పాపాయి-2

  • 243 Views
  • 8Likes
  • Like
  • Article Share

    జగదాంబ పీసపాటి

  • విజ‌య‌వాడ‌
  • 8978300330
జగదాంబ పీసపాటి

అదలా ఉంచితే, రానే వచ్చాయి నా బోసినోట్లోకి బోల్డెన్ని పళ్లు. (పసికూనని కదా, బూచోడెత్తుకు పోతే నన్ను నేను రక్షించుకోవాలిగా)
      నాకు పెట్టకుండా అందరూ తినే అప్పచ్చుల్లో ఇక నాకూ వాటా దొరుకుతుందిలే! ఇంకో రహస్యం చెప్తా వినండి, నాకిష్టం లేకుండా అమ్మచంకలోంచి నన్ను లాక్కుంటుందే రెండో వీధి బామ్మగారు, ఆవిడకి తగిన బుధ్ధి చెప్తా ఈసారి. నేనేం చిన్నపిల్లను కాను!! గడపలు కూడా దాటగలను తెలుసా. హనుమంతుడు సముద్రం దాటినట్టు అమ్మ ఎంత ఆర్భాటం చేసిందనుకున్నారు. అప్పాలు, పానకం చేసి ఊరంతా పంచిపెట్టింది, మరి నా సంగతో... అక్కడికే వస్తున్నా.. గారెలు చేస్తా చేస్తా అని గోలే గాని పప్పయినా నానబెడితేగా.. అది నానాలి, రుబ్బాలి, కర కర వేగాలి ఎంత కథనుకున్నారు.. అలా ఎదురు చూస్తూ ఉండగా, నాకో కల వచ్చింది.
      నా పాత చుట్టాలు నన్ను కలవడానికి వచ్చార్లే.. గంధర్వులు. ఏవో పనులున్నాయట, సాయం అడగొచ్చారు.. గారెలు వండుకోలేను కానీ వీరికి ఏం చేసిపెట్టగలను.. చూస్తే పాత బంధుత్వం కాదనలేను. ‘చల్లకొచ్చి ముంత దాచడమెందుకు.. తల్లీ, హడావుడిలో పంపించాంగానీ నీ పాప పుణ్యాల చిట్టా తేలనిదే’ అన్నారు. అమ్మో సమయం చూసుకుని వచ్చారయ్యా, ఇంకా బామ్మ గారెలు వండనే లేదు.. పాపాల్లెక్క తేలితే గారెలు దక్కవేమో అని బెంబేలు పడుతూ నా బ్రహ్మాశ్తాన్న్రి ప్రయోగించాను. ఒక్క గుక్క పెట్టానో లేదో నా బలగం అంతా చుట్టూ..
      నాకు ఎన్ని రాగాలొచ్చనుకున్నారు కల్యాణి, కాంభోజి, మోహన.. స్వరాల్లో పొరబడ్డా స్థాయి మాత్రం ఒకటే ‘తార’, తేడా వచ్చిందో పట్టించుకోరే నన్ను.. అందుకే ‘మంద్రం’ గురించి మరిచిపోయా..
      తెల్లవారిందో లేదో తొమ్మిది కావొస్తొందిలెండి కాని ఎంత వ్యవహారం జరిగింది, చావు తప్పి కన్ను లొట్టపోయిందనుకోండి. గడపలన్నీ దాటి చూసేను కదా వంటింట్లో ఘుమఘుమలు.. నాకోసం కాదులెండి చుట్టాలొచ్చారట. నా పేరు చెప్పి ఇక.. ఈ విడ్డూరం వినండి, ‘తింటేగారెలు తినాలి వింటే భారతం వినాలి’ అని ఛలోక్తులు విసురుతూ అల్లం పచ్చడి మీద ఒట్టు ఒక్కటి మిగిలితే..
      అయిపోయిన దానికి బాజాలు అని, దాని సంగతెందుకులెండి, సీత బాధ సీతది పీత బాధ పీతది అన్నట్టు అమ్మేమో వంటింట్లో తలమునకలవుతుంటే నా గాభరా నాది. చిట్టా చూస్తే ఆవగింజ, వడ్లగింజ అన్నారు. నాకే తంటా తెచ్చిపెడతారో..
      నేనేమి తక్కువ తినలేదు, నా గూట్లో రెండు గారెలు ఎవరికీ తెలియకుండా దాచాన్లే!!
      అమ్మేమో కునుకు తీసింది, నేనేమో చిట్టా గొడవలోపడి కునుకు తీస్తే ఒట్టు. గురుతుకొస్తున్నాయి... ఎంత కాలమైంది, అయినా మర్చిపోతేగా... బడిలో టీచరు క్లాసులో కూర్చోమంటే, ఏం చెయ్యను ఆవరణలో ఉయ్యాలేమో జతకట్టమని రోజూ పిలుస్తోంది.. బావుండదని లెక్కల క్లాసు ఎగ్గొట్టి దాని ఒళ్లో కూర్చున్నానో లేదో రయ్‌మని రెక్కపట్టుకుని టీచర్‌ లాగబోతేను ఒక్క కొరుకు కొరికాను, అదీ పాపమేనా.. ఏదో చిన్నపిల్లని, దానికి కూడా లెక్కలు రాస్తేను!!
      అలా అయితే నా బుగ్గలెన్ని సార్లు కొరికారో వీళ్లని ఏం చెయ్యాలో..! రెండోది.. నా స్నేహితురాలు దాని కష్టం సుఖం చెప్పుకుంది, బుజ్జిగాడు దాని జడ లాగింది, మరమరాలు దొంగిలించింది, ఇంకెన్నని చెప్పను... పోనీలే అని వాణ్ని దులపడానికి కాస్త మాట సాయం చేశాను.. ‘పరులను నిందించరాదు’, మహాపాపమంట. ఇంకేముంది దీన్నీ చేర్చారు.
ఇలా అయితే బామ్మ, అమ్మనెన్నిసార్లు దులపలేదు, అయిపోయిందే బామ్మ పని...
      మూడోదంటారా, నాన్నేమో అస్తమాను చదువుకోమంటారు, నేనేమో కుంభకర్ణుని చెల్లెలి వరసైతేను. నాన్నగారు ఆఫీసు నుంచి వచ్చే సమయానికి కాపుకాసి నిద్రకళ్లతో నటన.. పుస్తకం హస్తభూషణం అన్నమాట. ‘అబద్ధం చెప్పరాదు’, ఇది మరీ దోషమట. అసలు నిద్రాభంగం చేయడం ఎంత పాపమో తెలుసా, పోన్లే పాపం అంటే మరీను.. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నని చెప్పను.. ఇక ‘బుద్ధిగా’ (ఎంత ఒద్దికైన మాటో) ఉంటాగా అన్నీ మర్చిపోతార్లే!!
      నాన్నగారంటే విన్నా మరుపు సహజమంట, ఆయనన్నీ మర్చిపోతార్లే (నీలం రంగుని ఆకుపచ్చ అంటారు), నా పేరు మర్చిపోతారు కాబోలు ఎన్ని తమాషా పేర్లతో పిలుస్తారో..
      సరేలే, బుద్ధిగా ఎలా ఉంటారో మీరే చూస్తారుగా..
      అమ్మని పరుగుపెట్టనివ్వకుండా నేనే మొదలెట్టాగా పరుగు.. ఎవరికీ దొరకకుండా తప్పించుకోవచ్చులే, ఇక ఆ గంధర్వులు పట్టుకునేది లేదు.. నేను దొరికేది లేదు.. అని కులాశాగా అమ్మ చేసిన అరిసెల మీద చకాచకా నడిచేసి అలసిపోయి నిద్దరపోయాను.
      ‘బుద్ధి’గా ఎలా ఉండాలో చెప్పండి మరి.. నేనూ ఆలోచిస్తున్నాలెండి.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


పాపమ్మ చెట్టు

పాపమ్మ చెట్టు

లోగిశ లక్ష్మీనాయుడు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోనిbal bharatam