వొంతు

  • 466 Views
  • 4Likes
  • Like
  • Article Share

    జిల్లేళ్ల బాలాజీ

  • తిరుపతి.
  • 9866628639
జిల్లేళ్ల బాలాజీ

నేడు కులవృత్తులకు అంతగా ఆదరణ ఉండదని పరమేశం నమ్మకం. పోటీ ప్రపంచంలో తన చదువుకు ఉద్యోగం రాక, వొంతుగా వచ్చిన కులవృత్తిని నమ్ముకుని ఊరెళ్లిన అతని కొడుకు చంద్రానికి ఎదురైన అనుభవాలేంటి...?
‘‘గుళ్లో వొంతు కోసరం
సెంద్రన్న మద్దిస్తం పెట్టబోతాడంట!’’ ఇంటి తాళువారంలో కూర్చుని ఎంటిక సవరం పేడుతున్న ఆదెమ్మతో అనింది నీల. 
      చివుక్కున తల పైకెత్తి నీల వంక జూసింది ఆదెమ్మ. మళ్లీ తలదించుకుని, తన ముందర పేర్చిన ఎంటిక పోగుల్లోంచి ఒకదాన్ని తీసుకుని, ఎడమచేతిలో సవరానికి జతచేసి తొడకు చుట్టుకుని ఉన్న (లారీ)టైరు మింద రాస్తూ పురిదిప్పింది.
      ‘‘నిజెం పిన్నమ్మా! మా ఇంటాయిన కట్టకాడికి (కళ్యాణకట్ట) పొయ్యింటే సెప్పినాడంట- ఆ సెంద్రన్న.’’
      ‘‘ఊర్నిండి ఎప్పుడొచ్చినాడంట?’’ మధ్యలోనే ప్రశ్నించింది ఆదెమ్మ.
      ‘‘నిన్ననే వొచ్చినాడంటలే! నేరుగా ‘రామ్మూర్తి’ మామకాడికి పోయి, తనకు సెందాల్సిన గుడివొంతును ఎట్టయినా ఇప్పించమని అడిగినాడంట. రామ్మూర్తి మామ, అది తనవొల్ల కాదనీ, కావాలంటే మనోళ్ల ముందు నరసిమ్ముల్నే గెట్టిగా అడిగి సూడమన్నాడంట. దాంతో అందరినీ రేపు నాగవేల్‌ సత్రంకాడికి రమ్మనినాడంట ఆ సెంద్రన్న.’’ 
      ‘‘ఆడొకడు శెనిపట్నోడు! తల్లో పురుగు మెదిలినప్పుడంతా ఈడికొచ్చి మమ్మల్ని సంపక తింటా ఉండాడు. ఆడికిప్పటికి నూరు తూర్లయినా సెప్పుంటాం, వొంతు మాదనీ, దాన్నిచ్చేది లేదనీ! అయినా సెవిలో పడినట్టులేదు. ఈసారి ఒకేతూరి మద్దిస్తం పెట్టేదానికి వొచ్చుండాడు!’’ అంది ఆదెమ్మ. 
      ‘‘అవును పిన్నమ్మా... ఆరుముగసామి గుళ్లో నాసరం (నాదస్వరం) కొలువు మీదే గదా! ఎన్నో సమచ్చరాల నుండి దాన్ని మీరేగదా కొలస్తా ఉండారు? అట్టాంటప్పుడు మద్దెలో ఆ సెంద్రన్న ఆటి కోసరం ఎందుకిట్టా మద్దిస్తానికొచ్చేది?’’ అమాయకంగా అడుగుతూ నేలమీద ఎంటికపోగు వరుసలో పెట్టింది నీల.
      ‘‘అంతా మా ఖర్మే! గొమ్మునుంటే ఊరా, పేరా? పరాయి సొత్తుమింద ఎవురికైనా ఆశే గదా?!’’
      ‘‘ఉంటే గూడా సొంత మీ బావకొడుకే మీ మింద మద్దిస్తం పెట్టాలనుకోడం ఏం బాగాలేదు పిన్నమ్మా?!’’
      ‘‘ఏం జేస్తామే? ఆ ఆదరువు మీదే గదా మేం బతకతా ఉండాం. అట్టాంటి దానిమీద రేపు సెంద్రన్న మద్దిస్తం పెడితే, ఈ తాగుబోతోడు ఏంజేస్తాడో, ఏమో?...’’ మొగుణ్ని ఆడిపోసుకుంటూ ఆలోచనల్లో పడింది ఆదెమ్మ.

* * *

      చాలా ఏళ్లుగా తిరుత్తణి ఆరుముగ స్వామి గుళ్లో నాదస్వరం కొలువును అంజిమిట్ట రామస్వామి ఇంటోళ్లే కొలుస్తూ వస్తున్నారు. రోజూ గుళ్లో ఉదయం ఆరుగంటలకు మొదలయ్యే పూజకు నాదస్వరం, డోలు, సండోలు (సన్నడోలు), తాళం, శృతి- ఈ అయిదు వాయిద్యాలనూ అయిదు కుటుంబాల నుంచి వచ్చిన మేళగాళ్లు క్రమం తప్పకుండా వాయిస్తూ... స్వామి పూజకు నిండుదనాన్నీ, మంగళకరాన్నీ అందిస్తూ వస్తున్నారు. 
      ఆ మేళగాళ్లను ఆస్థాన విద్వాంసులుగా దేవస్థానం ఇప్పటికే నియమించింది. ఏడాదికొక్కసారి మేళగాళ్లకు వాళ్లవాళ్ల వొంతుల ప్రకారం డబ్బులు ముట్టచెబుతోంది. ఆ ఫలితం మీద ఆధారపడి, అరవై ఏళ్ల వయసులోనూ  రామస్వామి ఆ గుడికొలువును ఎంతో నిష్ఠగా కొలుస్తున్నాడు. 
      రామస్వామికి తమ కులవృత్తిపట్ల అపారమైన గౌరవం. ‘ఏ జనమలో జేసుకున్నె పున్నెమో తానీ మంగలికులంలో పుట్నాడు, మంగళకరమైన నాసర వాద్యం వాయిస్తూ, గొప్పమేళగాడిగా పేరుదెచ్చుకున్నాడు. ఇది తనకు ఆ దేవుడిచ్చిన వొరం!’ అని గొప్పగా మురిసిపోయేవాడు రామస్వామి.
అట్టాంటి రామస్వామికి భార్య చనిపోయాక మిగిలింది కూతురు గౌరమ్మ మాత్రమే! కూతురిని ప్రభుత్వ గుమాస్తాగా పనిచేస్తున్న పరమేశానికిచ్చి పెళ్లి చేశాడు. వాళ్లకు పుట్టినోడే చంద్ర.
      మనుమడంటే రామస్వామికి వల్లమాలిన ప్రేమ! మనుమణ్ని తనలాగే నాదస్వర విద్వాంసుణ్ని చేయాలని కోరిక. తన తర్వాత గుళ్లో నాదస్వర కొలువును చూసుకుంటూ తనపేరు నిలబెట్టాలని ఆశ. సరైన వయసొచ్చాక పాఠాలు మొదలుపెట్టాలని ఎదురుచూస్తున్నాడు. కానీ వాడికి మూడో ఏడు జరుగుతుండగా, తల్లి హఠాత్తుగా మరణించింది. మనమడు తల్లిలేని బిడ్డగా ఎదుగుతుంటే రామస్వామి మనసు వికలమైపోయేది. పట్టుబట్టి అల్లుడు పరమేశానికి రెండోపెళ్లి చేశాడు. సవతితల్లి చంద్రను బాగా చూసుకునేది. కొన్నాళ్లకు బదిలీ కావడంతో పెళ్లాం బిడ్డల్ని తీసుకుని పట్నం వెళ్లిపోయాడు పరమేశం.
      సెలవుల్లో మనుమడు ఇంటికొస్తే నాదస్వరం మీద ఆసక్తి కలిగించాలని ప్రయత్నించేవాడు రామస్వామి. కానీ ఫలితం కనపడలేదు.
      పట్నంలోని సౌకర్యాలు, ఆదాయాలు పరమేశంలో మార్పును తీసుకొచ్చాయి. ‘వీణ్ని ఎలాగైనా ప్రయోజకుణ్ని చేయాలి. ప్రభుత్వోద్యోగంలో కుదురుకునేలా చూడాలి’ అనుకొని కొడుకును మంచి బళ్లో వేశాడు. 
      రామస్వామిని క్రమంగా వృద్ధాప్యం కుంగదీయసాగింది. ‘ఏంటో మునుపున్నంత ఓపిక ఇప్పుడు లేకుండా పోతోంది. గుళ్లో కొలువుకు మొన్నటిదాకా తనెంతో బాద్దితగా ఎళ్లేవాడు. కానీ ఇప్పుడు తెల్లార్తో నిద్ర లెయ్యాలంటేనే ఒళ్లు కనికరించటం లేదు. ఇప్పుడు తన దగ్గర మనవడుంటే ఎంత బాగుణ్ను! అటు కొలువునూ సూసుకునేవాడు. ఇటు తనకూ తోడుండేవాడు’, అని ఆలోచించి మనుమణ్ని పంపమని అల్లుడికి ఉత్తరం రాశాడు.
      కానీ పరమేశం కొడుకును పంపకుండా రామస్వామికి... ‘రానురాను మేళాలకూ, మేళగాళ్లకూ అంతగా గుర్తింపు ఉండదనీ, ఆదాయమూ అంతంతమాత్రంగానే ఉంటుందనీ... కనుక తన కొడుకును బాగా చదివించి మంచి ఉద్యోగస్థుణ్ని చెయ్యాలనుకుంటున్నాననీ, ప్రస్తుతం చంద్రం కూడా బాగానే చదువుకుంటున్నందున వాణ్ని పంపలేక పోతున్నానని’ ఉత్తరం రాశాడు. అలా కులవృత్తికీ, వొంతుకూ దూరమైపోయారు తండ్రీ కొడుకులిద్దరూ!

* * *

      ‘‘మామా... మామా... ఇంట్లో ఏంజేస్తా ఉండావ్‌?’’ అంటూ వచ్చాడు పరమేశం తమ్ముడు నరసింహులు.
      ‘‘రా నరసిమ్ములూ... కూసో!’’ అన్నాడు రామస్వామి. ‘‘ఏం మామా, ఒంట్లో బాగాలేదా, ఏందీ? ఎందుకట్టా దిగులుగా ఉండావ్‌?’’ అన్నాడు నరసింహులు.
      ‘‘ఏం లేదు. బాగానే ఉండాగా’’, అన్నాడు మనసులోని బాధను బయటపడనీయకుండా. 
      ‘‘లేదు మామా. నాకాడ ఏందో దాస్తా ఉండావ్‌? నీ కష్టమేందో నాకు సెప్పరాదూ’’
      ‘‘ఈ కడాకాలంలో గుడికొలువును సక్రంగా సెయ్యలేకపోతున్నాననే బాధేగానీ, ఇంక ఏరే కష్టం ఏముంటుందంటావ్‌ నాకు?’’ అన్నాడు రామస్వామి.
      ‘‘ఓస్, అంతేగదా! నేను లేనా, సాయం జెయ్యనా? నా కొడుకుని గుడికి అంపించి, నీ కొలువును కొలవమంటాను. ఆడు ఏ ఇబ్బందీ రాకుండా జూసుకుంటాడు, సరేనా!’’ అని రామస్వామికి భరోసా ఇచ్చాడు నరసింహులు. ఆ మరునాటి నుంచే గుడికొలువును కొలిచేటందుకు నరసింహులు కొడుకు సుబ్రహ్మణ్యం పూనుకున్నాడు. రోజూ గుళ్లో ఇచ్చే సాదం (అన్నం) లేదా బియ్యం తెచ్చి రామస్వామికి ఇవ్వటమేకాక, దేవస్థానమిచ్చే ఫలితాన్ని కూడా తెచ్చివ్వసాగాడు. దాంతో నిశ్చింతపడ్డాడు రామస్వామి.
      కొడుకు కొలువును బాధ్యతగా కొలుస్తూ ఉంటే, నరసింహులు ఫలితంలో కొంత తాను తీసుకునేవాడు. క్రమంగా అర్ధభాగం తీసుకునేంతవరకూ వచ్చింది వ్యవహారం.
      ‘తన మనవడు పెద్దవాడై ఈ గుడికొలువును స్వీకరించేంత వరకూ... అది నరసింహులు చేతిలోనే ఉండనీలే’ అని ఉదాసీనంగా ఉండిపోయాడు రామస్వామి. కానీ రామస్వామికి చేదోడువాదోడుగా ఉంటున్నట్టు మసలుతూ... గుడి కొలువునూ, ఫలితాన్నీ తనే పూర్తిగా దక్కించుకున్నాడు నరసింహులు. 
      ఉన్నట్టుండి ఒకరోజు రామస్వామి గుండెపోటుతో మరణించాడు. చావుకొచ్చిన పరమేశం, కొడుకుచేత మామకు తలకొరివి పెట్టించాడు కానీ, తనకు ఆయన వొంతు కావాలని గానీ, దాని ఫలం కావాలని కానీ నోరెత్తి అడగలేదు. కార్యాలయ్యాక తన కుటుంబంతో పట్నానికి వెళ్లిపోయాడు. అలా వొంతు నరసింహులు వశమైపోయింది!

* * *

      పట్నంలో డిగ్రీ పూర్తి చేశాడు చంద్ర.  పోటీ పరీక్షలు రాస్తున్నా ఉద్యోగం మాత్రం రావడం లేదు. తండ్రి పరమేశం ఉద్యోగ విరమణ పొందాడు. కొడుక్కు ఉద్యోగం రాలేదన్న దిగులు పరమేశాన్ని బాధిస్తోంది. అటు కులవృత్తికి దూరమై, ఇటు ప్రభుత్వోద్యోగమూ రాక మరింత కుంగిపోసాగాడు చంద్ర. కొడుక్కి పెళ్లిచేస్తే పరిస్థితి చక్కబడుతుందని ప్రయత్నాలు మొదలుపెట్టాడు పరమేశం. కానీ తనకసలు పెళ్లే వద్దన్నాడు చంద్ర.
      ఏ రకంగానూ కొడుకు భవిష్యత్తు బాగుపడదేమోనన్న బెంగ రోజురోజుకూ ఎక్కువకాసాగింది పరమేశానికి. ఆ బాధతోనే ఉన్నట్టుండి పరమేశం మరణించటంతో చంద్ర, అతని తల్లి ఒంటరివాళ్లయ్యారు. నిర్లిప్తంగా బతుకును వెళ్లదీస్తున్న చంద్రకు తల్లి పట్టుబట్టి పెళ్లి చేసింది. ఏదో ఉద్యోగం చేస్తూ బొటాబొటి జీతంతో ఎలాగో కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు చంద్ర. 
      ఒకరోజు- ‘‘ఏమండీ, ఇట్టా ఎంత కాలమని బతకడం? మీ ఊరెళ్లిపోయి మీ తాత కొలువు ఉంది గదా, దాన్ని జేసుకుంటా, దానిమీదొచ్చే ఆదాయంతో పాటు ఇంకో దారెతుక్కుని అక్కడే ఉండిపోదామా?’’ అంది లత.
      ‘‘బాగానే ఉంది కానీ, ఒక్కవిషయం మర్చిపోతున్నావ్‌ లతా! నాకు నాదస్వరం రాదు. క్షవరం చేయడం అంతకన్నా రాదు. కులవృత్తికి దూరమై నేను చాలా తప్పు చేశాను. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను’’ అన్నాడు నీరసంగా.
      ‘‘బాధ పడమాకండి. మీకు నాసరం వాయించడం రాకపోయినా ఆ గుడికొలువు మీ సొంతమేగదా? దాని మీదొచ్చే ఆదాయం కూడా మీకేగదా సెందాల! ముందు ఆ విసయం తేల్చుకురండి. కొలువు మనదైతే మీరు ఇంకెవురినైనా నాసరగాణ్ని పెట్టుకొని కొలుసుకోవచ్చు. వచ్చే దాంట్లో కొంత ఆ నాసరగాడికిచ్చి మిగతాది మనం తీసుకోవచ్చు! కాబట్టి ముందు ఆ గుడి కొలువూ... ఫలం మీ సిన్నాయన్నుండి మీరు తీసుకోండి’’ స్థిరంగా అంది లత. భార్య సలహా మేరకు ఇప్పటికి చంద్ర ఎన్నోసార్లు తన చిన్నాన్నను అడిగి చూశాడు. వెళ్లిన ప్రతిసారీ తాను ఆ కొలువును అతనికి ఇవ్వనని చెబుతూ వస్తున్నాడు నరసింహులు.

* * *

      నాగవేల్‌ సత్రం దగ్గర చంద్ర బంధువులంతా చేరారు. రామ్మూర్తి లేచి నిలబడి ‘‘నిన్న సెంద్ర నాకాడికొచ్చి తమ తాత కొలువును తనకు ఇప్పించమని కోరినాడు. అది నా సేతిలో పనిగాదనీ, అందరిముందూ నరసింహులు అన్నను అడిగి సూడమన్నాను. అందుకే నేయం కోసం మిమ్మల్నంతా ఈడికి పిలిపించినాడు సెంద్ర...’’ అంటూండగానే...
      ‘‘మరి ఇంతకాలం ఏమైనాడంట ఈ మనవడు? ఏనాడైనా గుడికాడికొచ్చిన పాపాన పొయ్యుండాడా?’’ రామ్మూర్తి మాటలకు అడ్డంపడతా అన్నాడు నరసింహులు బామ్మర్ది. 
      ‘‘సూళ్లేదనుకో! కానీ నాయపరంగా రామస్వామి వొంతు మనవడైన సెంద్రకే గదా సెందాల?’’ అన్నాడు రామ్మూర్తి.
      ‘‘అవును, అది నిజిమే! కానీ రామస్వామి సివరిరోజుల్లో కొలువును కాపాడకొచ్చింది నరసింహులన్నే గదా? మరిప్పుడు మద్దెలో ఈ సెంద్ర వొచ్చి, అది నాకు గావాలంటే ఎవురిస్తారు? అదేం నాయం?’’ అన్నాడు నరసింహులుకు వొత్తాసుగా వచ్చిన ఇంకో మనిషి.
      ‘‘నిజిమేననుకో! కానీ సెంద్ర ఇంటి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందంట! పెద్ద సదువైతే సదువుకున్నాడు గానీ మంచి ఉద్యోగమేదీ రాలే. తనకింక వేరే మార్గం లేదంటున్నాడు. ఏంజేస్తాడు పాపం? అందుకే తనకు దక్కాల్సిన వొంతును తనకివ్వమని అడగతా ఉండాడు.’’
      ‘‘ఇక్కడ మా పరిస్థితి మాత్రం ఏం ఎలిగిపోతా ఉండాదనీ? ఈడా అంతేగదా. ఈ వొంతే గదా మాకూ ఆదరువు. నలుగురు బిడ్డల్ని పెట్టుకుని మేమెంత కష్టపడుతున్నామో నీకు తెలీనిదేం గాదు. ఇంగా సెప్పాలంటే వాడు సదువుకున్నోడు... రేపోమాపో ఏదో ఒగమంచి ఉజ్జోగం రాకపోదు. మరి ఏ సదువూ లేని నేను, దీన్ని వొదులుకుంటే ఇంకేం సూసుకుని బతకాల. కుటుంబాన్ని ఎట్టా పోసించాల?’’ గట్టిగా అన్నాడు నరసింహులు.
      ‘‘పోనీ, ఒగనెల నువ్వు కొలువ్, ఇంగో నెల సెంద్ర కొలస్తాడు’’ అన్నాడు రామ్మూర్తి.
      ‘‘అదంతా కుదర్దు. ఇంతకాలంగా దానిమిందే మేం బతికినాం. ఉన్నపళంగా దాన్ని వొదులుకోమంటే ఎట్టా? దాన్ని వొదులుకునేదీ లేదు. ఇంగ దానిగురించి మాటలనవసరం’’, కరాఖండిగా తేల్చి చెప్పేసినాడు నరసింహులు.
      ఇంతలో అక్కడికి ఆయాసపడుతూ పరుగెత్తుకొచ్చాడు నరసింహులు రెండో కొడుకు ఉమాపతి. ‘‘నాయినా... అమ్మ, సెల్లెండ్లతో సహా పెద్దబాయిలోకి దూకేసిందంట. మన ఆడోళ్లందురూ ఆడికి పరిగెత్తుండారు. పద నాయినా బిరిన్నా’’ అంటూ అదిరిపడే విషయాన్ని చెప్పాడు. అంతే! ఆ మాటలకు అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా లేచి పెద్దబావి దగ్గరికి పరుగు పెట్టారు. వాళ్లను అనుసరించాడు చంద్ర.
      గుండ్లోల్ల పెద్దబావి పక్కనున్న మర్రిమాను కింద ఆదెమ్మా, ఆమె కూతుళ్లిద్దరూ కూర్చుని ఉన్నారు. వాళ్లను ఎవరో కాపాడినట్టున్నారు. వాళ్ల శరీరమంతా తడిసిపోయి బట్టలు ఒంటికి అతుక్కుపోయి ఉన్నాయి. వీస్తున్న గాలికి గడగడ వణుకుతున్నారు. ఆదెమ్మ ‘పడవేటి అమ్మోరి’లా కదలకమెదలక కూర్చోనుంది.
      ‘‘ఏందిమ్మే ఇది? ఎందుకు సేస్తివి ఇట్టాంటి పనికిమాలిన పని?’’ అని మొగుడు అడిగేసరికి భద్రకాళిలా విరుచుకుపడింది. ‘‘మమ్మల్నేల బతకనిస్తిరి? మమ్మల్ని సావనియ్యండి. మాకు బతకాలని లేదు.’’ అంటూ పిచ్చిపట్టినట్టుగా అరిచింది ఆదెమ్మ.
      ‘‘పోయే లంజిముండా.. ఇట్టా సచ్చే దానికా ఇంతకాలమూ మనం బతికింది?’’ ఆవేశంగా అన్నాడు నరసింహులు.
      ‘‘ఇంగా ఏముండాది బతికేటందుకు? దేన్ని నమ్ముకుని బతకమంటావయ్యా..? ఉండేది ఊడ్సకపోయె...’’ అంటూ కూతుళ్లను మళ్లీ లేపి నిలబెట్టి బావిలోకి దూకేందుకు పెనుగులాడింది ఆదెమ్మ. దాంతో ఆడకూతుళ్లిద్దరూ బిక్క మొహాలేసుకుని ఏడవడం మొదలుపెట్టారు.
      ‘‘ఏందే నువ్వుజేసే పని? ఇట్టాంటి పని జేసి ఏం సాదిద్దామని?’’ అంది వయసులో పెద్దదైన తాయమ్మ.
      ‘‘అత్తా, ఇంగ మమ్మల్నేం జెయ్యమంటావో నువ్వే జెప్పు? నా మొగుడేమో తాగుబోతు. పిలకాయలేమో ఇంగా ఉపయోగం లేకుండా ఉండారు. ఈ ఇద్దురు ఆడకూతుళ్లను పెట్టుకుని నన్నెట్టా బతకమంటావో నువ్వన్నా చెప్పత్తా’’, తాయమ్మను నిలదీసింది ఆదెమ్మ. 
      అక్కడి తతంగమంతా చూశాక విషయం అర్థమైంది చంద్రకు. మౌనంగా వెనుతిరిగాడు.

* * *

      నీరసంగా ఇంట్లోకి అడుగుపెడుతున్న భర్త వాలకంచూసి వెళ్లిన పనేమై ఉంటుందో గ్రహించింది చంద్ర భార్య లత. అయినా ఆపుకోలేక, ‘‘పోయిన పనేమైందీ?’’ అని అడిగింది. మౌనంగా ఉన్నాడు చంద్ర. ‘‘మీ సిన్నాయన ఏమన్నాడు?’’ మళ్లీ అడిగింది.
      ‘‘ఏమంటాడు, వొంతును వొదులుకోనని కరాఖండీగా చెప్పేసినాడు.’’
      ‘‘మీ పిన్నమ్మ ఏమనింది?’’
      ‘‘ఏమంటుంది? కొలువు వొదులుకుంటే తనకు చావే గతి అని బావిలో దూకేసింది.’’
      ‘‘అయ్యో... మళ్లా...’’ ఏమైందో ఏమోనని ఆత్రుతగా అడిగింది లత.
      ‘‘ఒక్కతే కాదు, కూతుళ్లను కూడా వెంటబెట్టుకుని వెళ్లి బావిలోకి దూకేసింది.’’
      ‘‘అయ్యో వాళ్లకేం కాలేదు గదా?’’...
      ‘‘లేదు’’ అన్నాడు చంద్ర.
      ‘‘వొంతు కోసరం ఇంత అగాయిత్యానికి పూనుకునిందా మీ పిన్ని.. మీరు తొలినుంచీ ఈ విషయంలో నోరు మెదపకపోవడమే దీనికంతటికీ కారణం?’’ అని తేల్చేసింది.
      చంద్ర ‘‘ఆ...’’ అంటూ నిట్టూర్చి ‘‘మా నాయనకేమో ఈ కులవృత్తుల మీద అంతగా పట్టింపు లేకపోయింది. నన్ను బాగా చదివించి ఒక ఉద్యోగస్థుణ్ని చెయ్యాలని ఆశపడ్డాడు. కానీ ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో తెలిసొచ్చేసరికి చెయ్యి దాటిపోయింది. తొలినుంచే ఆ వొంతును దక్కించుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వొచ్చేది కాదు. ఇంక ఆ కొలువు విషయం మనం మర్చిపోవటమే మంచిది.  చెయ్యిదాటిపోయిన దానిగురించి ఏం మాట్లాడి ప్రయోజనం? ఇంక మన చదువే మనల్ని కాపాడాలి. మన తెలివే మనల్ని పైకి తేవాలి. ఈ రోజుతో ఆ వొంతుని గురించీ మనం శాశ్వితంగా మర్చిపోవాలి’’, అంటూ బయటికెళ్లిపోయాడు చంద్ర.

* * *

      మూడేళ్ల తర్వాత... ఒకరోజు ఏదో పనిమీద పట్నానికొచ్చిన బంధువుకు బజార్లో ఎదురుపడ్డాడు చంద్ర. ‘‘ఏం సెంద్రా, ఏదో అప్పుడప్పుడు కలుసుకోవటమే గానీ, మా ఊరికి నువ్వు బాగా దూరమైపోయినావ్‌. మమ్మల్నంతా మర్సిపోయినావ్‌’’, అంటూ నిష్ఠురమాడాడు ఆ బంధువు.
      ‘‘అదేం లేదు. బంధువుల్ని మరిచిపోతారా ఎవరైనా? తీరికలేని ప్రైవేట్‌ జీవితాలు మావి. ఇక ప్రయాణాలెట్లా కుదురుతాయి? అదలా ఉంచు. ఊళ్లో అందరూ బాగుండారా?’’ అడిగాడు చంద్ర.
      ‘‘అంతా బాగుండారు.’’
      ‘‘మా సిన్నాయనా వాళ్లు ఎట్టుండారు?’’
      ‘‘ఆయనకేం మారాజులా ఉండాడు. తాగేదానికి కొడుకు లేదనకుండా దుడ్డిస్తా ఉంటే, ఇంగేం గావాల? మీ పిన్నికే ఒంట్లో బాగున్నట్టు లేదు. థైరాయిడ్‌తో బాధపడతా ఒళ్లు సగమైంది. గొంతుకాడ వాసిపోయి మింగలేక కక్కలేక నొప్పిని భరిస్తా ఉండాది.’’ అని నిట్టూర్చాడు ఆ బంధువు.
      మౌనంగా వింటూ ఉండిపోయాడు చంద్ర. మరుసటి రోజు స్కూలుకు సెలవుపెట్టి, చిన్నాన్న ఇంటికి వెళ్లాడు చంద్ర. కూర్చోమని చాపను పరిచింది ఆదెమ్మ. ‘‘నీ పరిస్థితి ఇలా ఉంటే నాకెందుకు ఒక్కమాట కూడా చెప్పలేదు పిన్నీ.’’ అన్నాడు. ‘ఏ ముఖం పెట్టుకుని తన పరిస్థితిని అతనికి తెలియజేస్త’ అనుకుంది ఆదెమ్మ. అందుకే మౌనంగా తలదించుకుని ఉండిపోయింది.
      ‘‘పిన్నీ బయల్దేరు. తిరుపతిలో రుయా ఆసుపత్రిలోగానీ, స్విమ్స్‌లోగానీ చూపిస్తా. అక్కడిప్పుడు మంచిమంచి డాక్టర్లుండారు.  నువ్విప్పుడే నాతో బయల్దేరి రా’’, అన్నాడు చంద్ర ఆదెమ్మను తొందరపెడుతూ.
      ‘‘నాయినా, నీకెందుకు నా కష్టం? ఆ దేవుడెట్టా రాసుంటే అట్టా జరగనీ’’, అతి కష్టమ్మీద నోరు తెరిచి అంది ఆదెమ్మ.
      ‘‘అదేం పిన్నీ అలా అంటావ్‌? అమ్మ తరువాత అమ్మ అంతటిదానివి. నీకు ఒంట్లో బాగలేదని తెలిసినాక కూడా, చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఈ సమయంలోనే గదా నేను నీకు తోడుగా ఉండాల్సింది. నీకిలా ఉందని తెలిసీ నేను చూసీచూడనట్టు పోతే ఇక నాకూ గొడ్డుకూ ఏం తేడా ఉంటుంది పిన్నీ.’’
      ఆ మాటలతో ఆదెమ్మ కండ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నిజానికి సెంద్ర బతుకును బుగ్గిజేసింది తాను కాదూ? సదువుకుని ఉద్యోగం దొరక్క, ఏం జెయ్యాల్నో తెలీక, కొలువు కోసరం ఆనాడు మద్దిస్తం పెడితే, ఎక్కడ అది సెయ్యిదాటి పోతుందోనన్న భయంతో, తానాడిన ‘సావు నాటకం’ గుర్తొచ్చి ఆదెమ్మ కళ్లనుంచి జలజలా కన్నీళ్లు ఉబికి నేల మీదికి జారాయి.
      ‘‘అయ్యో, ఏందిది పిన్నీ, నువ్వేం భయపడమాక. నీకేం కాదు. నేనుండాను కదా? రుయా ఆసుపత్రిలో చూపిస్తే నీ ఆరోగ్యం బాగైపోతుంది’’, అంటూ ధైర్యాన్నిస్తున్న చంద్రను నీళ్లు నిండిన కళ్లతో చూస్తూ ఉండిపోయింది ఆదెమ్మ.

* * *

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోని


కొత్త పలక

కొత్త పలక

కుప్పిలి సుదర్శన్‌bal bharatam