క‌న్నీరు

  • 575 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శ్రీనివాస్‌ దరెగోని

  • హైదరాబాదు.
  • 8008591414

తెలిసో తెలియకో తప్పు చెయ్యడం మానవ నైజం. ఆ పొరపాటు ఎంత తీవ్రమైందైనా కావొచ్చు. సరిదిద్దుకోలేని తప్పును చేసిన ఓ యువకుడు చివరికి ఏం చేశాడు?
నగరానికి
దూరంగా ఇంజినీరింగ్‌ కళాశాల. దాని పక్కనే హైవేపై దాబా. ఎప్పట్లాగే విద్యార్థులతో కోలాహలంగా ఉంది. సుజిత్, తన నలుగురు స్నేహితులూ ఓ మూలగా కూర్చున్నారు.
      సీసాలు ఖాళీ అవుతున్నాయి. వేళ్ల మధ్య సిగరెట్లు పొగలు కక్కుతూ బూడిదవుతున్నాయి. వాళ్ల భవిష్యత్తులాగే... 
      ‘‘ఈ ట్రీట్స్‌లో మజా పోయిందిరా. కాలేజ్‌ అవ్వగానే దాబాలో కూర్చుని మందు కొట్టేసి ఇంటికి వెళ్లిపోవడం... రోజూ ఉంటున్నదేగా... ఏదో కోల్పోతున్నట్లు మనసు పీకుతోంది’’ అన్నాడు రోషన్‌ .
      ‘‘మరేం చేద్దాం...’’ అడిగాడు సుజిత్‌ సీసా కింద పెడుతూ.
      ‘‘నా దగ్గరో కిక్కిచ్చే ఐడియా ఉంది. వింటానంటే చెప్తా...’’ అన్నాడు రోషన్‌ ఆసక్తి కలిగించేలా ముందుకు వంగుతూ.
      ‘‘ముందు చెప్పు. కిక్కు సంగతి... మేం చెప్తాం’’ అన్నాడు సుజిత్‌.
      ‘‘ఇక్కణ్నుంచి మనం అయిదుగురం బళ్లపై ఒకేసారి బయల్దేరదాం. సిటీ మొదట్లో రింగ్‌రోడ్‌ దగ్గరుండే కేఫ్‌కి చేరాలి. ఎవడు చివరగా వస్తాడో... వాడే లూజర్‌. రేపు ట్రీట్‌ వాడి జేబుదే’’ ముగించి అందరి మొహాలకేసి చూశాడు రోషన్‌.
      ‘‘మనం మందు కొట్టేసి ఉన్నాం, ఇలాంటి పరిస్థితుల్లో బైక్‌ రేసంటే ప్రమాదం మామా’’ అన్నాడు ఖాదర్‌.
      ‘‘ఆర్రే... ఖాదర్‌ మామా! నువ్వు నోర్ముయ్‌. నాకు నచ్చిందంతే. అందరూ బళ్లు తీయండ్రా...’’ అంటూ ఉత్సాహంగా లేచాడు సుజిత్‌.

* * *

      సుజిత్‌ బైక్‌ రివ్వున దూసుకెళ్తోంది. చేతికున్న స్టాప్‌వాచ్‌లో డిజిటల్‌ అంకెలు గుండెలయ కన్నా వేగంగా పరుగెడుతున్నాయి. చినుకుల చిటపట పెరిగింది. బైక్‌ మరింత జోరందుకుంది. తాగిన మైకం మస్తిష్కాన్ని కమ్మేస్తోంది. హైవే మీద భారంగా వెళ్తున్న ఒక్కొక్క వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తూ చినుకుల మధ్య ఖడ్గ ప్రహారం చేస్తున్న వాడిలా ముందుకు సాగుతున్నాడు సుజిత్‌. 
      దూరంగా రోడ్డు దాటుతోందొక మహిళ.
      అంతలోనే... కళ్లలో వాన చినుకు టప్పున పడింది. కనురెప్ప టపటపా కొట్టుకుంది. ఒక్క క్షణం కళ్లు మూసి తెరిచాడు. అప్పటికే ఆలస్యమైంది.
      వేగంగా ఆ మహిళను ఢీకొట్టింది సుజిత్‌ బైక్‌. విసురుగా పక్కకు పడిందామె. రోడ్డు పక్కన రాయికి తల బలంగా కొట్టుకుంది.
      ఏం జరిగిందో అర్థం కాలేదు. బైక్‌ నియంత్రించే ప్రయత్నంలో దాదాపు వంద గజాల అవతల రోడ్డు దిగువన తుప్పల్లో పడిపోయాడు. ఆ వర్షంలో ఎవరూ చూడలేదతన్ని. మోకాళ్లూ భుజాలూ కోసుకుపోయాయి. నొప్పి తెలుస్తోంది.. తాగిన మైకం వదిలినట్లుంది..
      దూరంగా రక్తం మడుగులో ఆ మహిళ కొన ఊపిరితో కదులుతోంది.. ఓ నలుగురైదుగురు గుమిగూడారు.. 
      స్థాణువై దూరంగా నిలబడిపోయాడు సుజిత్‌.
      అంతలోనే మరో పదిమంది చేరారక్కడ.. మెల్లగా అడుగులేస్తూ వెళ్లి తనూ వాళ్ల మధ్య నిలుచున్నాడు.. అంబులెన్స్‌ వచ్చింది..
      విరిగిన శిలలా బైక్‌ దగ్గరికి నడిచాడు.

* * *

      ఆస్పత్రి వరండాలో కూర్చున్నాడు సుజిత్‌. మెదడుకూ, శరీరానికీ సంబంధం తెగిపోయినట్లుగా ఉందతని పరిస్థితి. వర్షంలో తడిసి ముద్దయినా, పొడిబారిన కళ్లతో నిస్తేజంగా చూస్తున్నాడు.
      రెండు పెదవుల మధ్య నుంచీ ‘అమ్మ... అమ్మ...’ అంటూ బయటికి వినిపించని భావమేదో మంద్రంగా బయటికి రావడానికి ప్రయత్నిస్తోంది.
      ‘‘ఎ-నెగెటివ్‌ బ్లడ్‌ కావాలి. పేషెంట్‌ బంధువులెవరైనా ఉన్నారా..?’’ అడిగాడు డాక్టర్‌.
      ‘‘బంధువులెవరూ లేరు. మేమిస్తాం. సరిపోతే తీసుకోండ’’ని ఓ ఇద్దరు ముందుకెళ్లారు.
      సుజిత్‌ భావరహిత స్థితిలో అలాగే చూస్తుండిపోయాడు.
      ‘‘కేసేంటీ..?’’ ఎవరో అడిగారు.
      ‘‘లారీ గుద్దేసినట్టుంది సార్‌.. స్పాట్కి కొంత దూరంలో ఓ యాక్సిడెంటైంది. డ్రైవర్‌ స్పాట్‌ డెడ్‌..’’ ఎవరో జవాబిచ్చారు.

* * *

      ‘సుజిత్‌... సుజిత్‌...’ వంటింట్లోంచే గట్టిగా కేకేస్తోంది వసుధ.
      ఏంటి వీడు... రాత్రెప్పుడో వచ్చాడు, పొద్దున పదవుతున్నా లేవటం లేదు. అనుకుంటూ సుజిత్‌ గదిలోకి వచ్చింది వసుధ. 
      ‘నాన్నా సుజీ’ అంటూ తట్టిలేపింది.
      బద్ధకంగా కళ్లు తెరిచాడు. సుజిత్‌ కళ్లు అగ్నిగోళాల్లా ఉన్నాయి.
      ‘‘ఏంట్రా ఏమైంది. రాత్రి అంత ఆలస్యమైందేంటి?’’ అందామె.
      మౌనంగా చూశాడోసారి తల్లికేసి. 
      ‘‘మాట్లాడుతుంటే పలకవేరా’’ ప్రేమగా జుట్టు సర్దింది వసుధ.
      ఏమీ లేదన్నట్లుగా... తల్లి భుజమ్మీద తలవాల్చాడు సుజిత్‌.
      ‘‘సరే, టిఫిన్‌ చేద్దువుగానీ లే’’ అంది వసుధ.

* * *

      ‘‘ఏరా నాన్నా... కాలేజీలో ఏదైనా సమస్యా, స్నేహితులతో గొడవ పడ్డావా?’’ అడిగింది వసుధ. మౌనంగా తలొంచుకుని టిఫిన్‌ చేస్తున్న సుజిత్‌ పక్కగా కుర్చీ లాక్కుంటూ.
      ‘‘ఏమీ లేదు మమ్మీ’’ పొడిగా సమాధానమిచ్చాడు.
      ‘‘నాన్నేమైనా కోప్పడ్డారా?’’ అని మళ్లీ అడిగింది. మౌనమే సమాధానం.
      ‘‘సెమిస్టర్‌లో మార్కులేమైనా తగ్గాయా?’’ రెట్టించిందామె.
      ‘‘కాసేపు నన్నిలా వదిలేయ్‌ మమ్మీ... ప్లీజ్‌!’’ అన్నాడు సుజిత్‌ అర్థిస్తున్నట్లుగా...

* * *

      శూన్యంగా బయటికి చూస్తూ బాల్కనీలో కూర్చున్నాడు సుజిత్‌. 
      ఎదురుగా పాఠశాల కనిపిస్తోంది. గేటు బయట పిల్లల కోసం తల్లులు ఎదురు చూస్తున్నారు. గేట్లోంచి అడుగు బయటకు పెడుతూనే... అంత మందిలోనూ తమ తల్లిని వెతుక్కుంటున్నారు. తల్లి కనిపించగానే ఏదో తెలియని మెరుపు వారి కళ్లలో. పరుగెత్తుకొచ్చి తల్లిని హత్తుకుపోతున్నారు. 
లంచ్‌ బాక్స్‌ తెరిచి అన్నం తిన్నారా లేదా... అనే ఆత్రుత తల్లిలో కనిపిస్తోంది. 
      రోజూ ఇచ్చే చాక్లెట్‌ కోసం వెదుకుతున్నాయి పిల్లల మనసులు. తమ కోసం ఎవరూ రాని పిల్లలు... మౌనంగా... ఏదో వెలితితో ఆటోలవైపు నడుస్తున్నారు. సుజిత్‌ అటే చూస్తుండిపోయాడు. తల్లి చంకనెక్కిపోతున్న పిల్లల ముఖాల్లో ఆనందం. ఒంటరిగా వెళ్తున్న పిల్లల్లో విచారం. చీకటీ వెలుగూ పక్కపక్కనే.
      అమ్మ... అమ్మ లేకపోతే... అంతర్మథనం సుజిత్‌ మనసులో...
      అంతలో వెనక నుంచి అమ్మ వచ్చింది.
      ‘‘కొత్త ఆవకాయ పెట్టాను... రుచి చూసి చెప్పు ఎలా ఉందో...’’ అంటూ ఆవకాయ పచ్చడితో కలిపిన అన్నం ముద్దను సుజిత్‌ నోట్లో పెట్టిందామె.
      సుజిత్‌ కళ్లల్లో తడి.
      ‘‘ఏమైంది నాన్నా... కారం ఎక్కువైందా...’’ మంచినీళ్లు అందిస్తూ అందామె ఆందోళన నిండిన స్వరంతో.
      కాదన్నట్లుగా తలూపాడు.
      ‘‘పొద్దున్నుంచీ ఏమీ మాట్లాడటం లేదు. సరిగా తినడం లేదు. ఏమైంది నీకు’’ అని అడిగింది వసుధ.
      ఏమీ వినిపించనట్లుగా అభావం.
      అన్నీ పట్టించుకుని, అవసరాలన్నీ తీర్చే అమ్మ తనకుంది. అమ్మ ప్రేమ ఎంత కమ్మనో తనకు తెలుసు. తనకు జ్వరమొస్తే అమ్మ ఒంట్లో పెరిగే టెంపరేచర్‌. ఇంటికి రావడం ఆలస్యమైతే అమ్మ పెట్టే హడావుడి. ర్యాంకులొస్తే అమ్మ చేసే పండగ. ఇంజినీరింగ్‌కు వచ్చినా... ఇప్పటికీ ఇంటికి వచ్చే వరకూ ఎదురుచూసే అమ్మ... అవన్నీ తనకే సొంతమైన అనుభూతులు.
      తను బైక్‌తో ఢీకొట్టినావిడే గుర్తుకొస్తోంది. మరి ఆమె కుటుంబం.. పిల్లలు... వాళ్ల పరిస్థితేంటో? మదిలో ఎన్నో ప్రశ్నలు అలజడి రేపుతున్నాయి.

* * *

      బైక్‌ వాళ్లింటిముందు ఆపాడు సుజిత్‌. లోపలి నుంచి ఏడ్పులు గుండెలు పిండేసేలా వినిపిస్తున్నాయి.
      మెల్లగా లోపలికి వెళ్లాడు. హాలు మధ్యలో ఉంచారామె మృతదేహాన్ని.
      భర్త కాబోలు ఓ పక్క కూర్చున్నాడు. కడదాకా తోడుంటానని బాస చేసి... నిలబెట్టుకోలేకపోయిన జీవితకాలపు స్నేహితురాలి నిస్సహాయతను అసహాయంగా చూస్తున్నట్లుగా ఉన్నాయి ఆ భర్త జీవం లేని చూపులు.
      తండ్రి భుజమ్మీద తలవాల్చి తల్లికేసే చూస్తోంది వాళ్ల కూతురు. తన ఇష్టాల్నీ కష్టాల్నీ సమంగా భరిస్తూ నిత్యం చిరునవ్వుల్ని పంచే అమ్మ అలా నిస్తేజంగా పడుకుని ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతోందా అమ్మాయి. మనసులో చోటు సరిపోనంత విషాదం కళ్లలోంచి పొంగుకొస్తోంది.

* * *

      ఓ మూలగా నిల్చున్నాడు సుజిత్‌. శాశ్వత నిద్రలో ఉన్న ఆమె కళ్ల వెనక ఎన్నెన్ని ఆశలున్నాయో! ఎన్ని దుఃఖాలు, ఎన్ని బాధలు, ఎన్ని కలలు, ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని ఊహలు నింపుకుందో... అన్నింటినీ వదిలేసి వెళ్తోంది.
      లేదు లేదు.. తనే సజీవ సమాధి చేశాడు. ఈ లోకానికి ఒక అమ్మను దూరం చేశాడు. వయసూ, డబ్బూ తెచ్చిన ఆకతాయితనంతో ఒక అమ్మను బలి తీసుకున్నాడు. 
      మనసు దహిస్తోంది. తనమీద తనకే తెలియని ఉక్రోషం. అదుపులేని తన మనసు మీద అసహ్యం. అమ్మా... అని పిలవాలనిపించింది. గొంతు పెగలడం లేదు. ఆ శబ్దం తన గుండెకే వినిపిస్తోంది.
      వర్షిస్తున్న మనసు.. కన్నీరు కట్టలు తెంచుకొంటోంది. స్వచ్ఛమైన అమ్మ మనసు కోసం వచ్చిన తేటనీరులా.
      ఏదో చేయాలి. అవును, ఇలాంటి అమ్మలు ఈ లోకంనుంచి దూరమవ్వకుండా ఉండేందుకు ఏదో ఒకటి చేయాలి. ఆ నిర్ణయం తర్వాత సుజిత్‌ మనసులో ఏదో ప్రశాంతత.

* * *

      అది శిల్పకళా వేదిక....
      సన్మానసభ జరుగుతోంది. డీజీపీ మాట్లాడుతున్నాడు.
      ‘‘రోడ్డు మీద ప్రమాదం జరిగింది. బాధితులు రక్తం మడుగులో పడి ఉన్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరిమానాన వాళ్లు వెళ్లిపోతున్నారు. అంతలోనే కొంతమంది కాలేజీ విద్యార్థులు అక్కడికొచ్చారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న వాళ్లను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. కొంతమంది పోలీసులకీ ఆస్పత్రికీ విషయాన్ని చేరవేస్తే, ఇంకొంతమంది బాధితుల కుటుంబ సభ్యులను తీసుకొచ్చే బాధ్యతల్ని తీసుకున్నారు. మరికొంతమంది చికిత్స కోసం అవసరమైన రక్తం, మందులు వంటి అవసరాలు తీర్చారు. అంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. ఇదంతా కథలానో, కలలానో అనిపిస్తోంది కదూ! కానీ నిజం. దీనంతటి వెనకా ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి అంటే నమ్మగలరా?’’ చెప్పడం ఆపాడు డీజీపీ.
      ఆడిటోరియంలో గాఢమైన నిశ్శబ్దం. అంతా వేదికవైపే చూస్తున్నారు.
      అవును, ఒక్క వ్యక్తే. ఎంతోమందికి ప్రాణదాత అయ్యాడు. ఇప్పుడతణ్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. అన్నాడు డీజీపీ అభినందనలు నిండిన స్వరంతో.
      వేదికపై అందరి ముందుకూ వచ్చాడా యువకుడు అతనే... సుజిత్‌!
      చప్పట్లు మార్మోగాయి హాలులో...
      గొంతు సవరించుకున్నాడు సుజిత్‌... ‘‘మనిషి ప్రాణం విలువ ఒక జీవితం. ఒక కుటుంబం. ఒక అనుబంధం!
      అవును... ఒక ప్రాణంపోతే జీవితం కోల్పోయినట్లే, ఒక కుటుంబం కూలినట్లే, ఒక అనుబంధం, ఆప్యాయత చెదిరినట్లే... ఇవేవీ మనం డబ్బులు పోస్తే వచ్చేవి కావు. నిర్లక్ష్యంతో ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు.
      ఈ ఆలోచన నా మనసును తొలిచే... నేనీ ప్రాజెక్టు మొదలుపెట్టాను. నా వెంట ఎంతోమంది తోడుగా నిలిచారు. ఎవరూ రోడ్లపై నిర్లక్ష్యానికి బలవకూడదన్నదే మా ప్రయత్నం. నిర్లక్ష్యం ఖరీదేంటో... అదెంత గాయం చేస్తుందో నా మనసుకు తెలుసు...’’ అన్నాడు సుజిత్‌ కళ్లనిండా కన్నీటితో...

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోని


కొత్త పలక

కొత్త పలక

కుప్పిలి సుదర్శన్‌bal bharatam