అతని వెనుక ఆమె

  • 294 Views
  • 102Likes
  • Like
  • Article Share

    మాదా ఆంజనేయులు (శేషచంద్ర)

  • మైదుకూరు, కడప.
  • 9440581463
మాదా ఆంజనేయులు (శేషచంద్ర)

వచ్చిన కష్టాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. అతనిలో ఆందోళన ఎంతకీ తగ్గడంలేదు. బతుకు భయం అతణ్ని మామూలుగా ఉంచడంలేదు. అందుకే తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కానీ, అంతలోనే... 
నిద్ర పట్టక మంచం మీద అటూ ఇటూ కదులుతున్న అతను అసహనంగా లేచి కూర్చున్నాడు. అప్పటి వరకూ తన చుట్టూ ఎగురుతూ తోడున్న దీపపు పురుగులు ఒక్కొక్కటీ నేలకొరిగిపోయాయి. వాటికోసం దీనంగా రోదిస్తూ, కటిక చీకటితో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా పోరాడుతున్నట్టుంది. అతని ఇంటికి ఎదురుగా ఉన్న వీధిలైటు వెలుగుతూ ఆరిపోతూ నిట్టూర్పులు విడుస్తూ దాన్ని ఓదారుస్తునట్టు గాలి వేడిగా వీస్తోంది. 
      దారీ తెన్నూ లేని ఆలోచనలు ఎంతకూ తెగడంలేదు. ఎటు ఆలోచించినా... ఎలా ఆలోచించినా బైటపడే మార్గం కనపడక అంతా శూన్యంగా తోస్తోంది. ‘ఏంటి నా జీవితం? ఎప్పుడూ కష్టాల బతుకేనా? జీవితంలో సుఖపడింది ఎప్పుడు? కొద్దికాలం బాగుంటే, ఆ వెంటనే కష్టాలు కాచుకు కూర్చున్నట్టు పగబట్టి మరీ చుట్టేస్తూనే ఉన్నాయి. వాటి నుంచి కాస్తంత తేరుకోవడం, ఆ వెంటనే మళ్లీ చుట్టుముట్టడం... వాటికి అలవాటు పడిపోయినా ఈసారి వచ్చిన ఉపద్రవానికి నిలదొక్కుకోవడం కష్టమేనేమో’ అనుకున్నాడు.
      కొద్ది రోజులుగా దానిచుట్టే ఆలోచనలు సాగుతున్నాయతనికి. రెండు నెలల క్రితం సమస్యలన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టినట్టు ఆర్థిక వెసులుబాటు దక్కడంతో జీవితం ఇక సాఫీగా ఉంటుందని సంతోషపడ్డాడు. కానీ, ఆ ఆర్థిక వెసులుబాటే ఇప్పుడు ఇంత దుఃఖంలో ముంచుతుందని అనుకోలేదు. దాన్నుంచి ఎలా బైటపడాలో తెలియక, తిండి కూడా సరిగా సహించక సతమతమైపోతున్నాడు. మంచం మీద కూర్చున్నవాడు లేచి నిల్చున్నాడు. చూడకూడదనుకుంటూనే ఆవైపు చూశాడు. మసక చీకట్లో నిండా ముసుగు కప్పుకుని ఉన్న దాన్ని చూడగానే బాధ రెట్టింపయ్యింది. ఆవైపు చూడలేక మళ్లీ మంచం మీదకి వాలాడు. 
      ‘బతుకు భారమైనప్పుడు, దానికి పరిష్కారం ‘అది’ తప్ప మరింకేముంటుంది!’ అనుకున్నాడు. కొద్దిసేపు అలాగే మంచం మీద కూర్చుని ఒక స్థిర నిశ్చయానికి వచ్చినవాడిలా మెల్లగా లేచాడు. శబ్దం కాకుండా తలుపు తీయాలని ప్రయత్నించినా, అది అతని మాట విననట్టు కిర్రుమని శబ్దం చేసింది. కొద్ది క్షణాలు చీకటికి కళ్లు అలవాటు పడేంతవరకు కదల్లేదు అక్కణ్నుంచి. చీకటికి అలవాటు పడిన కళ్లకు లోపల నిద్రపోతున్న భార్య, కొడుకు స్పష్టంగా కనపడ్డారు. అమ్మ మెడచుట్టూ చెయ్యి వేసి ఆదమరచి నిద్రపోతున్నాడు కొడుకు. భార్య నిద్రపోతోందో లేదంటే కొడుకు సుతిమెత్తని చేతుల్లో మాతృత్వ మాధుర్యాన్ని అనుభవిస్తూ అలాగే ఉందో... కానీ కదలకుండా పడుకుని ఉంది. అతను వాళ్లవైపు నుంచి చూపులు తిప్పుకోలేకపోయాడు. ఇక అవే ఆఖరి చూపులనుకుంటూ తనవితీరా చూడసాగాడు. 
      ‘పొద్దునే లేవగానే ముద్దు ముద్దుగా ‘నాన్న ఏడి’ అంటూ నా కోసం వెతికి, నా చంకెక్కేవాడు... రేపు నేను పోతే... ఫ్యానుకి ఏలాడుతున్న నన్ను సూచి ఎలా ఏడుస్తాడో. నన్ను చూసి నా భార్య తట్టుకుంటదా? ఆమె స్పృహతప్పి పడిపోతే పిల్లాణ్ని ఓదార్చే దిక్కుకూడా ఉండదేమో’ జరగబోయే దృశ్యాన్ని ఊహించుకునేసరికి అతనికి లోపల్నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. కన్నీటి ధార అతని చొక్కాని పూర్తిగా తడిపేస్తుండగా, అక్కడ నిలబడలేక మళ్లీ వచ్చి మంచం మీద కూలబడ్డాడు.

*  *  *

      అతను పెద్దగా చదువుకోలేదు. అతని తండ్రి లారీ డ్రైవరుగా పనిచేసేవాడు. తాగుడు, పేకాట అతని తండ్రికి జంట స్నేహితులు. ఎప్పుడూ వాటిని వెంటేసుకుని తిరిగేవాడు. వచ్చే కొద్ది జీతాన్ని, జీవితాన్ని వాటికి ధారపోస్తుండటంతో, కుటుంబం చిన్నదైనా పస్తులతో బరువుగా సాగేది. చదువుకునే వయసులో, చదువుకోవాలని ఆశ ఉన్నా, ఆ ఆశను మధ్యలోనే తుంచేశాడు తండ్రి. ‘‘మనకు చదువెందుకురా. నా వెంట రా. డ్రైవింగ్‌ నేర్చుకుందువు’ అంటూ క్లీనర్‌గా కొడుకుని వెంటేసుకునే లారీ నడిపేవాడు.
      అసలే తండ్రంటే భయం, అయిష్టం. లారీలో అతని వెంట వెళ్లడం మరింత నరకం. తండ్రి తిట్లు, దెబ్బలతో డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు. కొడుకు పరిస్థితిని చూసి ఎదురు తిరిగినప్పుడల్లా భర్త చేతుల్లో చావుదెబ్బలు తినేది తల్లి. తాగిన మైకంలో డ్రైవింగ్‌ చేస్తూ యాక్సిడెంట్‌ చేశాడొకసారి తండ్రి. ఇద్దరూ అదృష్టంకొద్దీ బైటపడ్డారు. దాంతో చావనైనా చస్తానుగానీ నీ వెంట నా కొడుకును పంపనంటూ అడ్డం తిరిగింది తల్లి. దాంతో తండ్రి వెంట వెళ్లే నరకం తప్పింది. 
      తల్లి నాలుగిళ్లలో పని చేస్తుండటం చూసి, చదువు ఎటూ ఆగిపోయిందని ఒక అంగట్లో పనికి చేరాడు. పగలంతా కష్టపడి గాడిద చాకిరీ చేస్తే పస్తుల బాధ తప్పిందేగానీ బీదరికం మాత్రం అతని జీవితంలో అలాగే తిష్ఠవేసింది, అతణ్ని వదలడం ఇష్టం లేనట్లు. పట్టుదలతో దాన్ని తరిమి కొట్టేందుకు ప్రయత్నించేకొద్దీ తండ్రి వల్ల గోడకు కొట్టిన బంతిలా మళ్లీ తిరిగి వస్తూ దెబ్బతీయసాగింది. 
      తల్లీ కొడుకుల జీవిత వ్యథ చూసీ చూసీ కాలానికి విసుగేసిందో లేక జాలేసిందోగానీ కొద్దిగా మార్పు తెచ్చేందుకు అతని తండ్రిని యాక్సిడెంట్‌ రూపంలో తీసుకెళ్లిపోయింది. తండ్రి పోయినందుకు ఓ మూల బాధ ఉన్నా, తల్లికి, తనకు వేధింపులు ఇక ఉండవన్న ఆలోచన మనసుకు ఊరట కలిగించింది. 
      కష్టపడి సంపాదించడం, రూపాయి రూపాయి కూడబెట్టి అంతో ఇంతో వెనకేసుకోవడంతో కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, కాస్తంత ప్రశాంతత దొరికాయి. ఒకటి దొరికితే మరొక దాని కోసం ఆరాటపడటం మామూలే. నాలుగు డబ్బులు పోగుపడగానే ఆ తల్లికి కొడుక్కి పెళ్లి చేసి అతణ్ని ఓ ఇంటివాణ్ని చేయాలనిపించింది.
      తల్లి మాటలకు ‘‘తా దూర సందులేదు, మెడకో డోలా. ఇప్పుడిప్పుడే మన బతుకు బండి గాడిలో పడుతోంది. అప్పుడే పెళ్లి ఎందుకు’’ అంటూ కొట్టి పారేశాడు.
      ‘‘మనకన్నా బీదవాళ్లు పెళ్లిళ్లు చేసుకుని జీవితాలు సాగిస్తుంటే నువ్వు ఎన్నాళ్లని ఒంటరిగా ఉంటావురా. గంతకు తగ్గ బొంత దొరక్కపోదు’’ అంది తల్లి. ఆమె మాటలను తోసిపుచ్చాడుగానీ, కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగదన్నట్లు, అతను పనిచేసే షావుకారు ఇంట్లో పని మనిషికి పెళ్లీడొచ్చిన అందమైన కూతురుంది. ఆమె తన గుండెల మీద కుంపటిలా ఉండటంతో బీదవాడైనా మంచి నడవడిక ఉన్న వాడికిచ్చి పెళ్లిచేసి అల్లుడిగా తెచ్చుకోవాలని పదే పదే షావుకారికి మొరపెట్టుకుందామె. షావుకారు అతణ్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. 
      తల్లి పోరు, షావుకారు మాటలు, అంతకు మించి ఆ అమ్మాయి అందం అతని మనసు మార్చేశాయి. పెళ్లికి తలవంచాడు. పుట్టిపెరిగాక అవే అతని జీవితంలో మొదటిసారిగా ఆనందపు రోజులు. కాలచక్రం గిర్రున తిరిగి చూస్తుండగానే ఓ బిడ్డకు తండ్రయ్యాడు. కాలానికి మళ్లీ పాత పగ గుర్తుకొచ్చినట్టు అతని తల్లికి ఉన్నట్టుండి జబ్బు చేసింది. ఆమె పనికి వెళ్లలేకపోవడం, మందుల ఖర్చులు, కుటుంబ బాధ్యత... బతుకు బండి మళ్లీ కుదుపులకు లోనవసాగింది. 
      అత్తకు ఆరోగ్యం కుదుటపడేంత వరకు తాను పనికి పోతానని, అందులో తప్పేముందని భర్తను ఒప్పించి ఆమె పనులకు పోసాగింది. కొడుకుని ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టకూడదనుకుందో ఏమో, తల్లి కొద్ది రోజులకే కానరాని లోకాలకి వెళ్లిపోయింది. చిన్నప్పటి నుంచి తనకు అన్నీ అయిన అమ్మను కోల్పోవడం అతను తట్టుకోలేకపోయాడు. భార్య తల్లిలా ఓదార్చి అతనికి అమ్మ లేని లోటు తీర్చే ప్రయత్నం చేసింది. 
      అతని కొడుక్కి ఏడాది నిండింది. ఎదుగూ బొదుగూలేని సంసారంలో ఎలాంటి మార్పూ లేదు. ఆమెకి పనికి వెళ్లిన చోట యజమానుల, వాళ్ల కొడుకుల చొంగ కార్పుళ్లు, వికృత చూపులు, మాటలు, చేష్టలు భరించరానివిగా మారాయి. అయినా మనుసు చంపుకుని పనికి వెళ్లాల్సిన పరిస్థితి. 
      గానుగెద్దులాంటి జీవితానికి అలవాటుపడిపోయాడు అతను. కానీ ఆమె మదిలో ఏవో ఆలోచనలు. ఏదో ఒకటి చేసి బతుకు బండిని గాడిలో పెట్టాలని ఆశ. వేలు లక్షలు వెనకేయకపోయినా కనీసం పాచి పని నుంచి బైట పడే మార్గం కోసం అన్వేషించి... చివరికి ఆమె అతనికి ఒక ఆలోచన చెప్పింది. అది విని అతనికి నవ్వొచ్చింది. 
      ‘‘ఇదేమైనా సినిమా అనుకున్నావా? మన బతుకులింతే’’ అన్నాడు. కానీ, ఆమె పట్టు వదల్లేదు.
      ‘‘కొంత మంది జీవితాలనే సినిమాగా తీస్తారు. సినిమా రెండున్నర గంటలే ఉంటాది. అందుకే మనకది నమ్మలేనట్లు కనిపిస్తాది. కట్టపడితే జీవితంలో ఏదో ఒకటి తప్పక సాధించొచ్చు’’ అంది.
      ‘‘అయితే ఏం చేస్తావు?,మనది నష్ట జాతకం. అనుకున్నది జరక్కపోతే రెంటికీ చెడతాం. మరింత దిగజారిపోతాం’’ భయం వ్యక్తపరిచాడు.
      అతనికి ధైర్యం చెప్పింది. భార్య తీసుకున్న నిర్ణయం వల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అనే అనుమానం ఉన్నా, ఆమెను పనికి పంపడం మొదట్నుంచీ ఇష్టం లేని అతను ఆమె చేసే పనికి అడ్డు చెప్పలేదు. 
      ఆమె ఇంటి ముందు పొయ్యి వెలిగించి దోసెలు, ఇడ్లీలు వెయ్యసాగింది. ఓ వారం భయంగా, భారంగా సాగినా... నెల రోజులకు కొద్దిగా పుంజుకుంది వ్యాపారం. దాంతో సాయంత్రం బజ్జీలు, పకోడీలు లాంటివి వేయడం మొదలుపెట్టింది. నెలరోజులు పాచిపనికి పోయి ఒళ్లు హూనం చేసుకుంటే వచ్చే డబ్బు పది రోజుల్లో రావడంతో ఆమెకు మరింత ధైర్యం వచ్చింది. అతనికి ఆమె మీద నమ్మకం పెరిగింది. ఆ నమ్మకంతోనే వ్యాపారం ఇంటి ముందు నుంచి వీధి చివర బంకు వరకు వెళ్లింది. బంకులో టిఫిÆన్‌తో పాటు సిగరెట్లు, పిల్లల చాక్లెట్లు, బిస్కెటు,్ల కూల్‌ డ్రింకులు పెట్టడంతో వ్యాపారం పుంజుకుంది.
      చాలామంది సొంత ఆలోచనలు చేయరు. చేసేందుకు ధైర్యం చెయ్యరు. కొత్త దారిలో నడవడానికి భయపడతారు. కానీ, మరొకరి బాటలో నడిచేందుకు ముందుంటారు. ఇక్కడా అదే జరిగింది. ఆమెకు వస్తున్న ఆదాయం చూసి పక్కనే మరో బంకు వెలిసింది. ఆమె ఆదాయం పడిపోయింది. అతను బాధపడలేదు. విరక్తిగా నవ్వుకున్నాడు, తమ బతుకుల్లో సుఖపడే యోగం లేదని. ఆమె మాత్రం ధైర్యం కోల్పోలేదు. అంతటితో ఆగి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అదిగో ఆ రోజు ఆదివారం కావడం, అతను పనికిపోకుండా బంకు దగ్గర కూర్చోవడం, అతని స్నేహితుడు రావడం, వాళ్లలో ఆశలు రేపడం, దానికి వాళ్లు తలూపడం అంతా కలలాగా జరిగిపోయాయి. అదే అతని ప్రస్తుత దీన స్థితికి కారణమైంది.

*  *  *

      ‘‘గొర్రెదాటు నా కొడుకులు ఒకడు ఏది సేస్తే ఇంకోడు అదే సేయాలనుకుంటాడు. వాడు బాగుపడడు పక్కనోణ్ని బాగు పడ్నీడు. యాపారం సగానికి సగం పడిపోయినట్టుండాదే’’ బంకు దగ్గర కూర్చుని వేడి వేడి బజ్జీలు తింటూ స్నేహితుడు అన్న మాటలకు అతను నిరాశగా ‘‘ఒకర్నని ఏం లాభంలేరా. నా బతుకెప్పుడూ ఇంతేగా’’ అన్నాడు. 
      ‘‘ఎప్పుడు ఇంతే అన్నా ఈయన వరస. ఇప్పుడేమైనాది. కొద్దిగా యాపారం తగ్గినాది. యాపారమన్నాక పోటీ ఉంటాది. దానికే అంత ఇదైతే ఎట్టా. నాల్గిండ్ల పాచిపని సేసేదానికన్నా సొంత యాపారం జరిగిన కాడికి జరగనీ. బంకు మీద అప్పు తీరిపోయినాది. ఎక్కడా అప్పులేమీ లేవు. రోజుకు అయిదారు వందలు జరిగేది ఇప్పుడు ఏ మూడొందలో జరుగుతుండాది. సాలు. నెలంతా ఇంటింటికీ తిరిగి ఊడిగం సేసుకుంటే వచ్చేది వారం దినాల్లో వస్తుండాది. ఇంతకన్నా ఏం కావాలి’’
      ‘‘నువ్వు సెప్పేది సత్తెమే అమ్మి, సొంత యాపారం జరిగినకాడికి జరుగుతాది. ఎప్పుడూ మనకి కలిసి రాలేదని దిగులు పడితే ముందుకెట్టా పోతాం. నువ్వొచ్చినాక నీ దయిర్నంతో వీడి దశ తిరిగినాదిలే. అన్నట్టూ మీతో ఓ మాట సెప్పనేకి వచ్చి మరిసిపోయినా’’ అని, ఆమె వైపు నుంచి చూపులు అతని పక్కకి తిప్పి
      ‘‘అరే, నీకు డ్రైవింగ్‌ వస్తాదిగదా’’ అన్నాడు.  
      ‘‘ఆ వస్తాది.. అయితే ఏంది. నన్ను పని మానేసి ఏ లారీకో పొమ్మంటావా. అది నాకిట్టం లేదని నీకు తెలీదా ఏంది’’ తన పెళ్లాం ఎక్కడ వాడి మాటలు విని తనను లారీకి పొమ్మంటుందో అని అడ్డపుల్ల వేశాడు.
      ‘‘ఓర్నీ, నీ సంగతి నాకు తెలియదా ఏంది. నిన్ను డ్రైవరుగా ఎందుకు పొమ్మంటా. ఎంతకాలమని ఆ షావుకారు కాడ గాడిద చాకిరీ సేస్తావు. నువ్వూ యాపారంలోకి దిగితే మంచిదిగా. ఇప్పుడు మంచి టైమొచ్చినాది. నాకు తెలిసి ఆ యాపారానికి తిరుగులేదు. నాకు డ్రైవింగు రాదు. లేకుంటే నేనే ఆ పని సేసేటోణ్ని’’ అన్నాడు. 
      ‘‘ఏందన్నా నువ్వు సెప్పేది’’ అతని భార్య శనగపిండిలో మిర్చి ముంచి నూనెలో వేయబోతూ ఆగి, ఆసక్తిగా అడిగింది. 
      ‘‘వాడు ఏదో ఒకటి సెప్తావుంటాడులేవే. వాడి మాటలు వింటే అంతే’’ నీరుగార్చే ప్రయత్నం చేశాడు.
      ‘‘నేను సెప్పేది విన్నాక అది మంచిది కాకపోతే నీ సెప్పుతో కొట్టు, పడ్తా’’ తనను చులకన చేసి మాట్లాడే సరికి ఆవేశంగా అన్నాడా స్నేహితుడు. 
      ‘‘ఆయన మాటలకేంగానీ నువ్వు సెప్పన్నా’’ అంది ఆమె.
      ‘‘నా మీద నీకున్న నమ్మకం వాడికి లేదాయె. ఉట్టి మాటలు నేనెందుకు సెప్తా. సూస్తా సూస్తా నేను మిమ్మల్ని ఎందుకు సెడగొడ్తా. నాకేం ఒరుగుతాది అట్టా సేస్తే’’ అతను విషయం చెప్పకుండా మాట్లాడుతుంటే..
      ‘‘నువ్వు సెప్పన్నా. ఏం యాపారం అది’’ ఆమె నూనె ఎక్కువ కాగుతుంటే గ్యాస్‌ మంట తగ్గిస్తూ అడిగింది.
      విషయం చెప్పాడు అతని స్నేహితుడు. ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది. మరో ప్రశ్నకు అవకాశమివ్వకుండా అతను ఓపిగ్గా అంతా చెప్పుకొచ్చాడు. 
      ‘‘ఆ యాపారం సేసే ఆయన వాళ్ల రాష్ట్రానికి పోతుండాడని నిన్ననే సెప్పినాడు. యాపారం బాగా జరుగుతా ఉంటే ఎందుకు పోతుండావంటే ‘ఏం సేయనన్నా, పోక తప్పడంలే. అంత దూరం ఈ బండి పోవడానికి పనికిరాదు. అట్టాగని ఈణ్నే దీన్నిబెట్టి మళ్లీ వచ్చేదానికి కుదరడంలే’ అన్నాడు. ఆయన సేసే యాపారం ఏందంటే, ఉదయం ఎనిమిది తొమ్మదికల్లా దోసె, ఇడ్లీ, వడ, ఏస్తాడు. మధ్యాహ్నం అన్నం పప్పు సాంబారు ఆమ్లెట్లు ఏస్తాడు. సాయంత్రం మళ్లా ఇడ్లీ వడ దోసె బజ్జీలు.. మంచి సెంటర్లో బండి పెడ్తాడు. పోటీకూడా ఇంత దాకా ఎవరూ లేరు. ఖర్మకాలి ఆడ సరిగా జరక్కపోతే మనం సేసే యాపారం ఏ బంకులోనో కాదు గదా... వ్యానులో గదా. ఆడ ఒక్కసోటనే అని  ఏముంది. ఇంకోసోటకి తీసకపోయి పెట్టుకోవచ్చు. యాపారం అయిపోగానే నేరుగా బండిని ఇంటికాడ పెట్టుకుంటే సరిపోతాది. నువ్వు నమ్ముతావో నమ్మవో, వారం దినాల్లో కట్టపడేది ఒక్క దినంలో సంపాదించెయ్యొచ్చు. మీ దశ తిరుగుతాది. వ్యానాయన ఎట్టాగూ పోతుండాడు కాబట్టి వ్యానుతో పాటు, ఆయన కాడుండే సామాన్లు చీప్‌గా వస్తాయి. నా మీద నీకు నమ్మకం లేకపోతే రేపు నువ్వు వాడితో పాటు వచ్చి ఓ గంట ఆయన యాపారం సూస్తే తెలుస్తాది. వాడొక్కడే సేసే పనికాదు. నువ్వూ వాడి పక్కనే తోడుంటావు. కొద్ది దినాలు బంకు మూసేసి ఆడ యాపారం పెడ్తే సరి. అంతగా మీకు కలిసిరాకపోతే దాన్ని అమ్ముకునేకి సేతుల మీద అమ్ముడుబోతాది. రాత్రికి బాగా ఆలోచన సెయ్యి. మల్లా సెప్తుండా, రేపొద్దున ఓపారి కావాలంటే పోయి సూసిరా. సూసినాకనే నీకిష్టమైతేనే నేను సెటిల్‌ సేస్తా. ఇందులో నాకేమీ ఒరిగేది లేదు. మీరు బాగుంటే నాకు అవసరానికి పనికి రాకపోరా...’’ భర్త స్నేహితుని మాటలు ఆమెకు రాత్రంతా నిద్ర లేకుండా చేశాయి. ఆ మాటలు విని, సాఫీగా సాగుతున్న జీవితంలో మళ్లీ లేనిపోని కష్టాలు వస్తాయేమోనని అతను భయపడ్డాడు.
      ‘‘వాడి మాటలు నమ్ముతుండావా’’ అన్నాడు.
      ‘‘రేపు సూద్దాం. నిజమేందో తేలిపోతాదిగా’’ అంది.
      ‘‘అంటే, నేను పని మానేస్తే ఎట్టా. యాపారం సరిగా జరక్కపోతే మళ్లీ షావుకారు నాకు పని యాడిస్తాడు’’
      ‘‘పనెందుకు మానేస్తాం. షావుకారికి ఓ నెలరోజులు పనికి రాలేనని సెప్పు. అనుకున్నది అనుకున్నట్టు జరక్కపోతే మళ్లా నాకు బంకు తప్పదు నీకు ఆ పని తప్పదు’’
      మరుసటి రోజు ఓ అరగంట వ్యాపారం పక్కన పెట్టి అతణ్ని పిలుచుకుని పోయిందక్కడికి. అక్కడ జరిగే వ్యాపారం చూశాక కళ్లు తిరిగినంత పనైంది ఆమెకు. అతనికి కూడా అది కలా నిజమా అన్న సందిగ్ధంతో పాటు తాము అంత పని చేయగలమా అని సందేహం కూడా కలిగింది. ఆమెకు అది లాటరీ తగలబోతున్నంత ఆనందాన్నిచ్చింది. అప్పటికప్పుడే అతని స్నేహితుడి దగ్గరికి పోదామంది. అతను అడ్డు చెప్పలేదు.
      వ్యానుని అమ్మబోయే అతను దాన్ని ఆ ఊర్లోనే మరొకరి దగ్గర కొని నెలా నెలా కంతులు కడ్తున్నాడని, సగానికి పైగా కంతులు అయిపోయాయని, అతను కట్టిన కంతుల వరకు ఇచ్చి మిగిలినవి వాళ్లు కట్టుకుంటే సరిపోతుందని చెప్పాడు. వ్యాను పాత ఓనరుని కలిశారు. తనకు నెల నెలా కంతులు తప్పనిసరిగా కట్టాలని, లేకపోతే వ్యాను తీసుకుపోతానని అన్నాడు.
      బంకు పెట్టాక సంపాదించింది, తన అమ్మ దగ్గర అంతో ఇంతో తీసుకుని, అమ్మ, భర్త పూచీకత్తుతో మరికొంత అప్పు చేసి అతణ్ని ముందుకు నడిపించింది. మొదటి రోజు సంపాదన చూశాక వాళ్ల కళ్లు బైర్లు కమ్మాయి. వ్యాపారం అలాగే జరిగితే వారం రోజుల్లోనే వాళ్లిద్దరి నెల సంపాదన వచ్చేటట్టు అనిపించింది. అనిపించడమే కాదు వచ్చింది కూడా. తన దశ తిరిగిందని, ఇక వెనక్కి చూడాల్సిన అవసరం లేదనుకుంటూనే లోలోన ఏం ముంచుకొస్తుందోనని భయపడుతూనే ఉన్నాడు. రెండు నెలలు గడిచిపోయాయి.
      మూడో నెలలో వ్యాపారం బాగా జరిగే ఒక ఆదివారం కొవిడ్‌-19 వల్ల జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిసి కాస్తంత కంగారుపడ్డాడు. ఆ తర్వాత వెంటనే 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించారని తెలిసి మిన్ను విరిగి మీద పడట్టు తల్లడిల్లిపోయాడు. అతనికేమీ దిక్కుతోచలేదు. లాక్‌డౌన్‌ అంతటితో ముగియదని, మళ్లీ పొడిగిస్తారని వార్తలు వస్తుండటంతో భవిష్యత్తు అంధకారమైపోయినట్లు అనిపించింది. కాలు బైటకి పెట్టే వీలు లేకపోవడంతో, వ్యానుకు నెల నెలా కంతు ఎలా కట్టాలి? అప్పులవాళ్లకు వడ్డీలు ఎలా కట్టాలి? తమ తిండికి ఎలా సంపాదించుకోవాలి? లాక్‌డౌన్‌ ఎప్పటికి ఎత్తేస్తారో? ఆ తర్వాతైనా వైరస్‌ భయం వల్ల తన వ్యాపారం ఎలా జరుగుతుందో? ఆలోచన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, చావే తన సమస్యలకు పరిష్కారం అనుకున్నాడు. 

*  *  *

      బతికేందుకు ధైర్యం లేకపోయినా చచ్చేందుకు మనసు దిటవుచేసుకున్నాడు. శబ్దం చేయకుండా వెనక గదిలోకి వెళ్లి ఫ్యానుకు చీరకట్టి మెడకు తగిలించుకోబోతుండగా లైటు వెలిగింది! బిత్తరపోయాడు. లైటు వేసిన వ్యక్తిని చూసే సాహసం చెయ్యలేక స్టూలు మీద విగ్రహంలా నిలబడిపోయాడు. ఆమె అతని దగ్గరికొచ్చి బోరున ఏడుస్తుందనుకున్నాడు. ఆమెను ఎలా ఓదార్చోలో అర్థంకాక గుండెల్లోంచి దుఃఖం పెల్లుబుకుతుండగా అలాగే స్టూలు మీద కూలబడ్డాడు. ఆమె కదిలినట్లు అనిపించలేదు. 
      ఆమె ఏం చేస్తుందో... కొంపదీసి ఆమె మనసులో కూడా ఆలాంటి ఆలోచనే ఉందా... అనుకుంటూ తల వెనక్కి తిప్పి చూశాడు. కన్నీటి పొరలతో తనకేసి తీక్షణంగా చూస్తున్న ఆమెను చూడలేక వెంటనే తల దించుకుని, అలాగే ఆమె దగ్గరికి వెళ్లాడు. తనను గట్టిగా హత్తుకుని సాంత్వన పరుస్తుందనుకున్నాడు. కానీ దానికి విరుద్ధంగా అతని చెంప ఛెళ్లుమనిపించింది. అతను నిర్ఘాంతపోతుండగా అప్పుడు బల్లిలా అతణ్ని కరచుకుని, ‘‘ఏమైనాది. దీనికే చావాలా. నువ్వు చచ్చిపోతే మేం ఏమైపోవాలి’’ అంటూ బోరున ఏడ్వసాగింది. 
      కొద్ది సేపటికి తేరుకుంది. ‘‘నువ్వు దిగాలుగా ఉంటే ఏదో ఆలోచన సేస్తుండావనుకున్నా. కానీ, ఇంత పిచ్చి పని సేస్తావనుకోలే. చావడం గొప్ప పని అనుకుంటుండావా. సచ్చి సాధించడం గాదు బతకి సాధించాల. ఏ చెనంలో ఎప్పుడు సస్తామో తెలియక చీమ కాడ్నించి ప్రతి జీవి చావుతో పోరాటం సేస్తానే ధయిర్నంగా బతుకుతాది. అట్టాంటిది తెలివితేటలున్న మనిషిలా పుట్టి సావాలనుకునే వాణ్ని ఏమనుకోవాలా. అయినా ఇప్పుడేమైనాదని సావబోయినావు. లాక్‌డౌన్‌ కలకాలముంటాదా. ఉంటే ఉండనీ, ఈ దేశంలో మనమొక్కరమే ఉండామా. కష్టాలొచ్చినప్పడే మనిషి రాటు తేలేది. వ్యానుకు కంతులు కట్టకపోతే దాన్ని తీసకపోతారని, అప్పులోళ్లకు డబ్బులు ఎలా కట్టాలని, మనకు తిండీ తిప్పలు ఎట్టా అని కదా నీ భయం, బాధ. వ్యాను తీసకపోతే పోనీ. అయినా వ్యాను యాడికీ పోదు. మనం కంతులు కట్టాం. ఈ లాక్‌డౌన్‌ని సూసి వ్యాను తీసుకుని తప్పు సేసినామేమోనని నిన్నటి దాకా అనుకున్నా. కానీ, తప్పు సేయలా. అది తీస్కోని మంచి పనే సేసినాము’’ అంది. 
ఆ మాటలకు అతను ఆ దుఃఖంలోనూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. 
      ‘‘అవును. నాకు ఇందాకే ఒక ఆలోచన వచ్చినాది. నీకు పొద్దునే సెప్పాలనుకున్నా. నాకు మెలకువ వచ్చి సరిపోయినాది, లేకుంటే ఎంత పని జరిగిపోయేది’’ మళ్లీ దుఃఖంలో మునిగిపోయింది. 
      ‘‘తప్పు సేసా. నాకేం దిక్కుతోచలా’’ ఆమె చేతులు పట్టుకున్నాడు క్షమించమన్నట్లు. 
      ఆమె క్షమించేస్తున్నట్టు అతని చేతుల్లో ఒదిగిపోతూ, ‘‘మనకు వ్యానుతో లాక్‌డౌన్లో కూడా పని దొరికినట్లే. నిన్న మన రోడ్డు మీదకి కూరగాయలు, పండ్లు తీసుకోని తోపుడు బండి వచ్చినాది. దాన్ని సూసినాక నాకీ ఆలోచన వచ్చినాది. లాక్‌డౌన్‌ అయినా జనాలందరికీ కూరగాయలు, సరకులు కావాలగదా. పోలీసోళ్ల పర్మిషన్‌ తీసుకోని మన వ్యానును కూరగాయల బండిగా మార్చేసి నాలుగు వీధులు తిప్పితే మనకు యాపారం జరిగినట్టుంటాది, పది మందికి సాయం సేసినట్టుంటాది. టిఫిన్‌ సెంటరంత ఆదాయం రాకపోతే పోయే... గుడ్డిలో మెల్ల... లాక్‌డౌన్‌ ఎత్తేసేంత వరకు మనకు గడుస్తాది కదా. భయపడాల్సిన పనిలా’’ ఆమె మాటలు విన్నాక అతని ఆందోళనకు తెరదించినట్టైంది. 
      ‘‘అవును, ఈ ఆలోచన నాకు రానే రాలే’’ అంటూ ఆమె వైపు మెచ్చుకోలుగా చూస్తూ, ‘నా ఎనక నువ్వున్నంత వరకు నేను భయపడాల్సిన పనిలా’ అనుకున్నాడు. చీకటితో పోరాడి అలిసిపోయిన వీధిలైటుకు విరామమిస్తున్నట్టు అప్పుడే తూరుపున వెలుగు రేకలు విచ్చుకుంటున్నాయి.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


పాపమ్మ చెట్టు

పాపమ్మ చెట్టు

లోగిశ లక్ష్మీనాయుడు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోనిbal bharatam