అసంపూర్ణం

  • 410 Views
  • 5Likes
  • Like
  • Article Share

    బొమ్మరాజు దుర్గాప్రసాద్‌

  • హైదరాబాదు.
  • 8008001748
బొమ్మరాజు దుర్గాప్రసాద్‌

తల్లిదండ్రుల్నీ, భార్యాపిల్లల్నీ, జననమరణాల్నీ, కాసేపే ఆలోచించమంటాడు. కాస్త స్థితప్రజ్ఞత పొందమంటాడు. చివరికి ఉరుకుల పరుగుల అతని జీవితం సంపూర్ణమో, అసంపూర్ణమో తేల్చుకోలేకపోతాడు..
‘‘దుఃఖములు
కలిగినపుడు దిగులు చెందని వాడు... సుఖములు కలిగినపుడు స్పృహలేని వాడు... భయము, రాగము, క్రోధము పోయినవాడు.. స్థితప్రజ్ఞుడని చెప్పబడును..’’ ఘంటసాల గాన ప్రవాహం సాగిపోతోంది.
      స్థితప్రజ్ఞత సుఖదుఃఖాలకు అతీతం. సహజంగానే జీవన ప్రవాహంలో అంతో ఇంతో ఇది తప్పనిసరేనేమో..! రాన్రానూ గాఢత తగ్గిపోతోందా? స్పందనారాహిత్యం ప్రబలిపోతోందా? స్పర్శ నానాటికీ మొద్దుబారిపోతోందా!
      ఇది అనివార్యతా? కేవలం ఇది బహిర్గతమా? అంతర్గతమూ ఇంతేనా? అంతా ఇంతే అనడం కూడా అసాధారణమేనేమో..!
      సహజంగా సాగిపోవడం వేరు. కాస్త ఆగి, లోలోపలికి చూసుకుంటూ సాగడం వేరు. ఒకే గాట కట్టలేం. ఒక్కసారి వెనుతిరిగి చూస్తే, కాసింత ఆలోచిస్తే, ఒక కుదుపు..!
      15...25...35...45...55
      ప్రభవ...విభవ...విజయ...జయ...
      ఇక సంపూర్ణం దిశగా అడుగులు. అది ఎప్పుడో అర్థం కాదు. ఇక్కడే పెద్ద ప్రశ్న.. సందేహం...
      అంతా అయిపోయిందా? అంతా అయిపోతుందా...!? మన వెంట ఏమీ రాదు.. నిజమే.. ఆ తర్వాత సరే, మరి ఇప్పుడో.. ఇన్నాళ్ల తర్వాత, ఇన్నేళ్ల తర్వాత కూడానా!
      ఎప్పుడో అప్పుడెప్పుడో మధ్యలోనే ఆగిపోయినవీ మనవి అనుకున్నవీ, అవి ఏమైపోతాయి...?
      ఈ సగంలో ఇప్పుడు ఆలోచిస్తే... ఇదో అన్యమనస్కం. ఆ తపనలూ ఆ భావాలూ నిజంగా రాలిపోయాయా? లేదే.. ఆ గాఢతలు సడలిపోయాయా? నిజంగా మనల్ని వీడిపోయాయా? లేదే.. మరెందుకు? ఇదిలా అసంపూర్ణమేనా? ఆ అసంపూర్ణంలో సంపూర్ణం ఎలా సాధ్యం?
      చిటికెన వేలు వదిలి ఎటో వెళ్లిపోయిన బంధం. మోహమో, బంధమో, రెండు హృదయాలను కలిపింది. కాలంచెల్లి, కాటేసి వెళ్లింది...!
      ప్రారంభమనేది నిజమైతే, ముగింపు సాధ్యమేనా? పెనవేసుకోవడంలో గాఢతే ఉంటే, విడిపోవడం? వీడిపోవడానికి ఏ గీతలో సారాంశం వెతుక్కోవాలి...?
      ఆలోచనలోచనా స్రవంతి.. ఎక్కడ వెదకాలి? ఎవరిని ఆశ్రయించాలి? జిడ్డు కృష్ణమూర్తినా? ఫ్రాయిడ్‌నా...!?

* * *

      నాన్నా ఏం ఆలోచిస్తున్నావు?
      ఏం లేదురా... చెప్పు....
      నాకేమీ అర్థం కావడం లేదు నాన్నా..
      పాఠాలా..? ట్యూషన్‌ ఉంది కదా...
      అది కాదు నాన్నా...
      మరేంట్రా?
      పెళ్లి ఎందుకు చేసుకోవాలి నాన్నా..?
      ముందు చదువుకోమ్మా.. ఇప్పుడే ఆ ఆలోచనలు ఎందుకు... ఇంకా అంత వయసు రాలేదు కదా...!
      అది కాదు నాన్నా.. మిమ్మల్ని వదిలి వెళ్లిపోవాలా?
      నీకు ఇష్టం లేని పని ఏదీ చెయ్యొద్దమ్మా. క్రమేణా నీకే అంతా అర్థమవుతుంది. ఏం కంగారు పడకు...

* * *

      తనకి ఏం అర్థమవుతుంది? అర్థం కాదు. అయినా అలా చెప్పాలి. తప్పదు..
      ఏం అర్థమైందని సాగిపోతున్నాం? అర్థమయ్యేలోపే అంతా అయిపోతోంది.
      కొండలు దాటి, గుట్టలు దాటి, తిన్నెలు దాటి, ఆ అలజడులను అధిగమించి, గలగలలను తనలో నిక్షిప్తం చేసుకుని, మైదానాన నిశ్చల ప్రవాహమవుతుందట నది. అప్పుడే నిండుదనం వస్తుందట. వయసూ అంతేనట...
      మరి ఇదేంటి? నిశ్చలత్వం తిరగబడుతోంది. గాంభీర్యం గాడి తప్పుతోంది? వయసు పెరిగినా సూత్రం తప్పుతోందేమిటి? మనసు తప్పిదమా? అనుభవ రాహిత్యమా? అందరిలా ఉండలేకపోవడమా..?
      ఇంకా ఆ ప్రజ్ఞ అలవడలేదా? కొనసాగించాలా? ఆలోచించాలా? ఆగాలా? ఇలా ఎక్కడి వరకు...!? తార్కికమా? అన్వేషణా...!?
      సహజాతాన్ని ఎలా కాదంటాం. సర్దుకుపోతూ పోతే అసలు సంగతేమిటి..? ఏది ఎందుకు కాదనాలి? ఎవరో ఏదో అంటే ఎందుకు అవుననాలి...?
      ఒక పువ్వు పరిమళిస్తుంది. మేఘం వర్షిస్తుంది. కొమ్మ చిగురుతొడుగుతుంది. మనసు మనసుపడుతుంది. మనసు పడుతూనే ఉంటుంది...
      సహజత్వానికి విఘాతమేల...? ఎప్పటి ఘాతాలైనా, ఎప్పటికైనా మానిపోవాలంటే కాలమే పరిష్కారమా? ఆ చేయి స్పర్శలో ఆ ప్రేమ తడిలో ఆగిపోయినవి హత్తుకోవా? వీడిపోయినవి ఎన్నటికీ అల్లుకోవా? ఒక అసంపూర్ణం సంపూర్ణమయ్యేదెలా మరి? ఎక్కడిదక్కడేనా... ఎప్పటిదప్పుడేనా...
      జీవితం ఏంటి ఘాట్‌రోడ్డులా ఇన్ని మలుపులు తిరుగుతోంది. మలుపు మలుపులో ఒక మరుపు. వచ్చిన దోవలోనే మళ్లీ వెళ్లేలా, గాయాలన్నింటికీ అమృత స్పర్శ పూసేలా, సాగిపోతే...?
      మమేకం...తాదాత్మ్యం...

* * *

      ఇంతలో ఆవిడ వచ్చింది. ఒకసారి చూసి వెళ్లిపోయింది. మళ్లీ వచ్చింది. ఎంత సేపు అలా...
      ఆ ఆధార్‌ కార్డు సంగతి చూడండి... లేకపోతే సబ్సిడీ రాదట.. పిల్లాడి కాలేజీ సీటు సంగతి తేల్చాలి. ఎప్పుడూ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం సాధిస్తారు?
      అవును.. ఏం సాధించాలి? ఇది సాధించడం అంత సులభం కాదు...
      ఆధార్‌ కార్డు, గ్యాస్‌ ఏజెన్సీకి అది అందివ్వడం, కుర్రాడి కాలేజీ సీటు.. ఇవన్నీ పూర్తి చేయాలి. ఇక్కడ ఇదో సంపూర్ణం.
      ఎల్‌ఈడీ టీవీ, సిప్, జీవిత బీమా, పెన్షన్, నిశ్చింత!
      ఇది నిశ్చింతేనా? ఇదో నిశ్చింత..!
      తప్పదు. కొన్నింటిలో ఒక భాగం కావాలి. కొన్ని పనులు చేసినందుకు, ఈ పనులూ చేయాలి.
      జీవితం ఇంత అప్రయత్నమేమిటో, ఏం చేసినా సాగిపోతుంది. ఏం చేయకపోయినా సాగిపోతుంది. ప్రయత్నానికి పరమార్థం ఏమైనా ఉందా? ఇన్నాళ్లుగా చూస్తున్నా.. ఊ అన్నా ఒకటే.. ఊహూ అన్నా ఒకటే...

* * *

      అమ్మ వచ్చింది.
      విషయం చెప్పింది.
      మానవ సహజం కదా, అయ్యో అని అన్నా.. కాసేపాగి కాలు బయటకు కదిపా ఆ నలుగురిలో ఒకడినవుదామని.
      అక్కడ అంతా హడావుడి.. కట్టెలు సిద్ధమవుతున్నాయి.. ఇతనిది సంపూర్ణత్వమా..? అసంపూర్ణత్వమా...!?
      ఆ వెనుక నుంచి మంద్రంగా గీత వినిపిస్తోంది. దుఃఖింప తగని వాటి గురించి దుఃఖించుట అనుచితం...
      మనసులో మెరుపు మెరిసింది.
      ఒక సమాధానం..
      ఎంత వరకు..
      క్షణమా... గంటా... రోజా....!?

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోని


కొత్త పలక

కొత్త పలక

కుప్పిలి సుదర్శన్‌bal bharatam