నిజాముద్దీన్‌లో ఓ సాయంకాలం

  • 331 Views
  • 5Likes
  • Like
  • Article Share

    సకలాభక్తుల కృష్ణమూర్తి

  • విశ్రాంత అధ్యాపకుడు,
  • బెంగళూరు.
  • 9448848529
సకలాభక్తుల కృష్ణమూర్తి

ఇల్లు వదిలి పారిపోయొచ్చిన పిల్లల్లో బతుకుపట్ల నివ్వెరపరచే ఆత్మస్థైర్యం చూస్తాడు ఓ పెద్దాయన.. దాంతో భావితరాలు బాగానే ఉంటాయన్న తృప్తి అతనిలో కలిగింది., వాళ్ల ఆత్మస్థైర్యాలూ, ఇతని తృప్తీ ఒక సాయంకాలానికేనా..?
బెంగళూరు
భారతీయ భాషా సమితి ఆహ్వానం మేరకు బయల్దేరాను. సూరత్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ నిజాముద్దీన్‌ స్టేషన్లో నాలుగో నంబరు ప్లాట్‌ఫారం మీదకు వచ్చి ఆగింది. అప్పటి వరకు పిచ్చాపాటి కబుర్లాడుకున్న రైలుబండి స్నేహితులకు బైబై చెప్పి నా సామాన్లతో బయటపడ్డాను. అప్పటికి    సాయంకాలం 4.10 అయ్యింది.
      నా సామాను అందుకున్న మేస్త్రీతో ‘‘ఇక్కడ అప్పర్‌క్లాస్‌ వెయిటింగ్‌ రూమ్స్‌లో ఏసీలు పని చెయ్యవయ్యా.. మంచి గాలి తగిలే చోటు చూపించు. రాత్రి 8.20కి రాజధానిలో బెంగళూరు వెళ్లాలి. డబ్బులు న్యాయంగా తీసుకో’’ అన్నాను హిందీలో..
      ‘‘అలాగే సాబ్‌! మీ బండి ఎనిమిదో నంబరుకు వస్తుంది. నాతోనే మెల్లగా రండి, మీ కోచ్‌ నంబరెంత?’’ అని అడిగాడు. నా సమాధానం విన్నాక ఏడు, ఎనిమిది ప్లాట్‌ఫారంల మధ్యనున్న మెట్ల తోవ కిందకి తీసుకెళ్లాడు.
      ‘‘ఇక్కడ మంచిగాలి తగుల్తుంది. ఈ ఇనుప పెట్టె మీద కూర్చోండి. పక్కనే టీస్టాల్‌ కూడా ఉంది. న్యాయంగానే అడుగుతున్నాను, ఎనభై రూపాయలివ్వండి’’ అన్నాడు మేస్త్రీ. 
      అంత న్యాయంగా అడిగిన వాళ్లు నాకింత వరకు తారస పడలేదు. సంతోషంగా డబ్బులిచ్చాను.
      నాకు కాస్త దూరంలో కొందరు పిల్లలు కూర్చొని బాతాఖానీలో మునిగిపోయి ఈ లోకాన్నే మర్చిపోయినట్టు కనిపించారు. అయితే వాళ్లందరూ పాతికలోపు వయసువాళ్లే. నావైపెవరూ చూసేలా కనిపించట్లేదు. ఇంత వయసు వచ్చినా, ఎన్నో వందల కొద్దీ ప్రయాణాలు చేసినా, కొత్త వారితో మాట్లాడటం, సులువుగా కలియటం నా స్వభావానికే విరుద్ధం. కానీ విచిత్రంగా ఆ రోజు వాళ్లతో మాటలు కలపాలనిపించింది. మరో నాలుగ్గంటల సమయం ఎలాగైనా గడవాలి కదా, అందువల్లనేమో! మరో పావుగంట గడిచినా వాళ్లలో ఏ ఒక్కరూ నన్ను గమనించలేదు.
      నెమ్మదిగా లేచి పక్కనున్న టీస్టాల్‌వైపు నాలుగే అడుగులు వేశాను. లోపల యజమాని, ఓ కుర్రాడు ఖాళీగా కూర్చొని దిక్కులు ఎటున్నాయోనని వెతుక్కుంటున్నారు. పేపర్‌ గ్లాసుల్లో టీబ్యాగులు పెట్టి సిద్ధం చేసిన దొంతర కనిపించింది. ‘‘ఈ పక్కన మెట్లకింద కుర్రాళ్లకి డిప్‌చాయ్‌లు పంపించు భాయ్‌’’ అని చెప్పాను. చాయ్‌ ట్రే తీసుకువచ్చి తలా ఒకటందించాడు భాయ్‌. అప్పటికే రెడీగా పట్టుకున్న నలభై రూపాయలు కుర్రాడికందించాను. ఆ కుర్రాళ్లు మాట్లాడుతూనే గ్లాసులందుకుని టీ బ్యాగుల్ని డిప్‌ చేసుకున్నారు. 
      ‘‘అందరం ఇక్కడే ఉన్నాం కదరా, మరి ఎవరు టీ చెప్పేరూ?’’ అన్నాడొక కుర్రాడు. అతనే అందరికీ నాయకుడిలా ఉన్నాడు.. అందరూ ముఖాలు చూసుకున్నారు. నేను కాదంటే నేను కాదని ప్రతి కుర్రాడూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
      ‘‘నేను’’
      ‘‘మీరెందుకు టీలు తెప్పించారు?, మీరెవరో మాకు తెలియదే’’ అంటూ ఆశ్చర్యపోయాడు.
      ‘‘అందరం కలిసి టీ తాగుతుంటే బావుంటుందనిపించింది. ఈ మాత్రానికే ఒకరికొకరం తెలియనక్కరలేదుగా..’’ అన్నాను చొరవగా..
      ‘‘మరి మీరు...ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికెళ్లాలి?’’
      ‘‘హరిద్వార్‌ నుంచి వచ్చాను, వెళ్లాల్సింది బెంగళూరు’’
      ‘‘హరిద్వార్‌ లాంటి తీర్థస్థలాలకు ఒంటరిగా వెళ్లరు కదా, ఆంటీని... ఇంట్లోనే వదిలి మీరొక్కరే...’’ నసుగుతూ అన్నాడో అబ్బాయి.
      ‘‘ఆంటీయా! ఆపైన...’’ అంటూ చేత్తో ఆకాశం వైపు చూపించాను.
      ‘‘కూర్చోండంకుల్, నిల్చొనే ఉన్నారు...’’ మరో అబ్బాయి మాట కలిపాడు.
      ‘‘మీరు చూస్తే డిజేబుల్డ్‌లా ఉన్నారు. దూర ప్రయాణాలు కష్టం కదండీ..’’ అందరిలోకి చిన్న కుర్రాడు.
      ‘‘మీ పిల్లలు తోడు రారా?’’ మరో అబ్బాయి.
      ‘‘తప్పదు మరి... ప్రతిసారీ రావాలంటే వాళ్లకు కుదరదు కదా. ముగ్గురు పిల్లలూ మూడు రాష్ట్రాల్లో ఉన్నారు మరి..’’ అప్పుడే నాకు స్ఫురించిన విషయం జోడించాను. 
      ‘‘సరే..ఇప్పుడు మీ విషయాలు వివరంగా చెప్పండి.. ఇక్కడేం చేస్తుంటారు?’’
      ‘‘మేం అంతా ఢిల్లీ వాళ్లం కాదు, ఈ చిన్న పిల్లడొక్కడే ఇక్కడివాడు, అమ్మా, నాన్నలతో కలిసి ఈ దగ్గర్లోనే ఉంటున్నాడు’’
      ‘‘అంటే...?’’ తేడా ఏమిటో నాకర్థం కాలేదు.
      ‘‘మేమంతా ఇళ్లనుంచి పారిపోయి వచ్చిన వాళ్లమే’’ కోరస్‌గా, ఉత్సాహంగా, చిరునవ్వులతో చెప్పారందరూ...
      ‘‘అలాగా.. అసలేంటీ మీ కథ.. మొదట నువ్వు చెప్పబ్బాయ్, వీళ్లందరికీ లీడర్‌లాగున్నావ్‌.. ఏ ఊరు మీది?’’
      ‘‘మాది ఒడిశాలో పూరీ దగ్గర చిన్న పల్లెటూరండీ. చిన్నప్పటి నుంచి పరమ బద్దకిష్టిని. అక్షరాలు, అంకెలు తప్ప మరేం అబ్బలేదు. అమ్మా, నాన్నలే కాదు, ఊళ్లోని వాళ్లంతా తిట్టేవారు. మరీ ముసలాళ్లు దగ్గరకు పిల్చి మరీ చెవులు మెలేసేవాళ్లు. మా తమ్ముడిలా కనీసం అత్తెసరు మార్కులతోనైనా పాసవలేని చవటనని ఎగతాళి చేసేవారు. వాడు ఇంటర్మీడియట్‌ పాసైన రోజు నా మీద జడివానలా తిట్ల వర్షం కురిసింది. వాటిని భరించలేక ఇల్లొదిలి పూరీ చేరాను నడుచుకుంటూ. ఆ మర్నాడు రైలు బండెక్కి టికెట్‌ లేకుండానే ఇక్కడకు వచ్చి ఇదే ఏడో నంబరు ప్లాట్‌ఫారం మీద అడుగుపెట్టి, ఇప్పటి దాకా పాతుకుపోయాను.’’ 
      ‘‘ఆ తర్వాత ఏం చేశావ్‌?’’
      ‘‘మూడు రోజులు స్టేషనంతా తిరిగాను. అదిగో ఆ స్టాల్‌ వాడు వద్దంటున్నా, కసురుకున్నా, తిట్టినా, ఎంగిలి ప్లేట్లు కడుగుతూ, బతిమాలుతూ, వాడిచ్చే ఆ కాసింత అన్నం తింటూ ప్రాణాలు నిలబెట్టుకున్నాను.. ‘ఇక్కడ వేలాడితే నీకేంటొస్తుందిరా వెధవా, ఈ స్టేషనంతటికీ ఓ పెద్ద కాంట్రాక్టర్‌ సాబ్‌ ఉన్నాడు. వాడింటికెళ్లి, కాళ్ల మీద పడి బతిమాలితే ఏదైనా తోవ చూపిస్తాడేమో’ అన్నాడు ఆ స్టాల్‌ సబ్‌కాంట్రాక్టర్‌. ఆ మాటలు నా మీద మంత్రంలా పని చేశాయ్‌.
      పహడ్‌గంజ్‌లో ఆ కాంట్రాక్టర్‌ ఇల్లొక ఇంద్రభవనంలా ఉంది. తోవలో తట్టిన ప్లాన్‌ ప్రకారం ఇంట్లోకి దూసుకుపోయి కాంట్రాక్టర్‌ కాళ్ల మీద పడిపోయాను. నాకేదైనా తోవ చూపించేవరకూ విడిచిపెట్టనంటూ రెండుకాళ్లూ పట్టేసుకున్నాను. మా పేదరికం గురించి, నా గురించీ నిజాయతీగా చెప్పేశాను. చివరిగా పూరీ జగన్నాథుడి మీద ఒట్టు పెట్టుకున్నాను, ఎప్పుడూ అబద్ధమాడనని, మోసం చెయ్యనని. నన్ను పరీక్షించడానికి ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఏ పనీ ఖాళీ లేదు, నువ్వేం చెయ్యగలవో చెప్పమని నన్నే అడిగాడు చివరకు. 
      ఏవైనా సరకులివ్వండి సార్‌.. అమ్ముతాను. సాయంకాలానికి మొత్తం డబ్బులు, మిగిలిన సరకులు తెచ్చి మీకిస్తాను. తోచినంతివ్వండి. దాంతోనే కడుపు నింపుకుంటాను..’ అన్నాను.
      ‘రేపొద్దున్నే వస్తాను, ఎంట్రన్స్‌ దగ్గర నిల్చో’ అన్నాడు.
      ఉదయం పదకొండు గంటలకొచ్చి, నాకు చిప్స్, కుర్‌కురే, బిస్కట్‌ ప్యాకెట్లు ఓ పదేసి చొప్పున ఇప్పించాడు. మధ్యాహ్నం రెండు గంటలకల్లా అవన్నీ ఖాళీ. హోల్‌సేల్‌ ధర మాత్రం తీసుకొని మిగతాదంతా నాకే విడిచిపెట్టాడు. సముద్రంలాగా నాలో ఆనందం ఉప్పొంగింది.
      సార్‌! ఈ మధ్య జనాలంతా కుర్‌కురేలు, చిప్స్, కూల్‌డ్రింక్స్‌తోనే బతుకుతున్నారు. వీటిల్లో లాభాలూ ఎక్కువే. అందువల్ల నా పని బాగుంది.. అదిగో ఆ బడ్డీ ఇప్పుడు నాది. పల్లెటూళ్లోని మా పూరిపాక రెండు లక్షల ఖర్చుతో ఒంటిస్తంభం మేడలా మారిపోయింది. మా తమ్ముణ్ని పై చదువులు చదివించాను. మూడు లక్షల లంచంతో వాడు ఢిల్లీలోనే సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నాడు. ఇప్పుడు మాఊరెళ్తే పెద్దన్నా, పెద్దన్నా (భాయినా) అంటూ నా చుట్టూ మూగుతున్నారు.’’ అన్నాడు గర్వంగా.
      ‘‘ సరే.. నీ ప్రోగ్రెస్‌ బావుంది గానీ నువ్విక్కడున్నావు, బడ్డీలో ఎవరూ కనపట్టం లేదే!’’
      ‘‘ఇదిగో, వీళ్లిద్దరూ నాకు హెల్పర్స్, నెలకు మూడు వేల చొప్పున జీతాలు, మూడు పూటలా భోజనం, టీలు ఇప్పిస్తాను. అయిదు గంటల వరకు ఈ రెండు ప్లాట్‌ఫారాలు ఖాళీ. అందుకే ఇలా పిచ్చాపాటి.’’ అంటూ బక్కపల్చగా ఉన్న ఇద్దరబ్బాయిల్ని చూపించాడు. వాళ్లు నాకు నమస్కారం చేశారు. ‘‘ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ, నా పేరు బొంశీ(వంశీ) నాయక్‌’’ తనే ముక్తాయించాడు.
      ‘‘ఇప్పుడే వస్తాం సార్‌’’ అంటూ మిగిలిన నలుగురిలో ఇద్దరు హఠాత్తుగా పరుగెత్తారు. అంత హడావుడిగా ఎక్కడికెళ్తున్నారనుకొని అటు చూసే సరికి అప్పుడే ఆరో నంబరులోకి వస్తున్న బండెక్కేశారు.
      నా దృష్టి నాలుగడుగులైనా లేని అందరికన్నా చిన్న కుర్రాడిపైన పడింది. పక్కనే 10, 12 లీటర్‌ సైజు బకెట్లో తాలింపు శనగలు సగం వరకు ఉన్నట్లు కనిపించింది. వాటిపైన ఓ చిన్న గరిటె, ఓ దొంతర ఆకుదొన్నెలు ఉన్నాయి.
      ‘‘టైం అయిదవుతోంది.. మిగిలిన శనగలు ఎప్పుడమ్ముతావ్, ఇంటికెప్పుడెళ్తావ్‌?’’
      ‘‘అన్నీ అయిపోయాయి సార్, అందుకే వీళ్లతో మాటల్లో పడ్డాను. ఇహ ఇంటికెళ్లిపోతాను.’’
      ‘‘బకెట్లో శనగలు సగానికుండగా అమ్మేశానంటావేమిటి?’’
      ‘‘నే చెప్పేది నిజమేనండి, కావలిస్తే చూడండి, ఈ కొద్దిపాటి గింజలే ఉన్నాయి. బకెట్‌ మధ్యలో ఓ పళ్లెం ఉంటుంది. మాక్కూడా పట్టుకోవడానికి, మోసుకుంటూ తిరగడానికీ సదుపాయంగా’’ అని చెప్తూనే కాస్త ఏటవాలుగా వంచేసరికి, ఓ పక్కగా ఒరిగిపోయిన శనగలు కాసిని కంటబడ్డాయి.
      ‘‘సరే, నీ సంగతి చెప్పు, ఇంత చిన్నవయసులో స్కూలుకి వెళ్లకుండా ఈ బాధ్యత నీ నెత్తిన వేశారా? అయినా ఈ మాత్రం అమ్మితే నీకెంత మిగుల్తుంది’’ కుతూహల పడ్డాను.
      ‘‘రెండు వందలు మిగుల్తుందండి’’
      ‘‘నిజంగా’’
      ‘‘నిజమే సార్, పెట్టిన మదుపుకి రెండింతలొస్తుంది. ఈ సంపాదన అమ్మకీ నాన్నకీ నాకూ సరిపోతుంది. సొంత ఇల్లుంది కాబట్టి అద్దె బాధ లేదు.’’
      ‘‘నీ పేరు’’ 
      ‘‘ఉపేంద్ర దాసండీ..’’
      ‘‘స్టేషన్లో అందరికీ మామూళ్లు ఇవ్వాల్సి ఉంటుంది కదా!’’
      ‘‘అయినా బాగానే మిగుల్తుందండీ.’’
      ‘‘చదువుకోవాలనిపించడం లేదా నీకు?’’
      ‘‘మా వీధిలోనే నైట్‌ ట్యూషన్‌కి వెళ్తున్నా సార్, పదో తరగతి ప్రైవేటుగా కడతాను.’’
      ‘‘రోజల్లా అలసిపోయాక చదివే ఓపిక ఉంటుందా!’’
      ‘‘ఫర్వాలేదు సార్, ట్యూషన్‌ సార్‌ పెట్టే పరీక్షల్లో మంచి మార్కులే వస్తున్నాయి... పదో తరగతి పాసయ్యాక, ఏం చెయ్యాలో ఆలోచిస్తాను...’’ అంటూనే రెండడుగులు వేసి ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి దగ్గరకెళ్లాడు.
      ఎడమ వైపు తలతిప్పి చూసేసరికి పరుగుతో వెళ్లిన ఇద్దరు కుర్రాళ్లు అదే స్పీడ్‌లో నవ్వుకుంటూ వస్తున్నారు. ఒకరి చేతిలో ఖాళీ వాటర్‌ బాటిల్స్, కొంచెం నలిగినట్టున్న న్యూస్‌పేపర్లు మరొకరి దగ్గర, ఆయాసపడుతూ నా దగ్గరకొచ్చి నిలబడ్డారు.
      ‘‘నీ పేరేంటబ్బాయ్‌’’ ప్లాస్టిక్‌ బాటిల్స్‌ పట్టుకున్న కుర్రాడినడిగాను.
      ‘‘అమల్‌’’ అని చెప్తూనే, అక్కడున్న ఓ పెద్ద ఇనుప పలకల పెట్టె మూత ఎత్తి, వాటినందులో పడేసి మూతపెట్టి నా ఎదురుగా మరో పెట్టె మీద కూర్చున్నాడు. ‘‘మీదేవూరు!’’ అడగ్గానే తన సంగతి చెప్పుకొచ్చాడు.
      ‘‘అస్సాంలోని గౌహతి సిటీ, అమ్మా నాన్నలకు ఒక్కడే పిల్లాణ్ని. రోజంతా  చదువూ చదువూ... బాగా చదవాలి అంటూ తోమేవారు. బొంశీ భాయ్‌లాగే చదువంటే నాకూ ఇష్టముండేది కాదు. ఎంతో కష్టమ్మీద పది వరకు లాగించినా, ఫెయిలయ్యాను. అమ్మా నాన్న కలిసి గొడ్డును బాదినట్టు బాదారు. భరించలేక పారిపోయి వచ్చేశా..’’
      ‘‘ఎన్నాళ్లయింది!’’ 
      ‘‘రెండు సంవత్సరాలపైనే’’
      ‘‘ఈ రెండేళ్లలో ఇంటికెళ్లావా?’’
      ‘‘లేదంకుల్, ఇక వెళ్లను కూడా. చదువుకున్న వాళ్లందరూ బాగుపడిపోయారా? లేనివాళ్లు బతకడం లేదా? వాళ్లు నాకు పెట్టిన బాధల్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ కసిగా, కోపంగా వచ్చాయా మాటలు.
      ‘‘నిన్ను కొట్టినందుకు, నువ్వు పారిపోయినందుకు, ఆ తర్వాత వాళ్లు తప్పకుండా బాధపడే ఉంటారు. క్షేమంగా ఉన్నానని ఉత్తరాలన్నా రాస్తున్నావా?’’
      ‘‘క్షేమంగా ఉన్నాను’’ అని రెండే పదాలు ఓ పోస్టుకార్డు మీద రాసి గత నెలలోనే పోస్టు చేశాను. ఏ ఊరు అన్నది తెలుసుకోలేకుండా ఆర్‌ఎంఎస్‌కి వెళ్లి నేనే గజిబిజిగా స్టాంపు వేసేశాను. రోజూ నన్ను చూస్తుంటారు కాబట్టి, నా ఉద్దేశం గ్రహించి వాళ్లూ ఏమీ అనలేదు, నవ్వేశారు.’’
      ‘‘ఇక్కడ నీ పనేంటి?’’
      ‘‘ఇప్పుడు చూశారు కదా అంకుల్, నిజాముద్దీన్‌కి వచ్చే బండి రాగానే నేను ఖాళీ వాటర్‌ బాటిల్స్‌ తీసుకువస్తే, వీడేమో మీలాంటివాళ్లు చదివి వదిలేసిన న్యూస్‌పేపర్లు తెస్తాడు. అయిదు నుంచి తొమ్మిది వరకు మా ఇద్దరి పని.
      ‘‘ఖాళీ సీసాలేంజేస్తావ్‌?’’
      ‘చూడండి’ అన్నట్టు నాకు సైగ చేసి, ఇందాకటి పెట్టె మూత ఎత్తి ఓ పెద్ద సంచీ బయటకు తీశాడు. అందులోంచి ఒక్కొక్క బాటిల్‌ తీసి, టీస్టాల్‌ గోడకున్న కుళాయి నీళ్లు నిండుగా నింపడం ప్రారంభించాడు.
      ‘‘అవేం చేస్తావ్‌!’’
      ‘‘ఒక్కోటి రెండు రూపాయలకమ్ముతాను’’
      ‘‘ఎంగిలి సీసాల్లో నీళ్లు నింపేస్తున్నావ్, తప్పు కదా!’’
      ‘‘తప్పు, పాపం, పుణ్యంలాంటి మాటల్ని నేను పట్టించుకోను సార్‌’’ ఆ క్షణంలో ఆశ్చర్యంతో నా నోరు తెరుచుకొనే ఉండాలి.
      ఇంతలో అయిదో నంబరు మీదకు ఎక్కడికో వెళ్లాల్సిన ఖాళీ బండి దడదడ శబ్దం చేస్తూ వచ్చి ఆగింది. ఓ పెట్టెలోకి దూసుకుపోయాడు అమల్‌. వెళ్లిన పది నిమిషాలకే ఖాళీ సంచితో పరుగెత్తుకుంటూ వచ్చి, ఇంకొన్ని ఖాళీ సీసాల్ని నింపి మళ్లా వెళ్లాడు. ఆ ట్రైన్‌ వెళ్లిపోయాక మెల్లగా       నడుస్తూ వచ్చి నా దగ్గర ఖాళీగా ఉన్న పెట్టె మీద కూర్చుని 5, 6, 9 నంబర్లకు వచ్చే బళ్లలోనే తన మదుపులేని వ్యాపారం సాగుతుందని మెల్లగా మాటలు కలిపాడు.
      ‘‘మరి 7, 8 ప్లాట్‌ఫారాలు’’
      ‘‘సాయంకాలమయ్యాక ఈ రెండింటికి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఎక్కువగా వస్తుంటాయి. వీటికి ఆర్డినరీ పెట్టెలుండవు కదా’’ అని చెప్తుండగానే చీకటి ఆవరించుకుంది. కొత్తగా మెరిసిపోతున్న బండి వచ్చి ఏడో నంబర్లో ఆగింది.
      ‘‘ఇంత అందమైన బండిని నేనింత వరకు చూడలేదు.’’
      ‘‘దీన్ని ఆగస్ట్‌ క్రాంతి అంటారు. ముంబై, ఢిల్లీల మధ్య తిరుగుతుంటుంది. ఇలాంటిది మన దేశంలో ఇదొక్కటే’’ అమల్‌ పక్కనున్న అబ్బాయి మాటలు కలపడంతో అమల్‌ లేచి తన పనిలో పడ్డాడు. నేను ఆ కుర్రాడి వివరాలు కూడా అడిగాను.
      ‘‘నా పేరు రత్నాకర్‌ సార్‌, లక్నో దగ్గరి బారాబంకీ మా ఊరు. పారిజాత వృక్షం మా ఊళ్లోనే ఉంది. ఎప్పుడైనా విన్నారా?’’
      ‘‘లక్నో దగ్గర ఏదో ఊళ్లో ఉందని నా చిన్నప్పుడు న్యూస్‌పేపర్లో చదివాను. ఎంతోమందిని ఎంక్వయిరీ చేసి, చివరకు కిందటి సంవత్సరమే వెళ్లొచ్చాను. అవును గాని నువ్వక్కడే దుకాణం పెట్టుకోలేకపోయావా?’’
      ‘‘అబ్బే.. అక్కడ విజిటర్స్‌ తక్కువ, షాపులెక్కువ.. పైగా ఇంట్లోవాళ్ల గోల.. అందుకే ఇల్లొదిలి ఇలా..’’ ఆనందంతో మనస్ఫూర్తిగా నవ్వాడు రత్నాకర్‌.
      ‘‘ఓ రకంగా ప్రాణంలేని ఈ పెట్టెలే మిమ్మల్ని కలిపాయేమో, ఇంతకీ నీ న్యూస్‌పేపర్ల ఆదాయం రోజుకెంత?’’
      ‘‘250 రూపాయలపైనే’’
      ‘‘ఒక రోజుకి 50 కిలోల పేపర్లు దొరుకుతాయా?’’ ఈసారి ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టడం నాకు జ్ఞాపకముంది.
      ‘‘ఇరవై దొరికితే చాలండీ..’’
      ‘‘అవునా..కిలో ఎంత?’’
      ‘‘పద్నాలుగు రూపాయలు సార్‌’’
      ‘‘నిజమా, మా ఊళ్లో అయిదు రూపాయలు దొరకటమే గగనం, తూకంలోనూ మోసం చేస్తారు..’’
      పకపక నవ్వాడు రత్నాకర్, ‘‘ఇది ఢిల్లీసార్‌. స్టేషన్‌ బయటే ఓ కబాడి దుకాణం ఉంది. అక్కడ మోసం ఉండదు. వెళ్లేటప్పుడు అన్నీ తీసుకుపోయి, అమ్మేసి డబ్బులు జేబులో వేసుకోవడమే’’
      ‘‘మరి ఢిల్లీలో 250 సరిపోతుందా?’’
      ‘‘ఓ.. మిగుల్తాయ్‌ కూడా’’
      మా మాటలు జరుగుతుండగానే అమల్‌ ఓ పక్క జోరుగా తన పని చేస్తున్నాడు. ఆగస్ట్‌ క్రాంతి ఎప్పుడో వెళ్లిపోయింది. నా ట్రెయిన్‌ వచ్చేసిందేమోనని ప్రతిసారీ పేరు చూస్తున్నాను.
      ఆరో నంబరులో ఉన్న బండి నుంచి ఇటువైపు గబగబా దిగుతూ అమల్‌ కాలు జారి పడిపోవడం, ఏడో నంబరు మీదుగా ఓ ఇంజన్‌ దూసుకుపోవడం ఒక్కసారే జరిగాయి. నా సామాన్లు వదిలి ప్లాట్‌ఫారం మీద ఉన్న మిగతా వాళ్లతో నేనూ పరుగెత్తా.. 
      ‘‘ఉస్‌కో పానీ పిలావ్‌’’ అంటూ పెద్దగా కేకలు వేశాను. అతని కుడి చేతి వేళ్ల మీదుగా ఇంజిన్‌ చక్రాలు వెళ్లటంతో, అవి సగానికి తెగి, ఆ చక్రాలకే అంటుకొని వెళ్లిపోయాయి. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో తెగిన మొండివేళ్లు రక్తసిక్తంగా స్పష్టంగా కనిపిస్తున్నాయ్‌.
      రత్నాకర్‌ పరుగెత్తుకెళ్లి రైల్వే డాక్టర్ని తీసుకువచ్చాడు. హాస్పిటల్‌కి తీసుకురండి అంటూ డాక్టర్‌ వేగంగా వెళ్లిపోయాడు. నేను ఆత్రుతగా అమల్‌ మొహంలోకి చూశాను.
      ‘‘ఫర్లేదులెండీ.. మీరు మళ్లీ ఢిల్లీ వస్తే నేనిక్కడే కనిపిస్తా.. మీ బండికి టైమయ్యింది, సలామ్‌’’ అంటూ నిబ్బరంగా ఎడం చేత్తో సలామ్‌ కొట్టాడు. ఆ యువకులు డాక్టర్‌ వెనకాలే కదిలారు.
      టైమ్‌ 8.15 అయింది. నా ట్రెయిన్‌ రాగానే బెర్తు వెతుక్కుని కూర్చున్నా. పిల్లల ఆలోచనలు చుట్టుముట్టాయి. అందరి విషయంలోనూ తల్లిదండ్రులు ఇంచుమించు కఠినంగానే ప్రవర్తించారు. చదువులు లేకపోయినా ఎంతమంది బతకడం లేదు? గొప్పవాళ్లు కావడం లేదా! మనిషికి కావాల్సినవి ఆత్మస్థైర్యం, నిజాయతీలు. వీళ్ల తల్లిదండ్రులు ఆ దిశగా ప్రయత్నించనే లేదు. గానీ ఈ పిల్లలకివి నిశ్చయంగా ఉన్నాయి. పరీక్షల్లో మార్కులు తగ్గినా, ఫెయిలైనా, అమ్మానాన్నలు కోప్పడినా ఆత్మహత్యలకు పాల్పడే భీరువులు కాదు వీళ్లు. ఎప్పటికైనా ఉన్నత స్థితిలోకి వస్తారు.       ‘వీళ్లు ఇళ్ల నుంచి పారిపోయారు గానీ జీవితాల నుంచి కాదు’ అన్న మాటలు తట్టగానే నాలో కొండంత ఉత్సాహం వచ్చి చేరింది. హుషారుగా చిన్న ఈల వేశాను. జీవితపు పట్టాలపై రైలుబండి కూతవేసుకుంటూ బయల్దేరింది.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


పాపమ్మ చెట్టు

పాపమ్మ చెట్టు

లోగిశ లక్ష్మీనాయుడు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోనిbal bharatam