నేనొచ్చాను!

  • 308 Views
  • 1Likes
  • Like
  • Article Share

    జొన్నలగడ్డ రామలక్ష్మి (వసుంధర‌)

  • హైదరాబాదు.
  • 9885620065

‘బెస్ట్‌ డిసిప్లిన్డ్‌ ఎంప్లాయీ’ పురస్కారం వెంకటయ్యకు ఇవ్వాలి. కానీ, అతను  ఆఫీసుకి సరిగా రాడు. అయినా ఇవ్వాలి! ఎలా ఇస్తారు! అసలు ఎందుకివ్వాలి?
‘‘మన కంపెనీకో సమస్యొచ్చింది. నీ సాయం కావాలి’’ అన్నాడు బాస్‌. 
      సాధారణంగా ఉండే దర్పం లేదాయన మాటల్లో. ఆర్డరు వెయ్యడమేగానీ, సాయమడగడం ఆయన తత్వం కాదు. 
      ‘‘చెప్పండి సర్‌!’’ అన్నాను. 
      ఏ విషయమూ సూటిగా చెప్పడం ఆయనకి అలవాటు లేదు. 
      ముందుగా నగరంలో ప్రముఖ రాజకీయవేత్త వరహాల్రావు ప్రస్తావన తెచ్చాడు. ఊళ్లో ఆయనకెంత పలుకుబడుందో, మా కంపెనీకి ఆయన అవసరం ఎంతుందో చెప్పాడు. ఆయన భార్య దూరపు బంధువు వెంకటయ్యకి వరహాల్రావు చలవతోనే డిగ్రీ వచ్చిందన్నాడు. ఆ తర్వాత వరహాల్రావు రికమెండేషను మీద వెంకటయ్యకి ఓ కంపెనీలో ఉద్యోగమొచ్చిందన్నాడు. 
      ‘‘ఆ వెంకటయ్య సంగతి నాకెందుకు చెబుతున్నారు సార్‌!’’ అన్నాను.
      ‘‘పూర్తిగా విను. నీకే తెలుస్తుంది’’ అంటూ ఆయన వెంకటయ్య గురించి మరికొన్ని వివరాలు చెప్పాడు. వెంకటయ్యకి బొత్తిగా క్రమశిక్షణ లేదుట. ఉద్యోగం వేయించాక వెంకటయ్య తిన్నగా ఆఫీసుకెళ్లేవాడు కాదుట. కానీ, రికమెండేషన్‌ కాండిడేట్‌ కాబట్టి అతణ్ని ఎవరూ ఏమీ అనేవారు కాదుట. అది గమనించిన మిగతా ఉద్యోగులు కొన్నాళ్లకు తామూ అతణ్ని అనుకరించడం మొదలెట్టారుట. వాళ్లని అదుపు చేద్దామంటే - ఎదురు తిరిగి, ముందు వెంకటయ్యను అదుపు చెయ్యమన్నారుట. చివరికి వరహాల్రావు మనిషని తెలిసి కూడా, అతణ్ని ఉద్యోగంలోంచి తీసేశారుట. 
      ‘‘ఆ వెంకటయ్యకి మన కంపెనీలో ఉద్యోగమివ్వాలి’’ అన్నాడు బాస్‌.
      మాట్లాడకుండా బుద్ధిగా వింటున్న నాకు విషయం అర్థమైంది. బాస్‌కి వెంకటయ్యంటే ఇష్టం లేదు. కానీ ఉద్యోగమివ్వక తప్పదన్న అసహాయత ఆయన గొంతులో ధ్వనిస్తోంది. అది నేను గుర్తించినా బయటపడకూడదు. బాస్‌ మనని స్మార్ట్‌ అనుకోవాలిగానీ, బాస్‌ ముందు మన స్మార్ట్‌నెస్‌ ప్రదర్శించకూడదని నాకు తెలుసు. వెంకటయ్యకి ఆయన ఉద్యోగమిస్తాడు. అతగాడు క్రమశిక్షణ పాటించడు. అయినా ఏమీ అనకూడదు. అతడి మీద చర్య తీసుకోకూడదు. పాత కంపెనీవాళ్లలా తీసెయ్యకూడదు. అలాంటప్పుడు మిగతా ఉద్యోగులు ఊరుకుంటారా? ఊరుకునేందుకు ఏదో ఒకటి చెయ్యాలి. ఆ చెయ్యాల్సింది నేనా?
      ‘‘ఒంటి చేతి మీద కంపెనీని నడిపిస్తున్నారు. ఈ విషయమై ఈపాటికే మీరేదో ఆలోచించే ఉంటారు’’ అన్నాను ఆరాధనా భావం నటిస్తూ. 
      బాస్‌ సంతోషపడ్డాడు, ‘‘తెలివైనవాడివి. నా గురించి అన్నీ ఇట్టే పట్టేస్తావ్‌! నువ్వన్నట్టే నేనీ సమస్యకు సులభమైన పరిష్కారం ఆలోచించాను’’ అన్నాడు.
      ‘వెంకటయ్యకి కంపెనీలో ఉద్యోగమిస్తారు. అయితే అతడు ఉద్యోగి అన్న విషయం రహస్యంగా ఉంచుతారు.  ఇష్టమైతే ఆఫీసుకొస్తాడు. లేనప్పుడు లేదు. వెంకటయ్య ఆఫీసుకొచ్చినప్పుడు, ఉద్యోగిలా కాక విజిటర్లా చూసుకోవాలి’ ఇదీ బాస్‌కి తోచిన పరిష్కారం. విని తెల్లబోయాను. కానీ అది బయటికి కనిపించకూడదు. మెచ్చుకోవాలి.
      ‘‘ఆసమ్, మైండ్‌ బ్లోయింగ్‌’’ అన్నాను టీవీ షోల్లో న్యాయనిర్ణేతల భాషని అనుకరిస్తూ.
      ‘‘కానీ ఇక్కడ ఇంకో సమస్య వచ్చింది’’ అన్నాడు బాస్‌.
      ‘‘వెంకటయ్య సుధ అనే అమ్మాయిని ప్రేమించాడుట. సుధ అతణ్ని ప్రేమించిందో లేదో కానీ - అతణ్ని పెళ్లి చేసుకుందుకు అయిష్టం లేదుట. కానీ ఓ అభ్యంతరం చెప్పింది. అది వెంకటయ్య క్రమశిక్షణా రాహిత్యం. ఆమెకు క్రమశిక్షణే ప్రాణం. ఆమె కోసం వెంకటయ్య క్రమశిక్షణ అలవర్చుకుంటానన్నాడు. ‘మాటిస్తే చాలదు. ఏదైనా ఓ కంపెనీలో చేరు.       ఏడాదిపాటు నిలకడగా పని చెయ్యి. ఆ ఏడాదిలోనే ‘బెస్ట్‌ డిసిప్లిన్డ్‌ ఎంప్లాయీ అవార్డు’ తెచ్చుకో అందిట సుధ. ఆ సుధ తెలివైందని నాకు తోచింది. ఆమెకు వెంకటయ్యంటే ఇష్టం లేదు. వదుల్చుకుందుకు కారణం వెదుకుతోంది. క్రమశిక్షణ పాటించడం అతడి వల్ల కాదని కచ్చితంగా తెలిసే ఆ షరతు పెట్టి ఉంటుంది. ఆమె షరతుకి ఎంతో కొంత విలువివ్వడం - బహుశా వెంకటయ్యకీ తప్పదనుకుంటాను’’ 
      బాస్‌ చెబుతున్నాడు, ‘‘వెంకటయ్యకి మన కంపెనీలో ఉద్యోగమివ్వగలను. అతడి క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించగలను. కానీ వాళ్లు కోరిన అవార్డెలా ఇస్తాను? ఇస్తే మన కంపెనీలో డిసిప్లెన్‌ ఏమైపోతుంది? ఈ విషయంలోనే నీ సాయం కావాలి’’ అన్నాడు బాస్‌.
      ఉరుమురిమి మంగలం మీద పడనే పడింది. బాస్‌ వెంటయ్యని నాకు అప్పగిస్తాడన్న మాట!
      నా తెలివంతా ఉపయోగించి, ఎలాగోలా అతణ్ని ‘బెస్ట్‌ డిసిప్లిన్డ్‌ ఎంప్లాయీ’ అవార్డుకి ఎంపిక చెయ్యాలి. అప్పుడు ఆఫీసులో నా పరిస్థితి ఏంటి? అలాగని అడిగితే, బాస్‌కి కోపమొస్తుంది. 
      ఓ క్షణం ఆలోచించాను. మనసులో సంకోచం ముఖంలోకి రాకుండా జాగ్రత్తపడ్డాను. 
      ‘‘నేనేంటో మీకు తెలుసు. నా సమర్థత కూడా మీరెరుగనిది కాదు. నా సాయం అవసరమనుకుంటే - నేనెలా సాయపడగలనో కూడా మీరే ఆలోచించి ఉంటారు’’ అన్నాను కొంచెం లౌక్యంగా.
      ‘‘వెరీ స్మార్ట్‌! నీ గురించి నాకు తెలిసినదానికంటే, నా గురించి నీకు తెలిసిందే ఎక్కువలా ఉంది - కరెక్టుగా ఊహించావు’’ అని మెచ్చుకున్నాడు బాస్‌.
      ఆయన మెచ్చుకుంటుంటే నా బెంగ పెరిగిపోతోంది - నా బాధ్యత మరింత కష్టం కావచ్చునేమోనని! 
      బాస్‌ మొదలెట్టాడు. ‘‘ఇలాంటి పరిస్థితే ‘డిజిట్‌ విజిట్‌’ కంపెనీకి కూడా వచ్చిందట. వాళ్లూ మనలాగే సంపత్‌ అనే ఓ నికమ్మాకి ఉద్యోగమిచ్చారుట. అక్కడేం జరిగిందోగానీ ఇంకో నాలుగు నెలల్లో - నికమ్మా సంపత్‌కి ‘యియర్స్‌ బెస్ట్‌ డిసిప్లిన్డ్‌ ఎంప్లాయీ’ అవార్డు రావచ్చని అక్కడి ఉద్యోగులే నమ్ముతున్నారుట.
      ‘‘ఇదెలా జరిగిందో ఆరా తియ్యాలి’’ అన్నాడు బాస్‌. 
      సంపత్‌కి ఫ్రెండునంటూ నేను డిజిట్‌ విజిట్‌ కంపెనీకి వెళ్లాలిట. దాంతో నన్నక్కడ అందరూ వీఐపీలా చూసే అవకాశం కూడా ఉందిట.
      ‘‘సంపత్‌కి సంబంధించి మనకి ముఖ్యమనిపించే వివరాలన్నీ ఆరా తియ్యి. అక్కడ నీకు తెలిసిన విషయాలేవీ నాతో తప్ప ఇతరులతో పంచుకోకూడదు’’ అన్నాడు బాస్‌.
      ‘‘మరి వెంకటయ్యకి కూడా డిజిట్‌ విజిట్లోనే ఉద్యోగం ఇప్పించొచ్చుగా’’ అన్నాను.
      ‘‘ఆ కంపెనీ వరహాల్రావు ప్రత్యర్థులది. వాళ్లు చేసింది నువ్వు చెయ్యలేవా అని నన్నాయన సవాలు చేశాడు. వెంకటయ్యని చేర్చుకుని, అవార్డు ఇప్పించడం - మనకిప్పుడు అవసరమే కాదు, ప్రిస్టీజ్‌ క్వెశ్చన్‌ కూడా’’ అన్నాడు బాస్‌.
      డిజిట్‌ విజిట్‌ కంపెనీకి వెళ్లాను. రిసెప్షనిస్టుని కలుసుకున్నాను. నేను నా గురించి అసలు వివరాలు చెప్పలేదు. సంపత్‌ గురించి అడిగి, ‘‘వాడు నా ఫ్రెండు. ఓసారి కలుసుకుని మాట్లాడాలి. ఆఫీసుకొచ్చాడా?’’ అన్నాను.
      సంపత్‌కి అక్కడెంత గౌరవముందో తెలుసుకుందుకు - అప్పుడా రిసెప్షనిస్టు మొహం చూస్తే చాలు!
      సంపత్‌ని ‘వాడు’ అన్నానుగా, అతడు చాలా వినయంగా మొహం పెట్టి, ‘‘సంపత్‌ గారు ఆఫీసుకి రాకపోవడమా? మిన్ను విరిగి మీదపడ్డా ఆయన ఆఫీసు మానరు’’ అన్నాడు.
      ‘‘థాంక్స్‌ ఫర్‌ ది ఇన్ఫర్మేషన్‌! వాణ్ని అర్జంటుగా కలుసుకోవాలి - పిలుస్తారా?’’ అడిగాను.
      ‘‘ఆయనకి విజిటర్సుని కలుసుకోవడం ఇష్టముండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనని డిస్టర్బ్‌ చెయ్యకూడదని మాకు స్ట్రాంగ్‌ ఇన్‌స్ట్రక్షన్సున్నాయి. మీరు అతడితో క్లోజ్‌ కాబట్టి - లోపలికెళ్లి కలుసుకోండి’’ అన్నాడతను.
      ‘‘వాడు ఏ సెక్షన్లో పని చేస్తున్నాడు?’’అడిగాను.
      ‘‘అతడిది కన్సల్టెంట్‌ జాబ్‌. ఈ సెక్షనూ ఆ సెక్షనూ అని లేదు. ఎక్కడైనా ఉండొచ్చు. ముందు అడ్మినిస్ట్రేషన్లో ట్రై చెయ్యండి’’ అన్నాడు రిసెప్షనిస్టు. 
      ముందు - అన్నాడంటే - ఇంకా చాలా చోట్ల ట్రై చెయ్యాలేమో అనుకుంటూ - ఆ సెక్షనుకి వెళ్లాను.
      సంపత్‌ ఫ్రెండునని తెలియగానే, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసరు కూడా రిసెప్షనిస్టంత వినయంగా మొహంపెట్టి, ‘‘ఆయన పేరు వినడమేగానీ నేనెప్పుడూ చూడలేదు. మనిషికి బాగా మొహమాటమట. ఆయన చూడాల్సిన ప్రోబ్లమ్సుంటే - పెద్ద బాస్‌ రూంకి పంపిస్తాం. వాటికి సొల్యూషన్సున్న ఫైల్సు సంపత్‌ సంతకంతో తిరిగొస్తాయి. సమస్య ఎంత జటిలమైనా, బ్యూటిఫుల్‌ సొల్యూషన్స్‌ ఇస్తాడతను’’ అన్నాడు.
      ‘‘అంటే వాణ్ని చూడాలంటే పెద్ద బాస్‌ రూంలో ఉంటాడన్న మాట!’’ అన్నాను.
      ‘‘అలా చెప్పలేను. ముందోసారి అకౌంట్‌ సెక్షన్లో కూడా ట్రై చెయ్యండి’’ అన్నాడు. 
      సంపత్‌ అకౌంట్‌ సెక్షన్లో లేడు. స్టోర్స్‌ సెక్షన్లో లేడు. పర్చేజ్‌ సెక్షన్లో లేడు. 
      చిత్రమేమిటంటే ఏ సెక్షన్లో వాళ్లూ ఆ రోజు అతణ్ని ఒక్కసారైనా చూసినట్టు చెప్పలేదు.
      ‘‘ఆయన పెద్ద బాస్‌ని బాగా ఇంప్రెస్‌ చేశాడు. అంత తొందరగా ఎవరి పనికీ అంతగా ఇంప్రెసవని పెద్ద బాస్, సంపత్‌ని పదే పదే పొగిడి - అతణ్ని ఆదర్శంగా తీసుకోవాలని మాకు చెబుతుంటారు’’ అన్నాడో ఎంప్లాయీ.
      చివరికి కంప్యూటరు సెక్షనుకి వెళ్లాను. అక్కడా అతను లేడు.
      ‘‘ఆయనో ఇంట్రావర్టు. ఎవర్నీ కలవడానికి ఇష్టపడడు. బాస్‌ తన ఛాంబర్లోనే చిన్న పార్టిషన్‌ చేసి, దాన్ని సంపత్‌కి కేటాయించాడు. ఆయన అక్కడే ఉండి పనిచేస్తాడు’’ అన్నాడో ఉద్యోగి. 
      ‘‘అంతవరకూ బాగానే ఉందిగానీ - ఆ ఛాంబర్లోకి వెడుతున్నప్పుడైనా మీరెవరూ వాణ్ని చూడలేదా?’’ అన్నాను ఆశ్చర్యంగా. 
అప్పుడు నేను విన్న విశేషం నాక్కూడా సంపత్‌ మీద గౌరవాన్ని పెంచేసింది. 
      సంపత్‌ ఆఫీసుకి అందరికంటే చాలా ముందొచ్చేసి, తన గదిలోకి వెళ్లి కూర్చుంటాట్ట. ఆఫీసులో ఉన్నంత సేపూ తన పనిలో మునిగిపోయి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటాట్ట. అలాగని తొందరగా ఆఫీసు విడిచిపెట్టడు. అందరూ వెళ్లిన తర్వాతే వెడతాట్ట.
      ‘‘అతగాడికి పెళ్లయిందో లేదో, కుటుంబముందో లేదో తెలియదు. కానీ అతడికి ఆఫీసే జీవితం. మాకంటూ వేరే జీవితమున్న మేము అతడితో ఎలా పోటీ పడగలం! టైంకొస్తాం. టైంకి వెళ్లిపోతాం, పని శ్రద్ధగా చేస్తాం కానీ, మధ్యలో టీకీ, లంచికీ బ్రేకులు అవసరం. అందుకే బాస్‌ అతడి డిసిప్లిన్‌ గురించి పొగిడితే విని ఊరుకుంటామే తప్ప అనుసరించాలనుకోం’’ అన్నాడతను.
      ‘‘మీలో ఎవరూ ఈ రోజు వాణ్ని ఆఫీసుకి వస్తుండగా కానీ, అంతకు ముందు ఆఫీసు నుంచి వెడుతుండగా కానీ చూడలేదు. అంతెందుకూ, అసలు మనిషినే చూడలేదు. అసలింతకీ వాడు ఆఫీసుకొచ్చినట్టు రుజువేంటి?’’ అన్నాను అనుమానంగా.
      నా అనుమానం విని అతడు నొచ్చుకుంటాడనుకున్నాను. కానీ వెంటనే, ‘‘నిజమే! అలాంటనుమానం మీకే కాదు, మా ఆఫీసులో ప్రతి ఒక్కరికీ ఉండేది. అది సహజం కూడా!’’ అన్నాడు. 
      అయితే ఆ అనుమానం ఇప్పుడు లేదుట. ఎందుకంటే - సంపత్‌ ఆఫీసులో చేరడానికి ముందు అక్కడ ఉద్యోగుల రాకపోకలను తెలుసుకుందుకు పంచ్‌ కార్డ్‌ సిస్టం ఉండేదట. సంపత్‌ జాయినైన పది రోజులకే బాస్‌ అటెండెన్సు ప్రొసీజరు మార్చాట్ట. పంచ్‌ కార్డ్‌ సిస్టం పోయి సంతకాలు చెయ్యడానికి అటెండెన్సు రిజిస్టరు పుస్తకం వచ్చింది. 
      ఆఫీసుకి వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు - ఉద్యోగులు అటెండెన్స్‌ రిజిస్టరులో సంతకం పెట్టి టైం వెయ్యాలి.
      ‘‘అప్పట్నించీ మేమెంత పెందరాళే వచ్చినా అప్పటికే రిజిస్టర్లో సంపత్‌ సంతకముంటుంది. ఎప్పుడైనా మేం లేటుగా వెళ్లొచ్చు. కానీ సంపత్‌ డిపార్చర్‌ టైమెప్పుడూ మా తర్వాతే ఉంటుంది. వియ్‌ రియల్లీ అడ్మైర్‌ హిమ్‌’’ అన్నాడతడు. 
      నాకు అర్థమయింది. ఆ ఆఫీసులో అవార్డు కొట్టడం సంపత్‌ ఆశయం. అందుకని అతడు అడ్డదార్లు తొక్కలేదు. తను ఆఫీసుకి పూర్తిగా అంకితమైపోయాడు. ఆ విషయం ఆఫీసు మొత్తం తెలుసు. అందుకే వారందరికీ అతడంటే గౌరవం. 
      సంపత్‌ రహస్యం నాకు తెలిసింది. 
      నా బాస్‌ చెప్పిన మాటల్ని బట్టి మా వెంకటయ్య ఈ లెవెల్లో సహకరిస్తాడనుకోను! అందువల్ల నేను సేకరించిన సమాచారంవల్ల బాస్‌కి పెద్దగా ప్రయోజనముండదని అర్థమైంది. అయితే - నికమ్మాగా ముద్రపడ్డ సంపత్‌ ఒక్కసారిగా ఇంతలా ఎలా మారిపోయాడు? ఆ రహస్యం తెలుసుకుంటే - వెంకటయ్యని మార్చడం కూడా సాధ్యమౌతుందేమో! 
అంటే నేనొక్కసారి సంపత్‌ని కలుసుకుని మాట్లాడాలి.
      ప్రేమ ఫలించాలంటే అడ్డదారులుండవన్న విషయాన్ని - సంపత్‌ చేతనే వెంకటయ్యకి చెప్పిస్తే ప్రయోజనం ఉంటుందేమో - అనిపించింది. పెద్ద బాస్‌ గదికి వెళ్లాను. నన్ను నేను సంపత్‌కి క్లోజ్‌ ఫ్రెండుగా పరిచయం చేసుకున్నాను.
      ‘‘మా సంపత్‌ మీ కంపెనీలో చేరి ఇంత మంచి పేరు తెచ్చుకోవడం నాకెంతో గర్వంగా ఉంది’’ అన్నాను.
      ‘‘సంపత్‌ మన దేశంలో ఉద్యోగులందరికీ గొప్ప ప్రేరణ. అతడు మా కంపెనీ ఉద్యోగి కావడం మాకు గర్వకారణం. ఈ ఏడాది అతడికి ‘ఇయర్స్‌ బెస్ట్‌ డిసిప్లిన్డ్‌ ఎంప్లాయీ’ అవార్డు వస్తుందనుకుంటున్నాం. అది అతడికి కాదు. ఆ అవార్డుకే పెద్ద గౌరవం’’ అన్నాడు డిజిట్‌ విజిట్‌ పెద్ద బాస్‌.
      ‘‘మీరు అనుమతిస్తే నేనోసారి వాణ్ని కలుసుకుని మాట్లాడాలనుంది’’ అన్నాను.
      ‘‘ఆఫీసు టైంలో ఎవర్నీ కలుసుకోవడం సంపత్‌కి ఇష్టముండదు’’ అన్నాడు పెద్ద బాస్‌.
      ఆయన మొహం చూస్తే - నేను సంపత్‌ని కలుసుకోవడం తనకే ఇష్టం లేనట్టుంది.
      ‘‘మీరు ఏమీ అనుకోకుంటే ఒక్క మాట! వాడి గురించి నాకు బాగా తెలుసు. క్రమశిక్షణంటేనే వాడికి పడదు. ఎటొచ్చీ వాడికి పొలిటికల్‌ కనెక్షన్లున్నాయి. అందుకని వాడు ఆఫీసుకి రాకపోయినా మీరు వాణ్ని కవర్‌ చేస్తున్నారని నా అనుమానం. అది నివృత్తి కావడానికైనా ఒక్కసారి వాణ్ని కలుసుకునే అవకాశమివ్వండి’’ అన్నాను. 
      పెద్ద బాస్‌ నవ్వాడు, ‘‘మీ అనుమానంతో నాకేం నిమిత్తం లేదు. కానీ, అన్నారు కాబట్టి ఓ మాట చెబుతాను. సంపత్‌ ఆఫీసుకొచ్చాడనడానికి తిరుగులేని రుజువొకటుంది. అదే అటెండెన్సు రిజిస్టర్‌’’ అన్నాడు.
      ‘‘ఒక ఉద్యోగి ఆఫీసుకొచ్చాడో లేదో తెలుసుకుందుకు- ఆ మనిషి కనబడక్కర్లేదా? రిజిస్టర్లో సంతకముంటే చాలా?’’ అన్నాను కొంచెం వ్యంగ్యంగా.
      ‘‘సంతకాలు గాల్లోంచి ఎగిరిరావు. మనిషి స్వయంగా పెట్టాలి. అందుకే మరి తిరుగులేని రుజువయింది. మీ సంగతి నాకు తెలియదుగానీ, మా ఆఫీసు స్టాఫంతా ఆ రిజిస్టర్ని నమ్ముతారు’’ అన్నాడు.
      ‘‘నేనోసారి ఆ రిజిస్టరు చూడొచ్చా?’’ అన్నాను ఏమనాలో తెలియక.
      ‘‘ష్యూర్‌’’ అంటూ - పెద్ద బాస్‌ తన డ్రాయరు సొరుగు లాగి ఓ పుస్తకం తీసి నా ముందుకి విసిరాడు.
      పుస్తకం అందుకున్నాను. పేజీలు తిరగేస్తూ సంతకాలున్న చివరి పేజీకి వచ్చాను. చూస్తుంటే నా కుతూహలం ఆశ్చర్యంగా మారింది, ‘‘అరే, ఈ రోజు ఆఫీసులో స్టాఫ్‌ చాలామందే కనిపించారు. మరి ఇందులో సంపత్‌ ఒక్కడి సంతకం ఉందేమిటి? మిగతావాళ్లు ఈ రోజింకా సంతకాలు పెట్టలేదా?’’ అన్నాను.
      ‘‘అలా ఎందుకుంటుంది? ఏదీ నన్ను చూడనివ్వండి’’ అంటూ ముందుకి వంగి ఆ పుస్తకం అందుకుని తనూ చూశాడు. తర్వాత ఒక్క నిమిషమాగి, ‘‘అదీ సంగతి! మీరు చూసిన పేజీ ఈ రోజుది కాదు, రేపటిది’’ అనేసి నాలిక్కరుచుకున్నాడు. 
      ఉలిక్కిపడ్డాను. ఒక్కసారిగా చాలా సందేహాల మబ్బులు తేలిపోయాయి.
      వాటితో పాటు చాలా విషయాల్లో సంపత్‌ని కవర్‌ చేసుకుంటూ వస్తున్న పెద్ద బాస్‌ ఉన్నట్టుండి నోరెందుకు జారాడన్న సందేహానికి కూడా జవాబు స్ఫురించింది నాకు.
      పెద్ద బాస్‌కి నేనెవరో, ఎందుకొచ్చానో మా బాస్‌ ముందే చెప్పి ఉంటాడు. సంపత్‌ అటెండెన్సు గురించిన అసలు నిజం కావాలనే నాకు చెప్పాడా? అది ఫోన్లో చెప్పే విషయం కాదని - ఇలా నోరు జారినట్టు నటించాడా? 
      నేనిక సంపత్‌ని కలుసుకుంటానని గట్టిగా అడగలేదు. ఆఫీసులో లేని వ్యక్తిని, అసలు ఆఫీసుకే రాని వ్యక్తిని నేను కలుసుకునేదెలా? 
      తిరిగి వెళ్లి మా బాస్‌కి చెప్పాను, ‘‘మీరు వెంకటయ్యని ఉద్యోగంలో చేర్చుకోవాలంటే మన ఆఫీసులో కూడా ఓ అటెండెన్సు రిజిస్టరు ప్రారంభించాలి. బాగా పలుకుబడి ఉన్నవాళ్లు మనకి సహోద్యోగులైతే - వాళ్లు ఆఫీసుకి రానక్కర్లేదు. అటెండెన్సు రిజిస్టర్లో సంతకముంటే చాలు - ‘నేనొచ్చాను’ అనడానికి అంతకు మించిన రుజువుండదు’’ అని నా పరిశోధనా ఫలితాన్ని క్లుప్తంగా అందజేశాను.
      బాస్‌కి అది తెలియకనా?
      అమలు చేసే బాధ్యత నాది కాబట్టి - అటెండెన్సు రిజిస్టరు నిర్వహణ ఎలా ఉండాలో, దాని ప్రభావం ఎలా ఉంటుందో - ఫస్ట్‌ హ్యాండ్‌ ఇన్ఫర్మేషను కోసం నన్నక్కడికి పంపించాడని నాకు అర్థమౌతోంది.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


పాపమ్మ చెట్టు

పాపమ్మ చెట్టు

లోగిశ లక్ష్మీనాయుడు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోనిbal bharatam