ఫౌల్‌...ఫౌల్‌ (క‌థాపారిజాతం)

  • 184 Views
  • 0Likes
  • Like
  • Article Share

    జంపన పెద్దిరాజు

జంపన పెద్దిరాజు

ఆమె ఓ సంచలన టెన్నిస్‌ తార... విందులూ వినోదాలూ మాత్రమే లోకమనుకున్న ఆమె ఓ నిశిరాత్రిలో మరికొన్ని జీవన పార్శ్వాలను చూసింది.. నాగరికతను నిర్ణయించే హద్దులు- అందం, హోదాలని తెలిశాక ఆమె ఏమందో చదవండి...
టెన్నిస్‌ ఆడటానికి కాదు
చూడటానికి
      వందలు, వేలు జనం - కార్లు - స్కూటర్లు - సైకిళ్ళు - పిల్లలు - పెద్దలు - ముసలాళ్లు - అంతా - టెన్నిస్‌ ఆడటానికి - కాదు, చూడటానికి.
      స్త్రీ టెన్నిస్‌ - ఆడటెన్నిస్‌ (అంటే ఆడపిల్లలాడేది) - మిస్‌టానియా టెన్నిస్‌ - యూనివర్సిటీలో వందలు, వేలు జనం - ఆడటానికి కాదు, చూడటానికి.
      మూడు రోజుల నుండి మిస్‌ టానియా పేరు అంతులేని ఆకాశంలా వుంది. ఒడ్డులేని సముద్రంలా వుంది. టానియాకు నేలపై నడవబుద్ధి కావడంలేదు. కోర్టులో తన నడకలో ప్రతి కదలికను మింగుతూ - కొన్ని వేల కళ్ళు, కొన్ని వందల కళ్ళజోళ్లు.
      టానియా టాపులేని కారులా కోర్టులో తిరిగింది. కోడిపుంజులా తల పైకెత్తింది. పైకి లేస్తున్న కెరటంలా వెళ్ళి బాల్‌ తీసేది.
      ‘ఆటలో అందం వుంది.
      నిర్లక్ష్యం వుంది.
      తెలివి వుంది’.
      మద్రాసుపై రెండుసెట్లు వరసగా తీసుకుని ఫైనల్సుకు రాగానే వచ్చిన కామెంట్స్‌ ఇవి.
      ‘టానియా, హిపిప్‌
      టానియా జిందాబాద్‌!’
      టానియా బ్యాట్‌కు బాల్‌ తగలగానే చప్పట్లు సముద్ర కెరటాల్లా విరుచుకుపడుతున్నాయి.
      టానియా నవ్వింది.
      ఏదో టానిక్‌ అందరి గుండెల్లో ఒలికింది.
      గళ్ళ కోట్లు, కళ్ళద్దాలు, రంగురంగుల మేజోళ్ళు, ఆడపిల్లల ముందు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న వాలంటీర్లు.
      అదొక తీర్థం.
      అదొక సంత.
      రావణాసురుడి సభలో తోకచుట్టపై భైఠాయించిన హనుమంతుడిలా అంపైర్‌ యెక్కడో ఆకాశంలో ఒబ్బిడిగా ఆసీనుడై ఉన్నాడు.
      ఆట ముగిసింది.
      మహా సముద్రంలా ఉన్న జనాన్ని కేంటీన్‌ కొంత లోపల ఇముడ్చుకొని మిగతా కక్కేసింది. కక్కబడ్డ జనం రోడ్లమ్మట...... జనం జనం జనం - జజజజజజజజనం.
      టానియా చెయ్యి - గుళ్ళో గంటలా, పూజారి తీర్థంలా ముట్టుకొని వెళ్లిపోతున్నారు.
      ఎదర వరసలో కూచున్న ఆఫీసర్ల అందమైన ఆడ ముఖాలు, అజ్ఞానంలాంటి నల్లద్దాలు పెట్టుకొన్న తెల్ల ఏనుగులు, కారు డ్రైవర్ల కోసం చూస్తూ హుందాగా టానియా నభినందించాయి. ఖరీదయిన మూడు కోట్లు వాళ్ళింటికి రాత్రికి డిన్నర్‌కు పిలిచాయి.
      ‘‘మన సమాజంలో స్త్రీలు వంట యిల్లు వదలి ధైర్యంగా అన్ని రంగాల్లోకి దూకుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది’’. టౌన్‌ మహిళా మండలి అధ్యక్షురాలు ఆవేశంతో అంది, లిప్‌స్టిక్‌ పెదాన్ని కొరుకుతూ పక్కనున్న పెద్దమనిషిని చూసి. ఆయన చిరునవ్వు నవ్వాడు.
      టానియా ఆ సాయంత్రం రెండు తప్పనిసరి డిన్నర్లకు అటెండ్‌ అయింది. మొదటి డిన్నర్‌లో పూర్తిగా భోజనం చేసింది. రెండో డిన్నర్‌లో బలవంతంపై కొంచెం పలావు, రెండు యాపిల్స్, ఫ్రూట్‌ సలాడ్‌ తీసుకుంది - తనకోసం ఏర్పాటు చేసిన డిన్నరులో ఆ మాత్రం పుచ్చుకోకపోతే బావుండదని.
      ‘తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్‌!’ అని తన టీమ్‌లో అమ్మాయి నవ్వింది.
      అప్పుడే పన్నీటిలో కడిగిన మల్లెపువ్వులా ఆ రాత్రి టానియా మంచంమీద వాలింది. నిశ్శబ్దం రాత్రికి పహరా కాస్తూంది. యూనివర్సిటీ టవర్‌ క్లాక్‌ కొట్టిన పదకొండు గంటలకు చీకాకుపడ్డ నిశ్శబ్దం టానియాకు మత్తుగా మెలకువ తెచ్చింది. ప్రాజెక్టు గేటుల్లా కళ్లరెప్పలు తెరిచేసరికి కిటికీలోంచి వెన్నెల వరదలా ముంచెత్తింది. సాయంత్రం తిన్న యాపిల్స్‌ గొంతులో బ్రతికున్నట్టు - కడుపులో కొండచిలువ కదుల్తున్నట్టు - వికారం - ఆకారం లేని వికారం - వాంతి వెళ్ళేట్టుంది - లేదు - టానియాకు నిద్ర పట్టడం లేదు.
      ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు ఆ ఫేకల్టీ క్లబ్‌ లాడ్జి కిటికీలోంచి ఏదో కొత్త లోకంలా కనిపించేసరికి కొలంబస్‌లా ఒకసారికొత్త అనుభవాన్ని చూద్దామని నైట్‌గౌన్‌ సరిచేసుకొని నెమ్మదిగా బైటకు నడిచింది, మిస్‌ టానియా, టెన్నిస్‌ ప్లేయర్‌. చలిమంచు, వెన్నెల నిశ్శబ్దం. రాత్రి పెడుతున్న గురకలా సముద్రం హోరు. మంచు దుప్పటి కప్పుకున్న నిశ్శబ్దం. చేతులూ, తలా, చెవీ ఎక్కడన్నా దాచుకొని కళ్ళతో చూడబుద్ధి వేసే వాతావరణం. వులెన్‌ మఫ్లర్‌ అందంగా చుట్టుకుని, కోర్టు పక్కగా ఉన్న సిమెంటు గాలరీపై నిలబడి చేతులు కట్టుకుంది.
      స్ట్రీట్‌ లైట్లని కాపలాపెట్టి యూనివర్సిటీ అంతా నిద్రపోతూంది. పగలంతా జనాన్ని టోపీగా పెట్టుకని మేచ్‌ చూసిన ‘లా కాలేజి’, ఫాకల్టీక్లబ్‌ విశ్రాంతి తీసుకొంటున్నాయ్‌. అఫ్లైడ్‌ ఫిజిక్స్‌ లేబొరేటరీపై రాడారు తలవంచుకొని కునికిపాట్లు పడుతూంది. వాటర్‌ లేని స్విమ్మింగ్‌ పూల్‌లా వున్న టెన్నిస్‌ కోర్టులో, విరిగిపోయిన కుర్చీలు మధ్య తరగతి జీవితాల్లా ఉన్నాయి. ఫ్యూడల్‌ వ్యవస్థకు ప్రతిబింబాల్లా గొప్పవాళ్ల కోసం ప్రత్యేకించబడ్డ సోఫాలు, కుర్చీలు మంచు తాగి నిద్రపోతున్నాయ్‌. వేదికపై పూలదండల వెనక దాక్కొన్న నాయకుల్లా నీలిరంగు గుడ్డల్లో దాక్కొన్న రెండు తడికలు కోర్టుకిరువైపులా.
      వ్యభిచారి వేసుకున్న లిప్‌స్టిక్‌లా స్కోరు బోర్డు తగిలించుకొన్న విల్స్‌ అడ్వర్టైజ్‌మెంటు. 
      టానియాకు మనసు చికాకుగా వుంది. వాతావరణం ఆహ్లాదకరంగా వుంది.
      నిద్రపోతున్నవాళ్ల ప్రతినిధుల్లాగ అక్కడక్కడ, అప్పుడప్పుడు దూరంగా కేకలు, చిన్నచిన్న మాటలు. టానియా దృష్టి కోర్టుకు కొంచెం దూరంలో ఉన్న మూడు ఆకారాలపై పడింది. ఎడారిలో ఏవో మూడు మోడులు మాట్లాడుకుంటున్నట్లు ఆ గ్రౌండులో ముగ్గురు - అంతలో గట్టిగా దగ్గు.
      ‘‘పర్నేదు నేవే. అదెప్పుడూ ఉండేదే......’’
      ‘‘కాసిని నీళ్ళు దొరికితే బావుణ్ణు’’.
      ‘‘ఏఁటి పర్నేదు. పని మానేసి, గూటికి పోక -’’
      ‘‘నీకు తెల్దసే, అప్పుడప్పుడు ఇలా రగతం పడుతుంటదిలే!’’
      ‘‘ఇంకో పది తట్టలుంటది. ఆకాస్తా పోసేత్తే అంతా కల్సి ఒకేసారి పోవొచ్చు’’.
      మళ్ళీ గట్టిగా దగ్గు.
      టానియా వాళ్ళ దగ్గిరిగా వెళ్ళింది. సందేహం లేదు. ముగ్గురూ మనుషులే. అందుకు నిదర్శనం వాళ్ళు మాట్లాడుకోటం. నూనె లేకపోయినా జుట్టుంది. గుడ్డలు చినిగినా శరీరం ఉంది. వాళ్ళ మొహాలు వాళ్ళ జీవితాలకు ప్రతిబింబాలు, పెద్దసైజు కట్‌ డ్రాయర్‌లా బిగించి కట్టిన వాళ్ళ చీరలు, చీరలు కాదు చింకి కోకలు. మట్టి అద్దకంతో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కాళ్ళూ చేతులూ. వక్షాలున్నందువల్ల ఆడవాళ్ళు. మనుషులు నిద్రపోతున్న వేళ మట్టి మోస్తున్న జీవాలు.
      టానియా పిల్లిలా వాళ్ళ దగ్గరికెళ్ళింది. మట్టిలో గడ్డకట్టిన రక్తం చూసింది. మనిషి కక్కిన రక్తం చూసి టానియా మనసు పూర్తిగా పాడయింది.
      ‘‘ఏమైంది?’’ అంది, ఏమీ అనలేక.
      అందరూ హాయిగా నిద్రపోతుంటే ఆ రాత్రి వాళ్ళు మట్టెందుకు మోయాలి? మట్టి మోస్తూ ఆమె అలా రక్తం ఎందుకు కక్కాలి? - ఇదంతా టానియాకు కొంచెం బాధ అనిపించింది.
      వాళ్ళు లేచి తట్టలు నెత్తిమీద పెట్టుకోబోతున్నారు. చూస్తూ నిలబడితే బావుండదని టానియా సాయం చేయబోయింది. కాని, తనవైపు తట్ట కొంచెం కూడా లేపలేకపోయింది. పవర్‌ - పాక్‌డ్‌ సర్వీసులకి, పవర్‌ స్ట్రోక్స్‌కి టెన్నిస్‌ కోర్టులో తప్పట్లు కొట్టించుకుంది తను! ఆ తట్ట ఆమాత్రం యెత్తలేకపోడం అవమానంగా ఫీలయింది.
      ‘‘పర్నేదమ్మా! సదుకునే వోళ్ళు చేసే పన్లు కావియ్యి. మీరు దేశాన్ని బాగుచేయాలి. మీరు సుఖంగా ఉంటేనే మాబోటివాళ్ళకు కాస్తంత కూడూ గుడ్డా దొరుకుతాది’’. అంది వాళ్ళలో ఒక మనిషి.
      తను టెన్నిస్‌ ఆడి వాళ్ళకు కూడూగుడ్డా ఏవిధంగా పెట్టగలదో అర్థం కాలేదు టానియాకు. వాళ్ళు టెన్నిస్‌ కోర్టు గోతులు పూడవటానికి మట్టి పట్టికెళ్తున్నారు. అది చదును చేయాలని, ‘లెవెల్‌’ చేస్తేగాని మర్నాడు ప్రేక్షకులకు సౌకర్యంగా ఉండదని సాయంత్రం ఆర్గనైజర్లు తీర్మానించారు.
      తను చూస్తుండగానే వాళ్ళు ముగ్గురూ తట్టలెత్తుకుని వెళ్ళిపోయారు. కష్టాల్లా వెళ్తున్న వాళ్ళను చూస్తూ టానియా ఎప్పుడూలేని ఆలోచనల్లో పడింది.
      వాళ్ళూ స్త్రీలే. బరువులు మోయటంలో వాళ్ళకు గొప్ప ప్రావీణ్యం ఉంది. పైగా అర్ధరాత్రి చలిలో నిద్రలేకుండా రక్తం కక్కుకుంటూ అలా బరువులు మొయ్యడం సామాన్యమైన విషయం కాదు. తను కాస్త నేర్పుతో టెన్నిస్‌ ఆడుతున్నందుకే, నిక్కరుతో అంతమంది ముందు నిల్చున్నందుకే - అన్ని కార్లు, అన్ని కళ్ళజోళ్ళు. అంత గందరగోళం! మరి అర్ధనగ్నంగా తట్టలు మోసే వీళ్ళని గురించి ఆ కార్లూ, ఆ కోట్లూ, ఆ మైక్‌లు తప్పట్లు కొట్టవేం? డిన్నర్‌కు పిలవ్వేం? ఆవిడెవరో ‘స్త్రీలు వంటింట్లోంచి ధైర్యంగా బైటకు వస్తున్నా’రంది. యూనివర్సిటీలో ఇలా పట్టపగలు, రాత్రికి రాత్రి తట్టలూ, కట్టెలూ అర్ధనగ్నంగా మోస్తుంటే స్త్రీ జాతికి ఎంత పురోభివృద్ధి! - ఏఁవిటో ఈ ఆలోచనలు వేపకాయల్లా - గొంతుకడ్డంపడ్డ వెలక్కాయల్లా వెగటుగా, వగరుగా ఉన్నాయ్‌. నిజంగా ఆలోచించకూడదు. ఆలోచిస్తే ఏ పనీ చేయలేం. తలకాయని - తల దువ్వుకోటానికి, స్నో-పౌడర్‌ రాసుకోటానికి, మగాళ్ళైతే గడ్డం గీసుకోటానికి ఉపయోగించుకోవాలి. ఆలోచించకూడదు. కళ్ళతో టెన్నిస్‌ చూడాలి. చెవులతో క్రికెట్‌ కామెంటరీ వినాలి. ఆలోచించకూడదు. ఆలోచన భయంకరం. ఏఁవిఁటీ? ఈ రక్తం చూసినప్పటి నుంచీ మనసు మరీ చికాకుగా ఉంది. ఇలాంటి ఆలోచనలు ఇదివరకెన్నడూ రాలేదే. లోకం ఆలోచన నేర్పుతుందేమో! నేను చదువుకొన్న కాన్వెంట్‌ యెందుకు నేర్పలేదు?
టానియా ఒక్కసారి వులిక్కిపడింది - పిడుగు పడ్డట్టు కెవ్వున కేక!
      ‘‘ఓలమ్మో, మెట్లకడ్డుగా యెందుకు దిగావు? నాకొండో, నాకొండో, తిరుపతి పడిపోయినాది. లగెత్తుకురా! ఏళ్ళనన్నా లేపుకురా’’, అంటూ లబోదిబో మంది అప్పలమ్మ.
      టానియా డ్రాప్‌ ఎత్తటానికి పరిగెట్టేటంత వేగంగా వెళ్ళింది. అవును, ఇందాక రక్తం కక్కుకున్న తిరపతే - ఆ తిరపతే! టెన్నిస్‌ రాకెట్‌ ఖరీదు కూడా చేయని తిరపతి - పరపతి లేని తిరపతి!
      తిరపతి తలనిండా రక్తం.
      తలలో రక్తం.
      రక్తంలో తల.
      తిరపతి గుడ్లగూబలా మూల్గుతోంది. గాలిలా యేడుస్తోంది. చూస్తూండగానే తిరపతి చేతిలో తట్టని గుప్పిటతో గట్టిగా బిగించి ఒదిలింది.
      ఆ దృశ్యం చూసిన టానియా కెరటంలేని సముద్రంలా, ఆకు కదలని చెట్టులా, మబ్బులాడని ఆకాశంలా, మనసులేని మనిషిలా, జీవంలేని శవంలా వచ్చి బెడ్‌మీద పడుకుంది. పడుకుందిగాని, నిద్రపోడానికి రెప్పల్లేవు. రెప్పలు తిరుపతి కళ్ళు మూసినచోట వొదిలేసింది.
      తెల్లవారింది. తెల్లవారక తప్పదు. సూర్యుడు డ్యూటీ ఛార్జి తీసుకున్నాడు. టానియా బాత్‌రూమ్‌లో ఉండగా బైట మాటలు అస్పష్టంగా వినబడుతున్నాయి.
      ‘‘ఆఁ ఏఁవీఁ లేదు. రాత్రి ఎవరో పనిమనిషి గుండెజబ్బుతో చచ్చిపోయిందిట. దిక్కులేని పిల్లను ఒదిలేసి. ఆ పిల్లకేఁవైనా సాయం చేయాలంటుంటే రేపు రమ్మంటున్నాను. ఈవాళ ఫైనల్స్‌ గదా! ఈ గొడవలో ఉన్నాను’’.
      అంతలో రేడియో సిలోన్‌ ఆ మాటల్ని మింగేసింది.
      బైట ఎవరిదో కారు హారన్‌! ఇన్‌-గేటు అవుట్‌-గేటు వాటి పని అవి చూసుకుంటున్నయ్‌. యూనివర్సిటీ మూసేయలేదు. క్లాసులు మామూలుగానే జరుగుతున్నాయి. మధ్యాహ్నం మాత్రం సెలవ్‌. తిరపతి చచ్చిపోయినందుకు కాదు. టానియా ఆట చూడటానికి.
      ఆఖరు రోజు. ఎండ మంటలా వుంది. ఆర్గనైజర్స్‌ హడావుడి. చోటుకోసం లాస్ట్‌ అవర్‌ ఎగ్గొట్టేవాళ్ళ హడావుడి పోటీపడుతున్నట్టుంది. పబ్లిక్‌ రిలేషన్స్‌ వాళ్ళు పిక్చరైజ్‌ చెయ్యటానికొచ్చారు. టౌన్‌లో స్కూళ్ళకు, కాలేజీలకు, ఆఫీసులకు పండుగ. మళ్ళా మామూలే. టెన్నిస్‌ కోర్టు, కార్లు, స్కూటర్లు, కళ్ళజోళ్ళు, సైకిళ్ళూ, కోట్లు, చీరలు, బ్లౌజులు, పోజులు, జనం జనం జనం. నిశితంగా చూస్తున్నాయ్‌ కళ్ళు కళ్ళు కళ్ళు. మళ్ళా లా కాలేజి రంగురంగుల జనాన్ని టోపీగా పెట్టుకుంది. ఎత్తు తక్కువగా ఉన్న కేంటీన్, ఎన్‌.సి.సి. ఆఫీసు మేచ్‌ చూడలేక సిగ్గుతో తలవంచుకున్నట్టున్నయ్‌. కారు డ్రైవర్లు సిగరెట్లు కాలుస్తూ కష్టసుఖం చెప్పుకుంటున్నారు.
      టానియా శరీరం ఆడుతోంది. హృదయంలో సైగల్‌ గొంతు విషాద ఘోషలా ఉంది. అంపైర్‌ ప్రతీ కదలికను అతి జాగ్రత్తగా చూస్తున్నాడు. టానియా చికాగ్గా ఆడుతోంది. మొదటి సెట్టు ఎదుటిపక్షం తీసుకుంది.
      టానియా - కొట్టు.
      టానియా - బీకేర్‌ఫుల్‌.
      టానియా - డోన్ట్‌వర్రీ.
      ఎంకరేజ్‌మెంటు ఆకాశంలా విరిగిపడుతూంది.
      టానియా చేసిన సర్వీసులు ఫెయిలవుతున్నయ్‌. అంపైర్‌ ఫౌల్, ఫౌల్‌లతో జనం విసుగెత్తిపోతున్నారు. లా కాలేజిపై నుంచి ఆటచూస్తున్న అమ్మాయి తేలుకుట్టినంత బాధగా చెయ్యి విదిలించుకొంటోంది. అంపైర్‌ ‘డ్యూస్‌’ అన్నాడు.
      ‘ఐ డోన్ట్‌ వాంట్‌ డ్యూస్‌’ లా కాలేజీపై అమ్మాయి గట్టిగా అరిచింది. ఆ అరుపులు వినే పరిస్థితిలో లేరు జనం. ఎవరి లోకంలో వారే అరుస్తున్నారు. టానియాకు చాలా చికాకుగా వుంది. తిరపతి కక్కుకున్న రక్తంలా కళ్ళముందు ఎండ మెరుస్తోంది. టానియాకు గట్టిగా మైకులో ఎనౌన్స్‌మెంటు చేయాలనిపించింది. ఆ రోజు ఆట ఆపేయాలనిపించింది. తిరుపతి చావుకు సంతాప సూచకంగా జనాన్నంతటినీ ఓ అరగంట నిశ్శబ్దంగా నిలబెట్టాలనిపించింది.
      జనం........ జనం. సముద్రపొడ్డు ఇసకలా, ఈ దేశంలో దారిద్య్రంలా.
      టానియా చూపు రాత్రి తిరపతి చచ్చిపోయిన చోటుపై పడింది. అక్కడ కార్పెట్‌పై జనం. ఆడటానికి కాదు, చూడటానికి.
      టానియాకి జనం మీద కోపం హెచ్చింది. ఆ కోపం బాల్‌మీద చూపించింది. రెండోసెట్టు తను నెగ్గింది.
      మూడో సెట్టుకు మనసు మళ్ళా తక్కెడలా ఊగుతూంది. మూడోసెట్టులో అయిదు గేములు అవతలి అమ్మాయి తీసుకుంది. టానియా మళ్లా చిరుతపులి అయిపోయింది. వరసగా అయిదుగేములు లాక్కుంది.
      జనం కుర్చీలమీద లేరు. సిక్స్‌త్‌ గేములో సర్వీసు చేయగానే మళ్ళా ఫౌల్‌ అన్నాడు అంపైరు. టానియాకు ఆట మానేసి ఎక్కడన్నా ఏకాంతంగా కూర్చోవాలనిపిస్తోంది.
      ‘అంపైర్‌! నేను కొట్టిన బాల్‌ కాదు. ఈ లోకం ఫౌల్‌. ఈ జనం ఫౌల్, వీళ్ళ తెలివి ఫౌల్‌ - వీళ్ళ కార్లు ఫౌల్‌ - వీళ్ళంతా ఫౌల్‌’. అని అరవాలనిపించింది. నిద్రలేక కళ్ళు బరువుగా వున్నాయి.
      తిరపతి - తల బద్దలైపోయిన తిరుపతి - తను మోయలేని తట్టలు మోస్తున్న తిరపతి. తిరపతి చావునెవరూ పట్టించుకోరే! వీళ్ళంతా ఫౌల్‌. వీళ్ళ కోట్లు ఫౌల్‌. వీళ్ళ కార్లు ఫౌల్‌. ఆ లా కాలేజి ఫౌల్‌. వీళ్ళంతా ఫౌల్‌ ఫౌల్‌.
      టానియా నిర్లక్ష్యానికి నుదుటిమీద టెన్నిస్‌బాల్‌ గట్టిగా కసి తీర్చుకుంది. చిన్నబొప్పి కట్టటంతోబాటు కొంచెం పక్కకు వాలింది. రాత్రి నిద్రలేక కళ్ళు తిరుగు తున్నాయి. అంతే, జనం సముద్రంలో టానియాను పైకెత్తారు. చేతులపై ఫేకల్టీ క్లబ్‌లోకి తీసుకుపోయారు. ఆ లాడ్జి చుట్టూ జనం.
      ‘నెవర్‌ మైండ్, ఐయామ్‌ ఆల్‌రైట్‌’ అంది టానియా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. కోట్లకు, కార్లకు, గొట్టం పేంట్లకు ఆదుర్దా. డాక్టర్లు సిరింజిలు సరిచేసుకొంటున్నారు. టానియాకు  ఏడుపులాంటి నవ్వొచ్చింది. తనకేం కాలేదంటే వినరే. జరిగిందంతా తిరపతికి. మట్టితట్ట చేత్తో గట్టిగా పట్టుకొని చచ్చిపోయిన తిరపతికి. దిక్కులేని ఆమె పిల్లకు, ఎవరూ వినిపించుకోరేం? వీళ్ళంతా నిజంగా ఫౌల్‌. వీళ్ళ అభిమాన ప్రవాహం సముద్రంలాంటి మట్టితట్టలవైపు ప్రవహించటం మానేసి, ఈ టానియాలాంటి నగరాలపై పడటం నిజంగా అసలైన ఫౌల్‌! ఫౌల్‌ఫౌల్‌! చుట్టూ చూట్టం మానేసి టానియా       సైలెంట్‌గా గోడ గడియారంవైపు చూస్తూ ఆలోచిస్తూంది. ఎన్నో రహస్యాల్ని, సత్యాల్ని దాచుకున్న గడియారం తాపీగా ముందుకు నడుస్తోంది.

*  *  *


ళఢపురోగమించడం లేదని నేననను
ప్రతిదీ సుఖంగా ఉందంటే నేవినను
నిజం- ఈ రథం ముందే పోతోంది కానీ
బతికున్న మనిషిని 
నాకొక్కడిని చూపించు... 

అంటూ సామాజిక చైతన్యాన్ని కోరుకున్న జంపన పెద్దిరాజు 1946లో పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెంలో జన్మించారు. 1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. భీమవరం కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేస్తూ, 24 సంవత్సరాల చిరుప్రాయంలో 1970లో మరణించారు. ఆయన రాసిన ‘ఫౌల్‌ఫౌల్‌’ కథ 1969 నాటి ఎమెస్కో ప్రచురించిన ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి కథల సంపుటిలో అచ్చయింది. ఇదికాక, మంచం, దేవత అనే రెండు కథలు, ‘పట్టిందల్లా బంగారం’ సినిమాకి రాసిన ‘ఏయ్‌ ఏయ్‌ నువ్వెంతో బాగుంటావ్‌’ అన్న పాటా ఆయన కలం నుంచి జాలువారాయి.


 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోని


కొత్త పలక

కొత్త పలక

కుప్పిలి సుదర్శన్‌bal bharatam