ప్రేమ కానుక‌

  • 252 Views
  • 2Likes
  • Like
  • Article Share

    పార్థసారథి చిరువోలు

  • హైదరాబాదు
  • 9908892065
పార్థసారథి చిరువోలు

ఒక ప్రేమ తెరచాటు కానుక మధ్యవయస్కుని హృదయాంతరంగాన్ని ఎంత కలవర పెట్టిందో, అతని భార్యకి ఎన్ని కలల కలువల్ని పంచిపెట్టిందో...
ఆరోజు
ఉదయం...
ఆఫీసు ప్రారంభమైన అర్ధగంటకి
కొరియర్‌ కుర్రాడు తెచ్చిచ్చిన పార్సిల్‌ చూశాక తాతాజీలో ఎక్కడా లేని హుషారొచ్చింది. దాన్ని ఆత్రంగా విప్పి చూశాడు. లేటెస్ట్‌ మోడల్‌ ఐపాడ్‌. దాంతోపాటు ఓ గులాబీరంగు కాగితం. చుట్టూతా పూలకుచ్చు అంచు... అందంగా! 
సాధారణంగా కుర్రాళ్లు ప్రేమసందేశాలు పంపేందుకు ఇలాంటి ప్రత్యేకమైన కాగితాలు వాడతారని విని ఉన్నాడు. అలాంటిది అందుకోవడం మాత్రం ఇదే మొదటిసారి.
      అందులో...
      ‘నా మనసుకి నచ్చిన మీకు... ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో..’ అని మాత్రమే రాసి ఉంది.
      అది పంపిన వాళ్లు తమ పేరు మాత్రం రాయలేదు. చేతిరాతను బట్టి అది ‘ఓ స్త్రీ పని’ అని మాత్రం గ్రహించగలిగాడు తాతాజీ.
      అతను యుక్తవయసు వాడేం కాదు, ఓ పాపకు తండ్రి. ఆ ఆఫీసులో పది పన్నెండేళ్లుగా పని చేస్తున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉంటాడన్న పేరుంది.
      ఓ స్త్రీ తనను అమితంగా ఇష్టపడుతోందన్న విషయం ఇచ్చినంత సంతృప్తి మగాడికి మరేదీ ఇవ్వలేదేమో! అందుకే తాతాజీలో పార్సిల్‌ పొందిన ఆనందం - అది ఎవరు పంపారో తెలుసుకోవాలన్న ఆత్రుత ఒకేసారి మొదలై ఉక్కిరిబిక్కిరి చేశాయి. పని మీద మనసు లగ్నం చేయలేకపోయాడు.
      ఆఫీసంతా పరికించి చూశాడు. తన డిపార్ట్‌మెంట్‌లోనే ఆరుగురు మహిళలు. వాళ్లు కాక ఇంకో డజను మంది దాకా ఈ బ్రాంచిలో పని చేస్తున్నారు. ‘ఈ పని చేసింది కచ్చితంగా ఇందులో వాళ్లే... అదీ తనను ఆట పట్టించడానికి పరిచయమైన వ్యక్తులే’ అని తనకు తానే తీర్మానించుకున్నాడు. 
      తలెత్తి చూస్తే- కంప్యూటర్‌ ముందు దీక్షతో పని చేస్తున్న వైష్ణవి కనిపించింది. ఆఫీసులో అనేక విధాలుగా ఆమెకి సాయపడ్డాడు. ఎకౌంట్స్‌లో తేడాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పదేపదే ఆమెకి చెప్పేవాడు. పై అధికారులు ప్రశ్నలు వేసినప్పుడు తెలివిగా సమాధానాలు చెప్పి బయటపడటం నేర్పాడు. ‘బహుశా ఆ కృతజ్ఞతతోనే బహుమతి పంపి ఉండొచ్చు’ అనుకున్నాడు. తేలికపడిన మనసుతో ఆమె దగ్గరికి వెళ్లి పలకరించాడు. 
      ఆమె ముభావంగా జవాబిచ్చింది. విషయం బయటపడుతుందన్న భయంతో గంభీరంగా ఉండటానికి ప్రయత్నిస్తోందేమోనని అనుమానం వచ్చి - మరికాసేపు సంభాషణ కొనసాగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
      నిరాశగా వచ్చి సీట్లో కూలబడ్డాడు తాతాజీ. కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. అప్పట్లో చాలామంది స్నేహితులకి చిలిపి ప్రశ్నలతో ఉత్తరాలు వచ్చేవి. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సాయంత్రం మున్సిపల్‌ పార్కుకి రా... ఏకాంతంగా ప్రేమ ఊసులు చెప్పుకుందాం’లాంటి మాటలేవో అందులో ఉండేవి.
      ఉబ్బితబ్బిబ్బయి - మర్నాడు ముస్తాబై అక్కడికెళితే ఎవరూ కనిపించేవారు కాదు.
      ‘బుజ్జికన్నా! అద్దంలో నీ మొహం ఎప్పుడన్నా చూసుకున్నావా? నిన్నెవడ్రా ప్రేమించేది...’ అనో, ‘ఐశ్వర్యరాయ్‌లు నీకు దొరకరు గానీ - కల్పనారాయ్‌లు దొరుకుతారేమో ప్రయత్నించి చూడు’ అనో, ‘నీ ఎత్తుకి తగిన పిల్లలు దొరకరు గానీ - పక్క దేశంలో ప్రయత్నించు’ అనో మాటలతో దెప్పిపొడుస్తూ మరో ఉత్తరం వచ్చేది. అది పట్టుకొని మగపిల్లలంతా ఆట పట్టించేవారు. ఆడపిల్లలూ తక్కువ తినలేదు. ఈ విషయాన్ని రహస్యంగా చెప్పుకొని కిసుక్కుమంటూండేవారు. తనెప్పుడూ ఇలాంటి వాటిల్లో దూరింది లేదు గానీ, స్నేహితులు ఇలాంటివి రోజుకొకటి చెవిన వేసేవారు. 
పక్క డిపార్ట్‌మెంట్‌లో కొందరు  ఆడవాళ్లు గుమిగూడి ఏదో చర్చించుకుంటున్నారు. అద్దాల గోడ అవతలవైపు నుంచి ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీట్లోంచి లేచి అటువైపు వెళ్లాడు. వాళ్లెవరూ అతణ్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నగరంలో కొత్తగా ఏర్పాటైన షాపింగ్‌ మాల్లో చీరలు చవకగా అమ్మటం గురించి సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. అక్కడ నిలువబుద్ధి కాక గబుక్కున వెనక్కి తిరిగొచ్చాడు. 
      ‘అది జెన్నీ పని కాదు కదా..!’ - ఆమె తన ఎదురుగా నాలుగైదుసార్లు అటూఇటూ తిరుగుతూంటే ఎందుకో అనుమానం వచ్చింది తాతాజీకి.
      జెన్నీ అంటే ఆఫీసులో చాలామంది మగవాళ్లకి అదోలాంటి బెరుకు. ఆమె చూపించే చొరవ ఇబ్బందుల పాలు చేస్తుందనేది వాళ్ల అనుభవం.
      ఓసారి కొలీగ్‌ పెళ్లికి ఆఫీసంతా వెళ్లారు. వ్యక్తిగత పనులవల్ల ఆమె రాలేకపోయింది. మరుసటి రోజు- అతనింటికి ఫోన్‌ చేసి... ‘సుబ్బారావు ఉన్నాడా...’ అని ఏకవచనంతో అడిగింది. మీరెవరని అవతల వ్యక్తి ప్రశ్నిస్తే - కొలీగ్‌నని చెప్పడానికి బదులు ‘ఫ్రెండ్‌’ అని సమాధానం ఇచ్చింది.       ‘పెళ్లికెలాగూ హాజరు కాలేదు. కనీసం శోభనానికైనా పిలిస్తే రెక్కలు కట్టుకొచ్చి వాలతా’ అంది ఉడికిస్తున్నట్టుగా.
      ఆ ఫోన్‌ అందుకున్నది సుబ్బారావు భార్య. కొత్త పెళ్లి కూతురు. అదే రోజు వాళ్లిద్దరికీ శోభన ముహూర్తం. ఇంకేముంది. జెన్నీ ఫోన్‌కాల్‌తో మొదటిరోజే ఇద్దరి మధ్యా వాదనలు మొదలయ్యాయి.
      మర్నాడు ఆఫీసుకొచ్చి అతను గోలపెడితే - ఒకరి తరువాత మరొకరు వరుసగా వాళ్లింటికి వెళ్లి సుబ్బారావు మంచితనం గురించి రకరకాలుగా నచ్చజెప్పాక గానీ అతని భార్య దారికి రాలేదు. ఇదంతా సర్దుకొని ఆ సంసారం గాడిన పడటానికి ఐదారు నెలలపైనే పట్టింది.
      ‘ఫేస్‌బుక్‌లో రకరకాల కామెంట్స్‌ జోడించటం, ఆఫీసుకు రాని ఉద్యోగులకు ‘ఐ మిస్‌ యు డియర్‌’ అంటూ ఎస్‌ఎంఎస్‌లివ్వడం వంటి ప్రాక్టికల్‌ జోక్స్‌తో మగవాళ్లని ఇబ్బంది పెట్టడం ఆమె సహజ స్వభావం. కొంపతీసి ఆమె ఈసారి ఆ ప్రయోగం తన మీద చేయలేదు కదా...’ తాతాజీ ఆలోచనల్లో ఉండగానే- ఆమె అతని సీటు దగ్గరికి వచ్చింది.
      ‘‘వాట్‌ బాస్‌. నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు, తలాడిస్తున్నావ్‌. కొత్తగా ప్రేమలో పడ్డ కుర్రాడి మాదిరిగా...’’ అనేసరికి తెగ సిగ్గుపడిపోయాడు.
      ‘జెన్నీదంతా డైరెక్ట్‌ ఎటాక్‌. చాటుమాటు వ్యవహారాలు ఆమెకి గిట్టవు’ - తనకి తానే సమాధానం చెప్పుకుని మామూలుగా నవ్వేసి క్యాంటీన్‌ వైపు సాగిపోయాడు. 
      కొలీగ్స్‌ అంతా మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఎవరి గొడవలో వాళ్లున్నారు. లేడీకొలీగ్స్‌ దగ్గరకెళితే- ఎవరైనా బయట పెడతారేమోనని ప్రయత్నించినా అవతలి వాళ్లెవరూ పెద్దగా పట్టించుకోలేదు.
      తిండి సహించక- మళ్లీ వెనక్కొచ్చి సీట్లో కూలబడ్డాడు. అదేదో సినిమాలో ఒకరికి పంపిన ప్రేమలేఖ మరొకరికి చేరినట్టు, తన పేరుతో ఉన్న వేరెవరికైనా చేరాల్సిన పార్సిల్‌ తనకొచ్చిందా? అనుమానంతో కవరువైపు చూసి - చిరునామాలో పేరు, అధికార హోదా స్పష్టంగా పేర్కొన్నారు, ఇది కచ్చితంగా తనకొచ్చిందే’నని నిర్ధరించుకున్నాడు. ఎంత ప్రయత్నించినా పనిమీద మనసు లగ్నం కాలేదు. ఆలోచనలతో తల పగిలిపోయింది. ఇక ఆఫీసులో ఉండలేకపోయాడు.

*  *  *

      రోజూకంటే ముందుగా ఇంటికొచ్చిన భర్తను సాదరంగా ఆహ్వానించింది కైవల్య.
      తాతాజీ రోజూ ఆఫీసు నుంచి రాగానే అక్కడి విషయాలన్నీ పూసగుచ్చినట్టు ఆమెకు చెబుతాడు. అందులో ఆమెకు కొన్ని అర్థం కావు. అయినా అతను అదేమీ పట్టించుకోకుండా చెప్పుకుపోతుంటాడు.
      ఈ రోజెందుకో అతను ముభావంగా ఉన్నాడు. అతణ్ని చూడగానే ఆ విషయం ఆమె గ్రహించింది. తనేమైనా చెబుతాడేమోనని ఎదురుచూసి, అతను మౌనంగా ఉండటం గమనించి - ‘‘తలనొప్పిగా ఉందా? జండూబామ్‌ రాయనా?’’ అని అడిగింది.
      ‘‘అవసరం లేదు’’ అన్నాడు ముక్తసరిగా.
      ‘‘పోనీ... టీ తెమ్మంటారా?’’
      ‘‘ఊఁ’’ అన్యమనస్కంగా జవాబు చెప్పాడు.
      ఆమె వంటింట్లోకి నడవగానే - టీపాయ్‌ మీదున్న రిమోట్‌ అందుకొని వరుసగా ఛానళ్లు మార్చసాగాడు. దేనిమీదా ఆసక్తి కలగలేదు. అలా చూస్తూనే ఉన్నాడు. 
      ‘భార్యాభర్తలను ఏకం చేయడం కంటే - వారి బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికే ఈ చట్టం ఉపయోగపడుతుంది. భర్తను దారిలోకి తెచ్చుకోవడానికి కొంతమంది ఈ సెక్షన్‌ను ఉపయోగించుకొని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. భర్త మాత్రమే కాకుండా అత్తమామలు, ఆడపడుచులు, వారి బంధువులు వేధింపులకు గురవుతున్నారు’ హైకోర్టు  చేసిన వ్యాఖ్యలపైన చర్చావేదిక నడుస్తోంది. 
      ‘స్త్రీలను అణచివేస్తున్న మగవాళ్ల దురహంకారాన్ని అదుపు చేయాలంటే ఇలాంటి చట్టం అవసరమే...’ మధ్య వయసు ఆవిడెవరో గట్టిగా వాదిస్తోంది. 
      ఇంకో ఛానల్‌ తిప్పితే...
      అదేదో సీరియల్‌- ఓ పారిశ్రామిక వేత్త రెండో భార్య మొదటి భార్య అడ్డు తొలగించుకోవడానికి హంతక ముఠాతో చేయి కలిపి ‘సుపారి’ ఇస్తోంది. తాతాజీకి విసుగెత్తింది.
      ‘మీ పేరులో అక్షరాల్లో నెగెటివిటీ ఎక్కువ ఉంది. కాబట్టి మీ పేరు ముందు ‘బి’ అక్షరాన్ని చేర్చి, చివర్లో రెండు ‘ఎ’లు కలిపి రోజుకి వెయ్యిన్నూటపదహార్లు రాస్తూ పోండి. పది రోజులకల్లా మీ దశ తిరిగిపోతుంది.’ ఎవరో ఒకాయన చెబుతున్నాడు. ‘పది రోజులు రాస్తే - దశ సంగతి దేవుడెరుగు, చేతివేళ్లు కొంకర్లు పోవడం మాత్రం ఖాయం’ అనుకున్నాడు తాతాజీ.
      ఇంకో ఛానల్లో చారు ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చో చెబుతోంది సినిమాల్లో వేషాల్లేక బుల్లి తెరనే నమ్ముకున్న ఓ తార. అలా ఛానళ్లు తిప్పుతున్నాడేగానీ అతని ఆలోచనలన్నీ ‘తనకి బహుమతి పంపిన వాళ్లెవరా?’ అనే విషయం చుట్టూనే తిరుగుతున్నాయి.
      ‘ఇంటి చుట్టుపక్కల వాళ్లెవరైనా ఈ పని చేసుంటారా?’ ఆలోచించసాగాడు.
      ఈ ఇంటికి వచ్చి మూడు నెలలే అయింది. తనకి పరిచయస్థులెవరూ లేరు. మార్నింగ్‌ వాకర్స్‌లో గానీ, క్లబ్బులో గానీ... మరెవరైనా గానీ... ఊఁ హు... ఆ అవకాశమే లేదు. ఇప్పటిలా ఆడపిల్లలు సన్నిహితంగా మెలగడం, స్వేచ్ఛగా ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి తను చదువుకొనే రోజుల్లో లేవు. తను ఆడవాళ్లతో అంత చనువుగా ఉన్నదీ లేదు.
      కైవల్య టీ కప్పుతో వచ్చి పక్కన కూర్చున్న విషయం అతను గుర్తించలేదు. ఆమె పలకరించేసరికి తడబడ్డాడు. టీ కప్పు తీసుకుని ‘నువ్వు లోపలికి వెళ్లి పని చేసుకో’ అని ఆమెని పంపేశాడు. ఇలాంటి చిలిపి పనులు చేసి ఏడిపించే స్నేహితులు లేరు. అసలు వాలెంటైన్స్‌ డే లాంటివి సెలబ్రేట్‌ చేసుకునే సందర్భాలు తన జీవితంలో ఇంతవరకూ ఎదురు కాలేదు.
      తాతాజీ మనసులో చిక్కుముడి వీడటం లేదు. ఆ వ్యక్తి ఎవరో తేలేదాకా స్థిమితంగా ఉండటం కష్టమనిపించింది. అప్పుడే ప్రైవేటు నుంచి తిరిగొచ్చిన ఆరేళ్ల కూతురు దగ్గరికి చేరి కబుర్లు చెప్పడం ప్రారంభించింది. 
      ‘‘నాన్నా! ఈ రోజు ట్యూషన్లో...’’ ఆమె చెప్పడం పూర్తి కాలేదు. 
      తనమీద విసుక్కున్నాడు. పాప బిత్తరపోయింది. రోజూ తను బడి నుంచి రాగానే పక్కనే కూర్చుని కబుర్లు చెబుతూ దగ్గరుండి హోంవర్క్‌ చేయిస్తాడు. భోజనం చేసి పడుకునే వరకూ వెంటే ఉంటాడు. అలాంటిది తండ్రి కసురుకోవడాన్ని ఆ పాప తట్టుకోలేకపోయింది.
      ‘‘నాన్నకి ఒంట్లో బాలేదు. విసిగించకు’’, అని చెప్పి కైవల్య లోపలికి తీసుకెళ్లి అన్ని పనులూ చేయించి నిద్రపుచ్చింది.
      ఆ తరువాత తనూ నిద్రపోయింది. అర్ధరాత్రి ఆమెకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. డ్రాయింగ్‌ రూంలో లైటు వెలుగుతోంది. తాతాజీ అదే సోఫాలో ఏదో ఆలోచించుకుంటూ కూర్చుని కనిపించాడు. కైవల్యకి జాలేసింది. ఆమె ఆలోచనలు నాలుగు రోజులు వెనక్కి మళ్లాయి.

*  *  *

      ‘పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు పెద్దలు. ఈ భూమ్మీద దాన్ని నిలపాల్సిన బాధ్యత మాత్రం దంపతులదే’ - దాంపత్యానికి రొమాంటిక్‌ టచ్‌ పేరుతో తన అభిమాన రచయిత రాసిన వ్యాసం దీక్షగా చదువుతోంది కైవల్య. చాలా ఆసక్తికరంగా అనిపించింది ఆమెకి.
      కవులు, రచయితలు, మేధావులు, తత్త్వవేత్తలు పెళ్లిని రకరకాల కోణాల్లో దర్శించారు. ఒక్కరంటే ఒక్కరైనా ఎలాంటి దంపతుల మధ్య వివాహం విజయవంతమవుతుందనే ధర్మసూక్ష్మాన్ని మాత్రం పట్టుకోలేకపోయారు. చెవిటి భార్య, అంధుడైన భర్త సరిజోడి. పెళ్లి ఓ జూదం, ఓ లాటరీ...       అదో యుద్ధ రంగం... స్వర్గానికి, నరకానికి నడుమ ఊగిసలాడే త్రిశంకుస్వర్గం... ఇలా ఎన్నో చెప్పారు. పెళ్లి పుస్తకంలో తొలి విభాగమంతా ఏక లయతో సాగే రసవత్తర కవిత్వమైతే, ఆ తర్వాత అంతా మలుపులతో కూడిన వచనమట. ఈ రెండింటికీ పొంతన ఉండదని తేల్చి పారేశారు.
      అది ‘మ్యారేజ్‌’ కాదు... ‘మిరేజ్‌’గా చదువుకోవాలి అన్నారు ఒకాయన. ‘భావోద్వేగాల చెత్తకుప్ప- పెళ్లి’ అని నిర్వచించారు ఇంకో ఆయన. ‘మంచి భార్య నీకు దొరికిందా సరే - అదృష్టవంతుడివే, సుఖంగా జీవిస్తావు... లేదా? నువ్వు తత్త్వవేత్తగా తయారవుతావు. భయపడకు’ - భరోసా ఇచ్చాడు సోక్రటీసు. గయ్యాళి భార్యలున్న మగాళ్లకి ఇదో టానిక్‌.
      ‘ఓ వ్యక్తి తన భార్య ఎక్కేందుకు కారు డోర్‌ తెరిచి ఉంచాడంటే - ఆ కారు కొత్తదన్నా అయి ఉండాలి లేదా అతను ఆమెను కొత్తగా వివాహం చేసుకునైనా ఉండాలి’ అని చమత్కరించాడు మరొకాయన మగవాళ్ల నైజాన్ని చెబుతూ.
      ఆ వ్యాసాన్ని కైవల్య ఏకాగ్రŸతతో చదవసాగింది. రచయిత చెప్పిన తీరు బాగుందని అనుకోకుండా ఉండలేకపోయింది. ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ రవిశంకర్‌ దగ్గరికెళ్లిన కొందరు ‘పెళ్లిళ్లు విజయవంతం కావాలంటే ఏం చేయాలి?’ అని ప్రశ్నించారట. ఆయన గడ్డం సవరించుకుంటూ ఇలా చెప్పారు.
      ‘భర్త ఎలాంటి వాడైనా భార్య అతని అహాన్ని దెబ్బతీయకూడదు. అతనికి మెదడు లేకపోయినా దాన్ని అతడు ఏ మాత్రం ఉపయోగించకపోయినా నీ అంతటి వాడు లేడు అనాలి. అప్పుడే అతను ఇంట్లో మనశ్శాంతిగా ఉండగలుగుతాడు’, అనగానే ఆడవాళ్లంతా పెద్దపెట్టున నవ్వారు. 
      ‘నీ సామర్థ్యాన్ని నిరూపించుకోమని మొగుళ్లను సతాయించొద్దు -బాహ్య ప్రపంచంలో అడుగడుగునా వాళ్లు తామేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి’, ఈ మాటలు చెప్పగానే వాళ్ల నోళ్లు మూతపడ్డాయి. ఆ తరువాత రవిశంకర్‌ మగవాళ్లవైపు తిరిగి - ‘భార్య కోరికలను మన్నించండి. ఆమె బట్టల దుకాణానికి వెళతానన్నా, స్టోర్స్‌ క్లబ్‌కి వెళతానన్నా, ధ్యాన శిబిరానికి హాజరవుతానన్నా అంగీకరించండి. ఆమె చేతిలో క్రెడిట్‌కార్డు ఉంచండి’ అన్నారు. హాలులో మళ్లీ నవ్వులు.
      చివర్లో స్త్రీ, పురుషులిద్దరినీ ఉద్దేశించి మళ్లీ చెప్పారు, ‘మునుపట్లా నువ్వు నన్ను ప్రేమగా చూడటం లేదని పైకి ఎప్పుడూ అనకండి. మీరెప్పుడూ ప్రేమను పంచడానికి సిద్ధంకండి, అప్పుడే మీ దాంపత్యం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది’, రవిశంకర్‌ ముగించారు. వివాహబంధం గొప్పతనం గురించి బ్రహ్మచారి అంతబాగా చెప్పడం అక్కడున్నవాళ్లను ఆశ్చర్యపరచింది.
      కైవల్య ఒక్కసారి తమ దాంపత్య జీవితాన్ని తడిమి చూసుకుంది. తాతాజీ ప్రవర్తన, తను స్పందించే తీరు కళ్లముందు మెదిలాయి. మళ్లీ వ్యాసం చదవటంలో నిమగ్నమైంది.
      పది పేజీలున్న ఆ వ్యాసంలో చివర్లో రచయిత చేసిన సూచనల దగ్గర ఆమె కళ్లు నిలిచిపోయాయి.
      ‘ఒకే వ్యక్తితో మళ్లీ మళ్లీ ప్రేమలో పడటమే - పెళ్లిని విజయతీరాలకు చేరుస్తుంది. యాంత్రికంగా సాగే మీ దాంపత్యానికి రొమాంటిక్‌ టచ్‌ ఇచ్చి చూడండి. ఒక్కసారిగా ఎంతటి చైతన్యం వస్తుందో... ఇందుకు మీ జీవిత భాగస్వామికి అనుకోని బహుమతి ఇచ్చి ఆశ్చర్యకరమైన ఆనందానికి లోను చేయండి. అది అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్దరోతున్న సమయంలో - గాఢమైన ముద్దు ఇవ్వటం కావచ్చు. ఇంటి నుంచి వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు బిగి కౌగిలిలో బంధించడం కావచ్చు. పెళ్లయిన కొత్తలో ఎంత రొమాంటిక్‌గా గడిపామో గుర్తు చేస్తూ ప్రేమలేఖ పంపడం కావచ్చు. ఇవేమీ కాకపోతే...’ అందులో మరికొన్ని సూచనలున్నాయి.
      ఆ వ్యాసం చదవటం పూర్తయ్యే సరికి ఆమె మనసులో ఆలోచనలకి ఓ రూపం వచ్చింది. వెంటనే ఓ బహుమతి ఇవ్వాలనుకుంది. తన భర్తను థ్రిల్‌ చేయబోతున్నానన్న ఆనందంలో ఉక్కిరిబిక్కిరైంది.
      ‘కొరియర్‌ అందినట్లుంది. అందుకే పాపం జుట్టు పీక్కుంటున్నాడు. రోజూ రాత్రి పదైతే చాలు, ముసుగుతన్ని పడుకునేవాడు.. ఇవాళ నా ప్రేమ కానుక మంత్రానికి అర్ధరాత్రి దాటినా ఆపసోపాలు పడుతున్నాడు..’ తెరలు తెరలుగా నవ్వొచ్చింది కైవల్యకి.
      ఈ బాధంతా మనసువిప్పి తనతో చెప్పుకుంటే..
      బుజ్జికన్నా.. నిన్ను థ్రిల్‌ చెయ్యాలనే ఇలా చేశానని చెప్పేసేదే..
      కానీ మహానుభావుడు అసలు నోరు తెరిస్తేనా..? నూటికి తొంభైమంది ఇంతే. తమ జీవిత భాగస్వాములతో మనసువిప్పి మాట్లాడరు. కొందరు మనసారా మాట్లాడితే, అవతలి వాళ్లు సక్రమంగా అర్థం చేసుకోరు..
      ఇదో చిత్రమైన వైవాహిక జీవితాంశం. భర్త అవస్థ చూసి ఆ నిమిషంలో కైవల్యకి జాలేసింది. తనే చొరవతీసుకుని చెప్పేయాలనుకుంది. ప్రేమగా అతని భుజాలపై చేతులు వేసింది.. తాతాజీ ఉలిక్కిపడి వెనక్కి చూశాడు.. నోరుతెరచి ఏదో చెప్పాలని ప్రయత్నించింది.. కానీ ఎందుకో తెలీదు, అక్కడే ఆగిపోయింది. గుప్పిట విప్పి రహస్యాన్ని బట్టబయలు చేయాలనిపించక, వెనక్కి తిరిగి వచ్చి మంచం మీద వాలి ఆ క్షణాల్ని భద్రంగా మనసులోనే పదిలపరచుకుంది..
      భర్తను బాగా ఊరించి ఉడికించానన్న మధురానందాన్ని మనసులో ఖైదు చేసేసింది..
      రోజులు-నెలలు-సంవత్సరాలు.. మారుతూనే ఉన్నాయ్‌..
      తాతాజీ మాత్రం - తారసపడిన ప్రతి అమ్మాయినీ గుచ్చిగుచ్చి చూస్తూనే ఉన్నాడు.. తనకి ‘ప్రేమకానుక’ పంపిన తారక ఎప్పటికైనా తారసపడకపోతుందా అన్న కొండంత ఆశతో...!

*  *  *

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోని


కొత్త పలక

కొత్త పలక

కుప్పిలి సుదర్శన్‌bal bharatam