అంబులెన్స్‌

  • 331 Views
  • 52Likes
  • Like
  • Article Share

    ఆనంద్‌ కార్తిక్‌

  • మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్,
  • లక్సెట్టిపేట, ఆదిలాబాదు
  • 9701542404
ఆనంద్‌ కార్తిక్‌

తెగిన గాలిపటం లాంటి జీవితానికి దొరికిన రెండు ఆధారాలనూ పోగొట్టుకున్న నిర్భాగ్యుడు ఆ కుర్రాడు. కొత్త ఆధారాన్ని వెతుక్కునే క్రమంలో అనుకోకుండా అతనో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ దార్లో అతనికి ఎదురైన అనుభవాలేంటి? చివరికవి అతన్ని ఎక్కడికి చేర్చాయి?
మన జీవితం మీద మనకే జాలి కలిగితే అంతకంటే దారుణమైన అనుభూతి ఇంకోటి ఉండదేమో.. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. పాతికేళ్ల నా జీవితంలో ఏం సాధించానో నాకే తెలియట్లేదు. ఈ ప్రయాణంలో మొదటి పదేళ్లు ఎక్కడ ఉన్నానో, ఏం చేశానో కూడా గుర్తులేదు. నాకు తెలిసిన నా జీవితం ఓ జీప్‌ క్లీనర్‌గా మొదలైంది.. అప్పట్లో నాకు పది పదకొండేళ్లే ఉంటాయేమో!
      ఆకలితో పొట్ట పట్టుకుని మంచిర్యాలంతా తిరుగుతున్న నన్ను, తను నడిపే మహీంద్రా కమాండర్‌ జీప్‌కు క్లీనర్‌గా తీసుకున్నాడు సలీం కాకా. అప్పటి నుంచి ఆ జీపే నా సర్వస్వం. అదే నా ఇల్లు. పొద్దున్నే ఏడింటి కల్లా అన్ని పనులూ బస్టాండ్‌లో పూర్తిచేసుకుని, జీప్‌ వెనక సీట్‌ కింద సంచిలో ఉండే బట్టలు వేస్కోవాలి. అవీ కాకా కొనిచ్చినవే. తర్వాత మియాభాయి హోటల్లో కాస్త తిని, జీప్‌ అంతా శుభ్రం చేయాలి. తర్వాత కాకా రాగానే జీప్‌ ముందు నిల్చొని ‘ఆదిలాబాద్‌ ఆదిలాబాద్‌’ అని అరవడం.. అలా రోజుకు ఓ రెండు ట్రిప్పులు వేయడం.. వెళ్లొచ్చేటప్పుడు జీప్‌ వెనక వేలాడటం అన్నీ అలవాటైపోయాయి.  
      అలాంటి నా జీవితానికి అప్పట్లో ఒకటే లక్ష్యం... స్టీరింగ్‌ ముందు కూర్చోవాలి. ఆ పట్టుదలతో మూడేళ్లలో కాకాకే నచ్చేంత డ్రైవర్నయ్యాను. పద్దెనిమిది ఏళ్లు నిండాక ఆయనే లైసెన్స్‌ ఇప్పించాడు. ఊరూపేరూ లేని నాకు ‘రాజు’ అని పేరుపెట్టి, ఉన్నంతలో నాకు కాస్త తినిపించి పని నేర్పించిన కాకా ఓ ప్రమాదంలో చనిపోయాడు. ఆ రోజు నేను చిన్న గాయాలతో బయటపడ్డాను. కానీ, సలీం కాకా లేని జీవితం మొదటిసారి బాధ అంటే ఏంటో చూపించింది.
      తర్వాత ఊళ్లో బాగా పేరున్న ఓ నాయకుడి కారు డ్రైవర్‌గా పనిదొరికింది. నిజానికి అతని దగ్గర పని చేయడం నాకిష్టం లేదు. కానీ, బతకడానికి తప్పలేదు. అతను మనిషి కాడన్న విషయం పనిలో చేరిన కొన్ని రోజులకే తెలిసింది. అతను వచ్చాక గోదావరిలో ఇసుకపోయింది. రియల్‌ ఎస్టేట్‌ లొల్లి మొదలైంది. అప్పుడే మా ఎమ్మెల్యే ఓ ముసలాయన జాగా మీద కన్నేశాడు. దొంగ పట్టాలతో తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. పాపం... ఆ పెద్దమనిషి ఇంటికి వచ్చి ఏడిస్తే బయటికి గెంటేయించాడు. అయిదేళ్ల నుంచి పనిచేస్తున్నానన్న చొరవతో ‘‘పాపం సార్‌’’ అన్నాను. ఆ ఒక్కమాçతో నా ఉద్యోగం ఊడిపోయింది. ‘‘నాకే నీతులు చెప్తావా...’’ అంటూ అమ్మానాన్నలెవరో తెలియని నా పుట్టకను అతను గేలిచేయడంతో ఎక్కడో బాధ అయింది. బయటికొచ్చాక ఎక్కడా పనిదొరకలేదు. లాభం లేదని గోదావరిఖనిలో ఉండే వజీర్‌ దగ్గరికి వచ్చేశాను.
      వజీర్‌ నా చిన్ననాటి దోస్తు. అప్పట్లో తను ఇంకో జీప్‌ క్లీనర్‌. ఇప్పుడిక్కడ  ప్రైవేట్‌ అంబులెన్స్‌ నడుపుతున్నాడు. తన గదిలో ఉంటూ పని వెతుక్కుంటున్నాను. అలా నెల రోజులు గడచిపోయాయి.

***

      వజీర్‌ ఒళ్లు కాలిపోతోంది. అయినా, హైదరాబాదు బయల్దేరుతున్నాడు. ‘‘ఇంత జ్వరంతో వెళ్లడం అవసరమా’’ అన్నాను. ‘‘తప్పదు’’ అన్నాడు. ‘‘అయితే, నీ బదులు నేను వెళ్తా’’ అన్నాను. ‘‘రేయ్‌... మీ నాయకుడితో కలిసి కార్లో వెళ్లడం కాదిది... చనిపోయిన మనిషితో వెళ్లడం’’ అంటూ నవ్వాడు వాడు. ‘‘దాని కన్నా ఇదే నయం’’ నేనూ నవ్వుతూ అన్నాను.

***

 

      దవాఖానా మార్చురీ దగ్గర వజీర్‌ వేరే మనిషితో మాట్లాడుతున్నాడు. నేను దూరంగా వేపచెట్టు కింద సిగరెట్‌ తాగుతూ, ఏదో ఆలోచనలో పడిపోయాను. ఇంతలో ఒక్కసారిగా అంబులెన్స్‌ సైరన్‌ వినిపించడంతో వెనక్కి చూశాను. లోపల వజీర్‌. రమ్మని సైగ చేస్తున్నాడు. పక్కసీట్లో కూర్చోగానే బండి తీశాడు. ఊరు దాటాక రోడ్డు పక్కగా ఆపాడు.
      ‘‘రాజూ జాగ్రత్త రా... గాంధీ మార్చురీకి వెళ్లు. అక్కడ కనకయ్య అని ఉంటాడంట, బాడీ తీసుకుని పదివేలు ఇస్తాడు’’ అన్నాడు వజీర్‌.
      ‘‘సరే.. నువ్వు మందులు వేస్కో.. ఇంట్లో దించి వెళ్లనా...’’
      ‘‘ఇప్పటికే ఆలస్యమైంది... ఈ చిన్న జ్వరం నన్నేం చేయదు.. బయల్దేరు... అన్నట్టు నీకు సెల్‌ఫోను లేదుగా... అక్కడికి చేరాక నువ్వే నాకు ఫోన్‌ చెయ్యి’’ అన్నాడు వజీర్‌. ‘‘సరే’’ అని డ్రైవర్‌ సీట్లో కూర్చున్నాను. గోదావరిఖని నుంచి హైదరాబాద్‌ 200 కిలోమీటర్లు. అయిదు గంటల్లో వెళ్లిపోవచ్చు. అంటే మధ్యాహ్నం ఒంటిగంట కల్లా అక్కడ ఉంటాను. బండి తీసే ముందు ఒక్కసారి తలతిప్పి చూశాను... వెనక తెల్లటి గుడ్డలో శవం. జీవితంలో మొదటిసారి ప్రాణం లేని మనిషితో ప్రయాణం..

***

      దార్లో ఆంజనేయస్వామి గుడి దగ్గర అంబులెన్స్‌లోంచే దండం పెట్టాను. ఆయన్ను కోరింది ఏమీ లేదు ఇంతవరకు. కానీ, ఎప్పటికైనా నాకో మంచి దారి చూపిస్తాడని ఓ నమ్మకం.
      మారుతీ ఒమ్నీ తెల్లబండి... డ్రైవర్‌ సీట్‌ పక్కన ఇంకో సీట్‌... వెనక రెండు పొడుగు సీట్లు. ఒకదానిలో శవం.. రెండోది ఖాళీ. ఈ ప్రయాణమేంటో కొత్తగా ఉంది. భయం లేదు కానీ ఒంటరిగా అనిపిస్తోంది.  ‘సాధారణంగా హైదరాబాదు దవాఖానాల్లో ఎవరైనా చచ్చిపోతే అంబులెన్సులో ఊరికి తీసుకొస్తారు. ఇదేంటి మరి! ఓ శవం ఊరి నుంచి హైదరాబాదు పోవడం?’
ఇదే ప్రశ్న వజీర్‌ని అడిగాను. ‘‘చనిపోయాక తన శరీరాన్ని అవేవో పరిశోధనలకు వాడుకోవాలని రాసిపెట్టాడట ఈ పెద్దమనిషి. అందుకే దవాఖానా వాళ్లే అతని బాడీని హైదరాబాదు పంపుతున్నారు’’ అన్నాడు.
      ‘‘గొప్పోడు..’’ అనుకున్నాను.
      మళ్లోసారి వెనక్కి చూశాను. తెల్లబట్ట అంతా కప్పి ఉంది. ఆ వ్యక్తి మీద గౌరవం పెరిగింది.

***

      నల్లటి హైవే మీద తెల్లటి బండి.. ఇరవై కిలోమీటర్లు దాటాను. రోడ్డు మీద నా బండి ఒక్కటే పోతోంది. అప్పుడప్పుడు ఏవో కొన్ని బైకులు కనిపిస్తున్నాయి. లారీ, బస్సు, ఆటోల్లాంటివి ఏవీ తిరగట్లేదు. హైదరాబాద్‌ హైవే ఇలా ఉండటం ఆశ్చర్యం!!
      దూరంగా ఓ పదిమంది చెయ్యి ఊపుతున్నారు లిప్ట్‌ కోసం.. నాక్కూడా సోపతి ఉంటారు కదా అని వాళ్ల దగ్గర ఆపాను. అప్పటిదాకా ఏదైనా బండి వస్తే వెళ్దాం అనుకున్నవాళ్లు, ‘‘ఇది అంబులెన్స్‌... లోపల శవం ఉంది’’ అనగానే దూరంగా పోయారు. నవ్వొచ్చింది నాకు. ‘‘బస్సులు, లారీలు తిరగట్లేదేంటి?’’ అని అడిగాను. ‘‘నీకు తెల్వదా... రాష్ట్ర బంద్‌’’ అన్నారు. ‘‘అవునా..’’ అనుకుంటూ బండిని ముందుకు కదిలించాను.
      కరీంనగర్‌ దాకా ఒక్కడు కూడా నా బండి ఎక్కలేదు. అత్యవసరం అని ఏడుస్తున్నారు కానీ రావట్లేదు. ఒకడు ప్రభుత్వాన్ని తిడతాడు. ఇంకొకడు బందు చేసేవాళ్లను తిడతాడు. అంతే తప్ప ఎవరూ నా బండిలో కాలుపెట్టట్లేదు. ఇక మిగిలిన 132 కిలోమీటర్లూ ఒంటరి ప్రయాణం తప్పదనుకుంటా!

***

      కరీంనగర్‌ దాటి ఓ కిలోమీటరు వెళ్లగానే రోడ్డు మీద ఓ వంద మంది వరకూ బైఠాయించారు. ఓ అరగంట తర్వాత ఎవరో మహానుభావుడు ‘‘అంబులెన్స్‌ అనుకుంటా’’ అంటూ దారి ఇప్పించాడు. సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి... ఇరవైరెండేళ్లు ఉంటాయేమో... పరిగెత్తుకుంటూ వచ్చింది. ‘‘అర్జెంటుగా హైదరాబాదు వెళ్లాలి’’ అంది. ‘‘వెనక శవం’’ అన్నాను. ‘‘పర్లేదు... మీరు ఉన్నారు కదా’’ అంటూ పక్కసీట్లో కూర్చొంది.
      కాస్త చామనఛాయగా ఉన్నా అందంగా ఉంది తను. ఒకపక్క ఆనందం, ఇంకోపక్క ఆశ్చర్యంతో అడిగాను... ‘‘శవం అనగానే చాలామంది భయపడిపోయారు... మరి నువ్వు...’’ అని.
      ‘‘ఏముంది.. అందరం శవాలం కావాల్సిందే కదా! రేపు పొద్దున్నే ఇంటర్వ్యూ ఉంది.. ఇవాళ బస్సులు తిరిగేలా లేవు... ఎలారా దేవుడా అనుకుంటుండగా మీ బండి కనపడింది’’ అందామ్మాయి. తన పేరు సంధ్య అని, నర్సింగ్‌ చదివానని చెప్పింది. ‘‘రోగులను అసహ్యించుకోవడం, శవాల్ని చూసి భయపడటం లాంటివి చేస్తే నా వృత్తికి నేను పనికిరాను’’ అంది. ‘‘ఏం ఇంటర్వ్యూ?’’ అంటే... ‘‘కార్పొరేట్‌ ఆస్పత్రిలో నర్సు ఉద్యోగానికి... పొద్దున్నే స్నేహితురాలు ఫోన్‌చేసింది. వెళ్దాం అనేసరికి అనుకోకుండా ఈ బంద్‌. అన్నీ మన ఇష్టం ప్రకారం జరగవు కదా. ఇంతలో మీ అంబులెన్స్‌ వచ్చింది నన్ను ఆదుకోవడానికి’’ అని నవ్వింది. అరవై కిలోమీటర్ల ప్రయాణ అలసట ఆమె మాటలతో ఎగిరిపోయింది.

***

      ‘‘పొలం కలిసిరాక అప్పులు పెరిగి, మా అమ్మానాన్నలు ఆత్మహత్య చేసుకున్నారు... అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉంటున్నా. చేతిలో డబ్బు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే ఈ ఉద్యోగం కచ్చితంగా సంపాదించాలి’’... సంధ్య మాటలు వింటుంటే, తను కచ్చితంగా సాధించగలదు అనిపించింది. నా గురించి అడిగింది. అక్షరం ముక్కరాదని చెబితే ముందు నవ్వింది. ‘‘ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, చదువుకో’’ అంది. నవ్వుతూ ‘‘సరే’’ అన్నాను. జీపు వెనకాల వేలాడుతూ, బడికి పోతున్న నాతోటోళ్లను చూసిన ఆ రోజుల నాటి నా చదువు ఆశ, ఆశగానే మిగిలిపోయింది.

***

      రోడ్ల మీదంతా మనుషులే! కొందరు ధర్నాలు చేస్తూ.. మరికొందరు గమ్యస్థానాలకు వెళ్లడానికి ఎదురుచూస్తూ... ఇంకొందరు బంద్‌ పేరిట తమ ‘బలాన్ని’ బక్కోళ్ల మీద చూపిస్తూ... అందరూ మనుషులే! వాళ్లందరినీ దాటుకుంటూ మా అంబులెన్సు సిద్ధిపేట వరకూ వచ్చింది. టైం చూస్తే పన్నెండు... కడుపు నకనకలాడిపోతోంది. దాభాల కోసం చూశాను. అన్నీ ‘బంద్‌’. ఇంతలో తన దగ్గర ఉన్న చపాతీలను తీసిచ్చింది సంధ్య. తిని మళ్లీ బండి తీశాను. ‘‘గంటలో హైదరాబాదులో ఉంటాం’’ అన్నాను. ‘‘ఇవాళ నేనింత తొందరగా రాగలుగుతానని అనుకోలేదు... థ్యాంక్స్‌’’ అంది. ‘‘నాతో ఇంత దూరం వచ్చినందుకు ఆ మాట నేను చెప్పాలి’’ అన్నాన్నేను. చిన్న నవ్వు నవ్వింది. ‘‘మరి ఇప్పుడేం చేస్తావు’’ అని అడిగింది. నాకు అర్థం కాలేదు. ‘‘అదే.. మళ్లీ ఉద్యోగం?’’ అంది. ‘‘ఏముంది.. అక్కడే ఎవరో ఒకరి దగ్గర పని...’’ అన్నాను యథాలాపంగా.

***

      శామీర్‌పేట దాటి నగరంలోకి వచ్చేశాం. తను అల్వాల్‌లో దిగుతానంది. ఓ చెట్టు పక్కన బండి ఆపాను. ఈ ప్రయాణంలోనే నేను ఇంకో మనిషితో డబ్బు, జీవితం మీద మాట్లాడాను. మర్చిపోలేని ప్రయాణం ఇది. తను దిగి వెళ్తూ, మళ్లీ వెనక్కి వచ్చింది. ‘‘ఏం లేదు.. ఇంత దూరం నీతో వచ్చాను. మనతోపాటు ఆ వ్యక్తి మృతదేహం కూడా! వైద్య పరిశోధనల కోసం తన శరీరం దానం చేసిన మంచి మనిషి. ఆయన్ను ఒకసారి చూస్తా’’ అంది.
      వెనక తలుపు తీశాను. తను లోపలకు వెళ్లింది. తెల్లటి గుడ్డ చుట్టిన శవం పక్కన కూర్చుని, దాని ముఖం దగ్గర కట్టిన ముడిని విప్పింది సంధ్య. ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. తను మళ్లీ అలాగే గుడ్డను ముడేసి బయటికి వచ్చింది. నేను తలుపు వేసి తనవంకే చూస్తున్నాను.
      ‘‘ఏంటి రాజు! శవం అన్నావు. అది బట్టల దుకాణాల్లో ఉండే మనిషి బొమ్మ’’ అనుమానంగా చూస్తూ అడిగింది సంధ్య. ‘‘నాకు అదే అర్థం కావట్లేదు’’ గోదావరిఖని దవాఖానాలో ఇచ్చిన కాగితాన్ని చూపిస్తూ చెప్పాను.
      ‘‘ఇప్పుడేం చేస్తావు రాజూ? అలాగే వెళ్లి ఇస్తావా గాంధీలో’’
      ‘‘కానీ, అది శవం కాదు కదా’’
      ‘‘అదే కదా... శవం అని చెప్పి బొమ్మను ఎందుకు పంపారు? ఏదో జరుగుతోంది రాజూ... నువ్వు జాగ్రత్త. అసలు ఈ బొమ్మలో ఏముందో చూస్తే...’’ అంది సంధ్య. వెంటనే తలుపు తీసి బండ్లోకి వెళ్లాను. బొమ్మ మీదున్న గుడ్డ మొత్తం తీసేశాను. మధ్యలో గట్టి దారంతో కుట్టారు. ఆ దారం విప్పాను.
      అంతే.. ఇద్దరం ఒక్కసారిగా అంబులెన్స్‌ దిగి బయటకొచ్చాం. నా గుండె ఇంత వేగంగా ఎప్పుడూ కొట్టుకోలేదు. ‘‘కోట్లలో ఉంటాయి రాజూ...’’ అదిరిపోతూ అంటోంది సంధ్య. ‘‘ఇప్పుడేం చేద్దాం..’’ తన మాటలకు అడ్డొస్తూ అడిగాను.
      ‘‘నాకు డబ్బు కావాలి రాజు... కానీ, ఇలాంటిది కాదు... సొంతంగా సంపాదించాలి... నువ్వు తీస్కెళ్లు’’
      ‘‘డబ్బు అవసరం అనుకుంటే కదా నాకు ఇవి కావాల్సొచ్చేది. బతకడానికి పని దొరికితే చాలు’’
      ఇద్దరం నవ్వుతూ ఒకరినొకరు చూసుకున్నాం. తన ఫోన్లోంచి ‘100’ డయల్‌ చేశాం. అరగంటలో పోలీస్‌ జీప్‌ వచ్చింది. ఇంకో అరగంటలో నేనూ, సంధ్యా పోలీస్‌ కమిషనర్‌ ముందు ఉన్నాం. దొరికింది పెద్దమొత్తం కదా అందుకే విషయం వెంటనే ఆయన దాకా వెళ్లిపోయింది.
      నా అంబులెన్స్‌ ప్రయాణం గురించి అడిగారు కమిషనర్‌. నా కథంతా పూసగుచ్చినట్టు చెప్పాను. సంధ్య సంగతీ అడిగారు. తన ధ్రువపత్రాలు చూశారు. డబ్బు గురించి నిజాయతీగా సమాచారం అందించినందుకు మమ్మల్ని అభినందించారు. గోదావరిఖని పోలీసులకు సమాచారం అందించారు.

***

      సాయంత్రం నాలుగవుతోంది. మేమింకా పోలీసు కమిషనర్‌ కార్యాలయంలోనే ఉన్నాం. వెళ్లమని చెప్పలేదు వాళ్లు. అలా ఎదురుచూస్తూ, ఇద్దరం అవీఇవీ మాట్లాడుకుంటున్నాం. ఇంతలో కమిషనర్‌ గారు పిలుస్తున్నారంటూ మళ్లీ కబురు వచ్చింది.
      ‘‘లెక్కబెడితే అయిదు కోట్లుగా తేలాయి రాజూ... అక్కడ మావాళ్లు మీ వజీర్‌ను పట్టుకుని అడిగితే, దవాఖానాలో కలిసిన వ్యక్తి గురించి తెలిసింది. వాణ్ని తోమితే నిజం కక్కేశాడు. నువ్వు పనిచేసి మానేశావే... నాయకుడు! అతనిదే ఈ నల్లడబ్బు. ఎవరికీ అనుమానం రాదని ఇలా అంబులెన్సుల్లో హైదరాబాదుకు దాన్ని చేరవేయిస్తూ ఉంటాడట. ఈసారి అతని ప్లాన్‌ను నువ్వే చెడగొట్టావు’’ అన్నారు కమిషనర్‌.
      ‘‘అయ్యో నాకేం తెలుసు సార్‌... అది శవం కాదని తెలిశాక ఏం చేయాలో తెలియలేదు. సంధ్య ఉంది కాబట్టి మీ దాకా వచ్చాను’’ అనేశాను. సంధ్య ముఖంలో చిరునవ్వు దోబూచులాడింది.
      ‘‘మరేం పర్లేదులే... విచారణ సాగుతోంది కదా... అతను కచ్చితంగా కటకటాల్లోకి పోతాడు. సరే మీరింక వెళ్లొచ్చు’’ అన్నారాయన.
      ‘‘థ్యాంక్స్‌ సార్‌’’ అని చెప్పి బయటికొచ్చాం. గేటు దాటుతుండగా ఓ కానిస్టేబుల్‌ పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘సార్‌ పిలుస్తున్నారు’’ అన్నారు. ఎందుకో ఏమో అని కంగారుగా వెనక్కి వెళ్లాం.
      ‘‘రాజూ... పని కోసం వెతుకుతున్నా అన్నావు కదా. నా స్నేహితుల్లో ఒకాయన మంచి డ్రైవర్‌ కోసం చూస్తున్నానని చెప్పారు ఆ మధ్య. ఇప్పుడే ఆయనతో మాట్లాడాను. ఇదిగో అడ్రసు... వెళ్లు...’’ అంటూ ఓ విజిటింగ్‌ కార్డిచ్చారు. జీతం వచ్చేవరకూ ఈ డబ్బు ఖర్చులకుంచుకో అంటూ కొంత డబ్బూ చేతిలో పెట్టారు. ‘‘వద్దు సార్‌’’ అంటే... ‘‘అంత డబ్బు పట్టిచ్చినందుకు పారితోషికం అనుకోవయ్యా’’ అంటూ నవ్వారు. సంధ్య కళ్లలో సంతోషం కనపడుతోంది.
      ఆయనకు నమస్కరించి బయటికి వచ్చాం. ‘‘ఆల్‌ ది బెస్ట్‌ రాజూ’’ అంది సంధ్య. ‘‘నీక్కూడా’’ అన్నాను. పర్సులోంచి చిన్న కాగితం తీసి తన ఫోను నంబరు రాసిచ్చింది. నవ్వుతూ అందుకుని జేబులో పెట్టుకున్నాను. తర్వాత ఇద్దరం మాట్లాడుకుంటూ బస్టాప్‌ వైపు నడిచాం. తనను ఆల్వాల్‌ బస్సెక్కించి, నేను కమిషనర్‌ గారిచ్చిన అడ్రస్సుకు బయల్దేరాను.
సంధ్య ఫోన్‌ నంబరు రాసిచ్చిన కాగితం అక్కడే... నా గుండెలకు దగ్గరగా ఉంది!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


పాపమ్మ చెట్టు

పాపమ్మ చెట్టు

లోగిశ లక్ష్మీనాయుడు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోనిbal bharatam