ఏటికేతంబట్టి

  • 371 Views
  • 6Likes
  • Like
  • Article Share

    ఎస్‌. సంపత్‌కుమార్‌

  • యోగాచార్యులు,
  • కరీంనగర్‌.
  • 9346435123
ఎస్‌. సంపత్‌కుమార్‌

ముద్దు మనుమలతో ముచ్చట్లాడుకుని ఊరి జనాలతో గొప్పోళ్లనిపించుకుని పండు వయసులో వేసంగి వ్యవసాయం చేసే మిథునం.. తుదకు దయలేని విధి మిగిల్చె మరణం..
మా ఊర్ల
రాజయ్య తాతంటె తెల్వనోల్లు లేరు. తెల్లారిన కాడికెల్లి రాత్రిదాక చేన్ల చెల్కల్లనే తన బతుకు. నోరిప్పి ఒకల్నొకమాటనడు. దండి అభిమానంగల మనిషి.
      ఉన్న రెండెకరాలు సాగుజేసుకుంటడు. వచ్చిన పంట కొంత తిండికుంచుకోని, కొంత అమ్ముకుంటడు. అమ్మిన పైసలు ఆడదానికిస్తడు. నూరున్నొక్క సామాన్లు ఆమెనే తెచ్చి, కమ్మగ వంటజేసి మొగనికి పెట్టి తనింత తింటది.
      ఇద్దరు బిడ్డల పెండ్లిండ్లు చేసిండు. పెద్దదాన్ని మేనోళ్లకే ఇచ్చిండు. చిన్నబిడ్డను ఊళ్లదూళ్లనే తెల్సినోండ్లింటికిచ్చిండు. బిడ్డలు ఎవరికాశపడకుండ మంచిగనే బతుకుతున్నరు. పండుగలకు పబ్బాలకు బిడ్డలను అల్లుండ్లను ఇంటికి పిలుస్తరు. ఊరికోడిని కోసి కూరజేసి పెడ్తరు. అంబటాల్లకు బోయి ఎల్లాగౌడు దగ్గర మంచి ‘నీర’ తెస్తడు.
      మనువడు, మనుమరాల్లంటే రాజయ్యకు చెప్పరాని ప్రేమ. తాత బాగ గార్వం చేస్తడని పిల్లగాండ్లు ప్రాణం బెడ్తరు. భుజాల మీద కూచోబెట్టుకొని సంతకు తీస్కపోయి, ఏదడిగితదే కొనిస్తడు. రెండు మూడ్రోజులు సంబురం. ఎప్పటికి ఈడ ఉండరాదాయె. బడికి పోవాల్నాయె. తాతను ఇడువలేక ఇడువలేక ఎల్లిపోతరు. 
      రాజయ్య సంగతి తెల్సుగద. పని దెయ్యం. దున్నుడు పెడ్తె పొంటెకు పొంటె దున్నుడేనాయె. అదైనంక ఎడ్లకు బొత్తలనిండ పచ్చగడ్డి… మేపి, నీళ్లు తాగిపిస్తడు. పెండ్లాం సద్ది తెస్తది. కాల్జేతులు కడుక్కోని చెట్టు నీడకు చేరుతడు.
      మంచి ఆకలి మీదుండె. కలో గంజో కల్పుకోని కడుపు నిండ తింటడు. ఉన్నంతల మంచి కూరలో, పప్పుపులుసో వండుకోని తెస్తది పెండ్లాం. నాల్కకు ఆయిమనాల్నని మాడికాయ తొక్కు తెస్తది. ఆలుమగలు మంచిగ కల్సి ఉంటరు. ఆయన దున్నుతుంటే, ఆమె విత్తనాలు చల్లుతది. ముక్కుకు బట్టకట్టుకోని పొలాలకు మందుజల్లుతది. ఆమెకు రాని పన్లేదు.
      వేసంగి పొలం బెట్టిండ్రు. నారు మంచిగ పచ్చగ పెరిగి పొట్టకు వచ్చింది. కావాల్సినన్ని నీళ్లు పెట్టిరి. బాగా పైసలు బెట్టి మంచి మందులేసిరి. ఇద్దరికిద్దరు పొలాన్ని కాపుగాస్తండ్రు. పొలం ల నారంత పసుపురంగుకు మర్లింది. నాల్రోజులల్ల కోతకచ్చింది. చూస్తేనే దిష్టి తగిలేటట్టున్నది. ఇగ రెండ్రోజులైతే పొలం కోసుడే, కుప్పలేసుడే, బంతి తిరుగుడే. పంట చేతికి రాంగనే అమ్మి సావుకారు బాకీ ముట్టజెప్పాలే. పసలెల్ల తినంగ మిగులదా! 
      పెండ్లాం మొగల్లు తెగ సంతోషం కొద్దీ ఉన్నరు. రాత్రి తిని ఈడనే పందామనుకున్నరు. ఒక్కసారే మబ్బులు కమ్ముకచ్చినయి. తళతళ మెరుపులు, ఫెళఫెళ ఉరుములు ఆకాశంలో వెల్గులు చిమ్ముతున్నయి. రాజయ్య ముఖంల బయం కనవడ్డది. ఆరుగాలం కష్టపడిన పంట చేతులకచ్చేటాల్లకు ఏమైతదోనని బుగులు పట్టుకున్నది. 
      ఇద్దరు పొలం కాడ ఒడ్డుమీద కూచున్నరు. చిటపట చినుకులు రాలబట్టినయి. ఆకాశానికి, వానదేవునికి చేతులెత్తి మొక్కబట్టిరి. దేవునికి ఈళ్ల మొరముట్టలేదేమో! వాన ఈడ్చి చంపబట్టింది. వరి పక్కకు ఒరుగవట్టె. చూసిన కొద్ది రాజయ్య మనసు కలకలమనబట్టింది. 
      ఆలుమొగలు ‘‘నీ బాంచెను వానదేవుడా! ఇగ కొట్టకు’’ అని పబ్బతులు బట్టి గోడుమన్నరు. వాన జోరైన కొద్దీ ఇద్దరి కండ్లల్ల నీళ్లెక్కువైనయి. వడగండ్లు పడబట్టె. వడ్లు రాలిన చప్పుడుకు రాజయ్య బొచ్చంత కొట్టుకుంట అటుఇటు ఉరుకు తున్నడు. రాళ్లవాన దెబ్బలకు ఇద్దరి ఒంటి మీద బొబ్బల్లేసినయి. వాన బీభత్సమైంది. 
      కన్నీరుమున్నీరై తలకాయ పట్టుకొని కూలబడ్డడు రాజయ్య. వానదేవునికి జాలిలేకపాయె. ఇద్దరి గుండెలు పగిలి కన్నీళ్లై, వరదనీళ్లల్ల కలిసిపారినయ్‌. ‘‘అప్పులెట్ల తీరుస్తం, అన్నమెట్ల తిందు’’మని ఓండ్లనోండ్లు పట్టుకొని ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పోయిండ్రు. అంతవానకు రాజయ్యకున్న ఇల్లుకూడ కూలిపోయింది. 
      తెల్లారి పేపర్లల్ల, టీవీలల్ల మొత్తం వాన బీభత్సపు వార్తలే నిండినయి. రాజకీయాలు మొదలైనయి. నాయకులు వచ్చుడు, వరి పట్టుకోని ఫొటోల్దిగుడు. ఎవరిచ్చింది లే!చేసిందిలే! నష్ట పోయినోళ్లకు పరిహారమిస్తమని సర్కారు ప్రకటించింది. చావలేక బతికిన రాజయ్య ఎవల్ని చేయి జాపి అడిగినోడు కాదు. కానీ, ఏంజేస్తడు పాపం? పంటనాశనమై కుంటల కల్సింది. ఇల్లు కూలిపోయి నీడలేకుంట యింది.
      ఆశకొద్దీ ఆపీస్‌ పొంటి తిరిగి తిరిగి చెప్పులరిగిపోయినయి. కానీ, పరిహారమంద లేదు. ఇంటి తొవ్వబట్టిండు. పట్టపగటెండ నిల్చి కొడ్తున్నది. అడుగులు తడబడుతు న్నయి. కండ్లు తిరుగుతున్నయి. ఊర్లకచ్చే టాల్లకు గుండెల్ల పిసికినట్టయి కూలబడ్డడు.
      ‘‘అయ్యో! ఏమైందయ్య నీకు?’’ అని ఉరుక్కుంట పోయి చెంబెడు నీళ్ళు దెచ్చి తాగించింది రాజయ్య పెండ్లాం. తాగబోయి రాజయ్య అట్లనే ఇరుసుకపడ్డడు. ఊరి జనమంత కుప్పయిండ్రు.
      కాకులు జేరి ‘‘కావు... కావు’’మని అరుస్తున్నయి. ‘‘కావుమ’’ంటే కాపాడుమన్నట్టా లేకపోతే ‘‘పైసలు సాంక్షన్‌ కావు’’ అన్నట్టా? దేవుడ్నే అడుగుదామని ఆయనదగ్గరికే పోయిండు రాజయ్య. నోట్ల మాటరాక మొగని మీదనే ఒరిగింది పెండ్లాం.
      ‘‘ఏటి కేతం బెట్టి యెయిపుట్లు పండించి
      ఎన్నడూ మెతుకెరుగనన్నా!
      నేను గంజిలో మెతుకెరుగనన్నా..!’’
      ఎక్కణ్నో దూరంకెల్లి పాట వినబడుతున్నది.
      ‘‘ఎసోంటి మనుషులెట్లయిపోయి’’రని ఊరి జనమంతా ఉస్సూరుమన్నరు...

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోని


కొత్త పలక

కొత్త పలక

కుప్పిలి సుదర్శన్‌bal bharatam