లక్ష్మీస్మృతి

  • 355 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మన్నే లలిత

  • తెలుగు ఉపాధ్యాయురాలు,
  • హైదరాబాదు.
  • 9949599913
మన్నే లలిత

పెంచుకున్న పాపాయి పెళ్లీడుకొచ్చింది. కన్నతల్లివచ్చి పట్టుచీరెనిచ్చింది. అయినా.. లక్ష్మి గుట్టు వీడలేదు, స్మృతుల జాడ తెలియలేదు.. ఒకరి కడుపుకోత మరొకరికి వరం...
‘‘నా లచ్చిమే!
నా లచ్చిమే! కనకమాలచ్మివే నువ్వు’’ మొలసంచిలోని డబ్బులు గుమ్మరిస్తూ అంది ఎంకి సంబరపడిపోతూ. కూతురుని ముద్దులతో నింపేసింది. ఉక్కిరిబిక్కిరైన కూతురుని తనివితీరా హత్తుకుని ‘‘నా బంగారు లచ్మి, నా బంగారు కొండ’’ అనుకుంది చిన్నగా.
      ‘‘రాయే అమ్మా! ఆకలేత్తంది. తింటానికేదుండాది ఇయ్యాల ఓటెల్లో ఉల్లిపాయ దోసె మంచి వాసనేత్తంటే నోరూరి ఎల్లి తిందామనుకొన్నా. నువ్వు గుర్తుకొచ్చి ఇటొచ్చినా. టైవయిందే మల్లా బస్సుల కాడకెల్లాల అడుక్కోను. ఏదోకటి ఎట్టే తింటానికి’’ అన్న లక్ష్మితో ‘‘నా తల్లే! ఈ పదేను రూపాయలు తీస్కో. లగెత్తుకెల్లి ఓటెల్లో దోసె తిని బస్సులకాడికెల్లు. మీ నాయన్నంపుతా. ఆడే ఉండు’’ అంది ఎంకి కూతురుకు డబ్బులిస్తూ.
      ‘‘ఏనాడు నా ఇంటో అడుగెట్టిందో కాని ఈ కనకమాలచ్మి ఏ లోటూ లేదు మాకు. పిల్ల పెద్దదయితంది. ఇసప్పురుగుల సూపులు పడకుండా పిల్లదాన్ని కాపలాకాయాల.’’ మనసులో ఆడపిల్ల తల్లి బాధ ఎంకిది.
లచ్మి చిన్నప్పుడు ఎట్టాగుండేది. తెల్లరబ్బరు బంతిలాగుండేది కదూ! 
      చిన్న చేతిని చాపించి అడుక్కోటం నేర్పింది తనే కదూ! చాపిన చేతిలో పైసా ఎయ్యకుండా ఎవ్వరూ లేరు, గుంట అందరికీ ముద్దొచ్చేది! ‘‘అయ్యా! పైసెయ్యండి’’ అనేది. ఆ తరువాత తనెక్కడో ఇన్న ‘సారూ! పైసెయ్యండి’ అని నేర్పిందీ తనే. ఎంత ముద్దుగా అడిగేదని.

*  *  *

       ‘‘నీ కూతురు బంగారు బొమ్మే! యాపారం జేయిత్తావేంటే? కాసుల పంటే’’ అన్నవాళ్ల గూబ గుయ్‌మన్పించింది. ‘‘నా బిడ్డతో యాపారమా?’’ అని ఉరిమురిమి చూసేది. ‘లక్ష్మి పెద్దదైంది. ఒకయ్య చేతిలో ఎట్టాల. మంచి సంబంధం సూడాల. అదీ దాని పిల్లలూ ఇంక అడుక్కోకూడదు. దానికి మంచి బతుకియ్యాల’ అని ఆలోచించిన ఎంకి కిళ్లీకొట్టు కిట్టయ్యను కలిసి మనసులోని మాట చెప్పింది. అభ్యంతర పెట్టడానికేమీ కన్పించలేదు కిట్టయ్యకు.
      కిట్టయ్య ఏడు చదివాడు. ఎర్రగా బుర్రగా, బుద్ధిగా ఉంటాడు. అంతో ఇంతో ఆస్తి ఉంది. ఒక్కడే కొడుకు. తల్లిమాటలకు లక్ష్మి సిగ్గుతో తలొంచుకుంది. లగ్గాలెట్టుకుందా మనుకున్నారు. ఆకుపచ్చని పట్టుచీరలో బంగారు బొమ్మలాంటి లక్ష్మిని చూడాలనుకొంది ఎంకి.
      పట్టుచీర కొనేందుకు కూతురుతో దుకాణానికి వెళ్లింది. కళ్లు తిరిగినంత పనైంది... బయటి నుంచి చూడటమే తప్ప, లోపలికెప్పుడూ వెళ్లలేదు. బెరుకుగా నడుస్తూ తను పట్టుచీర కొనటానికి వచ్చిందన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని, అడుగులు దర్జాగా వేసింది. మొహమాటంగా కుర్చీలో ముందుకు కూర్చుని ‘పట్టుచీర’ గుర్తొచ్చి వెనక్కి దర్జాగా వాలింది. పక్క కుర్చీల్లో కూర్చున్న దంపతుల్ని చూసి గతుక్కుమంది. గుండె నిబ్బరం చేసుకొని ఎంచుకున్న చీరెను ఆమెకు చూపి ‘‘మా అమ్మాయి పెళ్లమ్మా, లగ్గంచీరె ఇది బాగుంటుందా అమ్మా! నాకు తెల్వదు, సూడండమ్మా’’ అడిగింది.
      లక్ష్మీదేవిలా ఉన్న ఆమె ‘‘ఈ అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. అమ్మవారి కళ ఉట్టిపడ్తోంది. చాలా బాగుంటుంది. మాక్కూడా నచ్చింది. నేనూ చీరె కొందామని వచ్చా మీరేం అనుకోకపోతే చీర డబ్బులు నేనిస్తా. ఎందుకంటే ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు. ప్రతీ పుట్టినరోజుకు ఓ ఆడపిల్లకు బట్టలుపెట్టడం మాకు అలవాటు. ఈ రోజు వెతుక్కునే అవసరం లేకుండా మీరు కనిపించారు. పైగా పెళ్లంటున్నారు. ఇంకా సంతోషం’’ అంటూ భర్త వంక చూసింది.
      ‘‘నీ ఇష్టం రాణీ! గౌనులు, లంగావోణీలు, డ్రస్‌లు ఇచ్చావ్‌. ఇప్పుడు ఓ ఆడపిల్ల పెళ్లికి చీర ఇద్దామంటున్నావ్‌. నీ ఇష్టం ఎప్పుడు కాదన్నాను కనుక. ఎంతవుతుంది?’’ అంటూ పర్స్‌ తీశాడు ఆనంద్‌.
      ‘‘అమ్మా, నీ మేలు మరువలేనమ్మా! పట్టు చీర కొనిచ్చే వాళ్లను మిమ్మల్నే చూస్తున్నానమ్మా’’ అంటూ కాళ్లకు దండం పెట్టింది లక్ష్మి. రాణి తనని పైకెత్తి కౌగిలించుకుంటుంటే ‘ఆళ్లనిబ్బంది పెట్టమాక’ అని చటుక్కున విడదీసి ‘‘వత్తానమ్మా! నమస్కారమమ్మా!’’ అంటూ కూతురుని హడావుడిగా లాక్కెళ్లింది ఎంకి.
      ‘లక్ష్మీ కిట్టయ్యల పెళ్లి ఉన్నంతలో వైభవంగా జరిగింది... ‘ఆమె’ కొనిచ్చిన పట్టుచీరతో...’ అనుకుని ఎంకి తృప్తిగా నిట్టూర్చింది...
      ఆ రాత్రి భర్త చెవిలో గుసగుసలాడింది ఎంకి. ‘‘ఆళ్లు... అదే చీరె కొనిచ్చినారే, ఆళ్ల అమ్మా, నాన్న అని తెలీక లచ్చి ఆళ్ల కాళ్లకు దణ్ణవెట్టింది. నా లచ్మిని ఎక్కడ గుర్తట్టి లాక్కుపోతారోనని సెడ్డగుబులైనాది నాకు. లచ్మి మనకు బిడ్డలు లేని లోటు తీర్చింది. దీపాలమాసకు ముందురోజే లచ్మిని దొంగతనంగా మనింటికి తీసుకొచ్చా గదయ్యా. ‘అడుక్కునే వాళ్లకు అరవయ్యారూర్లని’ ఏడయితే ఏంటని ఊరు మారొచ్చాం. ఈళ్లూ అట్లే వచ్చారంటా’’ అంటూ నిద్రపోతున్న భర్తను చూసి ‘‘ఊ! ఈడెప్పుడింతే! గుర్రెట్టి నిద్రోతాడు ఏదన్నా సెప్తుంటే’’ అంటూ పక్కకుతిరిగి పడుకొంది.

*  *  *

      అదే రాత్రి ‘ఆమె’ భర్తతో... ‘‘మన పాపే ఉంటే, ఇప్పుడు పెళ్లి చేసేవాళ్లం కదండీ. పట్టుచీర ఇచ్చినమ్మాయి స్పర్శ ఒక్క క్షణం మన ‘స్మృతి’ స్పర్శలా అన్పించింది ఎందుకో. నా భ్రమేమో! అంతలోనే వాళ్లమ్మ లాక్కెళ్లింది. ఎంతైనా పరాయిబిడ్డ పరాయిబిడ్డే. ఈ సంవత్సరం స్మృతి వయసు అమ్మాయికి, అదీ పెళ్లి కోసం పట్టుచీర ఇచ్చానన్న తృప్తి మిగిలింది. ప్రతీ సంవత్సరం స్మృతి పుట్టిన రోజున, దాని వయసువాళ్లకు ఇచ్చిన బట్టల్లో స్మృతిని ఊహించుకుంటున్నాం నా చిన్నారి ‘స్మృతి’ స్మృతులను మాత్రమే మిగిల్చి వెళ్లిపోయింది కదండీ..’’ బాధతో అంది. ‘స్మృతి’ స్మృతులతో నిండిన భార్య తడికళ్లను ఓదార్పుగా తుడిచాడు ఆనంద్‌.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


పాపమ్మ చెట్టు

పాపమ్మ చెట్టు

లోగిశ లక్ష్మీనాయుడు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోనిbal bharatam