ఆటవెలది

  • 343 Views
  • 1Likes
  • Like
  • Article Share

    కె.కృష్ణ‌మోహ‌న్‌

  • ఉప వాణిజ్య ప‌న్నుల అధికారి
  • తెనాలి
  • 9440321969
కె.కృష్ణ‌మోహ‌న్‌

ప్రియురాలి సౌందర్యారాధనే తన జీవితమనుకుంటాడు వేమన. కానీ తన ప్రేమకంటే కనకాభరణాలే ఆమెను ఆనందింపజేస్తాయి.. లోకం తీరేంటని తనను తాను ప్రశ్నించుకుంటాడు.. అతనికి తత్వమార్గంలో ఆటవెలదుల సమాధానాలు ఎలా దొరికాయి..?
‘‘ఆమె పేరు ఏమన్నావూ...
’’ అడిగింది నరసమాంబ.
      ‘‘సరిగ్గా తెలీదు. కాని విశ్వదా అని అంటుంటాడు..’’ చెప్పాడు అభిరాముడు.
      ‘‘అదేమి పేరు..? సానుల పేరులా లేదే...’’ అంటూ బుగ్గన చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తూ ఇంట్లోకి నడిచింది నరసమాంబ.
      ఈ విషయం అనవసరంగా చెప్పలేదు కదా అనుకున్నాడు అభిరాముడు.

* * *

      ‘‘ఊ.. అయితే వదినెగారి చెవిన వేసేశావన్న మాట...’’ అన్నాడు పచ్చగడ్డిలో వెల్లకిలా పడుకుని ఆకాశం వైపు చూస్తూ వేమన.
      పక్కనే వేప చెట్టుకు చేరగిలబడిన అభిరాముడు ‘‘మరే...’’ అన్నాడు.
      ‘‘నిన్న విశ్వద దగ్గరకు వెళ్లానా.. అదే సమయంలో చిన్నగా వాన జల్లు మొదలైంది.. చినుకు చూసిందా అంతే.. తనకెంత ఇష్టమో కదా వానంటే..! ఇక నాట్యం మొదలుపెట్టింది. ఆ వానా విశ్వదా నేనూ అంతా ఒకటై ఒక్కసారిగా మాయమయ్యాం.. తెలివి వచ్చేవరకు తెల్లారింది. ఇంటికి వెళ్లానా.. వంటగదిలో నుంచి వదినె ప్రశ్న. ఎవరు వేమా, నిన్ను కట్టేసుకున్న వలపుకత్తె..?!’’ అని.
      ‘‘ఏమని చెప్పావూ..?’’ అన్నాడు అభిరాముడు.
      ‘‘చెప్పేందుకు ఏముంది.. తలవంచుకుని బయటకు వచ్చేశాను’’ వేమన నవ్వాడు.
      ‘‘మరి నీ తెలివితేటలన్నీ ఏమయ్యాయి?’’
      వేమన అభిరాముడి వైపు చూశాడు.
      ‘‘చెప్పూ..’’ అన్నాడు అభిరాముడు.
      ‘‘ఏమి చెప్పేది? గుహల్లో గురువులను నువ్వు వెదికి చూస్తావు.. ఏ మృగమో నీకు ముక్తిమార్గం చూపెడుతుందని చెప్పినా వినవు. లేనిది వెదికేది మానని నీకు.. ఉన్న అందం, ఆనందం దొరికిపుచ్చుకున్న వేమన మాట అర్థమవుతుందా?’’
      ‘‘నేనేమీ లేనిది వెదకటంలా..’’ ఉక్రోషంగా అన్నాడు అభిరాముడు.
      ‘‘మరెందుకు తిరుగుతావు బైరాగుల వెంబడి... ప్రపంచం పట్టని మహత్తులకు, ఆ మహత్తులను పట్టుకుని మనకు దొరకని విధంగా తిరుగుతున్నవారి వల్ల లోకానికి ఒరిగే ప్రయోజనమేమి? లోకం సంగతి పోనీ, నీకేం ఒరిగింది..?
      ‘‘అయినా నీకు దైవం, అద్వైతం అనే పదాలు ఎక్కవులే వేమా’’ అన్నాడు చిన్నగా గొణుగుతూ.
      ‘‘అద్వైత కోడాది యద్దుదను హోగాడి
      ఉద్దన మరద తుదిగేరి, కైజారి
      బిద్దు సత్తంతె సర్వజ్ఞ...’’ అన్నాడు వేమన.
      ‘‘అదేంటీ’’ ఉలిక్కిపడి అడిగాడు అభిరాముడు.
      ‘‘కన్నడలో ఒక పెద్దాయన చెప్పాడట.. అద్వైతం కోసం తిరగడం అంటే ఉన్నది పోగొట్టుకోవడమే.. పొడవైన మాను చివరికెక్కి, చేయి జారి పడి చచ్చినట్లు అని అర్థమన్న మాట..’’ నవ్వాడు వేమన.
      ‘‘వెక్కిరిస్తున్నావా?’’
      ‘‘లేదు’’
      ‘‘మరి?’’
      ‘‘నీ తమ్ముడు లక్ష్యయ్య కన్నా నువ్వు పనిమంతుడివి. ఇనుపముక్క గుణమూ బంగారు తునక గుణమూ బాగా ఎరిగినవాడివి. ఒక బంగారు తీగను పట్టుకుంటే, దాని అందమెక్కడ ఒక ఆకారమై కళ్లకు కడుతుందో నీకు ముందుగానే తెలుస్తుంది.. దాన్ని అలా తీర్చిదిద్దుతావు కూడా. అలాంటి అభిరాముడు వెర్రి సాధువుల వెంట పరుగులు తీస్తుంటే, నేను ఏమి చేయగలను..?’’
      ‘‘సరే సరే, నా గురించి అంతగా చెప్పావు కదా.. మరి నువ్వు కూడా మామూలువాడివి కాదే. మీ వంశానికి రకరకాల చరిత్రలు ఉన్నాయి’’.
       ‘‘ఆహా...ఏమేమి చరిత్రలవి?’’ నవ్వాడు వేమన.
      ‘‘మళ్లీ నేను చెప్పాలా... దొంతి అలియరెడ్డి మీ తాత అని చెప్పే కథ నిజమేనా?’’
      ‘‘కథ ఏమిటో చెప్పకుండా నిజమేనా అంటావా’’
      ‘‘అందరూ చెప్పుకుంటుంటే విన్నదేలే.. నీకది వినాలని ఉంటే వినిపిస్తా. ఒక వ్యాపారి పేరు వేమన్న అట. శ్రీశైలం యాత్రకు వెళ్లి అక్కడ రాత్రి బస చేశాడట. గుడి తాళం వేసి వెళుతూ వెళుతూ ఉత్తరదిక్కుకు వెళ్లవద్దు అని అర్చకుడు చెప్పి వెళ్లిపోయాడట. ఆ వేమన్న నీలాంటోడే.. వెళ్లి ఉత్తరదిక్కున చూస్తే ఇనుమును బంగారు చేసే పరుసవేది ద్రవం కనబడిందట. అది రెండు బిందెలకు నింపుకుని ఓ కావిడి కట్టుకుని బయలుదేరి దారిలో అనుమకొండలో ఆగాడట. ఆ ఊరి పెద్దకాపు దొంతి అలియరెడ్డి ఇంట గొడ్లచావిట్లో ఈ బిందెలు పెట్టుకుని, భోజనానికి వెళ్లాడట. అక్కడే వున్న నాగలిచాలు పరుసవేది ద్రవానికి తగిలి బంగారమైందట. ఇది చూసిన అలియరెడ్డి బిందెలు తీసి పక్కనబెట్టి, కొట్టానికి నిప్పంటించాడట. భోజనం చేసి వచ్చిన వేమన్నకు నిప్పులమయమైన గుడిసె కనిపించిందట. ఎగిరి నిప్పుల్లో దూకాడట. ఆ తర్వాత అలియరెడ్డి ధనవంతుడయ్యాడట. కానీ మనశ్శాంతి కరవైందట. ఇంట్లో చావులు మొదలయ్యాయట. ఆ సమయంలో అలియరెడ్డి కలలోకి వేమన్న వచ్చి... తన పేరు పెట్టుకుంటే వందేళ్లపాటు వంశం నిలబడుతుందని చెప్పాడట. ఇదంతా నిజమేనా?’’ అడిగాడు అభిరాముడు.
      ‘‘వందేళ్లు అయిందన్న మాట నిజమేమో అభిరామా!’’ 
      ‘‘నువ్వు ఎగతాళి మాను. ఇంత చరిత్ర ఉన్న నువ్వు కేవలం చరిత్రతో మాత్రమే ఉన్నవాడివి కాదే. దేన్నయినా ఒక్కమాటుగా పట్టెయ్యగలవు. అలాంటిది అన్నావదినెలు నీ గురించి బెంగపడేలా రాత్రింబవళ్లు ఆ సాని కొంప చుట్టూ తిరుగాడ్డం సరైనదేనంటావా...?’’
      ‘‘రామ... రామా! నీకేది వచ్చో నీకు తెలీదు.. నాకు తెలుసు.. చుట్టూ ఉన్న వారికీ తెలుసు. అభిరాముడి చేతిలో విద్య ఉంది. బంగారం ఇచ్చినవారు ఎంతకాలమైనా వేచి, ఆభరణాలు పూర్తయ్యేంతవరకు అలా నీ చుట్టూ తిరుగాడతారు. అది నీ విద్య. ఇక నేనా.. నాకు ఆమెలో సౌందర్యం తెలుసు.. అది చీకటింట చెలగేరీతిగా- వెలుగుతున్న దీపమని నేను తిరుగుతున్నాను...’’
      ‘‘... ఆపు కవిత్వం!’’ అభిరాముడు వేమన నోటిపై చెయ్యి అడ్డుగా పెట్టి అదిమాడు.

* * *

      వారం రోజులుగా వేమన పరధ్యానంలో ఉన్నట్టనిపిస్తోంది. నాలుగు మెతుకులు ఎంతో బలవంతం చేస్తే తింటాడు. నిద్రకూడా సరిగ్గా పోతున్నట్లు లేదు. ఎర్రబడిన కళ్లు, నలిగిపోయినట్లు ఉన్న ముఖం, జబ్బుపడినట్లుగా ఉన్న వేమనను చూస్తే నరసమాంబకు బాధవేసింది. ఇది ఏమిటో అని, అభిరాముడిని పిలిచి అడిగింది నరసమాంబ. కనుక్కుంటానమ్మా అని నేరుగా వేమన ఎప్పుడూ కూర్చుని ఉండే చోటుకు వెళ్లాడు. వేమన వేపచెట్టు కింద పడుకుని కాలుమీద కాలు వేసుకుని ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు.
      ‘‘ఇక్కడున్నావా నువ్వు.. మరేమో’’ అన్నాడు ఉపోద్ఘాతంగా అభిరాముడు.. వేమన పలకలేదు.
      ‘‘లంబికా శివయోగి గురించి విన్నావా?’’
వేమన కళ్లు అభిరాముడివైపు తిరిగాయి.
      ‘‘మళ్లీ మొదలా?’’
      ‘‘హఠవిద్య సాధకుడట’’
      ‘‘ఆయన హఠం దేనికి సంబంధించిందో? మంత్ర యోగమా? లయ యోగమా?’’
      ‘‘విను మరి. ఆయన నౌళి, ధౌతి కర్మలను ఉపయోగించి ప్రక్షాళన చేసుకుంటుంటారట. అదీ చిన్నపిల్లలాటగా చేస్తాడట’’.
      ‘‘షట్‌ క్రియలలో రెండే చెప్పావు. మిగిలిన నేతి, భస్త్రి, త్రటక, కపాలభాతి సంగతి ఏమిటి..? అయినా-
      ముక్కుత్రాళ్ళు గుచ్చి మురికిపోవగా తోమి, కచ్చ నీరు నించి కడిగి కడిగి డొక్క తుడిచినంత మాత్రాన మోక్షం దొరుకుతుందా అభిరామా??’’
      ‘‘నువ్వు ఇలా ఎగతాళి చేయకు. నువ్వు కూడా రా. మనం వెళ్లి ఆయన ఆశీర్వాదం పొందివద్దాం’’
      ‘‘మనం అనకు. నీకు తప్పదు, నువ్వు వెళ్లు’’
      ‘‘సరే వెళ్తాను గాని, విశ్వద సంగతి చెప్పు.. ఈ మధ్య అటు వెళ్లినట్లు లేవు..’’ చిన్నగా అడిగాడు అభిరాముడు.
      కాసేపు మౌనంగా ఉన్నాడు వేమన.
      ‘‘తనకు వదినె నగలు కావాలంటే ఇచ్చాను. గడపమీదే నిలబెట్టి అందుకుని, వీటిలో ముక్కుపుడక లేదే అంది. అది కూడా వదినెనడిగి వెంటనే ఇచ్చాను.
      దాన్ని చూసిన ఆమె కన్నుల్లో సంతోషం.. నేను అంటూ లేనే లేను ఆ సంతోషంలో.. ఆ చీకటిలో ఆమె తొందరలు- ప్రమిదె వెలుగులో బట్టలు తీసేసి నగలు ధరించింది. ఆ నగ్నత్వాన్ని నగలు కప్పాయా? లేదే- ఏమూలో దాగిన కోరని కోరికల నగ్నత్వాన్ని బహిరంగం చేసిన రాత్రది.
      నేను చూస్తున్న సౌందర్యం మరణించింది. వేమన సౌందర్యపు పిపాసి కాదు రాకాసి. ఆ రాకాసి తన ఆకలిదప్పులను ఆత్మీయుల రక్తపు బొట్లతో తీర్చుకుంటాడు.. కదా అభిరామా..?!’’ చిన్న నీటిచెమ్మ వేమన కనుకొలుకుల్లో.
      అభిరాముడు కదిలిపోయాడు. రెండు చేతులతో వేమన చేతులను పట్టుకుని ఆత్మీయంగా ఒత్తాడు.
      ‘‘వేశ్యలకు ప్రేమ అర్థం కాదు’’ అన్నాడు అభిరాముడు.
      ‘‘అభిరామా..! అసలు బంగారంలో ఏముంది? మనిషి ప్రేమా అపేక్షా అనుబంధం అన్నీ ఒక్కసారిగా ప్రత్యక్షంగా చూపించేందుకు లేదా మాయం చేసేందుకు.. ఏముంది అభిరామా, బంగారంలో ఏముంది...??’’ అభిరాముడు ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ అలా కూర్చుండిపోయారు.

* * *

      ‘‘రామయ్యా.. రేపు వరలక్ష్మీవ్రతం. కమ్మలూ, ముక్కెర సాయంత్రానికి అత్యవసరంగా పూర్తిచేసిపెట్టు..’’ నరసమాంబ చెప్పింది.
      అభిరాముడికి గొంతులో వెలక్కాయ అడ్డం పడ్డట్లయింది. శివయోగి ఈ రోజు బయలుదేరి వెళ్లిపోతున్నాడు. ఫలహారం అందించేదెలా అని ఆలోచిస్తూ నీరసంగా కూలబడ్డాడు అభిరాముడు.
      బయటికి బయలుదేరుతున్న వేమన చూసి ‘‘ఏమా అవతారం?’’ అన్నాడు.
      సంశయం చెప్పేశాడు అభిరాముడు.
      ‘‘సరే వదినమ్మ పని చేసిపెట్టు. నేను నీ పని చేసిపెడతాను’’ అన్నాడు వేమన.
      అభిరాముడిలో ఆనందమూ ఆశ్చర్యమూ!

* * *

      రాత్రి రెండో జాము దాటింది.
      ఏదో ఆలోచనలో ఉన్న వేమనకు హఠాత్తుగా శివయోగి గురించి గుర్తొచ్చింది. మామిడితోపువైపు వెతుకుతూ వెళ్లాడు.. తోపు నిశ్శబ్దంగా ఉంది.
      దూరంగా ఒక బక్కపల్చని ఆకారం మసకవెన్నెల మధ్య.
      ఎముకలను కప్పిన చర్మం, నాలుక బయటకు సాచి కనుబొమల మధ్య తాకి ఉంది. కనురెప్పలు రెండువంతులు మూతపడి ఉన్నాయి. బాహ్యఖేచరీముద్ర.. సాధకుడే... అనుకున్నాడు వేమన.
      గాలికి ఎండుటాకు గలగలలాడింది.
      కళ్లు మెల్లగా తెరిచాడతడు.
      ‘‘ఎవరది రాముడా.. కాదే కృష్ణుడా ఏమి?’’
      ‘‘కాదు కాదు.. నన్ను వేమనంటారు..’’
      ‘‘నువ్వు వచ్చే ప్రదేశం కాదే ఇది..’’
      ‘‘అభిరాముడు.. బంగారపు పని.. అత్యవసరంగా..’’ ముక్కలు ముక్కలుగా వాక్యాలు వచ్చాయి వేమన నోటివెంట.
      గట్టిగా నవ్వుతూ శివయోగి ‘కాంతాకనకాల నుంచి ఎవ్వరూ అంత సులభంగా తప్పించుకోలేరు..’’ అన్నాడు.
      తలదించుకున్నాడు వేమన.
      తాను చెబుతున్నదాన్ని కొనసాగించాడు ఆ యోగి.
      ‘‘కోరికలకు ఉండే ఫలితాన్ని, బాధ్యతగా తీసుకోగలిగినవాడికే- ఆ కోరికలను అనుభవించే శక్తి ఉండటం సరైనది. అటువంటి శక్తి లేనివారు దేన్ని పొందినా దాన్ని నిలుపుకోరు.
      నేను తిరిగి చూసిన లోకం చాలా చిన్నది. ఈ లోకంలో విలువైనది అని భావించేదానికి, అపురూపం అని భావించేదానికి- ఎవరి దృష్టిలో విలువ లేదో- వారు అరుదుగా కనబడతారు. అలాంటివారు, వారికోసం కాకుండా- ప్రపంచం కోసం ఏదయినా చేస్తే, అది అత్యంత విలువైనదీ సజీవమైనదీ అవుతుంది’’.
      ఎవరితో మాట్లాడని శివయోగి ఇప్పుడు ఇలా ఎందుకు తనతో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు వేమన.
      నిజంగా మహత్తులున్న వ్యక్తా లేక పిచ్చివాడా ఇతడు..? చిన్నగా తలెత్తి శివయోగి కళ్లలోకి చూశాడు.
      ‘‘నేను ఏ తంత్రాన్ని అభిమానించి తిరిగానో, ఆ సాధనలో ఈ జీవితాన్ని వెళ్లబుచ్చానో అనుకుంటే ఒక్కోసారి నాకు నవ్వొస్తుంది. దాని ద్వారా వచ్చేది ఏదీ నాకు అవసరం లేదు. ఈ రోజు నిన్ను చూసిన తర్వాత- ఒక అనుభవం నీలోకి ప్రయాణించేందుకు సిద్ధంగా ఉందని నాకు అనిపించింది. బహుశా నా విద్య నీకు ఉపయోగపడుతుందేమో చూడు వేమనా..’’ అంటూ శివయోగి లేచాడు.
      క్షణంలో మెరుపులా అతడి చూపుడువేలు వేమన కనుబొమల మధ్య మొనకత్తిలా దూసుకుపోయినట్లయింది. ఎక్కడో నిద్రిస్తున్న బుద్ధి పడగపై తగిలిందా మొన. వేమన దృష్టిలో లోలోపలి రూపారూపాలన్నింటినీ ఒక్కసారిగా స్పష్టంగా దర్శించి- చటుక్కున శూన్యమయింది.
‘‘వేమా.. క్షణాల కలయికే కాలం. క్షణాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడు, కాలం దాని గమనం నీకు తెలుస్తుంది. ప్రాణాన్ని గమనించు. దాని ఆట ఏమిటో, దేనికో నీకు తెలుస్తుంది’’.
      వేమనకు అలసిపోయినట్లనిపించింది. అక్కడే మోకాళ్లపై కూలబడి, శివయోగి వైపు చూశాడు.
      ‘‘ఏమి చేశారు స్వామీ. నన్ను ఏదో మాయలో బంధించినట్లుంది..’’
      ‘‘అవునా- ఎవరిని ఎవరు బంధించగలరు వేమనా.. నీ ఇష్టమైన ప్రియురాలిని చేరకుండా ఇల్లు బంధించిందా? ఆ ఇంటిలోనివారి ఆత్మీయతలు బంధించాయా? నీ ప్రియురాలి మీద నీ నమ్మకాన్ని ఎవరు బంధించగలిగారు?- ఆ నమ్మకం ముక్కలు కాకుండా చూసుకోవాల్సిన నిన్ను ఎవరు బంధించారు? అంతా నీ చేతుల్లోనే ఉంది.
      ఆలోచనకు ఉండే రెక్కల బలం తెలియనివారు ఎక్కువ. తెలిసినా, ఎగిరి తప్పిపోతామనో- జారిపడిపోతామనో జాగ్రత్తల ముసుగులో ఉండేవారూ ఉన్నారు.
      ఇక ప్రేమ అంటావా..? అది నీరులాంటి ఒక ప్రాకృతికం. కొందరు దానితో దాహం తీర్చుకుంటారు. కొందరు దానిలో మునుగుతారు. మరికొందరు దానిలో మునిగి తేలుతారు. మరికొందరు దానినుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
      వ్యక్తి తననుంచి అనంత విశ్వానికి, అనంత శక్తికి కలుపుకునేందుకు ఉత్తమ మార్గం ప్రేమ. అది వస్తువు వైపు గమనం కాదు. వ్యక్తివైపు గమనమూ కాదు.
      ఇదంతా తెలియడం ఒక విద్య. తెలియజేయడం ఒక బాధ్యత. ఇది అందరికీ అర్థమయ్యే భాషలో, రీతిలో చెప్పగలిగే శక్తి నీకు ఉంది. దీన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తావో నీ ఇష్టం.
      నాకంటూ నేను సాధన చేసిన తంత్రంలో ఏదన్నా నీకు ఉపదేశించగలిగితే అది నీకు ఇస్తున్నాను. నువ్వు కోరుకున్నది నువ్వు ప్రేమించిన స్త్రీ అనుకుని ఆ దారిలో వెళితే, నిన్ను ఆమె స్వాగతిస్తుంది, వెళ్లి చేరుకో లేదా నీ స్నేహితుడిలా బంగారమే కావాలనుకుంటే- ఏ లోహాన్నయితే నువ్వు తాకుతావో అది బంగారమై తీరుతుంది- కాదూ అవి నిన్ను బంధిస్తున్నాయనుకుంటే ఆరెండు దారులను వదిలేసి, కళ్లు తెరిచి ప్రపంచాన్ని ఒక్కసారి చూడు..’’ అన్నాడు శివయోగి.
            వింటున్న వేమనకు ఆ మాటల తరవాత ఇక ఏమి వినబడలేదు. అతని శరీరం లేదు. అతని మనసు లేదు. అతనే లేడు అన్నట్లుగా అయ్యాడు. శివయోగిని చూస్తున్న మరో యోగిలా ఉన్నాడు వేమన.

* * *

      ఆ మరుసటి రోజున పొద్దున్నే వేమన ఏడని అభిరాముడిని అడిగింది నరసమాంబ. అభిరాముడికి సందేహం వచ్చింది ఎటెళ్లాడా అని. వెతికాడు.. సానివాడలో లేడు. ఊరిబయట తోటలోనూ లేడు. చుట్టుపక్కల ఊళ్లల్లోనూ వెతికిచూశారు. వేమన జాడలేదు.

* * *

      రోజులు గడిచాయి. గడుస్తున్నాయి. గడుస్తూనే ఉన్నాయి. వారాలూ నెలలూ ఏళ్లూ.. అభిరాముడికి వయసు మీద పడింది. పూర్తిగా పని మానేశాడు. కొడుకు, మనుమళ్లు పనిచేసేవారు. ఆ రోజుల్లో అని అభిరాముడు వారితో మొదలుపెట్టేవాడు. వారు నవ్వుకునేవారు. మాటలతోనే కాలక్షేపం. మాయలూ, మంత్రాలూ, యోగులూ, సాధువుల కథలు చెప్పాలంటే అభిరాముడే చెప్పాలి. చుట్టుపక్కల పిల్లలంతా సాయంత్రం అయితే అతని చుట్టూ మూగేవారు.
      అలా నడుస్తున్న కాలంలో- ఓ హేమంతం బద్ధకంగా విచ్చుకుంది. విచ్చుకున్న ఆ పొద్దు మాటున, చలికి ముడుచుక్కూర్చున్న అభిరాముడికి దూరంగా ఏదో అలికిడి వినబడింది. అటువైపు చూశాడు. తమ ఇంటివైపే వస్తున్న ఒక ఆకారం. కళ్లు నులుముకుని, చేతులు అడ్డుగా పెట్టుకుని చూశాడు. ఎవరో సాధువులా ఉన్నాడే అనుకున్నాడు. అతని గడ్డం, వైఖరి, నడక ఎక్కడో చూసినట్లుగా అనిపించింది.
తాను ఎప్పుడో చూసిన ఎవరో యోగి తనను కరుణించడానికి వస్తున్నాడా...? అనుకున్న అభిరాముడు-
      ‘‘ఎవరు స్వామీ తమరు? ఎక్కడివారు మీరు...’’ అని ప్రశ్నించాడు.
      ఆ వ్యక్తి దగ్గరగా వచ్చాడు. ఆ కళ్లు నవ్వాయి. ఆ పెదవులు కదిలాయి ఇలా...
      ‘‘ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి
      మూగచింతపల్లె మొదటి ఇల్లు
      వెర్రి వేమననగ వేదాంత వేత్తరా
      విశ్వదాభిరామా వినుర వేమ’’
      తాళలేని చలిని తీర్చే వెచ్చని మంటలా ఆ మాటలు తాకాయి అభిరాముడిని.
      ‘‘వేమనా!!’’ అంటూ అభిరాముడు వేసిన కేక ఆటవెలదుల తోటలో నేటికీ  ప్రతిధ్వనిస్తూనే ఉంది..!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోని


కొత్త పలక

కొత్త పలక

కుప్పిలి సుదర్శన్‌bal bharatam