సంక్రాంతి సంబరం (క‌థాపారిజాతం)

  • 104 Views
  • 1Likes
  • Like
  • Article Share

    దాశరథి కృష్ణమాచార్యులు

దాశరథి కృష్ణమాచార్యులు

సంకురాతిరి వచ్చిందంటే చాలు ఊరు ఊరంతా బంతిపూల వనమైపోతుంది.   రంగవల్లులు దిద్దుకుని మరింత సొగసుగా ముస్తాబవుతుంది. అలాంటి ఓ వనంలో హాయిగా విహరిస్తున్న చిలుకా గోరింకల కథ ఇది. జోడు కట్టిన ఆ జంట మనసులకు పెద్దపండగ పంచిన మధురానుభూతులేంటి?
పసుపు
రాసులు పోసినట్టు బంతిపూలు పచ్చ పచ్చగా, వెచ్చ వెచ్చగా పూసినై. చేమంతులు రాజుల పూలైతే బంతిపూలు రైతుల పూలు. నల్లటి కొప్పులో పచ్చని బంగారంలాంటి బంతిపూవు చెక్కుకుని సీత పొలం పక్కగా నడిచిపోతుంది. రాముడు గడ్డివామిలో కూచుని దానివైపు చూసి మురిసిపోతాడు. చలిగాలి కత్తిలా కోస్తుంది. పైటకొంగు తల మీదికి ముసుగులా లాక్కుంటుంది సీత. గడ్డి వంటినిండా కప్పుకుంటాడు రాముడు. కళ్లకు పచ్చ పచ్చగా, వెచ్చ వెచ్చగా బంతిపూలు, మనసులో కమ్మ కమ్మగా వలపులు.
      సంక్రాంతి రానే వచ్చింది. గరిసెల్లో, గాదెల్లో నిండుగా ధాన్యం. నిరుపేద వాడు సంక్రాంతినాడు మహారాజు. కొత్త బియ్యపు అన్నం తియ్య తియ్యగా దిగుతుంది. లేత లేత ఊసబియ్యం కంకులు కాల్చుకుని నములుతుంటే పాలూరుతాయి. సజ్జరొట్టెలు కాల్చుకుంటున్నారు కొందరు. నువ్వులు బొక్కుతున్నారు కొందరు. సీతకి తిండి మీద దృష్టిలేదు. ముగ్గులంటే దానికి సరదా. రంగు రంగుల పిండితో ముగ్గులు పెట్టింది ఇంటి ముంగిట. పేడతో గురుగులు చేసింది. ఆ గురుగుల్లో రంగు రంగుల పూలు గుచ్చింది. నూలు, బియ్యం, రేగుబండ్లూ నింపింది. అక్కడక్కడా ముగ్గులు చెరిపి మళ్లీ సరిదిద్దుతున్నది. బొటన వేలుతో నేలను రాస్తూ ఏదో ఆలోచిస్తున్నది. రాముడు దూరం నుంచి చూశాడు. ముగ్గులు సరిదిద్దుతున్న సీతని చూసే వరకు వాని గుండెలో ఎవరో గుస గుసలాడారు. దగ్గరిగా వచ్చాడు. వెనక నుంచున్నాడు. కొప్పులోని బంతిపూవు పక్కున నవ్వింది.
      ఏదో చప్పుడైనట్టై గిరుక్కున వెనక్కు తిరిగి చూచింది సీత. రాముడు అటు తిరిగి చూస్తున్నాడు. ‘‘దొంగా యేంటీ ఆట?’’ అంది సీత.
      ‘‘అంతలో పొలంలోంచి ఇంటికొచ్చి ముగ్గులు పెడుతున్నావే?’’ అన్నాడు రాముడు.
      ‘‘పొలంలో నన్నెక్కడ చూసినౌ?’’ అని అడిగింది సీత.
      ‘‘చూశిన, గడ్డి వామిలోనుంచి’’
      ‘‘దొంగ చూపులు ఎప్పుడు నేర్చినౌ?’’
      ‘‘ఇప్పుడిప్పుడే నేరుస్తున్న’’
      ‘‘పండగపూట ఇంటికి పో’’
      ‘‘ఇదే నా యిల్లు. నేను పోనేపోను’’
      ‘‘అయ్య తంతడు’’
      ‘‘ఎందుకూ?’’
      ‘‘ఆడపిల్లల యెంట పడ్డందుకు’’
      ‘‘మరి మొగపిల్లల యెంట పడమంటవా?’’
      ‘‘ఏమో. నీకు జవాబులు చెప్పలేను. పో’’
      ‘‘నేను పోనంటే పోను’’
      ‘‘అదుగొ అయ్యొస్తున్నడు’’ అంది సీత. ఉలిక్కి పడి ఇంట్లోకి చూశాడు రాముడు. అయ్యలేడు కొయ్యలేడు.
      ‘‘అమ్మదొంగా! భయపెడతావ్‌?’’
      అని సీతని పట్టుకున్నాడు రాముడు. సీతకి భయం వేసింది. విదిలించుకుంది. కాని రాముడు వదల్లేదు.
      అంతలో దూరం నుంచి సన్నాయి వినపడ్డది. పిల్లలు అల్లరిగా అరుస్తున్నారు. ఇద్దరూ అటువైపు చూశారు. నందీశ్వరుడిలాగా ఎత్తైన మూపురం, దాని మీద చుట్టిన ఎర్రటి సిల్కు సెల్లా, వీపున రంగు రంగుల బొంద, మెడలో మువ్వలు, మొఖాన బొట్టు, గంభీరంగా వుంది గంగిరెద్దు. ముందర ఒకడు సన్నాయి వాయిస్తూ నడుస్తున్నాడు. వెనక వొకడు డోలు వాయిస్తున్నాడు. వెంట పిల్లలు పరుగెత్తుకు వస్తున్నారు.
      ‘‘గంగిరెద్దొస్తున్నది’’ అంది సీత.
      ‘‘రానీ, దాన్నడుగుతా మన పెళ్లెప్పుడో’’ అన్నాడు రాముడు.
      ‘‘అమ్మో! పెళ్లే? నీకు పిల్ల నెవ్వడిస్తాడు?’’
      ‘‘మీ అయ్య’’
      ‘‘మా అయ్య నీకు నిజంగానే పెళ్లి చేస్తాడు’’
      ‘‘మరింకేం?’’
      ‘‘కర్రతో పెళ్లి’’
      ‘‘అట్లగా అదీచూస్తా’’ అన్నాడు రాముడు. గంగిరెద్దు ఇంటి ముందు ఆగింది.
      ‘‘పెబువు గారికీ దణ్ణం పెట్టు’’ అన్నాడు గంగెద్దుల వాడు. ముందటి కుడికాలు వంచి దండం పెట్టింది గంగిరెద్దు. గొల్లుమన్నారు పిల్లలు.
      ‘‘బాబు పెళ్లి ఈ యేడైతుందా చెప్పు బసవన్నా!’’ అన్నాడు గంగెద్దుల వాడు.
      తల వూపింది యెద్దు. సీత యింట్లోకి పరిగెత్తింది. పాత ధోతి తెచ్చి ఇచ్చింది గంగెద్దులవాడికి. రాముడు ముసి ముసి నవ్వులు నవ్వాడు. గంగిరెద్దు మళ్లీ వంగి దణ్ణం పెట్టింది. గంగెద్దుల వాడు డబడబా డోలు వాయించాడు. పిల్లలు కిలకిలా నవ్వారు. సీతతల్లి వొడ్లు చాటలో తెచ్చి గంగెడ్లవాడి జోలెలో పోసింది. ఇటు చూసేవరకు రాముడు కనపడ్డాడు. ఆమెను చూడగానే మొఖం తిప్పుకొని దూరంగా పోతున్నాడు రాముడు. సీత తల్లి రాముణ్ణి పిలిచింది. దగ్గరగా వచ్చి నిలుచున్నాడు.
      ‘‘ఏం నాయనా పోతున్నావు?’’ అని అడిగింది.
      ‘‘ఏం లేదత్తా’’ అన్నాడు రాముడు.
      ‘‘అయ్య చూస్తాడని బయపడుతున్నడు’’ అంది సీత. ‘‘నాకేం బయం’’ అన్నాడు రాముడు. అన్నాడే గాని గుండె గతుక్కు మంటున్నది. బుర్రమీసాల పుల్లయ్య కర్ర తీసుకొని ఎటునుంచొస్తాడో అని భయంగానేవుంది.
      ‘‘మాకూ మీకూ వున్న పాత పంచాయతీలకు మీరు కష్టపడుతున్నారు నాయనా మీరేం చేశారని?’’ అంది సీత తల్లి.
      ‘‘ఆ ఆలోశన అయ్యకు లేదవ్వా’’ అంది సీత.
      ‘‘ఎప్పుడొస్తదో బుద్ది’’ అని తల పట్టుకుంది సీత తల్లి.
      ‘‘రమారమణ గోవిందో హరి హరిలోరంగ, రంగ హరిలొరంగ’’
      అంటూ సాతాని జియ్యరు గెంతుతూ వచ్చాడు. నున్నగా రాగి చెంబులాంటి తల. తలమీద గుడ్డచుట్టకుదురు. కుదురు మీద రాగి అక్షయపాత్ర. దానికి బంతిపూల హారం. మొఖాన దట్టంగా ఊర్థ్వపుండ్రాట మెడలో బంతిపూల దండలు నడుముకు ఎర్ర పట్టుకండువా, పింజాలు పోసి కట్టిన తెల్ల ధోతి, చేతిలో చిరతలు, కనుబొమ్మలెగరేస్తూ, పాడుతూ, హుషారుగా వున్నాడు జియ్యరు. అతన్ని చూసి పక్కున నవ్వింది సీత. ‘‘నవ్వుతే నవ్వావుగానీ నువ్వులు దానం చెయ్యమ్మా!’’ అన్నాడు జియ్యరు.
      ‘‘బావా! నువ్వులు కావాలట’’ అంది సీత.
      ‘‘తెచ్చిపెట్టవే సీతా!’’ అని బుగ్గ మీద గిల్లాడు రాముడు.
      ‘‘ఎవడ్రా వాడు’’ అని అరుపు వినిపించింది. ఉలిక్కిపడి చూచారంతా. బుర్రమీసాల పుల్లయ్య కర్ర తీసుకుని ఉరికొచ్చాడు. చస్తినిరా అనుకుంటూ రాముడు లగెత్తాడు.
      ‘‘పండగనాడు వాడిమీదకు ఉరుకుత వేమయ్యా! వాడేమన్నడు?’’ అంది సీత తల్లి.
      ‘‘ఆడు మనింటికెందుకొచ్చినట్టూ అంట?’’
      ‘‘ఏదో ఆడుకుంటాని కొచ్చిండు’’
      ‘‘మీసాలు గడ్డాలు వచ్చినై. ఇంకా ఆటా? అయినా ఆడపిల్లతో ఏమాట?’’
      ‘‘చిలకా గోరింకల్లా వున్నారయ్యా! పెండ్లి చేయండి’’ అన్నాడు జియ్యరు.
      ‘‘సాతానాయనా! నోరు మూసుకొని నీ దారిన నువ్వు పోతవా? పండగనాడు పంచాయితి పెట్టుకుంటవా?’’ అని గర్జించాడు బుర్రమీసాల పుల్లయ్య.
      ‘‘పంచాయతి నా కెందుకు బాబూ. మీ ఇల్లు చల్లగుండ. సామగ్రి ఇప్పించండి’’ అన్నాడు జియ్యరు.
      ‘‘పడేయవే బియ్యం’’ అని అరిచాడు పుల్లయ్య. సీత భయం భయంగా దోసిలి నిండా తెల్లటి బియ్యం తెచ్చి ఎర్రటి రాగి అక్షయపాత్రలో పోసింది. అక్షయపాత్ర ఆమెకు అందేట్టు మోకాలి మీద గరుత్మంతుడిలా వంగాడు జియ్యరు. దోసిలి సాచి పాత్రలోకి బియ్యం జారవిడిచింది సీత. కంటిలోనించి కన్నీటి చుక్క జియ్యరు భుజం మీద రాలింది. వేడి కన్నీటి చుక్క భుజం మీద పడేసరికి జియ్యరుకు అర్థమైపోయింది సీత బాధ. 
      ‘‘ఇక పో’’ అని అరిచాడు పుల్లయ్య.
      ‘‘పోతున్నా! చల్లగా వర్ధిల్లు తల్లీ’’ అంటూ వెళ్లాడు జియ్యరు. దూరంగా చిరతల మోత వినిపిస్తుంటే అటే చూస్తూ నిలుచున్నది సీత. ఆ పూట సీతకి అన్నం సయించ లేదు. ‘‘పండగనాడు అన్నం సరీగా తినవేమే?’’ అని తల్లి అడిగితే జవాబు చెప్పకుండా చేయి కడుక్కుని లేచిపోయింది సీత.
      చుట్ట కాల్చుకుంటూ ఇంటి ముందట అరుగు మీద కూచున్నాడు పుల్లయ్య. ఇంతలో సుబ్బరామయ్యగారు దారిన వెళుతూ పుల్లయ్యను చూశాడు.
      ‘‘రండి రండి దండాలు’’ అన్నాడు పుల్లయ్య.
      ‘‘దీర్ఘాయుష్మాన్‌భవ. ఏం పుల్లయ్యా!’’
      ‘‘ఏముందీ. సంకురాత్రి వొచ్చింది. పండుగలు వస్తుంటాయి పోతుంటాయి. పండగ పండగకూ హడావుళ్లు’’ అని నసిగాడు పుల్లయ్య.
      ‘‘అలా అనకు పుల్లయ్యా! సంకురాత్రి పెద్ద పండగ. పండగల్లో కెల్లా పండగ. ఇవాళ సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు.’’
      ‘‘ఏడకు పోతే మన కేమిటంట.’’
      ‘‘అట్లా కాదు పుల్లయ్యా! ఇవాళటితో నరకద్వారం బందైతుంది. స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. అందుకే భీష్ముడు ఉత్తరాయణం వచ్చేదాక జీవించివుండి ఆ తరువాత ప్రాణాలు విడిచాడు’’ అని వివరించాడు సుబ్బరామయ్య. ఇంతలో ఇంట్లోనుంచి సన్నగా ఏడ్పు వినపడ్డది.
      ‘‘ఎవరా పండగ నాడు ఏడుస్తున్నది?’’ అనడిగాడు సుబ్బరామయ్య.
      ‘‘తల్లన్నా అయ్యుండాలి, పిల్లన్నా అయ్యుండాలి’’ అన్నాడు పుల్లయ్య.
      ‘‘పండగనాడు ఏడ్పెందుకు?’’
      ‘‘అందుగో, ఆ రాముడుగాడితో పరాచికాలు వద్దన్నానని.’’
      ‘‘ఇదుగో పుల్లయ్యా! రాముడు పేదవాడు కావచ్చు గాని మంచివాడు. ఎప్పటి వైరాలో మనసులో పెట్టుకుని మాణిక్యాన్ని పారేసుకోకు.’’
      ‘‘ఏం మాణిక్యమో!’’
      ‘‘తప్పి పోయిన్నాడు తెలుస్తుంది మాణిక్యం విలువ’’ అన్నాడు సుబ్బరామయ్య.
      ‘‘అట్లా చెప్పండయ్యా?’’ అంటూ వచ్చింది సీత తల్లి.
      ‘‘ఇవాళ పెద్ద పండగ. పేదలకూ సాదలకూ అందరికీ పండగ. ధాన్యం లక్ష్మి వంటిది. ఇళ్ళల్లో ప్రవేశించిన మంచి రోజుల్లో ఈ పండగ వస్తుంది. కనుక ఇవ్వాళ అన్ని ద్వేషాలు మరిచిపోవాలి’’ అన్నాడు సుబ్బరామయ్య. గబగబా ఇంట్లోకి వెళ్లాడు. సీతని బయటికి తీసుకొచ్చాడు.
      ‘‘నీవు నా కూతురులాంటి దానివి. నీకు శుభం అయ్యేట్లు చేస్తానమ్మా’’ అంటూ ఓదార్చాడు.
      ‘‘ఇదుగో పుల్లయ్యా! నా మీద ఏ మాత్రం గురివున్నా నా మాట విను. నీకు మేలు కలుగుతుంది. పెద్దవాణ్ణి చెబుతున్నా!’’ అన్నాడు సుబ్బరామయ్య.
      ఇంతలో చుట్టుపక్కల పిల్లలంతా వాకిట్లో గుమిగూడారు.
      ‘‘గొబ్బిళ్లో గొబ్బిళ్లో’’ అంటూ గొబ్బి తట్టడం మొదలు పెట్టారు. హృదయంలో ఏ మాత్రం కళంకంలేని ఆ పసిపాపలను చూస్తుంటే పుల్లయ్య మనస్సు జల్లుమంది.
      ‘‘అయితే ఏం చేయమంటారు సుబ్బరామయ్యగారూ!’’ అంటూ దగ్గరగా వచ్చాడు పుల్లయ్య.
      ‘‘నా మాట విని ఈ పెద్ద పండగ నాడు నీ మనస్సు మార్చుకో. రాముడి తండ్రికీ, నీకు వున్న తగాదా అతను పోయిన్నాడే పోయిందనుకో. చచ్చి ఏ స్వర్గాన ఉన్నాడో అతనూ ఆనందిస్తాడు. రాముడికిచ్చి సీతని పెళ్లి చేయి’’ అన్నాడు సుబ్బరామయ్య.
      కిలకిల నవ్వింది సీత. ఇంట్లోకి కొత్త వెలుతురు ఒచ్చినట్టైంది. హృదయాలలో వెచ్చదనం ప్రవేశించింది.
      రాముడు దూరంగా దాక్కుని దాక్కుని వెళ్లిపోతున్నాడు. సుబ్బరామయ్య కంట పడ్డాడతను. 
      ‘‘అరే రాముడూ! ఇంకా భయమెందుకూ! రా’’ అని పిలిచాడు సుబ్బరామయ్య. రాముడు రాలేదు. పుల్లయ్య వాకిట్లోకి వచ్చి ‘‘రాముడూ’’ అన్నాడు.
      ‘‘రా నాయనా! రా’’ అంది సీత తల్లి. సీత సిగ్గుతో ఇంట్లోకి పరిగెత్తింది. రాముడు తల వంచుకుని వచ్చి ఇంటి ముందర నిలబడ్డాడు.
      ‘‘డూ డూ డూ బసవన్నా!’’ అంటూ పాడుకుంటూ పోతున్నాడు గంగెద్దుల వాడు. ‘‘బసవన్నంటే ఆ ఎద్దు కాదు. మా పుల్లయ్యే ఇవాళటి నించి బసవన్న. మేం చెప్పినట్టు వింటాడు’’ అన్నాడు సుబ్బరామయ్య.
      ‘‘మీ మాట చలవవల్ల మా యిల్లు నిలబడింది సుబ్బరామయ్యగారూ’’ అంది సీత తల్లి.
      ‘‘అదంతా నా మహిమ కాదు. సంకురాత్రి మహిమ. సూర్యుడు అడుగో మనందరికీ సాక్షి. అతడు మకరంలోకి ప్రవేశించాడు. పుల్లయ్య తన మొసలి పట్టు వదిలిపెట్టి దారికొచ్చాడు’’ అన్నాడు సుబ్బరామయ్య.
      ‘‘ఏదో నాకు సరైన దారి చూపించారు సుబ్బరామయ్యగారూ’’ అన్నాడు పుల్లయ్య. గబ గబా లోపలికిపోయి ఇన్ని దోసకాయలూ, లేత లేత జొన్నకంకులూ తెచ్చి సుబ్బరామయ్య ఒడిలో పోశాడు. రాముడు సుబ్బరామయ్యకు దండం పెట్టాడు.
      ‘‘అత్తా మామలకు దండంపెట్టు. నాకు దండం పెట్టడానికేం గాని’’ అన్నాడు సుబ్బరామయ్య.
      అంతా కిలకిలా నవ్వారు. రాముడు సమయంచూచి తుర్రుమన్నాడు. సీత పెరటి దారిని పొలంగట్టుకు చేరింది. గడ్డివామి వద్ద ఇద్దరూ కలుసుకున్నారు. వాలిపోతున్న సంక్రాంతి సూర్యుడు వారి ఇరువురి ఒడులలో దోసిళ్లకొద్దీ బంతిపూలు కుమ్మరించాడు.

* * *


కథల్లోనూ అందెవేసిన చెయ్యే!
సామాన్య ప్రజల ఆర్తిని తన అక్షరాల్లో పలికిస్తూ కవితాగ్నిధారలు కురిపించిన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు.  కవిగా ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు తెలుగువాళ్లందరికీ కరతలామలకమే. అయితే... తక్కువమందికి తెలిసిన విషయం ఏంటంటే దాశరథి కథలూ రాశారు. నిజాం కాలం నాటి సాంఘిక పరిస్థితులు, జాతీయోద్యమ సమయంలో జనజీవన స్థితిగతులు తదితరాల నేపథ్యంలో ఆయన కథారచన చేశారు. ప్రేమకథలూ రాశారు. దౌర్జన్యానికి వ్యతిరేకంగా గళమెత్తి ప్రాణాలర్పించిన దేశభక్తులు, మనసిచ్చిన వారికి దూరంగా అజ్ఞాతవాసం చేస్తున్న విప్లవ వీరులు, విలువలకు కట్టుబడి బతికే సామాన్యులు... వీళ్లే దాశరథి ‘కథానాయకులు’. ప్రబంధ నాయికలను కథారూపంలో పరిచయం చేస్తూ ఆయన మరికొన్ని రచనలు చేశారు. గల్పికలు సృజించారు. ‘ప్రజాకవి దాశరథి సాహిత్యం- 5’ పేరిట ఇవన్నీ పుస్తకరూపంలో వెలువడ్డాయి. 


సౌజన్యం: దాశరథి లక్ష్మణ్‌
(కృష్ణమాచార్యులు గారి అబ్బాయి)

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


పాపమ్మ చెట్టు

పాపమ్మ చెట్టు

లోగిశ లక్ష్మీనాయుడు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోనిbal bharatam