ఇది కథ కాదు!

  • 374 Views
  • 23Likes
  • Like
  • Article Share

    దమ్మవళం రామారావు

  • హైదరాబాదు.
  • 9866534340

బహుమతి తెచ్చిపెట్టే అద్భుత కథ రాయడానికి ఆపసోపాలు పడుతున్నాడు మూర్తి! దాని గురించి స్నేహితుల దగ్గర బీరాలు పలికాడు కూడా! హఠాత్తుగా అతనిలో ఓ ఆలోచన! దాని కథేంటి? 
‘ఛ. ముదనష్టపు కథ. ఎలా మొదలు పెట్టాలో అర్థమై చావట్లేదు...’ అప్పటిదాకా రాసిన చిత్తు కాపీని ఉండచుట్టి డస్ట్‌ బిన్లో గిరాటేస్తూ అనుకున్నాడు మూర్తి. డస్ట్‌ బిన్‌ వైపు దిగులుగా చూశాడోసారి. అలాంటి ఉండలు చాలా కనిపించాయి. అన్నీ ఆరోజువే. కనీసం ఏడెనిమిది ఉన్నాయ్‌. చిన్నగా నిట్టూర్చాడు. 
      ‘రోజులు దగ్గర పడుతున్నాయి..’ అనుకున్నాడు. మళ్లీ ‘ఛ. రోజులు దగ్గర పడటమేంటి దరిద్రంగా. కాబోయే ప్రఖ్యాత రచయితను. ఆలోచనల్లో కూడా క్లారిటీ ఉండాలి. ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది..’ అనుకున్నాడు. 
      ఇంతకీ విషయమేంటంటే, నలభై అయిదేళ్లు దాటి అయిదారేళ్లయిన మూర్తికి అర్జెంటుగా ఓ గొప్ప రచన చేసి బహుమతి కొట్టేయాల్సిన అవసరం ఏర్పడింది. ‘అంతా ఆ చెత్తవెధవ గోపీ వల్లే..’ మనసులో తిట్టుకున్నాడు. 
      ఎక్కడో చదివాడు... చెయ్యి తిరిగిన రచయితలు పొద్దున్నే నాలుగింటికల్లా లేచి కూర్చుని ఫ్రెష్‌గా ఫీలవుతూ రాస్తారని. తను కూడా అలాగే ట్రై చేస్తున్నాడు, మూడ్రోజులుగా. పొద్దున్నే లేచి ఫ్రెష్‌గా కూర్చోవడం వరకూ అచ్చం వాళ్లలాగే చేశాడు. కానీ, ఆ తర్వాత కాగితాలు ఉండలు చుట్టడం తప్ప చేసిందేమీ లేదు. ‘పెన్ను పావు అంగుళం కూడా కదలట్లేదు. పనికొచ్చే ఒక్క ఆలోచనా వచ్చి చావట్లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల కథలూ రచయితలందరూ ఇప్పటికే రాసిపారేస్తే ఇక రాయడానికి మిగిలేదేంటి?’ విరక్తిగా అనుకున్నాడు. 
      ఏది ఏమైనా మూర్తి పట్టుదలను మెచ్చుకునే తీరాలి. రచనలు చేయడం అంత సులువు కాదని ఎవరైనా అంటే, మొదట కస్సుమని, ఆ తర్వాత బుస్సుమంటాడు. ఎవరూ పుట్టుకతోనే రచయిత అయిపోరనీ, ఆసక్తి, సమయం లేక గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవాల్సిన తను ఇన్నాళ్లూ ఓ పాఠకుడిలా మిగిలిపోయాననీ గట్టిగా చెబుతాడు. తనే గనక ఒళ్లు, పెన్ను వంచి రాస్తే పాఠకులు వెర్రిగా చదివి ఆ తర్వాత ఉర్రూతలూగుతారని అతడి నమ్మకం. 
      కానీ, కొన్ని రోజులుగా పట్టువదలని విక్రమార్కుడిలా రచయితగా తన ప్రతిభ చూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి చతికిలబడ్డాడు. ఎదురుగా పెన్ను, పక్కన డస్ట్‌ బిన్నూ రెండూ పోటీపడి వెక్కిరిస్తున్నాయి. కోపం ముంచుకొచ్చింది. దుఃఖం కూడా వస్తానని మారాం చేస్తోంది. ‘దీనికంతటికీ కారణం ఆ చెత్త గోపీగాడే..’ పళ్లు పటపటా కోరకబోయి తనకున్న ఒకట్రెండు కట్టుడు పళ్లు గుర్తొచ్చి ఊరుకున్నాడు. ‘అసలా పార్టీ ఎగ్గొట్టాల్సింది. వెళ్లినా నోరుమూసుకుని ఉంటే బావుండేది. వాళ్లంతా ఏదో కొట్టుకు చస్తూంటే మధ్యలో దూరి ఈ పరిస్థితి తెచ్చుకున్నాను. ఛ..’ దిగులుగా అనుకుంటూ నాలుగు రోజులు వెనక్కి వెళ్లాడు.  

*  *  *

      నాలుగు రోజుల ముందు శేఖర్‌ పుట్టినరోజు పార్టీ ఇచ్చాడు, వాళ్లంతా ఎప్పుడూ కలిసే బార్‌లో. శేఖర్‌తో పాటు మూర్తి, గోపి, చందు మొత్తం నలుగురు స్నేహితులు కలిశారు. వాళ్లలో గోపీకి తప్ప మిగతా అందరికీ లైఫ్‌ ఎంజాయ్‌ చెయ్యడమంటే మందు తాగడమే. అతనొక్కడే మందు కాకుండా కూల్‌డ్రింక్‌ తాగాడు. తాగిన మత్తులో అంతా రకరకాల విషయాలు మాట్లాడుకున్నాక, చర్చ తెలుగు రచయితల మీదకి మళ్లింది.  
      ‘‘నా అభిమాన రచయిత యండమూరి. ఆయన లాంటి గొప్ప రచయిత మళ్లీ దొరకడం కష్టం..’’ ఎక్కువగా యండమూరి రచనలు చదివే చందు అన్నాడు, మిగతావాళ్లు కూడా ఒప్పుకోవాల్సిందే అన్నట్టుగా. 
      ‘‘కాదు. మల్లాది నంబర్‌ వన్‌. ఇప్పుడంటే ఆధ్యాత్మిక పుస్తకాలు రాస్తున్నాడుగానీ, ఒకప్పుడు ప్రేమ కథలతో  పేకాడేసేవాడు..’’ ఆ విషయంలో ఎవరితోనైనా వాదించడానికి సిద్ధమన్నట్టుగా చెప్పాడు శేఖర్‌.
      ‘‘యర్రంశెట్టి కామెడీతో క్యారమ్స్‌ ఆడేస్తాడు. ఆయన సృష్టించిన హాస్యం వీళ్లెవరి వల్లా అయ్యేపని కాదని బల్లగుద్ది మరీ చెబుతాను’’ గట్టిగా బల్ల చరుస్తూ చెప్పాడు గోపి. అతడు యర్రంశెట్టి వీరాభిమాని. 
      వాదన పెరిగి ముగ్గురూ ఆవేశంగా బల్ల చరుస్తూ వాదించుకోవడం చూసి ఒళ్లు మండిపోయింది మూర్తికి. పైగా గోపి గట్టిగా బల్ల చరిచేసరికి టేబుల్‌ మీద గ్లాస్‌ తొణికి మూర్తి ఒళ్లో పడింది. 
      ‘‘ఏంటి మీరంతా మాట్లాడేది? ఆ మాత్రం నేను రాయలేనా?’’ గట్టిగా, కాస్త కోపంగా అన్నాడు ప్యాంటు మీద పడ్డ డ్రింక్‌ టిష్యూ పేపర్‌తో తుడుచుకుంటూ. 
      మందు తాగిన మిగితా ఇద్దరి మత్తు ఒక్కసారిగా దిగిపోతే, గోపీ తను తాగిన కూల్‌డ్రింక్‌లో మందేమైనా కలిసిందా అని అనుమానంగా చూశాడు. నాలుగైదు క్షణాల తర్వాత తేరుకుని పిచ్చిగా చూశారు అంతా మూర్తి వైపు. వెయిటర్‌ వచ్చి అందరి గ్లాసులు మళ్లీ నింపి వెళ్లాడు. 
      ‘‘నేను కూడా గొప్పగానే రాయగలను. టైం లేదంతే..’’ ఎప్పుడూ చెప్పే పాఠం మళ్లీ చెప్పాడు మూర్తి.
      ‘‘గోపీ తాగకపోయినా మాంచి తిక్క మీదున్నాడు. ఈసారి ఎలాగైనా మూర్తి నోరు పర్మినెంట్‌గా మూయించాలనుకుని, తన ఫోన్‌లో ఓ వారపత్రిక కథల పోటీ క్లిప్‌ని చూపిస్తూ, ‘‘అరేయ్‌ మూర్తీ, నువ్వన్నట్టు నువ్వో గొప్ప రచయితవే అయితే, ఈ కథల పోటీకి నువ్వో కథ రాసి పంపు. బహుమతి రాకపోయినా ఫర్వాలేదు. సాధారణ ప్రచురణకు ఎంపికైతే చాలు. అప్పుడే నువ్వో రచయితవని మేమంతా చచ్చినట్టు ఒప్పుకుని నీకో బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాం’’ 
      తాగిన మత్తులో వెంటనే ఒప్పేసుకున్నాడు మూర్తి, ‘అదెంత పని’ అన్నట్టుగా పకపకా నవ్వుతూ.
      ‘‘ఒకవేళ కథ అచ్చవకపోతే?’’ అడిగాడు శేఖర్‌. 
      ‘‘నేనూ రాయగలనని, రాస్తానని ఇంకెప్పుడూ మీ దగ్గర అనను. నేనే మీకు మాంచి పార్టీ ఇస్తాను..’’ జవాబిచ్చాడు మూర్తి అందరి వైపు చూస్తూ.
      ‘‘సరే’’ అన్నారంతా. 

*  *  *

      మళ్లీ వర్తమానంలోకి వచ్చాడు మూర్తి. ఆలోచనలు తెగట్లేదు. అసలీ పందెం ఎందుకు ఒప్పుకున్నానా అని మళ్లీ అనుకున్నాడు. ‘ఓడిపోతే ఎంత పరువు తక్కువ? జీవితాంతం నన్ను ఎగతాళి చేస్తూనే ఉంటారు. ఆ గోపీగాడికైతే మరీ వెటకారం ఎక్కువ. వాళ్లందరి నోళ్లు మూయించాలంటే ఎలాగైనా ఓ అద్భుత కథ రాసిపారేసి బహుమతి కొట్టెయ్యాలి. బహుమతి సంగతి వదిలెయ్యి, కథ అచ్చయితే చాలు అంటాడా గోపీగాడు. ఎంత పొగరు. నేనేంటో అందరికీ తెలియాలి’ దృఢ నిశ్చయంతో కుర్చీలోంచి లేచాడు. 
      రెండు చేతులూ వెనక్కి పెట్టుకుని, పాత సినిమాల్లో గుమ్మడిలా ఇంట్లో పచార్లు చేశాడు, కథ ఎలా రాయాలా అని ఆలోచిస్తూ. అలా పచార్లు చెయ్యడం వల్ల గుమ్మడికి ఏం ఒరిగిందో తెలియదుగానీ, మూర్తి మస్తిష్కంలో మాత్రం ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. కానీ, వెంటనే భయమేసింది. ఆ తర్వాత కంగారుగా అనిపించింది. మళ్లీ సంతోషంతో వికటాట్టహాసం చేయాలనిపించినా, ఇప్పుడు వద్దులే అని ఊరుకున్నాడు. మొత్తానికి తన ఆలోచన సరైందే అని నమ్మకం కలిగింది. ప్రస్తుత పరిస్థితిలో పందెం గెలిచి అందరి నోళ్లు ఆశ్చర్యంతో తెరిపించాలంటే అదే సరైన దారి అనుకున్నాడు. 
       మూర్తి తండ్రికి వార, మాస పత్రికలు చదివిన తర్వాత వాటిని భద్రంగా దాచడం అలవాటు. ఇంట్లోవాళ్లు న్యూస్‌ పేపర్లు తూకానికి అమ్మేసినా, ఆ పత్రికల్ని మాత్రం తాకనిచ్చేవాడు కాదు. ఆయన పోయి పదేళ్ల పైనే అయ్యింది. మొన్నా మధ్య ఇల్లు సర్దుతూంటే ఎన్నో పాత పత్రికలు కట్టలుగా దొరకడం గుర్తుకొచ్చింది. అవే ఇప్పుడు మూర్తిని రక్షించబోతున్నాయి. ‘ఆ పాత పత్రికల్లోంచి ఏదైనా ఓ మంచి కథ కాపీ కొడితే పోలా..’ ఇదీ అతడికొచ్చిన ఆలోచన. ఆ ఆలోచనకి తనని తానే తనివితీరా మెచ్చుకున్నాడు.
      ‘చాలా థాంక్స్‌ నాన్నా. ఎందుకలా కట్టలుగా కట్టి అటక మీద గుట్టలుగా పెట్టావో తెలీదుగానీ, ఇప్పడు నాకు గట్టిగా పనికొస్తున్నాయవి..’ అనుకుని బయటికే నవ్వాడు. లోపలికెళ్లి స్టూలు తీసుకొచ్చి అటక మీద ఉన్న ఓ పత్రికల కట్ట కిందకి దించాడు. శబ్దం రాకుండా నెమ్మదిగా దుమ్ము దులిపాడు. భార్యకు తెలిస్తే విషయం కరోనా వైరస్‌లా ఊరంతా పాకిపోతుంది. జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాడు.
      ఆ తర్వాత రెండు మూడు గంటలు ఎంతో శ్రద్ధగా శ్రమించాడు. ఒక్కో పత్రికా తీసి కథలు చదవడం మొదలుపెట్టాడు. మొత్తానికి ఒక కథను సెలెక్ట్‌ చేసుకున్నాడు. ఎవరో అనామక రచయిత రాసిన ‘పిచ్చి ముదిరింది’ కథ అది. ప్రోత్సాహక బహుమతి గెలుచుకుంది. ఎప్పుడు రాసిన కథో చూశాడు. ముప్పై ఏళ్లు దాటింది! మళ్లీ ఓసారి మొత్తం కథ చదివాడు. బానే ఉందనిపించింది. ఆ పత్రిక కూడా ఎప్పుడో మూతపడింది. ఆ రచయిత కథ మరొకటేదీ ఆ పత్రికల్లో కనిపించలేదు. ఇదే ఫైనల్‌ అనుకుని ఆనందంగా లేచి మిగతా పత్రికలన్నీ సర్దేశాడు.  
      తన బల్ల దగ్గరికొచ్చి తీరిగ్గా కూర్చుని పత్రికను జాగ్రత్తగా పరిశీలించాడు. కథ చివర్లో ఆ రచయిత పేరు, ఫొటో కూడా వేశారు. వయసు కనీసం యాభై పైనే ఉంటుందనిపించింది. ‘అంటే ఇప్పుడు ఎనభై దాటే ఉంటాయి. అసలీ పాటికి స్వర్గస్థుడై ఉండొచ్చు. లేదంటే వార్ధక్యం వల్ల ఇప్పుడొచ్చే పత్రికలు చదివే ఓపికా, ఆసక్తీ లేక ఏ నవారు మంచం మీదో సెటిల్‌ అయ్యుంటాడు, పక్కన మంచి నీళ్ల సీసా, మందులు పెట్టుకుని. ఈ కథను కాపీ కొట్టిన విషయం స్వయంగా నేను చెబితే తప్ప ఎవరికీ తెలిసే అవకాశమే లేదు’’ అనుకోగానే ఉత్సాహం రెట్టింపైంది.    
      కాగితాలు, పెన్ను తీసుకుని ప్రశాంతంగా కూర్చుని జాగ్రత్తగా మక్కీకి మక్కీ కథ దింపేశాడు. నేరుగా ఫెయిర్‌ కాపీనే రాశాడు. రాస్తున్నంత సేపూ మొహం మీద సంతోషంతో కూడిన చిరునవ్వు. ఆ కథకు బహుమతొచ్చి స్నేహితులంతా ఆశ్చర్యపోయి, తనను ఆకాశానికి ఎత్తినట్టుగా, తమ అభిమాన రచయితలతో తనను పోల్చినట్టుగా, తన పరపతి స్టాక్‌ మార్కెట్లో సూచీలా అమాంతంగా పెరిగినట్టుగా ఊహల్లో తేలిపోయాడు. గంటలో కథ రాయడం పూర్తి చేసి, ఒళ్లు విరుచుకున్నాడు బద్ధకంగా. ఓ మంచి కథ పూర్తిచేస్తే కలిగే తృప్తి నిజంగా ఎంత గొప్పగా ఉంటుంటో అనుకున్నాడు. భార్యకు తను కష్టపడి రాసిన కథను చూపిద్దామనుకుని, మళ్లీ ఎందుకులే అని ఊరుకున్నాడు. కథ అచ్చయ్యాక స్నేహితులతో పాటు భార్య కూడా చూసి ఆశ్చర్యపోతుందని భావించాడు. 
      ‘అదే పిచ్చి’ అని కథ శీర్షిక కాస్త మార్చాడు. చక్కగా కవర్లో పెట్టి, ఈ కథ దేనికీ కాపీ కాదు అన్న హామీ పత్రం కూడా శ్రద్ధగా జతచేసి, మొత్తానికీ కథను పోటీకి పంపాడు మూర్తి. ఆ తర్వాత పత్రిక నుంచి ఎప్పుడు జవాబు వస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు. కొన్నాళ్లకు పత్రికాఫీసు నుంచి జవాబొచ్చింది, పోటీలో తన కథకు బహుమతి వచ్చిందని! ఎగిరి గంతేయబోయి నడుము పట్టేస్తుందేమోనని ఊరుకున్నాడు. ‘‘యాహూ..’’ అని మాత్రం గట్టిగా అరిచాడు. కళ్లల్లో ఆనందంతో కూడిన కన్నీరు. ఇంట్లోవాళ్లకీ, పందెం కాసిన స్నేహితులకీ గర్వంగా చెప్పాడు విషయం. అంతా ఆశ్చర్యానికి లోనై అనుకున్నట్టుగానే నోరెళ్లబెట్టారు. పట్టుబట్టి పెద్ద హోటల్లో పార్టీ తీసుకున్నాడు పందెం ప్రకారం. 
      ఆరోజు నుంచీ తన పేరు, కథ అచ్చులో చూసుకోవాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. తనివితీరా కథను చూసుకున్నాడు పత్రికలో. కథకు తగ్గ బొమ్మ వేశారు. పెద్ద అక్షరాలతో ఇంటిపేరుతో సహా రాసిన తన పేరును గర్వంగా చదువుకున్నాడు. అదంతా చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. కానీ మనసులో ఎక్కడో కొంచెం బెరుగ్గా కూడా ఉంది. ‘కొంపదీసి ఎవడైనా నేను కాపీ కొట్టిన విషయం పట్టేస్తాడా?’ అని. కాసేపు ఆలోచించి తను అవనసరంగా భయపడుతున్నానని సర్దిచెప్పుకుని ఊరుకున్నాడు.
      తెలిసినవాళ్లకీ, చుట్టాలకీ ఫోన్‌ చేసి చెప్పాడు, ‘‘ఈ వారం పత్రికలో నా కథ వచ్చింది, చదవండి’’ అని. అంతా కంగ్రాట్స్‌ చెబితే గర్వంగా థాంక్స్‌ చెప్పాడు. ఆఫీసులో బాస్‌ కూడా అందరి ముందూ అభినందనలు తెలిపాడు. అంతా కలలా అనిపించింది. క్రమంగా తనో పెద్ద రచయితగా మారినట్టూ, నవలలు కూడా అవలీలగా రాస్తున్నట్టూ, అభిమానులు ఏర్పడ్డట్టూ, సభలూ సమావేశాలకు అధ్యక్షత వహించాలని అడిగితే సున్నితంగా తిరస్కరిస్తున్నట్టూ ఊహల్లో తేలిపోయాడు.
      వారం గడిచింది. ఆ తర్వాతి వారం పత్రిక తీసుకుని, ఎవరైనా అది కాపీ రచన అని స్పందన తెలియజేశారా అని చూశాడు. తను భయపడినట్టు ఏదీ జరగలేదు. తన రచనను పొగుడుతూ ఇద్దరు ముగ్గురు రాశారు. హమ్మయ్యా అనుకుని, వాళ్ల స్పందనని ఆస్వాదించి, ప్రముఖ రచయితలకు ఇలాంటివి మామూలే అన్నట్టుగా నిర్లక్ష్యంగా ముఖం పెట్టాడు. 
      కథ అచ్చయ్యి పది రోజులు దాటింది. భయమంతా పోయింది. అందరి దగ్గరా తను రాయబోయే సీరియల్‌ గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇంటికొచ్చాక భార్య ‘‘నిన్న మీకేదో కవర్‌ వచ్చిందండీ. చెప్పడం మర్చిపోయాను. చదువుతూండండి కాఫీ తెస్తాను’’ అని ఓ కవర్‌ అతడి చేతిలో పెట్టింది. వెంటనే దాన్ని చింపి అందులో రెండు మడతలు పెట్టిన కాగితం విప్పాడు.
      ‘‘మూర్తి గారికి, మీరు రాసిన ‘అదే పిచ్చి’ చదివాను. చాలా బాగా కాపీ కొట్టారు. మీ అడ్రస్‌ సంపాదించడానికి కొంత టైం పట్టింది. మీరు కాపీ కొట్టిన ‘పిచ్చి ముదిరింది’ రాసింది నేనే. నా వయసు ఇప్పడు ఎనభై అయిదేళ్లు. ఇప్పటికీ అన్ని పత్రికలూ చదువుతాను. 
      ‘‘రచనలు చేయాలంటే సొంతగా ఆలోచించాలి. అంతేగానీ పాత పత్రికలు వెదికి కాపీ కొట్టడం బుద్ధిలేని పని. పాఠకులు తెలివితక్కువ వాళ్లేంకాదు. ఎవరో ఒకరు పట్టేస్తారు. ఇలాంటి పనులు చేసి పరువు పోగొట్టుకుని స్నేహితుల ముందు తలెత్తుకుని తిరగలేకపోవడం కంటే మంచి పాఠకుడిగా ఉండటం మేలు. 
      ‘‘ఇవి నా మాటలు కాదు. ఈ కథ రాసిన అసలు రచయితవి! అవును. నువ్వు కాపీ కొట్టిన ‘పిచ్చి ముదిరింది’కి అసలు మూలం ‘అసలు పిచ్చి’ అనే ఇంకో కథ! నేను కూడా నీలాగే కాపీ కొట్టాను! దురదృష్టవశాత్తూ దాని అసలు రచయిత మా వీధిలోనే ఉంటాడన్న విషయం నాకు ముందుగా తెలీదు. నా కథ అచ్చయి బహుమతి వచ్చాక, ఆ మహానుభావుడు నలుగురు స్నేహితులతో మా ఇంటికొచ్చి నా పళ్లు రాలగొట్టాడు. నా పరువు ఇంటి ముందున్న మురుగు కాలవలో చక్కగా కలిసిపోయింది. 
      ‘‘నా పళ్లు కట్టించుకుని, అప్పటి నుంచీ కథలు రాయడమనే ఆలోచనకు చరమగీతం పాడి, కథలు చదవడం మాత్రమే చేస్తున్నాను. నీకు రచనలు చేసే సీన్‌ లేదు. మళ్లీ ఇలాంటి పని చెయ్యకు. నీ మీద ఫిర్యాదు చేసే ఓపిక, అర్హత నాకు లేవు. నీకొచ్చిన బహుమతిలో సగం నాకిస్తే సంతోషిస్తాను. బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు పంపుతున్నాను. ఇట్లు...’’ 
      ఉత్తరం చదువుతున్న మూర్తి ముఖం రకరకాల రంగుల్లోకి మారి చివరకి నలుపు వర్ణం సంతరించుకుంది. ‘ఈయన కూడా కాపీ బాపతే అన్నమాట!’ అనుకుంటూ ఏదో ఆలోచనలో ఉండగా భార్య కాఫీ తీసుకొచ్చి ఉత్తరం గురించి అడగబోయింది. ఉత్తరం మడిచి జేబులో పెట్టుకుని, చప్పున లేచి నిలబడి ‘‘కాసేపాగి తాగుతాన్లే. అర్జెంట్‌ పనుంది’’ అని హడావుడిగా బెడ్‌ రూంలోకి వెళ్లి, లోపలి నుంచి తలుపు గొళ్లెం పెట్టుకుని, మంచం మీదకి చేరి బావురుమన్నాడు!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


పాపమ్మ చెట్టు

పాపమ్మ చెట్టు

లోగిశ లక్ష్మీనాయుడు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోనిbal bharatam