పాపాయి - 1

  • 566 Views
  • 21Likes
  • Like
  • Article Share

    జగదాంబ పీసపాటి

  • విజ‌య‌వాడ‌
  • 8978300330
జగదాంబ పీసపాటి

అమ్మ, తెలుగు ఒకేసారి పరిచయమయ్యాయి. నేను ఎంత అందంగా ఉన్నానో చెప్పడానికి మెుదటిసారి అమ్మ  పెదవులు కదిలిన తీరు భలే తమాషాగా ఉందిలే!! చం..ద..మా..మ.. (నేనే)!! ఇక నాన్నగారు, తాతగారు, మామ్మ, అమ్మమ్మ ఎన్నెన్ని ఛలోక్తులనుకున్నారు. నాకన్ని గుర్తులే!!
      అమ్మ ముద్దుల్లో నలిగిపోతూ బారసాల రానే వచ్చింది. నాకు నిద్దురపడితే ఒట్టు.. అందరూ మాట్లాడే ఆ తీపి శబ్దాలు నేనూ పలకడానికి ఈ రోజే కదా నాంది.. తేనెలో ముంచిన ఆ ఉంగరం నా నాలుకను తగలగానే అబ్బబ్బ ఎంత చెప్పాలనుకున్నాను... ఖాళీ దొరికితేగా.. వాళ్లే మాట్లాడతారే, ‘ఏడవకమ్మా!’ ‘ఆకలేస్తోందా’, ఎన్ని ప్రశ్నలు?? సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వాలిగా, నేనేమో పసికూనను!!
      సరేలే!! మాట్లాడనివ్వకపోయినా బోల్డెన్ని తెలుగు పిండి వంటలు చేసిపెడతార్లే. బోర్లా పడితే ‘బొబ్బట్లు’,
భలే తమాషా పేరు కదా!! పాకితే ‘పరవాన్నం’, ఎంతటి దైవత్వం కల పేరు!! అమ్మమ్మ, బామ్మల నోట్లో ఎప్పుడూ 
అదే మాట, ‘దేవుడు’, ఆయన మాతోనే ఉంటాడు కాబోలు, ఎన్ని పనులు చెయ్యాలో పాపం, ఎప్పుడూ పిలుస్తుంటారు!!!
      నవ్వితే ‘నువ్వుండలు’, ‘సరదా’ పేరు కదా!! ఆ సరదా తీరింది, చేశారన్న మాటే కానీ, నాకొక్కటి పెడితేగా!! నవ్వుతూ నవ్వుతూ డబ్బా ఖాళీ చేసేశారు. 
      వీళ్ల పని పడతాన్లే తొందరలో, నేను మాట్లాడడం మొదలుపెట్టాగా.. 
      అ...త్త అన్నానో లేదో నాకంటే ముద్దయిన ‘చిలుకలు’ వంటింట్లో తయారు. భలే ‘చిలిపి’ మాటలే!!
      అత్తయ్య అంటుంటే విన్నాను అవి చేసే పనులు కూడా చిలిపేనట!! జామకాయని ఎర్రని నోటితో కొట్టి పోతాయట, అలా ఎంగిలి చెయ్యొచ్చా?? మామ్మైతే వీపు మీద రెండు వేసేది, నాన్నకి వేసేదటలే అమ్మకి చెప్తుంటే విన్నాను.
      ఇక ఒకటేమిటి అత్త, అమ్మ, నాన్న బోలెడన్ని మాటలు, నాకింకా వచ్చులే.. అమ్మ పొట్టలోకి రాకముందు గంథర్వులట వాళ్లు అదే భాష మాట్లాడేవారు. నన్నే పొట్టలో పెట్టాలా అని ‘వాదన’, అమ్మో ‘పెద్ద’ మాటలే. వాళ్లు  వాదించుకుంటుంటే విన్నాన్లే. నా ‘పుణ్యం’ ఆవగింజట, ‘పాపం’ వడ్లగింజట, భలే కోపం వచ్చిందిలే!! ఎంత ‘పుణ్యం’ చేశానని, ఇప్పుడు చెప్పలేనులే ఎంత పొడుగాటి పట్టికనుకున్నారు!! 
      అదలా ఉంచితే చివరకు ఒక గంధర్వుడన్నాడు, ఆ మధ్య భూలోకం వెళ్లినప్పుడు ఓ పెద్దాయన్ని కలిశాడట, సాహిత్యం, సదాచారం మహానుభావుడటలే.. చెప్పడం మరచాను, నవ మన్మథుడట!!
      ఆయన మనసులో మాట చెప్పుకొచ్చాడట.. షష్ఠిపూర్తి పండక్కి భార్య పురుడు పోసుకుందిట. ‘ఏమయ్యా, ఇదెక్కడి చోద్యం, నలుగురూ నవ్వరూ!! ఆ బంగారు తల్లిని నా ఊపిరుండగా ఒక అయ్య చేతిలో పెట్టి ఓ పురుడు చూస్తే నాకు శాంతి’.
       జరిగేట్టు చూస్తానని మాటిచ్చి వచ్చాను కదా, కొద్ది కాలంలోనే పెద్దాయన నా దారి పడితేను!! ఇంకేముంది స్నేహితుడికి ఇచ్చిన మాట దక్కించుకోవాలిగా, దృష్టి నా మీదికి మళ్లింది.. సాయం కోసం కాబోలు. అడగనీ చెప్తా నేనేంటో, అసలే కోపం మీదున్నానేమో!!
      సమావేశమయ్యి ఏదో తీర్మానించుకున్నారు కాబోలు.. నన్నో మూటకట్టి మా అమ్మ (ఆ పెద్దాయన కూతురు) పొట్టలో పెట్టి వెళ్లిపోయాడు ఆ గంథర్వుడు.
      అదో చీకటి గుహ.. కాళ్లు కదపలేను, చెయ్యి మెదపలేను.. అదే లోకం. అమ్మకి ఆవకాయ ఇష్టమట, అమ్మమ్మ ఎర్రగా కలిపిపెట్టేదిలే.. అమృతానికి దీటుగా ఉంటుంది. అమ్మ వాటాకి దీటుగా లొట్టలేసేదాన్ని.. కంది పచ్చడి, పెసర పచ్చడి, గోంగూర (ఇక అమృతం ప్రస్తావన అనవసరం).. నాలుక నిదురోయినా కడుపు నిదరోతే కదా. ఆవకాయ ప్రతాపం ఆవగింజంత నా మీదే!!
      ఎంతటి కక్ష కట్టావయ్యా, ఏమని చెప్పను కష్టాలు?? ఈ ఊరగాయలతో నేనేమో ఊరిపోతుంటేను, అమ్మ కదల్లేదు మెదల్లేదు.. పాపం.. నేను బయటికి వస్తే అంతా తీర్చేస్తానుగా!!
      సమయం రానే వచ్చింది, ఇక కొత్తింట్లోకి వెళ్లాలట. ఎంతమందిని కలవాలో, ఎన్ని పనులు చెయ్యాలో, అసలే నాకు తొందరెక్కువ!! భలేలోకంలే, నేను రాగానే అమ్మని మర్చిపోయారు. నా చుట్టే అందరూ.. అమ్మకైతే నేనే లోకం, నాన్న బుంగమూతి పెట్టినా బంగారుతల్లిదే (నేనేలే) పైచేయి. ఏమైతేనేం అదో పెద్ద పండగ. ఈ సారి కలిసినప్పుడు చెప్తాన్లే!! అదండీ నా జన్మ రహస్యం.. నమ్మారుగా!! 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


పాపమ్మ చెట్టు

పాపమ్మ చెట్టు

లోగిశ లక్ష్మీనాయుడు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోనిbal bharatam