడుతుందని, పక్కింటికెళ్లి తలుపేసుకున్నా, అయినా అదెలాగో నేను దూరిన ఇంట్లోకి వచ్చేసి కుట్టేసిందిరా..’ అంటూ భోరుమన్నాడు పెద్దవెంగళప్ప.
      ‘అయ్యో! నీకెంత అన్యాయం చేశాన్రా పెద్దాడా!’ అంటూ వాపోయాడు చిన్న వెంగళప్ప.
      ‘నువ్వు నాకేం అన్యాయం చేశావురా?’ అన్నాడు పెద్ద వెంగళప్ప.
      ‘మొన్న రాత్రి నేను మా ఇంటికెళుతుంటే ఆ చీమ నాకెదురొచ్చి నీ ఇల్లు ఎక్కడో చెప్పకపోతే నన్ను కుడతానందిరా. నిన్ను కాపాడాలని, మీ పక్కిల్లు చూపించి అదే నీ ఇల్లు అన్నాన్రా!’ అంటూ చిన్న వెంగళప్ప భోరుమన్నాడు..’’ 
      ఈ గుళికకు అందరూ నవ్వే.. నేను తప్ప.
      ఈసారి ఒకావిడ లేచి మొదలెట్టింది.. ‘ఆ మధ్య మా ఆయనతో కలిసి బట్టల దుకాణానికెళ్లాను. ఆరు చీరలు ఎంచుకున్న తర్వాత వాటి ఖరీదు చెప్పాడు ఆ దుకాణంవాడు. నాలుగు చీరలకు మాత్రమే డబ్బు సరిపోతుంది, రెండు చీరలు వదిలెయ్యమని మా ఆయనన్నారు. దుకాణం వాడు రెండు చీరలకు బేరం పోతోందని బేలముఖం పెట్టాడు’ అంది.
      ఇంతలో మరొకావిడలేచి ‘మరేంచేశావక్కా? ఆరెండు చీరలు వదిలేశావా?’ ఆత్రుత, సానుభూతి కలగలిపి అడిగింది.
      ‘భలేదానివి చెల్లీ! ఆరుగంటలు కష్టపడి ఎంచుకున్న చీరలను వదిలేస్తానా! అందుకే, మా ఆయన్ని దుకాణంలో వదిలేసి, ఆ చీరలు ఇంటికి తీసుకెళ్లి, డబ్బు చెల్లించిన తర్వాత ఆయన్ని విడిపించుకున్నాను’ అంది.
      ఇంకో ఆవిడలేచింది. ‘అదిసరే వదినా! మీ ఆయన్ని ఎలాగూ దుకాణంలో వదిలేసినప్పుడు చీరల్ని కూడా వదిలేసి ఇంటికెళ్లి మిగతా డబ్బు తీసుకురావచ్చుగా!’ అంటూ అనుమానం వ్యక్తం చేసిందావిడ.
      ‘బాగుందొదినా! చీరలను వదిలేసి మిగతా డబ్బు తీసుకురావడానికని నేనింటికెళ్తే, ఆ నాలుగు చీరలకే డబ్బిచ్చి  మా ఆయన నా వెనకే వచ్చేయరూ!’ అంటూ ఈవిడ సమాధానం.
      ఈవిడ తెలివితేటలకు ముగ్ధులైపోయి ఆడవాళ్లందరూ పెద్దగా చప్పట్లు. మగవాళ్లూ కొట్టారు చప్పుడు రాని చప్పట్లు. పాపం ఈవిడగారి భర్తను చూసి నవ్వనివారులేరు. నాకు మాత్రం జాలేసింది. 
      ఇలా హాస్యవల్లరి అంటూ చాలాసేపు సాగింది. తర్వాత పొడుపు కథలు, మెదడుకు మేత, అంత్యాక్షరి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. నా సంగతి తెలిసి, ఎవరూ నన్ను ఇబ్బందిపెట్టలేదు. ఒంటిగంటకి భోజనాలు వడ్డించారు. నాకైతే పంచభక్ష్యపరమాన్నంలా అనిపించింది. భోజనాలు కాగానే పిల్లలు ఆటల్లో, ఆడవాళ్లు మాటల్లో, మగవాళ్లు పేకాటల్లో పడ్డారు. నేను ఆలోచనలోపడ్డాను ఏంచేద్దామా అని. కాసేపు ఆ ప్రాంతమంతా అలా చుట్టివస్తే బాగుంటుందని బయల్దేరాను. దారంతా ఎన్నోరకాల చెట్లు దట్టంగా ఉన్నాయి. విడదీయరాని స్నేహబంధంలా, రకరకాల లతలు ఆ చెట్లను అంటిపెట్టుకొని ఉన్నాయి మీతోనే మేమూ అన్నట్లుగా. చెట్లమధ్య గుబురుగా పెరిగిన మొక్కలు ఎంతో పచ్చదనంతో, రంగురంగుల పూలతో ఆ ప్రాంతమంతా చూడముచ్చటగా ఉంది. చెట్ల నుంచి, పూలనుంచి వస్తున్న సువాసనలను ఎంత పీలుస్తున్నా తనివితీరటం లేదు. ఇంత అందమైన ప్రకృతితో మమేకమై జీవించే ప్రాణుల జన్మే జన్మ కదా అనిపించింది. కాస్తదూరంలో ఓ చెట్టు మీద ఎగురుతూ గంతులేస్తున్న కోతుల గుంపొకటి కనిపించింది. కాసేపు వాటి చేష్టలను గమనిద్దామని, అక్కడే ఓచెట్టు దగ్గర కూర్చున్నాను. అవన్నీ కొమ్మల మీద గెంతుతూ, చెట్టు విరిగిపడిపోతుందేమో అనేంతగా ఆడుకుంటున్నాయి. కొమ్మమీద కూర్చున్న ఓ కోతి తోక కిందికి వేలాడుతోంది. పక్క కొమ్మ మీద నుంచి ఇంకో కోతి ఒక్క గెంతుగెంతి, దీనితోకను పట్టుకొని వేలాడటం మొదలెట్టింది. కాసేపు ఊగిన తర్వాత అది కొమ్మ మీదికి ఎగిరి తన తోకను వేలాడదీసి ఇందాకటి కోతికి ఊగే అవకాశమిచ్చింది. ఇప్పుడు ఆ కోతి దీనితోకను పట్టుకొని ఊయలూగడం మొదలెట్టింది. మరికొన్ని ఒకదానిమీద ఒకటి ఎక్కి కూర్చొని కొమ్మల మీద వేగంగా గెంతుతున్నాయి. గిరికీలు కొడుతూ చాలా తమాషా చేష్టలు చేస్తున్నాయి. ఈ చేష్టలన్నీ గమనిస్తున్న నా మెదడుకు ఏవో సంకేతాలందుతున్నాయి. నా నరాలు ఉత్తేజితమవుతున్నాయి. నా పెదాలు కాస్త విచ్చుకున్నట్లు అనిపిస్తోంది. ఏదో హాయి కలుగుతోంది. నా దృష్టి కాస్త చెట్టుకిందికి మళ్లింది. అక్కడ, ఓ తల్లికోతి సేదతీరుతోంది. దానిచుట్టూ ఓ అయిదారు పిల్లకోతులున్నాయి. అవిచాలా ముద్దుగా ఉన్నాయి. ఓ కోతిపిల్ల వాళ్లమ్మ తోకను కొరుకుతూ ఆడుకుంటోంది. తల్లికోతికి ఇబ్బందిగా అనిపించి తనతోకను లాక్కునేంతలో, ఇంకో కోతిపిల్ల వాళ్లమ్మ చెవులు కొరుకుతూ ఆడుతోంది. ఈ పిల్లకోతిని తరిమేంతలో, మరో పిల్లకోతి వాళ్లమ్మ వీపుమీద ఎక్కి గెంతడం మొదలెట్టింది. తల్లికోతి చిరుకోపం ప్రదర్శిస్తూ అన్నింటినీ దూరంగా తరిమింది. మళ్లీ కొంతసేపటికి, ఈ కోతిపిల్లలన్నీ కాళ్లు లాగడం, తోక కొరకడంతో తల్లికోతి ఓ పిల్లకోతిని పట్టుకొని దానికి నొప్పి లేకుండా  పళ్లతో కొరుకుతూ, నాతోకాదు మీలో మీరు ఆడుకోండి అన్నట్లు ప్రేమతో బెదిరించింది. అవి దూరంగా జరిగినట్టే జరిగి అదనుచూసుకొని మళ్లీ తల్లి దగ్గరే ఆడుతున్నాయి. ఇలా, ఓపదిసార్లు వాటి చేష్టలను గమనించిన నాకు ఒక్కసారిగా ఫెళ్లుమని నవ్వొచ్చేసింది. అలా ఎంతసేపు నవ్వుతూ ఉన్నానో నాకే తెలియటం లేదు. మనసంతా చెప్పలేని ఆనందం నిండుతోంది. కళ్లలోంచి నీళ్లు కారుతున్నాయి. ఆనందబాష్పాలంటే ఇవేనని మొదటిసారిగా తెలిసింది. ఇంతలో, ఇంకోచెట్టుమీద పక్షులు కూడా ఒకదాని మీదినుంచి ఇంకొకటి గెంతుతూ, గాలిలో గిరికీలు కొడుతూ చేస్తున్న తమాషాలకి, నా నవ్వు మరింత ఎక్కువైంది. మనసంతా ఆనందంతో దూదిపింజలా తేలిపోతోంది. ఆహా! ఈ ప్రకృతి వల్ల నేను జీవితంలో మొదటిసారిగా నవ్వగలిగాను. ఇన్నాళ్లూ, నాకు నవ్వు ఎందుకు రాలేదో అర్థమైంది. లేనివి కల్పించడం, ఒకరినొకరు కించపరచుకోవడం వల్ల వచ్చే నవ్వు యాంత్రికమవడమే దానికి కారణమని తెలిసింది. ఇప్పుడు లభించిన నవ్వు, దానివల్ల పొందిన ఆనందంతో జీవితమంతా గడిపేయవచ్చు. ఇక నేను బయలుదేరాలని గుర్తొచ్చింది. నిలబడి నాకు నవ్వును ప్రసాదించిన ప్రకృతి మాతకు  చేతులు జోడించి నమస్కరించాను. చెప్పలేని ఆనందం నిండిన మనసుతో మా బృందాన్ని కలిశాను. మాటల్లో వర్ణించలేని ఆనందంతో వెలిగిపోతున్న నా ముఖాన్ని చూస్తూ అందరూ ఆశ్చర్యపడ్డారు. జరిగిన సంగతి చెప్తే, ఇన్నాళ్లకు నేను నవ్వుకోగలిగానని అందరి నుంచీ అభినందనలే. బట్టల దుకాణంలో ఉండిపోయిన భర్తగారైతే నన్ను కౌగిలించుకొని మరీ ప్రత్యేకంగా అభినందించారు. బహుశా వాళ్లావిడ హాస్య గుళిక విసిరినపుడు ఆయనను చూసి నేను మాత్రమే నవ్వనందుకు కావచ్చు..!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోని


కొత్త పలక

కొత్త పలక

కుప్పిలి సుదర్శన్‌bal bharatam