ఆఖరి ప్రశ్నలు

  • 399 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కవితశ్రీ

  • తెలుగు అధ్యాపకులు
  • మదనపల్లి, చిత్తూరు
  • 9494696990
కవితశ్రీ

ద్దెమ ద్దెమ ద్దెమా... పరిగెత్తాండాడు జయసిమ్మ. వాని రబసానికి ఈదిలో కోల్లు, మ్యాక పిల్లలు ఇసరకపొయ్యి పక్కన బడతాండాయి. ర్యావిటేల నడీదిలో నీరెండకు జోగుతాండే కుక్కలు గెబీమని లేచి బౌబౌ అని మరిగి ‘ఓ... ర్‌ నీ! ఈడా?’ అన్నెట్లు మల్లా తోక ముడుచుకోని పండుకుంటాండాయి జోగేదానికి.
      బోరింగు కాడ నీల్లు గొట్టుకొని బింది నడుంమింద బెట్టుకొని ఎగరేస్తా బోతాండే సౌడమ్మను గుద్దబొయ్యి టక్కుమని నాగుబామ్మాదిరి వైదొలిగి ఉరికినాడు. ‘‘ఓర్నా బట్టకొడకా! అకురోయింగా గుద్దేస్తాంటివే. ఉద్దరగా దిని కండ్ల నిండా పాసరం బట్టింది నా బట్టబిడ్డకు’’ అని తిట్టింది సౌడమ్మ.
జయసిమ్మకు యాదీ ఇనపల్లా. ఏందీ కనపల్లా. పరిగెత్తాండాడు... పరిగెత్తాండాడు... రాంకిట్ట మామ వాల్లింటికాడికి ఒచ్చి దొడ్డిముందర కాలుబ్బండ దొందురుకొని ముందిరికి పడబొయ్యి పందిలిగుంజ పట్టుకొని నిలదొక్కున్యాడు. 
      అట్నుంచి జూస్తే ఎదురుంగ ఉండాడు ఒగ కొత్తేయప్ప. రాంకిట్ట మామోల్ల నట్టింట్లో పిలాస్టిక్కు కుర్చీలో కూచ్చోని టువాల్తో మూతి తుడుసుకుంటాండాడు. పాచిరంగు ప్యాయింటు, గులాపిరంగు సగ్గుడ్డ ఏసుకోండాడు.
      ‘‘ఆఁ ఈయప్పే అయిండల్ల మా మ్యాన మామ. మా యమ్మోల కడగొట్టన్న. ఆఁఆఁ ఈ యప్పే మా అయివోరు మామ. తుఫు తుఫు అయివోరు మామ గాదు. అయివోరంటే ఇస్కూల్లో అఆలు ఏబీసీలు చెప్పేవోడు. మామ కాలోజిలో పెద్ద పెద్ద పాటాలు చెప్పేవోడంట. ఆఁ ఆ కాలోజి అయివోర్ను ఏమంటారబ్బా! అమ్మేందో చెప్పిందే! ఆఁ గుర్తుకొచ్చింది. లెక్సిలీరు. ఆఁ ఈయప్పే మా లెక్సిలీరు మామ.’’
      ‘‘లెక్సిలీరు మామా...!’’ అని పరిగెత్తా బొయ్యి దబ్బుకుందామని కాలు కడప్మాన్లో ఏసినోడల్లా ‘లె... లె... లె...’ అనుకుంటా ఎనిక్కి దిగినాడు. ఇంట్లో నుంచి నడిపెత్త రాకాసిముండే కట్టే వస్తాంది. ఎంగిలి బోకులెత్తుకోని బచ్చలి సందులోకి పొయ్యేదానికి. ఆయమ్మ బొలేది. ఇంట్లోకి రానీదు. 
      ఆ పందిలి గుంజకానుకుని ఇంటిసూరు కింద నిలబడి బవాని తింటాండే అరిటికాయి చేతిలో ఉన్నెబ్బుడు చేతికల్లా, నోటికాడికి పొయ్యి నబ్బుడు నోటికల్లా ఆ... అంటా చూస్తాండాడు.
      జయసిమ్మ నల్ల నిక్కర, నీలం సగ్గుడ్డ తొడుక్కోండాడు. వానిరంగు స్యామనశాయ. పెద్దపెద్ద కండ్లు, దాండ్ల నడిమజ్జెలో అనిగిపొయ్యిన ముక్కుదూలం. కొన మాతరం బుడ్డమిరక్కాయి మాదిరి పైకి లేసింది.
      ‘సీనప్పకు వాన్లో వాల్ల చుట్టాల్లో ఎవురి పోలికలూ కనపల్లా. ‘‘ఎవురా పిల్లోడు?’’ అన్యాడు.
      ‘‘సిన్నప్పా! ఈడు నీకు తెలీదా? ఈడే అంజులమ్మత్త కొడుకు. జయసిమ్మ’’, అనింది బవాని. గుండెకాయిలో అగ్గి పడి భగ్గుమనింది సీనప్పకు.
      ‘‘ఊఁ నేనే’’ అన్నెట్లు కండ్లు మిటకరించి పండ్లికిలించినాడు జయసిమ్మ. ఆ మగంలో సిలిపితనం సూసినోల్లు నగకుండా ఉండ్లేరు.
      ‘‘ఎంతోడయినాడు. ఏమి సదువుతాండాడు’’, అన్యాడు బవానితో. బవాని నచ్చాడతా ఉంది.
      ‘‘ఊఁ ఊఁ నీను ఎలకేజీ. ములకలసెర్లో. కానిమెంట్లొ సదువుతాండా’’ అన్యాడు జయసిమ్మ మామిచ్చిన సందు వొదులుకోగుడదని.
      ‘‘ఈల్లమ్మ యట్లుంది? బాగుంద్యా?’’ 
      ‘‘ఊఁ బాగుండాది.’’ 
      ‘‘ఏం జేస్తా ఉంది?’’ 
      ‘‘ఊఁ కాయిలోల్లకు సెనిగి సెట్లు పీకను పొయ్యింది.’’
      ‘నాయిన్ను మామ అడగలా. అడగల్లే. నాయినంటే మామకు అక్కరగాని, కోపం గాని రొండూ లేవంట. మామకు అమ్మ ఎదురు పన్యా అమ్మకల్ల సూడ్డంట. ఒగేల పరపాట్న సూచినా మాట్లాడ్డంట’, అనుకున్యాడు జయసిమ్మ మనసులో. మామ తాతకు అవ్వకు చెప్పి మదనపల్లికి ఎల్లిపాయ.

* * *

      జయా వాల్లు మదనపల్లిలో ఉన్నెబ్బుడు ఒగనాడు ఎవరో ఒచ్చి నాయిన సచ్చిపొయినాడని సెప్పినారు. అమ్మ కుప్పకూలిపోయింది. ‘‘సగినంలో సెప్పినట్లే అయగదా సామీ! నాగూటి కొమ్మ కూలిపాయనే’’ అంటా ఏడస్తా కూచ్చునింది. ‘‘పదమ్మా! నాయందగ్గిరికి’’ అన్యాడు జయసిమ్మ. ‘‘ఒద్దు నాయినా! వాల్లు నిన్ను జంపేస్తారు’’ అనింది.
      ‘‘ఎవురుమ్మా వాల్లు? నన్నెందుకు సంపుతారు?’’ అన్యాడు. ‘‘ఆయప్పకు ముందు పెండ్లాము ఉండాదిలే. వాల్లకు మనల్ను చూస్తే కాదు’’, అనింది.
      మల్లనాపొద్దు జయసిమ్మ లేసేలకు అమ్మ గుడ్డల్తోగూడా సరుకులన్నీ పాతచీర గుడ్డల్లో మూడుమూట్లు గట్టింది. ‘‘లెయ్‌ నాయినా పోదాం’’ అనింది. లేసి ‘‘యాడికి పోదామమ్మా!’’ అన్యాడు. ‘‘ఇంగీ కొంపలో బతకలేం నాయినా! ఇంగ మనకు ఆ ముసిలోల్లే దిక్కు. తాతోల్లింటికి ఎల్లిపోదాం పదా!’’ అనింది అమ్మ.
      సంగటిపొద్దుకు ఊరికెల్లిపోతాంలే అనుకున్యారు. మూటలన్నీ ఎత్తుకోని అమ్మ నడస్తా ఉంటే అమ్మంత బలం ఎవురికీ లేదనిపించింది. అమ్మమింద గవరవం పెరిగింది.
      బస్సొచ్చిన దావలో అసలీకొండ మాతరమే గుర్తుంది జయాకు. అమ్మమగం జూసి ఉత్తమ్మవ్వకు బయమేసింది. ‘‘ఏమ్మీ అట్లుండావు!’’ అని అవ్వ ఎన్నిసార్లు అడిగినా అమ్మ సెప్పలా. కడాకు ‘‘మా నాయిన సచ్చిపొయ్యినాడంట. అందుకే ఒచ్చేసినాము’’ అన్యాడు జయసిమ్మ.
      ‘‘అయ్యయ్యయ్యో! ఎంత పన్జేసుకుంటివమ్మా మా అదోటీలో నడకుండా’’ అంటా ఒదరబట్టింది అవ్వ. రామసెందర తాత మగం కమిలిపొయ్యింది. ఆడ ఉండ్లేక రామసామి దేవలం కల్ల ఎల్లిపాయ.
      అవ్వ ఊర్లేకి దిగబడిపొయ్యి నాయిన సచ్చిపొయ్యినాడంటని పెద్దమామ ఎంగట్రూనకు, పెద్దత్త గంగోజికి, రాంకిట్టకు, నడిపెత్తకు వాల్లు ఇనకున్యా టముకేసి ఒచ్చింది. అయినా వాల్లు ఒచ్చి అమ్మను పలకరిచ్చలా.
      ఆ పొద్దు సందకాడ బువ్వ తిని దొడ్లో నవారు మంచం ఏసుకుని పడుకున్యాడు తాత. కాని నిద్దరపట్టలేదేమో నుసుగుతానే ఉండాడు. తాతకు అమ్మంటే పానమంట. నిద్దరెట్లొస్తాది? పానంలో పానమైన బిడ్డకు ఇట్లైంటే.
      అమ్మతోబాటు ఈతసాప మింద పడుకున్యాడు జయసిమ్మ. ‘‘అమ్మా!’’ అన్యాడు. ‘‘ఏం నాయినా!’’ అనింది అంజులమ్మ. ‘‘నాయిన సచ్చిపొయ్యినా సూసేదానికి పాకుండా ఒద్దంటివి. ఈడికొస్తే మామోల్లు గుడా పలకరిచ్చలా. ఎందుకమ్మా మనల్ను ఎవరూ పట్టిచ్చుకోరు’’, అని అడిగినాడు.
      ‘‘ఇంత పెద్దిరికంగ అడిగినంక, ఈల్ల నాయిన గుడా సచ్చిపొయినంక ఇంగ ఈని ముందర ఏందీ దాసిపెట్టకూడదు’’ అని అంజులమ్మ తన కతంతా సెప్పేసింది.

* * *

      అంజులమ్మకు సిన్నబ్బుడు సినిమాలంటే బోపిచ్చంట. బుద్దలోల్లపల్లిలో సిన్మాలు యాన్నుంచొస్తాయి? కాలవపల్లి సాయిబులు ఈడియోలు దెచ్చి సిన్మాలు ఏసేవోల్లు. టిక్కట్టు ఒగరూపాయి.
      అంజులమ్మ గులేబకావలికత, జగదేక ఈరుడు, అట్లా పాత సిన్మాలు చూసింది. మల్ల కొత్తకొత్తవి సిరంజీవి రాచ్చేసుడు, బాలకిస్న మంగమ్మగారి మనవడు అట్లాంటివి గూడా చూసేసిందంట.
      సుహాసిని వాల్ల బావ బాలకిస్న సరదాలు చూస్తాంటే అంజులమ్మకు వాల్ల బావ గండుసీనా గుర్తుకొచ్చినాడంట.
      ఒగసారి గండుసీనా బుద్దలోల్లపల్లికి ఒచ్చినాడు. నాయినమ్మ మల్లక్క ఇంటికాడ ఉండాడు. అంజులమ్మకు స్యానా సంబరం అయిపొయ్యింది. అవ్వొల్లింటికి పొయ్యి బావకు మరేదలన్నీ చేసింది.
      ఆ పొద్దు రేతిరి అవ్వ పందిలి కింద పండుకున్నింది. అంజులమ్మ, గండుసీనా అవ్వకు చెరొగ పక్క పండుకొని పొద్దుపొయ్యేదంకా మాట్లాడుకుంటా, బావామరదల్ల సరసాలు ఆడతాంటే అవ్వ నగతా నగతా అట్లే నిద్దరబొయ్యింది.
      మల్లక్కవ్వ అద్దరేతిరి మెలకువ ఒచ్చి పక్క తడిమి చూస్తే వాల్లిద్దురూ కనపల్లా. ‘‘ఓ యామ్మ! పెండ్లైన ముండకొడుకుతాన కిమ్మల్లో ఎల్లిపొయ్యింది గదమ్మా! ఈ పందిముండ’’ అని అవ్వ అర్సింది.
      అన్నిండ్లు ఒగేతావ ఉంటాయి. అందరూ లేసినారు. రామసెందర ఆ మాట ఇని ‘‘ఇంగా మదనపల్లి రామసుబ్బు తన కొడుకు సాంబాకు ఈ పాపను చేసుకుంటుందా?’’ అని లేసింతావే కుచ్చనబడిపోయినాడు.
      ఎక్కడ పొయ్యి ఇసారించినా ఎల్లిపొయ్యినోల్ల పోవిడీ చిక్కలా. నాన్నాల్లు పొయ్యినంక అమ్మన్ని, అబ్బోడు ఇద్దురు గ్యాజిగానిపల్లి చేరుకున్యారని తెలిసింది.
      అంజులమ్మ అన్నోల్లు ఎంగట్రూన రాంకిట్ట ఇద్దురు ఒగమోపున బొయ్యి గ్యాజిగానిపల్లి మింద బన్యారు. గండుసీనాను బండిగూటాల్తో పడగొట్టేసినారు. వాల్ల అన్నా వొదినల్ను కుమ్మేసినారు. కడాకు వాల్లమ్మను నాయిన్ను మేనత్త- మేనమామలని గూడా చూడకుండా వాంచి ఇడిసిపెట్టినారు. అంజులమ్మను శేతలమింద తెచ్చేసినారు బుద్దలోల్లపల్లికి.
      ఇంగ రామసెందర గెతిలేక ‘‘మీ యట్లా ఇత్తుకు లేని జాతికి నా బిడ్డనిస్తానా?’’ అని సీకొట్టిన మ్యానమామ గారినే పిలిపిచ్చి ‘‘మీరే చేసుకోని బోండ్రా?’’ అన్యాడు. మ్యానమామ గంగులప్ప అంజులమ్మను పెండ్లి చేసుకున్యాడు. గంగులప్ప మంచోడే గాని ఆ కునిస్టోనితో కాపురం జెయ్యలేక అంజులమ్మ ఏట్లో దాన దూరి పుట్టింటికి ఒచ్చేసేది.
      అన్న ఎంగట్రూనకు ముగ్గురు కూతుర్లు పుట్టినారు. ‘‘ఓయమ్మా! ముగ్గురు లచ్చిందేవులు పుట్టినారే. ఈ మొరటు గుంపునకు ఆడబిడ్ల మనసు తెల్దే. నా బతుకు ఇట్ల తెల్లారింది. నా యన్న బిడ్డ్డ్నన్నా బాగుపరచల్ల. బాగుపరచల్లంటే దుడ్లు కావల్ల. దుడ్లు కావల్లంటె కొయ్యేటికి పావల్ల’’ అని అంజులమ్మ ఒగనాడు ఎవురికీ చెప్పకుండా మదనపల్లికి ఒచ్చేసింది. ఈజా తీసిస్తాడని అమ్మీర ఇంటికాడికి పోతే ఆ యప్పోల్లు ఇంటికాడ లేరు.
      ఎక్కడ బోవల్లో దిక్కుతోసక ఆడ కడతాండే మిద్ది కల్ల సూస్తా ఉండిపొయ్యింది. మావిటేల కావస్తాంది. అంజులమ్మ బిక్కర మగమేసి చూస్తా ఉంటే ‘‘ఎవుర్రా ఈ పాప’’ అని ఆ ఇల్లు గట్టే మేస్తిరీ పలకరిచ్చినాడంట.
      అంజులమ్మ తన సంగతంతా చెప్పితే ‘ఓసి పిచ్చిదానా!’ అనుకోని ‘‘టిక్కట్టుకిస్తా మీ ఊరికెల్లిపోతావా?’’ అన్యాడంట. ‘‘ఇక్కడే అన్నా సచ్చిపోతాగని ఊరికి మాతరం పోను’’ అనింది అంజులమ్మ.
      ఏం జెయ్యాలో పాలుబోక ఆయప్ప ‘‘ఏమైతే అదైంది ఒగ అనాద ఆడమనిసిని ఇట్ల ఒదిలేసిపోతే యట్ల’’ అని ఆ పూట కూడు బెట్టిచ్చి తనకు తెలిసినోల్ల ఇంటికాడ సిన్న రూములో బెట్టినాడు.
      ఇంగ ఆ పొద్దునుంచి కూడూ గూరా అన్ని ఆయప్పే చూసినాడు. కస్టం సుకం పాలుపంచుకున్యాడు. ఒగానొగనాడు తాలిబొట్టు గూడా కట్టేసినాడు. కానీ బిడ్డలు మటుకు ఒద్దనుకున్యారు. ఎన్నిసార్లు కడుపు తీపిచ్చుకున్యా గెట్టిపిండం జయసిమ్మ ఒడిలో బడినాడు. యా దిక్కులేని అంజులమ్మ పురిటిదినాలు ఎట్ల యల్లీదిందో ఆ దేవునికే తెల్వాల.
      బిడ్డలు ఒద్దనుకున్న అంజులమ్మను తన నెత్తర పంచుకోని పుట్టిన పసికన్నమ్మను సూడగానే బయిము, బెమ ఉక్కిరి బిక్కిరి చేసినాయి. పూట పూటకు బిడ్డమింద అక్కర పెరిగి పెరిగి మర్లుగా మారిపోయింది.
      ‘‘నేను బతుకులో అడుగడుగునా ఓడిపొయ్యినా. నా బిడ్డ అన్నింటా గెల్వాల’’ అని వానికి జయసిమ్మ అని పేరు పెట్టింది. ‘‘నా బిడ్డ గొప్పోడు గావల్ల. వాని వల్ల నా పుట్టింట్లో నాకుమల్లా గవరవం దక్కల్ల.’’ అని స్యానా ఆశలు పెంచుకున్యాది.
      కూలీనాలీ జేసి బిడ్డను సాకింది. మంచి మంచి గుడ్డలు కొనిచ్చింది. తనబిడ్డ ఇమానంలో బోతాన్నెట్లు, పడవలో సికారు కొడుతాన్నెట్లు... ఇంగా ఇంగా దండిగా పోటోలు తీపించి పటాలు గట్టిచ్చింది. తినేదానికి అడిగిందల్లా కొనిచ్చింది. వాల్ల నాయిన సచ్చిపొయ్యినా ఎనకడుగెయ్యలా.
      జయసిమ్మ బాగా సదవతాండాడు. కానీ సగినమోడు చెప్పినమాటలు బయపెడతానే ఉండాయి.

* * *

      ఒగనాడు మావిటేల అంజులమ్మ కూలి నుండి ఇంటికొచ్చేలకు జయసిమ్మ బ్యాగు ఇంటి పంచలో పారేసి బండరాయి మింద కుచ్చోని రొండు సేతలతో తలకాయి బట్టుకోని ఏడస్తా ఉండాడు.
      అంజులమ్మ గుండికాయి నీరైపొయ్యింది. ఒగూక్కున బిడ్డను ఎత్తికోని ఒల్లో ఏసుకున్యాది. ‘‘యేమి నాయినా!’’ అంటే ‘‘తలకాయ నస్తాంది’’ అని ఏడవబట్టినాడు. నీల్లు దాపి, ఆదరా బాదరా ఇన్ని బియ్యం ఉడకేసి నాలుగు మెతుకులు తినిపిచ్చింది. తలపోటు మాతర మింగిచ్చింది. కనతలు, నొస్టమింద అమురుతాంజనం పూసి పండుకోబెట్టింది. ఏంజేసినా రాతిరంతా బిడ్డకు నిద్దరబట్లా.
      తన బిడ్డకు ఒంట్లో బాగలేదనడం అంజులమ్మ జీర్నిచ్చుకోలేక పోతాంది. బిడ్డ లేస్తానే ‘‘బడికి పోతావా నాయినా?’’ అని అడిగింది. ‘‘పోతాలేమ్మా! మల్లా మిస్సోల్లు అరుస్తారు’’ అన్యాడు.
      కాలవపల్లి నుంచి బస్సు రాకముందే బస్టాపు కాడ జయసిమ్మ కుప్పగూలి పొయ్యినాడు. ఎవురో ఎత్తి రామసామి దేవలం పందిట్లో పండబెట్టినారు. అంజులమ్మ పరిగెత్తా ఒచ్చి బిడ్డను ఒల్లో ఏసుకొని ‘‘జయా! ఏమైంది సామీ నీకు’’ అని ఏడస్తాంది.
      ఎవురో ఒన్నాటెయిటుకు పోను జేసినారు. ములకలసెరువుకు ఏసకపోయింది అంజులమ్మ. మామూలు కన్నులు దిరిగి పడిపొయ్యినాల్లే అని ఎవురూ తోడుబోలా.
      ములకల సెరువులో మదనపల్లికి పొమ్మన్యారు. మదనపల్లిలో తిరపతికి పొమ్మన్యారు. ఎవురూ తోడులేరు. ఆల్సెం జేసేదానికి లేదు. బిడ్డకోసరం దైర్నం జేసింది. బయలుదేరింది తిరపతికి. ఇబ్బుడు సగినమోని మాటలు నిజమైతా న్నాయని బయపడతాంది. కాదని సరుదుకుంటాంది. రుయాసుపత్రి చేరుకున్యాది.

* * *

      ‘‘మీ పిల్లోనికి తలకాయిలో క్యాన్సరు గడ్డలున్నాయి. తొందరగా స్విమ్సుగ్గాని, బెంగులూరుగ్గాని, హైదరాబాదుగ్గాని తీసుకెల్లండి’’ రుయా డాగటర్లు చెప్పినారు. బోరున ఏడవబట్టింది అంజులమ్మ.
      ‘‘ఇంగ నా బిడ్డను సీనన్న తప్ప ఎవురూ కాపాడలేరు.’’ అనుకున్యాది. ఇంతలో ఆ పసిగుడ్డుకు యెట్ల మనసు కొచ్చిందో ‘‘అమ్మా! సీనమామకు పోను జెయ్‌’’ అన్యాడు జయసిమ్మ. పోనందు కున్యాది అంజులమ్మ. అన్న పట్టింపులన్నీ ఒదిలేసి రెక్కలమింద ఒచ్చి వాల్న్యాడు.
      సిమ్సు, బెంగులూరు నిమాన్సు, ఐదరాబాదులో నిమ్సు అన్నీ అయినాయి. కడాకు మదరాసు జండ్రలాసుపత్రి చేరినారు. ఈ తిరగడాల్లో అనాది బిడ్డని చుట్టాలు, ఊరోల్లు, పేపర్లలో చూసి దాతలు మహానుబావులు ఎంత మందో సాయపన్యారు. నెలలు గడిసినంక, ఎన్నో వైదిగాలు, ఆపరేసన్లు అయి బిడ్డ సిక్కి సెల్యమైపొయ్యినాడు. ఇంగగాదని ఊరికొచ్చేసినారు.
      ఎవురో చెప్పినారు. మదరాసు చర్చికి బయలుదేరింది అంజులమ్మ జయసిమ్మను ఎత్తుకోని. మదరాసు బోయిన రొండో దినం రేతిరి తాతేడమ్మా? సీనమామే ఏడీమ్మా?’’ అంటా మదరాసు చర్చిలో జయసిమ్మ పానాలిడిసినాడు.
      అంజులమ్మ సోకదేవతై నింగీనేలా కరిగిపొయ్యేటిగా ఏడిసింది. కారుకు దుడ్లు లేవు. ‘‘ఈన్నే సముద్దరంలో ఏసిపోదామా?’’ అనుకున్యాది. ‘‘అమ్మా! ఒద్దు సామీ! స్యాపలు దింటే నా బిడ్డకు మూచ్చముండదంట.’’ అనుకొన్న అంజులమ్మ ఆదిసెక్తి అయ్యిపొయ్యింది. తొమ్మిదేండ్ల బిడ్డను ఏ...త్తి బుజాన ఏసుకున్యాది. సచ్చిన బిడ్డ అని ఎవురికీ తెలీకుండా టర్కీటువాల కప్పుకున్యాది. ఆటో ఎక్కి మదరాసు బస్టాండుకొచ్చి మదనపల్లి బస్సెక్కింది.

* * *

      సగినమోని మాటలమింద పూర్తి నమ్మకం కలిగింది అంజులమ్మకు. ఇంగ తన ఒంతే. అయినా బయపల్లేదు. దినమూ జయసిమ్మ ఒలికి దగ్గిరికి పొయ్యి  ‘‘నాయినా! జయసిమ్మా! బయపడద్దురా! నెల తిరక్కనే నీను గుడా నీకు తోడొస్తా’’ అని ఏడిసేది. ఒగనాడు పెద్దొదిన అది చూసి ‘‘యేం తిక్క పాపా! నీకు, అట్లం టాండావు.’’ అంటే ‘‘నిజెం ఒదినా నేను గూడా నెల్లోపల సచ్చిపోతానంట’’ అనింది.
      ‘‘నువ్వింగా తిక్కల దానివి. ఎవురేం జెప్పినా నమ్మేస్తావు. నీకేం రోగమా? సచ్చిపొయ్యేదానికి. దిమ్మసే కట్టే ఉండావు. పదా సంగటి తిందువు’’ అని పిల్చుకోని పొయ్యింది ఒదిన.
      ఇరవై తొమ్మిదో దినం రేతిరి పూట. ఊర్లో యల్లమ్మసామి మెరవన జరుగు తాంది. అసలే సావు యా రూపములో వస్తుందోనని దిగులు పడతాండే అంజుల మ్మకు మెరవని పలకల వల్ల నిద్దర పట్టలా. ఈదిలోకి పొయ్యింది.
      అంజులమ్మ వాల్ల సిన్నాయిన కొడుకు తాగేసి ఎవుర్నో తిడతాండాడు. ‘‘ఒరేయ్‌ ఇంటికి పొయ్యి పండుకోపో’’ అనింది. వాడు ఇన్లా. శెంపమింద ఒగేటేసింది. తాగిన మైకంలో వాడు ఒగటేసినాడు. ‘‘నా కొడకా నన్నే కొడతావా? సెప్పుతో కొడతా అంటూ కిందికి ఒంగింది. వాడు మొలలో కత్తి తీసి అంజులమ్మ ఎడమ రొమ్ము మింద ఒక్కపోటు పొడిసినాడు.
      అమ్మా! అనడానికి ‘ఆఁ’ అంటా నోరు తెరిసి అనలేక అట్లే యెల్లెలకలపడి పొయ్యింది. ‘‘అయ్యో! ఆ నా కొడుకు అంజులమ్మను జంపేశరా!’’ అని ఎవురో తన తలకాయిని ఒల్లో బెట్టుకున్యారు. అందురూ గుంపు గూడినారు. వాడు బయిపడిపోయి ఉరికినాడు.
      అంజులమ్మకు అర్తమైంది తన సావు ఈ రూపంగా ఒచ్చిందని. కరంటు పోలుమాన్ల నుంచి బార్లైట్లు పగులు మాదిరి ఎలతర ఆరబోస్తాండాయి. ఆ ఎలతర్లో అంజులమ్మ అందరికల్లా కడసారి చూపులు లీలగా చూస్తా ఉంది. ఆ చూపుల్లో ఎన్నో ప్రశ్నెలు ఉండాయి.
      తన బతుకిట్ల గావడానికి ఎవురు కర్తలు? తానిన్ని కస్టాలు బడిందానికి ఎవరు కారనం? తానిట్లా సావు సస్తాండడానికి ఎవురు బాజ్యులు?
      తాను దుడ్డిచ్చి చూసిన సినిమాలా?, తాను పెండ్లైనోన్నని తెలిసి లేవదీసుకోని పోయిన ఆ పరిగిలోడా?, తాను మెచ్చి పొయ్యినోని తాన ఉన్నీకుండా మేమే పోటుగాల్లమని పిల్సకచ్చి తన హక్కులను కాలరాసిన అన్నోల్లా?, దాన్ని సరిదిద్దకండా సెడిపోయినదని ముద్దరేసి రోగిస్టోనికి తగలగట్టిన తల్లిదండ్రులా?, తనకిష్టం లేదని తెలిసి పెండ్లాడిన మేనమామా?, తన బతుకులో మలుపులను చూసి అయ్యో! అనకుండా తమాసా చూసిన సమాజమా? అని ఆ చూపులు దీనంగా ప్రస్నిస్తాండాయి. మా ఆడజాతి ఉసురు ఇంగా ఎన్నాళ్లు పోసుకుంటారు?

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam