గుప్పెట్లో స్వర్గం

  • 379 Views
  • 209Likes
  • Like
  • Article Share

    ప్రియదర్శిని చాగంటి

  • పుణె.
  • 9372413078
ప్రియదర్శిని చాగంటి

తాతయ్య పిలుపుతో ఉద్యోగానికి సెలవిచ్చి సొంత ఊరొచ్చాడు శేఖర్‌.. ఆ ప్రశాంతతలో... సంపాదనకీ తృప్తికీ సంబంధం లేదనీ, ప్రేమించే తోడుంటే స్వర్గం గుప్పెట్లోకొస్తుందనీ తెలుసుకున్నాడా?
మా నాన్న
తహశీల్దారుగా వేరే ఊళ్లో పని చేస్తున్నారు. నేను గత కొన్ని సంవత్సరాలుగా మహానగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నాను. ముప్ఫై ఏళ్లు దగ్గర పడుతున్నా బ్రహ్మచారినే. అసలు పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదు నాకు. పగలూ రాత్రీ తేడా లేకుండా పని. అర్ధరాత్రి దాకా పరదేశం పనులు కంప్యూటర్‌ మీద చేస్తూనే ఉండాలి. చాలాసార్లు తెల్లారి మూడు గంటలకి కూడా పని చేస్తూనే ఉంటాను. చాలీచాలని నిద్రతో నీరసంగా లేచి, గబగబా తెమిలి తొమ్మిది గంటలకల్లా ఆఫీసుకి వెళ్లాల్సి వస్తుంది. ఏ రోజూ రాత్రి ఎనిమిది గంటల లోపల ఇంటికి రావడం కుదరదు. ఉదయపు ఉషఃకాంతులుగానీ, సంధ్యాకాలం పిల్లగాలులు కానీ అనుభవించే అదృష్టం లేదు నాకు. తెల్లవారితే ఉద్యోగ విషయాల ఆలోచన, రాత్రి ఇల్లు చేరితే పరదేశాలతో ఉద్యోగ సంబంధాల తలబరువూ తప్ప వేటికీ సేపు లేదు. నాలుగేళ్లక్రితం చిన్న ఫ్లాటు కొనుక్కున్నాను. అది అమ్మి పెద్దది కొనాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యనే నా చిన్నకారు అమ్మి పెద్దది కొన్నా. బాధ్యతలేమీ లేవు. అక్క పెళ్లి అయిపోయింది. నాన్నగారు ఇంకా ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల, జీతం రాగానే వారికి కొంత పంపాలన్న ఆలోచనే రాదు నాకు. నా జీతం నాకిష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు! అలా అని ఖర్చు మనిషిని మాత్రం కాను.
      ఎంత సంపాదించినా ఏదో వెలితి! సమయానుకూలంగా మారే కోరికలు. అందుకే పెళ్లంటే ఇష్టపడటం లేదు నేను.
      ‘‘పెళ్లి చేసుకోవటానికీ, పిల్లలు కనడానికి ఒక వయసంటూ ఉంటుంది, వయసుతో ప్రమేయం లేకుండా తక్కినవన్నీ ఎప్పుడో అప్పుడు అమరుతాయి. అయినా నారు పోసిన వాడు నీరు పోస్తాడో లేదో’’ అని నిట్టూరుస్తుంది అమ్మ.
      ‘‘నారూ నీరూ కూడా నేనే పోయాలి మరి, అందుకే పెళ్లి వద్దంటున్నాను’’ అని పెళ్లి ప్రసక్తి తోసిపుచ్చాను.
      పోయిన ఆదివారం మా తాతయ్య నుంచి ఫోన్‌. ‘‘శేఖర్‌! నిన్ను చూడాలని ఉందిరా నాన్నా. నువ్వొచ్చి సంవత్సరం అయింది. ఓ వారం సెలవు పెట్టి మన ఊరికి రారా.. నీకూ కాస్త విశ్రాంతీ, ప్రశాంతతా..’’ అన్నారు తాతయ్య.
      ‘‘పని చాలా ఉంది. సెలవు దొరుకుతుందో లేదో, అయినా ప్రయత్నిస్తా’’ అన్నా మాట కాదనలేక.
      నాకు చిన్నప్పటి నుంచి తాతయ్య అంటే అభిమానం. తాతయ్యతో క్రికెట్‌ ఆడటం, డాబా మీద గాలిపటాలు ఎగరేయటం, ఆయన చెప్పే కథలు వింటూ పడుకోవడం ఇప్పటికీ నాకు తాజా జ్ఞాపకాలే. 
      ఇప్పుడు తాతయ్యకి 80 ఏళ్లు పైబడ్డాయి. తన పనులు తను చేసుకోవడం కష్టమవుతోంది. చేతికర్ర లేకుండా నడవలేరు. కంటికి చెయ్యి ఓరగా పెట్టుకుంటేగానీ చూపానదు. ఈ మధ్య నాన్న బలవంతం మీద పళ్లు కట్టించుకున్నారు. పగటిపూట కూర్చున్న పడక కుర్చీ మీదే సుఖంగా నిద్రపోతారు. రాత్రిపూట నిద్రరాక పక్క మీద అటూఇటూ కదులుతూ ఉంటారు.
      బామ్మ ఉన్నప్పుడు ఇద్దర్నీ చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉండేది. వసారాలో కాఫీ తాగినా, టేబుల్‌ దగ్గర భోజనం చేసినా ఇద్దరూ కలిసే చెయ్యాలి. సాయంత్రం అయ్యేసరికి, జరీచీర కట్టుకుని కొప్పులో పూలు పెట్టుకొని, ముస్తాబయ్యేది బామ్మ. తాతయ్య కూడా జరీ అంచు పంచె కట్టుకుని తెమిలేవారు. ఇద్దరూ కలిసి గుడికో, చుట్టాల ఇంటికో వెళ్లి వచ్చేవారు. భోజనాలయ్యాక, నిద్రొచ్చే వరకూ డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. వాళ్లకి వాళ్లిద్దరూ తప్ప మరో మనిషి అక్కర్లేదు. ఇల్లే వాళ్ల స్వర్గం.
      కానీ బామ్మ ఏడాదిక్రితం పోయింది. దాంతో తాతయ్య ఒంటరి అయిపోయారు.
      ‘మా దగ్గరికి వచ్చి ఉండండి’ అని అమ్మా నాన్నా చాలా బతిమిలాడారు. ‘‘సీతని ఇక్కడ వదిలి నేను ఎక్కడికీ రాను’’ కచ్చితంగా అన్నారు తాతయ్య. ఆ మాటకి మేమందరం కన్నీళ్ల్ల పర్యంతం అయ్యాం.
      ఆయనకి బామ్మ తన చుట్టుపక్కల ఉన్నట్లే అనిపిస్తుంది. ఆయన మనసుని కష్టపెట్టదలచుకోక, ఊళ్లోనే ఉండటానికి ఒప్పుకున్నాం. ఎవరికి వీలైతే వాళ్లు ఊరెళ్లి చూసి వస్తున్నారు తాతయ్యని. 
      తాతయ్య ఫోన్‌ తర్వాత నాకూ ఊరి మీదకు గాలి మళ్లింది.
      ఆ రోజు ఆఫీసులో ఓ వారం సెలవు కావాలని అడిగాను.
      ‘‘అర్జంటు పనులున్నాయి కదా, ఇప్పుడు సెలవుపెడితే ఎలా’’ అన్నాడు మేనేజరు.
      ‘‘ఇంటి నుంచి పని చేస్తాను సార్‌’’... నా గొంతు ప్రాధేయపడింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో ఇదో సౌలభ్యం.
      ‘‘సరే అయితే, సెలవులో ఉన్నాను కదా అని పని అశ్రద్ధ చేయకు’’ అని హెచ్చరించారాయన.
      ‘‘సెలవులో పనేమిటి? పని చేస్తూంటే సెలవు కాదుగా మరి!’’ అనుకున్నా మనసులో, పైకి ‘‘సరే సార్‌’’ అన్నా.
      ఆ రోజు ఇంటికి వెళ్తూ తాతయ్యకి, ఇంట్లో పనివాళ్లకీ బహుమతులు కొన్నాను. ఇంటికెళ్లి భోజనం చేసి, సామాన్లు సర్దుకుని ఊరికి వెళ్లడానికి నా కారులో బయల్దేరాను.
      తెల్లారి ఉదయం ఆరింటికి ఊరి పొలిమేర చేరాను. నా ముందు ఓ పాత టెంపో వెళ్తోంది. దాని డ్రైవరు గట్టిగా జనపదాలు పాడుతూ, తీరిగ్గా నడుపుతున్నాడు. నేను ఎంత హారన్‌ కొట్టినా వెళ్లటానికి సందివ్వలేదు. ఓ అరగంట ప్రయాసపడితేగానీ, ఆ టెంపోని దాటలేకపోయా. ఇరుకు సందులూ, మురికి కాలువల మధ్యలో కారు నడపటానికి స్థలమే లేదు. టెంపో ముందర కారాపా. ‘‘ఏం హారన్‌ వినపడటం లేదా? చెవుడా?’’ అన్నా కోపంగా.
      ‘‘బానే వినపడింది, అయినా ప్రాణం కంటే వేగం ముఖ్యం కాదుగదా’’ డ్రైవరు చిన్నగా నవ్వుతూ అన్నాడు. అతనితో వాదించి లాభం లేదని, కారు వేగం పెంచా. 
      ‘మహానగరంలో అయితే రకరకాల వాహనాలు, మనుషులు, పశువులు, ఒకరినొకరు పట్టించుకోకుండా, సందు దొరికించుకు మరీ దూసుకుపోతూ ఉంటారు. వేగం ప్రధానం. అందుకే తరచూ ప్రమాదాలు జరుగుతాయి మరి’, ఏంటిలా ఆలోచిస్తున్నాను.. ‘టెంపోవాడి మాటలు నాకు బాగా ఎక్కినట్లున్నాయి!’... నవ్వుకున్నా. 
      ఇల్లు చేరేప్పటికి ఏడయ్యింది.
      ఇదివరకులా తాతయ్య వసారాలో కాఫీ తాగుతూ కనిపించలేదు. బామ్మ లేనిలోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. గేటు తీసిన చప్పుడుకి ‘ఎవరక్కడ?’ అంటూ పరుగున వచ్చాడు వెంకన్న.
      ‘‘శేఖర్‌బాబా! ఎన్నాళ్లకి! బాగా చిక్కిపోయారు బాబూ! ఉండండి, అయ్యగారిని లేపుతాను’’ అని హడావుడిగా వెళ్లబోయాడు.
      ‘‘తాతయ్య ఇంకా లేవలేదా?’’ అడిగాను ఆశ్చర్యంగా.
      ‘‘అమ్మగారు పోయాక ఆయన ఆరు గంటలకి లేవటం, కాఫీ తాగడం మానేశారు బాబూ’’ అన్నాడు వెంకన్న బాధగా.
      ‘‘నేను తాతయ్యను లేపుతా, నీ పని చూసుకో’’ అని తాతయ్య గదిలోకి వెళ్లా.
      ‘తాతయ్యా!’ అంటూ ఆయన భుజం తట్టా, కళ్లు తెరిచినా గది చీకటిగా ఉండటంతో, ఆయనకి చూపానలేదు. లైటు వేశా. కంటికి చెయ్యి వోరగా పెట్టుకుని, ‘ఎవరూ?’ అని పరిశీలనగా చూసి ‘‘వచ్చావట్రా కన్నా! ఎన్ని రోజులయిందిరా నిన్ను చూసి!’’ అని నన్ను దగ్గరికి తీసుకున్నారు తాతయ్య.       మా ఇద్దరి కళ్లూ మసకబారాయి!
      ‘‘మీరు రమ్మంటే, రాకుండా ఉండగలనా తాతయ్యా’’ అన్నా ఆప్యాయంగా.
      అంతలో వెంకన్న వచ్చి, చెయ్యి అందించి తాతయ్యని లేపి పక్కనున్న కుర్చీలో కూర్చోబెట్టాడు.
      ‘‘సామాన్లు నీ గదిలో పెట్టుకుని మొహం కడుక్కునిరా నాన్నా! నేను కూడా తెములుతాను’’ అన్నారు తాతయ్య.
      ఓ పావుగంటలో ఇద్దరం వసారాలోకి వచ్చి కూర్చున్నాం.
      ‘‘బాగున్నారా బాబూ’’ పలకరిస్తూ గౌరమ్మ గారు కాఫీ అందించారు ఇద్దరికీ.
      ‘‘సీత వెళ్లిపోయాక వసారాలో కూర్చుని కాఫీ తాగడం మానేశాను’’ దిగులుగా అన్నారు తాతయ్య.
      ‘‘ఇవాళ మనిద్దరం కాఫీ తాగుదాం తీసుకోండి తాతయ్యా’’ అన్నాను మాట మారుస్తూ, ఇద్దరం నిశ్శబ్దంగా కాఫీ ముగించాం.
      ‘‘కాసేపు అలా బయటికి వెళ్లొస్తా, నువ్వు విశ్రాంతి తీసుకో’’ అని చేతికర్ర తీసుకుని, మరో చేత్తో వెంకన్న చెయ్యి పట్టుకుని తోటవైపు వెళ్లారు తాతయ్య.
      ఏదో బాధ. తెలియని వెలితి. చుట్టూ బామ్మ జ్ఞాపకాలే!
      ఓ గంట నడుం వాల్చా. ఈ లోగా వెంకన్న తువ్వాలు, సబ్బు, పెద్ద బక్కెట్టు నిండా వేడి నీళ్లు బాత్రూమ్‌లో పెట్టాడు. స్నానం ముగించి వచ్చే సరికి తాతయ్య డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని పేపర్‌ చదువుతున్నారు. నన్ను చూసి ‘‘గౌరమ్మా టిఫిన్‌ పట్టుకురా చిన్నబాబుకి’’ అన్నారు. ఆవిడ ఎన్నో ఏళ్ల నుంచీ మా వంటమనిషి. రోజూ వేళ తప్పకుండా మాకు వండి పెట్టడం ఆవిడకి ఇష్టం. టిఫిన్‌ చేశాక నేను తెచ్చిన బహుమతులు అందరికీ ఇచ్చా. అంతలో మొబైల్‌ మోగింది. ‘ఆఫీసు నుంచేమో.. మాట్లాడొస్తా’ అని నా గదిలోకి గబగబా వెళ్లి లాప్‌టాప్‌కి డేటాకార్డు పెట్టి, అంతర్జాలం కనెక్ట్‌ చేశా. అది సిద్ధం అవుతోండగా కిటికీలోంచి బయటికి చూస్తున్నా.
      వెంకన్న పెద్దకొడుకు రాము జాజిపూలు కోస్తున్నాడు. ‘ఇష్, ఇష్‌’ అని గోడ అవతల ఉన్న పనమ్మాయి జయని పిల్చాడు. ‘ఏంటి?’ అంది జయ. ‘నీ కోసం!’ అంటూ దోసిలి నిండా పూలు చూపించాడు.
      ‘‘అయ్యగారు చూస్తే బాగోదు?’’ మురిపెంగా మందలించింది జయ.
      ‘‘అందుకేగా, ఆయన చూడకుండా ఇస్తున్నా, తీసుకో’’ అని నవ్వుతూ జయ కొంగులో వేశాడు రాము.
      ‘‘పొద్దున్నే నీ నవ్వు మొహం చూస్తే హుషారుగా ఎంత పనయినా చేసేస్తా’’ అన్నాడు రాము, ఆమెను ప్రేమగా చూస్తూ. జయ సిగ్గు పడింది. నేను నవ్వుకున్నా.
      ‘ఇంత చిన్న విషయం... ఎంత సంతోషం కలిగించింది ఇద్దరికీ. ఇలాంటి సంతోషం నాకెప్పుడైనా కలిగిందా?’ ఆలోచనల్లో పడ్డా. మొబైల్‌ మోగడంతో ఊహాలోకం నుంచి బయటకు వచ్చా.
      ఆఫీసు పని అయ్యేటప్పటికి పన్నెండు దాటింది. హాల్లో చూస్తే వాలు కుర్చీలో తాతయ్య నిద్రపోతున్నారు. నిశ్శబ్దంగా వెళ్లి, వసారాలో ఫ్రేమ్‌ కుర్చీలో కూర్చున్నాను. పేపరు చదువుతుంటే ‘‘అయ్యగారూ..’’ అన్న పిలుపు. పేపరు తప్పించి చూశా. 
      ‘‘మీరు వచ్చారని గౌరమ్మ చెప్పింది’’ అంటూ పెరుగు ముంత ఇచ్చాడు పాలేరు రంగన్న.
      ‘‘బావున్నావా రంగన్నా? ఇవన్నీ ఎందుకూ?’’ అన్నా ముంత తీసుకుంటూ.
      ‘‘ఎంత మాట చినబాబుగారూ? మీరు తింటే మాకు సంతోషం’’ అన్నాడు రంగన్న వినయంగా.
      ‘‘సరేగాని ఒక్క నిమిషం ఉండు’’, అని లోపలికి వెళ్లి నేను తెచ్చిన కొత్తచొక్కా తెచ్చి ఇచ్చా. ‘‘చల్లగా నూరేళ్లపాటుండండి బాబు’’ అని ఆనందంగా ఆశీర్వదించాడు రంగన్న.
      ‘‘ప్రతి చిన్న విషయమూ ఎంత సంతోషం కలిగిస్తుంది వీళ్లకి!’’ అని నవ్వుకున్నా.
      తాతయ్య లేచి వసారాలోకి వచ్చారు. ‘‘లేపలేకపోయావా కన్నా?’’ అన్నారు. ‘‘పేపరు చదువుతూ కూర్చున్నాను’’ అన్నా.
      మధ్యాహ్నం గౌరమ్మగారు పెట్ట¨న  రుచికరమైన భోజనంతోపాటు రంగన్న తెచ్చిన పెరుగూ తిన్నా.
      ‘సిటీలో పెరుగు రుచి ఇలాగెందుకుండదో?’ అనుకున్నా.
      సాయంత్రం తోటలో తాతయ్యతో కూర్చున్నప్పుడు, వెంకన్న కుటుంబంతో వచ్చాడు.
      ‘‘రాము పెట్రోలు బంకులో పని చేస్తున్నాడు. ఓ అయిదు వందలు చేతి ఖర్చుకని ఉంచుకుని మిగతాది మాకిచ్చేస్తాడు’’, అని గొప్పగా చెప్పాడు వెంకన్న. ‘ఏనాడూ నా జీతం డబ్బులు నాన్నకి పంపలేదు’... నాకు సిగ్గనిపించింది.
      ‘‘మరి పెళ్లెప్పుడూ?’’ నవ్వుతూ అడిగా.
      ‘‘మంచి పిల్ల దొరికితే చేసేస్తాం’’ ‘‘పక్కింట్లో పనిచేసే జయ మంచి పిల్లలాగే ఉంది’’ అన్నా, క్రీగంట రాముని చూస్తూ. తను సిగ్గుతో తలవంచుకున్నాడు.
      ‘‘మీ మాట కాదంటామా బాబూ, ఆ పిల్ల పెద్దోళ్లతో మాట్లాడి అన్నీ కుదిరితే ఈ మాఘంలోనే పెళ్లి చేస్తాం, ఏమంటావురా?’’ కొడుకు వంక చూశాడు వెంకన్న. రాము ముసిముసిగా తలూపాడు.
      ‘‘చిన్నోడు ఇంకా బళ్లో చదువుతున్నాడు బాబూ’’ అన్నాడు వెంకన్న. ‘‘మీలా కంప్యూటర్‌ ఉద్యోగం చేస్తానంటున్నాడు బాబూ’’ అంది వెంకన్న భార్య. ‘‘నాలానా!’’ అన్నాను ఆశ్చర్యంగా.
      ‘‘అవును సార్‌! ఆ ఉద్యోగమైతే జీతం బాగా వస్తుందట కదా? అమ్మానాన్నలని పని మానిపించి బాగా చూసుకుంటా’’ అన్నాడు చిన్నోడు ఉత్సాహంగా. 
      ‘‘చాలా మంచి ఆలోచనే! మీరు అదృష్టవంతులు’’ అన్నా.
      ‘‘భార్య, పిల్లలూ, ఇల్లూ... ఇంతకంటే స్వర్గమా బాబుగారూ’’ అన్నాడు వెంకన్న. 
      ‘‘వీళ్లు ప్రతీ విషయాన్నీ తేలికగా తీసుకుని తృప్తిగా సమాధాన పడతారు. అందుకే వీరికి జీవితం స్వర్గంలా అనిపిస్తుంది. నాకెన్నో కోరికలు. అందుకోలేని ఆశలు. ఎంత ఉన్నా ఏదో అసంతృప్తి. ఆ రాత్రంతా అదే ఆలోచన. ఏదో తెలియని ఆవేదన.
మర్నాడు లేచే సరికి తాతయ్య వసారాలో పేపరు చదువుతున్నారు. నేను వచ్చినప్పటి నుంచీ ఆయన కొంచెం హుషారుగా అనిపిస్తున్నారు.
      ‘ప్రతి మనిషికీ ఓ తోడు కావాలి’ అనుకున్నా. ఈ కొత్త ఆలోచనకి ఉలిక్కిపడ్డా. పనికి బయల్దేరిన రాము, గులాబీపువ్వు కోసి జేబులో పెట్టుకోవడం చూసి నవ్వుకున్నా. ‘బతకడానికి ప్రేమ అవసరం’ అనుకున్నా. 
      ఈసారి మరింత ఆశ్చర్యపోయా, బడికి వెళ్తున్న కొడుకుని తృప్తిగా చూస్తూ నుంచున్న వెంకన్న భార్యని చూశా. ‘జీవితంలో తృప్తి చాలా అవసరం’ అనుకున్నా. ఒక్క ఉదుటున లేచి నుంచున్నా. గౌరమ్మగారు వేళ తప్పకుండా టిఫిన్‌ పెట్టి వెళ్లారు. ‘ఆరోగ్యకరమైన జీవితానికి క్రమశిక్షణ మంచి మందు’ అనిపించింది గౌరమ్మ గారిని చూస్తే. స్నానం చేసి ఉదయాన్నే, చక్కగా వస్తుందావిడ పనికి. వేళ తప్పకుండా శుభ్రంగా వంట చేస్తుంది.
      ‘ఏమిటి నా ఆలోచనలు!’ ఇలా ఇదివరకెప్పుడూ ఆలోచించలేదు, ‘ఏంటీ మార్పు?’ ప్రశ్నించుకున్నా.
      ‘‘నాన్న ఫోన్‌ చేశాడు’’, తాతయ్య మాటలకి, ఆలోచనల్లోంచి బయటపడ్డా. ‘‘ఏమంటారు!’’ అడిగా.
      ‘‘మంచి సంబంధం వచ్చిందట. పద్ధతైన కుటుంబం. అమ్మాయి బాగా చదువుకుంది. మంచి ఉద్యోగమట మరి...’’ 
      ‘‘చూడమనండి! అన్నీ బావుంటే...’’ నా మాటలకి నేనే ఆశ్చర్యపోయా. బహుశా ఆ క్షణం నా గుప్పెట్లో స్వర్గం నాకు మొదటిసారిగా కనిపించిందేమో!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోని


కొత్త పలక

కొత్త పలక

కుప్పిలి సుదర్శన్‌bal bharatam